సదా బాలకుడు -అఫ్సర్: వంశీ కృష్ణ

ప్రియమిత్రుడు, కవి, కథకుడు, విమర్శకుడు వంశీ కృష్ణ "కవిసంగమం"లో రాసిన శీర్షిక నుంచి...
కాలం లో అఫ్సర్ గురించి రాయాలని రెండు మూడు నెలలు గా అనుకుంటున్నాను . ఎప్పటికప్పుడు ఈ వారం రాద్దాము అనుకోవడం, రాయలేక మరొకటి రాయడం అవుతోంది . ఈ కృత్యాద్యవస్థ రెండు నెలలనుండి నన్ను వేధిస్తున్నది . ఎక్కడి నుండి మొదలు పెట్టడం అనేది పెద్ద సమస్య . ఎలా ముగించడం అనేది మరొక పెద్ద సమస్య . మూడు దశాబ్దాలుగా ఒక కవిని సన్నిహతంగా గమనిస్తూ , రాసిన ప్రతి అక్షరమూ చదువుతూ , సంభాషిస్తూ వస్తున్నప్పుడు ఆ కవి గురించి పట్టుమని పది వాక్యాలు రాయడానికి ఇంత యాతన పడవలసిన అవసరం లేదు . కానీ రాయాలనుకున్నప్పుడు మనసులోకి వచ్చి చేరే భావాలకు అంతు లేక అవన్నీ ఒక దాని మీద మరొకటి గా ఓవర్ లాప్ అయి ఒక గజిబిజి దృశ్యం ఎదో మనోఫలకం మీద ఆవిష్కృతమై ఆరడి పెడుతున్నది
అఫ్సర్ నిరంతర కవి . శివారెడ్డి తనంత కవి అన్నాడు . తనంత కవి గురించి మాట్లాడటం అంత తేలికైన విషయమేమీ కాదు అని కూడా అన్నాడు . అఫ్సర్ ను ఎప్పుడు తలచుకున్నా నాకు ఒక పద్యం గుర్తుకు వస్తుంది .
కాస్త ప్రేమా ,కాస్త స్నేహమూ
కాస్త సంతోషమూ --- నీ కోసమే వీచే గాలి
నీ వెంటే నడిచే ఆకాశమూ
నిన్ను మాత్రమే పాడే పాటా
చిటికెన వేలు వొదలని నీడా
ఈ కవిత అఫ్సర్ రాసిందే . సురయా గురించి . అయినా అఫ్సర్ కి కూడా సరిగ్గా సరిపోతుంది . ఉద్యమాల ఖిల్లా ఖమ్మం నుండి వాణిజ్య రాజధాని విజయవాడ మీదుగా అతి పెద్ద అనంతపురం దాటి అమెరికా దాకా సాగిన అఫ్సర్ జీవిత ప్రస్థానం , సాహిత్య ప్రస్థానం వైవిధ్య భరితం . లోతుకు వెళుతున్న కొద్దీ అనితర సాధ్యమైన ఆకర్షణ ఎదో అందులో ఉంది . అది మనలను మోహపెడుతుంది . మనలను వివశులను చేస్తుంది
అఫ్సర్ కవిత్వ ప్రస్థానం లో మూడు దశలు వున్నాయి . ఒకటి ఖమ్మం లో చదువుకున్నప్పటి దశ . రెండు ఆంధ్రజ్యోతి .. ఆంధ్రభూమి లలో ఉద్యోగించిన దశ . మూడవది అమెరికా . ఈ మూడు దశలలో అఫ్సర్ కవిత్వం బహుముఖాలుగా విస్తరించింది . ఎక్కడో నాసికా త్రయంబకం లో ఒక చిన్న , సన్నటి , పల్చని ధారగా మొదలైన గోదావరి పలు రకాలుగా ప్రవహించి , విస్తరించినట్టుగా అఫ్సర్ కవిత్వం కూడా ఖమ్మం లో సన్నగా మొదలై ఇవాళ విశ్వవ్యాప్తం అయింది .
1980 ల మధ్య కవులుగా కళ్ళు తెరిచిన వారిని బలంగా ఆకర్షించిన వాళ్ళు ముగ్గురు ఒకరు శ్రీశ్రీ .మరొకరు తిలక్ , ఇంకొకరు శివసాగర్ . వీళ్ళు తప్పిస్తే మిగతావారు కవులే కాదు అనుకుని వాళ్ళ కవిత్వాన్ని పదే పదే పలవరించే తరానికి నారాయణ బాబు , అజంతా , వేగుంట ,బైరాగి ల ప్రాధాన్యాన్ని విప్పి చెప్పినవాడు అఫ్సర్. బహుళత్వం ఎప్పటికీ రహదారే అన్నది అఫ్సర్ విశ్వాసం .
కదిలేది , కదిలించేది లాంటి శబ్దాడంబరం లేకున్నా "కిటికీ తెరల కుచ్చులని పట్టుకుని జీరాడుతుంది దిగులుగా నీ పాట , జ్ఞాపకాలు వేధిస్తాయి కానీ ఆప్యాయంగా పలకరించవు లాంటి వాక్యాలు కూడా కోటబుల్ కోట్స్ గా మిగిలి పోతాయని అఫ్సర్ కవిత్వం నిరూపించింది .
