అఫ్సర్ కవితాసంపుటి ‘యుద్ధం మధ్యలో నువ్వు’
అత్యాధునిక కాలచక్రాన్ని కాళ్లకు తగిలించుకొని మనిషి పరుగులు తీస్తూనే ఉన్నాడు. పొద్దున్నే లేచి కార్పొరేట్ బ్లేజర్‌ను భుజాలకు అతికించుకొని అద్దాల మేడల్లోకి బట్వాడా అవుతూనే ఉన్నాడు. ప్యాకేజీల వేలంపాటల వెంట నీడలా పాక్కుంటూ నిలబడి ఆకాశాన్ని అందుకోటానికి కసరత్తు చేస్తూనే ఉన్నాడు.
అదొక నిరంతర పోరాటం. అనుదిన ఆరాటం. అనివార్య యుద్ధం. ఆ యుద్ధం మధ్యలో మనిషి మహదానందంగా ఇరుక్కుపోయి, ఊపిరాడనితనాన్ని వేడుకగా మార్చుకుంటున్నాడు. ఈ వర్తమాన జీవన విషాదాన్ని కనిపెట్టడం అంత తేలిగ్గాదు. అనుభవజ్ఞుడైన కవి మాత్రమే ఆ పని చెయ్యగలడు.
ప్రముఖ కవి, రచయిత, సంపాదకులు అఫ్సర్ చేశారు.
తనను తాను పుటం పెట్టుకొని, మానవావతారాన్ని ఆక్రమిస్తున్న అవాంఛనీయ ఆచ్ఛాదనలను ఏ రోజుకారోజు అక్షరాల మధ్య బంధించారు. కనిపెట్టడమూ కవిత కట్టడమూ దినచర్యగా మార్చుకున్నారు. ‘ఇవాళ’ ఏం జరుగుతోందో 1991లోనే లోకానికి చాటింపు వేసిన దార్శనిక కవి అఫ్సర్. నాలుగున్నర దశాబ్దాల కాలంలో ఆయన చూపు మరింత విశాలమైంది. ఊహ పదునెక్కింది. కంఠం కరకుదేలింది. ఆ అనుభవం ఆలంబనగా గత నాలుగైదేళ్లలో రాసిన కవిత్వం ‘‘యుద్ధం మధ్యలో నువ్వు’’.
అంతకుముందు కవిగా అఫ్సర్ గొంతులో పలకని వినూత్న శబ్దగాంభీర్యమేదో ఈ కవితల్లో వినిపిస్తుంది. ఫార్మాట్ ఏదో చెదిరిపోయినట్లు కనిపించినా, ప్రక్రియలోని పదును రాటుదేలి దర్శనమిస్తుంది. పైగా, తనను తాను మరిన్ని పొరలుగా విప్పుకొంటూ, లోలోపలి నిర్మాణవిధ్వంసాల రహస్యాలను బట్టబయలు చేసిన విద్య అబ్బురపరుస్తుంది.
కాలాన్ని సముదాయించి, జోకొట్టి, దాన్ని నిద్ర పుచ్చటానికి తాను పడిన గుంజాటన నిజానికి ప్రతి ఒక్కరిదీ. కాబట్టే చదివే ప్రతి ఒక్కరూ ఆ యుద్ధం మధ్యలో అనివార్యంగా చిక్కుకుంటారు. అడుగడుగునా భుజాలు తడుముకుంటూ, ‘రంగ’వైకల్యాన్ని తల్చుకుంటూ అన్యమనస్కంగానే ఆసాంతం ముందుకు సాగుతారు. నిరపరాధాన్ని నిరూపించుకోవాలన్న కాంక్ష పేజీలవెంట పరుగులు తీయలేక చతికిల పడుతుంది.
అఫ్సర్ రాసిన మొత్తం 73 కవితల పవర్ ప్యాక్డ్ పొయిట్రీ ‘‘యుద్ధం మధ్యలో నువ్వు’’. ‘కత్తి అంచు మీద నిలబడి’ కొన్ని పద్యాలు, ‘ఆరుకాలాలూ మాయమైన చోట’ మరికొన్ని ఖండికలు, ‘పంజరాల్ని వోడించినప్పుడు’ ఇంకొన్ని కవితలు. మూడు విభాగాలుగా సంపుటిలో కొలువుదీరాయి. విభజన శీర్షికలతోనే ఈ సంపుటి తాలూకు వైవిధ్యాన్ని ప్రకటించారు.
