డియర్ మేరీ

 


రిగిన కథంతా నిజానికి శ్రీకర్ మాత్రమే చెప్పాలి. యీ మొత్తం కథలో నేను యిప్పటికీ బయటి మనిషినే. 

యింకా చెప్పాలంటే- ప్రాణమే  అనుకున్న స్నేహితుడి దిగులులో వొక కథకుణ్ణి మాత్రమే!  

యిది నా దాకా వచ్చేసరికి కథ అయిపోయిందేమో కానీ, శ్రీకర్ కి  యిదేదో వూహల్లో అల్లుకున్న  లోకం  కాదు.  పట్నం వచ్చినప్పటినుంచీ యిద్దరమూ వొకే  చోట కలిసి చదువుకున్నాం.

సెయింట్ మేరీస్ చర్చి అంటే కాలేజీకి వెళ్ళే దారిలో మా అడ్డా. అతిపురాతనం అనిపించే ఆ చెట్ల కింద యెన్నో కబుర్లూ రేపటి ప్రణాళికలూ చెప్పుకున్నాం. మేం కలిసి ఆడుకున్నచోటు. 

యిక్కడి   ప్రతి చోటూ యిద్దరికీ వొకేరకమైన అనుభవమై వుండాలని అనలేను.  కానీ, ప్రదేశాల మట్టి మా శరీరాల మీద కొంతైనా పడివుండాలి. మా గుండెల్లో దాని పరిమళమే యెంతో కొంత నిండి  వుండాలి. వాటిల్లోంచి మా గుండె చప్పుళ్ళు కొన్నయినా వొకే లయలో వుండి వుండాలి. 

నిజానికి యీ సంగతులన్నీ చెప్పకుండా వుండలేనితనమే నాలోనూ వుంది. అది వాడి మాదిరిగా నాలోపల యెప్పటికీ ఆరని కార్చిచ్చులాంటిది కాదు. వొక అనుభవాన్ని చెప్పడమన్నది -అందులో నిండా మునిగి వున్న వాళ్ళ కంటే, కొంచెం యెడంగా వున్న వాళ్ళకి  తేలిక అనుకుంటా. అలాంటి వెసులుబాటేదో దొరకడం వల్లనే యివన్నీ చెప్తున్నా గానీ,  వాడి అనుభవంలోని తీవ్రత యేదీ నా యీ మాటల్లో రవంత లేకపోవచ్చు.

చాలాసార్లు యే విషయమైనా యెంతో కొంత మాటల్లో చెప్పగలిగితే, జీవితం కాసింత తెరపినిస్తుందేమో!  అది శ్రీకర్ విషయంలో నాకు గట్టిగా రుజువైంది. ఆ మాటకొస్తే, వాడు మేరీ అంటే తనకున్న ప్రేమని యెప్పుడైనా ఆమెతో చెప్పాడా లేదా అన్నది నాకు యెప్పటికీ అనుమానమే.

చివరికి అర్థమైందేమిటంటే - యెంత జిగిరీ దోస్తులైనా యెవరి కథ వాళ్ళదే. యెవరి జీవితం వాళ్ళదే. యెంత దగ్గిరగా వెళ్ళినా, వాళ్ళ కథలోకి చొరబడి, మనమేమీ చేయలేం. కనీసం వాళ్ళ కొద్దిపాటి దుఃఖాన్ని కూడా సొంతం చేసుకోలేం. అదీ ఐరనీ! అందుకే, యీ అనుభవాల తలపోతలో కూడా నా భాగమేమీ లేదు. యెటు విన్నా వాడి గొంతుకే వినిపిస్తుంది, వాడే కథ చెప్పినా చెప్పకపోయినా.

