అనుభవం నేర్పిన పదాల నేత

నిజాయితీ వర్మ సంతకం! నిబద్ధత తన స్వరం నిండా! వర్మ మాటలో ఆ రెండూ అనుభూతితో కలిసిమెలిసి పలుకుతాయి. ఇవాళ వర్మ "ఇంటి వైపు" గురించి రాసిన ఈ నాలుగు మాటలూ నాకొక సత్కారమే! 


~ ~ ~ కేక్యూబ్ వర్మ 

*
ముప్పై ఏళ్లకు పైగా కవిత్వమే తన‌ సర్వస్వంగా శ్వాసిస్తున్న కవి అఫ్సర్ సర్. సాహిత్యంలోని అన్ని కోణాలలో తనదంటూ ఒక ముద్ర వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వారు. తను ఎన్ని రూపాంతరాలుగా మారినా కవిగా తను మనకందరికీ నిత్యమూ ఒక కొత్త పద పరిమళంతో తన మాంత్రిక లోకంలోకి లాక్కుపోతూ వుండడమే తనెక్కడున్నా మన మధ్య ఉన్న అనుభూతిని ఇస్తా వుంటారు. తను ఇటీవల వెలువరించిన "ఇంటివైపు" కొత్త కవితా సంకలనం వాకిలి ప్రచురణలుగా వచ్చింది.

తను ఎంతో ప్రేమగా మౌళితో పంపిన ఈ కవిత్వంలోకి నన్ను నేనుగా ప్రవేశించాలని నాకు నేనుగా కుబుసం విడిచి నగ్నంగా ప్రయాణించాలని మొదలు పెట్టాను. అసలు నేను ఇలా పరిచయ వాక్యం రాయడం సాహసమే కానీ ఒక ఉద్వేగానికి లోనవుతూ మీతో ఈ నాలుగు మాటలు పంచుకుందామని.

కవి తన ఉనికిని కోల్పోకుండా తను ఎత్తుకున్న జెండా దించకుండా అందుకున్న ఆయుధం వదలకుండా ఎలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తారో కొనసాగించాలో చెప్పేందుకు ఈ కవిత్వం ఒక తాజా ఉదాహరణ. జీవితంలోని‌ అన్ని పార్శ్వాలను కోణాలను అవి తన ఒంటరితనం కావచ్చు, ప్రేమ కావచ్చు, తనకందనంత దూరంలోని మట్టి పొరలలో‌ దాగిన‌ జ్ఞాపకాల రేగిపళ్ళ వాసన కావచ్చు, సంక్షుభిత సమాజంలోని అసహన ప్రేరేపిత హత్యల పట్ల దుఃఖం కలగలిసిన కోపమూ కావచ్చు, తన సామాజిక వర్గం అనుభవిస్తున్న వెలి పట్ల‌ క్రోధం కావచ్చు, తనున్న ప్రపంచ పెద్ద పోలీసు వేటాడుతున్న నల్ల వారి నుండి వాడి తానులోని చిరుగు చేసిన రోహిత్ వేముల హత్య వరకు తన చూపు దాటిపోనివ్వకుండా మనకు ఒక కొత్త వాక్య నిర్మాణంలో మనలో అలజడి సృష్టించడం అఫ్సర్ సార్ కు అనుభవం నేర్పిన పదాల నేత. అలా మనల్ని తనలోకి ఒంపుకొని‌ ఒక‌ కొత్త చూపునిచ్చే కవి కదా! 

ఈ పరిచయమంతా ఎందుకంటే మీరూ నాలానె త్వరగా ఈ ఇంటివైపు మరలి అనుభూతించాలని. నగరంలో జరుగుతున్న బుక్ ఫెయిర్ లో అందుకోవాలని. నవోదయ, కవిసంగమం, తోపుడుబండి వద్ద.
సరే మరి చివరగా తన మార్మిక మాటల మంత్రంతో ముగిస్తాను.

"కొంత విరామమూ మరికొంత నిరామయమూ అని నువ్వో
యింకెవరో చెప్తూనే వున్నారు
నాకు యేమీ అనిపించనే అనిపించని నిర్లిప్తతలో-
నీ రూపరాహిత్యమే నా ఉనికి రహస్యమని
యీ అనేక ప్రతిరూపాల సందిగ్ధంలో
దగ్ధమైపోతూ వుంటానిక్కడే-
నీలోనే
లోలోనే
మునిగిపోయే పడవని నేను,
వొడ్డుకి చేరాలనే వుండదు,
యెప్పటికీ
యెంతకీ-"
సమగ్రంగా మరోసారి వచ్చే సాహసం చేస్తాను.
Afsar Mohammed sir కు ప్రేమతో

'రేగిపళ్ళ వాసనలోకి!'


