అఫ్సర్ వాక్యమే అఫ్సర్: బాలసుధాకర్ మౌళి

"కవి సంధ్య" పత్రిక జూన్ సంచిక నుంచి 1 అఫ్సర్ 'ఇంటివైపు' కవిత్వ సంకలనం నిండా ఖండితఖండితాలైన అతని హృదయం కనిపిస్తుంది. ఒక్కో ఖండితంలో ఒక్కో హృదయం పుట్టుకొచ్చిందేమో అని అనిపిస్తుంటుంది. కవికి ఎన్ని హృదయాలో.. ఎంత నిబ్బరం వున్నవాడో... అన్నన్ని జ్ఞాపకాల దిగుళ్లూ, వర్తమాన సంక్షోభ సమయాలూ, నెత్తురు వుబికే కలలూ - అన్నింటినీ నిక్షిప్తం చేసుకుని అగ్నిగుండంగా మారడానికి కవికెంత దృఢహృదయం కావాలి? అఫ్సర్ - గతవర్తమాన కాలాల్లోని సలిపే గాయాల అన్వేషణ కోసం బయలుదేరిన వ్యాఖ్యాత - శకలాల శకలాల కవిత్వ వాక్యాల ద్వారా మనల్నీ గాయపడమని చెప్పే అసలైన వ్యాఖ్యాత. అతని వాక్యం ఎంత కఠువో అంత సున్నితం. ఉత్త వ్యాఖ్యాతే కాదు - అతను రక్తమండలమై మనల్ని రక్తమండలం చేయగలడు. చిన్న చిన్న సరళమైన వాక్యాలతోనే గాఢమైన అభివ్యక్తిని సాధించడం జీవితంతో పెనవేసుకున్న కవికే సాధ్యం. ' యివాళ యీ చిన్ని పాదాల్లోకి వలస వెళ్లి వచ్చాను ' కవి జీవితంలో వలస సాధారణమైపోయింది. పుట్టిన వూరిని దాటి నగరంలోకి కదలిపోవటం, నగరం నుంచి దేశం దాటి పోవడం - జీవితం అనేక దృశ్యాల పరంపర - అఫ్సర్ జీవితం అఫ్సర్ ది. అతని సొంతం. అయితే అతను వాక్యాల వల వేసి అతనిలోకి మనల్ని లాక్కుపోవడమే అతను చేస్తున్న ఇంద్రజాలం. ' మిగిలిన అన్ని ప్రయాణాలూ లోకం కోసం యీ వొక్క ప్రయాణమే నాదీ నా లోపలికీ అనిపిస్తుంది ' ఇంటి జ్ఞాపకాలను, వూరి జ్ఞాపకాలను గాఢంగా హత్తుకుని పదేపదే నెమరువేసుకుని వాటితో మమేకమై - మనల్నీ ఆ వుద్వేగాల్లోకి తీసుకుని వెళ్లడం అఫ్సర్ కే చెల్లు. అఫ్సర్ కవిత్వం చదువుతుంటే అతనే నా లోపలికొచ్చి పాడుతున్నట్లుంటుంది. నా లోలోపలికి దారి చేసుకుంటూ వెళ్లి - ఏదో పరిచయమున్న పాటనే ఇష్టంతో ప్రేమతో మోహంతో అమితమైన వుద్వేగంతో ఆలింగనంతో పాడుతున్నట్టే వుంటుంది. అతని వాక్యాల్లో ఒక సున్నితమైన లయ వుంటుంది. చదివి అనుభవిస్తే గాని, అనుభవించి ఓలలాడితే గాని ఆ మత్తు వదలదు. అతని వాక్యాల్లోనే అతని గొంతు వినిపిస్తుంది. అది అలవోకగా మన లోపలికి దారి తీస్తుంది. పసిగొంతు అఫ్సర్ ది. ' యెంత కష్టమో పసితనం తెలుస్తోంది నాకిప్పుడు ' అఫ్సర్ ని బాల్యం వదలదు. బాల్యం అఫ్సర్ ని వదలదు. 2 కొన్ని కొన్నిసార్లు - అఫ్సర్ కవిత్వాన్ని ముట్టుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ' నోరు, చెయ్యి అను రెండు దేశాలు ' లాంటి కవిత ఎంత క్షోభ పడితే గాని రాయగలం. కవిత్వ పాఠకుడిలో కవి క్షోభ యదాతథంగా ప్రతిఫలించడం అఫ్సర్ సాధించిన కవిత్వరహస్యం - రహస్యం అని అనుకుంటాం గాని హృదయాన్ని మెలిపెడితే గాని లోపలికి చొరబడదు క్షోభ - మెలిపెట్టే క్షోభ అఫ్సర్ ది. ' నోరు, చెయ్యి అను రెండు దేశాలు ' , ' రోహిత్ కోసమే కాదు! ' లాంటి కవితలు బాల్య జ్ఞాపకాల్లాంటివి కావు - నిత్యం సలిపే వర్తమాన నెత్తుటి జ్ఞాపకాలు - హృదయాన్ని స్తంభింపచేసే జ్ఞాపకాలు. అఫ్సర్ కవిత్వాన్ని గురించి మాట్లాడ్డం సులువు కాదు. అతని వాక్యాల