తన సహా కవులనుండి అఫ్సర్ ను వేరు చేశే అంశం ఏదయినా వుంది అంటే అది అతడు పదాలకు వున్న ప్రీ సపోజిషన్ నుండి తప్పుకోవడం . భావాన్ని లలిత లలితం గా .మార్దవం గా పాఠకుడికి అందించడానికి అతడు ఎన్నుకునే పదాలకు వాటి ఉద్దేశిత అర్ధాలను మించి కొత్త అర్ధాలను ఆపాదించడానికి ప్రయత్నం చేసాడు . అది విజయవంతము అయింది . బహుశా ఈ ప్రయత్నం చేయడం వెనుక అతడు చదువుకున్న ఆంగ్ల , హిందీ సాహిత్యాల ప్రభావం ఉండి ఉండవచ్చు . ఇలా తన భాషను కొత్త గా తాను సృష్టించుకోవడం చేతనే అప్పట్లో అఫ్సర్ కవిత్వం పైన సూర్యాపేట నుండి వచ్చిన ఉజ్వల లో చర్చోపచర్చలు జరిగినయి . రాజీవ్ ఆంధ్రజ్యోతి లో రాసిన ఒక పెద్ద వ్యాసం లో అఫ్సర్ బ్రాండ్ కవిత్వం అంటూ కాయిన్ కూడా చేశాడు . ప్రముఖ హిందీ కవి సర్వేశ్వర్ దయాళ్ సక్సేనా మరణ వార్త విని . ఆయన చనిపోయేటప్పటికీ గుండెల మీద తెరచిన పుస్తకం వున్నదని విని రాసిన కవిత అంతిమ స్పర్శ ఎంతోమందిని ఆకర్షించింది . చాలామంది అది సుందరయ్య గారిని ఉద్దేశించి రాసింది అనుకున్నారు
1980 ల తరువాత తెలుగు కవిత్వం ఒక కొత్త అభివ్యక్తిని సాధించడం లో అఫ్సర్ దోహదం చాలా వుంది . అతడు చాలావరకు తన కవితలలో అజంతా చెప్పినట్టు పదాలకు స్నానం చేయించి , శుభ్రపరచి , తాజా పరిమళాలతో ప్రాణం పోశాడు . కవిత్వం లో వస్తువుతో పాటు అఫ్సర్ శిల్పాన్ని కూడా బలంగా పట్టించుకున్నాడు . విప్లవం ఒక జడపదార్ధం కాదని . అది కూడా అనేకానేక అనుభూతుల సమ్మేళనమే అని , విప్లవ కవిత్వ ముసుగు లో విస్మరించిన అనేకానేక విస్మృత అంశాలకు తన కవిత్వం లో చోటు కల్పించాడు . అందుకేనేమో రాజీవ్ అఫ్సర్ బ్రాండ్ కవిత్వం అన్న వ్యాసం లో అఫ్సర్ ని చిట్టచివరి భావ కవి అన్నాడు . నిజానికి అఫ్సర్ భావ కవీ కాడు , అహంభావకవీ కాదు . శుద్ధ కవి .ఇస్మాయిల్ ప్రతిపాదించిన కవిత్వం లో నిశ్శబ్దం అఫ్సర్ కవిత్వం లో శిఖర స్థాయి అందుకున్నది
భావాలలో ఎరుపుదనం , శైలి లో ఆకుపచ్చదనమ్ కలగలసిన కవిత్వం అఫ్సర్ తన తొలి దశ లో రాసాడు . అదంతా రక్త స్పర్శ , ఇవాళ లో మనం చదువవచ్చు . అఫ్సర్ రెండో కవిత్వ దశ గురించి అతడి రెండు సంపుటాలు వలస , ఊరిచివర బలంగా వివరిస్తాయి
జీవితం అంటే నలుపు తెలుపు కాదని , ఇతరేతర రంగు భేదాలు ఉన్నాయని . వ్యవస్థ అంటే వున్నవాళ్లు లేని వాళ్ళు మాత్రమే కాదని , ఇంకా ఇతరేతర స్థాయీ భేదాలు ఉన్నాయని కాస్త ప్రపంచ జ్ఞానం 80 ల తరువాత అబ్బింది . ఈ నిర్దిష్టత అర్ధమైన తరువాత అప్పటి దాకా మనం రాస్తోంది అమూర్త కవిత్వం అనిపించింది . జీవితం వ్యాఖ్యానాలలో లేదని , క్రూరమైన వాస్తవికత లో ఉందని అర్ధమైంది . ఆ మేలుకొలుపుల్లోంచి వచ్చిన తొంభైల తరాన్ని చూస్తూ వాళ్ళ అంతరంగాలు అలజడిని వెతకడానికి భాష చాలక వలస పాటలు పాడుకున్నాను . ఇందులో నేను ఒక విచ్ఛిన్నమైన వాస్తవికతను . నేను స్త్రీని , నేను దళితున్ని , నేను మైనారిటీని , నేనొక మూడో ప్రపంచాన్ని , చివరకు నేను ఒక మనిషిని అని సొంత ఉనికిని చెప్పుకోవలసిన స్థితి లో పడిన సంక్లిష్ట అంతరంగాన్ని
అని తన వలసకు రాసుకున్న వెనుక మాటలో చెప్పకున్నాడు అఫ్సర్ . తన మొదటి దశ కవిత్వం అంతా అమూర్తమనీ , తానిప్పుడు క్రూర వాస్తవం గురించి రాస్తున్నాను అని చెప్పకనే చెపుతున్నాడు .అఫ్సర్ మాత్రమే కాదు ఏ కవి కవిత్వ తొలి దశలో అయినా అదే అమాయకత్వం , అదే లలిత లలిత లావణ్య పదగుంఫనం , అదే ఆరిందాతనం ఉంటాయి . సమాజం తో మమేకం అవుతున్నకొద్దీ దృక్పదాలు ఏర్పడుతున్నకొద్దీ , ఒక భావం నుండి మరొక భావం లోకి వలస వెళుతున్నకొద్దీ , జారిపోయిన విశ్వాసాలను నిర్మమకారంగా వదిలివేస్తున్న కొద్దీ , కవిత్వం కొత్త ఆవరణం లోకి ప్రయాణిస్తుంది . కొత్త కొత్త భావాలకు , కొత్త కొత్త అనుభవాలకు తలపులు తెరుస్తుంది . చిన్నప్పటి చిరుగాలి ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది కానీ దాన్ని చిరుగాలిగా చిన్నప్పుడు అనుభవించినంత తన్మయత్వం తో మనం అనుభవించం
వలస 2000 ల సంవత్సరం లో ఊరిచివర 2009 లో వచ్చాయి . ఇవాళ కూ వలస కూ మధ్య కూడా ఒక అర్ధ దశాబ్దం తేడా వుంది . నిరంతర చలన శీలమైన సమాజ గమనం లో ఈ సమయం చిన్నదేమీ కాదు . ప్రపంచం చాలా మారింది . విశ్వాసాలు కుప్పకూలాయి . కమ్యూనిస్ట్ రాజ్యాలు కూలిపోయాయి . కాపిటలిస్ట్ టవర్లూ విమాన దాడులకుగురి అయ్యాయి . నాగరికతల మధ్య సంఘర్షణ యుద్ధ రూపం తీసుకుంది . అస్తిత్వ రాజకీయాలు వేడెక్కాయి . తనను తాను స్థిరీకరించుకుని ,మార్కెట్ చేసుకోవలసిన పరిస్థితులు వచ్చాయి ..నేను హిందువునీ , నేను ముస్లింనీ , నేను దళితుణ్ణీ , నేను స్త్రీ అని చెప్పుకుని ఆ భావనలను స్థిరీకరించుకోవడం కోసం యుద్ధం చేయవలసిన అనివార్యమైనా స్థితిలోకి మానవ జాతి యావత్తూ నెట్టబడింది .
ఈ స్థితి లో భావుకుడు అయిన ఆలోచనాపరుడైన కవి ఏమిచేస్తాడు ?
ఇప్పుడు
నా పదానికి నెత్తురంటింది
గొంతులో ప్రాణం విలవిల్లాడినా
గుక్కెడు దాహం కోసం
నీ మోచేతులను మాత్రం అడగను
నా మాట
ఇప్పుడేమాటా వినదు
శవం చల్లుకుంటూ వెళ్లిన బుక్కయిలా పడి ఉండదు
మోకాలు దాటినా అరువు చొక్కాల్లో
దేహాలని ఎలాగోలా దాచుకుంటున్నాము కానీ
చిరుగులు పడి పోతున్న గుండెలని
ఇంకెలానో నిద్రపుచ్చలేము
అని తన తరానికి దిశా నిర్దేశం చేస్తున్నాడు . స్థావర జంగమాత్మక ప్రపంచం లో తన స్థావరం కోసం యుద్ధం సిద్ధపడుతున్నాడు . ఎంత బలంగా సిద్ధపడుతున్నాడు అంటే
మరణం
అంటే ఏమిటో ఇప్పుడు చెప్పాలా ?
