చూపుడు వేలు
1

నేనూ ఉమర్ వొకే వయసు. కానీ, అందరిలానే వాణ్ని నాకూ  “ఉమర్ భాయ్!” అనే పిలవడం అలవాటయింది. నేనే కాదు, మా ఆవిడ రజియా కూడా వాణ్ని అట్లానే పిలుస్తుంది. మొదట్లో మా వాడు –సాజిద్, ఇంటర్ చదువుతున్నవాడు కూడా-- వాణ్ని “ఉమర్ భాయ్” అనే పిలుస్తూంటే, “మరీ బాలేదురా, నువ్వు ఉమర్ చాచా అని పిలువు!” అని వాణ్ని కట్టడి చేసేశాం.  

“రంజాన్ ఉపవాసాలు  కూడా మొదలయ్యాయ్. ఉమర్ భాయ్ ఈసారి కనిపించనేలేదు. కొంచెం కనుక్కోండి!” ఆ సాయంత్రం రజియా చాయ్ ఇస్తూ అడిగింది.

ఈ కరోనా లాక్ డౌన్ వల్ల నా ప్రపంచమంతా కొంచెం మారిపోయింది. ఆన్ లైన్ క్లాసులతో మామూలుగా కంటే పనిభారం ఎక్కువ అనిపిస్తోంది. టెక్నాలజీ నాలో యేదో  ఆస్తిమితత్వానికి కారణమవుతోంది. ఆన్ లైన్ పాఠం అయిన ప్రతిసారీ అనిపిస్తుంది, నేరుగా క్లాస్ లో అయితేనే నాకు నచ్చేట్టుగా చెప్పగలనేమో.

ఈ కొత్త హడావుడిలో రంజాన్ చంద్రుడు కనిపించడమూ, ఉపవాసాలూ మొదలు కావడమూ గమనించుకోలేదు. ఇంకో విధంగా చెప్పాలంటే, వాటిని గమనించుకోగలిగే ముస్లింతనానికి తను కొంచెంగా దూరమవుతూ వస్తున్నాడు కొంతకాలంగా-

ఈసారి రోజాలైనా వుంటారా?!” అని రజియా ఆ సాయంత్రం గట్టిగానే అడిగింది. కాస్త నిరాసక్తంగా తల వూపడమో యేదో చేశాను కానీ, కచ్చితంగా యేమీ చెప్పలేకపోయాను. సాయంత్రం చాయ్ సమయానికి ముగ్గురం ఎక్కడున్నా ముందు గదిలో కనీసం అరగంట కలిసి చాయ్ బిస్కట్లు షేర్ చేసుకుంటాం. కబుర్లకి కూడా అదే మంచి సమయం. మామూలుగా అయితే, ఉమర్ యేదో వొక సమయంలో వచ్చి పలకరించే వెళ్తాడు.

“ఉమర్ భాయ్ కి ఫోన్ చేయండి! లాక్ డౌన్ తరవాత అసలు రానేలేదు!”

“అవును, బాబా! కనీసం ఫోన్ చేద్దాం!”

నాకు ఈ పరిస్థితి మరీ అన్యాయంగా అనిపించింది. సాధారణంగా వాళ్ళెవరూ గుర్తు చేయకుండానే ఉమర్ ని నేనే ఒకటికి పడిసార్లు పలకరిస్తూ వుంటాను. లాక్ డౌన్ కి ముందు వాడే వచ్చి వెళ్ళాడు కూడా!

ఇంకో ఆలోచన చేసే లోపే సాజిద్ టేబుల్ మీద వున్న మొబైల్ పట్టుకొచ్చి, నా చేతుల్లో పెట్టాడు. ఉమర్ నంబర్ నొక్కి, వాడి జవాబు కోసం ఎదురుచూస్తున్నా.

రజియా ఈ లోపు నమాజ్ కోసం లోపలకి వెళ్లిపోయింది. సాజిద్ మాత్రం నా ఎదురుగా కూర్చొని ఉమర్ కోసం ఎదురుచూస్తున్నాడు.

“వాడు ఫోన్ ఎత్తడం లేదు, రా!” అన్నాను. సాజిద్ నిరాశగా ముఖం పెట్టుకొని, తన గదిలోకి వెళ్లిపోయాడు.

మరోసారి మొబైల్ ప్రయత్నించి, వూరుకున్నా.

లాక్ డౌన్ కి ముందు ఇంట్లో వాళ్ళకి నేనూ ఉమర్ చెప్పని విషయం వొకటి వుంది. అది ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చేసింది కానీ, అసలు ముందు ఉమర్ ని పట్టుకోవాలి యెట్లా అయినా!

ఉమర్ గురించే ఆలోచిస్తూ మేడమీదకి వెళ్ళి, అక్కడ మా చిన్న కూరగాయల తోటకి నీళ్ళు పోయడం మొదలుపెట్టాను.

  రూఫ్ గార్డెన్ నిజానికి ఉమర్ ఆలోచనే.

“మీ డాబా మీద మంచి గార్డెన్ పడుతుందిరా  సాదిక్!” అన్న మరునాడే వాడు రెండు బెండ, రెండు వంకాయ, రెండు టొమోటా మొక్కలు పెట్టేశాడు. చూస్తూండగానే ఆ రూఫ్ నిండా గార్డెన్ పరచుకుంది. నిజానికి ఈ లాక్ డౌన్ సమయంలో మనసుని కొంచెం కుదుటపెట్టుకోడానికి ఈ పచ్చని మొక్కల మధ్య గడపడం, వాటి బాగోగులు చూసుకోవడం...నాకు బాగుంది సరే. ఉమర్ పరిస్థితి యేమిటి?

వాడు అద్దెకి వుండే రెండు చిన్న గదుల్లో ఆ నాలుగు ప్రాణాలు వుండడమే  కష్టమే. అప్పటికీ వాడు ఆ ఇరుకులోనే అక్కడేదో రెండు మూడు కుండీలు పెట్టుకున్నాడు. కానీ, వాడి సాయంత్రాలు ఎక్కువగా ఉర్దూ అరబ్బీ పాఠాలతో గడుస్తాయి. ఈ రెండు మూడు వాడల్లో మంచి అరబ్బీ ఉర్దూ టీచర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఒక ముస్లిం ప్రైవేట్ స్కూల్ లో పగలంతా పనిచేస్తాడు. సాయంత్రాలు అయిదారుగురు పేద పిల్లల్ని చేరదీసి, వాళ్ళ చేత తన ఇరుకు ఇంట్లోనే రెండు గంటల దాకా కూర్చోబెట్టి, పాఠాలు చెప్తాడు. వాళ్ళు హోం వర్కులు చేస్తూ వుంటే, దగ్గిర వుండి అన్నీ చెప్తూ వుంటాడు.

