ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (జులై 6) లో అచ్చయిన కొత్త కథ-
1
మరీ పెద్ద విలాసాలేమీ కోరుకోలేదు సబీనా. అన్నీ చిన్నచిన్న కోరికలే!
సాయంత్రం అయిదు గంటలకు స్కూలు నుంచి వస్తుంది. అప్పటికి అమ్మీ రెడీ చేసి పెట్టిన చాయ్ తాగుతూ అమ్మీతో కాసేపు కూర్చుంటుంది. ఏమీ వుండదు మాట్లాడుకోడానికి! చాలా వరకు నిశ్శబ్దమే. కానీ, కలిసి చాయ్ తాగితే వంద కబుర్లు చెప్పుకున్నట్టే. కాసేపు టీవీ చూస్తారు. ఆ తరవాత భోజనం, సబీనా స్కూలు పిల్లల హోం వర్కులు దిద్దుకుంటూ వుంటుంది. లేదా ఏదో పుస్తకం పట్టుక్కూర్చుంటుంది. ఏం చదువుతుందో కూడా తెలీదు చాలా సార్లు. వాక్యాలు తెగిపోతూ కనిపిస్తాయి, ఏ అర్థాన్నీ చేరుకోకుండా.
అమ్మీ రాత్రి నమాజ్ ముగించుకుంటే ఆ రోజు ఇక ముగిసినట్టే. ఆ తరవాత ఇద్దరూ ఒకే మంచమ్మీద పడుకుంటారు. సబీనాకి ఊరికే నిద్రపట్టదు. రెండు మాత్రలు తప్పనిసరి. అమ్మీకి ఆ వెలితి ఖురాన్ లో ఒక అధ్యాయం చదువుకోవడంతో తీరిపోతుంది. నిద్ర వస్తుందో రాదో తెలియదు గాని, మంచమ్మీదకి వొరిగిపోయి, కళ్ళు మాత్రం మూసుకుంటుంది.
అయిదేళ్లుగా ఇదే. అవే ఉదయాలూ, సాయంత్రాలూ. ఇందులో ఏది తప్పినా బతుకు గాడితప్పిందని ఇట్టే తెలిసిపోతుంది. ఈ సాయంత్రం అదే జరిగింది.
సబీనా ఇంటికొచ్చింది. అమ్మీ ఎదురురాలేదు. తలుపు తోసుకొని, తిన్నగా వంటింట్లోకి వెళ్లింది. అమ్మీ లేదు. పడగ్గదిలోకి వెళ్లింది. అక్కడా లేదు.
నిస్సత్తువగా అనిపించి, ముందు గదిలోకి పరిగెత్తుకువచ్చింది. వున్నట్టుండి సోఫాలో కూలబడిపోయింది సబీనా. ఇంకేవేవో ఆలోచనలు కూడా చుట్టుముట్టి, వుక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు, ధనత్తకి ఫోన్ చేసింది.
పోయినేడాది ఒక శుక్రవారం సాయంత్రం తను స్కూలు నించి వచ్చేటప్పటికి ఇంట్లో ఓ కొత్త మనిషి కనిపించింది. అలా ధనత్త అమ్మీకి కొత్త పరిచయమే. ఇద్దరబ్బాయిలూ అమెరికాలో మంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో వున్నారు. ధనత్తకి కావాల్సినవన్నీ సమకూర్చి ఎప్పుడో ఒకసారి వచ్చివెళ్తుంటారు. ధనత్త కూడా ఒక్కటే కాబట్టి, అమ్మీకి కాస్త కబుర్ల తోడు. అటూ ఇటూగా అమ్మీ వయసే- కానీ, మనిషి ఇంకాస్త చలాకీగా వుంది. కొడుకులు స్థిరపడి, అన్నీ చూసుకుంటున్నారన్న నిశ్చింత ఆమెలో కనిపిస్తుంది.