నా కవిత్వ పాదానికి మరణం లేదు
జీవితం తప్ప
వొరిగిపోతున్న దేహాల మధ్య సరిహద్దు మరణం
జీవితం తెగి పోయిన చోట మరణం
అసలే ఆకాశమూ లేకపోవడం భూమికి మరణం
మరణం కడుపులోంచి పుట్టిన యుద్ధం నా కవిత్వం
మరణించలేకపోవడమే కవిత్వం
ఇప్పుడు
భూమ్యాకాశాల మధ్య
నిటారుగా నిలబడ్డ సమాధానాన్ని నేను
కవిత్వానికీ జీవితానికీ మధ్య అబేధం పాటిస్తూ ఒక భావం నుండి మరొక భావం లోకి వలస సాగించాడు . మరోమాటలో చెప్పాలి అంటే అతడొక్కడే అనేకులు గా విస్తరించాడు . సమస్తమూ తనలోనే నింపుకునే ఒక ఏకత్వాన్ని తన కవిత్వం ద్వారా అనుభవం లోకి తీసుకుని వస్తున్నాడు .
ఊరి చివరకు రాసిన ముందు మాటలో గుడిపాటి అఫ్సర్ ను ముస్లిం కవిగా చూడలేము అన్నాడు . తనను కేవలం ముస్లిం కవిగా చూడటం , లేదా ఒక మైనారిటీ కవిగా చూడటం సాధ్యంకాదు . ఆ స్పృహ సాహిత్య ప్రపంచం లో ఉన్న వారికి రాదు . ఎందుకంటే అఫ్సర్ ఎదో ఒక పాయకు చెందినవాడు కాదు . అనేక పాయలని కలుపుకున్న నాదీ సంగమం లాంటి వాడు .అయితే అతడి ముస్లిం అస్తిత్వం అంతా అతడి జ్ఞాపకాలుగా ఊరిచివర లో వుంది . ఆ జ్ణాపకాల లోంచి ప్రస్తుత సమాజాన్ని అఫ్సర్ చూస్తున్నాడు , కనుక అతడు అనివార్యం గా ఇఖ్ రా లాంటి కవిత రాయగలిగాడు ఇఖ్ రా ప్రపంచానికి మహమ్మద్ ప్రవక్త అందించిన సందేశం .
కోపాన్ని వెళ్లగక్కలేను
ఒకరోజు బస్సుల అద్దాలు పగలగొడ్తాను
పాత వాసనలు గుప్పుమని నా వీధుల గుండా
మళ్ళీ వూరుకులూ పరుగులూ నెత్తుటి వాగులూ
అట్నుంచి ఇటు దాకా ఆకుపచ్చ జెండాల అసహనం ఆగ్రహాలు
నా మీదా
నా వొంటి మీదా ఇంకేమైనా ఖాళీ మిగిలి ఉంటే
అక్కడల్లా తొక్కితొక్కి నేనొక నుజ్జు నుజ్జు
గుహ లోంచి వచ్చిన మరుక్షణం
నేను నేర్పిన పాఠం ఒక్కటే
ఇఖ్ రా
. మొహమ్మద్ ప్రవక్త మీద ఒక డచ్ కార్టూన్ సృష్టించిన వివాదం తరువాత అఫ్సర్ రాసిన ఈ కవిత జ్ఞాపకం అస్తిత్వం గా ఎలా మారుతుందో చెప్పడానికి మంచి ఉదాహరణ ఇఖ్ రా అంటే చదువు అని అర్ధం . ఇది మహమ్మద్ ప్రవక్త సమాజానికి అందించిన గొప్ప సందేశం . అఫ్సర్ ఇప్పుడు కొత్తగా చదువుతున్నాడు . లేదూ ఒక కొత్త లోకానికి తలపులు తెరుస్తున్నాడు .
నాకు బాగా గుర్తు . చాలాకాలం క్రితం చేకూరి కాశయ్య గారు ఖమ్మం జిల్లాపరిషత్ ఛైర్మెన్ గా ఉనప్పుడు తొలి సారి ఖమ్మం జిల్లా అవతరణ ఉత్సవాలు జరిపిన సందర్భం గా కొంతమందిని రిక్కాబజార్ హుష్ స్కూల్ లో సన్మానించారు . వారికిలో అఫ్సర్ కూడా ఉన్నాడు . సన్మానం అందుకున్న తరువాత అఫ్సర్ మాట్లాడిన మొదటి మాట " విద్యారంగం లో నేను ఒక గొప్ప వైఫల్యాన్ని " అని . అఫ్సర్ అప్పటికే తన పి హెచ్ డి ముగించుకుని డాక్టరేట్ పట్టా అందుకున్నాడు . కానీ విద్యారంగం లో నేనొక గొప్ప వైఫల్యాన్ని అని అనగానే నా పక్కన ఉన్న ఒక మిత్రుడు విసుక్కోవడం నాకు ఇంకా గుర్తు వుంది . మన లౌకికమైన చదువు చదువే కాదని బహుశా అఫ్సర్ కి అప్పడే ఒక ఎరుక ఉందేమో .
తనకేమి కావాలో అఫ్సర్ ఇన్నాళ్లు తెలుసుకున్నాట్టున్నాడు . అలా తెలుసుకున్న తరువాత అతడి ప్రయాణం కొత్తగా గా మొదలు అయింది . అతడు ఇప్పుడు కొత్త కవిత్వం రాయడం మొదలు పెట్టాడు . బహుశా సృజనకారులు అందరికీ ఈ మెటామార్ఫసిస్ తప్పదేమో .
చలం ఈశ్వరార్చన వైపు మళ్లినట్టు , గోపీచంద్ అరవిందుడి ని తల్చుకున్నట్టు , అఫ్సర్ కూడా ఇప్పుడు సూఫీతత్వం వైపు మళ్ళాడు . తనకూ , ప్రభువు కూ ఆబేధం పాటించే మార్మికత వైపు మళ్ళాడు .
