ఉషా మాధవం...శాన్ అంటోనియో సంక్రాంతి సంబరం!
పోయిన వారం శాన్ ఆంటోనియో సంక్రాంతి సంబరాలకి వెళ్ళాం. మూడు గంటలకు పైగా జరిగిన ఈ సంబరాల్లో తెలుగు వాళ్ళు పాటలు పాడారు, నృత్యాలు చేశారు, తెలుగు దేశంలో సంక్రాంతి నిజంగా అంత బాగా చేసుకుంటున్నారో లేదో తెలియదు కానీ, శాన్ ఆంటోనియోలో వున్న ఆ మూడు గంటలూ తెలుగు దేశపు సంక్రాంతి శోభని తలచుకునేలా చేశారు. అన్నిటికి కంటే నాకు బాగా నచ్చింది – గోవిందరాజు మాధవ రావు గారిని శాన్ ఆంటోనియో తెలుగు వాళ్ళు సత్కరించడం! ఇది కూడా మాధవరావు గారికి తెలియకుండా ఒక “సర్ ప్రైజ్” లాగా చేశారు మూర్తి గారు. ఈ “సర్ ప్రైజ్” కోసం రెండు నెలలు ముందు మమ్మల్ని సిద్ధం చేశారు. మామూలుగా శాన్ ఆంటోనియో ఎప్పుడు వెళ్ళినా మాధవరావు గారి ఇంట్లో దిగే మేం, ఈ ‘సర్ ప్రైజ్’ లో భాగంగా మాగంటి ఉష (ప్రముఖ రచయిత మాగంటి కోటేశ్వర రావు గారి అమ్మాయి) ఇంట్లో దిగాం.

టెక్సాస్ లో తెలుగు వాళ్ళకి శాన్ ఆంటోనియో అంటే వెంటనే గుర్తొచ్చే పేరు గోవింద రాజు మాధవరావు! టెక్సస్ లో ఎక్కడయినా ఏ తెలుగు వేడుకయినా, తెలుగు వాళ్ళకి సంబంధించిన కార్యక్రమమయినా జరిగితే అక్కడ గోవిందరాజు మాధవ రావు గారి కుటుంబం వుండి తీరుతుంది. మాధవరావు గారు ఒక్కరే కాదు, ఆయనతో పాటు ఉష గారు! వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరి పేరు మినహాయించినా అది అసంపూర్ణంగా వుంటుంది. వాళ్ళిద్దరూ కలిసి చేసే సేవల్లో ఎవరికెంత వాటా దక్కాలి అన్నది అంత తేలికగా తేలే విషయం కాదు. కానీ, ఉష గారికి సింహ భాగం దక్కాలని నా వాదన అనుకోండి. (మేము శాన్ ఆంటోనియో వెళ్ళినప్పుడల్లా ఉష గారు మా కోసం దోసకాయ పచ్చడి వొక సీసాడు ఇస్తారన్న రహస్యం కూడా ఇందులో వుందనుకోండి. ఆ దోసకాయ పచ్చడి వేసుకుని తిన్నప్పుడల్లా మేము ఉష గారిని తప్పక తలచుకుంటాం కాబట్టి మాకు కొంచెం ఉష గారి పక్షపాతం. ఇక వాళ్ళిద్దరి కనుపాపలు సంజాత, స్వపంతి ఎక్కువ అమెరికాలోనే పెరిగినా అచ్చ తెలుగు ఆడపిల్లలు)

అమెరికాలో పేరుకి చాలా మంది తెలుగు సమాజ సేవకులు వున్నారు. కొంత మంది స్వయం ప్రకటిత కాగితప్పులులూ వున్నారు. వాళ్ళ సేవలు కాగితాలకే పరిమితం. అమెరికా తెలుగు సమాజం అంటూ పెద్ద కబుర్లు చెప్తారు, రాస్తారు, ఆంధ్రా వెళ్ళి వూదర కొట్టుకుంటారు. కానీ, చిన్న సాయం అందించడానికి చేయి ముందుకి రాదు. (అది ఎప్పుడూ ప్యాంటు జేబుల్లోనో, కోటు జేబుల్లోనో కూరుకు పోయి వుంటుంది). వీళ్ళు మహా అయితే, పదవుల కోసం పోటీ పడ్తారు. తెలుగు సంస్కృతికి తామే పదహారణాల ప్రతినిధులమని బోర్డులు పెట్టుకుంటారు. అలాంటి హంగూ ఆర్భాటం ఏమీ లేకుండా, ఒక చేత్తో చేసిన సాయం ఇంకో చేతికి కూడా తెలియకుండా సాయపడే వ్యక్తులు తక్కువ.