మత్తులో తూగుతున్నట్లుగా సాగిపోతున్న మానవ జీవనమోహనంపై ఠపీమని ఓ మొట్టికాయ వేసింది కోవిడ్. అప్రత్యక్షంగా మనిషిని కమ్మేసి, కరోనా నామధేయంతో జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. మనిషికీ మనిషికీ మధ్య అగాథాలు తవ్వేసింది. నోరు కట్టేసింది. ముక్కు మూసేసింది. చేతులు నరికేసింది. ఇళ్లను జైళ్లుగా మార్చేసింది. సంకెళ్లతో పనిలేకుండానే కాళ్లను బంధించేసింది. ‘‘యిప్పటిదాకా నువ్వు వెలివేసినవన్నీ/ తొలిచేసే ఋతువిది’’.
ఒక రకంగా మనిషికి మంచే జరిగింది. అదో భారీ కుదుపు. మనిషి ఊహించని మలుపు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆక్సిజన్ కోసం ఆస్పత్రులకు పరుగులు తీశాడు. ‘గాలి బరు’వెంతో జ్ఞానోదయమైన ఆ క్షణాన తనను తాను తవ్వుకోవటం మొదలు పెట్టాడు. పొరలు విప్పుకోవటం ప్రారంభించాడు. అదో భేరీలు మోగని యుద్ధం. ఆ యుద్ధం మధ్య అఫ్సర్ కూడా చిక్కుబడిపోయాడు. ఆ సంక్షోభాన్ని ఒళ్లంతా కళ్లు చేసుకుని చూశాడు. మనసంతా చేదు నింపుకొని అనుభవించాడు.
ఆ అనుభవాలను రికార్డు చేయటం మొదలు పెట్టాడు. దినచర్యనే కవిత్వంతో అంటుగట్టాడు. అట్లా పెరిగి పెద్దయిన మొక్కలన్నిటినీ ఈ సంపుటి నిండా అలంకరించాడు.
‘‘మరణం రాసుకునే అనుక్షణిక డైరీ/ యిప్పుడు నీ నా బతుకు’’ అని ప్రకటించారు.
‘‘భయం ఎక్కడో పుట్టేది కాదు. పుట్టినప్పటినుంచీ నువ్వూ నేనూ ప్రియంగా పెంచుకుంటున్న విషప్పురుగు అది. డైనోసార్ కంటే పురాతనం. ఆదిమత్వం కంటే సనాతనం యీ భయం.’’
దయ, జాలి, కరుణ, ప్రేమ, సానుభూతి, సహానుభూతి… ఇవన్నీ లివింగ్ రూముని అలంకరించే విగ్రహాలుగా మారిన కాలమిది. ప్రేమించటం కష్టమో, ద్వేషించటం కష్టమో లెక్కలు తేల్చుకునే కాలం కాదిది. నూతిలోని చీకట్లో దేన్ని కావలించుకోవాలో తెలియని సందిగ్ధ సమయమిది.
కొన్ని అనుక్షణికాలు భళ్లున బద్దలై నిద్రని గాయపరిచే కలల్లా వెంటాడుతుంటాయి. నిద్ర నటించక తప్పని రాత్రుల్లో యుద్ధాలు సిద్ధమవుతుంటాయి.
మనిషికి అత్యంత సౌఖ్యాన్నందించే సాధనం: నిద్ర. అది సాఫీగా సాగితే స్వర్గం. కలతలు మిళితమైతే నరకం. భూమ్మీద ఉచితంగా లభించే ఆ స్వర్గానికి నిచ్చెనలు వేసే అవకాశం లేని దురదృష్టవంతుల దీనగాథల్ని ఈ కవి శ్రుతిలయలకు అతీతంగా గానం చేస్తాడు.
‘‘యింకోసారి చాలని దుప్పటి పైకి లాక్కుని ఆమె సూర్యుణ్ణించి ముఖాన్ని దాచేసుకుంది. సూర్యుడి నీడకీ, దుప్పటి చిరుగుకీ మధ్య ఆమె ముఖాన్ని ఇంకోసారి చూసినప్పుడు ఆ కళ్ల మీద ప్రపంచం పట్టనంత అలసట’’ (కాసిని హోంలెస్ పద్యాలు).