అఫ్సర్ కవిత్వం గురించి మాట్లాడుతూ ఒక మిత్రుడు అఫ్సర్ కవిత్వం మంచుపల్లకి వంశీ సినిమాలు లాగా ఉంటుంది అన్నాడు . మళ్ళీ తానే వివరణ ఇస్తూ వంశీ సినిమాలలో ప్రతి ఫ్రేమూ చాలా అతద్బుతం గా ఉంటుంది . చూడగానే వాహ్ ! వంశీ కనుక ఇలా తీయగలిగాడు అనిపిస్తుంది . కానీ మొత్తంగా సినిమాను చూసుకుంటే ఎదో లోపిస్తుంది . బహుశా అది ఆత్మేమో అన్నాడు . అతడు ఇంకొంచెం పొడిగిస్తూ ఒక భావాన్ని లలిత లలితం గా పదాలలో పొదిగి కవిత్వం చేయడం ఎలాగో అఫ్సర్ కి తెలుసు . అందుకే చదివిన ప్రతి సారీ చాలా కొత్తగా ఉంటుంది అని కూడా అన్నాడు . బహుశా అతడు కవిత్వ రూపం గురించి అన్నాడేమో . ఈ విషయాన్ని అఫ్సర్ కెరీర్ మొదటి దశ లోనే సీతారాం చెప్పాడు అని అఫ్సర్ ఇంటివైపు కు రాసుకున్న వెనుక మాట లో చెప్పుకున్నాడు . ప్రతి అనుభవాన్నీ ఓన్ చేసుకునే నీ పద్దతి నిన్ను ఎప్పటికీ తాజా గా ఉంచుతుంది అని చెప్పాడట .
ఇన్నాళ్లకు అఫ్సర్ తన కవిత్వ ఆత్మ సూఫీతత్వం అంటున్నాడు తన ఇంటివైపు లో మన కాలపు సూఫీ అఫ్సర్ అని చిన వీరభద్రుడు కూడా అంటున్నాడు .
అఫ్సర్ కవిత్వ ఆత్మ సూఫీ తత్వం అని గత వారం ముగించగానే కొన్ని ఆసక్త్తికరమైన కామెంట్స్ వచ్చాయి అఫ్సర్ సూఫీ కవి కాదు అతడొక వాస్తవ ప్రపంచ కవి అని తాటికొండాల నరసింహా రావు గారు . అంటే న్యూటన్ కి ముందు కూడా ఆపిల్ పళ్ళు చెట్టు నుండి రాలినట్టు అతను సూఫీ ల గురించి తెలుసుకోక ముందే మంచి కవిత్వం రాశాడు అని అరణ్య కృష్ణ
నాకైతే పెద్దగా తెలీదు గానీ తెలిసినంతవరకైతే సంగీతం జోడించినప్పుడేమో గానీ లేనప్పుడు సూఫీ తత్వానికి కవిత్వంగా గోప్ప ప్రత్యేకత ఏదో వున్నట్టనిపించడం లేదు. సూఫీ అనే రెండక్షరాలపట్ల కొందరు కవులు అనవసర ప్రేమ పెంచుకుంటున్నారనుకుంటా....చినవీరభద్రుడు టాగింగ్ అండ్ కన్సాలిడేషన్ ఏదో చేసాడు గానీ నేనలా అనుకోవడం లేదు...
To explain the Truth is indeed a difficult task. Words, being limited, can never really express the perfection of the Absolute, the Unbound. So for those who are imperfect, words create doubt and misunderstanding.
Sufism is a school for the actualization of divine ethics. It involves an enlightened inner being, not intellectual proof, revelation and witnessing, not logic. By divine ethics that transcend mere social convention, a way of being that is the actualization of the attributes of God.
mystical Islamic belief and practice in which Muslims seek to find the truth of divine love and knowledge through direct personal experience of God is Sufism. By another name it is taṣawwuf means literally, “to dress in wool” in Arabic, but it has been called Sufism in Western languages .
Sufis were characterized by their asceticism, especially by their attachment to dhikr, the practice of remembrance of God, often performed after prayers. They gained adherents among a number of Muslims as a reaction against the worldliness of the early Umayyad Caliphat.
"In a broad sense, Sufism can be described as the interiorization, and intensification of Islamic faith and practice."
అని ప్రసేన్ కామెంట్ చేశారు . .
నిజానికి మనకు సూఫీ తత్వం కొత్తదేమీ కాదు . సూఫీ తత్వం ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా తనను తాను వ్యక్త పరచుకుంది . మతానికీ , మత దురహంకారాలకు అతీతంగా కేవలం అన్ని ఐహిక బంధాలను వదులుకుని , సకల చరాచర సృష్టి లోని ప్రతి అణువులోనూ దేవుడిని ప్రేమ మార్గం లో దర్శించడం సూఫీ ల పద్ధతి . ఇస్లాం మత సాంప్రదాయం లో దీనిని సూఫీ అంటున్నాము . సూఫీ పదం సఫా అనే పదం నుండి పుట్టింది . సఫా అంటే శుభ్రపరచడం అని అర్ధం . భౌతిక మానసిక ప్రపంచాలు రెండింటినీ శుభ్రపరచడం . ఆంగ్లం లో అయితే సఫా అంటే సోఫా అని అర్ధం అట . ప్రవక్త బ్రతికి వున్నా రోజులలో కొందరు మసీదు బయట ఉండే బల్లల పైన కూర్చునేవారట . వాళ్ళు అలా కూర్చుంది అపార కృపామయుడు , అనంత దయాళువు అయిన భగవంతుడిని నాలుగు గోడల మధ్య బంధించారని నిరసన వ్యక్తం చేయడానికట .. కబీరు ఈ భావాన్నే గానం చేశాడు . అదేసమయం లో దక్షిణాదిన శైవ వైష్ణవులకు మధ్య ఎడ తెగని ఘర్షణలు ఏర్పడినప్పుడు హరిహర అబేధాన్ని బోధించాడు తిక్కన .
హిందూ సంప్రదాయం లో భగవంతుడిని చేరడానికి భక్తి ఒక మార్గం . మన మీరాబాయి , మన అన్నమయ్య , మన గోపికలు వీరంతా భక్తిని ఆలంబనగా చేసుకుని దైవ సాన్నిధ్యం చేరుకున్నారు . ఈ మధుర భక్తిని సూఫీ యోగులు ఇష్క్ హక్కీ కి అన్నారు . మధుర భక్తికి మతాల బంధనాలూ లేనట్టే సూఫీ తత్వానికి కూడా మతాల బంధనాలు లేవు . మరో మాటలో చెప్పాలంటే మధుర భక్తి , సూఫీ తత్వం రెండూ ఒక్కటే
మధుర భక్తి లేదా సూఫీ తత్వం వీటితో వచ్చే పెద్ద చిక్కు ఏమిటంటే ఇవి నిష్క్రియాపరత్వాన్ని పెంపొందింప చేస్తాయి . ఇంకొంచెం కటువుగా చెప్పాలంటే ఇవి పలాయన వాదాన్ని మనసులో ఇంకేలా చేస్తాయి . మీరా భజనలు , సూఫీ తత్వాలు , బైరాగి గీతాలు సంగీత సాహిత్య సమ్మిళితంగా ఉండి అలసిన మనసులకు సాంత్వన చేకూరుస్తాయి . మన భారాన్ని అంతా ప్రభువు మీదో , మరొక దయామయువు మీదో వేసి నిశ్చింతగా ఉండిపోయే ఒక నిరామయ , నిర్వికల్ప స్థితి లోకి మనిషిని నెట్టివేస్తాయి . ఒకానొక అద్వైత స్థితి లో హిందూ ఇస్లాం సంప్రదాయాలు సంగమిస్తాయి . సూఫీలు అద్వైత భావనతో యోగ సాధన చేశారు . అమృతకుండ అనే హర్షయోగ గ్రంధాన్ని పెర్షియన్ లోకి అనువదించుకుని సాధన చేసి నిజాముద్దీన్ ఔలియా సిద్ధుడు అయ్యాడు
ఈ విప్లవావాగ్నులు ఎక్కడివంటే
పండితాపురం వైపు చూపాలి
అని పాడుకున్న కవి లో ఎంత మెటా మార్ఫాసిస్ జరిగినా ఒక నిష్క్రియాపరత్వానికి తన కవిత్వం లో చోటిస్తాడా ?