నిశ్శబ్దంగా తమ కృషి తాము చేసుకుంటూ వెళ్ళే మాధవరావు గారి కుటుంబం పెద్ద కబుర్లు చెప్పే కుటుంబం కాదు. తెల్లారి లేచి పేపర్ లో పేరు పడిందా లేదా అని వెతుక్కునే రకం కాదు. ఏ సంఘంలో తమకి ఎంత హోదా ఇచ్చారని లెక్కలు వేసుకునే వాళ్ళు కాదు. అక్కర వున్న వారికి వెంటనే నిస్సంకోచంగా సాయం అందించడం వొక్కటే వాళ్ళకి తెలుసు. మేం టెక్సాస్ వచ్చి మూడేళ్లే అయ్యింది. కానీ, ముప్పయ్యేళ్లుగా టెక్సాస్ లో వున్న తెలుగు వాళ్ళు ఈ విషయం ఇంకా బాగా చెప్పగలరు.

వరంగల్ దగ్గిర హనమ కొండ మాధవరావు గారి సొంతూరు. అక్కడ ఆర్. ఈ. సి. లో ఆయన చదువుకున్నారు, తరవాత విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటరులో పనిచేశారు. 1991 లో అమెరికాలో అడుగుపెట్టారు. ప్రవాస తెలుగు సంఘాలతో ఆయన అనుబంధం త్రివేండ్రం నించి మొదలయ్యింది. 1979 లో ఆయన త్రివేండ్రం సాంస్కృతిక సంఘానికి కార్యదర్శిగా వుండే వారు. శాన్ ఆంటోనియో వచ్చాక ఆయన టెక్సాస్ సాహిత్య సదస్సులలో పాల్గొనడం మొదలు పెట్టారు. మొదటి నించీ సాహిత్యం పట్ల వున్న అభిరుచి వల్ల సాహిత్య సదస్సులలో ఆయనకి క్రియాశీలక పాత్ర దక్కింది. టెక్సాస్ వచ్చిన తెలుగు రచయితలని ఎవరినయినా ఆయన మొదట శాన్ ఆంటోనియో తెలుగు వారికి పరిచయం చెయ్యడం మొదలు పెట్టారు. ఆ విధంగా స్థానికంగా సాహిత్య, భాషాభిమానాన్ని పెంచే కృషి శాన్ ఆంటోనియోలో మొదలయ్యింది. టెక్సాస్ యూనివర్సిటీ తెలుగు కమిటీలో ఆయన టాస్క్ ఫోర్స్ సభ్యుడు. అంతే కాదు, తెలుగు భాషలో బాగా ప్రతిభ కనబరచిన ఇద్దరు విద్యార్ధులకి టాసా (శాన్ ఆంటోనియో తెలుగు సంఘం) తరఫున ఏటా రెండు స్కాలర్షిప్పులు ఇప్పిస్తున్నారు. మొట్ట మొదటి సారి 2007 లో పెద్ద ఎత్తున తెలుగు నాటకోత్సవాలు కూడా నిర్వహించారు. ఒక తెలుగు వ్యక్తి గానే కాక, ఒక శాస్త్రవేత్తగా టెక్సాస్ లో ఆయన వివిధ శాస్త్ర సంఘాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.

ఉష గారు మొదటి సరిగా శాన్ ఆంటోనియో లో తెలుగు బడి మొదలు పెట్టారు. మొదట కొద్ది మంది పిల్లలతో మొదలయిన తెలుగు బడిలో ఇప్పటి దాకా కొన్ని వందల మంది పిల్లలకి తెలుగు నేర్పారు. మొన్న సంక్రాంతి వేడుకలలో తెలుగు బడి పిల్లలు మంచి జోకులు చెప్పి, అందరినీ కడుపుబ్బ నవ్వించారు. తెలుగు పాటలు పాడి, తెలుగు నృత్యాలు చేసి కనువిందు/ వీనుల విందు చేశారు. (అసలు విందు కూడా చాలా బాగుందండోయ్! పూర్ణాలూ, చక్ర పొంగలి, పులిహోర, పెరుగు మిరపకాయలూ వగైరా నా ఫావరైట్)

