వెలి వాడలో...
చూస్తూ వుండు

ఏదో వొక ఎదురు చూపు
కళ్ళలో వరద గూడెయ్యనీ.


దిగులు
పడీ పడీ అలసిపోయాను ఇంక.

రాలిపోలేదులే,
దిక్కుల అంచు మీద నెల వంక.


చూస్తూనే
వుండు
ఎదురుగా
ఆకాశం ఎదురుపడే దాక.


అంతు లేని సంధ్యలో అయినా,
చంద్రుడిని వెలి వేసే చీకట్లోనయినా.

*
Category: 5 comments

ఆస్టిన్ లో ఇక శాశ్వత కోర్సుగా తెలుగు

యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో తెలుగు ఇక శాశ్వత కోర్సుగా రూపు దిద్దుకుంటున్నది.
వివరాలకు చూడండి: ఈనాడు
Category: 9 comments

అతని పాట వెనక వొక తూనీగనై...!
భాషని వాయిద్యాల సమాధిలో కప్పెయ్యకుండా
అక్షరాల్ని అక్షరాలుగా
పదాల్ని పదాలుగా
పదాల్ని భావాలుగా
భావాన్ని అనుభూతిగా
చెవుల్లోకీ, గుండెల్లోకి వొంపిన వాడా
గజల్ నిదానపు నడకల్ని
మృదువయిన దాని పరిమళాన్ని
అందంగా మా దాకా తెచ్చిన వాడా...
నీ పాట నా లోపలే వుంది,
మృత్యువుకి చిక్కకుండా...


వెంటనే ఈ నాలుగు ముక్కలూ రాశాను కానీ, జగజిత్ మరణం వల్ల నాలోపలి ముసురుని నేను సరిగ్గా భాషలోకి బట్వాడా చెయ్యలేకపోయానన్నది నిజం.

విపరీతమయిన కోర్సు పని,బాకీ పడిన అనేక రచనల కంచెలో, కాన్ఫెరెన్సుల తిరుగుళ్లలో కొన్ని రోజులుగా ముఖ పుస్తకానికీ, బ్లాగ్లోకానికీ దూరంగా వున్నా. ఏదో వొక స్వయం నిర్మిత ద్వీపంలో వొంటరిగా బతుకుతున్న భావన.

ఇవాళ పొద్దున జగజిత్ మరణం ఆ నిశ్శబ్దం మీద నిప్పు కణిక అయ్యింది. ఏకాకి ద్వీపంలో వొక సెగ. వొంటి మీది నించి వొక జ్వర ప్రకంపన.

అతని వెంట నా కొన్ని జ్నాపకాల తూనీగలు దిగులు దిగులుగా నడిచి వెళ్లిపోయాయి. నిజానికి నన్ను ఈ సుతి మెత్తని స్వరంలోకి, అనిర్వచనీయమయిన దుఖ్ఖపు తీగలోకి నెమ్మదిగా ప్రవహించేట్టు చేసిన కవి నిదా ఫాజ్లి.

కవికీ గాయకుడికీ వొక ఆత్మ బంధుత్వమే వుంటుంది. ఫాజ్లి జగజిత్ కోసం రాశాడో, జగజిత్ ఫాజ్లి కోసం పాడాడో నాకు ఇప్పటికీ తెలియదు. ఫాజ్లి కవిత్వంలోని దిగులు జీర కోసమే జగజిత్ గొంతు పుట్టిందని అనిపిస్తుంది చాలా సార్లు.

అసలే ఘజల్ వొక మాయామోహం!

వొక్క సారి ఆ మాయామోహంలోకి అడుగు పెట్టాక వెనకడుగు లేదు. ఇక ఆ ప్రపంచంలో నిదా ఫాజ్లి అనే కవిని కలిశాక ఆ స్నేహ మోహం వూపిరాడనివ్వదు.నిద్రలోనూ అతని పంక్తులు, వాటిని స్వరానువాదం చేసిన జగజిత్ ఆలాపన వెంటాడతాయి.

విషాదాన్ని ఎంత అందంగా చెక్కుతాడో ఈ కవి, ఆ విషాదంలోని శిల్పాన్ని అంత అందంగా, అంత స్వాంతనగా మనసు చెవిలోకి వొంపుతాడు జగజిత్.

ఇవాళ జగజిత్ నిష్క్రమణతో నా లోపలి ఆ వొక్క జీవన రాగమూ తెగిపోయినట్టనిపించింది.

నిదా ఫాజ్లి మాటల్లోనే జగజిత్ కి నా అల్విదా...

వొకే విషాదం

సమాధి ఎవరిదయితేనేం?
చేతులు మోడ్చి
ఎవరి కోసం ఫతేహా చదివితేనేం?!

విడివిడిగా ఇక్కడ ఫతేహాలు చదువుతున్నాం కానీ,
ఏ సమాధిలో అయినా
వొక విషాదమే కదా, అలా కునుకు తీస్తోంది!
- ఏ తల్లి కన్నబిడ్డో,
ఏ అన్న ముద్దుల చెల్లెలో,
ఏ ప్రేయసి సగం దేహమో.

ఏదో వొక సమాధి మీద
ఫాతెహా చదివి వెళ్ళి పో..ఈ పూటకి!
*
Category: 4 comments
Web Statistics