Showing posts with label అమెరికా తెలుగు సాహిత్యం. Show all posts
Showing posts with label అమెరికా తెలుగు సాహిత్యం. Show all posts

Thursday, November 11, 2010

జీవితం అర్ధమయ్యింది ఇక్కడే : పూడిపెద్ది శేషు శర్మ

1. అమెరికా వచ్చాక జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?

అమెరికా వచ్చాకే నాకు జీవితం అంటే ఏమిటో తెలిసింది. అమెరికా భాషలో "టీనేజ్ వయస్సు" దాటీ దాటగానే వచ్చి ఈదేశంలో పడ్డాను. జీవితం అంటే ఎటువంటి అవగాహన లేకుండానే పెళ్లి చేసుకుని, భర్తతో భూతల స్వర్గం కాబోలు అనుకుంటూ అమెరికా వచ్చేను. ఇండియా లో పెరిగిన జీవితం అంతా "ఊహా లోకమే"! జీవితం ఎలా ఉండాలో, ఎంత ఆదర్శంతో బతకాలో; జీవితాన్ని ఎలా మలచుకోవాలో అనే ఊహాలోకం తప్ప, అసలు సిసలు జీవితం అంటే ఏమిటో ఎప్పుడూ ఆలోచించ లేదు. ఈదేశం వచ్చిన తరువాత, చుట్టుపక్కల ఉన్న ప్రవాసాంధ్రుల జీవితాలు చూస్తూ ఉంటే, "ఓహో, ఈ దేశంలో మన జీవితాలలో ఇటువంటి సమస్యలు వస్తాయా! మరి అటువంటి సమస్యల్ని ఎలా పరిష్కరించాలి?" అన్న ఆలోచనలు రావడం మొదలెట్టాయి. ఆ ఆలోచనలే నాలోని ఎమేచూర్ రచయిత్రిని మేల్కొల్పేయి.
మీ ప్రశ్నకు సమాధానం: ఇండియాలో నా జీవితం " స్వప్న జీవితం"; అమెరికా వచ్చిన తరువాత...ఏళ్ళు గడుస్తున్న కొద్దీ, అసలు జీవితం అంటే ఏమిటో తెలిసింది. రియల్ ఎవేకేనింగ్! ఇప్పటికీ కూడా రోజు రోజుకీ,....నా దృక్పధం లో మార్పు వస్తూనే వుంది.

2. ఆ మార్పు మీ రచనల్లో ఎలా వ్యక్తం అయ్యింది? ఒకటి రెండు ఉదాహరణలు ఇవ్వగలరా?
నా దృష్టిలో నేను గొప్ప రచయిత్రిని కాను. కేవలం నాఆలోచనలను చిన్న కధల రూపంలో వ్యక్తీకరణం చేసే మనిషిని. నేను ఇండియా లో పెద్ద రచనలు చేయలేదు. ఈదేశం వచ్చేక మన తెలుగు వారు ఎదురుకుంటున్న సమస్యల గురించి నా భావనల్ని, నా అభిప్రాయాల్ని, నలుగురికి తెలియజేయాలని చిన్ని చిన్ని కధలు వ్రాయటం మొదలుపెట్టా! నా రచనలు, చాలామట్టుకు, అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రుల జీవితాలకు సంభందించినవే. ప్రవాసాంధ్రుల జీవితాల్లో మనకు గోచరిస్తున్న సమస్యలు, వాటిని మనం ఏ దృక్పధంలో చూసి, ఎలా పరిష్కరించుకోవచ్చో అనేదే నా కధల్లో ముఖ్యాంశం. నా కధలు చదివి, అటువంటి ఇరకాటంలో సతమతమవుతున్న మన తెలుగు వారికి ఊరట కలిగించడమే నా ఆశయం.

3. ఇక్కడికి వచ్చాక మీరు చేసిన రచనలు మీరు ఆంధ్రాలో ఉండగా చేసిన రచనకి ఏ విధంగా భిన్నమైనవి?
ఇంతకు ముందు చెప్పినట్టు, నేను ఆంధ్రాలో ఉండగా, చేసిన రచనలు...చాలా బుల్లి బుల్లివే. చెప్పుకోదగ్గవి కావు.

4. అమెరికాలో ఉన్న తెలుగు రచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలేమిటి?
నేను ఎప్పుడో ఆరు నెలలకో, ఏడాదికో కధ వ్రాస్తూ ఉంటాను. నాకు, ఏదైనా క్లిష్టమైన విషయం గానీ, నా హృదయాన్ని తాకిన విషయం గానీ తారస పడితే వ్రాస్తాను; లేదా వ్రాయను. నన్నుగా నేను పెద్ద భవిష్యత్తు వున్నా రచయిత్రిగా ఎప్పుడూ ఆలోచించ లేదు. నేనువ్రాసిన కొన్ని కధలకి, దేశం నలు మూలల నుండి నాతో ఏకీభవిస్తూనో, లేదా విమర్శిస్తూనో నాతో ఫోన్ చేసి ఉద్వేగంతో మాట్లాడినప్పుడే ఒక రచయిత్రిగా నాకు ఆదరణ కలిగిందని నేను భావించేను. ఇక పోతే రచయిత్రిగా నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, భవిష్యత్తులోనే తెలుస్తుంది.

Wednesday, October 27, 2010

తెలుగు భాషకి కొత్త తలుపు...ఇంటర్నెట్!

కల్లూరి శ్యామల గారు డిల్లీలోని ఐ‌ఐ‌టి లో అధ్యాపకులు. తెలుగు నించి ఇటీవలి సాహిత్యాన్ని ఇంగ్లీషులోకి విస్తృతంగా అనువదిస్తున్నారు. తెలుగు సాహిత్యంతో పాటు ప్రపంచ సాహిత్యాన్ని సునిశితంగా చదువుకున్నారు. ఈ అభిప్రాయాలు పంపినందుకు వారికి ధన్యవాదాలు.


మొదటిప్రశ్న: ఇంటర్నెట్ తర్వాత తెలుగు సాహిత్యంలో వచ్చిన బాగా కనిపిస్తున్న మార్పులు.

