జీవితం అర్ధమయ్యింది ఇక్కడే : పూడిపెద్ది శేషు శర్మ

1. అమెరికా వచ్చాక జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?

అమెరికా వచ్చాకే నాకు జీవితం అంటే ఏమిటో తెలిసింది. అమెరికా భాషలో "టీనేజ్ వయస్సు" దాటీ దాటగానే వచ్చి ఈదేశంలో పడ్డాను. జీవితం అంటే ఎటువంటి అవగాహన లేకుండానే పెళ్లి చేసుకుని, భర్తతో భూతల స్వర్గం కాబోలు అనుకుంటూ అమెరికా వచ్చేను. ఇండియా లో పెరిగిన జీవితం అంతా "ఊహా లోకమే"! జీవితం ఎలా ఉండాలో, ఎంత ఆదర్శంతో బతకాలో; జీవితాన్ని ఎలా మలచుకోవాలో అనే ఊహాలోకం తప్ప, అసలు సిసలు జీవితం అంటే ఏమిటో ఎప్పుడూ ఆలోచించ లేదు. ఈదేశం వచ్చిన తరువాత, చుట్టుపక్కల ఉన్న ప్రవాసాంధ్రుల జీవితాలు చూస్తూ ఉంటే, "ఓహో, ఈ దేశంలో మన జీవితాలలో ఇటువంటి సమస్యలు వస్తాయా! మరి అటువంటి సమస్యల్ని ఎలా పరిష్కరించాలి?" అన్న ఆలోచనలు రావడం మొదలెట్టాయి. ఆ ఆలోచనలే నాలోని ఎమేచూర్ రచయిత్రిని మేల్కొల్పేయి.
మీ ప్రశ్నకు సమాధానం: ఇండియాలో నా జీవితం " స్వప్న జీవితం"; అమెరికా వచ్చిన తరువాత...ఏళ్ళు గడుస్తున్న కొద్దీ, అసలు జీవితం అంటే ఏమిటో తెలిసింది. రియల్ ఎవేకేనింగ్! ఇప్పటికీ కూడా రోజు రోజుకీ,....నా దృక్పధం లో మార్పు వస్తూనే వుంది.

2. ఆ మార్పు మీ రచనల్లో ఎలా వ్యక్తం అయ్యింది? ఒకటి రెండు ఉదాహరణలు ఇవ్వగలరా?
నా దృష్టిలో నేను గొప్ప రచయిత్రిని కాను. కేవలం నాఆలోచనలను చిన్న కధల రూపంలో వ్యక్తీకరణం చేసే మనిషిని. నేను ఇండియా లో పెద్ద రచనలు చేయలేదు. ఈదేశం వచ్చేక మన తెలుగు వారు ఎదురుకుంటున్న సమస్యల గురించి నా భావనల్ని, నా అభిప్రాయాల్ని, నలుగురికి తెలియజేయాలని చిన్ని చిన్ని కధలు వ్రాయటం మొదలుపెట్టా! నా రచనలు, చాలామట్టుకు, అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రుల జీవితాలకు సంభందించినవే. ప్రవాసాంధ్రుల జీవితాల్లో మనకు గోచరిస్తున్న సమస్యలు, వాటిని మనం ఏ దృక్పధంలో చూసి, ఎలా పరిష్కరించుకోవచ్చో అనేదే నా కధల్లో ముఖ్యాంశం. నా కధలు చదివి, అటువంటి ఇరకాటంలో సతమతమవుతున్న మన తెలుగు వారికి ఊరట కలిగించడమే నా ఆశయం.

3. ఇక్కడికి వచ్చాక మీరు చేసిన రచనలు మీరు ఆంధ్రాలో ఉండగా చేసిన రచనకి ఏ విధంగా భిన్నమైనవి?
ఇంతకు ముందు చెప్పినట్టు, నేను ఆంధ్రాలో ఉండగా, చేసిన రచనలు...చాలా బుల్లి బుల్లివే. చెప్పుకోదగ్గవి కావు.

4. అమెరికాలో ఉన్న తెలుగు రచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలేమిటి?
నేను ఎప్పుడో ఆరు నెలలకో, ఏడాదికో కధ వ్రాస్తూ ఉంటాను. నాకు, ఏదైనా క్లిష్టమైన విషయం గానీ, నా హృదయాన్ని తాకిన విషయం గానీ తారస పడితే వ్రాస్తాను; లేదా వ్రాయను. నన్నుగా నేను పెద్ద భవిష్యత్తు వున్నా రచయిత్రిగా ఎప్పుడూ ఆలోచించ లేదు. నేనువ్రాసిన కొన్ని కధలకి, దేశం నలు మూలల నుండి నాతో ఏకీభవిస్తూనో, లేదా విమర్శిస్తూనో నాతో ఫోన్ చేసి ఉద్వేగంతో మాట్లాడినప్పుడే ఒక రచయిత్రిగా నాకు ఆదరణ కలిగిందని నేను భావించేను. ఇక పోతే రచయిత్రిగా నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, భవిష్యత్తులోనే తెలుస్తుంది.

1 comments:

oremuna said...

Deleting a post is not the good spirit! At least you should put an updated post why that other post was deleted.

Web Statistics