ధిక్కారం నా మతం
నిరసన నా కులం
గోళ్లలో మేకులు దిగ్గొట్టే రాజ్యాన్ని
తూరుపు ఉరి కంబం ఎక్కించడం ఒక్కటే నా రాజకీయం
నీ గతం కాల్మొక్కలేను
అస్తిత్వ ఉన్మత్త ప్రేలాపనలో
చరిత్రని నిలువునా వంచించలేను
ఎప్పటికీ బాంచెన్ కాలేను
ఒక్క క్షణమైనా మరపులోకి జారిపోలేని వాణ్ని
కాలం నా వేళ్ళ సందులో గడ్డకట్టిన నెత్తురు
దాన్ని తుడిచివేసే పెర్షియన్ ద్రావకం ఇంకా పుట్టలేదు
ఇంత ధిక్కార స్వరం వినిపించిన కవి భగవంతుని పేరుతో పలాయనవాదాన్ని కౌగలించుకుంటాడా ?
ఇంటి వైపు చదువుతున్నప్పుడు ఈ ప్రశ్నలు పదే పదే చుట్టుముట్టినయి . ధిక్కారానికీ , సూఫీ తత్వానికి చుక్కెదురు కదా
ఒక ఎలియానేషన్ , ఒక uprotedness ఒక పరాయితనం ,గుండెల్లో కొన దిగి , తీరని వెత , దిగులుగా మారిపోతుందేమో - దేశం విడవనక్కరలేదు భారతదేశం లోనే -నీవూరు విడిచి ఏ నగరంలోనే వుంటున్నావంటే ఒక రకంగా మూలానికి దూరమవుతున్నావంటే కలిగేది హోమ్ సిక్నెస్ . ఇంటిమీద గాలి . ప్రపంచం గ్లోబలైజేషన్ లో మునిగాక అంతా దిగులే . ఈ కొత్త కవితా సంపుటి ఇంటివైపు లో దిగులు ప్రస్తావన ఎన్ని సార్లు వస్తుందో , అది వెంటాడుతున్నట్టుంది
అని కదా శివారెడ్డి అన్నది
అంతకుముందే ఎన్ . వేణుగోపాల్ జ్ఞాపకాన్ని కవిత్వంగా మలిచే రసవిద్య ఎదో అఫ్సర్ కి బాగా తెలుసు అన్నాడు . ఈ జ్ఞాపకం , ముసురుకుంటున్న దిగులు .లోలోపల గడ్డకట్టుకున్న స్థావర , జంగమాత్మక ప్రపంచాల నడుమ విడువక జరిగే ఘర్షణ , యధాతథ స్థితిని అంగీకరించలేని ఆమోదించలేని అసహనం , ఆమోదించాక తప్పని నిర్లిప్తత , నిరాసక్తత అఫ్సర్ ని ఇంటివైపు నడిపించాయి
అంతకుముందు ఊరిచివర లో కనిపించిన జ్ఞాపకాన్ని , ఇప్పుడు ఇఇంటివైపు లో కనిపిస్తున్న దిగులు . గుండెలనిండా నిండి ఉండి ఊపిరాడనివ్వని గాద్గదిక్యాన్ని సూఫీ భాష లో చెప్పే ధిక్ర్ తో పోలుస్తున్నాడు చిన వీరభద్రుడు . ఈ ద్రిక్ నే స్మరణిక అన్నాడు . ఫనా ని చేరాలంటే ఈ ద్రిక్ గుమ్మం ద్వారానే సాధ్యం . ఈ కవిత్వమంతా ఆ అప్రయత్న స్ఫూరణ , స్మరణ ల తో సాగుతున్నది . కొన్ని సార్లు అది చాలా స్పష్టంగా ,నిర్దిష్టంగా , ఇంద్రియాలకు అందేదిగా ఉంటుంది .
మిగిలిన అన్ని ప్రయాణాలు లోకం కోసం
ఈ ఒక్క ప్రయాణమే నాదీ , నా లోపలికి అనిపిస్తుంది
ఈ అస్పష్ట స్మరణిక లేదా జ్ఞాపకం , లేదా దిగులు . లేదా ఆంతరంగిక వేదనను నాకైతే మార్మికత అనాలి అనిపిస్తున్నది . సూఫీ తత్వాన్ని ఎంతో ఇష్టపడిన రవీంద్రుడు తన కవిత్వమంతా మార్మికత తో నింపినట్టు అఫ్సర్ కూడా తన కవిత్వమంతా ఒక మిస్టిసిజం తో నింపేశాడు . దట్టంగా అల్లుకున్న పొగమంచు లో అతి దగ్గర వస్తువు సైతం కనబడనట్టు , అఫ్సర్ తన పదచిత్రాలు మధ్య , తను స్వచ్ఛంగా , శుభ్రపరచిన అక్షరాల మధ్య తన తత్వచింతనని కదిలీ కదలని మృదు చేలాంచలముల కొసగాలుల విసురు చేశాడు .
ఇస్మాయిల్ గారి కవిత్వం లో ఇస్మాయిల్ గారికి తెలియకుండానే హైకూ తత్వం ఇమిడిపోయినట్టు అఫ్సర్ కవిత్వం లో కూడా సూఫీ తత్వ లక్షణాలు ఎక్కడో ఒక చోట ఒకటీ రెండూ అఫ్సర్ కి తెలీకుండానే చోటువెదుక్కుని ఉండవచ్చు . ఆ ఒకటి రెండు లక్షణాలే ఆఫసర్ ని మన కాలపు సూఫీ అనిపిస్తున్నాయి . ఆ ఒకటి రెండు లక్షణాలలో అఫ్సర్ తన ఇంటివైపు లో ఎన్నుకున్న కథన పద్దతి ఒకటి అఫ్సర్ ఇంటివైపు లో తన ఫామ్ ను అనూహ్యంగా మార్చేయడం . తాను ఇవాళ , వలస , ఊరిచివర లో అనుసరించిన పద్దతికి భిన్నంగా ఒక కొత్త రూపం తో పాఠకుల ముందుకు వచ్చాడు . ఇంతకుముందు అఫ్సర్ ఫామ్ అయితే ఒక మోనోలాగే అయ్యేది . లేకపోతే మరొక డైలాగ్ అయ్యేది . ఇప్పుడు ఆ రెండింటినీ కలిపేశాడు . ఒక జానపద కథన పద్దతిని ఎంచుకున్నాడు . ఏక కాలం లో తనతో తానూ సంభాషిస్తూ , పక్కవాళ్ళతో గుస గుసలు పోతూ , ప్రియురాలి తో రహస్య సంభాషణ చేస్తూ సరిహద్దులు అన్నీ చెరిపేశాడు . బహుశా ఈ కథన పద్ధతి కే
పాఠకుడు ఫిదా అయిపోతాడేమో .