విదేశాంధ్రులు, ప్రవాసాంధ్రులు తెలుగుని ఏదో ఒకరకంగా చదవగలుగుతున్నారు. భాషతో అనుబంధం నిలబెట్టులోవాలనే ఆదుర్దా నిజానికి తెలుగు యువతరంలో చదువుకునేరోజులలో దాదాపు మృగ్యమయిందనే చెప్పాలి. స్పర్ధతో కాంపిటీషన్ నిండిన ప్రపంచీకరణ విస్తరించిన నేటి సమాజంలో, తల్లిదండ్రులకి తమ పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు అవ్వాలనే ఆదుర్దాతో ఎక్కువ అవటంవలన భాషా సాహిత్యాలపట్ల ఒక వయస్సులో అంటే దాదాపు పదోఏటనుంఛి ఇరవైరెండేళ్ళ వయస్సు వరకు దూరంగా వుంచుతున్నారు. స్వంత భాషని చదవాలనే కోరికగాని కుతూహలంగానీ నేటి యువతకి లేదు అందులో వాళ్ళ తప్పుకంటే విద్యావిధానపు లోపాలు కారణమని చెప్పవచ్చును. అయితే ఉద్యోగాల్లో సెటిలయినతర్వాత మళ్ళీ భాషతో అభిమానం పెంచుకుని ఎక్కడికక్కడ తమ స్వంత వెబ్సైట్ లద్వారానో బ్లోగింగ్ ద్వారానో మూసుకున్న తలుపుల్ని తెరుస్తున్నారని చెప్పవచ్చును. ముప్పై అయిదు సంవత్సరాలు దాటిన తర్వాత కొందరు భాషని తిరిగి స్వంతం చేసుకుని తమతమ అస్థిత్వాలని సుస్థిర పరుచుకుంటున్నారు.

రెండో ప్రశ్న:

నిజంచెప్పాలంటే తెలుగుభాషకి ముందునుంఛి నెట్జెన్స్ తక్కువ. గృహిణులు, పత్రికల పాఠకులు నగరాలలో కంటే మద్యంతరమైన పట్టణాలలో, గ్రామాలలో వున్నారు. సాహిత్యం సృష్టింపబడేదిగూడా నెట్ సంస్కృతికి దూరంగా వుండే రచయితల వలననే. చాలమంది తెలుగురచయితలకి ఈమెయిల్ని మించి, ఒక్కొక్కసారి అదికూడా లేదు, తెలుసుకోవాలనే జిఙాస లేదు. వాళ్ళ ప్రపంచం వాళ్ళ పాఠకులు వాళ్ళకి వున్నారు. కాని రాయాలని ఆకాంక్షవున్న ఎంతోమందికి నెట్ ఒక ప్లాట్ఫామ్ ఇస్తోంది. పూర్తిగా వారైన పాఠకులు, చెదివేసంస్కృతి దీనివల్ల ప్రచారామవుతున్నాయి.

ఇది ఒకరకంగా మంచిదనే అనిపిస్తోంది. భాష సజీవంగా వుండటమేగాక తక్కిన ప్రపంచంతో ముందుకు నడుస్తోంది.

మూడో ప్రశ్న:

ఒక కొత్త సంస్కృతికి సాహిత్య అంశాలకి ద్వారాలు తెరుచుకుంటున్నాయి. కవితలు, కథలు. మిని కథలు మనంమర్చిపోయిన రచయితలు ఈ చర్చలద్వారా మళ్ళీ సజీవులవుతున్నారు. అయితే ఇందులోనుంచి బహుకాలంనిలచి వుండే సాహిత్యాన్ని గుర్తించి నెట్ అనే జాలంనుంచి పైకితీసి నిలబెట్టే మార్గాలని అన్వేషించాలి. ఎంతైనా చెయ్యటానికి అవకాశం వుంది. మన ఆంధ్రులు సాఫ్ట్వేర్ ఇంజనీరింగులో ఎంత ముందంజ వేశారంటే ఎన్నైనా ప్రాజక్ట్లని చేపట్టి పురాణ సాహిత్యాన్ని, నిలబడదగినదానిని, ఇప్పుడు అందుబాటులోలేని పుస్తకాలని మళ్ళీ ప్రచురించవచ్చు. నేట్ దీనికొక ఆసరా అవుతుంది.

ఇన్ని చెప్పాక ఒకవిషయం తప్పక చెప్పాలి. పుస్తకాన్ని పుస్తకంగా ఒళ్ళో పెట్టుకుని పడుకుని చెదవడలో వున్న ఆనందం నెట్ లో చదవడంలో లేదు.

email: s_kallury@hotmail.com s.kallury@gmail.com

syamala@hss.iitd.ac.in

Thursday, October 21, 2010

కొత్త తరం వస్తేనే అమెరికా తెలుగుకి కొత్త వెలుగు...విష్ణుభొట్ల లక్ష్మన్న!




1. అమెరికా వచ్చాక జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?

అమెరికా రావటం మాత్రమే కాకుండా "అమెరికా నా దేశం" అని విశ్వసించి ఇక్కడ జీవితం గడిపే అందరి తెలుగువారి జీవితాల్లో జీవితం పట్ల మార్పు వస్తుంది!
ప్రతి వ్యక్తికి కొత్తవి, గొప్పవి అయిన అనుభవాలు కలిగినప్పుడల్లా జీవితం పట్ల దృష్టి మారుతూనే ఉంటుంది. నా విషయంలో కూడా అంతే! అమెరికా రాక ముందు ఎనిమిదేళ్ళు ముంబాయిలో గడిపిన నా జీవితం కొన్ని మార్పులకు గురి కావటం ఒక అధ్యాయం అనుకుంటే అమెరికా జీవితం మరొక పెద్ద అధ్యాయం. అయితే మామూలుగా మనకి పరిచయమైన ఒక సమాజంలోని అనుభవాల వల్ల జీవితం పట్ల కలిగే మార్పుల కన్నా మరొక దేశం రావటం, పరిచయం లేని ఒక కొత్త సంస్కృతి పరిచయం కావటం వల్ల కలిగే అనుభవాలు తప్పకుండా జీవిత గమనాన్ని మారుస్తాయి. ఈ మార్పు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కోలా ఉండొచ్చు.
రచయితకి తన రచనల్లో ప్రేరణకి జీవితమే ముడి సరుకు అయినప్పుడు అమెరికా జీవితం ఎంతో పెద్ద ముడి సరుకు. ఇది అమెరికా పెద్ద దేశం, ఒక సూపర్ పవర్ కావటం వల్లనే కాదు. ఇక్కడి జీవితం ఎంతో వైవిధ్యమైనది. అనేక సంస్కృతుల కలబోత ఇక్కడి జీవితం. నిశిత దృష్టితో చూడగలిగే వారికి చెప్పాలనుకునే విశేషాలు ఎన్నో! అందరికీ తేలికగా కనపడే వస్తుపరమైన ఇక్కడి సమాజం వెనుక పైపైకి బులబులాగ్గా కనపడని జీవితం - అందుకు సంబంధించిన ఎన్నో మానవతా విలువలు ఈ సంస్కృతిలో దాగి ఉన్నాయి. ఒక తెలుగువాడిగా ఇతర తెలుగు వారితో మాత్రమే పరిచయాలు పెంచుకొని చూస్తే అమెరికా జీవితాన్ని విశాలంగా చూడలేము. అటువంటి విశాలమైన జీవితాన్ని చూడటం కోసం నేను ప్రత్యేకంగా కొన్ని ప్రయత్నాలు చేసాను. ఆ ప్రయత్నాల వల్లే జీవితం పట్ల నా దృష్టి మారిందని నేను అనుకుంటాను.