పద్యం ఇట్లాగే మొదలవ్వాలన్న నిబంధనను ఇష్టపూర్వకంగా అతిక్రమించటంలో అఫ్సర్ సిద్ధహస్తుడు. లోలోపల సుడులు తిరిగే ఒక భావధార ఎట్లా ఉబికివస్తే అట్లా ఆ వాక్యపు చిటికెన వేలు పుచ్చుకొని పిల్లాడిలా హాయిగా నడక ప్రారంభిస్తాడు. మనం కూడా ఆ హాయితనంలో బుడుంగున మునిగిపోయి, కవిత పొడవునా పరుగులు తీస్తాం.
‘‘చిట్టచివ్వరి నిద్ర శకలాన్ని పట్టుకునే వూగిసలాటే కావచ్చు. తెగిపోయే ఆఖరాఖరి ముడిని కాస్త సుతారంగా పొదివిపట్టుకునే తాపత్రయమే కావచ్చు’’ (ఆ నిద్దురలో మిగిలినవి కొన్ని).
కవితంటే, పొట్టి పొట్టి వాక్యాలు పేజీల్లో నిలువునా సాగాలన్న అలవాటును కూడా ధిక్కరిస్తాడు. ఆగటమూ అడ్డుకోవటమూ ఇష్టం లేనట్లుగా ప్రేరణాత్మక పేరాలను సృజించి, వాటికి మళ్లీ పొదుపైన వాక్యాలను అంటుగట్టి సరికొత్త సౌందర్యంలోకి మనల్ని ప్రవేశపెడతాడు.
ఇంతకీ అఫ్సర్ పద్యం ఏం చేస్తుంది!
నీ లోపలి గాయాలను మాన్పుతుందా? నిద్రిత మైదానాల్ని తట్టి లేపుతుందా? యుద్ధాల మధ్య శాంతివనాల్ని మొలిపిస్తుందా? పోనీ, వీటన్నిటి జాడ తెలియజెప్పి, కొత్త బాట నిర్మాణానికి శ్రీకారం చుడుతుందా?
‘‘యిప్పుడే కాదు – యెప్పుడూ యే పద్యమూ నీలోపలి లోయల్ని పూడ్చదు. ఆ లోయ మొదట్నించీ అలాగే వుందని, నువ్వు తలకిందులుగా దాని లోతుల్లోకి అవరోహణ చేస్తూ వున్నావని ప్రతి పద్యం చివరా అర్థమవుతుంది’’ (యుద్ధం మధ్యలో నువ్వు – 1).
నీకు నిలబడి నిద్ర పోయేంత సమయం కూడా ఉండకపోవచ్చు. నీ కాళ్ల కింద పెనుమంటలు విస్తరిస్తూ ఉండొచ్చు. నువ్వు వాక్యం కాలేకపోవడానికి వంద కారణాలుండొచ్చు.
మరి ఈ మంటలు చల్లారేదెట్లా? లోయలు చదునయ్యేదెట్లా?
స్వర్గనరక భయాభయాలనుంచి బయటపడేదెట్లా?
ఎదగాలి. చెట్టులా ఎదగాలి. ఎదగాలంటే కలలు కనాలి. కలలు కనాలంటే నీలోని చీకటి క్షణాలను మట్టుబెట్టాలి. లేకుంటే ‘గుంపుల మధ్య తెగిపోయిన ఆకులా వణికే నువ్వు చెట్టంత కల కనలేవు’.
అఫ్సర్ కవిత్వం ‘తడిగా ఆమె చెయ్యిలా తాకుతుంది. వెచ్చగా అతని నవ్వులా తడిమేస్తుంది. అతనామెలా నిలేస్తుంది’. జీవితాన్ని అడ్డంగానో నిలువుగానో కొలిచే సాధనాలుండవు. జీవితాన్ని కిందికీ మీదికీ వరదలెత్తే సంకేతాలుండవు. ‘యిప్పుడీ క్షణపు ముక్కలో కనిపించే ఆకాశమే నీది’.
