తెంపుకొచ్చిన నీలిమలు కొన్ని
1
నీలాంటిదే
వొక నింగి నీలిమని
నేనూ తుంచి తెచ్చుకుంటాను,
నిదానంగా కొమ్మని వొంచి పూవుని తెంపినట్టే.
ఎందుకనిపిస్తుందో
ఎప్పుడూ
నాదే నాదే అయిన వొక ఆకాశం కావాలనీ,
నాదే
నాదే అయిన వొక పూవు కావాలనీ.
2
నాదీ నీదీ
నీదీ నాదీ అనుకున్న అనుక్షణం
తెలుసు కదా, తెలుసు కదా
యెన్ని ఆకాశాలు చేజారిపోయాయో, పొద్దుటి పూలలా.
యెన్ని పూలు వాలిపోయాయో సాయంత్రపు మట్టిలోకి.

అయినా
యెందుకో తెంపుకొస్తూనే వుంటాం,
నీ పూలు నువ్వూ
నా ఆకాశాలు నేనూ.
*

ఫనా


1
ఆడుకుంటున్నా నాలో నేను
నీతో నేను.
నీ వూహ వొక సాకు నాకు.
తిరిగే విరిగే అలలో గడ్డ కట్టుకుపోతున్నా,
నా లోపలి నీలోకి / నీ లోపలి నాలోకి
నన్నే విసురుకునే ఆటబొమ్మనై.
2
ఎన్ని దూరాలు కలిపితే
వొక అస్థిర బైరాగినవుతానో,
ఎన్ని తీరాలు గాయాలై సలిపితే
వొక నిర్లక్ష్య సూఫీనవుతానో!
ఇదీ వొక ఆటే కదా నీ చుట్టూ
నేను బొంగరమయి తిరగడానికి!
3
కొలమానాలన్నీ గాల్లోకి
చిలిపిగా విసిరేసి
నీ లోపల శిధిలమయిపోనీ నిబ్బరంగా!
(ఫనా వొక సూఫీ భావన. “నేను” అనేది కనిపించనంతగా “నువ్వు” అనే భావనలో లీనమయిపోవడం!)

కాసింత సంతోషం!

గదినిండా చీకట్లు మాత్రమే పొర్లి, పొంగుతున్నప్పుడు
అవును, కచ్చితంగా అప్పుడే
కాసింత సంతోషంగా వున్నప్పటి వొకానొక పూర్వ క్షణపు దీపాన్ని మళ్ళీ వెలిగించు.
ఆ వెలుగులో నువ్వేమేం చేసి వుంటావో
వొక్క సారి- కనీసం వొక్కసారి- వూహించు.

మరీ పెద్దవి కాదులే, చిన్ని చిన్ని సంకేతాలు చాలు.

1
బహుశా మండుటెండ విరగబడే మధ్యాన్నంలో నువ్వు
వూరిచివర చెరువుని వెతుక్కుంటూ వెళ్లి వుంటావ్
శరీరాన్ని గాలిపటం చేసి ప్రతినీటి బిందువులోనూ వొక ఆకాశాన్ని దిగవిడుచుకొని
రంగురంగులుగా ఆ నీటి వలయాల్లోకి ఎగిరిపోతూ వుండి వుంటావ్.

యిప్పుడు అంతగా గుర్తు లేదేమో కాని,
ఆ చెరువుతోనూ ఆ ఆకాశమూ నువ్వూ వొకే భాషలో మాట్లాడుకొని వుండి వుంటారు,
వొకరిలోకి ఇంకొకరు తొంగి చూసుకొని వుంటారు నీటిలోపలి చందమామలా.

2
పల్లె రాదారి మీద ముగ్గురు నలుగురు పిల్లలు యీ లోకాన్ని బేఖాతర్ చేసేస్తూ
కబుర్ల సముద్రంలో మునకలు వేస్తూ వెళ్తున్నప్పుడు
వాళ్ళల్లో యెవరిదో వొక పసిచూపులోకి చెంగున గెంతి
నీ బాల్యపు చేలన్నీ పెద్ద పెద్ద అంగలతో దాటేసి వుంటావ్ వెనకెనక్కి-

యిప్పుడు అసలేమీ గుర్తు లేదేమో కాని,
అప్పుడు నీ వొంటిమీది పెద్దరికపు పొరలు రాలిపోయి
నువ్వు మళ్ళీ నగ్నంగా నిలబడే వుంటావ్,
ఆ పిల్లలు నీ ముందు నిలువుటద్దాలై నిలిచినప్పుడు-

ఎవరికీ చెప్పలేకపోవచ్చు కానీ
నువ్వు ఎంత దిగులుపడ్తున్నావో
వొక్కో సారి రాత్రీ పగలూ తెలియని కాలాల్లోకి యెలాగెలా జారుకుంటూ వెళ్ళిపోతున్నావో
అటు ఇటు ఎటు మళ్ళినా ఏడుపువై ఎలా పగిలిపోతున్నావో తెలుసు కాని-

కాసింత సంతోషంగా వున్నప్పుడు
కచ్చితంగా ఆ క్షణంలో నువ్వూ నేనూ యిద్దరు పిల్లలమై రెండు వూహలమై
వూయల వూగామే అనుకో,
అప్పుడు యీ దేహాలూ ఈ నిజాలూ గాలికన్నా తేలిక.

