నీ అడుగులు తలుపు దగ్గిర
మూతపడిన ఆ తలుపు దగ్గిరకే వెళ్తున్నాను మళ్ళీ మళ్ళీ.

ఆ అగాధమయిన నిద్రలోంచి నువ్వు వొస్తావనీ,

తలుపు తీసి నవ్వుతావనీ పోనీ కోపంగా తిట్టిపోస్తావనీ.


వొక్క సారి దుఖంలోకి వొరిగిపోయానా అంతే
నేను వొక దిగులు దిగుడుబావిలోకి
జారుకుంటూ వెళ్లిపోతాను,

తలుపు దగ్గిర చెవులూ కళ్ళూ కాపలా పెట్టి.

2

ఊహూ...ఎవరూ రారు
అసలేవరూ అలా రాలేదు
ఎవరూ లేరు
అసలీ నిశ్శబ్దపు అంతిమ వీధిలో ఇంకెవరూ మలుపు తిరగరు

నువ్వు నేనూ పిచ్చి మొహాలేసుకుని,
అలసిపోయిన వడలిపోయిన దేహాలేసుకుని,
రాలిపోని ఎదురు చూపుల మాలలు గుచ్చుకుంటూ

రికామీ గాలికి శూన్యపు ముద్దులు ఇచ్చుకుంటూ

ఎలాగోలా వస్తూనే వుంటాం ఈ వీధి చివరకి.

ఈ చివరి వీధికి.

3

వస్తావయ్యా రామయ్యా
అంటూ ఆ వెర్రిబాగుల పాటగాడు అప్పటి నించీ
ఆ పాటని అట్లా మోసుకు తిరుగుతూనే వున్నాడు.


రామయ్య రాలేదు రాడు

4

అన్నీ అన్నీ మూతపడిన తలుపులే ఎదురవుతున్నాయి

వొక్క పెదవీ విచ్చుకోని అసుర సంధ్యలో.

5

ఈ పూట కూడా నువ్వలాగే

పెదిమ కింద తొక్కిపెట్టిన పకపక నవ్వుల ఉప్పెనలా

వెళ్లిపో నిశ్శబ్దంలోకి
వీధి చివరి కొండంత మౌనంలోకి.

Category: 14 comments

14 comments:

కెక్యూబ్ వర్మ said...

తలుపు దగ్గిర చెవులూ కళ్ళూ కాపలా పెట్టి.

పెదిమ కింద తొక్కిపెట్టిన పకపక నవ్వుల ఉప్పెనలా

వెళ్లిపో నిశ్శబ్దంలోకి
వీధి చివరి కొండంత మౌనంలోకి.

అద్భుతమైన భావాన్ని పంచారు సార్.. మౌనంగా వినమ్రంగా యిలా........

వాసుదేవ్ said...

ఊరిచివరి నుంచి
ఇప్పుడు వీధి చివరిలోకి
కొండంత మౌనంలోకి!
రాడనితెల్సిన రామయ్యకోసం
"రామయ్యా, వస్తావయ్యా!"
అని పాడుకోవటంలోని
వెర్రిబాగులతనాన్ని
చెవొగ్గి వినాలనుకోవడం.......
ఈ వారానికి ఇది చాలు సర్....

Unknown said...

అన్ని నిజాలే...చాల చక్కగా వ్యక్తం చేసారు.అభినందనలు.

Satish Chandar said...

A mood visually captured.
కానీ అన్యాయం.
దిగులు మాది.
కవిత నీది.

రవి వీరెల్లి said...

అఫ్సర్ గారు,
చాలా బావుంది!

"వొక్క సారి దుఖంలోకి వొరిగిపోయానా అంతే
నేను వొక దిగులు దిగుడుబావిలోకి
జారుకుంటూ వెళ్లిపోతాను,

తలుపు దగ్గిర చెవులూ కళ్ళూ కాపలా పెట్టి."

