ఒక ‘పూర్వ నావికుడి’ ఆధునిక ప్రయాణం!
“నేనొక ancient mariner ని”
అన్నారు నండూరి వొక రోజు రాత్రి పురాణం గారి ఇంటి మేడ మీద ‘సాక్షి’ క్లబ్ సమావేశం తరవాత ఇద్దరం బెజవాడ బందరు రోడ్డు మీదకి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు.
తనకి ఎంతో ఇష్టమయిన ఆంగ్ల కవి కొల్రీడ్జ్ పద్యం Ancient Mariner లోని కొన్ని పాదాల్ని ఆయన ఆ రాత్రి అలా అప్పజెప్పేయడం ఈ పూటకీ వొక తాజా పరిమళం లాంటి జ్నాపకం.
With throats unslaked, with black lips baked,
We could nor laugh nor wail;
Through utter drought all dumb we stood!
ఆ పద్య పాదాలు ఆయన వొణికే స్వరంలో కొత్త మెరుపు తీగలవ్వడం గుర్తుకొస్తోంది. ఆ పద్యాన్ని అంతా తెలుగు చెయ్యమని ఆయన చాలా సార్లు అడిగేవారు, నాకు కూడా కొల్రీడ్జ్ అంటే వెర్రి ప్రేమ అని తెలిసినప్పుడు- కానీ, ఈ పద్యం చదివినప్పుడల్లా నాకు నండూరి నిండు జీవన యాత్ర భిన్న సందర్భాల్లోంచి భిన్న స్వరాలతో వినిపిస్తుంది. నండూరి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన కొన్ని తలుపులు ఈ పద్యంలోంచి తెరుచుకుంటాయి. ఆయన ఈ పద్యాన్ని వూరికే ఇష్టపడలేదని, ఇందులో ఆయనలోని కవీ, తాత్వికుడూ, రచయితా ముప్పేటగా కలిసి వున్నారని ఆయన ఎనిమిది పదుల నిర్విరామ జీవన యాత్రని తలచుకుంటే అర్ధమవుతుంది. కొల్రీడ్జ్ రాసిన ఈ పద్యం ఆధునికతకి మొదటి సంకేతమని ఆంగ్ల సాహిత్య విమర్శకులు అంటారు, కానీ- అంత కంటే ఎక్కువగా అది కొల్రీడ్జ్ కవిలోని ఉద్వేగ పూరితమయిన వ్యక్తిత్వం, దాన్ని నిరంతరం నియంత్రిస్తూ వుండే అతని పురా- ఆధునిక తాత్వికతల అంతస్సంఘర్షణల ఆత్మకథనం.
ఈ పద్యం నాకు వినిపించినప్పుడు కూడా నండూరి ఆ అంతస్సంఘర్షణల ఆత్మకథనాన్ని చెప్తున్నారని అనిపించింది. నండూరికి ఎలియట్ చెప్పే objective correlative అంటే చాలా ఇష్టం. అంటే, వొక విషయాన్ని చెప్పడానికి బయటి సాధనాల్ని వాడుకోవడం! నండూరికి ఇది సాహిత్యంలోంచి వ్యక్తిత్వంలోకి ప్రవహించింది. చాలా సందర్భాల్లో నండూరి తన వ్యక్తిత్వంలోని లోపలి వొత్తిడిని చెప్పడానికి కొన్ని సాహిత్య/ సంగీత సాధనాలని వెతుక్కోవడం నాకు ప్రత్యక్ష అనుభవం. ఈ సందర్భంలో పైన చెప్పిన కొల్రిడ్జ్ కవిత దీనికి వొక ఉదాహరణ మాత్రమే. పందొమిదేళ్ళ వయసులో నేను ఆయన దగ్గిర ఉపసంపాదకుడిగా చేరాను. అంటే, వొక వ్యక్తిగా నాదయిన దారిని వెతుక్కునే వయసులో నేను ఆయన నీడలోకి వచ్చానని అనుకోవాలి.
తొలినాటి నించే రోజు వారీ వార్తా పత్రిక పనులతో పాటు నాకు అదనంగా సాహిత్య రచనల బాధ్యతలు అప్పజెప్పారు. ఇద్దరికీ సాహిత్యం ప్రధానమయిన మనోవ్యాపారం కాబట్టి, దీంతో ఆయనతో నా అనుబంధం మరింత బలపడింది. అప్పుడు సాహిత్య పేజీ అంటే ఆదివారం అనుబంధంలో పావు పేజీ మాత్రమే. ఆదివారం అనుబంధం మార్చాలన్న ఆలోచన అప్పుడే ఆయనకు మొదలయ్యింది. అదే అదనుగా తీసుకొని నేను కాస్త ధైర్యం కూడదీసుకొని సాహిత్యం పూర్తి పేజీ చేద్దాం అని మెత్తగా మొరాయించడం మొదలెట్టాను. “వారానికి వొక నిండు పేజీ సాహిత్యమా? అబ్బే...అంత మ్యాటర్ దొరకదు” అన్నారు ఆయన. “నేను తీసుకు రాగలను” అని చెప్పి, కొత్త శీర్షికల చిట్టా విప్పాను. “కానీ, నీకు రోజూ వుండే పనిలో ఆ పేజీకి అంత సమయం పెట్టలేవు” అన్నారు. “అది నా పని. ఒక ప్రయత్నం చేస్తాను” అనేశాను, కానీ – తీరా మొదలు పెట్టాక కానీ తెలియలేదు అది ఎంత పనో! ప్రతి శుక్రవారం నేను ఆ పేజీ కోసం సేకరించిన రచనలు ఆయన చూసే వారు. చూసిన ప్రతి సారీ ఆయనకి కొన్ని బలమయిన ఇష్టాలూ, అయిష్టాలూ వుండేవి.