-బాల సుధాకర్ మౌళి 
~

1
'రేగిపళ్ళ వాసనలోకి!' ఒక hum. ఒంటరితనంలోని దిగులుని, దిగుల్లోని ఒంటిరితనాన్ని, దూరాలను దగ్గరితనాలని, హద్దుల్లేని ప్రేమని లోలోపల్నుంచి hum చేయటం.
ఒంటరితనాన్ని కూడా ఒంటరితనం లోపొరల్లోకి ప్రయాణించి వెలిగించుకోవటం కవి రేపిన ప్రకంపన.
' వొంటరిగా వున్నప్పుడు వొంటరి పక్షిని అసలే చూడలేను '
2
అనుభవం ఎంత గాఢంగా వుంటే భావశకలం అంత నగ్నంగా, సహజంగా వస్తుందనడానికి కవి సృజించిన ఎన్నో వాక్యాలే నిదర్శనాలు. ఉదాహరణ ఒక్క కవితని కాదు - 'ఆమె వచ్చి వెళ్ళినప్పుడు' లో మరింత స్పష్టంగా దీన్ని గ్రహించొచ్చని తెలుస్తుంటుంది.
'రెండు నగ్నదీపాల్లా యిద్దరమూ వెలిగిస్తున్నాం
అన్ని చీకట్లూ చుట్టిముట్టిన యీ రాత్రిని!'
'మేమిద్దరమూ ఒత్తినెగదోస్తూ
పట్టుబట్టి ఆరిపోనివ్వని చంద్రుడి దీపం కింద!'
ఒక్కసారి వాక్యంలో మునిగేమా.. ! ఆ వాక్య పరంపర ఎటో ఎటో తెలిసిందే అయినా కొత్త అనుభవగాఢతలోకి లాక్కుపోతుంటుంది.
3
జ్ఞాపకాన్ని అపురూపంగా దాచుకోవటం కవి కవిత్వస్వభావాల్లో ఒకటి.
దగ్గరదూరాలను గురించి కవి కలవరింత హృదయాన్ని తాకి లోపల తారట్లాడుతుంటుంది. చుట్టూ వుండే మనుషుల పట్ల ఒక గాఢమైన ప్రేమానుబంధం కల్గివుండటమనే కవిస్వభావం కవిత్వ వాక్యాల్లోకి బట్వాడా అవుతుంటుంది.
'యివాళ యీ చిన్ని పాదాల్లోకి వలస వెళ్లి వచ్చాను'
ఇలాంటి కొన్ని వాక్యాలు చెవిని ఆన్చి నిశ్శబ్దతరంగాలను వినమనిచెప్తాయి.
'జీవితం మరీ దూరమయిపోతోంది
కాస్త దగ్గిరకు తీసుకో ఆ పిచ్చిదాన్ని!'
తనకి తనే చెప్పుకునే లాలనలో అందరం మునిగిపోతామనేదొక్కటే.. !
4
ఇంటివైపు జ్ఞాపకాల్లోకి జారి ప్రశాంతంగా ఈదటంలో వుండే ఆనందం కోసం తపించటం, బాల్యం చిగుళ్ల కోసం అల్లల్లాడ్డం, పసిబాల్యంలోకి తొంగిచూసి తన్మయం చెందటం, ఒంటరి క్షణాల్లో మాయమవటం, మనుషుల్లో తనివితీరా ప్రవహించాలనే సరిహద్దుల్లేని ఆరాటం - రేగిపళ్ళవాసనలోని రేగిన గాలి అలలు.
'చాలా కాలం తరవాత వెళ్తున్నానా వూరికి,
ఇంటికి,
నా వుద్వేగాల తొలి ఆనవాళ్ళకి'
ఇంటివైపు లాగే మనసుని పట్టుకోవడం ఒక నిరంతర యాతన.
'వొకే వొక్క కారణం వెతుక్కుంటూ
నేనూ నువ్వూ యిల్లూ వాడా దాటాం'
తీరమ్మీద పెద్ద ఆసక్తి లేని కవి కవిత్వకెరటాల్లో కొట్టుకుపోవడమొక్కటే; కొట్టుకుపోయి కొట్టుకుపోయి ఎక్కడెక్కడో పరిచిత స్థలాల్లోనే తేలి ఆ తేలిన దారి కూడా ఇంటివైపు మళ్లటం గొప్ప ఊరట. ఇంటిమట్టిలో పొర్లిపొర్లి మొలకెత్తడం.

రోహిత్ కోసమే కాదు!


1
నొప్పెడుతుందని చెప్పుకోలేని
వొకలాంటి రాత్రిలోంచి  యింకోలాంటి  రాత్రిలోకి వెళ్లిపోయావే తప్ప
రెండు కలల మధ్య  చావుని మాత్రమే అల్లుకుంటూ పోయావే తప్ప
యెవరి చీకట్లోకి నువ్వు
నీ దేహంతో సహా గబుక్కున దూకేశావో,
యెవరి గోడల్ని
పిడిబాకులాంటి  పిడికిళ్ళతో బాదుకుంటూ వుండిపోయావో
ఆ రాత్రికో ఆ వొంటరి తనానికో
యిప్పుడు నీడగా అయినా  కన్పించని నీకో తెలుసా?