ఆ మాటకొస్తే, అమ్మీ కూడా తక్కువ చలాకీ ఏమీ కాదు. ఇప్పటికీ తెల్లారి మూడున్నర కాగానే ఠంచనుగా లేచి, పొద్దుటి నమాజుకి రెడీ అవుతుంది. ఇన్నేళ్ల జీవితంలో ఏనాడూ ఒక్క నమాజు అమ్మీ తప్పలేదు. ఆ తరవాత కనీసం రెండు అధ్యాయాలు ఖురాన్ చదివి, కూతురు ఎప్పుడు నిద్ర లేస్తుందా అని చూస్తూ వుంటుంది. ఆ కొద్దిసేపట్లో ముందు గదికొచ్చి కాసేపు సర్దడమో, బయట పెంచుకుంటున్న నాలుగైదు మొక్కలకు నీళ్ళు పోస్తూనో, వాటి లేత చిగుర్ల వైపు పరీక్షగా చూస్తూనో గడిపేస్తుంది.
“అమ్మీ! అంత పరీక్షగా ఏం చూస్తావు ఆ మొక్కల వైపు? అవి నిన్నటికీ ఇవాళ్టికీ పెద్దేమీ పెరగవు కదా?” అంటే, “నీకు తెలీదు. నాకు తెలుస్తుంది. కొంచెం పెరిగినా సరే!” అంటుంది. నలుగురు కొడుకుల్నీ, ఇద్దరు కూతుళ్లనీ కనీ పెంచిన తల్లికి ఏం చెప్తుంది సబీనా?! తనకి పెంచడం అంటే ఏమిటో తెలీదు కదా! తెలిసే అవకాశం ఆ దేవుడు ఇవ్వలేదు. ఆ అవకాశమే వుండివుంటే, వాహిద్ తో కాపురం నిలబడేదేమో! ఏమో, తెలీదు. వాహిద్ కి రెండేళ్ళు పట్టింది, వాళిద్దరికీ పొసగదని తెలుసుకోడానికి.
ఎందుకో సబీనాకి ఇప్పటికీ అర్థం కాలేదు. “పిల్లలు పుట్టకపోవడమే కారణమా?” అని పదిసార్లు వాహిద్ నే అడిగింది. వాహిద్ వెళ్లిపోయాక అమ్మీని కూడా అడిగింది. అదీ మొదట్లోనే కానీ ఆ తరవాత అడగడం మానేసింది. తను చేసిన పెద్ద తప్పు దగ్గిర వాళ్ళు కదా అని అతనికిచ్చి పెళ్లి చేయడం అని అమ్మీ బయటికే చెప్పేది. చివరికి “ఈ కాలం పిల్లలు నాకు అర్థం కావడం లేదమ్మా!” అనేది.
“నేను అర్థమవుతున్నానా మరి?!” అని సబీనా అడిగితే, మౌనంగా తలదించుకునేది. ఆ తరవాత వాళ్ళిద్దరి మధ్యా ఆ చర్చ లేదు. ఒకసారి మాత్రం కొడుకుల ప్రస్తావన వచ్చినప్పుడు “నేనెవ్వరికీ అర్థం కావడం లేదేమో!” అని మళ్ళీ అంది. వాళ్ళ నిర్లక్ష్యమూ, తనని పట్టించుకోని వాళ్ళ స్వార్థమూ లోలోపలే తలచుకొని, “అయినా వాళ్ళని అనుకొని ఏం ఫాయిదా?! నా కడుపే అలాంటిది. కనడం, పెంచడం వరకే!” అని ఢీలా పడ్డప్పుడు సబీనా అమ్మ కడుపులో తలదాచుకొని వుండిపోయేది. “నేనున్నాలే!” అంటూ-
ధనత్తకి ఫోన్ చేసింది. ఎత్తడం లేదు. “ఫోన్ ఎత్తనే ఎత్తదు ఈ ధన! ఆ మాత్రం దానికి అది చేతుల్లో పట్టుకొని తిరగడం ఎందుకూ!” అని ఒకటి రెండు సార్లు అమ్మీ కూడా విసుక్కుంది.
“అయినా, మధ్యలో నీకు ఫోన్ చేసే తీరిక వుందా, అమ్మీ!”