“అంత సమయం ఎలా పెడతావ్ రా, వాళ్ళకి?!” అని నేనే ఆశ్చర్యంగా అడుగుతూ వుంటాను అప్పుడప్పుడూ.

“కమ్యూనిటి కోసం నేనింకా  యేమీ చేయలేను కదా! మామూలుగా అయితే ఆ రెండు గంటలు వాళ్ళు ఇంట్లో వుంటే ఆ పనీ ఈ పనీ తప్ప చదువు మీద అయితే పెట్టరు. నా దగ్గిర కూర్చోబెట్టాననుకో, చచ్చినట్టు చదువుతూ కూర్చొంటారు కదా! చదువు వొక్కటే దారిద్ర్యాన్ని ఎదుర్కునే మంత్రం! మనకి తెలిసినంతలో చదువు విలువ గురించి చెప్పుకుంటూ వెళ్ళాలి ,” అన్నాడు చాలా ధీమాగా.

ఆ మాటకొస్తే, నేను ఇంగ్లీష్ వైపు, వాడు అరబ్బీ ఉర్దూ వైపు మళ్లడం కూడా చాలా ఆసక్తిగానే జరిగింది. నిజాయితీగానే చెప్తున్నా- నా ఆలోచనల్లో కమ్యూనిటీకి ఎప్పుడూ పెద్ద చోటు లేదు. నేను బాగా చదువుకోవాలి, లెక్చరర్ కావాలి. మంచి లెక్చరర్ కావాలి అన్నవరకే నా లక్ష్యంగా వుండేది. దానికి తగ్గట్టుగానే ఎమ్మే ఇంగ్లీషు చదువుకోగానే ఇక్కడే లెక్చరర్ గా చేరాను. వాడికి ఇంగ్లీషు, లెక్కలు కూడా బాగానే మార్కులు వచ్చేవి కానీ, ఎందువల్లనో డిగ్రీ తరవాత పూర్తిగా అరబ్బీ ఉర్దూ టీచింగ్ కి ఎంతకావాలో అంత వరకే నేర్చుకొని, ముస్లిం ప్రైవేట్ స్కూల్ లో కుదిరాడు.

“ఇట్లా అయితే నేను ముస్లిం పిల్లలకు దగ్గిరగా వుంటాను. వాళ్ళ కోసం యెమైనా చేస్తాను. లేదా, యెమైనా చెయ్యాలీ అన్న motivation తో వుంటాను.” అన్నాడు ఆ వుద్యోగంలో చేరిన రోజు-

“ఉమర్ భాయ్ ఫోన్ దొరికిందా?” అప్పుడే మేడపైకి వస్తూ రజియా అడిగిన ప్రశ్నకి నా ఆలోచనలు చెదిరిపోయాయ్.

“లేదు, రజియా! రేపు పొద్దున నేనే వెళ్లివస్తాను” అని లేచి, నీళ్ళతో చేతులు కడుక్కున్నాను.

“గార్డెన్ వర్క్ కూడా లేకపోతే ఎంత కష్టంగా వుండేదో...ఈ టైమ్ లో...?” అన్నాను.

“వర్క్ కావాలా? బోలెడు పని పెడతా...కిందకి రండి!” నవ్వుతూ అంది రజియా. కాసేపు ఏవో కబుర్లు చెప్పుకుంటూ మేడ మీది కుర్చీల్లోనే కూర్చుండిపోయాం.

కానీ, తనకి చెప్పాలి. లాక్ డౌన్ కి ముందు ఏం జరిగిందో?! అది ఎక్కడ మొదలు పెట్టాలో ముందు తేల్చుకోవాలి!

రాత్రి భోజనాలయ్యాక టీవీ ముందు కూర్చొన్నాం. సాజిద్ కి ఇది చాలా బిజీ సెమిస్టరు. పాపం, ఏదో తినేసి తన రూమ్ కి వెళ్ళి తన చదువులో తను మునిగిపోతూ వుంటాడు.

వార్తలు వింటున్నాం. అంతా కరోనా గురించే. మర్కజ్ కి వెళ్లివచ్చిన వాళ్ళే పాజిటివ్ కేసుల్లో ఎక్కువమంది వున్నారని మంత్రి అన్న మాటల మీద ఇంకా చర్చలు, చర్యలు జరుగుతూనే వున్నాయి. ఇది ముస్లింలని ఇంకో కొత్త పేరుతో అణచివేసే కుట్ర తప్ప ఇంకేమీ కాదని కొంతమంది ముస్లిం నాయకులు అంటున్నారు. కొన్ని చోట్ల ముస్లింలని దూరంగా వుంచడానికి ఇప్పుడు మర్కజ్ బూచి చూపిస్తున్నారని whatsapp గ్రూప్ లో , ఫేస్ బుక్ లో కూడా చర్చలు జరుగుతున్నాయి. అవి తను ఫోన్ లో చదువుతూనే వున్నాడు. ఆ లోకం రజియాకి తెలియదు కాబట్టి, ఆమెకి టీవీలో చూసేదీ, వినేది మాత్రమే వార్త!

“మన వాళ్ళు కూడా మరీ అన్యాయంగా తయారవుతున్నారు! ఈ మర్కజ్ లూ, జమాత్ లూ లేకపోతే ఏం? మనం బతకలేమా? వాళ్ళ వల్ల మామూలు ముస్లింలకు కూడా కష్టాలు!” అంది వున్నట్టుండి రజియా.

మొబైల్ ఫోనుకీ మధ్య, టీవీ వార్తలకు మధ్య షటిల్ ఆడుతున్న నేను ఆ మాట అన్న రజియా కళ్ళల్లోకి చూశాను. కచ్చితంగా అదే సమయంలో రజియా కూడా నా కళ్ళల్లోకి చూస్తోంది, నేనేం అంటానా అని!

