కాలం మారినా, సందర్భం అదే!


-సొదుం శ్రీకాంత్
~


మరేమీ తొడుక్కోను
ఎముకల చుట్టూ అల్లుకుపోయిన కండరాల మధ్య
ఉప్పొంగే కలల సరీసృపం
ఈ గరుకు నేల ఇరుకు గదుల గుండా
నీటిలోపల మెలితిరిగే కణాల
ఉక్కిరి బిక్కిరి సందర్భం( బాడీ లాంగ్వేజ్' )
ప్రపంచం మొత్తం పెట్టుబడి వలలో చిక్కుకున్న వలస వాదానంతర వలసవాద సందర్భంలో మనిషి సరుకైన నేపథ్యంలో , విలువల అసలు అర్థం మారిపోయి ఆర్ధిక, సరుకు, మారకపు విలువలే అసలు విలువలుగా చెలామణి అవుతున్న చోట మనసు అనునిత్యం మెలిపెట్టబడుతూ ఉంటుంది. బాధితులే నేరగాళ్ళై , అసలు నేరగాళ్ళు అభివృద్ధికి చిరునామాలైపోయిన యుద్ధోన్మాద అభివృద్ధి అంగడి వ్యవస్థలో , సున్నితమైన మనుషుల జీవన ప్రయాణం నిత్య గాయాల నదీ ప్రవాహంలా సాగాల్సిందే. తప్పదు. కానీ ఆ గాయాలకి పూతపూయడాకి మనిషికి కళలు అవసరం నిన్నటిలాగే నేడు కూడా ఎంతగానో ఉంది. ( ఆ కళలు కూడా అంగడి సరుకైన మాట వాస్తవం. కానీ అది మరోచోట రాసుకుందాం. ) అది ఏ కళా రూపమైనా కావచ్చు. అలాంటి కళా రూపాలలో నా వరకు నాకు అనునిత్యం తోడుండేది కవిత్వం. నాకున్న వేదన అనే జబ్బుకు కవిత్వం ఓ టానిక్లాగా పనిచేస్తుంది.

నడిచే కాళ్ళ చుట్టూ సంకెళ్ల మోతలు
ఇప్పుడే పుట్టిన శిశువు ముఖమ్మీద యుద్ధ విమానాల నీడలు

మూడో ప్రపంచాన్ని గురిచూస్తున్న గూఢచారి భాషా తెలుసు
జాలీ దయా కరుణా శాంతీ స్వేచ్ఛా అన్నీ శిథిలాలు
వాటి ప్రాణాల కొసలు మిగిలి ఉన్నాయేమోనని ఈ వెతుకులాట
….
ఒకే ఒక్క అనుమానంతో నిప్పులు పురిపిస్తావ్
ప్రాణమున్న బొమ్మలతో ఆడుకోవడం నీకు బలే సరదా

కుప్పకూలిన చోటే లేచి నిలబడుతున్నాను
ముసుగు కప్పుకుంటే సూర్యున్నైనా నిలదీస్తాను…

ఇప్పుడు యుద్ధం జరగని ప్రదేశమే లేదు. పొలాలపై పురుగు, ఎరువు మందు కంపెనీలు యుద్ధం ప్రకటించాయి. అడవిపై మైనింగ్ కంపెనీలు యుద్ధం చేస్తున్నాయి. అమ్మ ఒడి మొదలుకుని , బడి గదుల వరకూ ఏది చూసినా ఒక యుద్ధ వేదికై పోయింది. దేశాలే కాదు ప్రతి దేహమూ ఓ యుద్ధ వెదికే నేడు.
కవి కూడా అక్కడే ఉన్నాడు. వనరుల దోపిడీకై వాడికి మారణాయుధాలు ఆయుధమైతే కవికి మాత్రం మనిషి మానవత్వం ప్రాతిపదికన తన కలమే ఆయుధమయ్యిందానడానికి పిరంగులై పేలిన ఈ పదాలే సాక్షి.
ఈ పదాలు చదువుతుంటే వేదన వ్యక్తిగతం కాదని మనసుకు కొంత ఊరట కలుగుతుంది. ఈ పదాలలో ఊతమిచ్చే చేతులుండాయనిపిస్తుంది. కవిత్వంలో కేవలం కన్నీళ్ళే కాదు కోటానుకోట్ల కరచాలనాలుంటాయనిపిస్తుంది, రాలిపోయిన కలలూ , కాలిపోతున్న పూదోటల తాలూకు ప్రశ్నలు నిరసన కెరటాలై ఎగిసిపడుతాయి. ఇలా కవిత్వం పరిధి అనంతంగా సాగిపోతుంది.