***

దివారం పొద్దున్న శ్రీకర్  కాళ్లకి తెలీదు, అవి ఎందుకు చర్చి వైపు పరిగెడతాయో! అప్పుడప్పుడూ అనుకుంటాడు- చర్చి ముందు తెలుసా, మేరీ ముందు తెలుసా?! అని.  సమాధానం కష్టమే. చిన్నప్పటి మేరీ అతన్ని  చర్చికి వెళ్ళమనీ  చెప్పలేదు. చర్చివాళ్లెవరో  యింటికొచ్చి రారమ్మనీ అడగలేదు.

 ఆ చర్చి చుట్టూ తిరిగే బదులు వెళ్ళేదేదో గుడికెళ్లి, వొక దండం పెట్టుకు రా! కాస్త పుణ్యమైనా దక్కుతుందేమో!” అని యిప్పటికీ తల్లి  గొంతు పెద్దగానే వినిపిస్తుంది. అతని పుణ్యాల కోటా తగ్గిపోతూ పోతూ వుందని ఆమె  హెచ్చరిక అన్న మాట.

అయితే మేరీ, కాకపోతే వొకటీ అరా స్నేహితులు తప్ప యెవరూ  లేని అతని చిన్ని ప్రపంచంలో చర్చి వొక్కటే ఆత్మీయంగా పలకరించే చోటు. అలాంటిదే మరో చోటు వాళ్ళింటి డాబా-

అతనికి మాత్రమే కనిపించే లోకంలో కాలేజీ  రోజుల నుంచీ యీ  డాబా యేమీ మారలేదు. అట్లా అని అదేమీ పెద్ద డాబా కాదు. కింద వున్న రెండు  గదుల ఇంటిని కాపాడే గొడుగు అంతే. డాబా వెనక వేపచెట్టు యీ  డాబా మీదికి కూడా నీడలు చాస్తుంది. వేపచెట్టు కింద పడుకోవద్దని అమ్మ వందసార్లు మందలించి వుంటుంది. అయినా, మెత్తని గాలి అలల వ్యామోహంలో ఆ నీడని వదిలివెళ్ళడం నచ్చదు.  అందుకే, పనిమాలా తెచ్చుకున్న చింకి చాపనీ, చిన్ని దుప్పటినీ, దిండుని ఆ చెట్టు గాలి ముమ్మరంగా ప్రసరించే చోటుకి లాక్కొని మరీ పడుకుంటాడు. అట్లా పడుకొని ఆకాశంపైన నెమ్మదిగా తెరచుకునే నక్షత్రాల దారుల్ని వెతుక్కుంటూ వుంటాడు.  

 యింటి ముందు కూడా  యింకో అపరిచితమైన చెట్టుంది. దాని పేరు అమ్మానాన్నలకూ  తెలియదు. యింకాస్త పెద్ద వాళ్ళని అడిగినా తెలీలేదు. చివరికి మేరీకి కూడా తెలీదు. అదీ అతని ఆశ్చర్యం. మేరీకి తెలియని చెట్టూ, మొక్కా, పువ్వూ లేదని అతని మూఢ నమ్మకం,  మేరీ పట్ల వున్న అనేక నమ్మకాల మాదిరిగానే- యెంతకీ తెలియని మనుషులున్నట్టే, మనసులో యెంతకీ తెరచుకోని తలుపులూ వున్నట్టే- ప్రకృతిలో కూడా అట్లా అపరిచితమైనవి యెన్నున్నాయో! అలాంటి యెన్ని పరిచిత, అపరిచిత లోకాల్ని చూశాడో మేరీ సమక్షంలో శ్రీకర్!

 మేరీ తన  కంటే ఏడాది చిన్నదో, పెద్దదో యెప్పుడూ పట్టించుకోలేదు. కానీ, కాలేజీలో ఏడాది సీనియర్ కాబట్టి పెద్దదే కావచ్చు. కాకపోవచ్చు కూడా. కలిసి వచ్చిన దూరాలూ, నడిచివచ్చిన దారులూ చెట్టాపట్టాల్ వేసుకున్నట్టే వుంటాయి. కాబట్టి, యెప్పుడూ వయసు పెద్ద అడ్డంకి కాలేదు, వొక రోజు వాళ్ళమ్మ  మేరీ వయసు గురించి తండ్రితో గొడవ పడేదాకా.