కాసేపు యేమీ అనలేకపోయాను గాని, రజియా వూరుకోదు. కొంచెం గట్టిపిండం మరి!

“అంత తేలికగా లేదు, రజియా! మర్కజ్ లేకపోతే, ఇంకో కారణమేదో ముస్లింలని తిట్టిపోయడానికి వెతికి పట్టుకుంటారు. దేశమంతా ముస్లిం వ్యతిరేకతలో కొట్టుకుపోతోంది!”

“మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. మీరు ముస్లిం కాబట్టి మీ క్లాసులకి రాము అనే హిందువులు వుంటారా? లేకపోతే, మీ పేరులో మహమ్మద్ వుందని చెప్పి, మీ హిందూ స్నేహితులు యేమైనా కటాఫ్ చేశారా? మనం బాగుంటే, వాళ్ళు బాగుంటారు మనతో! మనమూ- వాళ్ళూ అనుకుంటే అట్లాగే వుండిపోతాం!”

అవునా? మనమూ- వాళ్ళూ—అని అంటున్నది యెవరో రజియాకి తెలియదా నిజంగా?!

ఇంకేం చెప్పాలో నాకు తెలీలేదు. “దేశం చాలా మారిపోయింది, రజియా! ఏడాది కిందట వున్నట్టు ఇప్పుడు లేదు!” అన్నాను.

“మీరేదో చెప్తారు. సరే, ఇషా నమాజ్ వేళ అయింది. వచ్చాక కాసేపు ఖురాన్ చదువుకొని పడుకుంటాను. మీరెలాగూ రేపు క్లాస్ కి రెడీ అవ్వాలి కదా!” అంటూ లోపలికి వెళ్లిపోయింది.

టీవీలో మర్కజ్ వార్త వస్తున్న సమయంలోనే ఉమర్ సంగతి చెప్పాలని అనుకున్నా. కానీ, ఈ చర్చ తరవాత ఇంకేం చెప్తాను? తన దగ్గిర యేమైనా విషయం దాచి వుంచడం అన్నది ఇంతవరకూ జరగలేదు. ఉమర్ మర్కజ్ కి వెళ్లివచ్చాడని, రాగానే అతన్ని   కరోనా టెస్టింగ్ కి పంపించారని రజియాకి చెప్పాలి.. చెప్పి తీరాలి రేపో మాపో!

ఆ తరవాత మా ఇంట్లో ఉమర్ ఎవరు? రజియా కి అతను “భాయ్”గానే కనిపిస్తాడా?! రజియా స్పందనని వూహించలేకపోతున్నా.

ఆ రాత్రి నాకు నిద్రలేదు. నిజం చెప్పడం అంత తేలిక కాదు, దాని వెనక వచ్చే పర్యవసానాల్ని గురించి ఆలోచన వుంటే! అవేమీ మనసులో పెట్టుకోకుండా తిన్నగా విషయం చెప్పేయాలా?!

“చెప్పేయ్, ఏం పర్లేదు?! నిజం నిజమే. అది చెప్పడం ఆలస్యమైతే అబద్ధం కంటే ప్రమాదకరం కావచ్చు!” అంటున్నాడు ఉమర్ లోపలినించి.

వాడు అంతే...అబద్ధాలు మన ముఖాల్ని మార్చేసే వక్రరేఖలు అంటాడు. కానీ...రేపు యెట్లా అయినా కలవాలి వాణ్ని.

3

“సాదిక్ బాబూ! అంత దూరం వద్దమ్మా! మధ్యలో యేదో స్కూల్ గ్రౌండ్స్ దగ్గిర కలవండమ్మా!” అనేది అమ్మ స్కూల్ రోజుల్లో ఆదివారాలు యెప్పుడైనా నేను సైకిల్ వేసుకొని, ఉమర్ వాళ్ళ ఇంటి వైపు వెళ్తూ వుంటే! ఉమర్ వాళ్ళ నాన్న రెహమాన్ ది పెద్ద వుద్యోగమేమీ కాదు. మూసా కిరాణా కొట్టులో పొట్లాలు కట్టేవాడు. ఉమర్  వాళ్లమ్మ చిన్న చిన్న కుట్టు పనులు చేసేది. ఉమర్ తమ్ముడు ఖమర్ మా ఇద్దరి కంటే మూడేళ్లు చిన్న. నా సైకిల్ వాళ్ళింటి ముందు ఆగినప్పుడల్లా రెహ్మాన్ వాళ్లమ్మ బయటికొచ్చి, “సాదిక్ బేటా!” అని ఆత్మీయంగా నన్ను లోపలికి పిలిచేది. అది నాలుగైదు అద్దె ఇళ్ల వాటాలున్న చిన్న కాంపౌండ్. వాళ్ళ ఇల్లు అంటే రెండు చిన్న గదులు.

మా అమ్మ అంత దూరం వద్దు!” అనడంలో కేవలం దూరం మాత్రమే లేదు.  మాటల్లో అమ్మా నాన్న యెప్పుడూ చెప్పలేదు గాని, వాళ్ళ చర్యల్లో అర్థమయ్యేది. ఉమర్ వాళ్ళ స్థాయి మనతో కలవదూ అని! స్కూల్ రోజుల్లో అప్పుడప్పుడూ ఉమర్ గాని, ఖమర్ గాని మా ఇంటికి వచ్చేవాళ్లు. కానీ, నాకు తెలిసీ మా ఇంట్లో యెవరూ వాళ్ళిద్దరినీ అంత మనస్ఫూర్తిగా లోనికి రమ్మని గాని, కాసేపు కూర్చోమని కానీ చెప్పిన గుర్తు లేదు నాకు.

అయినా- ఉమర్ తో నా స్నేహం ఆగలేదు. పెళ్లయ్యాక – రజియాకి అట్లాంటివి పెద్ద పట్టింపులు లేవు. అప్పటికి ఉమర్ భాయ్ స్కూల్ టీచర్ కాబట్టి నా అందరి స్నేహితుల కంటే ఎక్కువ మర్యాదలే దక్కుతున్నాయి. నిజానికి రజియాకి అన్నతమ్ముళ్ళు లేకపోవడం వల్ల ఉమర్ తన మంచితనంతో భాయ్ స్థానంలోకి తేలికగానే వచ్చేశాడు.