ఆయన స్వతహాగా చాలా మొహమాటస్తుడు. కానీ, రచనల ఎంపిక విషయం వచ్చేసరికి ఆ మొహమాటం వుండేది కాదు. ప్రతి రచనా ఇద్దరం కలిసి మళ్ళీ చదివే వాళ్ళం. ప్రతి వాక్యం పట్టి పట్టి చదివే వాళ్ళం. ఆ చదివే క్రమంలో ఆయన్ని చాలా దగ్గిరగా అర్థం చేసుకునే వీలు దొరికేది. శనివారం నేను పేజీ పెట్టి ఆయన దగ్గిరకి తీసుకువెళ్ళాక, ఆయన ముఖం వొక కొత్త కాంతితో వెలిగిపోయేది. దినపత్రిక సంపాదకత్వం అనేక బాధ్యతల భారమయిన సంకెల. కానీ, ఆ సాహిత్య పేజీ ఆ భారమయిన సంకెళ్ళనుంచి ఆయనకి బోలెడంత స్వేచ్ఛని ఇచ్చేదని ఇప్పటికీ అనిపిస్తుంది. ఆయన లోపలి మనిషి ప్రాణం ఆ సాహిత్య చిలకలో వుందని అనిపించేది. ఆయన ప్రధానంగా సాహిత్య జీవి. అంతకంటే మించి, ఆ జీవి వొక స్వేచ్చా జీవి!
ఆయన ఆలోచనలకూ, ఆయన వ్యక్తిత్వానికీ మధ్య ఎడం నాకు ఎప్పుడూ కనిపించలేదు. నా పట్ల ఆయన తొలినాళ్లలో తీసుకున్న శ్రద్ధని మరచిపోతే జీవితం నన్ను క్షమించదు. వొక రచయితగా కేవలం ప్రాచీన తెలుగు సాహిత్యం, ఇంగ్లీషు సాహిత్యం, కొద్దిపాటి మార్క్సిస్టు తత్వ శాస్త్ర పరిచయానికే పరిమితమయిపోయిన కాలంలో నాకు ఆయన సార్త్రని, ఇతర తత్వవేత్తలనీ పరిచయం చేశారు. ఆ తత్వశాస్త్ర పుస్తకాలు ఇచ్చి వారానికి ‘ఇంత చదువు’ అని షెడ్యూల్ పెట్టే వారు. చదివాక, వాటి గురించి ప్రశ్నలు అడిగే వారు. ఆఫీస్ కి వస్తే క్షణం తీరిక వుండేది కాదు ఆయనకి- కానీ, ఎన్ని పనుల్లో వున్నా రోజులో ఏదో వొక సారి నన్ను పిలిచి, నేను చదివే పుస్తకాల గురించి తప్పక అడిగే వారు. సగం ఇంటి అద్దెకీ, ఇంకో సగం భోజనానికి మాత్రమే బొటాబోటీగా సరిపోయే జీతం వచ్చే కాలంలో, కనీసం వొకట్రెండు ఇంగ్లీషు పుస్తకాలు కొనుక్కోవడానికి వీలుగా నాకు అదనపు డబ్బు వచ్చే ఏర్పాటు చేసే వారు.
అవి ఆయన ఆంధ్రజ్యోతి వారపత్రికలో “విశ్వ దర్శనం” రాస్తున్న రోజులు. మార్క్సు తరవాత ఇంకా వేరే సామాజిక/ జీవన వ్యాఖ్యానాలు చదవాలా అన్న సందిగ్ధం నన్ను పీడిస్తున్న కాలం అది. ఆయన చెప్తూ వుంటే, విశ్వదర్శనం శీర్షిక వ్యాసాలు కొన్ని సార్లు నేను రాసేవాణ్ణి. ఆ సందర్భాలలో మధ్యలో ఆయన కాసేపు విరామం తీసుకుంటూ, ఆ తత్వవేత్తల గురించి చెప్పే వారు. ముఖ్యంగా వాటి సాహిత్య మూలాలు చెప్పే వారు. ఆయన చెప్పిన వొక మాట ఎప్పుడూ నాకు గుర్తుంతుంది: “సాహిత్యం, ఫిలాసఫీ రెండూ వొక దానికి ఇంకోటి సంపూర్ణత్వాన్ని ఇస్తాయి. వొకటి లేకుండా ఇంకోటి అసంపూర్ణం. అందుకే, ఫిలాసఫీ చదువుకున్న రచయితలు, కవులు రాసే రచనలు చాలా భిన్నంగా, కొత్తగా కళకళలాడుతూ వుంటాయి.”
విశ్వదర్శనం ద్వారా ఆయన చేస్తున్న పని ఏమిటో నాకు చాలా ఆలస్యంగా బోధ పడింది. ఆయనకి బాగా నచ్చిన తాత్వికుడు సార్త్ర. ఇప్పటికీ “విశ్వ దర్శనం” వ్యాసాలన్నీ ముందు పెట్టుకుని చదివితే, సార్త్ర పట్ల ఆయన ప్రేమ తెలిసిపోతూ వుంటుంది. గ్రీక్ తత్వవేత్తలతో మొదలయిన విశ్వ దర్శనం సార్త్రతో ముగుస్తుంది. నిజానికి ఈ ముగింపు యాదృచ్ఛికం కానే కాదు. అది ఆయన ఇష్టపూర్వకంగా ఇచ్చిన ముగింపు. అదే వ్యాసంలో నండూరి సాహిత్య వ్యక్తిత్వం కూడా కనిపిస్తుంది. బహుశా, ఈ వ్యాసంలో ఇచ్చినన్ని సాహిత్య ఉదాహరణలు ఆయన ఇంకే వ్యాసంలోనూ ఇవ్వలేదు. అస్తిత్వ వాదం అర్థమయితే తత్వ శాస్త్రం చాలా మటుకు అర్థమయినట్టేనని ఆయన ఆ వ్యాసం రాసిన తరవాత నాతో వొక సారి అన్నారు. ఈ వ్యాసం కంటే ముందే, ఆయన ఈ వ్యాసంలో పేర్కొన్న రచయితలూ, రచనల గురించి ముఖ్యంగా , హామ్లేట్, ఎలియట్, రాబర్ట్ బర్న్స్, దాస్తావస్కీ, చెకోవ్, గోర్కీ ల గురించి విడివిడిగా