Showing posts with label దర్వాజ. Show all posts
Showing posts with label దర్వాజ. Show all posts

Monday, December 19, 2011

తూరుపు చెట్టు




నేనొక అద్దానయ్యాను
అన్నీ నాలో ప్రతిబింబిస్తున్నాయి

నీ జ్వాలలో నేను
ఆ నీటినీ, ఆ మొక్కనే మార్చేశాను.

శబ్దం రూపునీ
పిలుపునీ మార్చేశాను

నిన్ను రెండు గా చూడడం మొదలెట్టా
నిన్ను నిన్నుగా
నా ఈ కంటిలో ఈదుతున్న ముత్యంగా

ఆ నీరూ నేనూ ప్రేమలో పడ్డాం

అటు తరవాత
నీరు నా లోపలి నించే పుట్టింది.


ఎంచక్కా మేం కవలలమయ్యాం

మూలం: ఎడోనిస్ (ఆరబిక్ కవి)

ఇప్పుడు ఎనిమిది పదుల వయసు దాటిన ఎడోనిస్ మొన్న నోబెల్ సాహిత్య ప్రైజ్ కి చివరి దాకా వచ్చాడు; అది కొద్దిలో తప్పిపోయింది. అప్పుడు చాలా మంది కవిత్వాభిమానులు నోబెల్ వొక మంచి గౌరవాన్ని కోల్పోయిందని అన్నారు. ఎడోనిస్ అసలు పేరు అలీ అహ్మద్ సయ్యద్ అస్బర్. ఆ పేరుతో కవిత్వం పంపితే అన్ని పత్రికలూ తిప్పికొట్టడంతో అతను ఎడోనిస్ అనే కలం పేరుతో రాయడం మొదలెట్టాడు. ఆధునిక అరబిక్ కవిత్వంలో వొక నవీన సూఫీ యుగానికి నాంది పలికిన వాడు ఎడోనిస్.

Thursday, December 15, 2011

చలి రాత్రి వొక వీడుకోలు




వచ్చే సెమిస్టరు నేను ఆసియా భక్తి కవిత్వం మీద వొక కొత్త సెమినార్ కోర్సు చెప్పబోతున్నాను. అందులో భాగంగా చైనా, జపాన్ బౌద్ధ కవిత్వం చదువుతున్నా ఈ మధ్య.

కవిత్వం ఏం చెయ్యాలి? కవిత్వం చేసే పని ఎట్లా వుండాలి? అనేవి రెండు పెద్ద ప్రశ్నలు. వాటికి ఎవరి దగ్గిర వున్న సమాధానాలయినా అవి పూర్తి సమాధానాలు అయి వుంటాయని నేను అనుకొను. కానీ, ఏదో వొక సమాధానం రాబట్టుకొని తీరాలన్న మొండితనం కవికి వుండాలి, పఠితకీ వుండాలి. లేకపోతే, ఇద్దరి అన్వేషణా అధ్వాన్నపుటడవుల్లోకి జారిపోతుంది.

నా మటుకు నాకు ఈ బౌద్ధ కవిత్వ యాత్ర వొక కొత్త అనుభూతి. కొత్త దారి.
తెలియదు, ఈ దారిలో నేను ఎటు మళ్లుతానో?

ఈ కవితలో ఈ చైనా కవి అనేక శతాబ్దాల కిందట వీడుకోలు చెప్పింది నాకేనా?


చలి రాత్రి వొక వీడుకోలు

ఆ మొదటి మలుపు దీపం చూడూ,
అటుగా ఆ వూరి వంతెన మీంచి నేరుగా వెళ్ళు.


ఏటి మీద మొగ్గలు ముద్దలుగా
రాలిపడుతుంటాయి, కరగని మంచు.


ఇంత చలిలో - మరీ కురచని ఈ పగళ్లలో-
నువ్వు వెళ్లిపోవడం దిగులుగా వుంది.


ఈ కొండలేమో అంతులేనివి,
మరి, నువ్వు అందుకోవాల్సిన బాట మరీ దూరం!


(మూలం: chia tao 779-843)

