ఇంటివైపుకోసారి...


-భవాని ఫణి 
~

ఎంతటి వారినైనా పసివారిని చేసి ఆడించగలిగేవి వారి వారి చిన్ననాటి జ్ఞాపకాలేననుకుంటాను. మనల్ని మనమే నిత్యం గమనించుకుంటూ, బేరీజు వేసుకోవడం చేతకాకయితేనేం, మనదైన స్వంత లక్షణంతో బ్రతికేయడం - అప్పుటికి రావడమే అందుకు కారణం కావచ్చు. ఆ ఏమీ తెలీనితనాన్నీ గుర్తు చేసుకోవడమంటే, కోల్పోయిన మనల్ని మనం తిరిగి కలుసుకోవడమే కదా. ఎప్పటికప్పుడు కలుగుతున్న స్పృహలనన్నీ అక్షరాలుగా మార్చి, మనసు తెల్లకాగితం మీద రంగురంగుల్లో రాసేసి, మన 'గతం' మనకందించిన జ్ఞాపకాల ఉత్తరాల కంటే విలువైనవి ఇంకేముంటాయి జీవితంలో! ప్రపంచాన్ని మనకీ, మనల్ని ప్రపంచానికీ పరిచయం చేసిన అమ్మలాంటిదే కదా గతం కూడా. ఆ కమ్మని జ్ఞాపకాల్ని విప్పుకున్నప్పుడల్లా, వింత వింత అనుభూతులేవో కుప్పల్లా రాలి పడి, రాశి కడుతుంటాయి. ఎన్నెన్నో అవన్నీ...కొన్నికొన్ని ఆనందాలూ, ఉద్వేగాలూ, మరికొన్ని కొన్ని దుఃఖాలూ, దిగుళ్లూ.
అప్పుడప్పుడోసారి, ఎవరైనా ఇలా వింత బెంగతో తల్లడిల్లకపోతే, దాని గాఢ పరిష్వంగంలో చిక్కుకుని అల్లాడకపోతే, తమని తామెక్కడో పోగొట్టుకున్నట్టే మరి. అటువంటప్పుడే అఫ్సర్ గారి 'ఇంటివైపు'కోసారి వెళ్ళొస్తే సరిపోతుంది. భుజాలకి విమానం రెక్కల్ని మొలిపించుకు మరీ ఎగిరిపోతూ... ఎప్పటెప్పటివో కలల్లాంటి కొన్ని సీతాకోక చిలుకల్ని వెంబడిస్తూ, ఈ యాంత్రిక ప్రపంచం నుండి దూరంగా తరలిపోయే, ఆయన ఆ అందమైన వాహనంలో, మనమూ ఓసారి ప్రయాణించాల్సిందే. ఇప్పటి వయసు తెచ్చిన జ్ఞానమనే భాషతో, అనుభవం తెరిచిన వేదాంతి మనసుతో, ఆనాటి పసితనపు స్వచ్ఛతనోసారి ఆయనలా ప్రేమగా పలకరిస్తున్నప్పుడు, తేనెను తెచ్చే తేనెటీగా, తేనె తుట్టలో తేనెచుక్కా - ఒకటిగా మారి ఏర్పడే తేనెపట్టులాంటి నిజమొకటి, మన కళ్ళకూ, మనసుకూ కూడా రుచ్యమవుతుంది.
ఈ కవితా సంపుటిలోని 'ఇంటివైపు' కవితే చూడండి...
చాలా ఏళ్ళ తర్వాత, మన బాల్యాన్ని దాచుకున్న ఊరివైపెళుతుంటే, మనసెలా ఉంటుంది! క్షణాలెంత బరువెక్కిపోతాయి! కాలాన్ని చక్రంగా చేసి గిరగిరా తిప్పెయ్యాలనిపించదూ...
"అక్కడందరికీ
అక్కడన్నిటికీ
నా ఈ అలికిడి వినిపిస్తూనే ఉందేమో!"
తనలో కలిగిన ఆ వింత అలజడిని, తను పెరిగిన ఇంటికో, తన స్వంత ఊరు మొత్తానికో ఆపాదించేంత ఉద్వేగం! అంతలోనే, ఎదురుకాబోయే ఆ మధురానుభవాలు కాసినీ, కాలంలో పడి కరిగిపోయే పంచదార గుళికలేనన్న స్పృహ తెచ్చే బెంగ మరోవైపు...
"మనసు కూడా ఇరుకనిపించే సంతోషాన్నో
మళ్లీ వదులుకుని రావాలన్న దిగులునో
కాస్త ముందే సిద్ధం చేసి పెట్టుకుంటాను"
ఇదొక్కటే కాదు, ఈ 'ఇంటివైపు'లోని ప్రతీ కవితలోనూ మనల్ని మనం లీనం చేసుకుంటాం. కాసేపు మనతోనే మనం, ఆ మాటల్ని చెప్పుకుంటున్నట్టుగా భ్రమిస్తాం.
"ఎంత నిదానంగా వెనకడుగులు వేసావో
అంత తపనగా మళ్లీ ఆ అడుగులన్నీ
జీవితం నుండి అడిగి అడిగి తెచ్చుకుంటావ్ నువ్వే!"
అన్నారు 'చిన్ని పాదాలు' అనే కవితలో ఆయన. అవును... అడిగి అడిగి మరీ తెచ్చుకుంటాం - మనవైన మరి కొన్ని జ్ఞాపకాలని, మరుపు కొండల్ని తవ్వి మరీ, మన గతాల్లోంచి.
ఇంటికి చెందిన జ్ఞాపకాలతో, బెంగల్తో మొదలయ్యే ఈ పుస్తకంలోని పేజీలన్నీ, పోయే కొద్దీ, మరింత క్లిష్టమైన అనుభవాల్నీ, అనుభూతుల్నీ తర్కించుకుంటూ తిరిగిపోతాయి. ఓ పరాయి నేలా, మరో జ్వరమూ, ఇంకో షంషాద్ బేగం స్వరమూ, మరో గజల్ పై మోహమూ, కావేరీ తీరమూ, రాత్రై వెలిగిన పద్యమూ, అన్నం మెతుకు ఆక్రోశమూ, ద్వేష భక్తి గీతమూ...నిజమే, పుస్తకం పూర్తవుతుంది గానీ, నిజానికి మాటల సంచీ ఖాళీ అవనే అవదు. వినాలనుకున్నవింకా మిగిలే ఉంటాయి.
చివర్లో, ఈ కవితా సంపుటి గురించి అఫ్సర్ గారు రాసుకున్న "మా ఇంటి దాకా...!" చదివినప్పుడు, మా అత్తగారంటుండే ఓ మాట గుర్తొచ్చింది.
'చదువుల కోసమని పిల్లల్ని మరీ పసివయసుల్లోనే దూరంగా పంపేసి, వాళ్లాడుకున్న వస్తువులన్నీ సర్దుతున్నప్పుడు, మనిషి పోయినంత ఏడుపొచ్చేదట ఆవిడకి!'. ఎప్పుడో మనం వదిలి వచ్చేసినవన్నీ, ఇప్పటికీ మనల్నింతగా కదిపి కదిలిస్తుంటే, అలా పంపించి మనల్ని దూరం చేసుకున్నవాళ్లంతా, అప్పటికీ ఇప్పటికీ మనకోసమని ఇంకెంతగా తల్లడిల్లుతుంటారో కదా!
*

అనేక దూరాల ప్రయాణం అఫ్సర్!