నాతో వ్యాసాలు రాయించడం నాకు అద్భుతమయిన శిక్షణ. ఆ వ్యాసాల కోసం నేను ఆయా రచనలు చదవడం వొక ఎత్తు. చదివాక వాటి గురించి ఆయనతో మాట్లాడడం ఇంకో ఎత్తు. మరీ ముఖ్యంగా ఆంటన్ చెకోవ్ మీద ఆయన సూచన మీద నేను రాసిన వ్యాసం “ఆశా వైణికుడు ఆంటన్ చెకొవ్” మా మధ్య సాహిత్య బంధుత్వాన్ని మరింత పెంచింది. ఆ వ్యాసం చదివాక “ చెకోవ్ ఆశావాది అంటావా?” అంటూ వొక ప్రశ్న లేవనెత్తారు. “నిరాశ గురించి చెప్పడం అంటే ఆశని పునర్నిర్మించుకోవడం, నిరాశని వినిర్మించుకోవడం కాదా?!” అని అనగానే ఆ రోజుకి మంచి తాయిలం దొరికిన పసిపిల్లాడిలా ఆయన ఎంత సంబరపడ్డారో చెప్పలేను. ఆ రోజు నేను ఆయనకి గుర్తు చేసిన చెకోవ్ అన్న వాక్యం “And yet, always, every movement of the day and night my soul has been filled with such marvelous hopes and visions, I can see happiness, Amia, I can see it coming…” అంత బలమయిన వాక్యం రాసిన చెకోవ్ ని నిరాశావాది అని ఎలా అనగలం? (ఈ వాక్యం తరవాత ఆయన సార్త్ర వ్యాసంలో సందర్భోచితంగా ఉపయోగించుకున్నారు కూడా)
సాహిత్యాన్ని భిన్నంగా చదవడం నండూరికి చాలా ఇష్టమయిన ప్రక్రియ. ఒక పుస్తకమో, కవితో చదివాక ఆయన అడిగే ప్రశ్నలు చాలా ఆసక్తిగా వుండేవి. కొన్ని ప్రశ్నలు చాలా అమాయకంగా, చిలిపిగా కూడా వుండేవి. కానీ, ఆయనలోని పఠిత నాకు ఎప్పుడూ విస్మయం కలిగించే వాడు. ఆ భిన్నమయిన పఠన పద్ధతి తత్వశాస్త్ర అధ్యయనం వల్లనే సాధ్యమయిందని ఆయనే చాలా సార్లు చెప్పే వారు. వాచకాన్ని ప్రశ్నించడం, అందులోని భిన్న స్వరాల వెతుకులాట అనేది మనకి 1990 తరవాత బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ధోరణి. కానీ, ఆ రోజుల్లో నండూరి ఎలియట్ కవిత్వవిమర్శ వ్యాసాలని బాగా ఇష్టపడే వారు. ఎలియట్ సాహిత్య విమర్శలో ఈ రెండు ధోరణులు బలంగా కనిపించడం వొక కారణం. అసలు ఎలియట్ కవిత్వం అంతా భిన్న స్వరాల కోరస్ అని ఆయన వొక సారి మాటల సందర్భంలో అనడం నాకు బాగా గుర్తు. పుస్తకం చదివేటప్పుడు ఆ చదవడంలో వుండే ఉద్వేగాన్ని కాపాడుకుంటూనే, ఆ పుస్తకంలోని విషయాల్ని విబేధించాలని ఆయన అనే వారు. అదే సహృదయత అనీ అనేవారు. ఆయన దగ్గిర వున్న కాలంలో చదువు వొక వ్యసనం అయ్యింది నాకు, ఎందుకంటే – కలిసిన వెంటనే ఆయన అడిగే ప్రశ్న” ఏం చదువుతున్నావ్?” అని- ఆ ప్రశ్నకి సరయిన సమాధానం ఇవ్వలేకపోతే, మా సంభాషణ అక్కడితో ఆగిపోయేది. ఆ సంబాషణ కొనసాగించాలన్న ఉత్సాహంతో నేను ఏదో వొకటి చదువుతూ వుండే వాణ్ని. కానీ, ఆయనతో వచ్చిన చిక్కేమిటంటే, “నేను టాగోర్ కవిత్వం చదువుతున్నాను,” అంటే వెంటనే ఆయన రూటు మార్చి, ‘అబ్బే, టాగోర్ వ్యాసాలు చదువు!’ అనేసేవారు. మరో సారి నేను టాగోర్ వ్యాసాలు చదువుతున్నాను అంటే,”అబ్బే, ఆయన కథలు చదువు!” అనే వారు. ఈ రకమయిన పరీక్షా విధానం వల్ల నేను పనికట్టుకుని కొన్ని పుస్తకాలు చదవాల్సి వచ్చింది.
పఠనంలో భిన్నత్వం అనేది అసలు రచనల ఎంపికతో మొదలవ్వాలన్నది ఆయన ఉద్దేశం. కృష్ణశాస్త్రి అనగానే అందరూ పోలోమని ఆయన కవిత్వం చదువుతారు, కానీ, అసలు కృష్ణ శాస్త్రి వ్యాసాల్లో వున్నాడు అనే వారు. అలాగే, వొక్కో రచయిత వొక్కో రకమయిన భిన్నమయిన ప్రక్రియలో రహస్యంగా దాక్కుంటాడు అనే వారు. శ్రీశ్రీని వచనంలో చదవాలనీ, ఎలియట్ ని విమర్శ వ్యాసాల్లో చదవాలనీ, కీట్స్ ని ఉత్తరాల్లో చదవాలనీ అలా ఆయన భిన్నమయిన దారుల్ని చూపించే వారు. ఆఫీసుకి రాగానే, రోజు వారీ రాజకీయ వ్యాసాల, వార్తల మధ్య కప్పడిపోయే ఆయన ఆత్మ ఇంత శుభ్రంగా ఎలా వుందా అని రోజూ ఆశ్చర్యపోయేవాణ్ని. ఆయన చేతుల్లో ఆ రోజు ఏ పుస్తకం వుందా అని పరీక్షగా చూసే వాణ్ని.