Thursday, June 2, 2011

గుడ్డు




స్లావేనియా కవిత్వం ఎలా వుంటుందో అప్పుడప్పుడూ మిత్రులతో సంభాషణల్లో వినడమే తప్ప పెద్దగా చదివే అవకాశమేమీ దొరకలేదు. ఈ మధ్య లైబ్రరీలో కొత్త పుస్తకాల దగ్గిర వెతుక్కుంటూ వుంటే, అనుకోకుండా దొరికాడు ఈ కవి. ఇతని పేరు Ales Steger. అతని కొత్త పుస్తకం The Book of Things. ఈ పుస్తకం తీయగానే మొదటి పుటలలో A word doest not exist for every thing అన్న Slovenian dictionary వాక్యం నన్ను అతని కవిత్వంలోకి లాక్కెళ్లింది. ఈ కవిత్వం ఎంత తేలిక మాటల్లో వుందంటే, చాలా కవితలు నన్ను తీవ్రంగా కుదిపేశాయి గాని, వాటిలో వొకటి రెండు అనువాదం చెయ్యబోతే తేలిక మాటల్ని అనువాదం చెయ్యడం ఎంత కష్టమో మరో సారి అనుభవంలోకి వచ్చింది. నా వీలుని బట్టి ఇతని కవిత్వం అంతా తెలుగు చేయాలన్న దురాశ నాకు వుంది, కానీ, అంత నిరాలంకార, నిరాడంబర సంభాషణకి తెలుగు సేత సాధ్యమా అన్న నిరాశ కూడా వుంది. వున్నంతలో అనువాదానికి లొంగిన మరీ తేలికపాటి కవిత ఇది. ఇక్కడ తేలిక అనేది మాటలకే పరిమితం. భావానికి కాదు!




గుడ్డు

పెనం అంచున నువ్వు దాన్ని చంపినప్పుడు
దాని చావు కన్ను నువ్వు చూసావో లేదో మరి!


ఆ గుడ్డు మరీ చిన్నది, ఈ పొద్దుటి ఆకలి
బాధలో అది వో మూలకి కూడా రాదు.

దాని కన్ను నిన్ను చూస్తూనే వుంటుంది,
నీ లోకంలోకి తేరిపార చూస్తుంది.

నీ లోకపు అంచులేమిటి? వాటి కళ్ళద్దాల కింద ఏ తత్వాలున్నాయా అని-


శూన్యంలో బేఖాతరుగా చుట్టి వచ్చే కాలాన్ని
ఆ కన్ను చూస్తుందా?
దాని కనుపాపలు, చిట్లిన దాని అవయవాలు,
ఆ గందరగోళం, లేదా ఏదో వొక పద్ధతి
అంటూ వుంటే దాన్ని చూస్తుందా?


హ..ఇంత పరగడపున ఇంత చిన్ని కన్ను చుట్టూ
ఇంత పెద్ద ప్రశ్నలా?

నిజంగా నీకు - అవును నీకే -
వీటికేదో వొక సమాధానం కావాలంటావా?

టేబుల్ దగ్గిర కూర్చొని వున్నప్పుడు
కన్నూ కన్నూ కలిసినప్పుడు

నువ్వు దాని కన్నుని ఓ బ్రెడ్డు ముక్కతో కప్పేస్తావ్?! అంతేనా?

*

Friday, May 27, 2011

వొకానొక తాళం చెవి




కవిత్వాన్ని అకవిత్వీకరించే మరో సాధనం - సంభాషణ. మామూలు సంభాషణలోని తేలిక మాటలనే తీసుకొని, వాటికి అసాధారణమయిన శక్తినివ్వడం. డెబోరా కీనాన్ కవిత్వం చదువుతున్నప్పుడు ఇదెలా సాధ్యమో అర్ధమవుతుంది. ఆమె కొత్త కవిత్వ సంపుటి "గుడ్ హార్ట్" నించి వొక కవిత ఇది.





వొకానొక తాళం చెవి

ఏకాంతమా, అమ్మా! నా జీవితాన్ని మళ్ళీ చెప్పమ్మా!
- డీ మీలోజ్



ఇల్లు విడిచి
ఏ పొద్దో వాలకముందే
ఆ వొడ్డు దాకా వొక్క నిమిషం నడిచి వెళ్లాలని.


లేదా,
అప్పుడప్పుడే పొద్దు వాలినప్పుడయినా సరే.


వెండి అలల్ని దాటి
నల్ల డాల్ఫిన్లు బారులు తీరడానికి
ఎగబడుతున్నప్పుడు.


తాళంలో చెవి తిప్పి
నా అడుగుల చప్పుడు వింటూ

తెల తెల్లని ఇసక దారి
సంద్రంలోకి లాగుతున్నప్పుడు.


మూసుకు పోయిన దారంటా
వీధి చివరంటా నడిచెళ్లే ఆ పిల్లలా.

అందరూ మంచి వాళ్ళే అనే
అందరూ పొరపాట్లు చేసిన వాళ్ళే అనే
కుటుంబ బాదరబందీ నించి

వొకానొక ఏకాంతపు కౌగిలిలోకి
నిదానంగా నడక.


వుండి పోవాలని వెళ్లిపోవాలని
తాళం చెవి బాగు చేయించాలని దాన్ని మళ్ళీ పోగొట్టుకోవాలని
ఇసక మీదనో రాళ్ళ మీదనో నడవాలని
అలల మీద స్వారీ చేయాలని తేలిపోవాలని
దారి చివరంటా పోవాలని

తాళం చెవి సరిగ్గా వేయాలని
దాని అర్థం తేల్చుకోవాలని.