శాన్ ఆంటోనియోలో గోవిందరాజు కుటుంబం నాటిన తెలుగు మొక్క ఇప్పుడు పెరిగి పెద్దదయింది. ఆ తరం నించి ఈ తరానికి ఈ స్ఫూర్తిని అందించడానికి ఉత్సాహం ఉరకలేసే పాటమళ్ళ మూర్తి గారు, నిత్యయవ్వనోత్సాహి అడివి వెంకటేష్ లాంటి వారు ముందుకు వస్తున్నారు. స్నేహం, సౌజన్యం, సమానవత్వం ముప్పేటగా కలిసి పోయిన మాధవిజాన్ని, మాధవ మానవ ధ్వజాన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి ఈ తరం ముందుకు వస్తోంది. వారికి స్వాగతం. నోరు మంచిదయితే వూరు మంచిదవుతుందంటారు, నోరే కాదు చెయ్యి, మనసు కూడా మంచిది కావాలి. అది నిరూపించుకున్నారు శాన్ ఆంటోనియో తెలుగు వాళ్ళు!
Category: 10 comments

నా టీనేజర్లు!
వున్నట్టుండి ఓ రోజున వాళ్ళు
వాళ్ళ గదుల్లోకి మాయమయి పోతారు.

తలుపులూ పెదాలూ మూతపడతాయి
ఇక ఇంట్లోనే
వొకరికొకళ్ళం అపరిచితులవుతాం.

బయట గదిలో పచార్లు చేస్తుంటా
వాళ్ళ గుసగుసలే వినిపిస్తాయి
ఆ రహస్య భాషేదో నాకు తెలుసు
కానీ ఇప్పుడేమీ గుర్తు లేదు

అదీ నేను నేర్పిన భాషే కదా!


కొన్నేళ్ల తరవాత తలుపు తెరుచుకుంటుంది
మళ్ళీ చూస్తాను ఆ ముఖాలని,
వొకప్పుడు నా అరచేతుల్లో దాచుకున్న ముఖాల్ని,
నా చేతుల్లో పొద్దు తిరుగుడు పూలయి విచ్చుకున్న ముఖాల్ని.


అవి నాకు పరిచితమయిన చర్మాలే!

కానీ
ఇప్పుడు నిటారుగా నిలబడిన దేహాలు
ముత్యాల్లా మెరుస్తూ
నన్ను దాటుకుంటూ వెళ్లిపోయే దేహాలు!

(మూలం: పాట్ మొరా - టెక్సాస్ ఎల్ ఫాసో లో పుట్టిన కవయిత్రి. కవిత్వం, స్మృతులుగా మెక్సికన్ అమెరికన్ స్త్రీల జీవితాన్ని రికార్డు చెయ్యడానికి మొరా ప్రయత్నిస్తోంది. పిల్లల కోసం ఎక్కువగా రాసింది. ఆమె జీవితం కేవలం కవిత్వానికి పరిమితం కాదు,కవిత్వం ఆమెకి వొక సాధనం మాత్రమే.)

నాన్నగారు...మళ్ళీ వస్తారా?
ఇవాళ నాన్నగారు కన్ను మూసిన రోజు.

ఆయనది ఊహించని మరణం. ఆయన అలా మృతశరీరంతో పడివుండడం వొక మాయ అనీ, వున్నట్టుండి మళ్ళీ ఏదో వొక రోజు నవ్వుతూ ఆయన అలా నడుచుకుంటూ వెనక్కి వచ్చేస్తారని చాలా కాలం వొక దిగ్భ్రమలో, భ్రమ లాంటి నమ్మకంతో వుండే వాణ్ని.

చనిపోయినప్పుడు ఆయన వయసు 57 ఏళ్లు. అసలు లోకానికి ఏమీ చెయ్యని వాళ్ళు నూరేళ్ళు బతుకుతున్న పాడు కాలంలో అలాంటి వాళ్ళ ఆయుషు అంతా నాన్నగారికి వచ్చేస్తే బాగుండు అని స్వార్ధంగా, క్రూరంగా అనుకుంటూ వుండే వాణ్ని చాలా కాలం! నా స్పృహా, నా చైతన్యం, నా చదువూ అన్నీ బిక్కచచ్చిపోయిన ఆ మరణానంతర విషాద కాలంలో!

కానీ, మృత్యువుకి నా ఉద్వేగాలేవీ లేవు, తెలియవు కూడా !

అది మనిషిని వొకానొక జ్ణాపకంగా మాత్రమే మిగిల్చే కరకు వాస్తవం!