 

సలు వయసు కంటే పెద్ద సమస్యలు వేరే వున్నాయ్. అవి కూడా మీరు పట్టించుకోవడం లేదు,” అని వొక రోజు తల్లి గట్టిగా తగవుకి దిగింది తండ్రితో- సాయంత్రం కాబట్టి వాళ్ళు  వెనక వున్న మెట్ల దగ్గిర  కూర్చొని మాట్లాడుకుంటున్నారు. డాబా మీద వున్న అతనికి ఆ మాటలు వినిపిస్తున్నాయో లేదో అన్న స్పృహ వాళ్ళకి లేదు.

“వేరే వాళ్ళని యింట్లోకి కూడా రానివ్వం మనం! అట్లాంటిది, ఆ అమ్మాయి చీటికిమాటికి రావడం  అసలు భరించ లేను. అన్నీశుభ్రం చేసుకోలేక చస్తున్నా,” అంటున్నప్పుడు తల్లి గొంతు సహజంగానే పెద్దదయింది. శ్రీకర్ నెమ్మదిగా జంధ్యం కూడా తీసేస్తాడనీ, విధిగా చేసే అనుదిన అభిషేకమూ మానేస్తాడనీ, శనివారాలు గుడి చాయల్లోకి కూడా వెళ్లడనీ అప్పటికి ఆ తల్లి వూహకి అందలేదు. వయసు వేడి తగ్గితే అన్నీ పోతాయని సర్దుకుపోయిందేమో తెలీదు. కానీ, అతని  ప్రవర్తన ప్రభావం చెల్లి చదువు మీద పడింది. కాన్వెంటు బడికి పంపితే చదువుల కంటే సంధ్యలే యెక్కువైపోతాయన్న భయంతో చెల్లిని యింట్లో కూర్చోబెట్టి చదివిస్తున్నారు యిద్దరూ. “నాకు ఫ్రెండ్స్ యెవరూ లేరు,” అని మొత్తుకున్నా.

 

యీ  డాబా లేకపోతే అతని ప్రపంచం మరీ ఇరుగ్గా వుండేది. అట్లాగే, మేరీ లేకపోతే అసలు ఆ చిన్న ప్రపంచం కూడా వుండేది కాదేమో. అతను పుట్టి పెరిగిన చిన్న వూళ్ళో రైల్వే స్టేషన్ తప్ప పెద్ద ఆకర్షణ యింకేమీ లేదు. అట్లాంటిది, అయిదో క్లాసు మొదట్లో వొకమ్మాయి చాలా అమాయకంగా క్లాసులోకి అడుగుపెట్టింది. కానీ, ఆ అమాయకత్వం వొట్టొట్టిదే అని వారంలోనే అందరికీ అర్థమైపోయింది. అప్పుడు ఇంగ్లీషు క్లాసు అంటేనే హడలిచచ్చిపోయే అతనికి మేరీ అంటే ప్రాణమే అయిపోయింది. ఇంగ్లీషులో రెండు వాక్యాలు హాయిగా మాట్లాడేసే యెవరికైనా ప్రాణాలన్నీ యిచ్చేసే దశలోనే వున్నాడు మరి.

 మేరీ రెండు వాక్యాలేం ఖర్మ. టక్కున నిలబడి వొక  కథే చెప్పేసింది. ఆ కథ కూడా యెలాంటి కథ?! “గివింగ్ ట్రీ” అంట. అంటే కల్పవృక్షమే కదా!  ఆ కథలో - He would climb up her trunk and swing from her branches and eat apples- దగ్గిర అతని గుండె చిక్కుకుంది. ఈ యాపిల్ యేమిటో అతనికి అప్పట్లో తెలీదు. ఆ పల్లెటూరి గబ్బిలాయి లోకంలో  రేగ్గాయలు, జామకాయలే యెక్కువ. గుడికెళ్తే, యెప్పుడైనా ఓ అరటిపండు దొరికితే మహాప్రసాదమే!