Image may contain: 5 people, including Afsar Mohammed, people smilingGenuine poetry can communicate before it is understood…..TS. Eliot
ఆయన కవిత్వం ఇంకా పూర్తిగా అర్థం అయ్యేలోగానే, తాను అనుకొన్న భావాన్ని, పాటకుడి మనసు లోకి ప్రవేశ పెడతాడు. అందుకే అఫ్సర్ కవిత్వం హడావుడి గా చదివేది కాదు. చక్కగా తలస్నానం చేసి, ఆరుబయట చల్లటి గాలి లో, వేడి ఫిల్టర్ కాఫీ తాగుతూ, చదవాలి. చదివిన కవితలోని వాక్యాలను , కవితాసక్తి ఉన్న యువకవికొ, కవియత్రికో చెపుతూ, గుండెల నిండా ఆ ఆనందాన్నో, ఆ ఉద్వేగాన్నో అనుభవిస్తూ ఉండాలని పిస్తుంది. నా మటుకు నేనైతే, ఆయన కవిత్వాన్ని ముఖ్యంగా వలస, “ఇంటివైపు” చదివి, కవితాశక్తి ఉన్నవాళ్ళతో ఆ కవిత్వంలోని వాక్యాలను షేర్ చేసుకొన్నాను. అఫ్సర్ తో పరిచయం ఒక గొప్ప విశేషం.
.
నేను ఆంధ్ర భూమి లో జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు అఫ్సర్ అనంతపురం ఆంద్ర భూమి కి ఎడిషన్ ఇంచార్జ్ గా ఉండేవారు. మేడం కల్పనా గారు కూడా అక్కడ మా డెస్క్ చూసే వారు. ఎంతగా ప్రోత్సహించే వారో నాకిప్పటికీ గుర్తే. ఆయన అమెరికా కు వెళ్ళే సమయం లో తన దగ్గర ఉన్న వెయ్యి కి పైగా సాహితీ పుస్తకాల తో పాటు, అవి ఉంచుకోవడానికి రాక్ లు కూడా పంపినారు.
..
ఆయన అనంతపూర్ లో ఉన్న రోజుల్లో రాయలసీమ సమస్యలపి తనదైన శైలి లో మొత్తం జర్నలిస్టులందరినీ రాయమని చెప్పేవాడు. ఆయన ఎన్నో వ్యాసాలు రాసాడు. రాయలసీమ కె ప్రత్యేకం అనే అంశాలు నాతో చాల రాయించాడు. సీమ కె ప్రత్యేకమైన అనేక అంశాల పై ప్రత్యెక శ్రద్ధ చెప్పి నాతో రాయించాడు. అలాగే, ఇక్కడ గూగూడు లో ఆయన రాసిన the festival of pires పీర్ల పైన అంతర్జాతీయ స్థాయి లో ఆయన పుస్తకం ఖ్యాతి గాంచింది. ఆయన ఇటీవల విడుదల చేసిన కవితా సంకలనం “ఇంటివైపు’ నా దగ్గరకు చేరడమే ఒక ప్రత్యేక పరిస్థితి. ఎలాగోలా కష్ట పడి తెప్పించుకొన్నాను.
సాదాసీదా సాఫీ వాక్యంలా సాగే అఫ్సర్ వాక్యం అంత సాదా కాదు అర్థం అనంతం. చదువుతున్న ప్రతిసారీ ఏదో ఒకటి కొత్త గా కనిపించటం ప్రత్యేకత. ఆడంబరం అలంకారం అద్దని అతి సాధారణ సరళ పదాల సహజమైన అందం అఫ్సర్ కవిత్వం. కానీ... పైకి కనిపించినంత నిరాడంబరత ఆ కవిత్వం చదువుతున్నప్పుడు కనిపించదు. ఓ నిశ్శబ్దం మనలోకి ప్రవేశించి విస్ఫోటనం చెందుతున్న శబ్దం కచ్చితంగా విని తీరతారు. అప్పుడు అసలు కవిత్వం అర్థం అవటం మొదలౌతుంది. ఒకే కవిత, చదువుకున్న ఒక్కొక్కరికి ఒక్కోలా వినిపిస్తుంది. ఒకే చదువరికి, చదువుకున్న ప్రతిసారి ఒక్కోలా కనిపిస్తుంది. మొత్తానికి ఏదో తెలియని అస్పష్ట అవ్యక్తతల మధ్య స్పష్టత స్పృశించి బయటకు వస్తాం.
అతని కవిత్వం... ఒక నిరంతర చింతనా.. నిరంతరాన్వేషణా.. అంతఃశోధనా.. ఆత్మావలోకనా.. అలౌకికతా... తాత్వికతా.. ఏదైనా.. అతని అక్షరాలెప్పుడూ అనేక భావాల్ని అభావంగా అలా వదిలేసి వెళ్ళిపోతాయి. అనేక భావాల్ని అభావంగా .. ఏంటీ అనిపించొచ్చు. అభావంగా అంటే.. అతని కవిత్వం ఉప్పెనై ఎగిసిపడదు.. ఆవేశమై ఆగ్రహించదు.. ఆరాటమై కంగారు పడదు.. ఆవేదనై పొంగి పొర్లదు.... కానీ... చదువరి మస్తిష్కాన్ని మౌనంగా ముంచేస్తది. ఆలోచనల్ని ఆక్రమించేస్తది. మోహాన్నీ అమోహంగా చెప్పటం.. అక్షరాలుగా చూస్తే అస్పష్టత గోచరిస్తూ.. చదువరికి మాత్రమే స్పష్టమయేలా రాయటం.. ఏం చెప్పారూ.. అనిపించటం.. ఎంత చెప్పారు అనిపించటం..
..
Poetry is a type of literature based on the interplay of words and rhythm....అక్షరాల అఫ్సర్ అక్షరాలతో చేసిన విన్యాసమే ఆయన “ఇంటివైపు” కవితల సంకలనం. చెప్పూ చెప్పూ చెప్పూ //గొంతులో సముద్రాన్ని జోకొట్టినట్టు //సముద్రం లో పదాల్ని విసిరేసినట్లు //3//యీ లోకంతో ఇంకేం పని అని //పడుకొంటాను మూడ౦కెలా-//కలల్ని వేలాడేసి//ఖాళీ తనాలపంకీకి -//
Poetry comes from the highest happiness or the deepest sorrow….. ఏపిజే అబ్దుల్ కలాం అన్న మాట అక్షరాల నిజం. అఫ్సర్ కవిత్వం లో గాయపడిన కవి గుండె కనిపిస్తాది. గాయం చేసిన నొప్పి ని పాటకుడి లోకి పంపుతాడు. కవిత పూర్తి అయ్యే లోగా అతడి నొప్పిని, గాయాన్ని మటుమాయం చేస్తాడు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అది నా స్వానుభవం.
..
ఎక్కడెలా ఎందుకు గాయపడ్డావో
నిన్ను నొప్పించి అయిన అడగాలనుకుంటాను.
తాకి చూడడానికి ఆ దిగులుకొక
శరీరం వుంటే బాగుండనీ అనుకొంటాను.
నువ్వు ఏ ఏ పదాల్లో దీన్ని గురించి చెప్పుకుంటూ వెళ్తావా అని
ఎదురు చూస్తూ ఉంటాను. ..... ఈ వాఖ్యాలు ఆయన కవిత్వం లోనివి. వాటిని ఎలా ఉంటుందో అని ఇంగ్లీష్ లోకి అనువాదం చేసి చూసాను. ఒక శబ్దం ఉంది. ఒక లయ ఉంది. అది లిరికల్ పోయెట్రీ అని చెప్పేయొచ్చు.
Where and how you were wounded
I would like to ask even it pains you.
I feel better….
That affright should have a body…
To touch and see!
I will be watching…..
In which words you will render about these…
ఆ నొప్పి ను కూడా ఒక రిధంలో తీసుకురాగల నేర్పరి అఫ్సర్ . సాదారణ౦గా లిరికల్ పోయెట్రీ లిరిక్ రైటర్ ల లైన్స్ లో వినొచ్చు...చూడొచ్చు. సాదారనంగా కవిత్వం రాసే కవుల కవితల్లో ఆ మీటర్ , ఆ ప్రాస, ఆ రిధం ఉందంతే, అది ఓ అద్బుతంగా ప్రజల నోళ్ళల్లో నాన్తుంది. పుట్టపర్తి నారాయణ చార్యుల వారి శివ తాండవం లో “ ఆడేనమ్మా శివుడు.. పాదేనమ్మా భవుడు” అనే వాఖ్యాలు, ఆ మోత్హం శివతాండవం లో జనవాహిని గుండెల్లో మార్మోగుతుంది. అలాగే, శ్రీ శ్రీ కవితల్లోని రిధం, ఆ లిరికల్ అస్పెక్ట్ ఆయన్ను యుగకవి గా మలచింది.
Poetry is when an emotion has found its thought and thought has found words….robert frost
అఫ్సర్ లో ఒక అమాయకపు పిల్లవాడు దాగున్నాడు. అతడిలో దాగున్న ఆ పిల్లాడి అమాయకపు ప్రశ్నలు అతని కవిత్వాన్ని ఆ పిల్లవాడు చిన్ని చేతులను తిప్పుతూ మనల్ని అడిగినట్లు అనిపిస్తుంది. అఫ్సర్ కవిత్వ ప్రపంచానికో విభ్రమ. విదేశాల్లో ఉండి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జాతర చేస్తుంటాడు. సారంగా... అక్షర అనే వెబ్ పత్రికలు నడుపుతూ, ఎందరో కవులను motivate చేస్తూ ఒక అవ్యక్తానందాన్ని పొందుతాడు. ఇంతా చేసి, ఆయన ఏమైనా ఆశిస్తునాడా? అనే ప్రశ్న నాకిప్పటికీ అర్థం కాలేదు. ఒకటే తపన. ఒకటే ఆరాటం. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఆయన పట్టు అద్వితీయం.
Poetry is an echo, asking a shadow to dance…….carl sandburg ... ఇది ముమ్మాటికి అఫ్సర్ కవిత్వం లో నిజం. అయన కవిత్వం చదివి పుస్తకం మూసి వేసినా సరే, ఒక చిన్న నొప్పి అక్షరాలతో వెంటాడుతుంది. చదువుతున్నంత సేపూ పాటకుడి లోని ఒక ఉద్వేగం నిజంగానే నర్తిస్తుంది.
ప్రముఖ కవి వంశీ కృష్ణ గారు చెప్పినట్లు... అఫ్సర్ కవిత్వ ప్రస్థానం లో మూడు దశలు వున్నాయి . ఒకటి ఖమ్మం లో చదువుకున్నప్పటి దశ . రెండు ఆంధ్రజ్యోతి .. ఆంధ్రభూమి లలో ఉద్యోగించిన దశ . మూడవది అమెరికా . ఈ మూడు దశలలో అఫ్సర్ కవిత్వం బహుముఖాలుగా విస్తరించింది . ఎక్కడో నాసికా త్రయంబకం లో ఒక చిన్న , సన్నటి , పల్చని ధారగా మొదలైన గోదావరి పలు రకాలుగా ప్రవహించి , విస్తరించినట్టుగా అఫ్సర్ కవిత్వం కూడా ఖమ్మం లో సన్నగా మొదలై ఇవాళ విశ్వవ్యాప్తం అయింది
..
చూడు ఈ చరిత్ర లోకి మనిద్దరం
మనకి తెలియకుండానే,
కాల్లీడ్చుకొంటూ వొళ్లీడ్చుకొంటూ వచ్చాం
అసలు చరిత్ర నీకు తెలుసు
నా ముఖమ్మీదనే ఉమ్మి రంగులద్ది
నీ ముఖమ్మీదనే రక్తపు చారికలు అలిమి...
ఇద్దరికిద్దరం ఒక అబద్దాన్ని మోస్తూనే..
భారిస్తూనే కర్మ కర్మ అంటూనే..... ఇవి ఆయన కవిత్వం లోని వాక్యాలు. అసలు ఫిలాసఫీ ని కవిత్వాన్ని మిళితం చేసే విధ్యేదో ఆయనకు అబ్బినట్లు అనిపిస్తాది. One may be both a poet and a philosopher, but not at the same time: the two belong to very different spheres of activity. ఇందుకు భిన్నంగా మనకు అఫ్సర్ కనిపిస్తాడు. ప్రముఖ కవి Roger Caldwell సూచి౦చిన విషయం అఫ్సర్ అక్షరాల పాటిస్తున్నాడు. ఆయన అంటాడు....philosophy & poetry to be mutually alienి అని..
..
ఇలా వ్యాసం రాస్తూ... ఆయన తో కొన్ని మాటలు మాట్లాడాలని అనిపించింది.. నేనో నాలుగు ప్రశ్నలు వేసాను. ఈ వ్యాసం లో అక్కడక్కడా, నేను వేసిన ప్రశ్నలు.. ఆయన ఇచ్చిన సమాధానాలు పొందు పరుస్తున్నాను.
సి.వి. సురేష్ : 1. ఆధునిక కవిత్వం లో శిల్పం..వస్తువు . శైలి .ఇవేవీ కూడా నిర్దిష్ట0గ సూత్రీకరించలేక పోతున్నారు..ఈ దశలో కవిత్వం నిర్ధేశించే గొప్ప కవులు కానీ.ఫలానా వారు మంచి కవులనీ..వాళ్ళు చెప్పే విధంగా లేకపోతే కవిత్వం కాదని చెప్పే అవకాశం లేకపోయింది.. .. ఈ దశలో రైటర్స్ కు దిశ దశ నిర్దేశించే ఒక గురుత్వం కూడా మాయమైంది.. ఎవరూ శిక్షణ తరగతులు కూడా నిర్వహించడమ్ లేదు. ఇది ఏ పరిణామాలకు దారితీయొచ్చు.!?
అఫ్సర్: చాలా మంచి ప్రశ్న, సీవీ! మొదటి భాగానికి నా జవాబు: కవిత్వంలో ఆ మాటకొస్తే మొత్తంగా సాహిత్యంలోనే సూత్రీకరణలు చాలా కష్టం. మొదటి నించీ మనది అభిరుచి విమర్శ మాత్రమే. లోతైన విమర్శ చేస్తే తట్టుకునే శక్తి రచయితలకూ లేదు, చదువరులకూ ఆసక్తి లేదు. నా దృష్టిలో ఎప్పటికీ రాచమల్లు రామచంద్రా రెడ్డి మాత్రమే అలాంటి సూత్రీకరణలతో కూడిన విమర్శ చేయగలిగారు. సాహిత్య విమర్శకి స్వయం ప్రతిపత్తి, సొంత గౌరవం వచ్చే దాకా ఈ పరిస్థితి మారదు. ఇక ప్రశ్నలో రెండో భాగం: గురుత్వం అక్కర్లేదు. గురువుల వల్ల నష్టమే కాని లాభాలు తక్కువ. వొకరు గురువూ, ఇంకొకరూ లఘువూ అనుకునే మనస్తత్వంలో ఫ్యూడల్ లక్షణాలున్నాయి. అయితే, కవిత్వ శిక్షణ కి సంబంధించి “కవి సంగమం” చేస్తున్న కృషి మీద నాకు భరోసా వుంది. ఆ మేరకు కవి యాకూబ్ కృషి నిలబడుతుందన్న నమ్మకమూ వుంది.
ఆయనలో దాగున్న ఆ అమాయకపు పిల్లాడు.... ఎలా చెప్పగలిగాను సివీ ?అని అడిగాడు. అప్పుడు నేను ఇంకో పది ప్రశ్నలు అడిగి ఉంటె బావుండేదేమో అనిపించింది...! అని నేను చెప్పాను.
progressive పోయెట్... నేను ఆంద్ర భూమి లో పని చేస్తున్నప్పుడు నాకెప్పుడూ చెప్పేవాడు... ప్రజల పక్షాన జర్నలిజం ఉండాలి సురేష్ అనేవాడు. పీడిత పక్షాన నిలబడినప్పుడే సాహిత్యం కానీ. జర్నలిజం కానీ మనగలుగు తుంది. అని చెప్పేవాడు.
ఈ వ్యాసం రాస్తూనే, ఆయన ను నేను అడిగిన రెండవ ప్రశ్న....
సి.వి. సురేష్ : 2.. ఎవరికి మెడల్స్.. ?ఎవరికి శాలువాలు.. ?ఎవరి కి ప్రశంస ?అనే ఒక ఆలోచన అందరిలో ఉంది.. అటువంటి నేపధ్యం లో 'ఆకవిత్వం' బహిష్కరింపబడలేదు.. దానిని త్యజించడం లేదా అది కవిత్వం కాదు.. అని ఐడెంటిఫై చేసే ఒక వ్యవస్థ అవసరమా!? ఎలాంటి కరెక్షన్ కావాలనుకొంటున్నారా?
అఫ్సర్: సాధారణంగా అకవిత్వమే అందలాలు అందుకుంటుంది. అందలాలు అంటే ఈ వ్యవస్థ సృష్టించిన కృత్రిమ గౌరవాలు! మంచి కవి వాటి జోలికి పోడు, జోలె పట్టడు. మీరు చెప్పిన మాట బాగుంది. ఏది కవిత్వం కాదో ఎవరో వొకరు చెప్పాలి. అది కవులు చేయలేరు. గొప్ప విమర్శ ద్వారానో, గొప్ప అనువాదాల ద్వారానో మాత్రమే తెలుస్తుంది. మన అనువాద రంగం బలపడితే, అదే గొప్ప కరెక్షన్!
యిది ఆట సమయం ! అనే కవిత లో వాఖ్యాలు చూడండి...
యిప్పుడంతా నీ పసిపాదాల పద్యాన్ని నేను. ఆ పాదాల్లో సేలయేటి పరుగును నేను.ఆ పాదాలు వెతుక్కుంటున్న నెమిలి నడకని కూడా నేనే. యిప్పుడీ క్షణం లో కొన్ని కాలాలు ఇలా నీ ఎదుట freeze అయిపోయి, జీవితం మరీ నెమ్మదించిన still painting అయిపోతే బాగుణ్ను అనుకుంటాను కానీ, నువ్వు నన్ను ఎన్నిపరుగులు తీయిస్తావో తెలుసుకదా నాకు..
తత్వం బోధించే ఈయన కవిత్వం లో ఓ విలియం బ్లేక్, ఓ ఎమిలి డికెన్సన్, ఓ హఫీజ్ మనకు కనిపిస్తారు. పై వాఖ్యాల లోని తత్వం గమనిస్తే,...జీవితం మరీ నెమ్మదించిన still painting అయిపోతే బాగుణ్ణు అనడం ఎంత వేదన , ఎంత నొప్పి, ఎంత తత్వం మనకు కనిపిస్తాదో... ఇలా చెప్పుకొంటూ పోతే కొండవీటి చేంతాడు అంత అవ్వడం ఖాయం.
ఈ సందర్భంగా... ఆయనను నేను అడిగిన మూడో ప్రశ్న.... నిడివి ఎక్కువ కావడం తో ... నాలుగో ప్రశ్న కూడా సాహితీ మిత్రులకు ఉపయోగ మవుతుందని ఇక్కడే వరుసగా ఉంచాను....
సి.వి. సురేష్ (౩.) దాదాపు 3 దశాబ్దాలు పైనే మీకు కవిత్వం తో సహచర్యం...ఈ పీరియడ్ లో కవిత్వ లక్ష్యం ప్రజలకు అందుతోందని భావించారా!? ఎక్కడైనా ఈ కవిత్వానికి దుర్దశ కమ్మిన నేపధ్యం చూసారా!?
అఫ్సర్: ఇన్నేళ్ళ ప్రయాణంలో కవిత్వమూ కథా ఇవి రెండు మాత్రమే నాకు మిగిలాయి. సాహిత్య విమర్శ కొంత రాసినా అది పరిమితం. నా మటుకు నా కవిత్వమూ కథలూ రెండూ నేను అనుకున్న లక్ష్యాలను అందుకున్నాయి. రాయడం మొదలు పెట్టిన ఇన్నేళ్ళ తరవాత కూడా ఇవాళ నా పేరు కొంతమందికైనా గుర్తుందీ అంటే ఆ లక్ష్యం గురి తప్పలేదనే కదా! కవిత్వానికి దుర్దశ, మంచి దశా లేవు. అది అప్పుడూ ఇప్పుడూ అలాగే వుంది. మనం చూసే దృష్టి కోణం మారుతోంది అంతే! శ్రీశ్రీ కి ముందూ వెనకా శూన్యం లాంటి మాటలు అర్థరహితం. అట్లాగే, ఏదో ఒక కవి పేరు మాత్రమే ధగ దగా వెలిగే స్థితి కవిత్వంలో ఏనాడూ లేదు. మన కవిత్వమనే కాదు, మీలాంటి వారు అనువాదం చేస్తున్న గొప్ప కవుల సంప్రదాయం చూసినా ఇది అర్థమవుతుంది. గొప్ప కావ్యాలు వెలుగుతాయి. గొప్ప భావనలు వెలుగుతాయి. వ్యక్తులు కాదు!
సి.వి. సురేష్ :(4.) వర్ధమాన కవులకు దిశ దశ నేర్పించాల్సిన అవసరం ఉందా!? మీరిచ్చే సూచనలు..సలహాలు? అఫ్సర్: నేర్చుకోవడం అనే ప్రక్రియ ప్రసిద్ధులకైనా, వర్థమానులకైనా వొక్కటే! నేర్చుకోవాలి అనే తపన ఆగిపోయిన చోట కవిత్వం నిలవనీరు అవుతుంది. ప్రవాహం మాత్రమే సాహిత్య లక్షణం. ఆ ప్రవాహంలో ఎప్పుడు కాళ్ళు తడుపుకున్నా, కొత్త నీటి తాజాదనం తెలియాలి. రాయడం, చదవడం ఎంత ముఖ్యమో వినడం, అర్థం చేసుకోవడం అనే రెండు ప్రక్రియలు కూడా అంతకంటే ముఖ్యం. ఆ చివరి రెండూ కాస్త దెబ్బ తింటున్నాయేమో అని కాస్త చింత అప్పుడప్పుడూ.
ఆయన కవిత్వం కో డిక్షన్ ఉంది. అది నేనైతే ముద్దుగా అఫ్సరిజం అంటుంటా.. ! అఫ్సరే ఓ కవిత్వం అని నా అభిప్రాయం.
వ్యాసకర్త.. సి.వి. సురేష్, అడ్వకేట్, ప్రొద్దటూరు. 7780151975

జ్ఞాపకాల పలవరింత

Image may contain: text
వలస పక్షులై దేశాలకి వెళ్ళినప్పుడు కన్న ఊరు, దేశం తప్పక మది లోకి రాక మానదు. తాను పుట్టిన భూమి నుంచి లక్షల మైళ్ళ దూరం లో ఉన్నా తన వారిపట్ల ప్రేమ ఇసుమంతైనా తగ్గదు. యాది లో కొచ్చిన ప్రతి సంఘటనని సందర్భాన్ని అందమైన అక్షరమై హృదయానికి హత్తుకునే అక్షర సుమాల్ని మనకి అందించారు అఫ్సర్ గారు తన "ఇంటి వైపు" లో .. 