మనమంటే ఇసుక లోపలి దూదుంపుల్లలమైన చోట, అప్పటిదాకా గడ్డ కట్టిన చీకటిఖండాలమైన చోట, అఫ్సర్ కవిత్వం ‘అడివిని చుట్టుకు తిరిగే హోరుగాలి’లా మనల్ని చుట్టుముడుతుంది. మనలో గుట్టలా పేరుకుపోయిన నిస్పృహకు కళాత్మకంగా నిప్పు పెడుతుంది. మన ‘లోపలి వీధులన్నీ వొక్కసారిగా కాంతిద్వీపా’లవుతాయి. అప్పుడు మనలో ఉద్భవించే శక్తి అపారం.
మనిషికి ప్రకృతే పెద్ద గురువు. చెట్టూ పుట్టా కొండా కోనా నీరూ నిప్పూ గాలీ వానా… సృష్టిలోని ప్రతి వనరూ పాఠ్యాంశాల సమాహారమే. కవి తిరుచ్చిలోని అతి ఎత్తయిన కొండ దాదాపహాడ్ ఎక్కినప్పటి అనుభవాన్ని అక్షరాల మెట్లతో అలంకరించాడు.
ఏ కవితలో మునకలేసినా ఇట్లాంటి అద్భుతమైన పదచిత్రాలు మన కళ్లను నిర్మాల్యం చేస్తాయి. అవన్నీ అఫ్సర్ కవితాసృజనకు కమనీయ నిదర్శనాలు.
ఇలాంటివే రుచికరమైన మరికొన్ని చిరు ఖండికలు:
‘‘నువ్వేమీ పల్లె కడుపులో పుట్టక్కర్లేదు
బియ్యం నేల కింద పుడుతుందో
చెట్టు సిగన మెరుస్తుందో కూడా తెలియక్కర్లేదు
నువ్వు తినే మెతుకులో
యిప్పుడు నీ అహంకారం మూలుగులు వినిపించే తీరాలి’’ (నువ్వు తినే మెతుకు మెతుకులో).
బడుగుజీవి అట్టడుగునే మిగిలిపోతున్న బట్టల్లేని నిజానికి మూడు వేల ఏళ్ల చరిత్ర సాక్షీభూతం. శతాబ్దాలుగా రాలుతున్న నుసిని కాలగర్భంలో కలిపేస్తున్న కాంక్షాసర్పం. ఆ బక్కజీవికి కవి భరోసా ఇస్తాడు. అతని తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడతాడు. అతన్ని పీల్చి పిప్పి చేస్తున్న చట్టబద్ధమైన ఘోరాల గురించి దండోరా వేస్తాడు. నిజం బహిరంగ జీవచ్ఛవంగా ఊరేగుతున్న నగ్న వాస్తవాల్ని నిలువెల్లా ప్రదర్శనకు పెడతాడు.
‘‘రాజ్యాలు యెన్ని చూశావో అన్ని మరణ శాసనాలూ నువ్వు చూసే వుంటావ్. చరిత్రని చేతివేళ్ల నరాల్లో బిగబట్టుకున్న వాడివి కదా. వుద్వేగాలు చచ్చిపోయిన మొండిమాను కాలంలో కూడా నువ్వు నెత్తుటి చుక్కని చూసి, మూర్ఛపోతూనే వుంటావ్.’’
ఆదివాసీల ఆర్తనాదాలు గూడేల మధ్యనే ప్రతిధ్వనించి, ప్రకృతిలో లీనమైపోతున్న విషాదవీచికలు అఫ్సర్ కవితల్లో చాలాచోట్ల గుప్పున వీస్తాయి.
అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ గొంతుపై తెల్లపోలీసు కాలేసి తొక్కి చంపిన ఘటనపై చాలా కవితలు వచ్చాయి. కానీ అఫ్సర్ చూపు వేరు. అతని తల్లినీ, అతని పిల్లల తల్లినీ తలచుకుంటూ ఆ దుఃఖాన్ని అక్షరాలనిండా ప్రవాహం కట్టించాడు. ఫ్లాయిడ్ తల్లి దగ్గర మొదలై, తన బాల్యపు రోజుల్లోంచి ప్రయాణిస్తూ ఒక అద్భుత వేదిక నిర్మించి, అక్కడి ఆ దురాగతం తాలూకు నిర్వర్ణాలను లోకానికి చూపించాడు.