2
మరణంలో మాత్రమే
నిన్నూ నన్నూ యెవరినైనా పలకరించే
పరమ లౌక్య లౌకిక లౌల్యంలో వున్నవాళ్ళం కదా,
నువ్వున్నంత కాలమూ ప్రతి క్షణమూ  కన్పించని/ కన్పించనివ్వని
తెలియని/ తెలియనివ్వని
లెక్కలేనన్ని గోడలకి మాత్రమే చెప్పుకున్న కథలన్నీ
నిస్సహాయ అంతః శోకంలో పంచుకున్న కేకలన్నీ
యిప్పుడే విన్పిస్తున్నాయా నాకూ నా లోకానికీ?

3
అద్దాలు అడ్డం పడుతున్నాయి నిజాలకి,
విదూషకుడి మాయవరణంలో నువ్వొక అబద్దమై రాలిపడుతున్నావ్!
కచ్చితంగా నువ్వు గుర్తు పట్టినట్టే
నీ గుర్తులన్నీటికి మకిలి పట్టించాక
నువ్వేదో అంతుపట్టవు యీ  కళ్ళల్లో!

యీ  పూటకి
కాసింత  కాలాన్ని చంపే దృశ్యమై తేలిపోతున్నావ్ నువ్వు
యీ  గుడ్డి చూపుల దర్బారులో!
ఏదో వొక దృశ్యమేగా యీ  కంటి మీద  వాలాలి
ఆ తరవాతి మత్తు నిద్రకి మాత్రలాగా-

4
జీవితం యింకాస్త అందంగా
యింకాస్త ప్రశాంతంగా
యింకా కాస్త నిర్మలంగా వుంటే బాగుణ్ణు అనుకొని
నిన్నటి నిద్రలోకి జారిపోతూ యీ  పొద్దుటి కల రాసుకుంటూ వున్నానా
అదే  అరక్షణ శకలంలో  నువ్వు
చివరి పదాల ధిక్కారాన్ని వాక్యాలుగా పేనుతూ వున్నావ్,
కొండని పిండి చేసే ఆగ్రహమై కాసేపూ
అంత ఆగ్రహమంతా నీటి చుక్కయి రాలిపోయే నిట్టూర్పువై ఇంకాసేపూ-

5
యీ పొద్దున్న
యింకో సారి అద్దం కూడా నవ్వింది
నీకు నువ్వు తెలుసా అని!
నీలోపల పేరుకుపోతున్న ఆ పెదవి విప్పని  చీకటి పేరేమిటి అని!

నీ చూపు చివర
వైఫల్యమనే మాయలాంతరొకటి యింకా  కాచుకునే వుంది, చూశావా? అని-

యింకోలాగా  మాట్లాడలేనందుకు నువ్వు క్షమిస్తావో లేదో కాని
యింతకంటే నిజం యింకోలా లేనందుకు
యివాళ
యీ శరీరమంతా వురితాడై సలుపుతోంది నన్ను-

జనవరి 21, 2016

ఒకే ఒక్క ఆసరా- కవిత్వం!

'ఇంటివైపు' ఓ సంజ్ఞ, సంకేతం, ఓ సంతకం. ప్రవాసి హృదయపు బెంగటిల్లిన అక్షరం. కాలూనిన ప్రతి మట్టిరేణువులో తన పుట్టినూరుని తలుచుకునే ఓ సగటు మనిషి పలవరింత. కవిత్వంలో ఎప్పుడూ నూతనత్వాన్ని నిలుపుకుంటూ ఐదు కవిత్వసంపుటుల మేరా విస్తరించిన కవి. మామూలు విషయాలనే భిన్నమైన ఆనుభవిక స్పర్శతో చూడాలన్న తపన ఇటీవలి 'ఇంటివైపు'కవితాసంపుటి. సూఫీ భావనల ఆవరింపులోంచి వైవిధ్యంగా పలికిన కవిత్వమిది. కవి పరిశోధకుడు అఫ్సర్ తో కవియాకూబ్ ఇటీవలి సంభాషణ నమస్తే తెలంగాణాలో...


1.       “ఊరిచివర” వెలువడిన ఎనిమిదేళ్ళ తరవాత మీరు “ఇంటివైపు” అనే శీర్షికతో మళ్ళీ కవిగా ముందుకు వచ్చారు. రెండు కవిత్వ సంపుటాల మధ్య ఇంత దీర్ఘ కాలం యెందుకు పట్టింది?