కవిత్వం , పాటలు అంటే ఆయనకి ప్రత్యేకమయిన ఇష్టం. ఆయన ఎక్కువగా ఫిక్షన్/ నాన్ ఫిక్షన్ చదివే వారు. కానీ, కబుర్లలో కవిత్వం, పాటల గురించి చాలా ఇష్టంగా మాట్లాడే వారు. “ఎందుకంటే నేను విఫలమయిన కవిని కనుక!’ అనే వారు. నిత్య సంభాషణల్లో, తన వ్యాసాల్లో కూడా కవిత్వ పాదాల్ని చక్కగా ఉపయోగించుకునే వారు. ఒక్కో సారి, కొన్ని పద్య పదాలు వినిపించి, అసలు దాని అర్థం ఏమిటి అని అడిగే వారు. అసలు అర్థం ఆయనకు తెలుసు, భిన్నమయిన అర్థాలు వినాలని ఆయన తపన, సరదా. సైగల్ పాటలలోని సాహిత్యం మా ఇద్దరి మధ్యా మరో వంతెన. (ఆయన సైగల్ పాటలు బాగా పాడేవారు ) ఒక సారి ఆఫీసుకి రాగానే నన్ను పిలిచి, వొక పాటలో ‘కాహె కొ రార్ మచాయీ ” అనే పాటలో , అది “కాహెకొ ” అని ఎందుకు, “క్యోం?” ఎందుకు అనలేదు అంటూ ఆయన ఆ పాట మొత్తం వినిపించారు. నిజానికి, ఆ పాట మొత్తం శిష్ట వ్యావహారికంలో వుంటుంది, ఆ వొక్క పదం మాత్రం జానపదం. ఆ వొక్క పదం సైగల్ గొంతులో మరీ అద్భుతంగా వుంటుంది. నండూరి పాడినప్పుడు అది ఆయన ‘సన్నిధాన దివ్య స్థలాన’ మరింత మధురంగా వినిపించింది నాకు.
కవిత్వం, పాటల మీద ఆ ప్రేమే ఆయన చేత మహాసంకల్పం సంకలనం వెయ్యడానికి దారి తీసిందనుకుంటా. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారితో కలిసి 1940 -1975 మధ్య వచ్చిన వచన కవిత్వం సంకలనంగా 1975 చివరలో వచ్చింది. ఈ సంకలనం కృష్ణ శాస్త్రి తో మొదలై, చెరబండ రాజు కవితతో ముగుస్తుంది. ఈ సంకలనంలోని కవితలు చదువుతున్నప్పుడూ, దీనికి నండూరి రాసిన ముందు మాట చదువుతున్నప్పుడూ అస్తిత్వ వాదం, సార్త్ర ఆలోచనా విధానం ఆయన పైన ఎంత బలమయిన ముద్ర వేసాయో ఇంకో సారి అర్థమవుతుంది. ‘సమకాలిక జీవితం పట్ల ఆధునిక దృక్పథాల సంకీర్ణతని ప్రతిబింబించడం” ఈ సంకలనం ఉద్దేశం అని ఆయన రాసిన వాక్యాలు మొత్తంగా ఆయన దృష్టి ఎక్కడ నిలిచి వుందో చెప్తాయి. నిజానికి ఈ ముందు మాటలో సార్త్ర అడుగడుగునా తారస పడ్తాడు. మొత్తంగా సార్త్ర దృష్టి ఎంతసేపటికీ మనిషి అస్తిత్వ స్థితి మీద! ఈ సంకలనంలో ఏ కవిత చదివినా ఆ ఆధునిక మానవుడి స్థితే అద్దంలో చూపించినట్టుగా కనిపిస్తుంది. కానీ, అంత కంటే ముఖ్యంగా, ఆయన 1975 ల సంక్లిష్ట సాహిత్య యుగంలో ఇంకో సంగతి కూడా గుర్తు చేస్తున్నారు. సాహిత్యాన్ని నిజంగా “సాహిత్యం చేసే” నిర్దిష్ట గుణాల మీదకి మన దృష్టి మళ్ళించడం!
“కవి ఏ రాజకీయ, తదితర సిద్ధాంతాలకు కమిట్ కారాదని, నిర్లిప్తంగా వుండాలని, కవిత్వం అన్ని రాజకీయ, తదితర విశ్వాసాలకు అతీతంగా వుండాలనే వారి వాదంతో నేను ఏకీభవించలేను. కానీ, కవితా గుణం మాత్రం తప్పకుండా రాజకీయ, తదితర సిద్ధాంతాలకు, విశ్వాసాలకు అతీతమని నా అభిప్రాయం. కవిత్వం (poetry) వేరు, కవితా గుణం (poetryness?) వేరు.” అన్నది ఆయన ప్రతిపాదన. సాహిత్యం గురించి ఆయన చివరంటా అంటిపెట్టుకున్న ప్రతిపాదన ఇదే. అంతే కాదు, సార్త్ర చెప్పినట్టు ఎంపిక స్వేచ్చ లేని అస్తిత్వానికి అర్థం లేదనీ ఆయన విశ్వసించారు. ఆ మాటకొస్తే, ఆధునికత కి అసలు అర్థం అలాంటి స్వేచ్ఛలోనే వుందనీ ఆయన నమ్మారు. అలాంటి స్వేచ్ఛ లేని ఆధునికతకి కదలిక లేదనీ ఆయన అనే వారు. ఆయనకే నచ్చిన కొల్రిడ్జ్ కవిత ఆ కదలిక లేనితనాన్ని ఇలా చెప్తుంది – ఆ రాత్రి ఆయన వినిపించిందే -
Day after day, day after day,
We stuck, nor breath nor motion;
As idle as a painted ship
Upon a painted ocean.

సమాజం నిత్య చలన శీలం అనుకుంటాం, కానీ కొన్ని సమయాలు స్తబ్దంగా కూడా వుంటాయి, స్టిల్ పెయింటింగ్ లో ఆ నౌకాలాగా, ఆ సముద్రంలాగా! ఒక నావికుడు వస్తాడు, ఆ స్తబ్దతని తొలగించి, దిశ మార్చడానికి!
అలాంటి వొక స్తబ్దతని తొలగించి, వొక ఆధునిక మెలకువని తెలుగు వచనంలోకి ప్రవేశపెట్టిన నవ్య తాత్వికుడు నండూరి. అది సాహిత్యంలో కావచ్చు, మానవ పరిణామక్రమాన్ని శాస్త్రీయ వెలుగులో పూసగుచ్చినట్టు అందంగా చెప్పే రచనల్లో కావచ్చు. ఆధునిక మానవ మేధ వెయ్యి పూవులుగా వికసించిన అంతర్గతయాత్రని అక్షరాల్లోకి అనువదించిన తాత్విక రచనలు కావచ్చు. నవ్య సాహిత్య ప్రపంచ వీధుల్లో చిటికెన వేలు పట్టుకుని ప్రేమగా తిప్పిన సృజనాత్మక అనుసృజన కారుడు కావచ్చు. విపరీతమయిన దినపత్రికా పనుల వొత్తిడిలో కాసింత హాయిగా వూపిరి పీల్చుకోడానికా అన్నట్టు ఆయన రాసిన సాహిత్య, సంగీత రచనల్లో కావచ్చు. అవన్నీ ఆధునిక చేతనని ఒక బలమయిన సంప్రదాయంగా నిలబెట్టే ప్రయత్నాలే. అదే ఆయన అక్షరయాత్ర అంతస్సూత్రం.
ఆయనలాంటి సంపాదకుడు మరొకరు పుట్టవచ్చు. ఆయన కంటే గొప్ప సంపాదకీయాలు రాసే వారూ పుట్టవచ్చు. కానీ, ఆయనలాంటి ఆధునిక వచన రచయిత మరొకరు పుడతారా అన్నది సందేహమే! తనని తాను వొక ancient mariner అని ఆయన పిలుచుకోవడం కేవలం వొక అస్తిత్వ అన్వేషణలో భాగమే! తెలుగులో బహుముఖీన ఆధునికతని ఆవిష్కరించిన అపూర్వ నావికుడు నండూరి.