సుదీర్ఘ కవిత్వ ప్రస్థానంలో అఫ్సర్ తనకంటూ ఒక భాషను రూపొందించుకున్నారు. ఒక నిర్లయాత్మక శైలిని బలంగా తయారు చేసుకున్నారు. వ్యక్తీకరణలో లోతుల్ని సాధించటానికి సహజ సంభాషణల సుగంధాన్ని వాడుకున్నారు. ఈ కృషిలో భాగంగానే ప్రయోగాల బాటలోనూ ప్రయాణించారు. ‘అవయవ వ్యూహం, శబ్దవస్త్రాలు, అక్వేరియమ్ శ్మశానం, భ్రమల చేపపిల్లలు, బంధాల గాజుముక్కలు, అనామక పావురం, పంజరాల కానుకలు, కౌగిలి పంజా, పలకరింపుల వాన’ వంటి పదబంధాలు అందులో భాగమే.
ఇంతకీ ఈ కవి ఏం చెబుతాడు?
సుదీర్ఘ సంక్షోభాల సంకెళ్ల నుంచి విముక్తమయ్యాకనైనా నువ్వు నువ్వుగా నికరంగా నిలబడకపోతే రక్తమాంసాల పరమార్థం నిష్ఫలమైనట్లేనంటాడు.
పగళ్లను పండగల్లా మార్చుకోమంటాడు. సాయంత్రాల్ని యెలాగోలా వెలిగించుకోమంటాడు. మల్లెల్ని మనసులో మాలలల్లుకోమంటాడు. గాలి తరగై ప్రవహిస్తూండి పోవాలని, జలపాతమై దూకేస్తూ మంచువానల్లో తడిసిపోవాలని, పసితనపు మాయచర్మాన్ని వదలకూడదని చెబుతాడు.
తనకు తాను గడి బిగించుకొని, లోపల బందీ అయిపోతున్న పరిస్థితిని బద్దలుగొట్టి స్వేచ్ఛా విహంగాల తయారీకి నడుం బిగించమంటాడు.
‘వొకే వొక్క జీవితంరా నీది, దాన్ని గానుగెద్దు చేయద్దురా’ అని మొత్తుకుంటాడు. రహస్యాంగాలు నగర సంచారం చేయాలంటాడు.
వొడ్డుకు కొట్టుకువచ్చిన చేపపిల్ల కళ్లల్లోకొచ్చిన ప్రాణం కొసల్లో తనను తాను చూసుకునే సున్నిత మనస్కుడు అఫ్సర్. ‘పూలని వెలివేసే కాలాల్నీ లోకాల్నీ వూహించలేని’ పరిమళభరిత హృదయుడు అఫ్సర్.
క్లుప్తంగా చెప్పాలంటే, ఈ కవిత్వమంతా అఫ్సర్ తనతో తాను జరిపిన సుదీర్ఘ సంభాషణ. తన స్మృతుల్లో ఇంద్రధనుస్సుల్నీ, భూకంపాల్నీ వెతుక్కున్న ఆనందవిషాద విభ్రమ.
అఫ్సర్ భాషలోనే చెప్పాలంటే: ఆయన ‘పద్యాలన్నీ వొట్టి వాక్యాల పోగులు కావు’. విలువైన స్వర్ణసుమాలు. ఆ కవితాసుమాల పరిమళపు ఔన్నత్యాన్ని ఒక్క పేజీలో ఆవిష్కరించారు వరవరరావు, శ్వేత యర్రం గార్లు. అర్థగాంభీర్యం ఉట్టిపడే ముఖపత్రంతో అజు పబ్లికేషన్స్ ఈ పుస్తకాన్ని అందంగా ముద్రించింది.
తన ఊహను మనం ఊహించని దిక్కుల్లోకి విసిరి, మనల్ని పతంగుల్లా ఎగరేసి, సరికొత్త ఆకాశాల హద్దుల్ని మనకు పరిచయం చేసే అఫ్సర్ కవిత్వాన్ని అంతే సీరియస్‌గా అధ్యయనం చేస్తే, సర్వస్వాన్నీ కోల్పోవటమనేది ఎప్పటికీ ఉండదని అర్థమవుతుంది.
నమ్మకం లేదా? ఇదిగో రుజువు: