Showing posts with label హైదరాబాద్ వొక కవి సమయం. Show all posts
Showing posts with label హైదరాబాద్ వొక కవి సమయం. Show all posts

Monday, June 20, 2011

పతంగ్....




వొక వూహ కావచ్చు సాయంత్రానికి కరిగి నీరయ్యే ఏదో వొక నీడ కావచ్చు పొద్దుటికి సూరీడు రావచ్చు రాకపోవచ్చు ఇవాల్టి రాత్రి చీకటిగానే మిగిలిపోవచ్చు ఆకాశం మీద చుక్కలు ఎక్కడికీ వలసపోకపోవచ్చు సాయంత్రప్పూట హైద్రాబాద్ వొక మెరుపు కల

ఆ ఇరానీ చాయ్ నిజంగా అదే పరిమళమై నన్నూ మన శరీరాల నిద్ర చర్మాల మీద చర్నాకోల కావచ్చు కాకపోవచ్చు అసలు ఆ టేబుల్ చుట్టూ శరీరరహిత ఆత్మలు మాత్రమే పరిభ్రమిస్తూ వుండొచ్చు క్రాస్ రోడ్ గీసిన పెయింటింగ్ కళ్ల కిందా చూపు పారినంత దాకా.

వొక అర్ధరాత్రి అంటూ లేకపోవచ్చు వొక పోలీసు కన్ను మాత్రమే అటూ ఇటూ పరుగులు తీస్తూ వుండొచ్చు గోడల మీద ఎరుపు లేకపోవచ్చు మరేదో రంగులో కార్పొరేట్ సంతకాలే ఎగురుతూ వుండొచ్చు ఎవరో వొక అనామకుడు లావారిస్ ఆవారా తన పత్తా దొరక్క/దొరికిన పత్తాకి అన్ జాన్ కొట్టి కాపిటలిస్టు దుర్గమ్మీద మజాక్ వుడాయించవచ్చు, ఎంత మారిపోయావ్, హైద్రాబాద్! నువ్వొక మంత్రించిన పిచ్చి కల.

వొక వూహ కూడా కాకపోవచ్చు ఎప్పటికీ కరిగి నీరు కాలేని ఇంకేదో నీడ కూడా కాకపోవచ్చు ఇవాల్టి పగలు కూడా చీకటిగానే మిగిలిపోవచ్చు ఆకాశం మీద చుక్కలు వుండగానే సూరీడు రోడ్ల మీద కరిగిపోవచ్చు. ఈ క్షణపు ఆత్మహత్యవీ..వచ్చే క్షణపు హత్యవీ...ఆ రెండీటీ నడుమ వొక అరక్షణపు వాంఛవీ...చివరిదాకా చంపి కొసప్రాణం మీద సూర్యుడిని వేలాడదీసే....మాయాప్రవాసివి..మోహావేశపు వుక్కిరిబిక్కిరి కెరటానివి.


(బొమ్మ: అక్బర్. దౌర్జన్యంగా, కర్టసీ కూడా లేకుండా)

Sunday, September 5, 2010

వానలో హైదరాబాద్!




వొంటరి రాస్తా మీద
చిట్టికప్పల్లా ఎగిరెగిరి పడ్తుంటాయి చినుకులు

చినుకు వొక అల్లావుద్దీన్ అద్భుత దీపం.
దీని బుడగ దేహంలోకి నేను జారిపోతాను
నగరపు పైపై మెరుగుల నా దేహం
కాసేపు దీప కాంతిని ధరిస్తుంది.

వొంటరి రాస్తా పక్కన
కాసిన్ని వాన నీళ్ళు
పిల్ల మడుగులయి ఎటో పారాలని చూస్తాయి
నా వొంటిని మడిచి
కాయితప్పడవలాగా అందులోకి వదిలేస్తాను.

అది ఎటు వెళ్ళి
ఎటు వస్తుందా అని చూస్తూ వుంటాను.

దాని రెక్కల మీద నా కన్ను అతికిస్తాను.

అది కదలడం మరిచిపోయిందని
కాసేపటికి
అర్ధమవుతుంది నాకు.

ఈ వూళ్ళో వానకి ఏ పనీ లేదు
అది ఎవరికోసమూ కురవదు

తనలో తానే తపస్సు చేసుకునే నీటి బుడగ
ఓ అరక్షణం నన్ను నిలదీసే పాము పడగ.

పూర్తి కాని వాక్యాలు

ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (జులై 6) లో అచ్చయిన కొత్త కథ-   1           మ రీ పెద్ద విలాసాలేమీ కోరుకోలేదు సబీనా. అన్నీ చిన్నచిన్న కోరికలే!   ...