“వుంటుంది. ఒక్కోసారి మధ్యాన్నం ఏమీ చేయాలనిపించదు. ఎంతసేపని నమాజులూ, ఖురాన్లూ – కాసేపు ఎవరితోనైనా మాట్లాడాలని వుంటుంది.”
సబీనాలో ఈ “ఎవరితోనైనా మాట్లాడాలని వుంటుంది” అన్న కోరిక చచ్చిపోయి అయిదేళ్లయింది. అప్పటికి వాహిద్ వెళ్ళిపోయి రెండేళ్ళు. ఆ మనిషి ఆమె జీవితంలోకి ఎందుకొచ్చాడో, ఎందుకు వెళ్లిపోయాడో తెలీదు. అన్నలతో పాటు లోకం కూడా రకరకాలుగా అనుకొని, చివరికి నింద ఆమె మీదనే మోపి, తృప్తిపడింది. ఎలాంటి మగవాడన్నది ప్రశ్న కాదు, కానీ, ఏదో ఒక మగవాడి నీడ లేని ఆడది అంటరానిదే అని అర్థం కావడానికి ఎక్కువకాలమేమీ పట్టలేదు. అందరితోనూ కావల్సినంత దూరం పెరిగిపోయింది. అన్నలు కనీసం తలెత్తి చూడడం లేదు. ఆ విడాకులు కేవలం సబీనా తప్పే అని వాళ్ళు ఖాయం చేసేసుకున్నారు. వదినలు సరే! ఇక స్కూల్లో స్నేహితులు అంటూ ఎవరూ లేరు. అనేక రకాలుగా ఆమె బతుకు వాళ్ళకి గుసగుస కబుర్ల సరుకు. అప్పుడప్పుడూ ఆమె పేరూ, ఆమెకి సంబంధం లేని వేరే వేరే వ్యవహారాలు ఈ మధ్య బాగానే తోడయ్యాయి. “వాళ్ళు అంతేలే! అలాగే వుంటారు” అని చివర్లో తీర్పులు.
పాఠాలు చెప్పుకోవడం, ఇంటికి రావడం మధ్యలో ఇంకో లోకం వుందనీ, ఇచ్చిపుచ్చుకోడాలు వుంటాయని దాదాపూ మరచిపోయింది సబీనా.
“మాట్లాడాలని నీకు వుండదా? కనీసం ఎవరో ఒకరితో!” అని ఒక సందర్భంలో అమ్మీ అడిగింది కూడా. “నువ్వున్నావ్ కదా, చాలు!”
అది చాలదు అని అమ్మీకి తెలుసు, సబీనాకి కూడా తెలుసు. కానీ, ఈ లోకాన్ని తట్టుకునే శక్తి ఇక లేదు అనుకున్న తరవాత అందరినీ తెంపేసుకుంటూ వచ్చింది. ఆ తరవాత వాళ్ళు కూడా తెగిపోయి, ఎటో వెళ్ళిపోయారు.
మరోసారి ధనత్తకి ఫోన్.
అమ్మయ్య! దొరికింది!
అవతల ధనత్త “ఏమ్మా?” అని పలకరించింది. అమ్మీ అక్కడే వుండి వుండాలని గట్టి నమ్మకం.
“అమ్మ రాలేదమ్మా! సందు చివరకి వెళ్ళి ఒకసారి చూసి రా. వూరికే వాక్ లాగా వెళ్ళిందేమో?! అయినా నేనూ వస్తా వుండు” అని పెద్ద దూరమేమీ కాదు కాబట్టి పావుగంటలో వచ్చేసింది ధనత్త.
ఇద్దరూ కలిసి రోడ్డు ఎక్కారో లేదో, ఎవరో అమ్మీతో ఎదురొచ్చారు. చూడగానే అమ్మీని గట్టిగా కావిలించుకుంది సబీనా. లోపల ఏడుపు కూడా వచ్చేస్తోంది కానీ, అన్ని వుద్వేగాలనీ అణచిపెట్టుకోవడం అప్పటికి బాగానే అలవాటైంది. ధనత్త కూడా అమ్మీ రెండు చేతులూ పట్టుకొని, “బాగా కంగారు పడుతున్నాం బీబీ” అంది.