అఫ్సర్: అవున్నిజమే. నేను వొక్కో సంపుటి మధ్యా చాలా వ్యవధి తీసుకుంటున్నా. మొదటి నించీ అంతే! అనుకొకుండానే ప్రతి సంపుటికీ మధ్యా ఆ ఆలస్యం జరుగుతూ వస్తోంది. బహుశా, సీతారాం, ప్రసేన్ లతో కలిసి ప్రచురించిన “రక్తస్పర్శ” (1986) కూడా కలుపుకొని, మధ్యలో వచ్చిన నాలుగు కవిత్వ సంపుటాల కన్నా ఎక్కువ పేజీలున్న కవిత్వ సంపుటి ఇప్పటి ఈ “ఇంటి వైపు.” 
ఈసారి ఆలస్యానికి సరయిన కారణాలున్నాయని అనుకుంటున్నా. ముఖ్యంగా ఈ  ఎనిమిదేళ్ళు నా సాహిత్య ప్రయాణంలో కీలకమైనవని అనుకుంటున్నా. ఇంతకుముందు యెన్నడూ అనుభవించి ఎరుగని సంఘర్షణ ఈ  దశలో ఎదుర్కొన్నాను. ప్రత్యేక తెలంగాణా, సూఫీయిజం, గృహోన్ముఖీనత మొదలైనవి పూర్తిగా కొత్త లక్షణాలు కాకపోయినా వాటి తీవ్రతని అనుభవించీ పలవరించిన దశ ఇది. “ఊరిచివర” (2009)లో ఈ ధోరణులు చాయామాత్రంగా కనిపిస్తే, “ఇంటివైపు”లో వాటి తీవ్ర రూపం కనిపిస్తుంది. ఒక్కో కవితని రాసిన తరవాత ఒకటికి పదిసార్లు సరిదిద్దుకుని, పునరాలోచించుకొనీ ప్రచురణకిచ్చాను. అయితే, వాటి తాజాదనం చెదిరిపోకుండా సరిదిద్దుకున్నా.

2.       కవిత్వం మీకేమిటి? మీరు కవిత్వాన్ని ఎట్లా చూస్తారు?

కవిత్వం నాకు ఒక ఆంతరంగిక  నిత్యావసరం  అనవచ్చు. సాహిత్య ఊహ తెలిసిన తరవాత నన్ను నిర్మొహమాటంగా  వ్యక్తం చేసిన రూపం కవిత్వమే. అనేకవిధాలుగా చెప్పాలంటే, మిగిలిన సాహిత్య ప్రక్రియల మీద కూడా నాకు ఆసక్తి వున్నప్పటికీ నేను నేనుగా కనిపించే స్పష్టమైన అద్దం కవిత్వమే! మిగిలిన సాహిత్య రూపాలు అంటే- కథా, సాహిత్య విమర్శా, అనువాదాలు- మొదలైనవాటిలో నా వైపు నుంచి  కొనసాగింపు అంతగా కనిపించదు. కవిత్వం ఒక్కటే నాలో నిరంతరంగా కనిపిస్తుంది. నేను ఎక్కువగా చదివేదీ కవిత్వమే. ఉద్యోగపరంగా ఎక్కువగా పాఠాలు చెప్పేదీ కవిత్వమే. అనుదిన జీవన వ్యాపకాల్లో నా తక్షణ ప్రతిఫలనం కవిత్వమే. ప్రతి జీవితంలోనూ, జీవికలోనూ ఒక ఖాళీ వుంటుంది. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో ఆ ఖాళీని నింపుకుంటారు. నాకు అది కవిత్వం ద్వారా మాత్రమే సాధ్యమైంది.

3.       మీ కవిసమయాలూ సందర్భాలూ ఏమిటి?

ప్రత్యేకంగా అట్లాంటి సమయాలూ సందర్భాలూ లేవు. కవిత్వ సృజన పరంగా నాది సరళమైన ప్రపంచం. కొత్త స్థల కాలాలతో పాటు కొత్త సందర్భాలకు కూడా తేలికగా ఒదిగి వుంటాను. ముఖ్యంగా ఈ పదిహేనేళ్ళలో  వృత్తిపరంగానూ, డానికి సంబంధించిన పనుల ఒత్తిడి వల్లా ఎక్కువ సంఘర్షణకి లోనయ్యాను. ఉద్యోగరీత్యా అంతకుముందు అనుభవంలో లేని కొత్త కోర్సులు చెప్పాల్సి వచ్చింది, కొత్త బాధ్యతలు తలకెత్తుకోవాల్సి వచ్చింది. కాబట్టి, చాలా ఒత్తిళ్ళ మధ్య కవిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. కవిత్వం ఒక instinct అని చాలా సార్లు అనుకుంటాం కాని, నిజానికి కాదు. కొన్ని సార్లు మనం మనంగా మిగలడానికి కూడా చాలా ప్రయత్నం చేయాల్సి వుంటుంది. కొన్ని క్షణాలు మరీ పరాయీ అయిపోతాం, మనలో మనం మిగలం. అలా మిగుల్చుకునే సందర్భాలే కవిత్వం రాస్తాం. ఆ కారణంగా ఈ ఎనిమిదేళ్ళలో నేను చాలా తక్కువ రాశాను, గతంతో పోలిస్తే!

4.       మీ కవిత్వ పుస్తకాల శీర్షికలు – “ఇవాళ” “వలస” ఊరిచివర” కొత్తగా “ఇంటి వైపు” – చాలా భిన్నంగా, నిర్దిష్టంగా వుంటాయి. మీరు ఉద్దేశ పూర్వకంగా ఈ భిన్నత్వాన్ని, నిర్దిష్టతని లక్ష్యంగా పెట్టుకొని శీర్షికలు ఇచ్చారా?