(ఆంధ్రజ్యోతి వివిధ నుంచి - సెప్టెంబరు 11)
Category: 7 comments

నా తొలి కవిత "వయొలిన్లోకం"


మెత్తటి వేళ్ళు
తలుపు తట్టినట్టు

వయొలిన్తీగల్ని నొక్కినట్టు
నరాల్లో మౌనంగా
పారే రక్తంలో
వొక మృదువయిన కదలిక

ఆలోచన గాలిపటం
తెగిపోయిన ఆకాశంలో
కనిపించీ కనిపించనట్టు
మెలికలు తిరుగుతూ
నేలరాలే అనుభూతి

చీకట్లో ముడుచుకు పడుకున్నప్పుడు
రాత్రి గోడపై తెరుచుకునే నేత్రం
బిగుసుకుపోయిన గాల్లోంచి
కరుగుతూ వచ్చి
నిశ్శబ్దాన్ని తడుముకుంటూ
వెళ్లిపోయే సంగీతం వేళ్ళు

యుద్ధభూమిగా మారిన అరచేతులు
ఆకాశాలను పొదివిపట్టుకోవాలనుకునే
చివరి ప్రయత్నంలో
నిర్జీవంగా వేలాడి
అలసిపోయిన హృదయంపై
వాలిపోతాయి

వెక్కి వెక్కి ఏడ్వలేక

ఏ ముఖంలోనూ దాక్కో లేక...!