వద్ద రోజుల కొద్దీ నిల్చోవాలి - వేచి వుండాలి - వాక్యం గెడ్డం పుచ్చుకుని బతిమాలుకోవాలి - అప్పుడికి గాని వాక్యం కరుణకు లోనవం. అఫ్సర్ అల్లుకుంటే వదలని కవి. కవి రాసే వాక్యం బట్టే కవి మీదా గౌరవం పెరుగుతుంది. అఫ్సర్ వాక్యం మీద నాది అపరిమితమైన గౌరవం. ' మరణంలో మాత్రమే నిన్నూ నన్నూ యెవరినైనా పలకరించే పరమ లౌక్య లౌకిక లౌల్యంలో వున్నవాళ్లం కదా ' ఇలా రాసి అఫ్సర్ లౌక్యలోకాన్ని మన ముందు దోషిని చేసి నిలబెడతాడు. లౌక్యం రంగుల అద్దాన్ని బద్దలు చేస్తాడు. కవి నిజాయితీపరుడైతే కవిత్వమూ నిజాయితీని వెంటబెట్టుకుంటుంది అనడానికి ఈ వాక్యాలు నిదర్శనంగా మిగులుతాయి. అఫ్సర్ నిత్య వర్తమాన కవి. అఫ్సర్ కవిత్వం అఫ్సర్ ది. వాక్యంలో నగానట్రా లేకపోయినా మనల్ని అల్లుకుని వుక్కిరిబిక్కిరి చేసి అక్కడ నుంచి ఒక్క ఇంచు కూడా కదలనివ్వని విలక్షణత అతని సొంతం. చదవగా చదవగా వానకి ప్రతిరూపంగా అఫ్సర్ కనిపిస్తారు. అందుకేనేమో - 'అన్నీ తెలిసిన వాన' కవితలో -- ' యెప్పుడు యెలా కురవాలో తెలుసు వానకి !' ' యెప్పుడెలా కురిసినా వొకేలా వుండడమే తెలుసు వానకి ' అనగలిగాడు. కవిత్వ వాక్యాల్లో కవి కనిపించడమే కవిత్వం సాధించిన విజయం. 3 అఫ్సర్ కవి అంతరంగం మరీ సున్నితం కాబట్టే వాక్యాల్లో ఆ లేత పసితనం. చిన్ని చిన్ని సంతోషాలకి ఎగిరిపడతాడు. దూరాలను తలచుకుంటూ దిగాలు పడతాడు. దగ్గరితనం కావాలని తహతహలాడుతాడు. తన లోపలి పేజీలు అందరినీ చేరేట్టు పరమ సున్నితంగా చదువుతాడు. ' అవున్లే ఏం మాట్లాడుకుంటాంలే బతుకే వొక అలసట అయపోయినప్పుడు అలసట తప్ప ఇంకేమీ మిగలనప్పుడు ' కవికి చాలా రహస్యాలు తెలుసు. అందులోనీ జీవితరహస్యాల గుట్టు జీవితమంత విశాలంగానూ తెలుసు. ' అన్నీ దాటి వచ్చామనుకున్నప్పుడు అసలేదీ యెప్పటికీ దాటి వెళ్లలేమని ' ఎంత గాఢతాత్వికత కవిది. అఫ్సర్ కి బాధ తెలుసు - వ్యకిగత బాధ స్థాయి నుంచి సామూహిక బాధ వరకూ.. అస్తిత్వ స్పృహ వున్న మనిషి కాబట్టి - ఏ బాధనీ neglect చేసే రకం కాదు. బాధని expose చేసే సృజనశీలి - సున్నిత జీవి. ' వొకే వొక్కసారి నా నిజమైన ఏకాంతంలోకి నెమ్మదిగా నడిచి రా ' కవి రమ్మన్న ఏకాంతాన్ని ఆస్వాదించడానికి కవి సృజించిన వాక్యాలు సరళమైన ఒక దారిని వేసి వుంచాయి. ఆ దారంట వెళ్తే అమోఘమైన ఏకాంతం మనదే అవుతుంది. దుఃఖ ఏకాంతం మనసుకి దగ్గరైనది. దేశభక్తి అంటే ఏమిటి ? అనే దానికి అఫ్సర్ కవిత్వం వొక జవాబు. ' యింకో ద్వేషభక్తి గీతం ' అని పదునైన కవిత రాసారు అఫ్సర్. ' నేను ప్రేమిస్తూనే వుంటాను నీ చేతులు ఖడ్గాలై నన్ను ఖండఖండాలు చేస్తున్నా సరే ! ' ఇది అఫ్సర్ విసిరిన సవాల్ - దేశాన్ని ఏ తెరలూ లేకుండా ప్రేమించే నిజమైన ప్రేమికుడు - ప్రేమించినవాడే సవాల్ విసరగలడు. ద్వేషం చూపేవాళ్లు సవాల్ ను స్వీకరించగలరా ? అఫ్సర్ అఫ్సరే - భిన్న పార్శ్వాలున్న కవి. ఇంటివైపు అతని విశ్వరూపం. అఫ్సర్ ని నిర్వచించాల్సొస్తే.. అఫ్సర్ వాక్యమే అఫ్సర్ అనాలి - అని తీరాలి. అఫ్సర్ వాక్యమే అఫ్సర్ 6 మే 2018
Web Statistics