యిప్పుడు నువ్వు కనీసం వొక సంతోషపు అలలో,
అలలోపలి సంతోషపు కడలిలో
కొంచెమే అయినా సరే,
తేలిపో.
యిప్పుడు నువ్వు కనీసం వొక దీపం కళ్ళల్లో
కళ్ళలోని వెల్తురు నీడల్లో
కొంచెమే అయినా సరే,
వెలిగి రా!
4
జీవితం ఎప్పుడూ ఉత్సవమే కానక్కర్లేదు
కాసింత సంతోషపు చిన్ని సంకేతమైనా చాలు!

నేల కంపిస్తుందని తెలియని నీకు…nepal


1.
నీ కాళ్ళ కింద భూమి ఎప్పుడూ వణికి పోలేదు కాబట్టి, 
లేదూ  కాస్తయినా జారిపోలేదు కాబట్టీ, నీకు యింకా చాలా తెలియవ్.
 నిజానికి ఈ వివర్ణ ముఖాల నగరపు చలి  తప్ప 
యింకే జీవన్మరణ ప్రకంపనలూ తెలియవు కాబట్టి 
నీకు నువ్వో ఆ అవతలి ఇంకొక ముఖమో తెలియనే తెలియదు.
 చలిలో ఎండాకాలాన్నీ, ఎండలో చలికాలాన్నీ 
అందంగా పునఃసృష్టించుకునే తెలివో తేటదనమో నీకు ఉండనే వుంది కాబట్టి 
అసలే జీవితం ఎలా తెల్లారుతుందో, 
అంత హటాత్తుగానే ఏ మరణం ఎందుకు దాపురిస్తుందో నీకు యెప్పటికీ తెలియకనే పోవచ్చు.
కాని, అసలవేవీ జీవితమే కాదంటావే, 
అదిగో అక్కడే నీ రహస్యం అంతా నిద్రపోతూ వుంటుంది, వొళ్ళూపై  లేకుండా!

2.
యెప్పటి నించి ఆలోచించడం మొదలు పెట్టావో నువ్వు, 
యెప్పటి నించి దేన్ని యెలా అనుభవించడం మొదలెట్టావో నువ్వు,
 వొక బాధలో యింకో వొంటరితనంలో 
మరింకో చావు కన్నా పీడలాంటి బతుకులో యేది యెందుకు యెలా కమ్ముకొస్తుందో 
యెవరిని యే క్షణం యెలా కుమ్మేస్తూ పోతుందో ఏదీ ఏదీ  నీ వూహకి కూడా అందదు.
 నువ్వొక అద్దాల గదిలోపల గదిలో సమాధి తవ్వుకుంటూ వుంటావ్! 
దాన్ని  తెరిచే సూర్యకిరణపు తాళం చేయిని యెక్కడో పారేసుకుని వుంటావ్!

3.
 నువ్వు పడుకున్న గదిలో కాస్త చలిగా వుందనో, 
నీ పక్కన పడుకున్న దేహంలో కొంత  వెచ్చదనం చచ్చిపోయిందనో,
 నువ్వు ఎక్కాల్సిన మెట్టు చూస్తూ చూస్తూ వుండగానే చప్పున జారిపోయిందనో 

రాత్రీ పగలూ గుండెలు బాదుకొని యేడుస్తూ వుండిపోతావ్ తప్ప,
 యింకో గుండెలోకి  ప్రవేశించి అక్కడి గాయాన్ని పలకరించి రాలేవ్ నువ్వు. 
వొక కోరిక నించి యింకో కోరికలోకి వలసెళ్ళే ఏమరుపాటులోనో తొందరపాటులోనో
 అన్ని స్థలాలూ, కాలాలూ, వూహలూ చెక్కుచెదరని అందమైన అమరిక  నీకు. 

మహా బలిదానాలే చేయక్కర్లేదు,
 కాని కనీసం వొక అరచుక్క కంట తడిని ఎవరికోసమూ రాల్చలేవు కదా నువ్వు.
4.
ఇవాళ నేలా వణికి పోతుంది గజగజ.
రేపు ఆకాశమూ తొణికిపోతుంది వానచుక్కలా.
యీ సూర్యుడూ యీ చంద్రుడూ యింకేవీ నిలబడవ్ యింత ఠీవిగా యిప్పటిలాగానే.
జీవితం కొన్ని చేతుల్లోంచి యెట్లా పట్టుతప్పి పోతుందో
అలాగే కచ్చితంగా అలాగే ఇవన్నీ నెలవు తప్పి ఎటేటో రాలిపోతాయి,
నీకేమీ చెప్పకుండానే.

5.
నిజంగా
నీకు యింకా చాలా జీవితం తెలియనే  తెలియదు,
నీ కాళ్ళ కింద భూమి ఎప్పుడూ వణికి పోలేదు కాబట్టే!Web Statistics