చాలా మటుకు యాదృచ్చికంగా పెట్టిన శీర్షికలే అవి. అయితే, గమ్మత్తుగా అవి నా జీవన సందర్భాలకు సరిపోయాయి. “ఇవాళ” శీర్షిక మొదటి సారి నేను మిత్రులతో చెప్పినప్పుడు “అందులో నీ కవిత్వ గాఢత లేనేలేదు” అని కొట్టి పడేసిన వాళ్ళు ఎక్కువే. “వలస” “ఊరి చివర” ఇప్పుడు “ఇంటివైపు” కూడా అంతే. ముందే చెప్పినట్టు, నాది సరళమైన ప్రపంచం. నా కవిత్వ ప్రయాణం కూడా అంతే. “రక్తస్పర్శ” నుంచి “ఇంటివైపు” దాకా గమనిస్తే, నేను సంక్లిష్టత నుంచి సరళత్వం వైపు ప్రయాణించాను. సరళంగా మాట్లాడడం, కవిత్వం చెప్పడం చాలా కష్టమని అర్థమైంది. ఆ కోణంలోంచే నా కవిత్వ పుస్తకాల శీర్షికలు కూడా-

5.       సమకాలీన కవులకు అఫ్సర్ కవిత్వం భిన్నంగా వుంటుందన్నది  సాధారణంగా ఏర్పడిపోయిన భావన. ఆ భిన్నత్వాన్ని మీరెలా చూస్తారు?

ప్రతి కవీ తనదైన వ్యక్తిత్వంతోనే వస్తాడు. అనుభవంతో మొదలుకొని భాషా, దృక్పథం దాకా ఆ భిన్నత్వం కనిపిస్తుంది. అనుభవంలోని మెరుపు పెరిగే కొద్దీ కవిత్వంలోనూ ఆ మెరుపులు కనిపిస్తాయి. వెంటనే భాషలో ఆ కాంతి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కవికి భాష చాలా అవసరమైన సాధనం. కవి వ్యక్తిత్వాన్ని పట్టిచ్చే తొలి గుర్తు.  అనుభవంలోని వైవిధ్యం లేదా మామూలు విషయాలనే భిన్నమైన ఆనుభవిక స్పర్శతో చూడాలన్న తపన మన వ్యక్తీకరణని కాస్త కొత్తగా వెలిగిస్తుంది. బహుశా, ప్రతి వొక్కరూ ఆ వెలుగు కోసం వెతుక్కుంటూ వుంటారు. సాహిత్యం ఆసరా దొరికిన వాళ్ళు ఇంకాస్త ఉద్వేగంగా వెతుక్కుంటారు. నేనూ అంతే!

6.       మీరు మైనారిటీ స్వరాన్ని వినిపిస్తూనే ఒక విశ్వజనీన దృక్పథాన్ని కవిత్వంలో వ్యక్తం చేస్తారు. ఈ సమన్వయం యెలా సాధ్యపడింది?

నేను మైనారిటీని కాదు. అట్లాగని మెజారిటీని కాదు. నేను నేనుగానే వుంటాను, అన్ని  సామాజిక కొలమానాలు విఫలమయ్యేలా! నిర్దిష్టతనీ, స్థానికతనీ ఒక సైద్ధాంతిక భూమికగా బలంగా నమ్మే వ్యక్తిని నేను.  ఆ రెండీటిలో వుండే రంగూ రుచీ వాసనా నన్ను నిర్వచిస్తాయి. కొన్ని సార్లు కవి తను ఫలానా అని చెప్పుకున్నా, అతని కవిత్వం ఆ ఫలానాలో ఇమడదు. అలాంటి “ఫలానా” ముద్రల్ని ధ్వంసం చేసుకునే శక్తి కవిత్వంలోని మాజిక్. పాల్కురికి సోమన  నుంచి ఇప్పటి కొత్త కవి  దాకా మనకి తెలిసిన ప్రతి కవీ ఈ మాజిక్ కి ఒక ఉదాహరణే.

7.       దాదాపు మూడున్నర దశాబ్దాల మీ కవిత్వంలో ముఖ్యంగా ప్రాంతంగా చూస్తే నాలుగు దశలు కనిపిస్తాయి నాకు- ఖమ్మం/ విజయవాడ/ అనంతపురం/ అమెరికా. ఇది కేవలం ప్రాంతానికి సంబంధించిన మార్పు కాదనీ, అంతకుమించిన మార్పు ఏదో మీ కవిత్వంలో కనిపిస్తుంది. మీకూ అలాగే అనిపిస్తోందా?