నేను ఏ భాషలో నిన్ను చేరుకున్నానో తెలీదు
నువ్వు నాది కాసేపు కవిత్వ భాష అంటావు
కాసేపు మరీ ఉద్వేగాల భాష అంటావు
చాలాసేపు నీకు ఎంతకూ పాలు అందని శైశవ ఆక్రోశం లా వినిపించి వుంటాను
నా పసిభాష ఉద్వేగమై ప్రవహిస్తే
ఈ ఒక్క సరికీ మన్నించు
ఇంకా నాకు రానే రాని ఈ లోకపు భాష నేర్చుకోవాలి నేను
అని అఫ్సర్ మళ్ళీ తనను తాను కన్సాలిడేట్ చేసుకుంటున్నాడు . అయితే అఫ్సర్ పూర్తిగా సూఫీ లా మారిపోయే లోలోపలి అంతర్మధనం ఎదో ఇంటివైపు లో స్పష్టంగా కనిపిస్తున్నది . ఆ అంతర్మధనం అతడిని సూఫీ తత్వం లో ముంచితేల్చుతుందా లేక మరేదైనా ఒక కొత్త బంగారు లోకం లోకి తలుపు తీసి పంపిస్తుందా అనేది వేచిచూడవలసిందే . ఒక భావం నుండి మరొక భావం లోకి వలస వెళ్లడమే జీవితమైనా , కవిత్వమైనా అని అఫ్సర్ చెప్పనే చెప్పాడు కదా .
మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అందమైన కాజల్ రోజుకు కనీసం ఇరవై సార్లు అడిగినట్టు అఫ్సర్ కవిత్వం లో సూఫీ తత్వం ఉందా ? మార్మికత ఉందా ? సమకాలీన రాజకీయ ఆర్ధిక వ్యవస్థల పట్ల ఆగ్రహం ఉందా నిగ్రహం ఉందా లాంటి వెతుకులాట అక్కరలేకుండానే చదివిన ప్రతి సారీ ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చే అద్భుతమైన కవి అఫ్సర్ . తన పసితనపు అమాయకత్వాన్ని ఇంకా కవిత్వం నిండా ఒలికిస్తున్న సదా బాలకుడు అఫ్సర్ .
వంశీకృష్ణ
Category: 0 comments

రెండు చేతులా పిలిచే జీవితం: అఫ్సర్ 'ఇంటివైపు'"యిప్పుడు నువ్వు కనీసం వొక సంతోషపు అలలో
అల లోపలి సంతోషపు కడలిలో
కొంచెమే అయినా సరే, తేలిపో” (178, ఇంటివైపు)
ఎవరైనా ఓ కవి ‘అల లోపలి సంతోషపు కడలి’ గురించి ఆలోచిస్తున్నాడంటే అతను కచ్చితంగా అఫ్సరే అయ్యుండాలి. కవిత్వాన్ని తనలో నిరంతర ప్రవాహంగా చేసికుని, తనలోని ఖాళీని కవిత్వం ద్వారానే నింపుకుని ఐదు సంపుటాల ఎత్తు కెదిగిన విలక్షణ కవి, కధారచయిత, అనువాదకుడు, విమర్శకుడు అయిన అఫ్సర్ గురించి సాహితీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాటి విషయాన్నైనా ఒక ప్రత్యేక దృక్కోణం నుంచీ చూడగల, ప్రత్యేక భాషలో సరళంగా వ్యక్తీకరించగల సున్నితమైన ‘సంక్లిష్ట’ కవి శ్రీ అఫ్సర్.
బాల్యం నుంచీ సాహిత్యం పట్ల మక్కువ, భాష పట్ల ప్రేమ పెంచుకుని అనేక కవితా మూర్తుల బలాన్ని, ప్రేమను తనలో నింపుకున్న ఈ కవితా కౌముది ప్రారంభ కవిత్వం అందరి కవుల్లా విప్లవ స్ఫూర్తి ఛాయలను నింపుకున్నా రాను రాను తన విలక్షణ ముద్రను, భాషను, భావాల్ని పొదువుకొని ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఎప్పటికప్పుడు ‘ఫలానా’ ముద్రల్ని ధ్వంసం చేసికుంటూ (చూ. అఫ్సర్ తో ఇంటర్వ్యూ ) తన కవిత్వం లోని శక్తిని మరింత ద్విగుణీకృతం చేసికుంటున్న ఇంద్రజాలికుడు అఫ్సర్. ‘రక్తస్పర్శ’ నుంచీ ‘ఇంటివైపు’ దాకా ఎన్నో ముద్రలు, ఎన్నో చిరునామాలు – వీటన్నిటిలోనూ ఎన్నో చుట్టరికాలు. పాత్రికేయుడిగా, కవిగా,కధకుడిగా, అధ్యాపకుడిగా అనేక దశలలో గృహోన్ముఖీనత లోని తీవ్రతను అనుభవించి పలవరించిన దశలో రూపుదిద్దుకున్న కావ్యంగా ‘ఇంటివైపు’ ను గురించి చెప్తాడు అఫ్సర్.
ఇంటివైపు చేసే ప్రయాణమెప్పుడూ తీయనిదే. ఉద్వేగపూరితమైనదే. పరాయి ఆకాశపు దుప్పటి కింద నిద్ర యెంత దుఃఖభరమైనదో,  వేదనాభరితమైనదో, ఇంటివైపు మళ్లే ప్రయాణం ఎంత మధురమైనదో, ఎన్ని కలలను, వుద్వేగ భరిత క్షణాలను పొదువుకుని వస్తుందో చెప్పనక్కరలేదు.
          ‘రేగిపళ్ళ వాసనలోకి’  ‘దూరాల కంటే కదా!’ ‘ఎటో చెదిరిన పడవై’ అనే మూడు భాగాలుగా అమరిన యీ ‘ఇంటివైపు’ కల ఎన్నో బాధా తప్త క్షణాల్ని, బుడగల్లా చిట్లిపోతున్న క్షణికానందాల్ని, సామాజిక సన్నివేశాల్ని, వైయక్తిక అనుభవాల్ని ఒకచోటకు చేర్చి మనసుకు చుట్టుకుపోయే గాఢమైన కవిత్వంలో అందిస్తాడు అఫ్సర్. వ్యక్తిగతమైన సామాజికమైన విషయాలనుంచీ చారిత్రక రాజకీయ సత్యాలను, హింసలను, అణచివేయడాలను అదే లోతైన నిశ్శబ్దపు నది గొంతుకలో చెప్తాడు.  అందుకే ‘ఇంటివైపు’ కవిత్వమంతా ఆత్మ ఘర్షణ, ఆత్మ వేదనా ఘోషై వినవస్తుంది.