*
నాన్నగారిని తలచుకోగానే ముత్యాల కోవలాంటి ఆయన తెలుగక్షరాలు గుర్తొస్తాయి నాకు.

చిన్నప్పటి మా బడి గోడ మీద వొక దినపత్రిక సైజులో నాలుగు పేజీల గోడ పత్రిక “మధురవాణి” గుర్తొస్తుంది. ప్రతినెలా బడిపిల్లల కవితలూ, కథలూ, చిరు వ్యాసాలతో ఆ నాలుగు పేజీలను ఆయనే స్వహస్తాలతో రాసేవారు. ఆ పత్రిక గోడ మీద అతికించిన రోజు మా అందరికీ పెద్ద పండగే! నాలుగో తరగతి నించి పదో తరగతి పిల్లల దాకా ఆ పత్రికని ఆసాంతం చదివే వారు. అంతే కాదు, ఆ పత్రికలో తమ పేరు చూసుకోవాలని ఉత్సాహపడే వాళ్ళు. స్కూల్ లో నాన్నగారికి ఎంత పేరుండేదంటే – ఆ రోజుల్లో “కౌముదీ పిక్చర్స్” బానర్ కింద వచ్చే సినిమాలన్నిటికీ నాన్నగారే కథలూ, కవిత్వం రాసేవారని వాళ్ళు అనుకునేవాళ్ళు. “అబ్బే అది నేను కాదురా!” అని ఆయనెంత చెప్పినా వాళ్ళు వినే వాళ్ళు కాదు. వాళ్ళకి రచయిత అన్నా, కవి అన్నా ఆయనొక్కరే! చిన్న వూళ్లలో వుండే పెద్ద నమ్మకాల్లో ఇదీ వొకటి! నాన్నగారు ఇంకా వివరించబోతే, “లేకపోతే, ఆ సినిమా వాళ్ళు “కౌముది” అని మీ పేరెందుకు పెట్టుకుంటారు సార్!” అనే వాళ్ళు.
కౌముది అనే పేరుతో అప్పటికి నాన్నగారి నవలలు రెండు వెలువడ్డాయి. ఒకటి: కళంకిని, రెండు: విజయ. సుంకర, వాసిరెడ్డితో కలిసి ఆయన అనువదించిన ‘రంగభూమి” విశాలాంధ్ర వాళ్ళు అనేక ఎడిషన్లు వేశారు. విశాలాంధ్ర, ఆంధ్రజ్యోతి దినపత్రికలలో ఆయన కవిత్వమూ, కథల అనువాదాలు ఎక్కువగా వస్తున్న కాలం అది. అభ్యుదయ రచయితల సంఘం ఖమ్మం జిల్లా శాఖకి ఆయన అప్పటికే అధ్యక్షులుగా వున్నారు. కమ్యూనిష్టు పార్టీ వారి ఆంధ్రప్రదేశ్ యువజన సమాఖ్య వారి పత్రిక “యువజన” ని సాహిత్య పత్రికగా తీర్చిదిద్దిన సంపాదకవర్గంలో ఆయన వున్నారు.
చింతకాని ఖమ్మం జిల్లాలో చాలా చిన్న వూరు. పాసింజరు బండి దిగి అయిదు మైళ్ళు నడిస్తే కానీ, అసలు వూరు రాదు. కానీ, ఆ చిన్న వూరే ఆయన సాహిత్య కేంద్రం అయ్యింది. మా ఇల్లు నిత్యం రచయితలూ, కవుల రాకపోకల్తో సందడిగా వుండేది. ప్రతి నెలా ఎవరినో వొకరిని పిలిచి బడిలో ప్రసంగాలు ఇప్పించే వారు నాన్న. అలా దాశరథి, పెద్దిభొట్ల, హీరాలాల్ మోరియా, కవిరాజమూర్తి ఇలా ఎందరో నేను నాలుగో తరగతిలో వుండగానే ముఖాముఖీ తెలుసు. వాళ్ళ పద్యాలూ, కథలూ మా పిల్లలందరికీ కంఠోపాఠం.