ఖపు ప్రపంచం లో ఓక్క సంతోష వీచిక లేదని దిగులెందుకు అప్పుడుఅప్పుడు చిన్ననాటి తలుపులు తీసి "బచపన్" లోకి వెళ్లి రమ్మంటారు. మాతృభూమిని ఎవరికైనా ఒక్కటే అలాంటి తన దేశం లో తన అస్థిత్వాన్ని, దేశభక్తి ని నిరూపించుకోవాల్సి రావడం విచారమే అయినా సరే "నన్ను ఖడ్గం తో నరికినా నేను ప్రేమిస్తూనే ఉంటాను" అని తనని ద్వేషించిన వాళ్ళకి కూడా ప్రేమ ని పంచుతారు. ఈ లోకపు మాయ మర్మానికి అందనంత దూరం గా తనలోకి తాను వెళ్లి చిన్నప్పటి మధుర జ్ఞాపకాల్ని "ఇంటివైపు " లో వెతుక్కుంటూ పలవరిస్తారు.తెలంగాణ బతుకు చిత్రాన్ని రోజ్ రోటీ అద్దం లోంచి రాస్తున్న కొత్త చరిత్ర ని చదివితీరాల్సిందే. 
నెత్తుటి చొక్కా స్వగతం ఇప్పుడు జరుగుతున్న చరిత్రనే. ఇప్పుడు నేనో విడిచివేయబడిన వొట్టి వస్త్రాన్నే నిజమే కానీ తెగిపడిన ప్రాణాల చివరి కేకలు వినమంటూ ఒక ప్రశ్న ని ముందుంచి ఆలోచించమంటారు. అప్సర్ గారి కవిత్వం కేవలం అస్తిత్వ ప్రధానంగానే కాదు, భావ సంఘర్షణ, ప్రేమ ప్రధానం గా కూడా సాగిపోతుంది . ప్రేమ వ్యక్తీకరణలు ఆద్యంతమూ మనల్ని చూపు తిప్పనివ్వదు. ప్రేమ అంటే మాములు ప్రేమ కాదు తనలో దాచుకున్న అన్ని వెతల్ని, విషాదాల్ని వెలితి ని అక్షరం లో అందం గా పేర్చారు. ఓ చోట ఇలా అంటారు ."ఇంకా నీకు తెలియదు ఎప్పటికి నీకు తెలియదు

నీ నిన్న లోనే నేను, నీలోనే నేను నిలువునా రాలిపోయావని" ఇది ఒక స్త్రీ పురుషుడి కి రిలేటెడ్ అనిపించినా, కొన్ని వేల మంది వేదన ప్రేమ మనకి కనిపిస్తుంది. పదాలతో ఆట ఆడుకోవడం, కవితలకు సున్నితత్వానికి రంగులద్దడం అడుగు అడుగునాన అద్బుతమనిపిస్తుంది. "ఇది ఆట సమయం" అంటూ మనల్ని కూడా అందులోకి లాగేస్తారు. నేనొక పసి పాదాల పద్యాన్ని, పదాల్లో సెలయేటి పెరుగుని ని దా మరోసారి ఆడుకొందాం .క్షణ క్షణ పుట్టినరోజులు పునర్వజన్మలలో ప్రతీసారి నాకు నేనే మెలుకువ, నాకు నువ్వే మేల్కొల్పు అంటూ స్నేహాన్ని దానిలో మాధుర్యాన్ని ఎంతో బాగా చెప్పారు.
కవితలన్నిటి లో అంతర్లీనంగా ఒక జ్ఞాపకం ఉంది. తనకి గుర్తుకు వచ్చిన ప్రతి జ్ణాపకాన్ని, తానూ నడిచివచ్చిన ప్రతి సందర్భాన్ని కవిత్వీకరించారు. అది స్పష్టమైన, అస్పస్టమైన కూడా ఎక్కడా తడబడకుండా నిత్యం స్మరణ తో ముందుకు సాగిపోతారు . అఫ్సర్ గారి కవిత్వాన్ని చదవడం ఒక ఆనందం, ఒక ఉద్వేగం, మరో పిడికిలెత్తిన ఆవేశం ఇలా ఎన్నో భావాలూ మనల్ని మూకుమ్మడిగా చుట్టుముడతాయి
. ఈ అద్భుతమైన కవితా సంపుటి ని మూడు భాగాలుగా విభజించినా నేపధ్యం అంతా ఒక్కటే. "రేగుపళ్ళ వాసన లో కి, దూరాల మాటే కదా, ఎటో చెదిరిన పడవై, ఇలా మూడు భాగాలూ ఒక సజీవ చిత్రాన్ని కళ్లముందుంచుతుంది. "ఇవాళ" నుంచి ఇంటివైపు దాకా సాగిన కవితా ప్రస్థానం గొప్పగా ఉంటుంది. ప్రతి కవితా సంపుటి లో వైవిధ్యాన్ని రంగరించి ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తున్న అఫ్సర్ గారి కవిత్వం రాబోయే కాలానికి ఓ దిక్సూచి అనడం లో ఎంతమాత్రం సందేహం లేదు ....అద్భుతమైన కవిత్వాన్ని అందించిన అఫ్సర్ గారికి అభినందనలు.
-పుష్యమీ సాగర్

అఫ్సర్ వాక్యమే అఫ్సర్: బాలసుధాకర్ మౌళి

"కవి సంధ్య" పత్రిక జూన్ సంచిక నుంచి 1 అఫ్సర్ 'ఇంటివైపు' కవిత్వ సంకలనం నిండా ఖండితఖండితాలైన అతని హృదయం కనిపిస్తుంది. ఒక్కో ఖండితంలో ఒక్కో హృదయం పుట్టుకొచ్చిందేమో అని అనిపిస్తుంటుంది. కవికి ఎన్ని హృదయాలో.. ఎంత నిబ్బరం వున్నవాడో... అన్నన్ని జ్ఞాపకాల దిగుళ్లూ, వర్తమాన సంక్షోభ సమయాలూ, నెత్తురు వుబికే కలలూ - అన్నింటినీ నిక్షిప్తం చేసుకుని అగ్నిగుండంగా మారడానికి కవికెంత దృఢహృదయం కావాలి? అఫ్సర్ - గతవర్తమాన కాలాల్లోని సలిపే గాయాల అన్వేషణ కోసం బయలుదేరిన వ్యాఖ్యాత - శకలాల శకలాల కవిత్వ వాక్యాల ద్వారా మనల్నీ గాయపడమని చెప్పే అసలైన వ్యాఖ్యాత. అతని వాక్యం ఎంత కఠువో అంత సున్నితం. ఉత్త వ్యాఖ్యాతే కాదు - అతను రక్తమండలమై మనల్ని రక్తమండలం చేయగలడు. చిన్న చిన్న సరళమైన వాక్యాలతోనే గాఢమైన అభివ్యక్తిని సాధించడం జీవితంతో పెనవేసుకున్న కవికే సాధ్యం. ' యివాళ యీ చిన్ని పాదాల్లోకి వలస వెళ్లి వచ్చాను ' కవి జీవితంలో వలస సాధారణమైపోయింది. పుట్టిన వూరిని దాటి నగరంలోకి కదలిపోవటం, నగరం నుంచి దేశం దాటి పోవడం - జీవితం అనేక దృశ్యాల పరంపర - అఫ్సర్ జీవితం అఫ్సర్ ది. అతని సొంతం. అయితే అతను వాక్యాల వల వేసి అతనిలోకి మనల్ని లాక్కుపోవడమే అతను చేస్తున్న ఇంద్రజాలం. ' మిగిలిన అన్ని ప్రయాణాలూ లోకం కోసం యీ వొక్క ప్రయాణమే నాదీ నా లోపలికీ అనిపిస్తుంది ' ఇంటి జ్ఞాపకాలను, వూరి జ్ఞాపకాలను గాఢంగా హత్తుకుని పదేపదే నెమరువేసుకుని వాటితో మమేకమై - మనల్నీ ఆ వుద్వేగాల్లోకి తీసుకుని వెళ్లడం అఫ్సర్ కే చెల్లు. అఫ్సర్ కవిత్వం చదువుతుంటే అతనే నా లోపలికొచ్చి పాడుతున్నట్లుంటుంది. నా లోలోపలికి దారి చేసుకుంటూ వెళ్లి - ఏదో పరిచయమున్న పాటనే ఇష్టంతో ప్రేమతో మోహంతో అమితమైన వుద్వేగంతో ఆలింగనంతో పాడుతున్నట్టే వుంటుంది. అతని వాక్యాల్లో ఒక సున్నితమైన లయ వుంటుంది. చదివి అనుభవిస్తే గాని, అనుభవించి ఓలలాడితే గాని ఆ మత్తు వదలదు. అతని వాక్యాల్లోనే అతని గొంతు వినిపిస్తుంది. అది అలవోకగా మన లోపలికి దారి తీస్తుంది. పసిగొంతు అఫ్సర్ ది. ' యెంత కష్టమో పసితనం తెలుస్తోంది నాకిప్పుడు ' అఫ్సర్ ని బాల్యం వదలదు. బాల్యం అఫ్సర్ ని వదలదు. 2 కొన్ని కొన్నిసార్లు - అఫ్సర్ కవిత్వాన్ని ముట్టుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ' నోరు, చెయ్యి అను రెండు దేశాలు ' లాంటి కవిత ఎంత క్షోభ పడితే గాని రాయగలం. కవిత్వ పాఠకుడిలో కవి క్షోభ యదాతథంగా ప్రతిఫలించడం అఫ్సర్ సాధించిన కవిత్వరహస్యం - రహస్యం అని అనుకుంటాం గాని హృదయాన్ని మెలిపెడితే గాని లోపలికి చొరబడదు క్షోభ - మెలిపెట్టే క్షోభ అఫ్సర్ ది. ' నోరు, చెయ్యి అను రెండు దేశాలు ' , ' రోహిత్ కోసమే కాదు! ' లాంటి కవితలు బాల్య జ్ఞాపకాల్లాంటివి కావు - నిత్యం సలిపే వర్తమాన నెత్తుటి జ్ఞాపకాలు - హృదయాన్ని స్తంభింపచేసే జ్ఞాపకాలు. అఫ్సర్ కవిత్వాన్ని గురించి మాట్లాడ్డం సులువు కాదు. అతని వాక్యాల వద్ద రోజుల కొద్దీ నిల్చోవాలి - వేచి వుండాలి - వాక్యం గెడ్డం పుచ్చుకుని బతిమాలుకోవాలి - అప్పుడికి గాని వాక్యం కరుణకు లోనవం. అఫ్సర్ అల్లుకుంటే వదలని కవి. కవి రాసే వాక్యం బట్టే కవి మీదా గౌరవం పెరుగుతుంది. అఫ్సర్ వాక్యం మీద నాది అపరిమితమైన గౌరవం. ' మరణంలో మాత్రమే నిన్నూ నన్నూ యెవరినైనా పలకరించే పరమ లౌక్య లౌకిక లౌల్యంలో వున్నవాళ్లం కదా ' ఇలా రాసి అఫ్సర్ లౌక్యలోకాన్ని మన ముందు దోషిని చేసి నిలబెడతాడు. లౌక్యం రంగుల అద్దాన్ని బద్దలు చేస్తాడు. కవి నిజాయితీపరుడైతే కవిత్వమూ నిజాయితీని వెంటబెట్టుకుంటుంది అనడానికి ఈ వాక్యాలు నిదర్శనంగా మిగులుతాయి. అఫ్సర్ నిత్య వర్తమాన కవి. అఫ్సర్ కవిత్వం అఫ్సర్ ది. వాక్యంలో నగానట్రా లేకపోయినా మనల్ని అల్లుకుని వుక్కిరిబిక్కిరి చేసి అక్కడ నుంచి ఒక్క ఇంచు కూడా కదలనివ్వని విలక్షణత అతని సొంతం. చదవగా చదవగా వానకి ప్రతిరూపంగా అఫ్సర్ కనిపిస్తారు. అందుకేనేమో - 'అన్నీ తెలిసిన వాన' కవితలో -- ' యెప్పుడు యెలా కురవాలో తెలుసు వానకి !' ' యెప్పుడెలా కురిసినా వొకేలా వుండడమే తెలుసు వానకి ' అనగలిగాడు. కవిత్వ వాక్యాల్లో కవి కనిపించడమే కవిత్వం సాధించిన విజయం. 3 అఫ్సర్ కవి అంతరంగం మరీ సున్నితం కాబట్టే వాక్యాల్లో ఆ లేత పసితనం. చిన్ని చిన్ని సంతోషాలకి ఎగిరిపడతాడు. దూరాలను తలచుకుంటూ దిగాలు పడతాడు. దగ్గరితనం కావాలని తహతహలాడుతాడు. తన లోపలి పేజీలు అందరినీ చేరేట్టు పరమ సున్నితంగా చదువుతాడు. ' అవున్లే ఏం మాట్లాడుకుంటాంలే బతుకే వొక అలసట అయపోయినప్పుడు అలసట తప్ప ఇంకేమీ మిగలనప్పుడు ' కవికి చాలా రహస్యాలు తెలుసు. అందులోనీ జీవితరహస్యాల గుట్టు జీవితమంత విశాలంగానూ తెలుసు. ' అన్నీ దాటి వచ్చామనుకున్నప్పుడు అసలేదీ యెప్పటికీ దాటి వెళ్లలేమని ' ఎంత గాఢతాత్వికత కవిది. అఫ్సర్ కి బాధ తెలుసు - వ్యకిగత బాధ స్థాయి నుంచి సామూహిక బాధ వరకూ.. అస్తిత్వ స్పృహ వున్న మనిషి కాబట్టి - ఏ బాధనీ neglect చేసే రకం కాదు. బాధని expose చేసే సృజనశీలి - సున్నిత జీవి. ' వొకే వొక్కసారి నా నిజమైన ఏకాంతంలోకి నెమ్మదిగా నడిచి రా ' కవి రమ్మన్న ఏకాంతాన్ని ఆస్వాదించడానికి కవి సృజించిన వాక్యాలు సరళమైన ఒక దారిని వేసి వుంచాయి. ఆ దారంట వెళ్తే అమోఘమైన ఏకాంతం మనదే అవుతుంది. దుఃఖ ఏకాంతం మనసుకి దగ్గరైనది. దేశభక్తి అంటే ఏమిటి ? అనే దానికి అఫ్సర్ కవిత్వం వొక జవాబు. ' యింకో ద్వేషభక్తి గీతం ' అని పదునైన కవిత రాసారు అఫ్సర్. ' నేను ప్రేమిస్తూనే వుంటాను నీ చేతులు ఖడ్గాలై నన్ను ఖండఖండాలు చేస్తున్నా సరే ! ' ఇది అఫ్సర్ విసిరిన సవాల్ - దేశాన్ని ఏ తెరలూ లేకుండా ప్రేమించే నిజమైన ప్రేమికుడు - ప్రేమించినవాడే సవాల్ విసరగలడు. ద్వేషం చూపేవాళ్లు సవాల్ ను స్వీకరించగలరా ? అఫ్సర్ అఫ్సరే - భిన్న పార్శ్వాలున్న కవి. ఇంటివైపు అతని విశ్వరూపం. అఫ్సర్ ని నిర్వచించాల్సొస్తే.. అఫ్సర్ వాక్యమే అఫ్సర్ అనాలి - అని తీరాలి. అఫ్సర్ వాక్యమే అఫ్సర్ 6 మే 2018