ఆ సాయంత్రం  వాళ్ళ రైల్వే క్వార్టర్స్ కి తీసుకెళ్లి, వొక యాపిల్ పండు కోసి, అతనికిచ్చింది.  అట్లా చేసే ముందు వాళ్ళ అమ్మని గానీ, నాన్ననిగానీ వొక్క ముక్క అడగలేదు. నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గిరకి వెళ్ళిపోయి, వొక పండు తీసుకొని, కోయడం మొదలెట్టేసింది. అట్లాంటి సరికొత్త స్వేచ్చ అతనికి వూపిరాడనివ్వలేదు. మరీ చిన్నప్పటి విషయాల్లోని యీ చిన్న చిన్న వివరాలు కూడా అతని మనసులో చాలా కచ్చితంగా రికార్డయి వున్నాయి.

కల్పవృక్షమూ, యాపిల్ పండు మొదలు మాత్రమే. యింగ్లీషు, చర్చి, క్రిస్మస్, బైబిల్—అతని జీవితంలోకి తాజాగా ప్రవేశించాయి.  కానీ, ఆ ముచ్చట మూడేళ్లతో ఆగిపోయింది. వొక ఎండాకాలం చివర తండ్రి రెవెన్యూ వుద్యోగంలో బదిలీ వచ్చి, అందరూ పట్నం చేరారు. అతని ప్రపంచం కుదేలైపోయింది. వూరు మార్పుకి బలమైన కారణం అతని చదువు బాగుపడుతుందని తల్లిదండ్రుల ఆశ. ఆ ఆశ యెంతోకాలం నిలబడలేదు. యెందుకంటే ఇంటర్ చదువుల కోసమో, బదిలీ మీదనో మేరీ కుటుంబం కూడా పట్నం వచ్చేసింది.

 

ర్చ్ రోడ్డులో తప్ప ఇల్లు దొరకలేదా రా నీకు! ముందే చెప్తే, మన వీధిలో చూసి పెట్టేవాళ్లం కదా! యేదీ పద్ధతి ప్రకారం చెయ్యవు.  పిల్లలకు మన యిరుగూ పొరుగూ చాలా ముఖ్యం- మరీ యీ  కాలంలో! అన్నాడు తండ్రి స్నేహితుడు నరేంద్ర మామయ్య మొదటి రోజే. వాళ్ళతో రెండు వైపులా చుట్టరికం. కానీ, యెందుకో తండ్రి అతనికి కొంత దూరంగా మసలుకుంటాడు.

“యిది చవకగా దొరికిందిరా! నెమ్మదిగా మారుతాం లే! అయినా చర్చికి వెళ్ళే రోడ్డు తప్ప చర్చి వీధి కాదుగా!” అని తండ్రి  అన్నాడు  గానీ, ఆ నెమ్మది అనేది యేళ్ల తరబడి అయిపోయింది. ఆ వీధి పేరే సెయింట్ మేరీస్ రోడ్డు. వీధి చౌరస్తాలో పెద్ద చర్చి. వేరే వేరే వాళ్ళున్నా గానీ యెక్కువగా అక్కడ కిరస్తానీలే.