అమ్మీ కళ్ళల్లో ఏ భావమూ లేదు, పిచ్చి చూపులు తప్ప- ఏదో చెప్పబోతోంది, చెప్పలేకపోతోంది, ఈ లోపే ఆ నడివయసు వ్యక్తి చెప్తున్నాడు:
“దారి తప్పినట్టున్నారండీ. అడ్రస్ చెప్పలేకపోతున్నారు. నలుగురినీ అడుగుతూ ఈ దారిన తీసుకొచ్చా.” అమ్మీ దారి తప్పడం ఏమిటో నమ్మలేకపోతోంది సబీనా. చిన్న చిన్న విషయాలు మరచిపోవడం కొంతకాలంగా తెలుసు కానీ, మరీ ఇల్లు మరచిపోయేంతగా తెలీదు.
“చాలా థాంక్స్ అండీ” అంది సబీనా.
“కొంచెం జాగ్రత్తండీ” అని చెప్పి వెళ్లిపోయాడా వ్యక్తి. ఆ తరవాత ధనత్త ఇంటి దాకా తోడొచ్చి, కాసేపు కూర్చుంది. అప్పటికీ అమ్మీ ఏమీ మాట్లాడలేదు.
“అమ్మీ చెప్పు. ఎక్కడికెళ్లావు?!” అని ఒకటి రెండు సార్లు అడిగి, ఊరుకుంది సబీనా. లోపలికి తీసుకెళ్లి, మంచమ్మీద పడుకోబెట్టింది. ఏ చలనమూ లేని బొమ్మలా వుంది అమ్మీ. వెళ్తూ, వెళ్తూ ధనత్త అంది:
“బేటా, నువ్వు నా కూతురులాంటిదానివే. ఇవాళ కాదు కానీ, రేపు నీతో కాస్త మాట్లాడాలి.”
ధనత్తకి అమ్మీ విషయమో, తన విషయమో ఏదో కాస్త ఎక్కువ తెలుసు అని ఆ క్షణంలో అనిపించింది. కానీ, నోరు విప్పి అడగలేదు సబీనా. “సరే” అని మాత్రం అనగలిగింది.
ధనత్త వెళ్ళిపోయిన తరవాత, సోఫాలో కూలబడి, ఏమీ తోచక, టీవీ ఆన్ చేసింది. దృష్టి నిలవక, కట్టిపడేసింది.
రేపు ధనత్త ఏం మాట్లాడుతుందో– అన్న ఆలోచన సబీనా మనసులో నలుగుతూనే వుంది. ఈలోపు అమ్మీ విషయం ఏమిటో అన్న దిగులు అంతకంటే ఎక్కువగా సలుపుతోంది. వూళ్ళో ఎక్కడ దిగబెట్టినా హాయిగా తిన్నగా ఇంటికొచ్చేస్తుంది అమ్మీ. అలాంటిది- ఇవాళ ఏమైంది?
పడగ్గదిలోంచి ఏవో మాటలు వినిపించి, ఆలోచిస్తూనే ఆ గదిలోకి అడుగుపెట్టింది సబీనా.
2
“పిల్లలు లేరు, దిక్కూ మొక్కూ లేదు. కనీసం పలకరింతకు! ఈ చిన్నమ్మాయి ఎలాగో ఈడ్చుకొస్తోంది- పెళ్లీ, పిల్లల్లేకుండా - దానికి నేనూ, నాకు అదీ- ఎంతకాలం!?”
పక్కకి తిరిగి పడుకునే వుంది అమ్మీ, ఎవరినో గుచ్చిగుచ్చి అడుగుతోంది. ఎవరిని?! ఎదురుగా లేని వ్యక్తితో ఎంతసేపటి నుంచి, ఎంత కాలం నుంచి ఇలా మాట్లాడుకుంటోంది?! అలా చీకట్లో కూర్చొని అమ్మీని చూస్తున్నప్పుడు దిగాలుగా అనిపించడం ఒకటి. అమ్మీకి తనకీ మధ్య పెరిగిన దూరంలోని బాధ ఇంకొకటి. ఈ కొద్దికాలంగా అమ్మీని దగ్గిరగా గమనించే సమయమే తీసుకోలేదు. అలా తీసుకోలేదు అనడం కంటే అలా ఆలోచించేకొద్దీ పెరుగుతూ పోయే ఒంటరితనంలోని లోటు ఆమెని భయపెడుతోంది. ఇప్పుడీ స్థితిలో అమ్మీని చూస్తూంటే, నానీమా గుర్తొస్తోంది.