సదా బాలకుడు -అఫ్సర్: వంశీ కృష్ణ

ప్రియమిత్రుడు, కవి, కథకుడు, విమర్శకుడు వంశీ కృష్ణ "కవిసంగమం"లో రాసిన శీర్షిక నుంచి...
కాలం లో అఫ్సర్ గురించి రాయాలని రెండు మూడు నెలలు గా అనుకుంటున్నాను . ఎప్పటికప్పుడు ఈ వారం రాద్దాము అనుకోవడం, రాయలేక మరొకటి రాయడం అవుతోంది . ఈ కృత్యాద్యవస్థ రెండు నెలలనుండి నన్ను వేధిస్తున్నది . ఎక్కడి నుండి మొదలు పెట్టడం అనేది పెద్ద సమస్య . ఎలా ముగించడం అనేది మరొక పెద్ద సమస్య . మూడు దశాబ్దాలుగా ఒక కవిని సన్నిహతంగా గమనిస్తూ , రాసిన ప్రతి అక్షరమూ చదువుతూ , సంభాషిస్తూ వస్తున్నప్పుడు ఆ కవి గురించి పట్టుమని పది వాక్యాలు రాయడానికి ఇంత యాతన పడవలసిన అవసరం లేదు . కానీ రాయాలనుకున్నప్పుడు మనసులోకి వచ్చి చేరే భావాలకు అంతు లేక అవన్నీ ఒక దాని మీద మరొకటి గా ఓవర్ లాప్ అయి ఒక గజిబిజి దృశ్యం ఎదో మనోఫలకం మీద ఆవిష్కృతమై ఆరడి పెడుతున్నది
అఫ్సర్ నిరంతర కవి . శివారెడ్డి తనంత కవి అన్నాడు . తనంత కవి గురించి మాట్లాడటం అంత తేలికైన విషయమేమీ కాదు అని కూడా అన్నాడు . అఫ్సర్ ను ఎప్పుడు తలచుకున్నా నాకు ఒక పద్యం గుర్తుకు వస్తుంది .
కాస్త ప్రేమా ,కాస్త స్నేహమూ
కాస్త సంతోషమూ --- నీ కోసమే వీచే గాలి
నీ వెంటే నడిచే ఆకాశమూ
నిన్ను మాత్రమే పాడే పాటా
చిటికెన వేలు వొదలని నీడా
ఈ కవిత అఫ్సర్ రాసిందే . సురయా గురించి . అయినా అఫ్సర్ కి కూడా సరిగ్గా సరిపోతుంది . ఉద్యమాల ఖిల్లా ఖమ్మం నుండి వాణిజ్య రాజధాని విజయవాడ మీదుగా అతి పెద్ద అనంతపురం దాటి అమెరికా దాకా సాగిన అఫ్సర్ జీవిత ప్రస్థానం , సాహిత్య ప్రస్థానం వైవిధ్య భరితం . లోతుకు వెళుతున్న కొద్దీ అనితర సాధ్యమైన ఆకర్షణ ఎదో అందులో ఉంది . అది మనలను మోహపెడుతుంది . మనలను వివశులను చేస్తుంది
అఫ్సర్ కవిత్వ ప్రస్థానం లో మూడు దశలు వున్నాయి . ఒకటి ఖమ్మం లో చదువుకున్నప్పటి దశ . రెండు ఆంధ్రజ్యోతి .. ఆంధ్రభూమి లలో ఉద్యోగించిన దశ . మూడవది అమెరికా . ఈ మూడు దశలలో అఫ్సర్ కవిత్వం బహుముఖాలుగా విస్తరించింది . ఎక్కడో నాసికా త్రయంబకం లో ఒక చిన్న , సన్నటి , పల్చని ధారగా మొదలైన గోదావరి పలు రకాలుగా ప్రవహించి , విస్తరించినట్టుగా అఫ్సర్ కవిత్వం కూడా ఖమ్మం లో సన్నగా మొదలై ఇవాళ విశ్వవ్యాప్తం అయింది .
1980 ల మధ్య కవులుగా కళ్ళు తెరిచిన వారిని బలంగా ఆకర్షించిన వాళ్ళు ముగ్గురు ఒకరు శ్రీశ్రీ .మరొకరు తిలక్ , ఇంకొకరు శివసాగర్ . వీళ్ళు తప్పిస్తే మిగతావారు కవులే కాదు అనుకుని వాళ్ళ కవిత్వాన్ని పదే పదే పలవరించే తరానికి నారాయణ బాబు , అజంతా , వేగుంట ,బైరాగి ల ప్రాధాన్యాన్ని విప్పి చెప్పినవాడు అఫ్సర్. బహుళత్వం ఎప్పటికీ రహదారే అన్నది అఫ్సర్ విశ్వాసం .
కదిలేది , కదిలించేది లాంటి శబ్దాడంబరం లేకున్నా "కిటికీ తెరల కుచ్చులని పట్టుకుని జీరాడుతుంది దిగులుగా నీ పాట , జ్ఞాపకాలు వేధిస్తాయి కానీ ఆప్యాయంగా పలకరించవు లాంటి వాక్యాలు కూడా కోటబుల్ కోట్స్ గా మిగిలి పోతాయని అఫ్సర్ కవిత్వం నిరూపించింది .
తన సహా కవులనుండి అఫ్సర్ ను వేరు చేశే అంశం ఏదయినా వుంది అంటే అది అతడు పదాలకు వున్న ప్రీ సపోజిషన్ నుండి తప్పుకోవడం . భావాన్ని లలిత లలితం గా .మార్దవం గా పాఠకుడికి అందించడానికి అతడు ఎన్నుకునే పదాలకు వాటి ఉద్దేశిత అర్ధాలను మించి కొత్త అర్ధాలను ఆపాదించడానికి ప్రయత్నం చేసాడు . అది విజయవంతము అయింది . బహుశా ఈ ప్రయత్నం చేయడం వెనుక అతడు చదువుకున్న ఆంగ్ల , హిందీ సాహిత్యాల ప్రభావం ఉండి ఉండవచ్చు . ఇలా తన భాషను కొత్త గా తాను సృష్టించుకోవడం చేతనే అప్పట్లో అఫ్సర్ కవిత్వం పైన సూర్యాపేట నుండి వచ్చిన ఉజ్వల లో చర్చోపచర్చలు జరిగినయి . రాజీవ్ ఆంధ్రజ్యోతి లో రాసిన ఒక పెద్ద వ్యాసం లో అఫ్సర్ బ్రాండ్ కవిత్వం అంటూ కాయిన్ కూడా చేశాడు . ప్రముఖ హిందీ కవి సర్వేశ్వర్ దయాళ్ సక్సేనా మరణ వార్త విని . ఆయన చనిపోయేటప్పటికీ గుండెల మీద తెరచిన పుస్తకం వున్నదని విని రాసిన కవిత అంతిమ స్పర్శ ఎంతోమందిని ఆకర్షించింది . చాలామంది అది సుందరయ్య గారిని ఉద్దేశించి రాసింది అనుకున్నారు
1980 ల తరువాత తెలుగు కవిత్వం ఒక కొత్త అభివ్యక్తిని సాధించడం లో అఫ్సర్ దోహదం చాలా వుంది . అతడు చాలావరకు తన కవితలలో అజంతా చెప్పినట్టు పదాలకు స్నానం చేయించి , శుభ్రపరచి , తాజా పరిమళాలతో ప్రాణం పోశాడు . కవిత్వం లో వస్తువుతో పాటు అఫ్సర్ శిల్పాన్ని కూడా బలంగా పట్టించుకున్నాడు . విప్లవం ఒక జడపదార్ధం కాదని . అది కూడా అనేకానేక అనుభూతుల సమ్మేళనమే అని , విప్లవ కవిత్వ ముసుగు లో విస్మరించిన అనేకానేక విస్మృత అంశాలకు తన కవిత్వం లో చోటు కల్పించాడు . అందుకేనేమో రాజీవ్ అఫ్సర్ బ్రాండ్ కవిత్వం అన్న వ్యాసం లో అఫ్సర్ ని చిట్టచివరి భావ కవి అన్నాడు . నిజానికి అఫ్సర్ భావ కవీ కాడు , అహంభావకవీ కాదు . శుద్ధ కవి .ఇస్మాయిల్ ప్రతిపాదించిన కవిత్వం లో నిశ్శబ్దం అఫ్సర్ కవిత్వం లో శిఖర స్థాయి అందుకున్నది
భావాలలో ఎరుపుదనం , శైలి లో ఆకుపచ్చదనమ్ కలగలసిన కవిత్వం అఫ్సర్ తన తొలి దశ లో రాసాడు . అదంతా రక్త స్పర్శ , ఇవాళ లో మనం చదువవచ్చు . అఫ్సర్ రెండో కవిత్వ దశ గురించి అతడి రెండు సంపుటాలు వలస , ఊరిచివర బలంగా వివరిస్తాయి
జీవితం అంటే నలుపు తెలుపు కాదని , ఇతరేతర రంగు భేదాలు ఉన్నాయని . వ్యవస్థ అంటే వున్నవాళ్లు లేని వాళ్ళు మాత్రమే కాదని , ఇంకా ఇతరేతర స్థాయీ భేదాలు ఉన్నాయని కాస్త ప్రపంచ జ్ఞానం 80 ల తరువాత అబ్బింది . ఈ నిర్దిష్టత అర్ధమైన తరువాత అప్పటి దాకా మనం రాస్తోంది అమూర్త కవిత్వం అనిపించింది . జీవితం వ్యాఖ్యానాలలో లేదని , క్రూరమైన వాస్తవికత లో ఉందని అర్ధమైంది . ఆ మేలుకొలుపుల్లోంచి వచ్చిన తొంభైల తరాన్ని చూస్తూ వాళ్ళ అంతరంగాలు అలజడిని వెతకడానికి భాష చాలక వలస పాటలు పాడుకున్నాను . ఇందులో నేను ఒక విచ్ఛిన్నమైన వాస్తవికతను . నేను స్త్రీని , నేను దళితున్ని , నేను మైనారిటీని , నేనొక మూడో ప్రపంచాన్ని , చివరకు నేను ఒక మనిషిని అని సొంత ఉనికిని చెప్పుకోవలసిన స్థితి లో పడిన సంక్లిష్ట అంతరంగాన్ని
అని తన వలసకు రాసుకున్న వెనుక మాటలో చెప్పకున్నాడు అఫ్సర్ . తన మొదటి దశ కవిత్వం అంతా అమూర్తమనీ , తానిప్పుడు క్రూర వాస్తవం గురించి రాస్తున్నాను అని చెప్పకనే చెపుతున్నాడు .అఫ్సర్ మాత్రమే కాదు ఏ కవి కవిత్వ తొలి దశలో అయినా అదే అమాయకత్వం , అదే లలిత లలిత లావణ్య పదగుంఫనం , అదే ఆరిందాతనం ఉంటాయి . సమాజం తో మమేకం అవుతున్నకొద్దీ దృక్పదాలు ఏర్పడుతున్నకొద్దీ , ఒక భావం నుండి మరొక భావం లోకి వలస వెళుతున్నకొద్దీ , జారిపోయిన విశ్వాసాలను నిర్మమకారంగా వదిలివేస్తున్న కొద్దీ , కవిత్వం కొత్త ఆవరణం లోకి ప్రయాణిస్తుంది . కొత్త కొత్త భావాలకు , కొత్త కొత్త అనుభవాలకు తలపులు తెరుస్తుంది . చిన్నప్పటి చిరుగాలి ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది కానీ దాన్ని చిరుగాలిగా చిన్నప్పుడు అనుభవించినంత తన్మయత్వం తో మనం అనుభవించం
వలస 2000 ల సంవత్సరం లో ఊరిచివర 2009 లో వచ్చాయి . ఇవాళ కూ వలస కూ మధ్య కూడా ఒక అర్ధ దశాబ్దం తేడా వుంది . నిరంతర చలన శీలమైన సమాజ గమనం లో ఈ సమయం చిన్నదేమీ కాదు . ప్రపంచం చాలా మారింది . విశ్వాసాలు కుప్పకూలాయి . కమ్యూనిస్ట్ రాజ్యాలు కూలిపోయాయి . కాపిటలిస్ట్ టవర్లూ విమాన దాడులకుగురి అయ్యాయి . నాగరికతల మధ్య సంఘర్షణ యుద్ధ రూపం తీసుకుంది . అస్తిత్వ రాజకీయాలు వేడెక్కాయి . తనను తాను స్థిరీకరించుకుని ,మార్కెట్ చేసుకోవలసిన పరిస్థితులు వచ్చాయి ..నేను హిందువునీ , నేను ముస్లింనీ , నేను దళితుణ్ణీ , నేను స్త్రీ అని చెప్పుకుని ఆ భావనలను స్థిరీకరించుకోవడం కోసం యుద్ధం చేయవలసిన అనివార్యమైనా స్థితిలోకి మానవ జాతి యావత్తూ నెట్టబడింది .
ఈ స్థితి లో భావుకుడు అయిన ఆలోచనాపరుడైన కవి ఏమిచేస్తాడు ?
ఇప్పుడు
నా పదానికి నెత్తురంటింది
గొంతులో ప్రాణం విలవిల్లాడినా
గుక్కెడు దాహం కోసం
నీ మోచేతులను మాత్రం అడగను
నా మాట
ఇప్పుడేమాటా వినదు
శవం చల్లుకుంటూ వెళ్లిన బుక్కయిలా పడి ఉండదు
మోకాలు దాటినా అరువు చొక్కాల్లో
దేహాలని ఎలాగోలా దాచుకుంటున్నాము కానీ
చిరుగులు పడి పోతున్న గుండెలని
ఇంకెలానో నిద్రపుచ్చలేము
అని తన తరానికి దిశా నిర్దేశం చేస్తున్నాడు . స్థావర జంగమాత్మక ప్రపంచం లో తన స్థావరం కోసం యుద్ధం సిద్ధపడుతున్నాడు . ఎంత బలంగా సిద్ధపడుతున్నాడు అంటే
మరణం
అంటే ఏమిటో ఇప్పుడు చెప్పాలా ?
నా కవిత్వ పాదానికి మరణం లేదు
జీవితం తప్ప
వొరిగిపోతున్న దేహాల మధ్య సరిహద్దు మరణం
జీవితం తెగి పోయిన చోట మరణం
అసలే ఆకాశమూ లేకపోవడం భూమికి మరణం
మరణం కడుపులోంచి పుట్టిన యుద్ధం నా కవిత్వం
మరణించలేకపోవడమే కవిత్వం
ఇప్పుడు
భూమ్యాకాశాల మధ్య
నిటారుగా నిలబడ్డ సమాధానాన్ని నేను
కవిత్వానికీ జీవితానికీ మధ్య అబేధం పాటిస్తూ ఒక భావం నుండి మరొక భావం లోకి వలస సాగించాడు . మరోమాటలో చెప్పాలి అంటే అతడొక్కడే అనేకులు గా విస్తరించాడు . సమస్తమూ తనలోనే నింపుకునే ఒక ఏకత్వాన్ని తన కవిత్వం ద్వారా అనుభవం లోకి తీసుకుని వస్తున్నాడు .
ఊరి చివరకు రాసిన ముందు మాటలో గుడిపాటి అఫ్సర్ ను ముస్లిం కవిగా చూడలేము అన్నాడు . తనను కేవలం ముస్లిం కవిగా చూడటం , లేదా ఒక మైనారిటీ కవిగా చూడటం సాధ్యంకాదు . ఆ స్పృహ సాహిత్య ప్రపంచం లో ఉన్న వారికి రాదు . ఎందుకంటే అఫ్సర్ ఎదో ఒక పాయకు చెందినవాడు కాదు . అనేక పాయలని కలుపుకున్న నాదీ సంగమం లాంటి వాడు .అయితే అతడి ముస్లిం అస్తిత్వం అంతా అతడి జ్ఞాపకాలుగా ఊరిచివర లో వుంది . ఆ జ్ణాపకాల లోంచి ప్రస్తుత సమాజాన్ని అఫ్సర్ చూస్తున్నాడు , కనుక అతడు అనివార్యం గా ఇఖ్ రా లాంటి కవిత రాయగలిగాడు ఇఖ్ రా ప్రపంచానికి మహమ్మద్ ప్రవక్త అందించిన సందేశం .
కోపాన్ని వెళ్లగక్కలేను
ఒకరోజు బస్సుల అద్దాలు పగలగొడ్తాను
పాత వాసనలు గుప్పుమని నా వీధుల గుండా
మళ్ళీ వూరుకులూ పరుగులూ నెత్తుటి వాగులూ
అట్నుంచి ఇటు దాకా ఆకుపచ్చ జెండాల అసహనం ఆగ్రహాలు
నా మీదా
నా వొంటి మీదా ఇంకేమైనా ఖాళీ మిగిలి ఉంటే
అక్కడల్లా తొక్కితొక్కి నేనొక నుజ్జు నుజ్జు
గుహ లోంచి వచ్చిన మరుక్షణం
నేను నేర్పిన పాఠం ఒక్కటే
ఇఖ్ రా
. మొహమ్మద్ ప్రవక్త మీద ఒక డచ్ కార్టూన్ సృష్టించిన వివాదం తరువాత అఫ్సర్ రాసిన ఈ కవిత జ్ఞాపకం అస్తిత్వం గా ఎలా మారుతుందో చెప్పడానికి మంచి ఉదాహరణ ఇఖ్ రా అంటే చదువు అని అర్ధం . ఇది మహమ్మద్ ప్రవక్త సమాజానికి అందించిన గొప్ప సందేశం . అఫ్సర్ ఇప్పుడు కొత్తగా చదువుతున్నాడు . లేదూ ఒక కొత్త లోకానికి తలపులు తెరుస్తున్నాడు .
నాకు బాగా గుర్తు . చాలాకాలం క్రితం చేకూరి కాశయ్య గారు ఖమ్మం జిల్లాపరిషత్ ఛైర్మెన్ గా ఉనప్పుడు తొలి సారి ఖమ్మం జిల్లా అవతరణ ఉత్సవాలు జరిపిన సందర్భం గా కొంతమందిని రిక్కాబజార్ హుష్ స్కూల్ లో సన్మానించారు . వారికిలో అఫ్సర్ కూడా ఉన్నాడు . సన్మానం అందుకున్న తరువాత అఫ్సర్ మాట్లాడిన మొదటి మాట " విద్యారంగం లో నేను ఒక గొప్ప వైఫల్యాన్ని " అని . అఫ్సర్ అప్పటికే తన పి హెచ్ డి ముగించుకుని డాక్టరేట్ పట్టా అందుకున్నాడు . కానీ విద్యారంగం లో నేనొక గొప్ప వైఫల్యాన్ని అని అనగానే నా పక్కన ఉన్న ఒక మిత్రుడు విసుక్కోవడం నాకు ఇంకా గుర్తు వుంది . మన లౌకికమైన చదువు చదువే కాదని బహుశా అఫ్సర్ కి అప్పడే ఒక ఎరుక ఉందేమో .
తనకేమి కావాలో అఫ్సర్ ఇన్నాళ్లు తెలుసుకున్నాట్టున్నాడు . అలా తెలుసుకున్న తరువాత అతడి ప్రయాణం కొత్తగా గా మొదలు అయింది . అతడు ఇప్పుడు కొత్త కవిత్వం రాయడం మొదలు పెట్టాడు . బహుశా సృజనకారులు అందరికీ ఈ మెటామార్ఫసిస్ తప్పదేమో .