ఉపాధ్యాయ వృత్తిని కేవలం ఉద్యోగంగా ఆయనెప్పుడూ భావించలేదు. ఆయన పేరుకే హిందీ పండిత్ గానీ, తెలుగు, ఇంగ్లీషు పాఠాలు కూడా చెప్పేవారు. వొక్క లెక్కలు తప్ప అన్నీ చెప్పే వారు. ఆ రకంగా విద్యార్ధులందరికీ అందుబాటులో వుండే సార్ అనే పేరుంది. ఏ విద్యార్థి ఎప్పుడు వచ్చినా సమయం చూసుకోకుండా పాఠం చెప్పడానికి సిద్ధమయే వారు. ఆ రకంగా చాలా మంది విధ్యార్ధులకి మా ఇల్లు, మా ఇంట్లో పుస్తకాలు అన్నీ మావే మావే అనే భావం వుండేది.

అప్పట్లో బడిపంతులు అంటే ఇప్పటి మాదిరి పెద్ద జీతాలు లేవు. బతకలేని బడిపంతులు అన్నది నిజం! పైగా, మాది పెద్ద కుటుంబం. అమ్మ తెల్లన్నం వండిందీ అంటే ఆ రోజు పండగో పబ్బమో అయ్యి వుండాలి! లేకపోతే, జొన్నన్నం, గోంగూర పచ్చడే రోజూ! లేదంటే, సజ్జ రొట్టెలు! ఇక కొత్త బట్టల జత ఏడాదికి వొకసారి. చాలా కష్టంగా గడిచేవి రోజులు. కానీ, ఇంట్లో ఏదో వొక ఉత్సాహం నిరంతరం తరగలెత్తినట్టుండేది. చుట్టూ బోలెడు పుస్తకాలు, ప్రతి వారం ఎవరో వొకరు చుట్టాలు, స్నేహితులు ఇంట్లో అతిధులుగా వుండే వాళ్ళు. కబుర్లూ, కథలూ, పాటలూ...హోరెత్తినట్టుండేది ఇల్లు. మేం పట్టణం అంటే ఖమ్మం వెళ్ళే దాకా ఆ ఉత్సాహం అలా కొనసాగింది.


*
చింతకాని నా బాల్యానికి పునాది. నాన్నగారి యువకోత్సాహానికి సంబరం. కవిత్వంలాగా బతకడం అంటే ఏమిటో తెలిసినట్టే వుండేది ఆ కాలంలో అంత పేదరికంలో కూడా!

కానీ, తెలియని వొక దుఖం ఏదో ఆయన లోపల వుండేదనుకుంటా. మారని సమాజం పట్ల ఏదో అసంతృప్తి, ఏదో చేయాలన్న తపన! బడిని గుడిగా మలుచుకొని అదే ధ్యాసగా బతకడంలో ఆయన ఆ దుఖానికి విముక్తి కనుక్కున్నట్టు అనిపించేది.
జీవితం అనే కావ్యంలోసగం వృధసగం వ్యధ..
అని ఆయన ఒక కవితలో రాసుకున్నారు. ఆయన వచనంలో ఆయన నికార్సయిన మార్క్సిస్టు, కానీ కవిత్వంలోకి వచ్చే సరికి ఆయనలోని కాల్పనికుడు ఆ మార్క్సిస్టుని దాటుకుని వచ్చేవాడు. ‘రచయితకి స్వేచ్చ వుండాలి, ఎంత కమ్యూనిస్టు అయినా!” అనే వారు ఆయన.
అనేక సంవత్సరాల పాటు పార్టీ కోసం బతికి, సర్వస్వం పార్టీకి ధారపోసి, తన కోసం ఏమీ మిగుల్చుకోలేదు నాన్నగారు.
పార్టీ చీలిపోయాక క్రుంగదీసిన నైరాశ్యంలోంచి బయట పడేసరికి ఆయన నిరుద్యోగి. ఆయనే రాసుకున్నట్టు “చిరుద్యోగి, పోనీ, దురుద్యోగి సైతం కాలేని నిరుద్యోగి.” అప్పుడు ఆయనకి హిందీ అనే గడ్డిపోచ దొరికింది. అది పట్టుకుని అలహాబాద్ హిందీ మహావిద్యాలయానికి వెళ్ళి, అక్కడ చదువుకొని, వెనక్కి వచ్చి ఆయన హిందీపండితులుగా చేరారు. అలా ఆయన ఉద్యోగంలోకి కుదురుకునే సరికి నేను నాలుగో తరగతిలో వున్నా. అప్పటికి బడికి పంపే స్తోమతు లేక నన్ను ఉర్దూ క్లాసులకి పరిమితం చేసింది మా అమ్మ. ఆ విధంగా నేను నాలుగో తరగతి దాకా తెలుగు అక్షరముక్క తెలీకుండా పెరిగాను. నాలుగో తరగతి తెలుగు బడిలోకి వచ్చేసరికి నాకు కష్టాలు మొదలయ్యాయి. తెలుగు రాదు, ఉర్దూ మీద మమకారం పోదు. బడిలో అందరూ ఏడిపించడం మొదలెట్టారు. నాకు కచ్చపుట్టింది. మా నాన్నగారి రాతని అనుకరించడంతో నా తెలుగు మొదలయ్యింది. ఆయన నెల రోజులలో నాకు వోనమాలు నేర్పించి, రెండో నెలలోకి వచ్చే సరికి చిన్న కథలు చదివించడం మొదలెట్టారు. ఏడాది తిరిగే సరికి నేను పెద్ద పుస్తకాలు చదవడం మొదలెట్టాను. శ్రీ శ్రీ కవిత్వాన్ని ఇంటా బయటా పాటల కింద మార్చేసి హోరెత్తించే వాణ్ని. అది చూసి, మా హెడ్మాస్టర్ “అరె, ఈ జన్మలో నీకు తెలుగు రాదనుకున్నాను రా! మొత్తానికి సాధించావ్!” అనడంతో నా గర్వ పతాక ఎగిరింది బడిలో!

