వుంటే, సరే!

ఇవాళ సురయా పుట్టిన రోజు. ఎన్ని సార్లు విని వుంటాను, సురయా గొంతు ఇలా ఆమె స్వరంలోనూ, నా స్వరంలోనూ..ఆమె ఎందుకు పాడుతుందో నాకు తెలియక్కర్లేదు కాని, ఆ పాటలో నాకు నేనే ఎందుకు కనిపిస్తానో, వినిపిస్తానో అది నాకు కావాలి.
ఆమె స్మృతిలో పదకొండేళ్ళ కిందట - ఆమె చనిపోయినప్పుడు- రాసుకున్న కవిత ఇది. ఇందులో వాడిన చాలా ప్రతీకలూ పదచిత్రాలూ సురయా తన పాటలో ఆమె వాడినవే, ఈ కవితలో సురయా పేరు వుంది కాని, అది లేకపోయినా ఈ కవిత ఆమెకి హిందీలో వినిపిస్తే ఆమె యిట్టే గుర్తు పట్టేది ఇది తన కోసమే రాసింది అని..
~
వెనక్కి రాదు
దూరాల సొరంగంలోకి
జారిపోయాక, రైలు.
కాసేపే
ఇక్కడి యీ వెతుకులాటలూ బతుకుపాటలూ
ఎదురుచూపులూ తలపోతలూ
చివరి ఎడబాటు దాకా.
వస్తున్నప్పుడు ఎంత అలజడి!
రైలు .. రైలు .. హమారీ ఘర్‌కీ రైల్‌ .
ప్లాట్‌ఫారమ్మీద పిల్లల ఏడుపులూ
ఎదురుచూపు కొసన పెనవేసుకునే ఒత్తిళ్ళూ.
విడిపోయేటప్పటి మౌనానికి
ఏదో వొక భాషనివ్వు .. ఏదో వొక సంకేతాన్నివ్వు
కన్నీళ్ళు తప్ప.
దూరంగా మబ్బుపొరమీద పగిలిపోతుంది పాట
చూపుపొలిమేర దాటి మలుపు తిరిగే రైలుబండిలానే.
చివరాఖరి రైలుకూత గుండెలోకి దూసుకుపోతుంది.
రాత్రీపగళ్ళూ దగ్గరికొస్తూ దూరమవుతూ
అదే కూత … లోపల.
దీనికి మందు లేదు, సురయా!
నువ్వేదో పాడుకుని వెళ్ళిపోయావు కానీ
దీనికి భాష లేదు.
యీ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళినంత తేలిక.
వొక మౌనంలోంచి యింకో మౌనంలోకి
వొక నిద్రలోంచి యింకో నిద్రలోకి.
బతుకు, వొక దిల్లగీ.
ఎక్కడాలేని వూరికి గాలిరైల్లో ప్రయాణం.
పోనీలే, సురయా!
కాస్త ప్రేమా, కాస్త స్నేహమూ
కాస్త సంతోషమూ … నీకోసమే వీచే గాలీ
నీ వెంటే నడిచే ఆకాశమూ
నిన్ను మాత్రమే పాడే పాటా
చిటికెన వేలు వొదలని నీడా
అక్కడైనా వుంటాయంటావా?
వుంటే, సరే!
(మార్చి 2004)
Category: 1 comments

ఇద్దరి చీకటి


The darkness quiets if we watch it together.
-Charlotte Pence


1
చాలా సార్లు నువ్వొక గుహలాంటి చీకటి
లేదూ, చీకటిలాంటి గుహ.
కళ్ళు చికిలించుకొని అన్ని చూపుల్నీ వొక్క చోటే గుచ్చుకొని
ఎంత సేపని చూస్తానో
నీలోకి వొకింత కూడా రాలేను, నువ్వూ రానివ్వవు
నీ ఎత్తాటి గోడల మధ్యకు-
వొక్క చినుకయ్యీ రాలలేను, నువ్వూ రాలవు
ఎవరి ఎడారిలో వాళ్ళం!
అయినా గానీ
ఎంత ఆశగా చూస్తూ వుంటానో పసి కళ్ళ దాహంతో-


2
వద్దు వద్దని నువ్వు చెప్తూనే వుంటావ్ కానీ
ఇసక కంటే పొడి పొడిగా వుండే
ఆ కొద్ది మాటల్నే వొకటికి పదిసార్లు చదువుకుంటూ వుండిపోతాను
మునిమాపు చీకట్నించి నట్టనడి రాత్రి దాకా
నీ వాక్యాల చుట్టూరా మూగ దీపమై వెలుగుతూ వుంటాను,
ఎంత చలి నెగడునై కాలిపోతూ వుంటానో
తెగే నరాల ఉన్మత్తతలో-


3
సమూహలకేమీ కొదువ లేదు యిక్కడ
పలకరింపుల వానలకూ తెరపి లేదు
యింకాస్త గుండె ఖాళీ చేసుకొని
వూరికే వచ్చెళ్ళే తడినీడలూ కొన్ని.
అయినా గానీ,
అన్నిట్లోనూ అందరిలోనూ వొక్క నువ్వే నా కళ్ళకి-
యీ చుట్టూ శేష ప్రపంచమంతా గుడ్డి గవ్వయిపోతుంది నాకు.