“యిల్లు ఇక్కడ కాబట్టి కాస్త పెద్దది దొరికిందిలే ,” అని తండ్రి వొకటికి పదిసార్లు చెప్పడంతో తల్లి కూడా నెమ్మదించింది. కాకపోతే, వీధి వీధంతా నీచు వాసన అని ముక్కు మూసుకుంటూ తిరగడం మాత్రం మానెయ్యలేదు. తన పూజగది తనకి వుంది కదా అన్న ప్రశాంతత కూడా ఆమెకి వచ్చేసింది. అప్పుడప్పుడూ మేరీ వచ్చి, వెళ్లడమే ఆమెకి నచ్చలేదు. పైకి యేమీ అనలేకపోయింది,  ఆ ముందు చిన్న వసారాలోనే ఆ అమ్మాయిని కూర్చోబెట్టి, వెంటవెంటనే  పంపించేందుకు శ్రమపడ్డం తప్ప. అది అర్థం కావడానికి మేరీకి యెక్కువ సమయమేమీ పట్టలేదు. తిన్నగా డాబా మీదికొచ్చి, అక్కడే కాసేపు మాట్లాడి, వెళ్లిపోవడం మేలు అనుకుంది. అదీ వారానికోసారి!

 

“వొరే, వూళ్ళో చాలా జరుగుతున్నాయ్. నువ్వు గమనిస్తున్నావో లేదో!” అన్నాడు నరేంద్ర  మామయ్య.  వొక రోజు తండ్రి తో మాట్లాడడానికి వచ్చి,  చర్చి సంఘటనలన్నీ ఆయన పూసగుచ్చినట్టు చెప్తున్నాడు.

ఆ రోజు ఆయనతోపాటు వాళ్ళబ్బాయి కిరణ్  కూడా వచ్చాడు. కాలేజీలో యిద్దరూ వొకే క్లాసు. రోజూ వొకళ్ళ మొహాలు వొకళ్లు చూసుకుంటారు  గాని, మాటల్లేవు. “ఆ మేరీతో యేంట్రా కబుర్లు?” అన్న వాక్యంతో మొదలైన గొడవ వాళ్ళిద్దరి మధ్యా పెద్ద గోడ.  అలాంటిది ఆ రోజు యిద్దరూ కలిసి రావడం ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ళిద్దరి మాటల సారాంశం విన్నాక అదేమీ ఆశ్చర్యంగా మిగల్లేదు.

“యిప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. లేకపోతే, మన వీధుల నిండా ఆ చర్చ్ లూ, ఆ మసీదులే వుంటాయి!” అని ఆ రోజు కిరణ్ అన్న మాట మరచిపోలేదు శ్రీకర్ . అవకాశం వచ్చినప్పుడల్లా అదే వాక్యాన్ని మేరీకి అనేక రకాలుగా అన్వయిస్తూ హెచ్చరికలు పంపిస్తూనే వున్నాడు కిరణ్.

యిది జరిగిన వారం రోజులకే- సెయింట్ మేరీ చర్చి మీద దాడి జరిగింది. వొక ఆదివారం తెల్లారేసరికి చర్చి ముందు భాగం అంతా కుప్పకూలింది. అప్పటినించీ శ్రీకర్ పగలు వొక కునుకు తీస్తున్నా సరే, రెండు మూడు బుల్డోజర్లు వేగంగా చర్చిలోకి దూసుకువెళ్లడమే కనిపిస్తోంది. నిజానికి మొదట యాభై మంది కూడి, చర్చిని కూలుస్తున్నప్పుడు బుల్డోజర్లు యేవీ లేవు. మామూలు గునపాలతోనే వొక్కో గోడా పగలగొట్టుకుంటూ వెళ్లారని తరవాత నరేంద్ర మామయ్య చెప్పాడు. ఆ తరవాత అదే రోజు సాయంత్రం యేడుగంటల ప్రాంతంలో రెండు వందల మంది జమయ్యేసరికి, అది రాజకీయ రంగు పులుముకుంది. బుల్డోజర్ రంగంలోకి దిగి, చర్చి మెట్లదాకా దూసుకెళ్లింది.

మరునాడు సాయంత్రం మేరీ తండ్రి బెంజమిన్ గారు యింకో నలుగురు స్నేహితులతో మెట్ల మీద మాట్లాడుకుంటూ కూర్చొని వున్నారు. యెటు నుంచి వచ్చిన వొక గుంపు ఆ నలుగురి మీదా దాడి చేసి, కొట్టడం మొదలు పెట్టింది.