నిద్రలోనే ఇంకా ఏదో అంటోంది అమ్మీ. “నా కడుపు బంజరైపోయింది. దాని బతుకూ బంజరు నేల చేశాను”
“లేదమ్మీ. నేను పర్లేదు. నాకే దిగులూ లేదు,” అని నిద్రలేపి గట్టిగా చెప్పాలనిపించింది. మామూలుగా మెలకువగా వున్నప్పుడు అమ్మీ నోట ఇలాంటి ఓటమి మాటలే రావు. అమ్మీ కూడా తనలాంటిదే. లేని ధైర్యాన్నీ, భరోసానీ చూపిస్తూ వుంటుంది.
సబీనా మొబైల్ తీసి, ఫోటో ఆల్బమ్ లోకి తొంగిచూసింది. అలా ఆల్బమ్ తీసి, గతాన్ని వెతుక్కోవడం మానేసి చాలా కాలమే అయింది. ఒకే ఒక్క ఫోటో దగ్గిర సబీనా చూపు నిలిచిపోయింది. తెలుపూ నలుపూ ఫోటోలో కనీసం ఇరవై మంది కిక్కిరిసి వున్న ఫోటో. మధ్యలో నానీమా, నానాజాన్ చుట్టూ మామయ్యలూ, అత్తయ్యలూ. వెనక వరసలో అమ్మీ. తన చేతుల్లో పెద్ద కొడుకు. అప్పటికి సబీనా గానీ, మిగిలిన అన్నయ్యలూ, అక్కయ్య కానీ పుట్టలేదు. ఎంత ముద్దుగా వున్నాడో పెద్దన్న అన్వర్! అటు నానీమా నుంచి దాదీమా దాకా వాణ్ని అలవికాని ముద్దూ మురిపెంతో పెంచారు.
సబీనా బీ యిడి అయ్యాక ఇంటికొచ్చినప్పుడు నానీమా వీపు మీద కాలితో తంతున్నాడు అన్వర్. ఏమీ అనలేక అసలేం జరుగుతుందో తెలీక, తల వెంట్రుకల చిక్కులు విడదీసుకుంటూ ఒక మూల కూర్చొని వుంది నానీమా. రాగానే అతని చెయ్యి గట్టిగా పట్టుకొని, “భాయీ, ఏమిటిది?!” అని కేకేసింది సబీనా.
“నీకు తెలీదు. దారితప్పి ఎటేటో పోతోంది. వెతుక్కు రాలేక చస్తున్నాం ఈ ముసల్దానితో! ఇంటిపట్టున వుండి, రెండు మెతుకులు తిని ఒక మూలన పడివుండచ్చుగా!” అని తన చెయ్యి విదిలించుకొని, నానీమా వీపు మీద కాలితో బలంగా తన్నాడు. నొప్పికి కాస్త మూలిగి, మళ్ళీ తల వెంట్రుకల చిక్కులు తీసుకుంటూ వుండిపోయింది నానీమా.
ఏమీ అనలేక అమ్మీ వైపు చూసింది సబీనా. అప్పుడే చాయ్ చేసిందేమో, అందరికీ కప్పులు రెడీ చేస్తోంది అమ్మీ. “ఏంటమ్మీ ఇది!?”
“ఇది రోజూ వుండే రామాయణమే. నానీమాకి ఏమీ గుర్తుండడం లేదు. వీళ్ళేమో విసుక్కుంటున్నారు.”
“అదేమిటి, అమ్మీ?!”