4

బైక్ దిగి, ఉమర్ వాళ్ళ కాంపౌండ్ లోకి అడుగుపెట్టాను. వాళ్లది చివరి వాటా ఇల్లు. మొదటి మూడు వాటాల బయట అప్పటిదాకా కబుర్లు చెప్పుకుంటున్న ఆడవాళ్ళు నన్ను చూసి మాటలు ఆపేశారు. తిన్నగా చివరి వాటా దాకా వెళ్ళి, నిలబడ్డాను. ఖమర్ బయటికివచ్చాడు, “సాదిక్ భాయ్ వచ్చాడమ్మా!” అంటూ-

నన్ను చూడగానే వాళ్లమ్మ కళ్ళనీళ్లు తుడుచుకుంది. “అసలు కన్నెత్తి చూసిన వాళ్ళు లేరు బాబూ!” ఏడుపు వచ్చేస్తోంది ఆమెకి.  రెహమాన్ వున్న పళాన నిలబడి, తన కుర్చీ ఖాళీ చేసి నాకు ఇచ్చాడు. గదిలో వున్న వొకే వొక్క మంచమ్మీద అతుక్కుపోయి వున్నాడు ఉమర్ భాయ్. నన్ను చూడగానే వాడి కళ్ళు మెరిశాయ్. లేవబోయాడు. వద్దని చెబ్తే మళ్ళీ వెనక్కి వాలాడు.

“లాక్ డౌన్ నుంచీ అట్లానే వున్నాడు. జ్వరమూ అవీ చెక్ చేస్తున్నా. మొదట్లో 102 దాకా కనిపించింది. తరవాత నార్మల్ అయింది. కానీ, లేచి కూర్చోడం లేదు. కాసేపు కూర్చున్నా, వెంటనే కూలిపోతున్నాడు,” అన్నాడు ఖమర్.

“ఉమర్ భాయ్, నువ్వు చెప్పు!” అంటూ వాడి చేతులు దగ్గిరకు తీసుకున్నా. ఆ కాస్త స్పర్శకే వాడు కరిగిపోయినట్టు అనిపించాడు. వొక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది. నేను వాడి వీపు మీద చేయి వేసి, దగ్గిరకు తీసుకున్నాను. కాసేపు అట్లా వదిలేశాను వాణ్ని. వాడు ఏడిచీ ఏడిచీ కొంచెం నిమ్మళించాడు.  ఇన్నేళ్ల స్నేహంలో అంత బలహీనమైన స్థితిలో వాడెప్పుడూ కనిపించలేదు.  ఉమర్ భాయ్ క్లాస్ లో అయినా, బయట అయినా, రోజువారీ బతుకులో అయినా నన్ను అడిగితే చాలా creative. వాడికి రొటీన్ లైఫ్ లేదు. యేదైనా పనిచేస్తే, మనసుపెట్టి చేస్తాడని అందరూ అంటారు. క్లాస్ లో ఉమర్ భాయ్ చాలా సరదాగా వుంటాడని స్కూల్ ప్రిన్సిపల్ పదేపదే అంటాడు. ఇక పిల్లలకు వాడంటే ప్రాణం.

ఆరునెలలుగా ముస్లిం పేదపిల్లలకు యేదైనా చేయాలని వాడు అందరినీ కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. నా లాంటి స్నేహితుల సాయంతో వేరే మతాల పెద్దల్ని కూడా కలుపుకొని వెళ్తున్నాడు. ఆ క్రమంలోనే కొంతమంది జమాత్ పెద్దలతో కూడా అతనికి స్నేహాలు యేర్పడ్డాయి. అవన్నీ అతను తన శక్తితో సాధించగలిగిన తేలికపాటి విజయాలే! అవన్నీ పక్కన బెడితే, ఇప్పుడు అతన్ని వేధిస్తున్న పెద్ద సమస్య వేరే వుంది.

“నేనెప్పుడూ ఇక్కడ పరాయీవాడిగా నన్ను నేను భావించుకోలేదు. కానీ, మర్కజ్ కి వెళ్ళి వచ్చాక అందరి దృష్టిలో నేను యెవరినో అయిపోయాను.!” అన్నాడు కళ్ల నీళ్ళు కుక్కుకుంటూ.

కానీ, ఇవాళ నేను చూస్తున్న ఉమర్ కీ, ఆ ఉమర్ కీ పోలికే లేదు.

ఆ స్థితిలో నేను వాడితో ఎక్కువసేపు ఆ విషయాలూ ఈ విషయాలూ మాట్లాడి, వాడి మనసు బాధపెట్టే కంటే, కొంచెం సేపు కూర్చొని వెళ్లిపోవడమే మంచిదని ఆ రోజుకు అనుకున్నా.

కొద్దిసేపు కూర్చొన్న తరవాత నేను లేచి నిలబడితే వాడే అన్నాడు: “రజియానీ సాజిద్ నీ చూసి చాలా రోజులే అయింది. వస్తా అని చెప్పు!”

అవును, రోజూ అడుగుతున్నారు వాళ్ళు!” అని, నేను బయటికి వచ్చాను. నాతోపాటు ఖమర్ కూడా వచ్చాడు. నేను వొక పక్కగా నిలబడి, సిగరెట్ వెలిగించాను.

“సాదిక్ భాయ్, నెగెటివ్ వచ్చినా సరే వాళ్ళు అన్నయ్యని చాలా ఇబ్బంది పెట్టారు. ముందు ఆస్పత్రిలో తరవాత పోలీస్ స్టేషన్ లో “ఏరా, మర్కజ్ కి వెళ్లకపోతే యెమైందిరా?! ప్రాణాలతో ఆడుకుంటున్నార్రా మీరంతా!” ఇట్లాంటి సూటి పోటీ మాటలు. వారం రోజుల నుంచి ఈ ఇంటి వోనరు గొడవ ఇల్లు ఖాళీ చేయమని! ఇన్నేళ్లుగా ఇదే ఇంట్లో వున్నాం. ఓనర్ కి మేమేమిటో తెలుసు!”