ఇది జరిగాక మూడు రోజుల దాకా మేరీ కనిపించలేదు. యెవరింటికైనా వెళ్ళి, కనీసం యెలా వున్నారో చూసే పరిస్థితి కూడా పట్నంలో లేదు.  బెంజమిన్ గారికి ఆ రోజు దాడిలో గాయాలు తగిలాయని, ప్రమాదకరమైన స్థితిలో ఆయన్ని హైదరబాద్ తీసుకువెళ్లారని తెలిసింది.

అప్పటికే అక్కడి క్రైస్తవులెవరూ నలుగురికీ కనిపించేట్టు తిరగడం లేదు. జాన్సన్, విలియం, డేవిడ్, మరియదాసు  లాంటి పేర్లున్న వాళ్ళు పేర్లు పైకి చెప్పుకోడానికి కూడా వణికి పోతున్నారు. దాడి తరవాత యింకేమన్నా జరగవచ్చన్న అనుమానాలు అలముకున్నాయి.

కానీ, అతని   వెతుకులాట మేరీ గురించి- కొన్ని సార్లు బుల్డోజర్ మేరీ మీదికి దూసుకుపోతున్నట్టే కలల్లో కనిపించి, వులిక్కిపడి లేవడం మొదలెట్టాడు. రోడ్డు మీద వెళ్ళే ప్రతి వొక్కరూ మరణాయుధాలతో చర్చి వైపు పరిగెత్తినట్టు అనిపించి, మంచమ్మీంచి దబ్బున నేలమీదికి పడిపోతున్నాడు.

 

దాడి జరిగిన వారం రోజుల తరవాత తెలిసింది- మరునాడు జరిగిన సంఘటనలో గాయపడిన పదిమందిలో ఇద్దరు చనిపోయారని! ఆ ఇద్దరిలో బెంజమిన్ గారున్నారని తెలిసినప్పుడు మేరీ కోసం వాళ్ళ యింటి  వైపు  వెళ్ళాడు శ్రీకర్.

“బెంజమిన్ గారు పోయాక వారానికే వాళ్ళు వెళ్ళిపోయారు. యెక్కడికో నాకూ తెలియదు,” అన్నాడు యింటి  యజమాని. అది అతన్ని మరీ గిల్టీ ఫీలింగ్ లోకి తోసేసింది. దాడి జరిగిన వెంటనే యెందుకు కలవలేదన్న దిగులు కమ్ముకుంటూ వెళ్లింది.

              అసలు దేన్నయినా ధ్వంసం చేయాలనే ఆలోచన యెలా పుడుతుంది?! మరీ ముఖ్యంగా, అది నలుగురు మనుషులు ప్రేమగా కలుసుకునే చోటు అయినప్పుడు , ఆ ప్రదేశం ప్రేమకీ, కరుణకీ సంకేతమైనప్పుడూ అక్కడ అంత విద్వేషం యెందుకు చిమ్ముకుంటున్నాం మనం? యిలా యెన్నో ప్రశ్నలు మేరీ కలిస్తే అడగాలి. కానీ, మేరీని కలవడం యెలా?!

              అదే సమయంలో కొంచెం మనసుని సర్దిపెట్టుకోడానికి బైబిల్ చదువుకోవడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు కొన్ని వాక్యాలు గట్టిగా పైకే చదవడం అలవాటైంది. అందులో వొక శాంతి. కొంత ఉపశమనం.  ఆ వాక్యాలు అతని మనసు చీకటి లోతుల్లోకి కొంత వరకు తీసుకెళ్ళేవి. కానీ, యిలాంటి సందర్భాల్లో మతం అనేది యెంతవరకు సేదతీర్చుతుందో అతని అనుమానాలు అతనికున్నాయి. తన  మనసుకి యేది యిష్టమో, యేది కష్టమో తేల్చుకొని, దానికొక పరిష్కారం వెతకడంలో తానెంత మాత్రమూ  పనికిరాడన్న బాధ అతన్ని  యెప్పటికీ వెంటాడుతూనే వుండిపోయింది. బైబిల్లోని యీ వాక్యం వొక్కటే అతని గది గోడ మీద మిగిలిపోయింది.