చలం ఈశ్వరార్చన వైపు మళ్లినట్టు , గోపీచంద్ అరవిందుడి ని తల్చుకున్నట్టు , అఫ్సర్ కూడా ఇప్పుడు సూఫీతత్వం వైపు మళ్ళాడు . తనకూ , ప్రభువు కూ ఆబేధం పాటించే మార్మికత వైపు మళ్ళాడు .
అఫ్సర్ కవిత్వం గురించి మాట్లాడుతూ ఒక మిత్రుడు అఫ్సర్ కవిత్వం మంచుపల్లకి వంశీ సినిమాలు లాగా ఉంటుంది అన్నాడు . మళ్ళీ తానే వివరణ ఇస్తూ వంశీ సినిమాలలో ప్రతి ఫ్రేమూ చాలా అతద్బుతం గా ఉంటుంది . చూడగానే వాహ్ ! వంశీ కనుక ఇలా తీయగలిగాడు అనిపిస్తుంది . కానీ మొత్తంగా సినిమాను చూసుకుంటే ఎదో లోపిస్తుంది . బహుశా అది ఆత్మేమో అన్నాడు . అతడు ఇంకొంచెం పొడిగిస్తూ ఒక భావాన్ని లలిత లలితం గా పదాలలో పొదిగి కవిత్వం చేయడం ఎలాగో అఫ్సర్ కి తెలుసు . అందుకే చదివిన ప్రతి సారీ చాలా కొత్తగా ఉంటుంది అని కూడా అన్నాడు . బహుశా అతడు కవిత్వ రూపం గురించి అన్నాడేమో . ఈ విషయాన్ని అఫ్సర్ కెరీర్ మొదటి దశ లోనే సీతారాం చెప్పాడు అని అఫ్సర్ ఇంటివైపు కు రాసుకున్న వెనుక మాట లో చెప్పుకున్నాడు . ప్రతి అనుభవాన్నీ ఓన్ చేసుకునే నీ పద్దతి నిన్ను ఎప్పటికీ తాజా గా ఉంచుతుంది అని చెప్పాడట .
ఇన్నాళ్లకు అఫ్సర్ తన కవిత్వ ఆత్మ సూఫీతత్వం అంటున్నాడు తన ఇంటివైపు లో మన కాలపు సూఫీ అఫ్సర్ అని చిన వీరభద్రుడు కూడా అంటున్నాడు .
అఫ్సర్ కవిత్వ ఆత్మ సూఫీ తత్వం అని గత వారం ముగించగానే కొన్ని ఆసక్త్తికరమైన కామెంట్స్ వచ్చాయి అఫ్సర్ సూఫీ కవి కాదు అతడొక వాస్తవ ప్రపంచ కవి అని తాటికొండాల నరసింహా రావు గారు . అంటే న్యూటన్ కి ముందు కూడా ఆపిల్ పళ్ళు చెట్టు నుండి రాలినట్టు అతను సూఫీ ల గురించి తెలుసుకోక ముందే మంచి కవిత్వం రాశాడు అని అరణ్య కృష్ణ
నాకైతే పెద్దగా తెలీదు గానీ తెలిసినంతవరకైతే సంగీతం జోడించినప్పుడేమో గానీ లేనప్పుడు సూఫీ తత్వానికి కవిత్వంగా గోప్ప ప్రత్యేకత ఏదో వున్నట్టనిపించడం లేదు. సూఫీ అనే రెండక్షరాలపట్ల కొందరు కవులు అనవసర ప్రేమ పెంచుకుంటున్నారనుకుంటా....చినవీరభద్రుడు టాగింగ్ అండ్ కన్సాలిడేషన్ ఏదో చేసాడు గానీ నేనలా అనుకోవడం లేదు...
To explain the Truth is indeed a difficult task. Words, being limited, can never really express the perfection of the Absolute, the Unbound. So for those who are imperfect, words create doubt and misunderstanding.
Sufism is a school for the actualization of divine ethics. It involves an enlightened inner being, not intellectual proof, revelation and witnessing, not logic. By divine ethics that transcend mere social convention, a way of being that is the actualization of the attributes of God.
mystical Islamic belief and practice in which Muslims seek to find the truth of divine love and knowledge through direct personal experience of God is Sufism. By another name it is taṣawwuf means literally, “to dress in wool” in Arabic, but it has been called Sufism in Western languages .
Sufis were characterized by their asceticism, especially by their attachment to dhikr, the practice of remembrance of God, often performed after prayers. They gained adherents among a number of Muslims as a reaction against the worldliness of the early Umayyad Caliphat.
"In a broad sense, Sufism can be described as the interiorization, and intensification of Islamic faith and practice."
అని ప్రసేన్ కామెంట్ చేశారు . .
నిజానికి మనకు సూఫీ తత్వం కొత్తదేమీ కాదు . సూఫీ తత్వం ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా తనను తాను వ్యక్త పరచుకుంది . మతానికీ , మత దురహంకారాలకు అతీతంగా కేవలం అన్ని ఐహిక బంధాలను వదులుకుని , సకల చరాచర సృష్టి లోని ప్రతి అణువులోనూ దేవుడిని ప్రేమ మార్గం లో దర్శించడం సూఫీ ల పద్ధతి . ఇస్లాం మత సాంప్రదాయం లో దీనిని సూఫీ అంటున్నాము . సూఫీ పదం సఫా అనే పదం నుండి పుట్టింది . సఫా అంటే శుభ్రపరచడం అని అర్ధం . భౌతిక మానసిక ప్రపంచాలు రెండింటినీ శుభ్రపరచడం . ఆంగ్లం లో అయితే సఫా అంటే సోఫా అని అర్ధం అట . ప్రవక్త బ్రతికి వున్నా రోజులలో కొందరు మసీదు బయట ఉండే బల్లల పైన కూర్చునేవారట . వాళ్ళు అలా కూర్చుంది అపార కృపామయుడు , అనంత దయాళువు అయిన భగవంతుడిని నాలుగు గోడల మధ్య బంధించారని నిరసన వ్యక్తం చేయడానికట .. కబీరు ఈ భావాన్నే గానం చేశాడు . అదేసమయం లో దక్షిణాదిన శైవ వైష్ణవులకు మధ్య ఎడ తెగని ఘర్షణలు ఏర్పడినప్పుడు హరిహర అబేధాన్ని బోధించాడు తిక్కన .
హిందూ సంప్రదాయం లో భగవంతుడిని చేరడానికి భక్తి ఒక మార్గం . మన మీరాబాయి , మన అన్నమయ్య , మన గోపికలు వీరంతా భక్తిని ఆలంబనగా చేసుకుని దైవ సాన్నిధ్యం చేరుకున్నారు . ఈ మధుర భక్తిని సూఫీ యోగులు ఇష్క్ హక్కీ కి అన్నారు . మధుర భక్తికి మతాల బంధనాలూ లేనట్టే సూఫీ తత్వానికి కూడా మతాల బంధనాలు లేవు . మరో మాటలో చెప్పాలంటే మధుర భక్తి , సూఫీ తత్వం రెండూ ఒక్కటే
మధుర భక్తి లేదా సూఫీ తత్వం వీటితో వచ్చే పెద్ద చిక్కు ఏమిటంటే ఇవి నిష్క్రియాపరత్వాన్ని పెంపొందింప చేస్తాయి . ఇంకొంచెం కటువుగా చెప్పాలంటే ఇవి పలాయన వాదాన్ని మనసులో ఇంకేలా చేస్తాయి . మీరా భజనలు , సూఫీ తత్వాలు , బైరాగి గీతాలు సంగీత సాహిత్య సమ్మిళితంగా ఉండి అలసిన మనసులకు సాంత్వన చేకూరుస్తాయి . మన భారాన్ని అంతా ప్రభువు మీదో , మరొక దయామయువు మీదో వేసి నిశ్చింతగా ఉండిపోయే ఒక నిరామయ , నిర్వికల్ప స్థితి లోకి మనిషిని నెట్టివేస్తాయి . ఒకానొక అద్వైత స్థితి లో హిందూ ఇస్లాం సంప్రదాయాలు సంగమిస్తాయి . సూఫీలు అద్వైత భావనతో యోగ సాధన చేశారు . అమృతకుండ అనే హర్షయోగ గ్రంధాన్ని పెర్షియన్ లోకి అనువదించుకుని సాధన చేసి నిజాముద్దీన్ ఔలియా సిద్ధుడు అయ్యాడు
ఈ విప్లవావాగ్నులు ఎక్కడివంటే
పండితాపురం వైపు చూపాలి
అని పాడుకున్న కవి లో ఎంత మెటా మార్ఫాసిస్ జరిగినా ఒక నిష్క్రియాపరత్వానికి తన కవిత్వం లో చోటిస్తాడా ?
ధిక్కారం నా మతం
నిరసన నా కులం
గోళ్లలో మేకులు దిగ్గొట్టే రాజ్యాన్ని
తూరుపు ఉరి కంబం ఎక్కించడం ఒక్కటే నా రాజకీయం
నీ గతం కాల్మొక్కలేను
అస్తిత్వ ఉన్మత్త ప్రేలాపనలో
చరిత్రని నిలువునా వంచించలేను
ఎప్పటికీ బాంచెన్ కాలేను
ఒక్క క్షణమైనా మరపులోకి జారిపోలేని వాణ్ని
కాలం నా వేళ్ళ సందులో గడ్డకట్టిన నెత్తురు
దాన్ని తుడిచివేసే పెర్షియన్ ద్రావకం ఇంకా పుట్టలేదు
ఇంత ధిక్కార స్వరం వినిపించిన కవి భగవంతుని పేరుతో పలాయనవాదాన్ని కౌగలించుకుంటాడా ?
ఇంటి వైపు చదువుతున్నప్పుడు ఈ ప్రశ్నలు పదే పదే చుట్టుముట్టినయి . ధిక్కారానికీ , సూఫీ తత్వానికి చుక్కెదురు కదా
ఒక ఎలియానేషన్ , ఒక uprotedness ఒక పరాయితనం ,గుండెల్లో కొన దిగి , తీరని వెత , దిగులుగా మారిపోతుందేమో - దేశం విడవనక్కరలేదు భారతదేశం లోనే -నీవూరు విడిచి ఏ నగరంలోనే వుంటున్నావంటే ఒక రకంగా మూలానికి దూరమవుతున్నావంటే కలిగేది హోమ్ సిక్నెస్ . ఇంటిమీద గాలి . ప్రపంచం గ్లోబలైజేషన్ లో మునిగాక అంతా దిగులే . ఈ కొత్త కవితా సంపుటి ఇంటివైపు లో దిగులు ప్రస్తావన ఎన్ని సార్లు వస్తుందో , అది వెంటాడుతున్నట్టుంది
అని కదా శివారెడ్డి అన్నది
అంతకుముందే ఎన్ . వేణుగోపాల్ జ్ఞాపకాన్ని కవిత్వంగా మలిచే రసవిద్య ఎదో అఫ్సర్ కి బాగా తెలుసు అన్నాడు . ఈ జ్ఞాపకం , ముసురుకుంటున్న దిగులు .లోలోపల గడ్డకట్టుకున్న స్థావర , జంగమాత్మక ప్రపంచాల నడుమ విడువక జరిగే ఘర్షణ , యధాతథ స్థితిని అంగీకరించలేని ఆమోదించలేని అసహనం , ఆమోదించాక తప్పని నిర్లిప్తత , నిరాసక్తత అఫ్సర్ ని ఇంటివైపు నడిపించాయి
అంతకుముందు ఊరిచివర లో కనిపించిన జ్ఞాపకాన్ని , ఇప్పుడు ఇఇంటివైపు లో కనిపిస్తున్న దిగులు . గుండెలనిండా నిండి ఉండి ఊపిరాడనివ్వని గాద్గదిక్యాన్ని సూఫీ భాష లో చెప్పే ధిక్ర్ తో పోలుస్తున్నాడు చిన వీరభద్రుడు . ఈ ద్రిక్ నే స్మరణిక అన్నాడు . ఫనా ని చేరాలంటే ఈ ద్రిక్ గుమ్మం ద్వారానే సాధ్యం . ఈ కవిత్వమంతా ఆ అప్రయత్న స్ఫూరణ , స్మరణ ల తో సాగుతున్నది . కొన్ని సార్లు అది చాలా స్పష్టంగా ,నిర్దిష్టంగా , ఇంద్రియాలకు అందేదిగా ఉంటుంది .
మిగిలిన అన్ని ప్రయాణాలు లోకం కోసం
ఈ ఒక్క ప్రయాణమే నాదీ , నా లోపలికి అనిపిస్తుంది
ఈ అస్పష్ట స్మరణిక లేదా జ్ఞాపకం , లేదా దిగులు . లేదా ఆంతరంగిక వేదనను నాకైతే మార్మికత అనాలి అనిపిస్తున్నది . సూఫీ తత్వాన్ని ఎంతో ఇష్టపడిన రవీంద్రుడు తన కవిత్వమంతా మార్మికత తో నింపినట్టు అఫ్సర్ కూడా తన కవిత్వమంతా ఒక మిస్టిసిజం తో నింపేశాడు . దట్టంగా అల్లుకున్న పొగమంచు లో అతి దగ్గర వస్తువు సైతం కనబడనట్టు , అఫ్సర్ తన పదచిత్రాలు మధ్య , తను స్వచ్ఛంగా , శుభ్రపరచిన అక్షరాల మధ్య తన తత్వచింతనని కదిలీ కదలని మృదు చేలాంచలముల కొసగాలుల విసురు చేశాడు .
ఇస్మాయిల్ గారి కవిత్వం లో ఇస్మాయిల్ గారికి తెలియకుండానే హైకూ తత్వం ఇమిడిపోయినట్టు అఫ్సర్ కవిత్వం లో కూడా సూఫీ తత్వ లక్షణాలు ఎక్కడో ఒక చోట ఒకటీ రెండూ అఫ్సర్ కి తెలీకుండానే చోటువెదుక్కుని ఉండవచ్చు . ఆ ఒకటి రెండు లక్షణాలే ఆఫసర్ ని మన కాలపు సూఫీ అనిపిస్తున్నాయి . ఆ ఒకటి రెండు లక్షణాలలో అఫ్సర్ తన ఇంటివైపు లో ఎన్నుకున్న కథన పద్దతి ఒకటి అఫ్సర్ ఇంటివైపు లో తన ఫామ్ ను అనూహ్యంగా మార్చేయడం . తాను ఇవాళ , వలస , ఊరిచివర లో అనుసరించిన పద్దతికి భిన్నంగా ఒక కొత్త రూపం తో పాఠకుల ముందుకు వచ్చాడు . ఇంతకుముందు అఫ్సర్ ఫామ్ అయితే ఒక మోనోలాగే అయ్యేది . లేకపోతే మరొక డైలాగ్ అయ్యేది . ఇప్పుడు ఆ రెండింటినీ కలిపేశాడు . ఒక జానపద కథన పద్దతిని ఎంచుకున్నాడు . ఏక కాలం లో తనతో తానూ సంభాషిస్తూ , పక్కవాళ్ళతో గుస గుసలు పోతూ , ప్రియురాలి తో రహస్య సంభాషణ చేస్తూ సరిహద్దులు అన్నీ చెరిపేశాడు . బహుశా ఈ కథన పద్ధతి కే
పాఠకుడు ఫిదా అయిపోతాడేమో .
నేను ఏ భాషలో నిన్ను చేరుకున్నానో తెలీదు
నువ్వు నాది కాసేపు కవిత్వ భాష అంటావు
కాసేపు మరీ ఉద్వేగాల భాష అంటావు
చాలాసేపు నీకు ఎంతకూ పాలు అందని శైశవ ఆక్రోశం లా వినిపించి వుంటాను
నా పసిభాష ఉద్వేగమై ప్రవహిస్తే
ఈ ఒక్క సరికీ మన్నించు
ఇంకా నాకు రానే రాని ఈ లోకపు భాష నేర్చుకోవాలి నేను
అని అఫ్సర్ మళ్ళీ తనను తాను కన్సాలిడేట్ చేసుకుంటున్నాడు . అయితే అఫ్సర్ పూర్తిగా సూఫీ లా మారిపోయే లోలోపలి అంతర్మధనం ఎదో ఇంటివైపు లో స్పష్టంగా కనిపిస్తున్నది . ఆ అంతర్మధనం అతడిని సూఫీ తత్వం లో ముంచితేల్చుతుందా లేక మరేదైనా ఒక కొత్త బంగారు లోకం లోకి తలుపు తీసి పంపిస్తుందా అనేది వేచిచూడవలసిందే . ఒక భావం నుండి మరొక భావం లోకి వలస వెళ్లడమే జీవితమైనా , కవిత్వమైనా అని అఫ్సర్ చెప్పనే చెప్పాడు కదా .
మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అందమైన కాజల్ రోజుకు కనీసం ఇరవై సార్లు అడిగినట్టు అఫ్సర్ కవిత్వం లో సూఫీ తత్వం ఉందా ? మార్మికత ఉందా ? సమకాలీన రాజకీయ ఆర్ధిక వ్యవస్థల పట్ల ఆగ్రహం ఉందా నిగ్రహం ఉందా లాంటి వెతుకులాట అక్కరలేకుండానే చదివిన ప్రతి సారీ ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చే అద్భుతమైన కవి అఫ్సర్ . తన పసితనపు అమాయకత్వాన్ని ఇంకా కవిత్వం నిండా ఒలికిస్తున్న సదా బాలకుడు అఫ్సర్ .
వంశీకృష్ణ
Category: 0 comments