(ఈ కవిత మొదటి కవితా సంపుటి "రక్తస్పర్శ" లో 1986లో అచ్చయింది. కానీ, ఈ కవిత నాకు గుర్తున్నంత వరకూ నేను రాసిన మొదటి కవిత 1980లో! )
Category: 8 comments

కొందరు స్త్రీలు
కొన్ని దానిమ్మ గింజలు అటూ ఇటూ విసిరాను,
వొక్కో గింజలోంచి వొక్కో స్త్రీ.


ఆవలి కొండ మీద బతుకు దుప్పటి
నిండా కప్పుకొని వొకామె

రాత్రనకా పగలనకా కిటికీ పక్కన కూర్చొని-


ఏదో వొక తోటలోకి జారుకొని
చెదిరిన ముంగురులతో
వెనక్కి మళ్లుతూంది మరొకామె -


నేనేమో
నా దారిన వాళ్ళని వెతుక్కుంటూ -

నేనూ ఇంకో గింజనే
కాకపోతే, కాస్త ఎడంగా.

అంతే!


(మూలం: ఇంతియాజ్ ధార్కర్)
ఇంతియాజ్ ధార్కర్ బొమ్మలన్నా, కవిత్వమన్నా నాకు చాలా ఇష్టం.
ఆమె బొమ్మల్లోనూ, కవిత్వంలోనూ ఎక్కువగా కనిపించేది స్త్రీలే!
పాకిస్తాన్ లోని లాహోర్ లో పుట్టిన ఇంతియాజ్ తరవాత ముంబై వచ్చేసింది తన ప్రియుడితో.
ఇప్పుడు ముంబై, లండన్, వేల్స్ మధ్య పరిభ్రమణం ఆమె జీవనం.
బొమ్మలూ, కవిత్వమే జీవితం.
Category: 7 comments

అమ్మయ్య, నా మొదటి తెలుగు గండం గట్టెక్కింది!
"వీడికి ఇంక పొట్ట కొస్తే తెలుగక్షరమ్ముక్క రాదు!" అనుకున్నారు నా తురకంతో విసిగిపోయి మా అమ్మా నాన్న.
బట్టలు ఉతకడం అనాల్సింది బట్టలు "కడగడం" అనీ, అంట్లు కడగాల్సింది పోయి " అంట్లు ఉతకడం" అనీ అనేవాణ్ణి నా నాలుగో తరగతి దాకా! చింతకానిలో నా ఉర్దూ మీడియం చదువూ, దానికి తోడు నా వీధి బడి పంతులు వీర బాదుడూ నన్ను ఆ రోజుల్లో తెలుగు భాషకి దూరం చేశాయి. తెలుగు రాకపోతే ఎలా అని అమ్మా నాన్న దిగులు పడడం మొదలుపెట్టారు. తెలుగు వల్ల నా నాలుగో తరగతి చదువు నరకమయి పోయింది నాకు! తెలుగు రాకపోతే పర్లేదులే ఆ ఉర్దూ అరబ్బీ సరిగ్గా ఏడిస్తే చాలు అంది అమ్మమ్మ. ఇంగ్లీషు బాగా చదువుతున్నాడు, "ఇనఫ్..ఇనఫ్" అని సంబరపడిపోయాడు పెద మామయ్య. "అమ్మో, తెలుగు రాకపోతే ఎలా? నా పరువు గంగలో కలిసిపోతుంది" అనుకున్నారు నాన్న, పైకి చెప్పకపోయినా!