మంచి పరిశీలన! ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఖమ్మం మునేరులో మునిగాను, అమెరికాలోని ఫిలడెల్ఫియాలో తేలాను. మధ్యలో బెజవాడ, హైదరాబాద్, అనంతపురం లాంటి మజిలీలు వున్నాయి. ప్రాంతం కవి ఆనవాలు. నా కవిత్వ సంపుటాల్లో – “రక్తస్పర్శ” ఖమ్మం, “ఇవాళ” బెజవాడ, “వలస” అనంతపురం, “ఊరి చివర” అమెరికాలోని టెక్సాస్, “ఇంటి వైపు” ఫిలడెల్ఫియాలో వుండగా రాసినవి. ఆయా ప్రాంతాలకూ, ఆ కవిత్వ సంపుటాలకూ తప్పనిసరిగా చుట్టరికం వుంది. ఆయా ప్రాంతాల సాంస్కృతిక అంతస్సు వాటిల్లో యెంతో కొంత మౌలికంగా కనిపిస్తూ వుంటుంది. అయితే, నేను పెరిగిన, చదువుకున్న, నా తొలి అనవాళ్ళన్నీ తెలంగాణాలో వున్నాయి. మా కుటుంబ చరిత్ర తెలంగాణా సాయుధ పోరాటంతో ముడిపడి వుంది. వామపక్ష రాజకీయాలతో కలగలిసి వుంది. ఎక్కడున్నా యెలా వున్నా, వాటిని నేను నా వ్యక్తిత్వంలోంచి దూరంగా పెట్టలేను.  ప్రాంతానికి మించిన మార్పు అని మీరంటున్నది ఏదైతే వుందో, అది నా నేపధ్యం, నన్ను పెంచి పెద్ద చేసిన చరిత్ర. అందులోనే నేనున్నాను.

8.       ఒక ముస్లింగా మీరు కవిత్వంలో బలంగా వ్యక్తమవ్వాల్సిన సందర్భం ఎప్పుడు వచ్చింది?

భారతదేశంలోని  యే ముస్లిం కవికైనా అది డిసెంబర్ ఆరు 1992 అనే అనుకుంటాను. అయితే, అంతకంటే ముందే నేను మా ఖమ్మం గోడల మీద “విప్లవం వర్ధిల్లాలి” అనే నినాదాలు మసకబారి, డానికి భిన్నంగా ఎబీవిపి, మజ్లిస్  నినాదాలు కనిపించడం మొదలెట్టాయి. ఈ సందర్భాన్ని కవిత్వంలో కంటే ముందు  ఒక  కథలో వర్ణించాను. అది కవిత్వంలో యెందుకు చెప్పలేదా అన్న ప్రశ్న ఇప్పటికీ వుంది. మొదటి నించీ కవిత్వం నాకు ఒక మాజికల్ మిర్రర్. నాలోపల సామాజికుడి ఘోష ఎంత వున్నా, నా కోసమే అన్నట్టు కవిత్వాన్ని  అట్టిపెట్టుకున్నాను. మరీ ఒత్తిడి కలిగించిన బయటి సందర్భాలు కవిత్వం అయిన ఉదాహరణలు వున్నా, వాటిల్లో కూడా నాలోని పర్సనల్ కోణం స్ఫుటంగా  వ్యక్తమవుతుంది. అంతర్గతంగా ఎంతో నలిగితే తప్ప బయటి సందర్భాలూ సంఘటనలూ కవిత్వం కాలేదు నాకు.

9.       తెలంగాణా- మీ కవిత్వంలోనూ, పరిశోధనలోనూ ప్రధానమైన భూమికగా ఎప్పుడు మారింది?

మొదటి నించీ తెలంగాణా ప్రధానమైన భూమికే. చింతకానిలో తెలంగాణా జానపద పాటలూ, కథలూ, పోరాట గాధలూ చిన్నప్పటి నించే విన్నాను. మా కుటుంబానికి వున్న తెలంగాణా సాయుధ పోరాట వారసత్వం వల్ల ఇంట్లో ఆ పోరాట జ్ఞాపకాలూ అనుభవాలూ తరచూ వినిపించేవి. ఇక నా ఉస్మానియా యూనివర్సిటీ పీ ఎచ్ డీ ఆధునిక కవిత్వ వస్తు రూపాల మీద. అయితే, తెలంగాణా సాయుధ పోరాటం ఆధునిక వచన కవిత్వానికి మౌలికతని ఇచ్చిందని అందులో వాదించాను. పీర్ల పండగ మీద ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రచురించిన పుస్తకం పునాది తెలంగాణాలోని పీర్ల పండగే. అట్లాగే, ఇప్పుడు కొత్తగా రాస్తున్న పుస్తకం పోలీస్ చర్యకి సంబంధించిన సాహిత్య సాంస్కృతిక కథనాల గురించి ప్రధానంగా తెలంగాణాలో ఆధునిక సాహిత్య రూపాలు యెట్లా వికసించాయో చెప్పే ప్రయత్నం.

1   మిమ్మల్ని మీరు తెలంగాణా కవిగా చూసుకుంటారా?

