నది చుట్టూ పది పద్యాలు
1

అవే పాదాలు

అవే అడుగులు

ఇక్కడేమో నేలని మోస్తున్నంత

దిగాలుగా ఇసకరోడ్లలో దిగబడ్తుంటాయి

నీ దగ్గిరేమో  నింగి అందుకుంటున్నంత

తేలికగా గాలి రెక్కల మీద ఎగుర్తుంటాయి.

2

నది కాళ్ళ దగ్గిర

తల వంచి నిల్చున్నప్పుడు నేనేమడిగానో నాకు గుర్తు లేదు.

నిద్రపట్టనప్పుడు

నీ రెండు చేతులూ భుజమ్మీద వూయెలూగి

కలలన్నీ కరిగి కళ్లలోకి నది పొంగుకొచ్చింది.

తెల్లారబోతున్నప్పుడు నేనొక సముద్రాన్నని తెలిసింది.

3

అక్కడ రెండు గట్ల మధ్య వొరుసుకుపోతున్న

నీళ్ళు

నీకు అద్దంలా కనిపిస్తాయి స్వచ్ఛంగా.

ఏమిటో గుర్తొస్తున్నట్టు

అలా ఆ విరిగిపోతున్న నీటి బింబాల మధ్య

నువ్వు

ప్రతిబింబాలను ఏరుకుంటూ వుంటావు.

4

వొక మంచు పర్వతాన్ని

ముక్కలుగా తెగనరుకుతున్న చప్పుడు నేను వింటాను

ఎండ దుప్పటి కప్పుకొని

చలిగాలులు ఉదయాన్ని కోసుకుంటూ వెళ్లిపోతాయి.

నా వొంటి మీద వాల్తున్న నీరెండలోంచి

కంటిరెప్పలతో నన్ను కాచుకున్న నీలోంచి

నిశ్శబ్దంగా బయటికి వస్తున్నప్పుడు

నేను కుప్పకూలిపోతున్న మంచు కొండని.

5

ఎక్కడికీ వెళ్లనంటాను

నా వొళ్లోనే నదిని దాచుకుంటాను.

దూరాన  కొండ భుజానికి ఆనుకుని నిల్చున్న ఆకాశం.

అక్కడ చూడు,

నీటి వొంటి మీంచి జారిపోతున్న పడవ.

తీరా చూస్తే, నది నువ్వు- పడవ నేను.

6

మరీ చీకటప్పుడు ఆ చివ్వరికి నడుచుకుంటూ వెళ్ళామా?

నీటి గుండెలు ఎలా పగిలిపోతున్నాయో తెలిసిందా?

ఇంత నిశ్శబ్దాన్ని

ఈ చెట్లూ చేమలూ

ఈ కొండలూ ఈ గుట్టలూ

ఈ నేలా ఈ ఆకాశమూ నిజంగా భరిస్తాయా?

వంతెన మీంచి నడిచివెళ్తున్న పాదాల కింద

ఏమిటేమిటో కూలిపోతున్నాయో

వింటున్నావో లేదో అనుకుంటే

నా వైపు తిరిగి నువ్వు వొక కన్నీటి చుక్కని

నీ రెప్పల మధ్య దీపంలా వెలిగించావు.

7

తెల్లారని వంతెన మీద

నువ్వు సూర్యుణ్ణి వెతుక్కుంటున్నావు

దూరంగా నేను వొక గుడ్డిదీపాన్ని చూపించాను

నువ్వు నా కళ్లలోకి చూసి పగలబడి నవ్వావు కానీ

కాసేపటికి ఆ దీపమే ఆకాశం నడినెత్తికెక్కింది.

8

దిక్కుల సంగతెవ్వరికీ తెలీదు

వొక్క నదికి తప్ప.

దీనికీ ఓ అంచు వుండాలి కదా అనుకుంటే దొరకదు.

చేప పిల్లలా మెరుస్తూ ఈ దేహంలోకి ప్రవేశించాక

బయటికి రావడం ఇక వల్ల కాదు

ఏదో వలలో చిక్కుబడితే తప్ప.

అది సరే,

దిక్కుల్ని వల బంధిస్తుందా?


9

మరీ పొద్దున్నే నువ్వు

నుదుటి మీద ఎర్రని సూర్యుణ్ణి ధరించి వచ్చావు

నా కళ్లలోని చీకటంతా

అప్పటికప్పుడు నిద్రపెట్టె సర్దుకుని వెళ్లిపోయింది.

10

కాలానికి ఇక్కడెవరైనా ఆనకట్ట కడితే

బావుండేది,

పోనీ

వొక్క క్షణానికైనా!


(మే 2 –  వొకే వొక్క ప్రేమ దీపం కల్పన-కి  పుట్టిన రోజు సందర్భంగా)
Category: 10 comments

అఫ్సానా మేరా…పాటలు అందరూ పాడతారు, షంషాద్!

కానీ ఇంత చిలిపితనాన్ని ఎవరు పాడతారు,నువ్వు తప్ప
ఇంత అల్లరల్లరిగా మాటల్ని ఎవరు రువ్వుతారు నువ్వు తప్ప
ఇంత నిర్లక్ష్యంగా ఎవరు నవ్వుకుంటూ వెళ్తారు వొక్క నువ్వు తప్ప!

- మిగతా కవిత సారంగలో....
Category: 0 comments
Web Statistics