అప్పుడు మా అమ్మానాన్నకి వొక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది, వీడి తెలుగు ఇంటి చదువుకి ఎలాగూ బాగుపడదు అనుకున్నారు. వొక సాయంత్రం ఇద్దరూ నన్ను తీసుకువెళ్లి, శుభలక్ష్మి టీచరు ఇంట్లో పడేశారు. అప్పటికే ఆ ఇంటి వసారాలో పది పదిహేను మంది నా ఈడు పిల్లలు అమ్మ, ఆవు, ఇల్లూ, ఈగా అంటూ నానా యాగీ చేస్తున్నారు. వాళ్ళంతా నిజానికి నా ఈడు పిల్లలు కాదనీ, నేను వాళ్ళ కంటే పెద్దవాడినని, వాళ్ళు వొకటో క్లాసో, రెండో వెలగబెడ్తున్నారనీ నాకు తరవాత అర్థమయ్యింది.

శుభలక్శ్మి టీచరు నన్ను ఎగదిగా చూసి, "చూడడానికి టమాటా పండులా వున్నావ్! ఎందుకు రాదు, తెలుగు నీకు చక్కా వస్తుంది లే!" అనేసింది ఇంకేం ఆలోచించకుండా! "వీడి సంగతి నేను చూసుకుంటాలే సారూ!" అని అమ్మా నాన్నని పంపించేసింది శుభలక్ష్మి టీచరు. అంతే, నేను "ఆ అంటే అమ్మ" అని దిద్దుతూ వుంటే, నా కంటే వయసులోనూ, సైజులోనూ అన్ని విధాలా చిన్న వాళ్లయిన అరుణా, అజయ్, నాగి, అహ్మదూ, ప్రసాదూ, పద్మా కిస్సుక్కు కిస్సుక్కున నవ్వుకోవడం నాకు వినిపిస్తూనే వుంది.

కాసేపు శుభలక్ష్మి టీచరు వాళ్ళని గమనించి, వాళ్ళ పలకలు లాక్కుని 'అలీఫ్ బే తే" అని మూడక్షరాలు రాసి దిద్దమంది. (టీచరుకు ఆ మూడక్షరాలే వచ్చని నాకు తరవాత తెలిసిన సీక్రెటు!) అంతే, ఆ కిస్సుక్కు గాళ్ళంతా తలకిందులయి పోయారు. "ఇప్పుడు నువ్వు రాయరా?" అని నన్ను బోర్డు దగ్గిరకు లాక్కెళ్లింది. ఇదే అదను రచించెదను....అనుకొనేసి, బోర్డు మీద ఎడమ వైపు నించి సర్రున నాలుగు వాక్యాలు ఉర్దూలో రాసే సరికి, కిస్సుక్కు గాళ్ల మైండు బ్లాకయి, బ్లాంకయి పోయింది. కాకపోతే, వొక సమస్య ఏమిటంటే, వొక వారం రోజుల పాటు నేను తెలుగు అక్షరాలు కూడా ఎడమ వైపు నించే రాసే వాణ్ని. కుడివైపుకి రావడానికి నానా యాతనా పడాల్సి వచ్చింది.

ఈ పూట నా మూడు మొహాల చదువుని తలుచుకుంటూ వుంటే, ఆ శుభలక్ష్మి పంతులమ్మే గుర్తొస్తోంది.

"నేను కుడివైపుకి అలవాటు పడి, తెలుగు రాయగలను" అన్న ఆత్మవిశ్వాసం నాలో వెలిగించిన శుభలక్ష్మి పంతులమ్మగారిని ఈ పూట తలచుకోకపోతే, అది నన్ను నేనే మరచిపోవడం!

ఆ పంతులమ్మ గారు ఎక్కడున్నారో నాకు తెలియదు! కానీ, ఇప్పటికీ గుండ్రంగా అందంగా వొక తెలుగక్షరం రాసినప్పుడల్లా, పోనీ టైపు కొట్టినప్పుడల్లా, ఆ అక్షరాల అందంలోంచి ఆమె అందమయిన చిరునవ్వే కనిపిస్తుంది.


అప్పుడు ఆ కిసుక్కు గ్రూపు మీద నాకు ఎంత కసి పుట్టిందంటే, ఆరోతరగతికి వచ్చే సరికి నేను మా శుభలక్ష్మిపంతులమ్మ గారికి వొక కథ రాసేసి - అవును తెలుగులోనే- చూపించాను. ఆ రోజు ఆమె కళ్ళలోని మెరుపు ఇప్పటికీ నాకు కనిపిస్తూనే వుంది.

అమ్మయ్య, నా మొదటి తెలుగు గండం గట్టెక్కింది!

ఆ తరవాత నా రెండో తెలుగు పర్వం మొదలయ్యింది ఖమ్మంలో జ్యోతి బాల మందిర్ లో!

ఆ విషయం తరవాత మాట్లాడతాను!

(ఇవాళ టీచర్స్ డే సందర్భంగా...)
Category: 10 comments
Web Statistics