రెండు తెలంగాణా పోరాటాల అట్టల మధ్య ఒదిగిన పుస్తకాన్ని నేను. ఒక పోరాటం నా కుటుంబ స్మృతి, రెండోది నా సొంత అనుభవం. నిజానికి తెలంగాణా కవి అనిపించుకోడానికి అవి సరిపోక పోవచ్చు. ఆ ప్రాంతంలోని ఉద్విగ్నత నిండేలా ఇంకా పోరాట శీలత కావాలి. నేను ప్రధానంగా రచయితని కాబట్టి పోరాటానికి నా నిర్వచనం భిన్నంగానే వుంటుంది. ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు వుంటారు. వాళ్ళ నిబద్ధత ముందు రచయిత నిబద్ధత సరిపోదు. రచయితది సాంస్కృతిక నిబద్ధత. నన్ను నేను ఆ పరిధిలో మాత్రమే చూసుకుంటాను.

1   ఇప్పుడు తెలంగాణా సాహిత్యం తిరిగిన మలుపుల్ని మీరెలా అర్థం చేసుకుంటున్నారు?

తెలంగాణా సాయుధ పోరాటం సాహిత్య చరిత్రలో పెద్ద మలుపు అనే తాత్విక భూమిక నుంచి నేను వచ్చాను. అప్పటి కోస్తా ఆంధ్ర కవులకీ, రచయితలకీ, ఉద్యమకారులకి కూడా తెలంగాణా ఒక దిక్సూచి. తెలంగాణా పాత్ర యెప్పటికీ అట్లాగే వుంటుంది. తెలంగాణా అప్పటి వజ్రాయుధం. ఇప్పుడు కూడా వజ్రాయుధమే. కాని ఇటీవలి ఉద్యమ తీవ్రతలో వున్నప్పుడు పెంచి పోషించుకున్న ద్వేషాలు పక్కన పెట్టి, తెలంగాణా అసలు సిసలు పాత్రని అందరూ గుర్తించి తీరాలి. మన చరిత్రలో అంతకంటే గొప్ప ఉద్యమాల్ని ఇప్పటిదాకా మనం చూడలేదు. అందుకు తెలంగాణా మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలూ గర్వించాలి. ఇదే విషయం సాహిత్యానికి కూడా వర్తిస్తుంది. ఈ ఇరవయ్యేళ్ళలో తెలంగాణా నుంచి వచ్చిన మౌఖిక, లిఖిత సాహిత్యాలూ రెండూ బలమైనవే. ఆ వారసత్వం మున్ముందు కొనసాగాలి. ఇందులో దళిత, ముస్లిం స్త్రీ స్వరాలకి వాటికి తగిన స్థానం కూడా దక్కాలి.

   భారతీయ కవిత్వాన్ని దగ్గిరగా చదివిన అతికొద్ది మంది కవుల్లో మీరూ ఒకరు. భారతీయతా, కవిత్వం, ప్రాంతీయత- యీ మూడు అంశాల మధ్య పొంతన యెలా సాధ్యం?

భిన్నత్వం లేకుండా భారతీయత లేదు.  స్థానికతలోని బలమే భారతీయత బలం కూడా. ఇదే మాట భారతీయ కవిత్వం గురించి కూడా చెప్పుకోవాలి. స్థానికతలోని బహుళత్వం (pluralism) మన కవిత్వ సంస్కృతికి పునాది. మన దేశంలో యెన్ని భాషలున్నాయో, అన్ని భాషల కవిత్వాలూ మనకి ముఖ్యమే. వివిధ భాషల్లో వస్తున్న కొత్త తరం కవులు అట్లాంటి భారతీయతనే వెతుక్కుంటున్నారు.

   అట్లాగే, అంతర్జాతీయ కవిత్వం చదువుతూ, విశ్వవిద్యాలయ స్థాయిలో బోధిస్తున్నారు. ఆ కోణాలు మీ కవిత్వ వ్యక్తిత్వంపై యెలాంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాయి?

టీచింగ్ నా రోజువారీ జీవితంలో పెద్ద భాగం. పాఠం చెప్పే సమయం తక్కువే అయినప్పటికీ ఎక్కువ సమయం పాఠం చుట్టూ ఆలోచనలతో గడుస్తుంది. పైగా, ప్రతి సెమిస్టర్ కొత్త కోర్సులు చెప్పాల్సి రావడం వల్ల ఆలోచనలకి పెద్ద వ్యాయామం. ఈ సెమిస్టర్ “ప్రతిఘటన ఉద్యమాలూ- సాహిత్యం” అనే కొత్త కోర్సు చెప్తున్నా. ఈ కోర్సు ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష ఉద్యమాలతో మొదలై, ఇప్పటి అస్తిత్వ చైతన్య ఉద్యమాల దాకా వస్తుంది. ఇలాంటి కోర్సులు చెప్తున్నప్పుడు అది కేవలం తరగతి గదికే పరిమితం కావు. మన ఆలోచనల పరిధిని విస్తరిస్తాయి. కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తాయి. అవి కవిత్వ రచనలో కూడా కొత్తదనం కోసం వెతుక్కుంటాయి. నా దృష్టిలో ఇదంతా మన సొంత అన్వేషణలో భాగమే!

   ప్రభావాల మాటకి వస్తే, ఇటు భారతీయ కవిత్వంలోనూ అటు అంతర్జాతీయ కవిత్వంలోనూ మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వారు వున్నారా?