రెండు చేతులా పిలిచే జీవితం: అఫ్సర్ 'ఇంటివైపు'"యిప్పుడు నువ్వు కనీసం వొక సంతోషపు అలలో
అల లోపలి సంతోషపు కడలిలో
కొంచెమే అయినా సరే, తేలిపో” (178, ఇంటివైపు)
ఎవరైనా ఓ కవి ‘అల లోపలి సంతోషపు కడలి’ గురించి ఆలోచిస్తున్నాడంటే అతను కచ్చితంగా అఫ్సరే అయ్యుండాలి. కవిత్వాన్ని తనలో నిరంతర ప్రవాహంగా చేసికుని, తనలోని ఖాళీని కవిత్వం ద్వారానే నింపుకుని ఐదు సంపుటాల ఎత్తు కెదిగిన విలక్షణ కవి, కధారచయిత, అనువాదకుడు, విమర్శకుడు అయిన అఫ్సర్ గురించి సాహితీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాటి విషయాన్నైనా ఒక ప్రత్యేక దృక్కోణం నుంచీ చూడగల, ప్రత్యేక భాషలో సరళంగా వ్యక్తీకరించగల సున్నితమైన ‘సంక్లిష్ట’ కవి శ్రీ అఫ్సర్.
బాల్యం నుంచీ సాహిత్యం పట్ల మక్కువ, భాష పట్ల ప్రేమ పెంచుకుని అనేక కవితా మూర్తుల బలాన్ని, ప్రేమను తనలో నింపుకున్న ఈ కవితా కౌముది ప్రారంభ కవిత్వం అందరి కవుల్లా విప్లవ స్ఫూర్తి ఛాయలను నింపుకున్నా రాను రాను తన విలక్షణ ముద్రను, భాషను, భావాల్ని పొదువుకొని ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఎప్పటికప్పుడు ‘ఫలానా’ ముద్రల్ని ధ్వంసం చేసికుంటూ (చూ. అఫ్సర్ తో ఇంటర్వ్యూ ) తన కవిత్వం లోని శక్తిని మరింత ద్విగుణీకృతం చేసికుంటున్న ఇంద్రజాలికుడు అఫ్సర్. ‘రక్తస్పర్శ’ నుంచీ ‘ఇంటివైపు’ దాకా ఎన్నో ముద్రలు, ఎన్నో చిరునామాలు – వీటన్నిటిలోనూ ఎన్నో చుట్టరికాలు. పాత్రికేయుడిగా, కవిగా,కధకుడిగా, అధ్యాపకుడిగా అనేక దశలలో గృహోన్ముఖీనత లోని తీవ్రతను అనుభవించి పలవరించిన దశలో రూపుదిద్దుకున్న కావ్యంగా ‘ఇంటివైపు’ ను గురించి చెప్తాడు అఫ్సర్.
ఇంటివైపు చేసే ప్రయాణమెప్పుడూ తీయనిదే. ఉద్వేగపూరితమైనదే. పరాయి ఆకాశపు దుప్పటి కింద నిద్ర యెంత దుఃఖభరమైనదో,  వేదనాభరితమైనదో, ఇంటివైపు మళ్లే ప్రయాణం ఎంత మధురమైనదో, ఎన్ని కలలను, వుద్వేగ భరిత క్షణాలను పొదువుకుని వస్తుందో చెప్పనక్కరలేదు.
          ‘రేగిపళ్ళ వాసనలోకి’  ‘దూరాల కంటే కదా!’ ‘ఎటో చెదిరిన పడవై’ అనే మూడు భాగాలుగా అమరిన యీ ‘ఇంటివైపు’ కల ఎన్నో బాధా తప్త క్షణాల్ని, బుడగల్లా చిట్లిపోతున్న క్షణికానందాల్ని, సామాజిక సన్నివేశాల్ని, వైయక్తిక అనుభవాల్ని ఒకచోటకు చేర్చి మనసుకు చుట్టుకుపోయే గాఢమైన కవిత్వంలో అందిస్తాడు అఫ్సర్. వ్యక్తిగతమైన సామాజికమైన విషయాలనుంచీ చారిత్రక రాజకీయ సత్యాలను, హింసలను, అణచివేయడాలను అదే లోతైన నిశ్శబ్దపు నది గొంతుకలో చెప్తాడు.  అందుకే ‘ఇంటివైపు’ కవిత్వమంతా ఆత్మ ఘర్షణ, ఆత్మ వేదనా ఘోషై వినవస్తుంది.
          శివారెడ్డి తన ముందుమాటలో చెప్పినట్లు అఫ్సర్ కవిత్వం మొత్తం “Survival of feeling self” గురించే మాట్లాడుతుంది.
          ప్రపంచీకరణ నేపధ్యంలో ఎవరు ఎక్కడైనా వుండచ్చేమోకాని మనసున్న కవికి మాత్రం ప్రతిరోజూ తన ఆత్మ తన వూరిని తన దేశానికి ప్రయాణించి తన వాళ్ళను పలకరించి తిరిగొస్తూనేవుంటాడు.  ఈ అనుక్షణిక ప్రయాణం లో ఎన్నో వేదనలు, పలకరింతలు, పలవరింతలు, తీరని దిగుళ్ళు, గుబుళ్ళు ఎన్నో ‘వుద్వేగాల తొలి ఆనవాళ్ళు’(43)
          తన వూపిరినంతా కూడగట్టుకొని తన ‘ఇంటివైపు’ ప్రయాణం గురించి ఇలా చెప్తాడు.
                   యేమేం తీసుకెళ్తాను ఇంటికి,
                   నా ఊరికి
                   ఆ తొలి రక్తపు సెలయేటికి?!
తనదైన భాష, వ్యక్తీకరణ లతో చాలా తాత్వికం గా, కొత్త తనం తో చెప్తూ మనల్ని తీసుకెళ్తాడు-
‘అవున్నిజంగానే వెళ్తాను నాలోకి /ఆ చిన్న పంటపొలం లో రాలిపడిన /రేగుపళ్ళ వాసనలోకి!’  (45) ఇంత Homesickness లోనూ ‘లోకపు కొలమానాల కానుకల్ని’ అర్దాలు మారిపోయిన విలువల్ని యీసడించు కోవటం మరచిపోడు. ‘నీది కాని వాన’ కవిత పరాయికరించబడిన తన వేదననూ చాలా గాఢమైనదిగా తెలిపి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.  తనకే తెలియకుండా పరిగెత్తిస్తున్న తన ప్రపంచం లోకి ఆ వాన ప్రయాణం చూడండి-
                   “తెల్లారు జాము వానలో తడుస్తూ
                   ఇల్లు వూరు వదలి
                  పరిగెత్తుతూ వెళ్తాను, ప్రపంచం వేపు
                   నన్నలా పరిగెట్టించే ఈ ప్రపంచం లో
                   అసలేమైనా వుందో లేదో!
                   ......
                   నా కోసం కురవని ఆ వానలోకి
                   తీక్షణంగా చూసే శక్తి కూడా నాకు వుండదు
                   ఆ మాటకొస్తే, యెన్నో చినుకులు కలిస్తే
                   వాన అవుతుందో కూడా తెలీదు యీ ‘పరాయి’ క్షణం లో    (Quotes mine,47)
చాలా మందికి వాన ప్రతిసారీ ఒక క్రొత్త అనుభవం. ఒక ఆనంద పరవశం. వాన ఎక్కడైనా వానే. వానలో ఇష్టంగా గడపటం కరిగిపోవడమే. ఇష్టం లేనపుడే వాన మనల్ని బాధగా తడుపుతుంది. చికాకుపెడుతుంది. అదిగో అలాగే ఇక్కడ ఈ వాన ఒక బాధాకరమైన తాత్వికతను ప్రేరేపిస్తోంది. కవి అంతరాంతరాలలో పొరపొరగా పేరుకుపోయిన బాధను వెలికి తీస్తోంది. చాలా సరళమైన భాషలో చెప్పినా అఫ్సర్ కవిత్వం ఆవలి తీరాల నుంచీ దిగాలుగా ‘తనదికాని’ వానలో తడుస్తూ, చేజారి పోతున్న అద్భుత క్షణాల్ని అందుకోలేక నిరాశగా చూస్తున్న ఓ బాటసారి కలలను, సంక్లిష్ట క్షణాల్ని మనకందిస్తుంది.
          ఇలాగే ఇలాటిమరో వాన కవిత ‘అన్నీ తెలిసిన వాన’ . ‘ ఎపుడు/ఎలా కురవాలో/తెలుసు వానకి’-అంటూ మొదలై తన మనసులోని నిశ్శబ్ద సత్యాలు చెప్పేస్తాడు ఈ పంక్తుల్లో:
‘అయినా/వొక ఊరో ఇంకొక వూరు ఎప్పుడూ కాదు/ ...
ఆకాశం ఆకాశం కాదు
నేలా మనుషులూ అరుగులూ వాకిళ్ళూ
ఇవేవీ అవి కాదు –
ఏ ఊరూ యింకో వూరు కాదు
అపుడపుడూ ‘వెనక్కి చూడు’
‘దాటి వచ్చిన వూరు
ఏమంటుందో విను’ – (bold letters mine,148) అని మౌనంగా అంతరాంతరాలలో కవి మనసులో కురుస్తున్న దిగులును వెలికి తీస్తుంది. ‘అవీ – ఇవీ’ లలో ‘వొక – యింకొక’ లలో ‘దాటుకొచ్చీ’ , ‘వెనక్కు తిరిగిచూడాల్సిన’ దాగిన అవసరాలను చెప్పిపోతుంది.
ఇలాటి భావననే గమ్మత్తుగా ‘ఓ పొద్దుటి రైలు’ కవిత కూడా చెప్తూనే చివరలో హటాత్తుగా –
‘అన్నీ దాటుకు వచ్చామనుకున్నప్పుడు/అసలేదీ ఎప్పటికీ దాటి వెళ్ళలేమని/రైలు పాడుకుంటూ వెళ్ళిపోయింది/కూతవేటు దూరంలో’(190) తన సహజమైన సూఫీ తాత్వికతను జోడించి మరీ చెప్తాడు. ఇక్కడ నిరాశ లేదు.  జ్ఞాన సమృద్ధుడైన ఓ తాత్వికుడే కన్పిస్తాడు.
          తనను ‘ చుట్టు ముట్టిన ఈ తెలియని ముఖాల /తెలియని చెట్ల / తెలియని ఆకాశాల, తెలియని గాలుల,/కనిపించని కన్నీళ్ళ ‘ (56) సమూహాల గురించి ‘రాలి పడిన ఆకుల చిందరవందరలో / వాటిల్లో దాక్కున్న ప్రాణాల కొసల్లో/ఏదో వెతుక్కుంటూ ...’ దాటుకొచ్చిన ఊరూ ఏరూ గురించి , ఇల్లూ, వాడా గురించీ , తన ఒంటరితనపు బెంగ గురించీ పదే పదే పలవరిస్తూనే ఉంటాడు. ‘ఎక్కడికని ఎంత దూరమో వెళ్ళనుగానీ / వెళ్ళిన దారంతా బెంగ పడిన పక్షిలా మెలికలు తిరుగుతోంది.’(63) ఈ సంపుటి ఎన్నో అందమైన క్షణాల్ని , పరవశాల్ని ప్రేమ రాగాల్ని చెప్తున్నా సరే అంతర్లీనంగా ప్రవహించే రక్తం లాంటి దిగులు ప్రస్ఫుట మౌతూనే ఉంటుంది. తన లోపలితనం లోకి ప్రయాణిస్తున్నప్పుడు, బాహ్య ప్రపంచంలోని విధ్వంసాన్ని జయించాల్సిన స్థితిని కరుణతో తాకాలనుకున్నప్పుడు అఫ్సర్ శ్రీ వాడ్రేవు చెప్పినట్లుగా ‘ఈ కాలపు సూఫీ’ నే అవుతాడు.
          ఈ ‘ఇంటివైపు’ మార్గం లో కొన్ని ప్రదేశాలలో కొందరు వ్యక్తులతో గడిపిన సందర్భాలున్నై. కోల్పోయిన పసితనాన్ని పొందలేని, పొదువుకోలేని ఆక్రోశాలున్నై. గానామృతాన్ని సేవించిన మత్తులో పాడిన పాటలున్నై.ఇంతకుముందే అనుకున్నట్లు తాత్విక సంవేదనలున్నై. కృతజ్ఞతా ప్రవాహాలున్నై. నిశ్సబ్దంగా తనతోనే నడిచే నిస్ప్రుహలున్నై.      వేటినైనా లలితమైన కవిత్వంగా మార్చగల ప్రతిభ గల ఇంద్రజాలికుడు కాబట్టి అన్నిటినీ అంత అందం గానూ మార్చేస్తాడీ కవి. మరచిపోలేని పసితనాన్ని గురించి చెప్పినా (50) గాలి మోసుకెళ్ళే పాత గురించి చెప్పినా (51) అదే ఒరవడి, అదే సాంద్రత, అదే నిండైన భావన. ఈ వాక్యాల్ని చూడండి:
          ‘ ఈ రెండు చేతులే/గాల్లో ఎగిరితే పక్షులు/నెలన వాలితే రెండు నదులు/రెండిటి మధ్యా గుడి కడితే ఇంద్రచాపాలు’ – ఎంత అందమైన భావన!
అలాగే పసితనాన్ని తాకలేని (మ)/తన దయనీయ స్థితి గూర్చి ఎలా విలవిల్లాడుతాడో ‘తాలియా’, ‘ఆ చిన్ని పాదాలు’ కవితలు చూడండి.