యుద్ధానికి ఒక కాలం లేదు
ఒక స్థలమూ లేదు
అది ఇరాకో పాలస్తీనానో కానక్కరలేదు
రువాండోనో, జాప్నానో, కాశ్మీరో కాకపోవచ్చును
యుద్ధం ఈ క్షణాన ఇక్కడే నా మీద(యుద్ధం ఇక్కడే …)
మళ్ళా ఇప్పుడు ముళ్ళకంచెలు, సరిహద్దుల ఉన్మాదంతో , కత్తి అంచున వేలాడుతున్న నెత్తుటి చుక్కలా భూమి ఒక రక్త బిందువుగా మారిన యుద్ధసమయంలో కొంత కవిత్వం తప్పనిసరయ్యింది. ఎందుకంటే కవిత్వానికి తప్ప ఒట్టి మాటలతో మనసు సంతృప్తి పడదనిపించింది.

పాసుపోర్టులు అంతర్జాతీయ అబద్ధాలు
లోపలి నిజ పౌరుసత్వాన్ని దాచేస్తాయి
నెత్తిమీద ఒక ఆకాశం ముక్కని అతికించి
ఆ అద్దంలో నుంచి నన్ను చూస్తాయి

నువ్వు గీసిన సరిహద్దుల మధ్య
ఒరిగే దేశం కాదు నాది
జంగమం నా నిజస్తావరం
స్తావరం నా సమాధి ఫలకం
జంగమ కల నా ఇలాకా
(జంగమం)

సిరియాలో ఎంతటి విద్వంసం జరుగుతున్నా , యెమన్ పై అమెరికా వెనకుండి సౌదీతో బాంబులు కురిపిస్తిన్నా, మరీ ముఖ్యంగా గత కొన్నేండ్లుగా మిడిల్' ఈస్ట్ లో చోటుచేసుకున్న పరిణామాలు, అక్కడ రాలుతున్న నెలవంకలు, కాలుతున్న పూలతోటల గురించి తల్చుకున్నప్పుడల్లా మనసు తడుగుడ్డ కాక మానదు. ఆ పసిబుగ్గల కళ్ళల్లోకి చూసినప్పుడల్లా కళ్ళు చెమర్చక మానవు. పొట్ట చేత పట్టుకుని, పిల్ల పాపలతో ఇల్లూ వాకిలి వదిలి , దేశాలు వదిలి అగమ్యమే గమ్యమై సాగి పోతున్న సిరియా ప్రజల్ని ఈ ప్రపంచం చూసీ చూడనట్లు నిస్సిగ్గుగా వదిలేసింది. అదే అమెరికా ప్రెసిడెంటు దగ్గినా, తుమ్మినా అదో పెద్ద వార్తై పత్రికలకెక్కుతుంది. ఎంత వానైనా , మంచైనా, ఎంత చలిగా ఉన్నా వచ్చి ఇంటి ముందుండే గార్బేజ్ ని ఎత్తి అమెరికాను ‘స్వచ్చ అమెరికా’ మారుస్తున్న మెక్షికన్లు అమెరికాకి చెత్తగా కనిపిస్తున్నారు. ఒక్క ఇరాక్ లోనో 5 లక్షల మందిని పొట్టన పెట్టుకుని, లక్షలాది మందిని విగతజీవులుగా మార్చి ప్రపంచం పైకి ఉగ్రవాద పెను భూతాన్ని వదిలిన అమెరికాకు నేడు శరణార్థులు చేదయ్యారు. ఎంతైనా పెట్రోల్ కు అలవాటుపడ్డ నాలుకకి కన్నీళ్లు ఎలా రుచిస్తాయి మరి?