“ఖమర్, ఇప్పుడు మన గతమంతా చెరిగిపోయింది. మన స్నేహాలూ, బాబాయ్, మామాయ్, అన్నయ్యా, అక్కా  అనుకోడాలూ అన్నీ పోయాయ్. ఇప్పుడు నువ్వూ నేను ముస్లిం మాత్రమే!”

కానీ, నా ప్రశ్న అడక్కుండా వుండలేకపోయాను. “మర్కజ్ కి యెందుకు వెళ్ళాడు ఉమర్? వాడికి జమాత్ లూ అవీ నచ్చవ్ కదా!”

“నిజమే, కానీ, ఈ మధ్య ముస్లిం పిల్లల కోసం యేదైనా చెయ్యాలీ అన్న తపన పెరిగిపోయింది. చాలా మంది పేద పిల్లలు—ఈ మధ్య అయితే అనాథలు కూడా – అన్న సాయం కోసం వస్తున్నారు. వాళ్ళకి చేతనైనంత చేస్తూనే వున్నాడు. కానీ, ఎంత చేసినా సరిపోవడం లేదు. అట్లా జమాత్ వాళ్ళు కాంటాక్ట్ లోకి వచ్చారు!”

“అవునా?! ఇదంతా నాకు తెలీదే!” అన్నాను ఆశ్చర్యంగా-

“జమాత్ లో కూడా అన్న పాత్ర యేమీ లేదు. వాళ్ళు సాయం చేస్తామంటే సరే అన్నాడు. అంతే! అందులోని ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి, మర్కజ్ కి తీసుకువెళ్లారు. వాళ్ళే అన్నీ ఖర్చులూ పెట్టుకున్నారు!”

ఈ లోపు నా మొబైల్ మోగింది. ఇంటి నించి సాజిద్ ఫోన్. “బాబా! ఉమర్ చాచా కలిశారా?”

“అవును, కలిశాం. అందరూ బాగున్నారులే!” అని పెట్టేశాను.

“ఖమర్, కనీసం నువ్వు నాకు చెప్తూ వుండు. వాడు బాగా హర్ట్ అయినట్టున్నాడు. నేను రెండు రోజుల్లో మళ్ళీ వస్తా!” అని బైక్ ఎక్కాను.

ఇప్పుడు నా ముందున్న ప్రశ్న—రజియాకీ, సాజిద్ కి నిజం చెప్పాలా, వద్దా?!

నిజం చెప్పకుండా వుండడం ఉమర్ కి కూడా నచ్చదు.

కానీ, ఆ నిజం ఎటు వెళ్తుందో?!

నా మటుకు నాకు ఉమర్ ని వొంటరీ వాణ్ని చేయకూడదు అని ఆ క్షణంలో కచ్చితంగా అనిపించింది.  అంతా విన్నాక రజియా, సాజిద్ కూడా అట్లా అనుకుంటారా?! చెప్పలేను!

*
ANDHRA JYOTI SUNDAY MAY 16TH, 2020
‘సాహిల్ వస్తాడు’ మనం చర్చించాల్సిన సందర్భం


                                   

                                                                   
  -  డా।। ఎ. రవీంద్రబాబు

                                                         

అఫ్సర్ కవి, కథకుడు. సమకాలీన సమూహంలో తనను తాను ఆవిష్కరించుకుంటూ సొంత డిక్షన్ తో బలమైన అస్తిత్వాన్ని వ్యక్తం చేస్తున్న సృజనశీలుడు. కాలం పోకడల మధ్య అదృశ్య పొరలను గమనించి, గుర్తించి సాహిత్యాన్ని పదునెక్కిస్తున్న మార్మిక కళాతాత్వికుడు. గతానికి, వర్తమానికి మధ్య వారధిని నిర్మించే క్రమంలో మర్చిపోయిన మూలాలను పట్టుకొని ఆయువుపట్టులా పొదుగుతున్న సాహసికుడు. చరిత్ర వదిలేసిన వాటిలో, సొంత ముద్రలతో నిర్మించుకున్న చరిత్రలో దాగిన సత్యావిష్కరణల మీదుగా మాట్లాడతున్నాడు. సమకాలీనతల నుంచి గతం వైపు, గతం నుంచి భవిష్యత్తువైపు చూపు సారిస్తున్నాడు. సాహిత్య వ్యక్తిగా వ్యవస్తీకృతమైన సత్యాల్లోని నీడల్నీ ప్రశ్నిస్తున్నాడు. సాహిత్యం చేయాల్సిన పనిని నిబద్ధతగా, నిష్కర్షగా చేశాడు. చేస్తునే ఉన్నాడు.

అఫ్సర్ గత ఏడాది జనవరిలో తన కథల్లోంచి కొన్నింటిని సాహిల్ వస్తాడు మరికొన్ని కథలు పేరుతో వెలువరించాడు. సాహిల్ వస్తాడు కథా శీర్షికనే సంపుటికీ పెట్టాడు. అంటే ఈ కథ ఎంత ప్రాధాన్యత గలిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ కథా లోతుల్లోకి తొంగిచూస్తే.. మైనరిటీల అభద్రత, అస్తిత్వం, సమూహంలో ఏకాకితనం, రెండు మానసిక ప్రంపంచాల మధ్య ముస్లీంల మానసిక వేదన, కౌటుంబిక బంధాల్లోని ఆత్మీయత, వైయక్తిక సమ్మతమై, సమాజం సమ్మతం కానీ బాహ్య మానసిక జీవన నడవడిక, ఇస్లాంలోని స్వచ్ఛత... ఎన్నో అంశాలు రంగురంగుల రెక్కల్లా, బాధామయ శోకంలా దృశ్యాల్లా కదలాడతాయి. తనను తాను అపసవ్యదిశలోకి మార్చుకోని జీవన సౌందర్య స్వేచ్ఛాగానానికి, తితలీ(సీతాకోక చిలుక)లో దాగిన అమాయకత్వపు లేలేత నిజాయితీకి ఈ కథలోని సాహిల్ ఓ నిర్వచనంలా నిలుస్తాడు.   