‘ఇప్పటికిప్పుడు/వొక్కటి మాత్రం అర్ధమై పోయింది/నీ దరిదాపులకి ఎన్నటికీ రాలేను,/నన్ను నేనే ఆసాంతం చెరిపేసు కుంటే తప్ప’- ఎంత క్లిష్ట పరిస్థితి గురించి తన బాధను వ్యక్తీకరిస్తున్నాడో చూడండి.
అలాగే ఈ సంపుటిలో సంఘ ద్వేషానికి బలైన వ్యక్తులపట్ల జాతులపట్ల సహానుభూతితో పాటు ధర్మాగ్రహాలున్నై. తన బాధా తప్త హృదయపు ఆక్రోశాన్నేలా చెప్తాడో చూడండి: ‘నేను/యిపుడు విడిచివేయబడ్డ వొట్టి వస్త్రాన్నే/నిజమే కానీ,/ నన్ను హత్తుకుని/తెగిపడిన ప్రాణాల చివరి కేకలు వింటున్నావా నువ్వు’
          కవి కేవలం అంతర్గత స్వరాన్ని వినిపించడమే కాకుండా సామాజిక స్వరం కూడా అయినప్పుడే పరిపూర్ణుడౌతాడు. ప్రపంచపు రాజకీయ రహస్యాల్ని బట్ట బయలు చేసేందుకు చాలా ధైర్యమే కావాలి. అనేక దేశాల్లోని కవుల, రచయితల రచనల్ని పరిశీలిస్తే ఆ యా రచనలు చేసే నిశ్శబ్ద యుద్ధపు ప్రకటనలు, వాస్తవ నిరంకుశ పరిస్థితులను కళ్ళ ఎదుట నిలిపే రహస్య సమాధానాలు, సందేశాలు తేటతెల్లమౌతాయి. అలాటి విప్లవాత్మకమైన , బాధ్యతాయుతమైన గొంతుక కూడా ఈ సంపుటి మనకు వినిపిస్తుంది.
‘ నాకు ఏ దేహమైనా /అన్నం పళ్ళెం లాగే కనిపిస్తుంది ఎప్పుడూ
ఏ దేశమైనా/ఆ మెతుకుల్ని దోచేసే దొంగలాగానే కనిపిస్తుంది ఎప్పుడూ
యిక్కడ నీ పేదరికపు వొంట్లోనూ /అక్కడ ఆ గరీబు వొంట్లోనూ
వొకే ఆకలి కేక/వొకే వెతుకులాట’ ఆకలి మీద, అన్నార్తుల మీద అనేక రకాలుగా ముసుగుల్లో జరుగుతున్న కుట్రను ఎలా నిలదీస్తాడో చూడండి.
          ఒక మహా వృక్షం మొలకెత్తినప్పటి నుంచీ అనేకవేల కోట్ల చినుకులను తాగి, మరిన్ని వేల కోట్ల పవనమాలికలను ఆవాహన చేసుకుని కూడా తనదైన రూపుతో రంగు రుచి వాసనతో వటవృక్షంగా మారినట్లుగా ఇటు తెలుగు, అటు ఇంగ్లీషు మహాకవులను పరకాయప్రవేశం చేసి అనేక కవితాజ్యోతుల దీపఛాయలను సొంతం చేసుకుని తనదైన తేజోకవిత్వాన్ని పంచగల అఫ్సర్ కవిత్వం ఈ సంపుటిలో ఆసాంతం ఆసక్తికరంగా ఓ ఇతిహాస గాధలోని సంభాషణల్లా సాగుతుంది. అక్కడక్కడా ఆంగ్ల పద ప్రయోగ సంవిధానంతో ఒకింత ఆశ్చర్య పరిచినా ప్రస్తుత కాలాన్ని అద్దం పడుతుంది. నిరంతర మానవ జీవిత సంఘర్షణ ను వినిపించే ప్రతిపాటా ఎప్పటికీ వెలుగుతూ మార్గదర్శకకమౌతూనే  ఉంటుంది కదా. ఈ కావ్యమూ అంతే.
                                                                             డా.విజయ్ కోగంటి,
08801823244

చిట్టచివ్వరి Text!

 సాయంత్రపు చలిలో కొన్ని వణికిపోతున్న సంభాషణల్ని మనం అటూ ఇటూ రువ్వుకుంటూ కూర్చున్నాం. నీ సందేహంలోకి నేను పూర్తిగా ప్రవేశించగలనని అనుకోను కాని, ఆ దేహపు గోడల మీద పక్షినై కాసేపు రెక్కలు రెపరెప ఆడిస్తూ తిరిగానేమో బహుశా!
ఇన్నేళ్ళ ఇన్ని తడిపొడి బంధాల పెళుసు కాగితమ్ముక్కల చప్పుళ్ళలో ఏ ఇతర ఆకాశంలోకైనా కాస్త హాయిగా ఎగిరిపోగలనన్న నమ్మకం ఈ పక్షి గుండెకి లేదు కాక లేదులే!
ప్రతి దేహాన్నీ వొక ఇనప పంజరం చేసి, అందులో దాక్కున్న గుండెకి అన్ని అసహజత్వాలూ నేర్పుకున్న లౌక్యాల తేలిక సౌఖ్యాల కాలం కదా మనిద్దరిదీ!

లాంటి వొకానొక స్థితిలో నువ్వడుగుతున్నావ్: “రాసిందల్లా సగంలో అబద్ధమై తెగిపోతున్నప్పుడు ఏం రాయమంటావ్? రాయకుండా వున్న రోజో, సగం రాసిన కాగితాలు చింపేసిన రోజో కాస్త ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు- రాసి, పూర్తయ్యాక పడే ఉరికోతని భరిస్తూ ఎందుకూ నిద్రపట్టని రాత్రిని కావిలించుకొని?”