4
నిజమే, కలిసి చూసే వెలుగులూ వుంటాయి,
అడుగులు కలిపే మలుపులూ వుంటాయి
మరీ ముఖ్యంగా
యిద్దరమూ వొకే చీకట్ని కలిసి చూస్తున్నప్పుడు
వొక నమ్మకమేదో వెలుగై ప్రవహిస్తుంది
రెండు దేహాల నిండా-
అవునా? కాదా?
అవుననో కాదనో కూడా చెప్పవా?!

ఆ చిన్ని పాదాలు
ఎంతో కొంత దూరం నడిచాక నీ నీడతో మాత్రమే తలపడే వొంటరితనాన్ని సాధించుకున్నాక నిన్ను నువ్వు తప్ప ఇంకెవరూ వేధించలేని సాధించలేని బాధించలేని నొప్పించలేని అనేక లేనితనాల పతాకాలు దారిపొడవునా నువ్వు పాతుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు
జీవితం నిన్ను కాసేపు ఆపితే ఆగిపో.
ఆగిపోవడం తప్పేమీ కాదు, ఎవరో విధించిన శిక్ష కూడా కాదు
కాసేపు నిన్ను ఆపాలని ఎందుకనుకుందో జీవితం!

2

వెనక్కి చూస్తావ్ నువ్వు చూస్తూ వుండు చూస్తూ చూస్తూ వెనక్కి వెళ్ళినా వెళ్ళు. జీవితం నిన్ను వెనక్కి పంపాలనే అనుకుంటే వెనక్కే వెళ్లి రా. కాస్త ప్రేమగానే వెళ్ళు. మనసు తలపులన్నీ ఎంచక్కా తెరుచుకుంటూనే వెళ్ళు. ఎవరన్నారు వెనక్కి వేసే ఆ అడుగులు వెనక్కే అని!
ఎంత నిదానంగా వెనకడుగులు వేసావో, అంత తపనగా మళ్ళీ ఆ అడుగులన్నీ జీవితం నించి అడిగి అడిగి తెచ్చుకుంటావ్ నువ్వే!

3

ఇవాళ ఈ చిన్ని పాదాల్లోకి వలస వెళ్లి వచ్చాను. తొలినడకల్లో మరచిపోయిన నా పాఠాలన్నీ మళ్ళీ వల్లెవేసుకున్నాను. ఆ తడబడు అడుగుల లేత అందాలన్నీ వొక వూహలో వొంపుకున్నాను.

4

అవున్రా, ఇవాళ నా అడుగులు నాకు దొరికాయి.
నీకు చెప్పాలని పరిగెత్తుకు వచ్చానా, నువ్వెక్కడో అందనంత దూరంలో వున్నావ్!

5

నీ దూరంలోకి నేనూ
నా దగ్గిరలోకి నువ్వూ వచ్చి
వొక అడుగు అవుతామా ఎప్పుడైనా?!
ఆ చిన్ని పాదాల తడబాటులోకి వెళ్లి వస్తామా ఎప్పుడైనా?!

(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)

యింకేమీ కాదు


~
తెలుస్తూనే వుంటుంది,
దూరంగా వున్నప్పుడే యింకా ఎక్కువగా-
నేను తప్ప ఇంకెవరూ లేని గదిలో
వొక పక్కకి తిరిగి గోడవేపు చూస్తూ
నన్ను నేనే పలకరించుకున్నంత నింపాదిగా
ఆ చీకట్లోని నీడల్ని మెత్తని చూపుల్తో నిమురుతూ –
మాట్లాడుతూ వుండాలని అలా మాటల్లోకి అన్ని నిస్పృహల్నీ
గ్లాసులోకి నీళ్ళలా వొంపాలనీ
అంతే తేలికగా వాటిని మళ్ళీ గొంతులోకి కూడా వొంపేసి
అటునించి శరీరంలోకీ
యింకిపోయేంత హాయిగా మరచిపోవాలనీ అనుకుంటాను.
ఇదంతా యింకేమీ కాదు
కాస్త అలవాటు పడాలి, అంతే!
2
శరీరాన్ని బయటికి ఈడ్చుకెళ్తే గాలి మారుతుందని
అమాయకంగా నన్ను నేను నమ్మించుకొని
సాయంత్రపు చలిలోకి మనసంతా ముడుచుకొని నడుస్తూ వెళ్తాను
ఎక్కడికని? ఎంత దూరమో వెళ్ళను గానీ,
వెళ్ళిన దారంతా బెంగపడిన పక్షిలా మెలికలు తిరుగుతుంది.
వొంటరిగా వున్నప్పుడు వొంటరి పక్షిని అసలే చూడలేను.
ఇదంతా యింకేమీ కాదు
నువ్వు దేనికీ అలవాటు పడలేవని ఇంకో సారి తెలుస్తుంది తప్ప!
3
దగ్గిరగా వున్నప్పుడు
తెలిసినతనంలో ఏదో తెలియనితనమే ఎక్కువ.
తెలుసు అనుకుంటాం కానీ, ఏమీ తెలియదు నిజంగా-
దూరంగా వున్నప్పుడే
నా వొంటిని నేనే తాకి తాకి
కొలుస్తూ వుంటాను, నీ జ్వరాన్ని-

Web Statistics