2. ఆ మార్పు మీ రచనల్లో ఎలా వ్యక్తం అయ్యింది? ఒకటి రెండు ఉదాహరణలు ఇవ్వగలరా?

మొదటి విషయం. నేను ఎక్కువగా రాసిన వ్యక్తిని కాదు. నా రచనలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఐతే గత పాతికేళ్ళుగా అమెరికాలో గడిపిన జీవితం వల్ల నా అనుభవాలు అమెరికన్ తెలుగు మిత్రుల అనుభవాల్లాగే వైవిధ్యం ఉన్నవి. అందుకు తోడు అమెరికా నుంచి మూడేళ్ళ కోసం వృత్తి రీత్యా కుటుంబంతో కలిసి ఫ్రాన్స్ బదిలీ అవటం వల్ల పాశ్చాత్య జీవితాన్ని కొంచెం లోతుగా చూసే అవకాశం వచ్చింది. అవి నా రచనల్లో ఒకటీ, రెండు చోట్ల అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం చేసాను.

మొదటి ఉదాహరణ: ఈ ఆలోచనలతో మిత్రులతో కలిసి పన్నెండేళ్ళ క్రితం ప్రారంభించిన ఈ-పత్రిక "ఈమాట". ఈ ఈ-పత్రిక ఒక ధ్యేయం అమెరికాలో తెలుగు రచయితలు ఇక్కడి జీవితంపై తమ అభిప్రాయాలను సాహిత్యపరంగా ఎలా ప్రకటిస్తారో తెలుసుకోవాలన్న తపన. ఈ విషయమై నేను స్వయంగా ఎక్కువ రచనలు చెయ్యకపోవచ్చు కాని, నా మిత్రులతో పాటు నా ఉత్సాహం మాత్రం ఈ దిశలోనే ఉండేది. ఉంది. అప్పుడప్పుడు నేను రాసిన కొన్ని ఈమాటలోని నా రచనలు ఈ అంశాన్ని స్పృశించాయనే అనుకొంటున్నా.

రెండవ ఉదాహరణ: "నా ఫ్రాన్స్ అనుభవాలు" అన్న పేరుతో కొంచెం విపులంగానే నా ఒక్క అనుభవాలే కాక నా భార్యా పిల్లలు కలిపి పొందిన అనుభవాలను అమెరికాలో ఒక వెబ్ పత్రికలో ప్రచురించారు. కొన్ని మార్పులతో అవే అనుభవాలను "ఆల్ప్స్ అంచున మూడేళ్ళు" అన్న పేరుతో ఆంధ్రాలో ఒక ప్రముఖ పత్రికలో ప్రచురించబడ్దది. ఇక్కడ ముఖ్యాంశం ఏమిటంటే అంధ్రదేశంలో పుట్టి పెరిగిన నా వంటి ఒక తెలుగువాడు ఇరవై సంవత్సరాలు అమెరికాలో జీవితం గడిపి ఫ్రాన్స్ లో ఉన్న జీవితాన్ని ఎలా చూస్తాడో తెలుగులో చెప్ప ప్రయత్నించాను. చిత్రమైన విషయం ఏమిటంటే అమెరికా జీవితపు మూలాలు నాకు నా ఫ్రాన్స్ జీవితంలో అనుభవం అవటం ఎక్కువైంది. ఇవి చదువుదామనుకున్న వారు ఈ లింక్ నొక్కండి.
(http://www.eemaata.com/em/issues/200709/1142.html?allinonepage=1).

3. ఇక్కడికి వచ్చాక మీరు చేసిన రచనలు మీరు ఆంధ్రాలో ఉండగా చేసిన రచనకి ఏ విధంగా భిన్నమైనవి?

నేను ఆంధ్రాలో ఉండగా ఏమీ రచనలు చెయ్యలేదు. కాకపోతే అక్కడ విసృతంగా పుస్తకాలు చదివేవాడిని. ఇతరులతో చర్చించేవాడిని. నిజానికి అమెరికా వచ్చాకే తెలుగులో రాయాలని (వేరే భాషలు, సంస్కృతుల పరిచయాలు కలిగినప్పుడు వారు తమ తమ భాషలను, సంస్కృతులను నిలుపుకోటానికి చేసే ప్రయత్నాలు నాకు ఈ దిశగా ప్రేరకాలు) బలమైన కోరిక మొదలైంది.
23 ఏళ్ళ వయస్సులో ఆంధ్రదేశాన్ని వదలటం జరిగింది. అప్పటి దాకా చదువులు, పరీక్షలతోనే కాలం సరిపోయింది. సాహిత్యం పట్ల మక్కువ ఉన్నా రచనా వ్యాసాంగాన్ని మాత్రం మొదలెట్టలేదు. అసలు తెలుగులో రాయాలని అప్పట్లో నాకు అనిపించలేదు. తెలుగు భాష విలువ కూడా అప్పటి వరకు అందరి కుర్రకారు లాగే నాకూ తెలియ లేదు.

4. అమెరికాలో ఉన్న తెలుగు రచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలేమిటి?

అమెరికా జీవితాన్ని తెలుపుతూ వచ్చే రచనలు చెయ్యాలని ఒక పెద్ద తాపత్రయం. అందుకు ఒక ముఖ్య కారణం ఇప్పటి వరకూ ఈ విషయంలొ చెప్పుకో తగ్గ రచనలు రాసిలోనూ వాసిలోనూ రాలేదనే చెప్పాలి. అలా అని ఈ దిశగా పెద్ద ప్రయత్నాలు జరగలేదని కాదు. అయినా తగినంతగా అమెరికా తెలుగు సాహిత్యం పెరగలేదనే చెప్పాలి. అంతో, ఇంతో రాయగలిగిన వ్యక్తులు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఎక్కువగా యువ రచయితలు, రచయిత్రులు కనపట్టం లేదు. ఎప్పుడైనా సాహితీ సదస్సులకి వెడితే కనపడేవి తెలిసిన ఈ కొన్ని మొహాలు మాత్రమే!