   1980ల తర్వాత తెలుగు సమాజం తన సాహిత్య గతిని మార్చుకుంది. అస్తిత్వాలకు పురుడుపోసింది. తెలుగునేలపై చోటుచేసుకున్న అనేక సామాజిక సంఘటనలు, జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు అస్తిత్వ సాహిత్య ఉద్యమాలకు దారితీశాయి. ముఖ్యంగా 20వ శతాబ్ది చివరి దశాబ్దం.. సామూహికత్వంలోంచి చలనశీలమైన స్వీయ వ్యక్తీకరణలకు తావిచ్చింది. ప్రతి మనిషికి సంబంధించిన భావ, బౌద్ధిక సంఘర్షణలు, సంవేదనలు, సంలీనతలు.. అన్నీ చారిత్రక, సామాజిక, సాంఘిక, ఆర్థిక నేపథ్యంతో ముడిపినవేనని రుజువుచేశాయి. ఏకరూపత నుంచి భిన్నత్వ భావనాలోకాల్లోకి సమాజం వెళ్లిపోయింది.

అగ్రరాజ్య ఆధిపత్యం, చమరుకై పోటీలు, ఉగ్రవాద ముద్రలు.. జీవన పార్శ్వాలకు, సున్నితమైన అంశాలకు సైతం మతం పులమటం, మైనరిటీ అంటూ అభద్రతలోకి నెట్టివేయటం, బాబ్రీ మసీదు విధ్వంసం, తర్వాత చెలరేగిన అల్లర్లు, గుజరాత్ సంఘటన, వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడి, దాని పర్యవసానాలు...  ఈ క్రమంలో ముస్లింల జీవితాల్లో చోటుచేసుకున్న అభద్రత, అస్తిత్వం, బతుకులు, సడలుతున్న ఆత్మవిశ్వాసం, వీటి నుంచి ఉద్భవించే ప్రశ్నలు.. ఎన్నింటినో సాక్ష్యాలుగా మైనారిటీ వాదం చూపిస్తుంది. సంఘర్షణ, దాని తాలూకూ రాజీ, మింగుడుపడని వాస్తవాలు, ధ్వంసం మవుతున్న బాహ్య, అంతర్ మైనరీటీ జీవితాలను కవిత్వం, కథ, నవలలుగా తీసుకొచ్చింది ఈ వాదం. తమదైన టోన్ ను వినిపించే ప్రయత్నం చేశారు ఎందరో ముస్లిం సృజనకారులు. ఆత్మన్యూనత నుంచి అస్తిత్వ పెనుగులాట వరకు, కన్నీళ్ల నుంచి పోరాటం వరకు సాగిన, సాగుతున్న మైనారిటీవాద సాహిత్యంలో ఎన్నో మలుపులు, మెరుపులు ఉన్నాయి. ఈ క్రమంలో అఫ్సర్ రాసిన సాహిల్ వస్తాడు కథా స్థానాన్ని, నేపథ్యాన్ని, వస్తువును, పాత్రల అభూతులను, ఆవేదనలను, సామాజిక సందర్భాన్ని, కథా రీతిని గమనిస్తే...

సాహిల్ వస్తాడుకథా శీర్షికలోనే సాహిల్ కనిపించడంలేదన్న భావన వ్యక్తమవుతుంది. మరి సాహిల్ ఎక్కడకు వెళ్లాడు? ఎందుకు వెళ్లాడు? అసలు కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి? సాహిల్ కు సంబంధించిన వ్యక్తులు ఎవరు? వాళ్లు సాహిల్ కోసం ఎలా ఎదురు చూశారు? సాహిల్ ను వెతకడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారు? సాహిల్ కనిపించకుంటే అతడికి సంబంధించిన వాళ్ల పరిస్థితి ఎలా ఉంది?... కథా శీర్షికే ఇలాంటి ఎన్నో ప్రశ్నలను సంధిస్తుంది. ప్రతి ప్రశ్న వెనుక దాగిన జవాబుకోసం మనల్ని కథలోకి లాక్కుపోతుంది.

రాము దృష్టికోణంతో నడిచే ఈ కథ కలతో, కలత నిద్రతో మొదలవుతుంది. చార్మినార్ చుట్టూ జరిగిన అల్లర్ల అలికిడి, తెగినకలలో సీతాకోక చిలుక గుంపుల శవాలు.. వాటి అలికిడితో మొదలవుతుంది. ఆ స్థలంతో అతడి ఇద్దరు స్నేహితులు ఫణి, సాహిల్ కు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ ముందుకు సాగుతుంది. వాళ్ల ముగ్గురు అక్కడ టీలు తాగుతారు. కబుర్లు చెప్పుకుంటారు. చాయ్ బిస్కెట్ తోపాటు, సాహిల్ గజళ్లు వాళ్ల మధ్య తితల్లా ఎగురుతూ మనసులకు రంగులు అద్దుతుంది.

ప్రేమంటే ఏమిటో తెలుసుగాని అందాల నా చెలికి నా ఇల్లే తెలియదు.

దేవుడి పేరు వింటే విన్నదేమో కాని ఆమెకి అతని జాడే తెలియదు.

మరీ పరధ్యానంగా వున్నానేమో, యవ్వనపువనం ఎప్పుడొచ్చి ఎటు వెళ్లిందో తెలియదు.

వసంతం వాకిట నిల్చుందని తెలుసుకానీ, ఆకురాలుకాలమని తెలియదు.ఇలాంటి పాటలు సాహిల్ సమక్షంలో సంగీత సాహిత్యాల పోటీలా ఉంటాయి. సాహిల్ అద్భుతమైన పాటగాడు. స్వచ్ఛమైన పదాలతో అతనే పాటగా మారిన వ్యక్తి.

రాము కూతురుకు తితలీ అని పేరుపెట్టింది కూడా అతనే. ఈ చిన్నీకి రెక్కలు లేవనే కాని, సీతాకోక పాపలా పుడితే అది ఇలాగే ఉంటుందిరా అని ఎనిమిదేళ్ల పాపను ముద్దుచేయగల అమాయకుడు. తితలీ మామూ అంటూ అతనితో ఆత్మీయంగా ఆడుకుంటుంది. కబుర్లు చెప్తుంది. తితలీ దగ్గరకు వస్తే తప్ప అతనికి ఆత్మశాంతి ఉండదు”.     