నానీమా అంటే మొదటి నించీ సబీనాకి ప్రాణం. ఎన్నో అనుభవాల విలువైన పుస్తకం నానీమా జీవితం. ఇప్పటికీ ఇంట్లో బాగా నెమరేసుకునే తెలంగాణ పోరాట కథల్లో నానీమా అనామకంగా మిగిలిపోయిన వీరనారి. ఆ కాలంలో నానాజాన్ పార్టీ కొరియర్. పెద్ద మామయ్య ప్రజానాట్యమండలి గాయకుడు. పెద్దమ్మ దాదాపూ మిలటరీకి చిక్కి, తప్పించుకొచ్చింది. ఇంట్లో నిరంతరం పార్టీ వాళ్ళు. సమావేశాలూ. వీళ్ళందరికీ వండీ వార్చి, ఎప్పుడూ ఏ లోటూ లేకుండా చూసుకుంది నానీమా. అటు పార్టీ, ఇటు ఈ పెద్ద కుటుంబం.
అమ్మీ ఇచ్చిన చాయ్ కప్పు తీసుకొని, నానీమా దగ్గిరకెళ్లి కూర్చుంది. చాయ్ కప్పు చేతుల్లో పెడితే, ఎవరూ అన్నట్టు చూసింది నానీమా.
“నానీమా, నేను సబీనా!”
తన పేరు వింటే ఎక్కడ వున్నా గంతులేసే ప్రేమ నానీమాది. అలాంటిది ఇప్పుడు రెండు మూడు సార్లు పేరు చెప్పినా, పిచ్చి చూపులు తప్ప సమాధానం లేదు.
“ముసలిదానికి ఏమీ గుర్తులేదే! నువ్వేం చేసినా ఫాయిదా లేదు. ఎవరో లాపతా బిచ్చగత్తే ని ఇంట్లో వుంచుకున్నట్టే!” అన్నయ్య అంటున్నాడు.
ఇంత అన్యాయంగా మాట్లాడడం సహించలేకపోతోంది. లోపల్నించి కోపం తన్నుకొస్తోంది. “భాయీ, ప్లీజ్. ఏమీ అనొద్దు. నువ్వు కాసేపు బయట కూర్చో!” అనడం తప్ప ఏమీ అనలేకపోయింది.
ఇది జరిగిన పదిహేను రోజులకు నానీమా రోడ్డు పక్కన ఎక్కడో నిజంగానే బిచ్చగత్తలాగానే చనిపోయింది. అదీ చనిపోయిన గంట తరవాత తెలిసింది, వెతుక్కుంటూ వెళ్తే.
అప్పటి నుంచీ ఇప్పటిదాకా ఒకే ప్రశ్న అమ్మీని అడుగుతూనే వుంది. “అమ్మీ, నానీమా కథ అలా ముగియడం ఎందుకు?”
మనసు ఎంతగా మూలిగిందో, కొన్నాళ్ళకు అమ్మీ అంది. “అంతే! రేపు నా కథ, నీ కథ కూడా అలాగే ముగుస్తుంది. మనం పెద్ద పెద్ద కుటుంబాల్ని పోషిస్తాం. కుటుంబం కోసం ఎన్నీటినో నెగ్గుకొస్తాం. ఇలాంటి స్థితి ఒకటి దాపురించినప్పుడు అందరూ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నశవాన్ని పెట్టుకున్నట్టు చూస్తారు. శవాన్ని ఎలాగోలా వదిలించుకోవాలి,” అంది అమ్మీ.
ఇప్పుడు నిద్రపోతున్న అమ్మీ ప్రశాంతమైన కళ్లలోకి చూస్తున్నప్పుడు, మధ్యమధ్యలో ఆమె నిద్రని తెంపేస్తూ వుబికొస్తున్న అసంపూర్తి వాక్యాల్ని వింటున్నప్పుడు- అమ్మీ మాటలే గుర్తొస్తున్నాయి. ఫోటోలో ఆమె మూడు పదుల వయసున్న ముఖంలోని చిరునవ్వే గుర్తొస్తోంది. ఆ చిరునవ్వుకి తెలుసా తన చివరి క్షణం!? ఏమో!