          శివారెడ్డి తన ముందుమాటలో చెప్పినట్లు అఫ్సర్ కవిత్వం మొత్తం “Survival of feeling self” గురించే మాట్లాడుతుంది.
          ప్రపంచీకరణ నేపధ్యంలో ఎవరు ఎక్కడైనా వుండచ్చేమోకాని మనసున్న కవికి మాత్రం ప్రతిరోజూ తన ఆత్మ తన వూరిని తన దేశానికి ప్రయాణించి తన వాళ్ళను పలకరించి తిరిగొస్తూనేవుంటాడు.  ఈ అనుక్షణిక ప్రయాణం లో ఎన్నో వేదనలు, పలకరింతలు, పలవరింతలు, తీరని దిగుళ్ళు, గుబుళ్ళు ఎన్నో ‘వుద్వేగాల తొలి ఆనవాళ్ళు’(43)
          తన వూపిరినంతా కూడగట్టుకొని తన ‘ఇంటివైపు’ ప్రయాణం గురించి ఇలా చెప్తాడు.
                   యేమేం తీసుకెళ్తాను ఇంటికి,
                   నా ఊరికి
                   ఆ తొలి రక్తపు సెలయేటికి?!
తనదైన భాష, వ్యక్తీకరణ లతో చాలా తాత్వికం గా, కొత్త తనం తో చెప్తూ మనల్ని తీసుకెళ్తాడు-
‘అవున్నిజంగానే వెళ్తాను నాలోకి /ఆ చిన్న పంటపొలం లో రాలిపడిన /రేగుపళ్ళ వాసనలోకి!’  (45) ఇంత Homesickness లోనూ ‘లోకపు కొలమానాల కానుకల్ని’ అర్దాలు మారిపోయిన విలువల్ని యీసడించు కోవటం మరచిపోడు. ‘నీది కాని వాన’ కవిత పరాయికరించబడిన తన వేదననూ చాలా గాఢమైనదిగా తెలిపి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.  తనకే తెలియకుండా పరిగెత్తిస్తున్న తన ప్రపంచం లోకి ఆ వాన ప్రయాణం చూడండి-
                   “తెల్లారు జాము వానలో తడుస్తూ
                   ఇల్లు వూరు వదలి
                  పరిగెత్తుతూ వెళ్తాను, ప్రపంచం వేపు
                   నన్నలా పరిగెట్టించే ఈ ప్రపంచం లో
                   అసలేమైనా వుందో లేదో!
                   ......
                   నా కోసం కురవని ఆ వానలోకి
                   తీక్షణంగా చూసే శక్తి కూడా నాకు వుండదు
                   ఆ మాటకొస్తే, యెన్నో చినుకులు కలిస్తే
                   వాన అవుతుందో కూడా తెలీదు యీ ‘పరాయి’ క్షణం లో    (Quotes mine,47)
చాలా మందికి వాన ప్రతిసారీ ఒక క్రొత్త అనుభవం. ఒక ఆనంద పరవశం. వాన ఎక్కడైనా వానే. వానలో ఇష్టంగా గడపటం కరిగిపోవడమే. ఇష్టం లేనపుడే వాన మనల్ని బాధగా తడుపుతుంది. చికాకుపెడుతుంది. అదిగో అలాగే ఇక్కడ ఈ వాన ఒక బాధాకరమైన తాత్వికతను ప్రేరేపిస్తోంది. కవి అంతరాంతరాలలో పొరపొరగా పేరుకుపోయిన బాధను వెలికి తీస్తోంది. చాలా సరళమైన భాషలో చెప్పినా అఫ్సర్ కవిత్వం ఆవలి తీరాల నుంచీ దిగాలుగా ‘తనదికాని’ వానలో తడుస్తూ, చేజారి పోతున్న అద్భుత క్షణాల్ని అందుకోలేక నిరాశగా చూస్తున్న ఓ బాటసారి కలలను, సంక్లిష్ట క్షణాల్ని మనకందిస్తుంది.
          ఇలాగే ఇలాటిమరో వాన కవిత ‘అన్నీ తెలిసిన వాన’ . ‘ ఎపుడు/ఎలా కురవాలో/తెలుసు వానకి’-అంటూ మొదలై తన మనసులోని నిశ్శబ్ద సత్యాలు చెప్పేస్తాడు ఈ పంక్తుల్లో:
‘అయినా/వొక ఊరో ఇంకొక వూరు ఎప్పుడూ కాదు/ ...
ఆకాశం ఆకాశం కాదు
నేలా మనుషులూ అరుగులూ వాకిళ్ళూ
ఇవేవీ అవి కాదు –
ఏ ఊరూ యింకో వూరు కాదు
అపుడపుడూ ‘వెనక్కి చూడు’
‘దాటి వచ్చిన వూరు
ఏమంటుందో విను’ – (bold letters mine,148) అని మౌనంగా అంతరాంతరాలలో కవి మనసులో కురుస్తున్న దిగులును వెలికి తీస్తుంది. ‘అవీ – ఇవీ’ లలో ‘వొక – యింకొక’ లలో ‘దాటుకొచ్చీ’ , ‘వెనక్కు తిరిగిచూడాల్సిన’ దాగిన అవసరాలను చెప్పిపోతుంది.
ఇలాటి భావననే గమ్మత్తుగా ‘ఓ పొద్దుటి రైలు’ కవిత కూడా చెప్తూనే చివరలో హటాత్తుగా –
‘అన్నీ దాటుకు వచ్చామనుకున్నప్పుడు/అసలేదీ ఎప్పటికీ దాటి వెళ్ళలేమని/రైలు పాడుకుంటూ వెళ్ళిపోయింది/కూతవేటు దూరంలో’(190) తన సహజమైన సూఫీ తాత్వికతను జోడించి మరీ చెప్తాడు. ఇక్కడ నిరాశ లేదు.  జ్ఞాన సమృద్ధుడైన ఓ తాత్వికుడే కన్పిస్తాడు.