అసలు ప్రశ్న! అమెరికా తెలుగు రచయిత ఎవరు? అమెరికాలో ఉండి ఏ విషయం మీద అయినా తెలుగులో రచనలు చేసేవారు అని అర్ధం చెప్పుకుంటే భవిష్యత్తు గురించి నా అలోచనలు ఇలా
ఉన్నాయి. అమెరికాలో తెలుగులో రచనలు చేస్తున్నవారు రెండు రకాలు. చాలా కాలం క్రితమే, అంటే
దాదాపు పదేళ్ళ క్రితమే, అమెరికా వలస వచ్చి కుటుంబంగా ఇక్కడ స్థిరపడిన తెలుగు
రచయితలు చాలా కాలంగా తెలుగులో రచనలు చేస్తున్నారు. వీరి సంఖ్య ఎక్కువ లేకపోయినా (నా
ఉద్దేశ్యంలో వీరి సంఖ్య 30, 40 కి మించదు) క్రమం తప్పకుండా వీరి రచనలు ఈ-పత్రికలు,
బ్లాగులు మాత్రమే కాక అచ్చు మాధ్యమంలో ప్రచురించబడే సావనీర్లు, అమెరికా తెలుగు
సాంస్కృతిక సంఘాల ప్రచురణల్లో కనపడతాయి. ఇక రెండో వర్గం కొత్తగా వలస వచ్చిన,
వస్తున్న యువతరం. వీరిలో కొన్ని పేర్లు నాకు పరిచయమైనా వీరి సంఖ్య ఎక్కువగా
ఉన్నట్టు తోచదు. నిజానికి అమెరికా తెలుగు రచయితల భవిష్యత్తు నిర్ణయించేది ఈ 20, 30
సంవత్సరాల వయస్సులో ఉన్న ఈ యువతరం మాత్రమే. వీరి ఆలోచనలు పాతతరం కన్న కొత్తగా
ఉండటమే కాకుండా పాతతరం అలవాటు పడ్డ ధోరణి మూసలోంచి బయటకు లాగగలిగే శక్తి
ఉన్నది ఈ యువతరానికి. వ్యక్తిగా, ఒక తెలుగు రచయితగా ఈ యువతని ప్రోత్సాహపరిస్తే భవిష్యత్తు బాగుంటుంది అని తోస్తుంది నాకు.
మరి ఇది సాధించటం ఎలా? సాహిత్య సభల వల్ల, సత్కారాల వల్ల ఇది సాధ్యం అవుతుందని నేను అనుకోను. అలాగే ఈ-పత్రికలు, బ్లాగులు మొదలైన అంతర్జాల మాధ్యమాలు ఇందుకు సాయపడచ్చేమో గాని ఈ విషయంలో దిశానిర్ధారణ చేయ్యగలవని నేను అనుకోను. ఈ విషయంలో మిత్రుల ఆలోచనలు, సూచనలు తెలుసుకోటం మంచిది.

Sunday, October 10, 2010

సైన్సుకీ మనసుకీ మధ్య లోలకం లక్ష్మన్న!

ఈ గురువారం విష్ణుభొట్ల లక్ష్మన్న 'ప్రముఖా"ముఖి

పూర్తిపేరు: విష్ణుభొట్ల లక్ష్మన్న
ఇతరపేర్లు: లక్కీ విష్ణుభొట్ల
సొంత ఊరు: సరిపెల్ల గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా
ప్రస్తుత నివాసం: 1013 Ogden Drive, ఆష్టిన్, టెక్సాస్ - 78733, USA
వృత్తి: రిసెర్చ్ సైంటిష్ట్
ఇష్టమైన రచయితలు: శ్రీపాద, కొ.కు., కాళీపట్నం, రావి. శాస్త్రి, విశ్వనాథ
హాబీలు: శాస్త్రీయ - లలిత సంగీతం, నాటకాలు వేయడం, టెన్నిస్ ఆడటం, తోటపని, పుస్తక పఠనం
E-mail: Lark_Vishnubhotla@yahoo.com


సాహిత్య, కళా విమర్శకులు సైంటిస్టుల్లా పని చేయాలని అనుకుంటాను నేను. సాహిత్య కళా విమర్శని వొక బాధ్యతగా తీసుకొని,రచనని మనః ప్రయోగశాలలో అనేక విధాలుగా పరీక్షించి, ఒక హేతుబద్ధమయిన బేరీజు వెయ్యాల్సిన అవసరం ఇప్పుడు వుంది. సరయిన సాధనాలలో నేర్పు సాధించుకొని, తగిన అవగాహన తో రచనని "లోనారసి" చూడడం వొక విద్య. ఇతర రంగాలలో - ముఖ్యంగా సైన్సు రంగాలలో- పనిచేస్తున్న వారు సాహిత్యం గురించో, సినిమాల గురించో, కళల గురించో రాస్తే అందులో ఒక నిర్దిష్టతా, కచ్చితత్వం, సూటి దనం, స్పష్టతా కనిపిస్తాయి. విష్ణు భొట్ల లక్ష్మన్న గారు అలాంటి ప్రయత్నం చేస్తున్నారు.

వృత్తి రీత్యా ఆయన సెమీకండక్టర్స్‌ లో పరిశోధనా విభాగంలో, ఆష్టిన్‌లో ఉన్న "ఫ్రీస్కేల్ సెమీకండక్టర్స్" లో ప్రస్తుతం పని చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని "సరిపెల్ల" గ్రామంలో కవలల్లో (రామన్న – లక్ష్మన్న) ఒకరుగా జన్మించారు. ప్రాథమిక విద్య, కొంత వరకు కాలేజీ చదువు ఆంధ్రాలోనే చేసారు. తరవాత, ఐ. ఐ. టి. ముంబైలో ఇంజినీరింగ్ చదువు పూర్తి అయిన తరువాత, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ లో భౌతికశాస్త్రంలో పి. హెచ్. డి పూర్తి చేసారు.

రిసెర్చ్‌ లో చాలా ఇష్టం ఉన్న లక్ష్మన్నగారి అమెరికా జీవితం యేల్ విశ్వవిద్యాలయంలో రిసెర్చ్ సైంటిష్టుగా 1988 సంవత్సరంలో మొదలయ్యింది. సెమీకండక్టర్ పరిశ్రమలో పనిచేయటానికి 1994 సంవత్సరంలో డాలాస్ రావటం, అక్కడ తెలుగు సంఘంలో చేరి 1998 సంవత్సరంలో డాలాస్ వదిలి ఆష్టిన్ వెళ్ళేదాకా చురుగ్గా తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు.

ఆష్టిన్ వెళ్ళిన తరవాత తెలుగు సాహిత్యంపై ఇష్టం, పరిచయం ఉన్న మిత్రులతో కలిసి "ఈమాట" అన్న పేరుతో ఒక వెబ్ మాగజైన్ ప్రారంభించారు. ఇప్పటికీ "ఈమాట" కోసం రచనలు చేస్తూనే ఉన్నారు. 2002 సంవత్సరంలో అప్పటి మోటొరోలా కంపెనీలో పనిచేస్తూ, అత్యాధునిక సెమీకండక్టర్ చిప్స్ తయారీకి కావలసిన పరిశోధన కోసం ఫ్రాన్స్‌ లో మూడేళ్ళు పనిచేసే అవకాశం వచ్చింది. ఆ అనుభవాలు ఎప్పటికీ మర్చిపోలేనివి.

అంతో ఇంతో రాయటం వచ్చిన ప్రవాసాంధ్రులు అందరూ తప్పకుండా రాయాలని వీరి అభిప్రాయం.