ఎవరైనా అంతే
కడుపే దేశం
ఎంగిలి మెతుకే కల
ఎక్కడికైనా వెళ్ళాల్సిందే,
అమ్మలకూ, కన్న నేలకూ తెలియదు
దేశాల పటాలు మారిపోయాయని.
ఆకలి సరిహద్దులు విస్తరించాయని!
నేలతల్లి ఏనాడో మోసపోయింది
ఆయమ్మ మానం
ముళ్ళ కంప మీది వస్త్రం
దేశభక్తిని కొలవడానికి
ఊళ్ళో వాకిళ్లో ఇల్లో వాకిల్లో
ఇంటి పేర్లో
జెండాలో జాతీయ గీతాలోపార్టీలో రాజ్యాంగాలో రాజ్యాలో
వోటుహక్కులో ఎన్నయినా ఉండనీ
గుప్పెడు మెతుకులే రాజ్యాంగం మాకు
గుక్కెడు నీళ్ళే జాతీయగీతం మాకు.
(ఎడారి నుంచి కాస్త తడి )

రాజ్యం ఆడే రక్త క్రీడనూ, అదే రాజ్యం ఆ రక్తం ప్లైన్ గా కనిపించకుండా ఒక కొత్త చరిత్రని, ఒక కొత్త రాజ్య భాషని అద్బుతమైన కవిత ‘మూడో యామం’

చూపుడు వేలూ అక్కర్లేదు
అసలు చూపే అక్కర్లేదు
ప్రవక్త పదాల్లోంచి రాలిన మంచు బిందువులూ అక్కర్లేదు
బుద్ధుడి విశాలమైన అరచేతుల అభాయమూ వద్దు
మసీదు రెక్కల మీద ఎగిరే పావురాల తెలుపూ వద్దు
ఏదీ వద్దు
కాసింత నెత్తురూ, నూరిన కత్తులూ
మూసుకపోయిన గోడల గుండెల గుహలూ చాలు.
గొప్ప విధ్వంసంతో
ఇక్కడొక నిశ్శబ్దాన్ని నాటుతాం
మనిషిని
అరగదీసి ఇక్కడొక శిలువను చేక్కుతాం
చరిత్రకారుని చేతి వెళ్ళని తెగనరికి
కొత్త గతాన్ని తిరగారాస్తాయి ఫత్వాలు
ఇక్కడితో కవి ఆగిపోడు. ఒక ప్రశ్నై తిరగబడి మానవీయ దిశగా విస్తరించుకుంటాడు.

దుఖ్ఖం ఎలా పుడుతుందో నీకు తెలుసా?
……
అనంత కాలం పాటు వికసించిన
ఎముకల మహా పర్వతం ఇది
దీని ఒంటినిండా
వేయి కన్నుల కరుణ
వొంటిమీద వాలిన ఖడ్గాన్ని సైతం
ప్రేమగా నిమిరే చల్లని చెయ్యి దీనిది
కూలిన దీని దేహం మింద
ఎన్ని నాగరికతలున్నాయో చూడగలవా నువ్వు?
ఈ పుస్తకంలోని మొత్తం 47 కవితలూ దేనికదే ఉన్నతమైన భావ వ్యక్తీకరణతో పాటకుడి నరాన్ని మీటుతుంది. ప్రతి కవితా ఓ పదాల ఊటలా దప్పిక తీరుస్తుంది. ఇది 2009 లో వెలువడ్డా ఏ యుద్ధ సందర్భాన్నైనా కళ్ళకు కట్టినట్లు చూపించే కవిత్వం ఇందులో ఉంది.

ధిక్కారం నా మతం
నిరసన నా కులం
గోళ్ళలో మేకులు దిగ్గొట్టే రాజ్యాన్ని
తూరుపు ఉరికంబం ఎక్కించడం ఒక్కటే నా రాజకీయం
********************************
Category: 1 comments
Web Statistics