రేపు మాట్లాడుకుందాం అని ఈ సాయంత్రం వెళ్లిపోయింది కదా ధనత్త- రేపు ఏం మాట్లాడుతుందో అనుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది, ఎప్పట్లానే రెండు మాత్రల తరవాత.
3
ఎందుకో మెలకువ వచ్చి, చూసేసరికి పక్కన అమ్మీ లేదు. ఫోన్ లోకి చూసుకుంటూ, దిగ్గున లేచి కూర్చుంది సబీనా. మూడు గంటలయింది. పరుగున బాత్ రూమ్ లోకి వెళ్తే, తలుపు తీసే వుంది. బాత్ రూమ్ లో అమ్మీ. టాయిలెట్ లో కాకుండా స్నానం చేసే చోట కూర్చొని మూత్రం పోసుకుంటోంది. తనని చూసి, ఉలిక్కిపడి చూసింది.
“అమ్మీ! నన్ను లేపచ్చు కదా!” అంది కొంచెం విసుగ్గా.
అమ్మీని తీసుకొచ్చి, మళ్ళీ మంచమ్మీద పడుకోబెట్టింది. “ఇప్పటిదాకా అందరినీ నానీమా పసిపిల్లల్లా చూసుకుంది. ఇప్పుడు మనమే నానీమాని పసిపిల్లలా చూసుకోవాలి,” అని ఒకసారి అమ్మీ అన్నమాటలు ఇవాళ అమ్మీ దగ్గిరే తను పైకే అనుకుంది.
మంచమ్మీద పడుకోబెట్టగానే పసిపిల్లలా ముసుగు కప్పుకొని పడుకుంది అమ్మీ. నిద్రపట్టక, ముందుగదిలోకి వచ్చి, కూర్చుంది సబీనా. ఎప్పుడూ అలవాటు లేనిది- చాలా యాంత్రికంగా లేచి, ముఖం కడుక్కొని, వజూ అయిందనిపించి, ఫజర్ నమాజ్ కి నిలబడింది. తన దినచర్య మారిపోతోందా తనకి తెలియకుండానే?! ఏమో!
నమాజ్ అయ్యాక కూర్చొని రెండు చేతుల్ని దగ్గిరకి తీసుకొని, ఫాతెహా చదువుతున్నప్పుడు కడుపులోంచి ఏడుపు తన్నుకొస్తోంది. తన ఏడుపు తనకే వినిపించి చాలా కాలమే అయింది అనుకుంది సబీనా. నానీమా అనేది “ఫాతెహా చదివేటప్పుడు వెక్కివెక్కి ఏడుపు వచ్చిందంటే నీ మొర ఆలకించడానికి అల్లా సిద్ధంగా వున్నాడని అర్థం.” ఆ వెక్కి వెక్కి ఏడవడం నానీమా భాషలో ఉర్దూలో గిడ్ గిడాకే రోనా- అదే ఇప్పుడు. ఫాతెహాలో చివరి వాక్యాలు పెద్దగానే అని, మళ్ళీ ఏడుస్తూ వుండిపోయింది. కూర్చున్న చోటే వుండిపోయి, ఖురాన్ తెరిచింది, ఏ అధ్యాయం వస్తే అది చదవడానికి-
కాసేపు చదువుకొని, మళ్ళీ పడగ్గదిలోకి వచ్చింది. అమ్మీ ఇంకా లేవలేదు. ఫజర్ నమాజ్ వేళకి ముందే లేచి తన పద్ధతిలో తన దినచర్యలోకి వెళ్లిపోతుంది. పక్కన పడుకోబోతూ, అమ్మీని లేపాలా వద్దా అని సంశయిస్తూ, నెమ్మదిగా అమ్మీ భుజమ్మీద చేయి వేసింది సబీనా. చెయ్యి దగ్గిరకి తీసుకుంది అమ్మీ. అదీ కొంచెం పట్టించుకోమనే పసిపిల్లలానే- సబీనాకి నిద్రరాలేదు కానీ, అమ్మీ వైపే చూస్తూ కూర్చుంది.ఆ చూపుల్లో ఎప్పటికీ తోడు వుంటానన్న గాఢమైన నమ్మకం. దిగులేమీ లేదన్న కొండంత భరోసా అమ్మీ పడుకున్న భంగిమలో-
పొద్దున్న లేవగానే తానే అమ్మీకి చాయ్ చేసిపెట్టాలి అని తనకి తాను గట్టిగా చెప్పుకుంది సబీనా. మరునాడు పొద్దున లేచీ లేవకుండానే ఫోన్ మోగింది. తెలియని నంబర్. టైమ్ చూస్తే ఎనిమిది దాటింది. అమ్మీ ఇంకా లేవలేదు. లేపడం ఇష్టం లేదు.