విష్ణుభొట్ల లక్ష్మన్న రచనల సూచిక:

1. ఓడలో ఏడు రోజుల కార్నివల్, ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 20 - 2009, ఆదివారం అనుబంధం http://www.andhrajy othy.com/ sunday/sundaysho w.asp?qry= 2009/20-9/ travel
2. గుర్రం జాషువా పాపాయి పద్యాలు, ఈమాట, సెప్టెంబర్ 2009 http://www.eemaata.com/em/issues/200909/1464.html
3. హాయి హాయిగా ఆమని సాగే, ఈమాట, జూలై 2009
http://www.eemaata.com/em/issues/200907/1441.html

4. ‘అపు సంసార్ ‘ - సత్యజిత్ రాయ్ సినిమా మార్చి 2009 » వ్యాసాలు http://www.eemaata.com/em/issues/200903/1411.html?allinonepage=1
5. ‘అపరాజితో’ - సత్యజిత్ రాయ్ సినిమా జనవరి 2009 » వ్యాసాలు
http://www.eemaata.com/em/issues/200901/1390.html?allinonepage=1

6. రహదారి పాట - “పథేర్ పాంచాలి” సత్యజిత్ రాయ్ సినిమా "ఈమాట" నవంబర్ 2008 » వ్యాసాలు
7. ఒంటరి గృహిణి - “చారులత” సత్యజిత్ రాయ్ సినిమా "ఈమాట" మే 2008 » వ్యాసాలు
8. ఏది నిజం? - “రషోమాన్” జాపనీస్ సినిమా "ఈమాట" మార్చి 2008 » వ్యాసాలు
9. ఎందుకు రాయాలో అందుకే చదవాలి "ఈమాట" జనవరి 2008 » వ్యాసాలు
10. రొసెట్టా రాయి కథ - వెలుగులోకి వచ్చిన మరుగున పడ్డ ఒక పురాతన భాష
"ఈమాట" నవంబర్ 2007 » వ్యాసాలు
11. మా ఫ్రాన్స్ అనుభవాలు "ఈమాట" సెప్టెంబర్ 2007 » వ్యాసాలు
12. మా ఈజిప్ట్ యాత్ర "ఈమాట" జూలై 2006 » వ్యాసాలు
13. కథాశిల్పం "ఈమాట" మార్చి 2006 » వ్యాసాలు
14. తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? "ఈమాట" జూలై 2001 » వ్యాసాలు
15. రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి "ఈమాట" మే 2001 » వ్యాసాలు
16. మీ ఘంటసాల "ఈమాట" మే 2001 » సమీక్షలు
17. రాగలహరి: హిందోళం "ఈమాట" మార్చి 2001 » వ్యాసాలు
18. రాగలహరి: కల్యాణి "ఈమాట" జనవరి 2001 » వ్యాసాలు
19. తానాలో వేటూరి సుందరరామమూర్తి ప్రసంగం కొన్ని విషయాలు "ఈమాట" నవంబర్ 2000 » వ్యాసాలు
20. రాగలహరి: సింధుభైరవి "ఈమాట" నవంబర్ 2000 » వ్యాసాలు
21. రాగలహరి: అభేరి "ఈమాట" జూలై 2000 » వ్యాసాలు
22. రాగలహరి: మోహనం "ఈమాట" మే 2000 » వ్యాసాలు
23. ( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి "ఈమాట" నవంబర్ 1999 » వ్యాసాలు
24. ఘంటసాల - బాలసుబ్రహ్మణ్యం "ఈమాట" నవంబర్ 1999 » వ్యాసాలు
25. ఆల్ప్స్ అంచున మూడేళ్ళు, "ఆంధ్రజ్యోతి", ఆదివారం అనుబంధం, అక్టోబర్ 14, 2007
26. రొసెట్టారాయి - చచ్చి బతికిన ఓ రాయి కథ, "ఆంధ్రజ్యోతి", ఆదివారం అనుబంధం, డిసెంబర్ 23, 2007

Thursday, October 7, 2010

అమెరికా తెలుగుదనం నేర్పిన పాఠాలే నా రచనలు: "కొత్త పాళీ" నారాయణస్వామి




“అమెరికా వచ్చాకే నాకు ఇండియా అర్ధమయింది” అంటారు ఏకె రామానుజన్ వొక సందర్భంలో! చిత్రకారుడు చిత్ర రచన చేస్తున్నప్పుడు వొక దృశ్యం గీశాక, వొకడుగు వెనక్కి వేసి సాలోచనగా తన బొమ్మ వైపు పరికిస్తాడు. వొక దూరాన్ని వూహించుకొని తనని తాను “ఆబ్జెక్టివ్” గా చూసుకుంటాడు. రామానుజన్ చేబ్తోంది కూడా అదే! ఎంతో కొంత దూరం అయితే తప్ప/ దేనికీ దగ్గిర కాలేమని నేను వొక కవితలో రాసినట్టు గుర్తు. ఆ దూరం అనుభవంలోకి వచ్చి కలం పట్టిన రచయిత నారాయణ స్వామి. “రంగుటద్దాల కిటికీ” ఆయన తాజా పుస్తకమే కావచ్చు, కానీ, రచయితగా నారాయణస్వామి అనేక సంవత్సరాలుగా పాఠకులకి సుపరిచితులే. “తుపాకి” నారాయణస్వామి గా కూడా ఆయన ప్రసిద్ధుడు. రాత కన్నా ఎక్కువ చదువు, చదువు కన్నా ఎక్కువ పరిశీలనా, పరిశీలన కన్నా ఎక్కువ అవగాహనా, అవగాహన కన్నా ఎక్కువ చురుకుదనమూ ...అన్నీ వెరసి నారాయణ స్వామి! మిత్రులకి “నాసి”, బ్లాగ్మిత్రులకి “కొత్త పాళీ”, సాహిత్య మిత్రులకి నారాయణ స్వామి..ఏ పేరున పిలిచినా అది వొక్కటే రూపం! నచ్చినా నచ్చకపోయినా వెంటనే స్పందించే సహృదయం...నిరాశలో ఆశనీ, దురాశలో దుఖాన్నీ తలపించే స్నేహం...బతుకు తీపీ, కష్టాల వగరూ, ఆలోచన విగరూ ... అన్నిటికీ మధ్య వొక సమతూకాన్నీ సాధించాలన్న తపన నారాయణస్వామి! సంగీత సాహిత్య నృత్య సమలంకృత ప్రతిభ.... ఆయన సొంతం! ఇటీవల “పాలపిట్ట” మాసపత్రికలో “ఆవలి తీరం” శీర్షిక కింద అమెరికా తెలుగు అనుభవాలని రికార్డు చేస్తున్న రన్నింగ్ కామెంటేటర్ ఆయన.