రాముకు సాహిల్ తో పరిచయం చదువుకునే రోజుల నుంచి ఉంది. అతడి ఆత్మాభిమానం, మంచితనం, నిజాయితీ.. అన్నీ తెలుసు. తను హసీనాను ప్రేమిస్తూ, కలలో నిద్రలో చేస్తున్న పనులు బాగాలేవు అని స్నేహితుడితో చెప్పిన వ్యక్తి. ఏదయినా వొక విషయం దాస్తే రాత్రంతా నిద్రపట్టని మనిషి. తప్పు చేస్తున్నానన్న భావం ఇస్లాం దృష్టిలో అలాగే వుండనివ్వదు అని నమ్మి, ప్రేమించిన హసీనాను పెళ్లి చేసుకున్న నిజమైన ఇస్లాం. అంతేకాదు, ధర్మ బద్ధం కానిపని ఏదీ నేను చేయలేను. అది కేవలం నాశరీరానికి మాత్రమే పరిమితమయ్యే విషయం అయినప్పటికీ అన్న ఫిలాసఫర్. భార్య హసీనా, కొడుకు ఫైజ్, స్నేహితులు ఫణి, రాము మాత్రమే అతడికి తెలిసిన ఆత్మీయ ప్రపంచం. అలాంటి సాహిల్ హటాత్తుగా కనిపించకుండా పోతాడు.     

     దాని వెనుక మత మౌఢ్యంతో చార్మినార్ చుట్టూ జరిగిన అల్లర్లు, శవాల చప్పుళ్లు. ముస్లింలపై జరిగిన దాడులు.. అనేకం. ముస్లింలను అనుమానించడం, అవమానించడం, అరెస్టులు చేయడం, తద్వారా వాళ్ల కుటుంబాలను అభద్రతాభావంలోకి, సంఘర్షణలోకి నెట్టివేయడం లాంటివి ఎన్నో.. అలాంటి నేపథ్యంలోంచే సాహిల్ కనిపించకుండా పోవడాన్ని చూడాలి. ఆ సామాజిక, రాజకీయ, మత పరిస్థితుల నుంచి సమాజం అతడిని చూసే దృష్టికోణాన్ని చెప్పాడు అఫ్సర్. అతడి గురించి అన్నీ తెలిసిన ఆత్మీయ స్నేహితుడు నోరు విప్పలేని నిస్సహాయత, అతడి కుటుంబానికి భరోసా ఇవ్వలేని బాధ, కూతురుతో ఆ విషయాన్ని ఎలా షేర్ చేసుకోవాలో తెలియని మౌనం... ఇవన్నీ కథలో కనిపిస్తాయి. సాహిల్ ను రెండు ప్రపంచాలుగా చూసే సర్కిల్ కు, తన భార్యకు ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? చెప్తే పర్యవసానం ఏంటి అనే బాధ రామును భయపెడుతుంది. పోలీస్ స్టేషన్ లో జరిగే సంఘటనలో...

సాహిల్ కనిపించడం లేదని అతని భార్య, రాము, ఫణి వెళ్తే.. ముస్లింతో స్నేహం చట్ట విరుద్దమైనట్లు చూస్తాడు సర్కిల్. వొక్క విషయం చెప్పాలి. అతను ముస్లిం, మీరు హిందువులు. అతనిది ముస్లిం మైండ్! ముస్లింమైండ్ అంటే వయిలెంట్. అంత తేలిక కాదు అర్థం చేసుకోవడం – అది వొక మిస్టరీ! మీకు తెలియని లైఫ్ అతనికి చాలా వుండి వుంటుంది. ఇన్ని బాంబు బ్లాస్టులు, బస్సులు తగలబెట్టడాలూ, చావులూ, హత్యల తర్వాత కూడా మీకీ విషయం అర్థంకాకపోతే మీరు వొట్టి అమాయకులైనా అయి వుండాలి. లేకపోతే, తెలియని మాయలో ఇరుక్కొని వుండాలి.అంటాడు. అది రామును బరించలేనింతగా బాధపెడుతుంది. వాళ్ల స్నేహంమీద నమ్మకాన్నే ప్రశ్నిస్తుంది. రెండుకుంటంబాల మధ్య ఎప్పటి నుంచో ఉన్న తెగని బంధాన్ని, ఆత్మీయతని ప్రశ్నిస్తుంది. నమ్మకంతో అర్థరాత్రి తన ఇంటికి వచ్చిన సాహిల్ భార్య హసీనా నమ్మకాన్నీ ప్రశ్నిస్తుంది.

ముస్లిం వ్యక్తులను అలాంటి సందర్భంలో సమాజం చూసే విధానం, వాళ్లను అంచనా వేసే ఆలోచనలు ఎంత దుర్మార్గంగా ఉంటాయో చెప్పే సంఘటన అది. వ్యక్తిని మతం కోణంలో, అప్పటి వరకు జరిగన అల్లర్లతో ముడిపెట్టి మంచితనాన్ని, హృదయసౌకుమార్యాన్ని కర్కశంగా.. వాళ్లకై వాళ్లు తమదైన దృష్టితో చూడడం ఎంత దుర్మార్గమో చెప్తుంది. మతం అనేది మనిషిని, వ్యక్తిత్వాన్ని, చర్యలను అర్థం చేసుకునే దిక్సూచిలా మారిన వైనానికి నిదర్శనం ఈ సంఘటన. అంతేకాదు సాహిల్ గురించి, అతని వ్యక్తిత్వం, నిజాయితీ, దృక్పథం, మంచితనం, ఆదర్శాల గురించి తెలిసిన రాము ఏమీ చెప్పలేక పోవడం, చెప్పలేని పరిస్థితి దాపురించడం ఎంత దయనీయమో చెప్పే సఘంటన. ముస్లిం వ్యక్తైన సాహిల్ కే కాదు, రాములోని మూలాలని, మానవీయమైన వాళ్ల స్నేహబంధాల్ని, నోరు విప్పలేని నిస్సహాయ స్థితిని ప్రశ్నించే సంఘటన.  