“మేడమ్! నమస్తే. నేను ధనత్త గారి నైబర్ ని. ధనత్త గారు పోయారండీ.”
“అమెరికాలో వాళ్ళ ఇద్దరబ్బాయిలకూ చెప్పారా?!” అతనిచ్చిన సమాధానం సబీనాని చెప్పలేనంత దిగుల్లోకి నెట్టింది. ఇద్దరబ్బాయిలూ రాలేదు. రాలేకపోవచ్చు.
ఆ సాయంత్రం ధనత్త దేహాన్ని మెషీన్ కి అప్పజెప్పారు. యంత్రం తన పని తాను చేసుకుని వెళ్లిపోయింది యాంత్రికంగా. కానీ, దాని చప్పుడూ, దాంట్లోకి వెళ్తున్న ధనత్త దేహమూ –సబీనాని వెంటాడుతూనే వున్నాయి. ఇద్దరు కొడుకులు కదా అని ఎంత భరోసాగా వుండేది ధనత్త!
అలా చితి యంత్రంలోకి వెళ్లిపోతున్న ధనత్త ముఖం చూస్తున్నంత సేపూ “బేటా, అమ్మీ జాగ్రత్త! నువ్వే దానికి పెద్ద కొడుకువి!” అని తనకి మాత్రమే అర్థమయ్యేట్టు చెప్తున్నట్టే వుంది. ఇన్ని చూశాక కూడా “పెద్ద కొడుకు” అన్నదా నిజంగా-
ధనత్త చెప్పాలనుకున్నది ఏమిటా అనే ఆలోచన మాత్రం ఎప్పుడూ మిగిలే వుంది. తన గురించా? అమ్మీ గురించా? అదేమీ కాకుండా ఆమె సొంత విషయాలా?! ఈ సాయంత్రం తరవాత ధనత్త లేదు. రాదు. కనిపించదు. సగంలో మాట తెంపేసి వెళ్ళిపోయినట్టే అనిపించింది. కొడుకులు పదోరోజైనా వచ్చివుంటారా?! తెలీదు.
4
ఒక పొద్దున చాయ్ కలిపి అమ్మీ చేతుల్లో వుంచుతూ, ముడతలు పడ్డ ఆ చేతుల్ని కాస్త మెత్తగా నొక్కుతూ వుండిపోయింది సబీనా.
అప్పుడు అమ్మీ ముఖంలో నానీమానో, ధనత్తనో చూడడం ఆమెకిష్టం లేదు. కడుపులో తన్ని వెళ్లిపోతున్న కొడుకుల కాళ్ళు, వాళ్ళ మొండి చేతులూ కనిపిస్తున్నాయి కలల్లో కూడా-
వీటన్నీటి మధ్యా అమ్మీ యాది కొంచెం కొంచెం మేలుకుంటోంది.
“బేటా, నీకు నానీమా నుంచి ఏమొచ్చినా రాకపోయినా, ఆ చాయ్ రుచి మాత్రం వచ్చింది” అంటోంది అమ్మీ కాస్త నవ్వుతూ.
అమ్మీ అలా అన్నప్పుడు సబీనా రెండు కళ్ల నిండా రెండు గర్వపతాకలు ఎగురుతాయి. “ఈ గర్వ పతాక మీద ఏ మగాడి సంతకమూ అక్కర్లేదు,” అని రాసుకుంది ఆ రాత్రి డైరీలో.
*
No comments:
Post a Comment