యేమైనా చెప్పగలవా రేపటి గురించి- యేం జరుగుతుందో యేమో తెలియని రేపటి గురించి! యింతకీ, యీ నువ్వూ, నీ జీవితం యేమిటి? కాసేపు కనిపించి, మాయమయ్యే పొగమంచు తప్ప! (జేమ్స్ 4.14)”

3

మొదట్లోనే చెప్పాను కదా, యీ మొత్తం కథలోనూ  అనుభవంలోనూ  నేను బయటి మనిషిని మాత్రమే. శ్రీకర్ తో నాకున్న  స్నేహంలోని యిసుమంత కూడా వాణ్ణి సేదతీర్చలేకపోయింది. తలచుకున్నప్పుడల్లా కొన్ని సూదులు గుండెల్లోకి గుచ్చుకున్నట్టు అనిపించిన సందర్భాలు లేకపోలేదు. కానీ, వాడి అనుభవంలో నేనెప్పుడూ పరాయీవాణ్ణి. నేనొట్టి  కథకుడిగా మాత్రమే మిగిలిపోయానని మళ్ళీ మళ్ళీ రుజువవుతూనే వచ్చింది.

కచ్చితంగా పోయిన వారం క్రిస్మస్ రోజు పొద్దున శాంతితో కాఫీ కబుర్లు చెప్తూ, అన్నాను. “వొక సారి వూరెళ్లి రావాలి!”

“యేముంది నీకు ఆ వూళ్ళో?” అంది శాంతి వెంటనే.

నిజమే, అమ్మానాన్న యిద్దరూ పోయాక వూరికి వెళ్లాలనే ఆలోచన కూడా పోయింది. బతికినంత కాలం వాళ్ళు అద్దె యింట్లోనే వున్నారు. కాబట్టి, సొంత వూరు అన్న సెంటిమెంటు కూడా పనిచేయడం లేదు. కానీ, క్రిస్మస్ రోజు- బహుశా మా తీరికలేని బతుకుల్లో సెలవు దొరకడమే కష్టం కాబట్టి- నాకు ఆ ఆలోచన వచ్చి వుంటుంది.

అయిదేళ్లయింది.  మేమిద్దరం హైదరాబాద్ వచ్చేశాం యిద్దరికీ వుద్యోగాలు వొకే కంపెనీలో దొరకడంతో- మా యిద్దరు పిల్లల చదువుకి కూడా హైదరబాద్ బాగుంటుందనుకున్నాం.

యెలాగో వీలు చిక్కించుకొని,   వారం రోజుల తరవాత వెళ్ళాను. కారులో తిన్నగా శ్రీకర్ యింటికే వెళ్ళాను. యిప్పుడు అది యిల్లు కాదు. ఆ పాత యిల్లు కూల్చేసి, వొక అపార్ట్మెంట్ కట్టేశారు బిల్డర్లు. మా అమ్మానాన్న పోయిన ఏడాదే వాడి అమ్మానాన్న కూడా పోయారు. అప్పటికే ఆ యిల్లు బిల్డర్ల చేతుల్లో పడింది. వాడికి  యిల్లు మారడం యిష్టం లేక, అక్కడే సింగల్ బెడ్ రూమ్ తీసుకున్నాడు.

వెళ్ళేసరికి వాడే తలుపు తీశాడు. చూడగానే గట్టిగా కావిలించుకున్నాడు. ఆ కావిలింతలో అయిదేళ్ళ చెమ్మ  నన్ను తాకింది.