బహుదర్శియైన శిల్పి చెక్కినట్టు... వొక అద్బుతమైన భావాన్ని అలా అలవోకగా పద చిత్రంగా వేయడం.. రాసే పద్దతి, పాద విభజన, పఠిత మూడ్ పట్టుకున్నట్టు లైన్స్ బ్రేక్ చేయడం... మీ ప్రతీ కవిత లో ఏదో వొక కొత్తదనం కనిపిస్తుంది.

-రవి వీరెల్లి

రవి వీరెల్లి said...

సతీష్ చందర్ గారి కామెంట్ నచ్చింది :-)

NS Murty said...

Dear Afsar,

The relevance of the poem is multi-dimensional. You are always alone when you keep your temper under control and think differently from the highly volatile masses. You have to address a frozen Himalayan silence and appeal to the ether like reason. It tests your courage to its deepest convictions.
So beautiful.
best regards

Afsar said...

@వర్మ గారు: థాంక్ యు.
@వాసుదేవ్; 'రామయ్య వస్తావయ్య?" పాట చాలా కాలంగా గుండె గొంతుకల్లో మోగుతోంది.
@శైలబాల గారు: అవును, కవిత్వం అందమయిన అబద్ధం అన్నది నిజం కాదని చెప్పాలని నా ప్రయత్నం.
@సతీశ్ చందర్: నువ్వు చదవడమే నాకు గొప్ప ఎవార్డు. నిన్న మళ్ళీ నీ కథ చదివాను. ఆ వచనం నవ్విస్తుంది, ఎడ్పిస్తుంది కూడా!
@రవీ: ఇప్పుడు రాస్తున్న కవితలన్నీ నేను మళ్ళీ కవిత్వం రాయడానికి చేస్తున్న ఎక్సర్సైజులు. ఇవన్నీ నాకు కొత్త పాఠాలు.
@మూర్తి గారు: మీ మంచి మాటలకి థాంక్స్. ఆలోచనల లోకంలో మనం ఎప్పుడూ వొంటరి వాళ్ళమే కదా!

Vamsi Maddipati said...

ఆప్సర్ గారు,
మీ కవితలలో ఏదో తెలియని బాధని వ్యక్తపరుస్తున్నారు..... ఇది భావావేశమా.......? లేక నిజ జీవితమా.......?

Afsar said...

@వంశీ, అది 'ప్రపంచపు బాధ'!

Mohanatulasi said...

వెళ్లిపో నిశ్శబ్దంలోకి
వీధి చివరి కొండంత మౌనంలోకి...

చదివాక మిగిలింది మౌనమే అఫ్సర్ గారు!
మెత్తగా..దిగులుగా...కాస్తంత గుబులుగా వుంది!

ముఖ్యంగా రెండవది హృద్యంగా వుంది!

చాలా నచ్చాయి!

Manasa Chamarthi said...

"ప్రపంచపు బాధ" కూడా, మీ చేతుల్లో పడ్డాక ఎవరో ఒకరికి శాంతినీ, సంతోషాన్నీ కలిగించకపోదు, అఫ్సర్ గారూ. అక్షరాలు మీవి - అనుభూతులు మావి. మళ్ళీ మీరు వచ్చేవరకు, నెమరువేతల్లో కాలక్షేపం.

పద్మవల్లి said...

అఫ్సర్ గారూ,చాలా చాలా బావుంది!

"వొక్క సారి దుఖంలోకి వొరిగిపోయానా అంతే
నేను వొక దిగులు దిగుడుబావిలోకి
జారుకుంటూ వెళ్లిపోతాను"

ఎంత నిజం.
"రాలిపోని ఎదురు చూపుల మాలలు గుచ్చుకుంటూ
రికామీ గాలికి శూన్యపు ముద్దులు ఇచ్చుకుంటూ"
హ్మ్మ్.. మాటలు లేవు ఇక అభినందించడానికి. మనసు దిగులు మాత్రం ఇంకొంచెం పెరిగింది.

Padmapadmapv said...

Bhagundhi.ABINANDHANULU. SweetsmileAfsarji...

Web Statistics