ఇవాళ

వొకానొక గాలి తరగ దాని వొంటరి క్షణంలో
నా దక్షిణం వైపు కిటికీని తట్టి వెళ్తోంది

అది మోసుకు వెళ్లే తాళం చెవి నాకు తెలుసు
అది మందలింపు కాదు, పొడుపు కథ కాదు,
వాగ్దానమూ కాదు.

Friday, May 20, 2011

కాన్సర్ గుండెచప్పుడు ...కార్లా కవిత్వం!



టెక్సాస్ కవయిత్రి కార్లా మోర్టాన్ వొక వైపు కాన్సర్ ని సవాలు చేస్తోంది. మరో వైపు కవిత్వంలోని అలంకారాలనీ సవాలు చేస్తోంది. ఆమె కవిత్వం నిరలంకారంగా, నిరాడంబరంగా కేవలం జీవితాన్నే పాడే పదం. గత ఏడాది టెక్సాస్ పొయెట్ లారెట్ గా గౌరవం పొందిన కార్లా కొత్త పుస్తకం "రీడిఫైనింగ్ బ్యూటీ" నించి వొక కవిత ఇది.




గాలికి చేతులున్నాయని నాకు తెలీదు,
నా తల అంతా శుభ్రంగా గొరికించుకునేంత దాకా
దాని చేతులు ప్రేమగా నన్ను నిమిరేంత దాకా .

నా వొళ్ళు ఇంత అందంగా వుంటుందనీ తెలీదు
దాన్ని ఎవరో తెరిచి, కత్తెర వేసి, ఏదో విషంతో నింపెంత దాకా.

ఆత్మకీ కళ్ళు వుంటాయని తెలీనే తెలీదు
నా గుండె చివరంటా నన్ను వొలుచుకొని
నా అస్తిత్వాన్నంతా రాల్చుకొని నీ దాకా వచ్చే దాకా

నీ నిశ్శబ్దపు చూపు కింద
నగ్నంగా
వికలంగా నిల్చునే దాకా.

మూలం: కార్లా కె. మోర్టాన్.

Thursday, January 20, 2011

నా టీనేజర్లు!




వున్నట్టుండి ఓ రోజున వాళ్ళు
వాళ్ళ గదుల్లోకి మాయమయి పోతారు.

తలుపులూ పెదాలూ మూతపడతాయి
ఇక ఇంట్లోనే
వొకరికొకళ్ళం అపరిచితులవుతాం.

బయట గదిలో పచార్లు చేస్తుంటా
వాళ్ళ గుసగుసలే వినిపిస్తాయి
ఆ రహస్య భాషేదో నాకు తెలుసు
కానీ ఇప్పుడేమీ గుర్తు లేదు

అదీ నేను నేర్పిన భాషే కదా!


కొన్నేళ్ల తరవాత తలుపు తెరుచుకుంటుంది
మళ్ళీ చూస్తాను ఆ ముఖాలని,
వొకప్పుడు నా అరచేతుల్లో దాచుకున్న ముఖాల్ని,
నా చేతుల్లో పొద్దు తిరుగుడు పూలయి విచ్చుకున్న ముఖాల్ని.


అవి నాకు పరిచితమయిన చర్మాలే!

కానీ
ఇప్పుడు నిటారుగా నిలబడిన దేహాలు
ముత్యాల్లా మెరుస్తూ
నన్ను దాటుకుంటూ వెళ్లిపోయే దేహాలు!





(మూలం: పాట్ మొరా - టెక్సాస్ ఎల్ ఫాసో లో పుట్టిన కవయిత్రి. కవిత్వం, స్మృతులుగా మెక్సికన్ అమెరికన్ స్త్రీల జీవితాన్ని రికార్డు చెయ్యడానికి మొరా ప్రయత్నిస్తోంది. పిల్లల కోసం ఎక్కువగా రాసింది. ఆమె జీవితం కేవలం కవిత్వానికి పరిమితం కాదు,కవిత్వం ఆమెకి వొక సాధనం మాత్రమే.)

Saturday, July 17, 2010

నల్ల నినాదం అతని కవిత్వం!


















చాలా కాలంగా వెంటాడుతున్న కవి లాంగ్స్టన్ హ్యూ!