1. అమెరికా వచ్చాక జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?
కచ్చితంగా. అసలు నాకంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పడినదే అమెరికా వచ్చినాక అనుకుంటాను. వరంగల్లో కాలేజి చదువుమూలంగా నా ఆలోచనలకి కొంత ఎరుపు రంగు అంటుకుంది. సాహిత్యం వల్ల కేవలం వినోదమేకాక, అంతకు మించిన ప్రయోజనం కూడా ఉంటుంది అనే ఆలోచన పరిచయమయింది. కానీ విస్తృతంగా చదవడం మొదలు పెట్టింది అమెరికా వచ్చినాకనే. ఆ లెక్కన, ఆంగ్ల సాహిత్యాన్నీ, ప్రపంచ సాహిత్యాన్నీ, తెలుగు సాహిత్యాన్నీ ఒక్కమాటే చదివాను నేను. సాహిత్యంలో ప్రపంచాన్ని చూడ్డం, ప్రపంచంలో సాహిత్యపు ముద్రలు చూడ్డం అమెరికా జీవితంలోనే అలవాటయింది నాకు. అమెరికా వచ్చేదాకా అసలు నాకు జీవితంపట్ల ఒక అవగాహన కానీ ఒక దృక్పథంగానీ ఏర్పడిన గుర్తులేదు. ఈ విషయంలో అమెరికా ఏదో పెద్ద దోహదం చేసిందని కాదు నా ఉద్దేశం. కొత్త దేశంలో కొత్తతరహా జీవితం మొదలయేప్పటికి కొన్ని కొన్ని అనుభవాలు, తద్వారా నేర్చుకున్న గుణపాఠాలు తప్పనిసరి. అటుపైన, విశ్వవిద్యాలయ వాతావరణంలో, liberal intellectualsతో ప్రపంచవ్యాప్తంగా అనుభవాలు గడించినవారితో సుదీర్ఘ స్నేహాలు నా ఆలోచనా పరిధిని చాలా విస్తృతం చేశాయి.

2. ఆ మార్పు మీ రచనల్లో ఎలా వ్యక్తమయింది? వొకటి రెండు వుదాహరణలు ఇవ్వగలరా?
తుపాకి, ఇండియన్ వేల్యూస్, వీరిగాడి వలస, లోకస్ట్వాక్ కార్నర్లో - ఈ నాలుగు కథల్లో అమెరికను ఇమిగ్రంటు జీవితాల్లోని నాలుగు విభిన్న కోణాల్ని చిత్రించగలిగానని అనుకూంటున్నాను. నా కథల్ని గురించి విడిగా మాట్లాడ్డం, రాయడం నాకు ఇష్టం ఉండదు. చెప్పాల్సిన విషయమేదో కథలోనే ఉంది అని నా ఉద్దేశం. మనల్ని మనం సాధారణంగా ఏదో ఒక పరిధిలో నిర్వచించుకుంటూ ఉంటాం. మనిషి తనని కట్టిపడేసి ఉంచే పరిధుల్ని అధిగమించాలని ఒక రచయితగా నా ఆశ. అమెరికాలో జరిగినట్టు రాసిన నా కథల్లో ఇటువంటి పురోగమనాన్ని చిత్రించడానికి ప్రయత్నించాను. వీరిగాడి వలస కథలో ప్రధానపాత్ర రాఘవరావు సుమారు అరవయ్యేళ్ళ వాడు, రిటైరైనాడు, భార్య మరణించింది, అమెరికాలో కొడుకూ కోడలు దగ్గర వచ్చి ఉన్నాడు. ఆయన ఆలోచనలు కానీ, తీరుతెన్నులు కానీ సాధారణ భారతీయ తండ్రుల్లా ఉండవు. ఈ మధ్య రాసిన నీవేనా ననుతలచినది కథలో సహాయపాత్రగా ఉన్న మాధవి - కథానాయకుడు తేజా తల్లి - ఈమెకూడా విలక్షణమైన పాత్ర. సాధారణంగా అమెరికను భారతీయకథల్లో కనిపించే భారతీయ తల్లిలా ఉండదు. ఇలా, కథల్లో పాత్రలూ ఇతివృత్తాలూ భారతీయమే అయినా, కొన్ని కోణాల్లో ఆ పరిధినిదాటిన ఒక ఔన్నత్యాన్ని చిత్రించేందుకు ప్రయత్నిస్తున్నాను.

3. ఇక్కడికి వచ్చాక మీరు చేసిన రచనలు ఆంధ్రాలో వుండగా చేసిన రచనాలకి ఏ విధంగా భిన్నమయినవి?
అమెరికా రాకముందు నేను రచనలు చెయ్యలేదు. అసలు అమెరికా రాకపోతే రాయాలి అనే ఆలోచన నాకు బలంగా తోచి ఉండకపోవచ్చు. అంటే అదేదో అమెరికా గొప్పతనం కాదు, మాతృభూమిని, సుపరిచితమైన భాషనీ సంస్కృతినీ వదిలి వచ్చిన ఒక వలస ఫీలింగ్. ఆంధ్ర వదిలి కాన్పూరులో ఉండగా మొదటిసారి ఈ రచన తృష్ణ కలిగింది. అమెరికా వచ్చాక అది కచ్చితంగా తీరనిదాహంగా పరిణమించింది.

4. అమెరికా వచ్చాక మీ మొదటి రచన ఏది? దాని నేపధ్యం కొంచెం చెప్పండి.
నేను రాసిన మొదటి కథ "ఓరి భగవంతుడా" - ఇది అమెరికా వచ్చినాక రాసినదే. కానీ ఇందులో అమెరికా నేపథ్యం ఏమీలేదు. ఈ కథ ఇండియాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జరుగుతుంది. కొకు కథల మత్తులో, ముఖ్యంగా ప్రేమించిన మనిషి అనే పెద్ద కథ చదివిన మత్తులో రాశాను దీన్ని. ఒక మధ్యతరగతి యువకుడు (పదహారు పదిహేడేళ్ళ వాడు) తనని ఆకర్షించిన ఇద్దరు అమ్మాయిల పట్ల - ఒకామె తన ఆర్ధిక స్థాయికి చెందిన పొరుగింటి వారమ్మాయి, రెండో ఆమె తన ఇంట్లో పని మనిషి - విభిన్నంగా ఎట్లా ప్రవర్తిస్తాడు అనే ప్రశ్న ఈ కథకి కీలకం. పరుగుపందెంలో పాల్గొనబోయే ముందు కండరాల్ని సాగదీసుకున్నట్టు, నా రచనాశక్తిని సాగదీసుకోడానికి ఈ కథ రాశానని అనుకోవచ్చు.
నే రాసిన రెండో కథ తుపాకి. దాన్ని గురించి ఇప్పటికే చాలా మాట్లాడుకున్నాం.