హిందువైన రాముకే రక్తం ఉడికిపోతా ఉంటే.. సాహిల్ భార్య హసీనాకు- హసీనాకు ఎప్పుడూ గుర్తుంటుంది కదా? అంటే. ఆ ముస్లిం అన్న లేబుల్ కింద పడాల్సిన అవమానాలు, అనుమానాలూ అన్నీ ఈ పాటికి అనుభవించే వుంటుంది! కాదంటావా? అని ఫణి ప్రశ్నిస్తాడు. దానికి రాము దగ్గర సమాధానం ఉండదు. అంటే నిజమనే అర్థమన్నమాట.

          పొద్దున ఇంటి నుంచి బయటికి వెళ్లిన మనిషి సాయంత్రం సజావుగా వస్తాడో రాడో తెలియని ఈ నగరపు బతుకులో- మతం అనేది చివరికి కలహకారణంగానే మిలిగిపోయిన ఈ రోజువారీ హింసలో.. ఆందోళన తట్టుకోలేక తప్పనిసరిగా పోలీస్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.  

మతం మనుషుల మధ్య ఎలాంటి చిచ్చు రేపుతుందో, హింసతో ప్రాణాలు ఎలా తీస్తుందో తెలిపే వాక్యాలివి.

పోలీస్ స్టేషన్ లో జరిగిన సంఘటననే రాము పిడుగు పడినట్లు భావిస్తుంటే.. నమ్మకమైన స్నేహంలోని పొరలు ఒక్కొక్కటి విప్పుతూ ఆత్మీయ మిత్రుడి స్వచ్ఛమైన హృదయాన్ని, వయిలెంట్ మైండ్ గా చూస్తుంటే.. తట్టుకోలేకుంటే ... భార్య-

మీరేమీ అనుకోనంటే వొక మాట అడగనా? ఆ పోలీసు స్టేషన్లో మీరు విన్నది నిజమేనేమో! మనకు తెలియని యాంగిల్ సాహిల్ లో ఇంకోటి ఉందేమో అంటుంది. ఆ మాటలు అతడిని మరింత బాధపెడతాయి. ఆ మాటలు సాహిల్ లోని మరో కోణాన్ని కాదు, అది వారి స్నేహాన్ని ప్రశ్నిస్తున్నట్లు అనిపిస్తుంది. సాహిల్ ది అలాంటి వ్యక్తిత్వం కాదని బల్లగుద్ది చెప్పగల మనసును నిలదీస్తుంది. అప్పటి వరకు సాహిల్ ను ఒక మంచి మిత్రుడిలా చూసిన తన భార్య నీరు అతడిని ముస్లింలా చూడటాన్ని, మతంతో ముడిపెట్టి అతడి వ్యక్తిత్వాన్ని. చర్యలను అంచనా వేయడాన్ని తట్టుకోలేదు.

నువ్వెవరికీ ఏమీ సమాధానం చెప్పలేవు. ఇప్పుడంతా సాహిల్ ని ముస్లిం అనే చూస్తారు. కాని మనిషి మిస్ అయ్యాడని అనుకోరు అలా వుంది ఇప్పుడు పరిస్థితి అన్న మూడో మిత్రుడు ఫణి మాటలు గుర్తొస్తాయి. రచయిత కూతురు తితలీ సాహిల్ మామూ వస్తాడు. తనతో ఆడుకుంటాడు అన్న ఆశతో కథ ముగుస్తుంది.

కథలో సాహిల్ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా చెప్పి, కేవలం ముస్లిం మతస్తుడైనందున అతడిని సమాజం చూస్తున్న కోణాన్ని చిత్రించాడు అఫ్సర్. సాహిల్ ను అనుమానించడానికి పాతబస్తీ అల్లర్లు, వాటి వల్ల హైదరాబాద్ లో నెలకొన్ని పరిస్థితిని నేపథ్యంగా ఎంచుకున్నాడు. ముస్లింలలో ఉన్న మంచితనాన్ని కూడా మతంతో ముడిపెట్టి, ముస్లింల అందర్నీ వయిలెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్లలా చూసే వాళ్ల మైండ్ సెట్టే వయిలెంట్ అని తెలియజేశాడు. ఒక మనిషికి మరో రంగు పులిమి, వాళ్ల కోణంలో చూసే విధానం ఎలా ఉంటుందో, అందుకు మతం కారణమైతే ఎలా ఉంటుందో కూడా కథలో చూపాడు. అప్పటివరకు మనతో కలిసి, మనతో ఉన్న వ్యక్తిని సైతం నమ్మలేని దయనీయ పరిస్థితిని నీరు మాటల ద్వారా వ్యక్తీకరింపజేశాడు అఫ్సర్.

సాహిల్ వస్తాడా, రాడా, ఎక్కడికి వెళ్లాడు? రాకపోతే భార్య హసీనా, కొడుకు ఫైజ్ పరిస్థితి ఏంటి? సాహిల్ ను ఉగ్రవాదిగా చూస్తున్న సమాజం వాళ్లను ఎలా ట్రీట్ చేస్తుంది? సమాజం ముస్లింలను మంచిగా చూడలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? వ్యక్తికి, మతానికి ఉన్న సంబంధం వ్యక్తిత్వాన్ని ఎందుకు నిర్ణయిస్తుంది? మనిషిని మనిషిగా చూడలేని దుస్థితి వెనకున్న కారణాలేంటి? సాహిల్ గురించి బల్లగుద్ది చెప్పగల రాము నోరు విప్పితే పరిస్థితి ఏ విధంగా ఉండేది? నీరు ఆలోచన మారడం వెనుక ఎవరి ప్రభావం ఉంది? పసిపాప తితలీకి రాము సాహిల్ మామ గురించి అర్థమయ్యేలా ఏం చెప్పగలడు? వంటి ఎన్నో ప్రశ్నలు కథ ముగిసినా పాఠకుల మదిలో అలానే నిలిచిపోతాయి. వెంటాడతాయి. వేటాడతాయి. ఒక నిజాయితీగల ముస్లిం వ్యక్తిని, పైగా కనిపించకుండా పోయిన వ్యక్తిని, అతడి కుటుంబాన్ని.. మతంతో ముడిపెట్టి సమాజం చూసే దృక్కోణం, బాధ్యతగల పోలీసుల ఆలోచనాతీరు... దానివల్ల వాళ్లు ఎదుర్కొనే కష్టాలు, కన్నీళ్లే ఈ కథ.                                  ---------------------    


Web Statistics