ఎప్పుడో 1902లో పుట్టి, ఏ 1967లోనో కన్నుమూసిన ఈ కవి ఇప్పుడు నా లోకంలో ఎలా కన్ను తెరుచుకున్నాడు?! అతని కవిత్వ పాదాల్లోని ఏ శక్తి నన్ను అటు వైపు జర జరా ఈడ్చుకెళ్ళింది? ఇటీవల హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో హెన్రీ గేట్స్ అనే వొక నల్ల ప్రొఫెసర్ మీద పోలీసు దాడికి నిరసనగా "తోలు మందం" అనే శీర్షికతో (ఈ కవిత నా కొత్త సంపుటి "వూరి చివర" లో వుంది) కవిత రాసినప్పటి నించీ లాంగ్స్టన్ హ్యూ కవిత్వం రోజూ కొంత కొంత చదువుతున్నా. వొకే సారి అతన్ని అంతా చదవడం కష్టం. వొక్కో సారి వొక కవితలోని వొకే వొక్క పంక్తి చదివి పుస్తకం పక్కన పెట్టి, ఆలోచనల్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు అనేకం. ఇలా చదువుతూ చదువుతూ కొన్ని నెలలు గడిచి, ఈ పొద్దు చూస్తే ఫిబ్రవరి వొకటి: అతని పుట్టిన రోజు.

ఎవరికి కావాలి కవి పుట్టిన రోజు?!

ఒక తెల్ల దేశంలో నల్ల పుటక పుట్టిన వాడి పుట్టిన రోజు అసలే అక్కరలేదు. నల్ల నేత నాయకుడయినా సరే, ఆ కవి ఈ తెల్ల దేశానికి పరాయీ వాడే!

కాని, కొన్ని పుట్టిన రోజులు చరిత్రకి కావాలి. కొన్ని పుట్టిన రోజులు చరిత్ర వేగాన్ని పెంచుతాయి. హ్యూ అలా నల్ల చరిత్ర గతిని మార్చాడు. అతను కవి మాత్రమే కాదు, నల్ల జనం మౌఖిక కథల్ని వెలుగులోకి తెచ్చాడు. కవిత్వమే రాసినా, అన్ని పనులూ కవిత్వం వల్ల కావు అనుకున్నప్పుడు గొప్ప వచనం రాశాడు.

హ్యూ గురించి చాలా రాయాలి. ముఖ్యంగా ఇవాళ్టి దళిత చైతన్య స్రవంతిలో అతని స్మరణ చాలా అవసరం.

హ్యూ కవితల నించి కొన్ని మెరుపులు:


నీగ్రో భాషలో నది


నదులు ఎప్పటినించో తెలుసు నాకు:
అవి
ఈ లోకం కన్నా అతి పురాతనం
ఈ లోకపు మానవ నదులలో పారిన
మనిషి నెత్తుటి ప్రవాహం కన్నా పురాతనం

ఆ నదుల కన్నా లోతెక్కిన ఆత్మ నాది.



ఇంకా తెల్లారని పొద్దుట
యూఫ్రేటస్ లో స్నానమాడా
కాంగో దగ్గిర
వొక చిన్ని గూడు కట్టుకున్నా
సాయంత్రానికి అది నాకు జోల పాడింది.
నైలు వైపు దృష్టి సారించా
పిరమిడ్ల ఎత్తు ఆకాసమంత అయ్యింది.
న్యూ ఆర్లీన్స్కి లింకన్ వెళ్ళిన వేళ
మిస్సిసిపితొ కలిసి వో పాట అందుకున్నా.
ఆ సాయంత్రం దాని మురికి వొడి నిండా
బంగారపు రాసులు చూశా.



ఎప్పటివో ఆ చీకటి
నదులన్నీ తెలుసు
నాకు.

వాటి మల్లెనే
లోతెక్కింది నా ఆత్మ.



నా వాళ్ళు


భలే అందంగా వుంది రాత్రి
నా వాళ్ళ ముఖాల్లాగా.


భలే అందంగా వున్నాయి చుక్కలు
నా వాళ్ళ కళ్ళలాగా.

వారెవ్వా, సూర్యుడు కూడా
భలే బావున్నాడు
నా వాళ్ళ ఆత్మల్లాగా.


ఆత్మ హత్య చీటీ


ప్రశాంతమయిన
అతి చల్లని నదీ వదనం
అడిగింది
వొక ముద్దు కోసం!


కలల కాపరి


ఆ కలలన్నీ ఇలా పట్రా,
నా స్వాప్నికుడా!

నీ గుండె సంగీతాలన్నీ
ఇలా పట్రా కాస్త.

వాటన్నీటినీ
వొక నీలి మేఘ వస్త్రంలో చుట్టెస్తా,

ఈ లోకపు కర్కశ హస్తాలకి చిక్కకుండా. *

యుద్ధంలో నువ్వూ నేనూ మనం

  యు ద్ధంలో వెనుకడుగువేయడం పిరికివాళ్ళ లక్షణం . పోరాడి గెలవాలని చరిత్ర ఎన్నో అనుభవాలనిచ్చింది. అయితే ఆ యుద్ధం మనతో మనకే అయితే..! మనిషికీ, ...