5. డయాస్పోరా సాహిత్యాన్ని గురించి మీరు ఏమనుకుంటున్నారు? తెలుగు డయాస్పోరా సాహిత్యం అంటూ వుందనుకుంటున్నారా?
ఇది ఒక్క పేరాలో ఇమిడే ప్రశ్న కాదు. కానీ అడిగినందుకు నెనర్లు. దీనికి ఇంకా విపులంగా సమాధానమివ్వాలని ఉంది. రాస్తాను త్వరలో. టూకీగా కొన్ని మాటలు: తెలుగు వల్సవారు రాసినదంతా డయాస్పోరా సాహిత్యమే. కాదని ఎవరూ అనలేరు. అందులో కొన్ని విషయాలే ఎక్కువగా ఉన్నాయి, మిగతా విషయాలు లేవూ అంటే - అంతే మరి, మన వలసవారికి ఆ విషయాలే ఇప్పటికీ ఇంకా ముఖ్యమైన విషయాల్లాగా కనిపిస్తున్నాయి అన్న మాట - మాతృదేశాన్ని గురించి నాస్టాల్జియా, నివాసం ఉన్న దేశ సంస్కృతిని గురించి కొంచెం ఎగతాళి, లేదా ఇదే గొప్పది అనుకునే ఒక అభిమానం, పిల్లల పెంపకం, పెళ్ళిళ్ళు, రెండు సంస్కృతుల భేదాలు - ఇంకా ఇల్లాంటివి .. ప్రస్తుతానికి ఇంకా ఇవే మనవారికి ఇంపార్టెంట్ ప్రశ్నలు, ఇతివృత్తాలు. అందుకే అవే మన సాహిత్యాన్ని నింపుతున్నాయి. ఈ విషయాలకి పరిమితమైనందువల్ల మనవాళ్ళు రాస్తున్నది డయాస్పోరా సాహిత్యం కాదు అనే వాదనకి అర్ధం లేదు. ఈ సాహిత్యం కొత్త పుంతలు తొక్కాలి అంటే వలస సామాజిక స్పృహలో కొత్త ప్రశ్నలు ఉదయించాలి, దానికి కొత్త అనుభవాలు రావాలి - ఉదా. ఒక తెలుగు కుటుంబపు అబ్బాయి ఇరాకులోనో ఆఫ్ఘనిస్తానులోనో సైనికుడిగా పనిచేస్తే? తమాషాగా, ఈ విషయంలో నిజజీవిత అనుభవాలకంటే సాహిత్యం వెనకబడి ఉన్నదని నా అనుమానం.

6. అమెరికాలో వున్న తెలుగు రచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలు ఏమిటి?
అమెరికను - ఇండియను అనే లేబుల్సుని అధిగమించి ఒక విశ్వమానవుడి ప్రతీకతో రచనలు చెయ్యాలని ఆశ. దానికి ముందు ఇప్పుడు ఇక్కడ అమెరికాలో భారతీయ వలససమాజం ఎలా మసలుతున్నదో అని విపరీతమైన ఆసక్తి. దాన్ని కొంతవరకైనా నా రచనలో పట్టుకోవాలని పట్టుదల.

Wednesday, September 29, 2010

అమెరికా తెలుగు సాహిత్యం: ప్రముఖుల అభిప్రాయాలు

అమెరికా తెలుగు సాహిత్యం పైన చర్చ ప్రారంభించడానికి నాందిగా రేపు ఈ శీర్షిక మొదలవుతుంది. ఈ ముఖాముఖీ కోసం రచయితలనీ అడుగుతున్న ప్రశ్నలు ప్రస్తుతానికి ఇవి నాలుగు మాత్రమే. కొన్ని సమాధానాలు ఇప్పటికే నాకు చేరాయి. ఇంకా కొందరి సమాధానాల కోసం ఎదురుచూస్తున్నాను. కానీ, కొంత మంది రచయితలనీ, కవులనీ నేను మరచిపోయి వుండ వచ్చు అన్న నమ్మకంతో కూడిన అపనమ్మకం వల్ల ఇలా బ్లాగోన్ముఖంగా కూడా ఈ-లేఖ రాస్తున్నాను. ఇదే మీకు వ్యక్తిగత లేఖగా భావించి, ఎలాంటి మొహమాటం లేకుండా మీ సమాధానాలు పంపండి. మీ సమాధానాలని వొక డాకుమెంటు గా నాకు పంపే ఈమైల్ లో జత చేస్తే చాలు. నా ఈమెయిలు: afsartelugu@gmail.com
కేవలం నాలుగు ప్రశ్నలు మాత్రమే నేను అడుగుతున్నాను. మీ వీలు వెంబడి సమాధానాలు ఇవ్వండి.
1. అమెరికా వచ్చాక జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?
2. ఆ మార్పు మీ రచనల్లో ఎలా వ్యక్తమయింది? వొకటి రెండు వుదాహరణలు ఇవ్వగలరా?
3. ఇక్కడికి వచ్చాక మీరు చేసిన రచనలు ఆంధ్రాలో వుండగా చేసిన రచనాలకి ఏ విధంగా భిన్నమయినవి?
4. అమెరికాలో వున్న తెలుగు రచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలు ఏమిటి?




ఈ వారం ముఖాముఖీ: నిడదవోలు మాలతి (రేపు "అక్షరం"లో చూడండి)

Monday, September 27, 2010

పన్నెండేళ్ళ క్రితం...ఒక ఈ-లేఖ నుంచి...!

అమెరికా తెలుగు సాహిత్యం మీద ఈ చర్చ పట్ల ఇటు అమెరికా తెలుగు వాళ్ళే కాక, అటు ఆంధ్రా (ఆంధ్రా అంటే, ఆంధ్రా, తెలంగాణా, సీమ) నించి కూడా అనేక మంది ఆసక్తి చూపిస్తూ ఈ-లేఖలు రాస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు.

ఈ చర్చకి తగిన ఆధార భూమికని ఏర్పరచడానికి వీలుగా ఇదివరకు జరిగిన చర్చల నించి కొన్ని భాగాలని అందించాలని అనుకున్నాను.

అందులో భాగంగా విష్ణుభొట్ల లక్ష్మన్న గారు ఒక చాట్ గ్రూప్ లో రాసిన ఈ ఈ-లేఖని పునప్రచురిస్తున్నాను.




namastE: June 12, 1998

I have not posted to this news group for a while but I have been following the
news of this group for a long time.

Following the tremendous interest a lot of us have shown on Telugu Sahityam in
the recent past, I would like to share these comments with you all.

Though there are a number of knowledgeable people with good writing skills there
seems to be fewer people attempting to write in Telugu in general. Even fewer
among those who are writing are doing sobecause they want to JUST write. I
sincerely feel that it is time that we refocus on the contemporary or relevant
issues that Telugus face in the USA and put them succinctly in an accepted
literary form (kadha, kavita, etc.). And we should also strive to bring a higher
quality in these writings.

Honestly, I have read many Telugu stories originated in this country in the last
few years, but I can count only a few that I remember today as good. I have
always felt that a good literary piece of work would withstand the test of TIME
and people will remember it for a longtime no matter where and who produced it.
I do think that it will take our telugu sahitya community some more time to
achieve a higher quality of literary work. However, the efforts of a number of
writers in this direction are applaudable. And they should also be challenged to
produce better literary works.

If we ask ourselves the simple question, "How can one produce good literary
work?", I have the following to say.

Besides the writer being a competent person, he/she SHOULD

(1) have access to good literature (Classics etc.)