కాసేపటి తరవాత వాడి మాటల తీరు మారిపోయింది. వాడి ముఖంలోకి తీక్షణంగా చూడలేకపోయాను గాని, వాడి మాటలు నాలోకి జలపాతంలా దూకుతున్నాయి.

“చూడు యీ  డాబా మీద యిలా కూర్చుంటేనే మేరీ వచ్చేస్తుంది. చాలా సేపు కబుర్లు చెప్పుకుంటాం. ఆ తరవాత మేరీ వెళ్లిపోతుంది. యెక్కడికెళ్లి పోతుందో తెలీదు.”

అది డాబా కాదనీ, నువ్వొక అగ్గిపెట్టెలాంటి అపార్ట్మెంట్ లో వుంటున్నావని చెప్పాలనుకున్నాను.

“ఈ వేపచెట్టు గాలి తాకినప్పుడల్లా మనసులోకి వొక నెమ్మదితనం వచ్చేస్తుంది,” అన్నాడు కాసేపయ్యాక-

అక్కడ యెక్కడా వేపచెట్టు లేదని, వాడి కాంప్లెక్స్ కి ఆనుకునే మరో అపార్ట్మెంట్ వుందనీ చెప్పేయాలనుకున్నాను.

“తెలుసా!? యిప్పటికీ యింటి ముందు యీ పూల చెట్టు పేరు మాత్రం యెవరూ చెప్పనే లేదు!” అన్నాడు ఇంకాసేపటి తరవాత.

యింటిముందు యే చెట్టూ లేదని కూడా చెప్పేదామని గట్టిగా అనిపించింది. వొక్క మాటా అనకుండా, వాణ్ని పైనించి కిందిదాకా చూశాను పరీక్షగా!

మనిషి ఆరోగ్యంగా లేకపోవచ్చు. కానీ, అనారోగ్యం జాడలైతే యెక్కడా లేవు. నేనొచ్చే ముందే చక్కగా స్నానం చేసుకొని, ఇస్త్రీ బట్టలు వేసుకున్నట్టే వున్నాడు. వాడే వంట గదిలోకి వెళ్ళి, టీ చేసుకొచ్చాడు.  నలగని బట్టల్లో దాక్కున్న నలిగిన మనసు మాత్రం నాకు కనిపిస్తూనే వుంది.

యెక్కువేమీ మాట్లాడలేకపోయాను. మాట్లాడడానికి నేనేమిటి అన్న బాధ నన్ను నలిపేస్తోంది. వాడి లోకంలో మేరీ యింకా అలానే వుంది నిలకడగా!

యీ అయిదారేళ్లలో వాడికి నేనేమీ యివ్వలేకపోయాను. అతని లోపలి  గాయాన్ని కనీసం  పైపైన అయినా తాకలేకపోయాను. కాసేపటి తరవాత యిక నేను వెళ్లిపోవాలి. వాడు కింది దాకా వస్తానని చెప్పులు వేసుకోబోయాడు.

“వద్దు, వద్దు!” అని నేనే ఆపేశాను. వీడ్కోలుని తట్టుకునే శక్తి నాలో లేదు.

వాడు యింకోసారి నన్ను ఘాట్టిగా హత్తుకున్నాడు. మెట్లు దిగి గబగబా బయటికొచ్చేశాను. పొగమంచు చుట్టూరా. కారు అద్దాల్లోంచి, కళ్ళద్దాల్లోంచి అంతా మసగ్గా అనిపిస్తోంది.

అది నిజంగా పొగమంచా?! లేకపోతే, నాలోపలిదా?!

తెలియదు.

వాణ్ని మళ్ళీ చూస్తానో లేదో కూడా తెలియదు. నాకు తెలియకుండానే కారు అతివేగంగా దూసుకుపోతోంది, వాడికి దూరంగా-

 *

  

0 comments:

Web Statistics