పేర్లు చెప్పడం కష్టం! ప్రభావాలు తప్పనిసరి. భారతీయ కవిత్వంలో దళిత కవిత్వం నన్ను బాగా ప్రభావితం చేసింది. అంతర్జాతీయ కవిత్వంలో బ్లాక్ పోయెట్స్ నాకు చాలా ఇష్టమైన వాళ్ళు.

1   వర్తమాన కవిత్వం ప్రింట్ నుంచి సోషల్ మీడియాకి మళ్ళుతున్న దశని మీరెలా అర్థం చేసుకుంటున్నారు?

సోషల్ మీడియాని సమర్ధంగా వుపయోగించుకుంటే కవిత్వానికి అది కొత్త శక్తి. ప్రింట్ మీడియాలో వుండే పరిమితుల్ని అది దాటి వెళ్తుంది. ఎంత కాదన్నా, ప్రింట్ మీడియా కొంత సాంప్రదాయిక చట్రంలో వుంటుంది. కొత్తదనాన్ని అంత తేలికగా ఆహ్వానించదు. ఫేస్ బుక్ లో అట్లాంటి చట్రాలు పనిచేయవు. కాబట్టి, కొత్త స్వరాలకి మంచి అవకాశం. కొత్త ప్రయోగాలకి కూడా మంచి వేదిక. 

   అమెరికాలో కొత్త తరం కవిత్వం యెలా ఉంటోంది?

వస్తు వైవిధ్యం, అనుభవ విస్తృతి, విషయాన్ని తేలిక భాషలో చెప్పడం కొత్త అమెరికన్ కవిత్వంలో కనిపిస్తున్నాయి. ఇవి మన వర్తమాన తెలుగు కవిత్వంలోనూ వున్నాయి. కాని, భాషకి సంబంధించి ఇంకా మనకి కొన్ని సాంప్రదాయికమైన ఆలోచనలు వున్నాయి.అ వి తొలగిపోవాలి. అమెరికన్ కవిత్వంలో ప్రోజ్ పోయెమ్ కొన్ని సాంప్రదాయికమైన చట్రాల్ని బద్దలు కొట్టింది. ఆ ధోరణి మనకి కూడా అవసరమే.

1  మన దగ్గిర “కవిసంగమం” లాగా అమెరికాలో ఇంటర్నెట్/  సోషల్ మీడియా భూమికగాధోరణులు యేమైనా ఉన్నాయా?

“కవిసంగమం లాంటి ప్రయోగం అమెరికన్ సాంస్కృతిక నేపధ్యంలో అంతగా ఫలించదు. ఎంతకాదన్నా, అమెరికన్ కవిత్వంలో ఒక హైరార్కీ వుంది. కొన్ని బలమైన శక్తుల పెత్తనం ఇంకా వుంది. అందువల్ల అమెరికన్ కవి సమూహల్ల్లో వెసులుబాటు తక్కువ. కవిసంగమం ప్రధానంగా సాధించిన విజయం హైరార్కీని సవాలు చేయడం, కొత్త తరాన్ని అందుకోవడం. ఇవి రెండూ అమెరికన్ సమాజంలో అంత తేలిక కాదు. అట్లాగే, ఇంటర్నెట్ సాహిత్యానికి కూడా ఇంకా రావల్సినంత ప్రాముఖ్యం రాలేదు.

1   కొత్త తరం కవులు చాలా మంది వస్తున్నారు. ముందు తరం కవిగా మీరు వాళ్లకి యేమైనా చెప్పదలచుకున్నారా?

సందేశాలివ్వడం నాకు నచ్చదు. నిత్య సంశయం వెంటాడుతున్న తరం మనది. కవి ఏ తరం వాడైనా మన సహప్రయాణీకుడే! ఇప్పుడు మరీ ముఖ్యంగా అందరూ కలిసి ప్రయాణం చేయాల్సిన సందర్భం. చాలా సామాజిక వొత్తిళ్ళ మధ్య నడుస్తూ వెళ్తున్నాం. వ్యక్తిగత  అస్తిత్వం కూడా ప్రమాదంలో వుంది. మనకి వున్న ఒకే ఒక్క ఆసరా- కవిత్వం! అదృష్టం బాగుండి, ఇప్పుడు కవులకి మంచి వేదికలున్నాయి. మంచి కవిత్వాన్ని అక్కున చేర్చుకునే చదువరుల సంఖ్య కూడా పెరిగింది. జీవితాన్ని వంచించుకోకుండా రాసే ప్రతి వాక్యం నిలుస్తుంది.  ఆ నమ్మకం నా మటుకు నాకు గతంలో కన్నా ఇప్పుడే ఎక్కువగా వుంది. మనం వచనం ఎక్కువ చదవాలి. విమర్శని తట్టుకోవాలి. ఒక అడుగు ముందుకే వేయాలి, కాని నిన్నటి రెండు అడుగుల్ని కూడా  గుండెకి హత్తుకోవాలి.
*Web Statistics