(2) have knowledgeable critic friends who are not afraid to criticize the works
(not the person) and help the writer produce better sahityam, and

(3) enjoy a good & sizable readership.

Unfortunately, our community lacks in the first two areas. I was surprised to
find that most of the literary people I know have read very few classic books.
Similarly, they feel uncomfortable to receive criticism that is not in praise of
their work. However, I feel that there are a large number of literally oriented
people for the readership.

I would like to continue on this later.


Best wishes,

/Lakshmanna Vishnubhotla

Sunday, September 26, 2010

అమెరికా తెలుగు సాహిత్యం - కొత్త శీర్షిక గురించి...

ఆంధ్రా తెలుగు సాహిత్యం, అమెరికా తెలుగు సాహిత్యం అన్న పదాలు వినడానికి అంత బాగుండక పోవచ్చు కానీ, ఇప్పుడు అమెరికాలో పెరుగుతున్న తెలుగు సాహిత్య సందడిని గమనిస్తే ఇవి నిజమే కదా అనిపిస్తుంది. నిజానికి గత అరవై ఏళ్ల పైబడి అమెరికాలో తెలుగు రచయితలు ఏదో వొకటి రాస్తూనే వున్నారు. కథలూ, కాకరకాయలూ, వ్యాసాలూ కొత్త కాదు. కానీ, గత అయిదారేళ్లుగా గమనిస్తే ఈ ఉరవడి పెరిగినట్టు స్పష్టమయిన ఆధారాలే కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు ఆంధ్ర దేశపు తెలుగు పత్రికలలో అమెరికా తెలుగు రచయితల రచనలు ఎంత వెతికినా కనిపించేవి కావు, అవి ఎంత సేపటికీ ఏ తానా, ఆటా సావనీరుకో పరిమితమయ్యేవి. ఇప్పుడు అలా కాదు. అమెరికా తెలుగు రచయితల రచనలు చెప్పుకోదగిన స్థాయిలో కనిపిస్తున్నాయి. ప్రచురణ రంగంలో అమెరికా తెలుగు రచయితలు ఉత్సాహంగా కనిపిస్తున్నారు.


ఇక అమెరికాలోని కొన్ని పట్టణాల్లో ఎక్కడ తెలుగు సాహిత్య సభ జరిగినా కనీసం వంద మందికి తక్కువ కాకుండా హాజరవుతున్నారు. తానా, ఆటాలు నిర్వహించే సాహిత్య సభలతో పాటు, స్థానికంగా అనేక సాహిత్య సంఘాలు ఏర్పడి చురుకుగా పనిచేస్తున్నాయి. ఇవి కనీసం నెలకి వొక సభ అయినా ఠంచన్ గా నిర్వహిస్తున్నాయి. పైగా, ఈ సాహిత్య సభల్లో నలభై యేళ్ళ లోపు వాళ్ళు ఎక్కువగానే కనిపిస్తున్నారు.


ఇక అదనంగా, అమెరికాలోని వివిధ యూనివర్శిటీలలో తెలుగు అంశాల మీద పరిశోధన చేస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. కొన్ని యూనివర్శిటీలలో తెలుగు కోర్సులకి ఆదరణ కూడా పెరుగుతోంది. ఒక్క టెక్సాస్ యూనివర్సిటీలోనే ఏడాదికి 30 మంది విద్యార్థులు ఈ కోర్సుల నించి గ్రాడ్యుయేట్ అవుతున్నారు. మిగిలిన యూనివర్సిటీలు కూడా తెలుగు మీద ఆసక్తి చూపిస్తున్నాయి. తెలుగు సాహిత్యం మీదనే కాకుండా, ఇతర సాంస్కృతిక అంశాల మీద మన వాళ్ళకే కాకుండా, అమెరికన్ విద్యార్ధులకి ఆసక్తి పెరుగుతోంది.


అంతర్జాలంలో తెలుగు హడావుడి చెప్పనే అక్కరలేదు. అంతర్జాల పత్రికలూ, బ్లాగులూ రోజూ కొన్ని వందల పేజీల్ని ఉత్పత్తి చేస్తున్నాయి. గతంలో సాహిత్యేతర అంశాలకే పరిమితమయిన అంతర్జాలం ఇప్పుడు సాహిత్య అంశాల మీద కూడా దృష్టి పెడుతోంది. ఈ-పత్రికలకి పోటీగా బ్లాగర్లు సాహిత్య సృష్టి చేస్తున్నారు.


ఇది ఒక రకంగా అమెరికా తెలుగు సాహిత్యం ఒక రూపం దాల్చే వాతావరణం. ఒక అభిరుచిని తీర్చి దిద్దుకునే దశ. కొత్త తరం రచయితలు కొత్త ఇతివృత్తాల వైపు మళ్లి, సాహిత్యాన్ని మార్చగలిగిన సన్నివేశం.


ఈ దశలో అమెరికా రచయితలు కొంత ఆత్మ విమర్శ కూడా చేసుకోవాలి. మారుతున్న పాఠక లోకాన్ని అవగాహన చేసుకోవాలి. అలాగే, అంతర్జాలం, అమెరికా జీవితమూ తమ సాహిత్య అభిరుచిని ఏ దిశగా తీసుకువెళ్తున్నాయో ఆలోచించుకోవాల్సిన బాధ్యత పాఠకులది కూడా.

అటు రచయితల, ఇటు పాఠకుల మధ్య వంతెన కట్టే శీర్షిక : అమెరికా తెలుగు సాహిత్యం.

ఈ శీర్షికకి ప్రసిద్ధ రచయితలే కాదు, ఇప్పుడే పుస్తకం పట్టి పాఠకులుగా మారుతున్న వారు కూడా రాయవచ్చు.
మీరు చదివిన రచన గురించో, మీరు కలిసిన రచయిత గురించో, మీరు హాజరయిన సాహిత్య సభ గురించో, మీలో కలుగుతున్న కొత్త సాహిత్య స్పందనల్ని గురించో ఏమయినా మీరు రాయవచ్చు. ఫలానాది రాయాలి, ఫలానా రాయకూడదు అన్న నిబంధన లేదు, పెద్ద రచయితలే రాయాలి అన్న నియమం అసలు లేదు. మీ రచనలు నా ఈమైలు కి పంపండి. afsartelugu@gmail.com


ప్రతి నెలా ప్రసిద్ధ అమెరికా రచయితల ముఖాముఖీ మాత్రం ఈ శీర్షికలో తప్పక వుంటుంది. వచ్చే శనివారం ప్రసిద్ధ రచయిత్రి నిడదవోలు మాలతి గారి ముఖాముఖితో ఈ శీర్షిక మొదలవుతుంది.

పూర్తి కాని వాక్యాలు

ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (జులై 6) లో అచ్చయిన కొత్త కథ-   1           మ రీ పెద్ద విలాసాలేమీ కోరుకోలేదు సబీనా. అన్నీ చిన్నచిన్న కోరికలే!   ...