          తనను ‘ చుట్టు ముట్టిన ఈ తెలియని ముఖాల /తెలియని చెట్ల / తెలియని ఆకాశాల, తెలియని గాలుల,/కనిపించని కన్నీళ్ళ ‘ (56) సమూహాల గురించి ‘రాలి పడిన ఆకుల చిందరవందరలో / వాటిల్లో దాక్కున్న ప్రాణాల కొసల్లో/ఏదో వెతుక్కుంటూ ...’ దాటుకొచ్చిన ఊరూ ఏరూ గురించి , ఇల్లూ, వాడా గురించీ , తన ఒంటరితనపు బెంగ గురించీ పదే పదే పలవరిస్తూనే ఉంటాడు. ‘ఎక్కడికని ఎంత దూరమో వెళ్ళనుగానీ / వెళ్ళిన దారంతా బెంగ పడిన పక్షిలా మెలికలు తిరుగుతోంది.’(63) ఈ సంపుటి ఎన్నో అందమైన క్షణాల్ని , పరవశాల్ని ప్రేమ రాగాల్ని చెప్తున్నా సరే అంతర్లీనంగా ప్రవహించే రక్తం లాంటి దిగులు ప్రస్ఫుట మౌతూనే ఉంటుంది. తన లోపలితనం లోకి ప్రయాణిస్తున్నప్పుడు, బాహ్య ప్రపంచంలోని విధ్వంసాన్ని జయించాల్సిన స్థితిని కరుణతో తాకాలనుకున్నప్పుడు అఫ్సర్ శ్రీ వాడ్రేవు చెప్పినట్లుగా ‘ఈ కాలపు సూఫీ’ నే అవుతాడు.
          ఈ ‘ఇంటివైపు’ మార్గం లో కొన్ని ప్రదేశాలలో కొందరు వ్యక్తులతో గడిపిన సందర్భాలున్నై. కోల్పోయిన పసితనాన్ని పొందలేని, పొదువుకోలేని ఆక్రోశాలున్నై. గానామృతాన్ని సేవించిన మత్తులో పాడిన పాటలున్నై.ఇంతకుముందే అనుకున్నట్లు తాత్విక సంవేదనలున్నై. కృతజ్ఞతా ప్రవాహాలున్నై. నిశ్సబ్దంగా తనతోనే నడిచే నిస్ప్రుహలున్నై.      వేటినైనా లలితమైన కవిత్వంగా మార్చగల ప్రతిభ గల ఇంద్రజాలికుడు కాబట్టి అన్నిటినీ అంత అందం గానూ మార్చేస్తాడీ కవి. మరచిపోలేని పసితనాన్ని గురించి చెప్పినా (50) గాలి మోసుకెళ్ళే పాత గురించి చెప్పినా (51) అదే ఒరవడి, అదే సాంద్రత, అదే నిండైన భావన. ఈ వాక్యాల్ని చూడండి:
          ‘ ఈ రెండు చేతులే/గాల్లో ఎగిరితే పక్షులు/నెలన వాలితే రెండు నదులు/రెండిటి మధ్యా గుడి కడితే ఇంద్రచాపాలు’ – ఎంత అందమైన భావన!
అలాగే పసితనాన్ని తాకలేని (మ)/తన దయనీయ స్థితి గూర్చి ఎలా విలవిల్లాడుతాడో ‘తాలియా’, ‘ఆ చిన్ని పాదాలు’ కవితలు చూడండి.

‘ఇప్పటికిప్పుడు/వొక్కటి మాత్రం అర్ధమై పోయింది/నీ దరిదాపులకి ఎన్నటికీ రాలేను,/నన్ను నేనే ఆసాంతం చెరిపేసు కుంటే తప్ప’- ఎంత క్లిష్ట పరిస్థితి గురించి తన బాధను వ్యక్తీకరిస్తున్నాడో చూడండి.
అలాగే ఈ సంపుటిలో సంఘ ద్వేషానికి బలైన వ్యక్తులపట్ల జాతులపట్ల సహానుభూతితో పాటు ధర్మాగ్రహాలున్నై. తన బాధా తప్త హృదయపు ఆక్రోశాన్నేలా చెప్తాడో చూడండి: ‘నేను/యిపుడు విడిచివేయబడ్డ వొట్టి వస్త్రాన్నే/నిజమే కానీ,/ నన్ను హత్తుకుని/తెగిపడిన ప్రాణాల చివరి కేకలు వింటున్నావా నువ్వు’
          కవి కేవలం అంతర్గత స్వరాన్ని వినిపించడమే కాకుండా సామాజిక స్వరం కూడా అయినప్పుడే పరిపూర్ణుడౌతాడు. ప్రపంచపు రాజకీయ రహస్యాల్ని బట్ట బయలు చేసేందుకు చాలా ధైర్యమే కావాలి. అనేక దేశాల్లోని కవుల, రచయితల రచనల్ని పరిశీలిస్తే ఆ యా రచనలు చేసే నిశ్శబ్ద యుద్ధపు ప్రకటనలు, వాస్తవ నిరంకుశ పరిస్థితులను కళ్ళ ఎదుట నిలిపే రహస్య సమాధానాలు, సందేశాలు తేటతెల్లమౌతాయి. అలాటి విప్లవాత్మకమైన , బాధ్యతాయుతమైన గొంతుక కూడా ఈ సంపుటి మనకు వినిపిస్తుంది.
‘ నాకు ఏ దేహమైనా /అన్నం పళ్ళెం లాగే కనిపిస్తుంది ఎప్పుడూ
ఏ దేశమైనా/ఆ మెతుకుల్ని దోచేసే దొంగలాగానే కనిపిస్తుంది ఎప్పుడూ
యిక్కడ నీ పేదరికపు వొంట్లోనూ /అక్కడ ఆ గరీబు వొంట్లోనూ
వొకే ఆకలి కేక/వొకే వెతుకులాట’ ఆకలి మీద, అన్నార్తుల మీద అనేక రకాలుగా ముసుగుల్లో జరుగుతున్న కుట్రను ఎలా నిలదీస్తాడో చూడండి.
          ఒక మహా వృక్షం మొలకెత్తినప్పటి నుంచీ అనేకవేల కోట్ల చినుకులను తాగి, మరిన్ని వేల కోట్ల పవనమాలికలను ఆవాహన చేసుకుని కూడా తనదైన రూపుతో రంగు రుచి వాసనతో వటవృక్షంగా మారినట్లుగా ఇటు తెలుగు, అటు ఇంగ్లీషు మహాకవులను పరకాయప్రవేశం చేసి అనేక కవితాజ్యోతుల దీపఛాయలను సొంతం చేసుకుని తనదైన తేజోకవిత్వాన్ని పంచగల అఫ్సర్ కవిత్వం ఈ సంపుటిలో ఆసాంతం ఆసక్తికరంగా ఓ ఇతిహాస గాధలోని సంభాషణల్లా సాగుతుంది. అక్కడక్కడా ఆంగ్ల పద ప్రయోగ సంవిధానంతో ఒకింత ఆశ్చర్య పరిచినా ప్రస్తుత కాలాన్ని అద్దం పడుతుంది. నిరంతర మానవ జీవిత సంఘర్షణ ను వినిపించే ప్రతిపాటా ఎప్పటికీ వెలుగుతూ మార్గదర్శకకమౌతూనే  ఉంటుంది కదా. ఈ కావ్యమూ అంతే.
                                                                             డా.విజయ్ కోగంటి,
08801823244

Web Statistics