నువ్వడిగావ్, నేను అడగలేకపోయాను కాని,
సగం మాత్రమే రాసిన కాగితాలు కూడా నాకు ఉరి కంబాల్లా కనిపిస్తున్నాయి రోజూ! ఆ స్తంభాల మధ్య దిసమొలతో చావు ఆట ఆడుకుంటూ రాత్రిలోకి జారుకుంటూ వెళ్తున్నానని నీకు చెప్పాలని అనుకుంటా. కాని, ఎందుకో కర్తకర్మ క్రియలన్నీ ఎంచక్కా అమరుకుంటూ వచ్చిన వాక్యం మీద చచ్చేంత ప్రాణం! చావు రేఖ మీద విలవిల్లాడుతూ కూడా ఆ వాక్యం క్రియాంతం అయినప్పుడు వొక ప్రాణాంతక క్రీడానంతరం లోపలి తెల్లప్రవాహం అంతా వొక్కసారిగా పెల్లుబికి పారిన తృప్తి!

రాయలేని స్థితి / జీవించలేని స్థితి
రాసిన స్థితి / జీవించిన స్థితి
రాస్తూ రాస్తూ/ జీవిస్తూ జీవిస్తూ మధ్యలో వూపిరందక/ ఊపిరి తెంపుకొని కుప్పకూలిపోయిన స్థితి.
వీటి మధ్య చలనతీవ్రతల్ని కొలిచే కొలమానం లేదు నా దగ్గిరా నీ దగ్గిరా.

కాని
రాయాల్సింది రాయలేని క్షణం
జీవించాల్సింది జీవించలేని క్షణం ఆత్మహత్య.
కాదూ, కనీసం వో నలుగురు కుమ్మక్కై లోపల్నించి నీ హత్య!
చిట్టచివ్వరి text దొరకదు
దొరికినా ఆ నలుగురూ దొరకరు!

సంభాషణ ఆగిపోలేదు కాని
నీ దారిన నువ్వూ నా దారిన నేనూ వెళ్లిపోయాక
మనం
కేవలం శవాలుగా నిష్క్రమించామని మనిద్దరికీ తెలిసిపోయింది
ఇప్పటిదాకా వ్యక్తమైనదంతా వొక అవ్యక్త ఆత్మహత్య.
కాదంటావా?!

Category: 0 comments

అలాగే ఉండనీ కొన్ని రోజుల్ని,.....No automatic alt text available.
అఫ్సర్ రాసిన ఈ కింది కవితను జాగ్రత్తగా ఒకటికి రెండు మూడు సార్లు చదవండి.

- అలాగే వుండనీ కొన్ని రోజుల్ని,
నువ్వేమీ వాటి పొరల పొరల్ని తవ్వి తీయకుండా-
కొండంత నిశ్శబ్దంలోనో, గోరంత ఎండలోనో 
వాటికి మాత్రమే అర్ధమయ్యే ఏదో సాంధ్య భాషలో.
- అలాగలాగే వుండనీ కొందరిని,
నువ్వేమీ వాళ్ళ లోపలికి ప్రశ్నల కొలమానాలు గుచ్చకుండా-
కొంత చీకట్లోనో ఇంకొంత మసక వెల్తురులోనో
వాళ్లకి మాత్రమే తెలిసి వచ్చే ఆనుభవిక వలయంలో.
- అలాగలా గలాగే వుండనీ 
ఎదురొచ్చే చెట్లనీ, ఎగిరెళ్ళే పక్షుల్నీ 
వాటి వాటి ఊహల వూపిరి తీవెల మీద నీ పాదమేమీ మోపకుండా-
తెగని యీదురు గాలుల్లోనో, పలకని మాటల హోరులోనో 
వాటిని మాత్రమే తడిపే 
కాసిని తొలకరి చినుకుల జడిలో.
- ఇలాగిలాగే వుండాలి 
కొంత కాలం, కొంత దూరం 
కొన్ని స్థలాలూ కొన్ని ప్రాణాలూ.
విరిగిరిగి పడే వుద్విగ్నపుటల వొకటి 
కాస్తయినా తేలిక పడే దాకా.
నీకూ వాటికీ మధ్యా 
వొక 
శాంత స్థిమిత 
పవనమేదో 
నెమ్మదించి వీచే దాకా.(అఫ్సర్)

ఈ కవితలో కవి వ్యక్తం చేసిన ఆలోచన ఆసక్తి దాయకం. జీవితం పట్ల, తోటి మనుషుల పట్ల ఉద్ధరింపు ధోరణి కలిగి ఉండి, చైతన్యవంతమైన మానవులుగా తమను తాము పరిగణించుకునే వారికి సున్నితమైన సునిశితమైన వారింపు కనిపిస్తుందిక్కడ. తొందరగా అందరినీ, అన్నిటినీ బాగుపరచాలి, అన్ని సంక్లిష్టతల్నీ, సందిగ్ధాలనీ, సంబంధాల అపార్ధాలనీ స్పష్టీకరించాలి, తక్షణం తేల్చిపారేయ్యాలి అనుకునే వాళ్ళు సమయ సందర్భాలనూ, అవతలి వారి స్వతంత్రతనూ, అనుభవలనూ , ఎరుకనూ పట్టించుకోరు. అలాంటి వారిని వారిస్తూ నడిపిన ఉద్వేగపూరిత సంవాదమే మొత్తం కవిత. 'Not a hasty stroke , like that which sends him to the dusty grave' అని William Cowper అన్నట్లు కాలక్రమంలో అనుభవాలు జీర్ణమయ్యేకొద్దీ ఒక స్పష్టత, ఒక సమంజసత్వం సాధ్యమవుతాయి కాబట్టి , అందకా సంయమనం వహించటమే సహజమని సూచిస్తూ కవిత ముగుస్తుంది.

ఈ ఇతివృత్తాన్ని కవితగా మలచటానికి కవి ఉపయోగించిన నిర్మాణ పద్ధతీ , కళా సాంకేతికత ఈ కవితను ఉన్నతస్థాయి కవిత్వానికి ఉదాహరణగా నిదర్శనంగా నిలిపాయి. విషయాన్ని ప్రకంపనగా వ్యాకులతాత్మక చిత్ర పరంపరగా మనో సంవేదనగా ప్రవేశపెట్టడంలోనే ఈ ఆర్ట్ ఉంది. వ్యాకులతకూ అదుర్దాకూ భౌతిక రూపాన్ని ఇవ్వడం ఎలాగో యువక వులు నేర్చుకోవడానికి అఫ్సర్ వాడిన టెక్నిక్ ఒక కేస్ స్టడీగా ఉపయోగపడుతుంది.
అలాగే ఉండనీ కొన్ని రోజుల్ని,
నువ్వేమీ వాటి పొరల పొరల్ని తవ్వి తీయకుండా-
కొండంత నిశ్శబ్దం లోనో, గోరంత ఎండలోనో
వాటికి మాత్రమే అర్ధమయ్యే ఎదో సాంధ్య భాషలో
సమయ సందర్భాలను ముందు వాటికంటూ ఉన్న గోప్యతకు వాటిని వదిలిపెట్టమని చెప్పటానికి , కొండంత నిశ్శబ్దంలోనో గోరంత ఎండలోనో'', అని పద చిత్రాల్ని వాడుతున్నాడు కవి.గోప్యత అనే భావం అలా భౌతిక రూపం సంతరించుకుంది. ఇంకా ముందుకుపోతే
అలగలాగే ఉండనీ కొందరిని.
నువ్వేమీ వాళ్ళ లోపలికి ప్రశ్నల కొలమానాలు గుచ్చకుండా
కొంత చీకట్లోనో ఇంకొంత మసక వెల్తురు లోనో
వాళ్ళకి మాత్రమే తెలిసివచ్చే అనుభవిక వలయంలో
ప్రశ్నల కొలమానాలూ, కొంత చీకట్లోనో, ఇంకొంత మసక వెల్తుర్లోనో, ఇవన్నీ ఎదుటి వాళ్ళను వాళ్ళ మానాన వాళ్ళని వుండనివ్వటానికి చెందిన కాంక్రీట్ రూపాలు. ఇలా మనుషుల తాలూకు , సందర్భాల తాలూకు స్వతంత్ర అస్తిత్వాన్నీ స్వేచ్చనీ గౌరవించాలనే సూచనను తత్సంబంధ వస్తుజాలాన్ని అమర్చడం ద్వారా , ఉద్దేశించిన ఆలోచనని ఫీలింగ్ గా అనుభవంగా మార్చగలిగాడు కవి. ఈ వస్తుగతీకరణ తారాస్థాయికి చేరిన వ్యక్తీకరణను ఇప్పుడు గమనించండి.
ఎదురొచ్చే చెట్లనీ, ఎగిరెళ్లె పక్షుల్నీ
వాటి వాటి ఊహల ఊపిరి తీవెల మీద
నీ పాదమేమీ మోపకుండా-
తెగని ఈదురు గాలుల్లోనో, పలకని మాటల హోరుల్లోనో
వాటిని మాత్రమే తడిపే
కాసిని తొలకరి చినుకుల జడిలో
ఎదురొచ్చే చెట్లూ, ఎగిరెల్లే పక్షులూ వచ్చే సత్సంబంధాలనీ పోయే సంబంధాలని లేక సుఖదుక్ఖాల్నీ వస్తుగతీకరిస్తే- 
ఈదురు గాలులు, పలకని మాటల హోరులు ,తొలకరి చినుకుల జడలు స్వానుభవాల సంక్షోభాన్ని పట్టి చ్చిన పద చిత్రాలు. జనాన్ని అనుభవాలనుంచి నేర్చుకోనివ్వకుండా అప్పటికప్పుడు తమ జ్ఞానాన్ని వారిమీద పులమాలనే సోకాల్డ్ చైతన్యపరులను తగిన రీతిలో కౌన్సిల్ చెయ్యడానికి వాడిన బాహ్య వస్తు సముదాయం ఇక్కడ స్పష్టమయింది.
చెప్పదలుచుకున్న విషయానికి తత్సంబంధ పద చిత్రాల ద్వారా బాహ్య వస్తువుల అమరిక ద్వారా ఒక వైబ్రేటింగ్ మానసిక వాతావరణం సృజించటమే ఇక్కడ అఫ్సర్ వాడిన టెక్నిక్. ఇదే objective correlative అనిTS Elliot అంటాడు. తెలుగులో దీన్ని వస్తు సత్సంబంధి అని పిలుస్తున్నాం. అలాగలాగలాగే అని పదేపదే రిపీట్ చేయడంలో అపర ఉద్దారకుల మీద కావచ్చు పరిస్థితుల అవాంఛనీయత మీద కావచ్చు విసుగునీ వ్యంగ్యాన్నీ ధ్వనించటం పసిగట్టొచ్చు.
కవితలో ఇలా ఒక ఎగ్జిస్టన్సియల్ angst , అస్తిత్వ పరివేదన వ్యక్తమౌతుంది. "Humans go in accordance with their experiences rather than the definitions and theories the world imposes on them. Their credo is existence not the essence." అని గట్టిగా వాదించిన జియో పాల్ స్సార్త్ర్ తత్వం బలంగా ఈ కవితలో వ్యక్తమయ్యింది. అంతే కాదు , since man is a conscious being one cannot afford to change him automatically అని Edmund Husserl చేసిన హెచ్చరిక ఈ కవిత లో ప్రతిబింబించింది. మార్పు పరస్పరత ను సూచిస్తూ అఫ్సర్ ఏమన్నాడో చూడండి.
ఇలాగిలాగే ఉండాలి
కొంతకాలం కొంత దూరం
కొన్ని స్థలాలూ కొన్ని ప్రా ణాలూ
విరిగిరిగిపడే ఉద్విగ్నపుటల ఒకటి
కాస్తయినా తేలిక పడే దాకా
నీకూ వాటికీ మధ్య 
ఒక శాంత స్థిమిత
పవనమేదో
నెమ్మదించి వీచే దాకా
విషయాన్ని గురించి కవితాత్మకంగా మాట్లాడటం కాకుండా విషయం కవిత్వంగా పరిణమించటానికి కావాల్సిన కవిత్వ నిర్మాణ పద్ధతిని అనితర సాధ్యంగా ఉపయోగించాడు అఫ్సర్. కవితకు ఎదో పెర్సొనల్ , సోషల్ సందర్భమో ప్రేరణగా నిలిచివుంటే ఉండొచ్చు. దాన్ని ఒక తాత్విక సారంగా సాధారణీకరించటం మామూలు విషయం కాదు.
అయితే ఈ struture తాలూకు ఆకర్షణ , ఎత్తుగడ, సంవిధానం తాలూకు చొచ్చుకుపోయే స్వభావం ఎందుకో శ్రీ శ్రీ 'సాహసి' కవితను గుర్తు చేస్తుంది.
ఎగిరించకు లోహ విహంగాలను
కదిలించకు సప్త భుజంగాలను
ఉండనీ
మస్తిష్క కూలయంలో
మనో వల్మీకంలో
అంతరాల భయంకర
ప్రాంతరాలనా నీ విహారం
ముళ్ళ దారినా నీ సంచారం
పలికించకు మౌన మృదంగాలను
కెరలించకు శాంత తరంగాలను
హృదయంలో దీపం పెట్టకు
మంత్ర నగరి సరిహద్దులు ముట్టకు (శ్రీ శ్రీ)
ఎత్తుగడ ,సంవిధానంలోనే కాదు objective correlative టెక్నిక్ విషయంలోనూ అఫ్సర్ కవితకీ శ్రీ శ్రీ కవితకూ సామ్యం కనిపిస్తుంది. కాకపోతే శ్రీ శ్రీ మార్చాలని ప్రయత్నించే చైతన్య పరుల్ని కాదు విమర్శిస్తుంది. మారని మధ్య తరగతి పౌరుల్ని. హృదయంలో దీపం పెట్టటం ఇష్టం లేని వాళ్ళని. శ్రీ శ్రీ కాలానికి ,అఫ్సర్ కాలానికి ఉన్న వ్యత్యాసం వారి కవితల్లో రిఫ్లెక్ట్ అయిన దృష్టికోణాల వ్యత్యాసాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చు.
Do not go gentle into that good night
Rage rage against the dying of the light
అని రాస్తాడు Dylan Thomas. ఇతనిదీ ఇదే ఎత్తుగడ. ఇలాంటి ఎత్తుగడల్ని వాటి అత్యంత గరిష్ట స్థాయికి అఫ్సర్ తీసుకెళ్లాడనటంలో సందేహం లేదు.
Web Statistics