కానీ, అదంతా నా గొప్పతనం కాదు, పాఠం చెప్పడంలో నాన్నగారి నేర్పరితనమే తప్ప!

“సార్ క్లాసులో ఒక్క సారి చెప్పిన తరవాత షెల్లీ పద్యమయినా నోటికి వచ్చేస్తుంది, పెద్దన పద్యమయినా బట్టీ కొట్టినట్టు వుండిపోతుంది ” అని బడిలో విద్యార్ధులు అనే వారు. అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఆయన రాస్త్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా వరసగా అయిదుసార్లు అవార్డులు గెలిచి, తరవాత రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. చివరి రోజుల్లో “అక్షరదీపం” పట్టుకుని మారుమూలల పల్లెలకి వెళ్ళి పాఠాలు చెప్పేదాకా వెళ్లింది ఆయన తపన. చివరికి ఉపాధ్యాయ వృత్తి కోసం తనలోని రచయితని వదులుకున్నారు. ఆయన తరవాతి కాలంలో రాసిన రచనలు కూడా “అక్షరదీపం” వాచకాలూ, కథలూ, పాటలు మాత్రమే!

“నేను ఎప్పటికీ పాఠకుడిని మాత్రమే. చదవడంలో వున్న ఆనందం నాకు రాయడంలో లేదు. అయినా నేను ఉపాధ్యాయుడిని, అంతే! ఈ రోజు పాఠాలు బాగా చెబితే ఆ రోజుకి నా కల తీరినట్టే, నా లక్ష్యం నెరవేరినట్టే!” అనే వారు ఎప్పుడూ. కానీ, తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లీషు, అరబ్బీ, ఫారసీ భాషలు చదువుకొని, వాటి సాహిత్యాలని ఆపోసన పట్టిన నాన్నగారు, ఒక మారుమూల పల్లెలో బడిపంతులుగా వుండి, జాతీయస్థాయిలో రచయితలతో స్నేహాలూ, ఉత్తరప్రత్యుత్తరాలూ నడిపిన నాన్నగారు…జీవితాన్ని వొక అక్షర ఉద్యమంగా మలుచుకున్న నాన్నగారు...ఇప్పటికీ, ఎప్పటికీ మరణశయ్య మీద ఆయన్ని వూహించలేను!

ఆయన చివరి డైరీలో రాసుకున్న ఈ వొక్క వాక్యం ఎప్పటికీ నా మనసులో వెలుగుతూ వుంటుంది:

“అనుభవమే చివరి వెలుగు. ఈ క్షణమే చివరి క్షణం. ఆ వొక్క క్షణమూ సదామణి సదృశ జ్వాలగా వెలుగు”

*
కౌముది అనే పేరు ఆయన ఎందుకు పెట్టుకున్నారు తెలియదు. ఆయన అసలు పేరు షంషుద్దిన్, అంటే సూర్యుడు అని. దానికి పూర్తి వ్యతిరేకంగా ఆయన చంద్రకాంతిని ఆశ్రయించి “కౌముది” అని పెట్టుకున్నారు.
ఆయనంటే మహాకవి దాశరథికి చాలా ప్రేమ. “కౌముది” అన్న పేరంటే మరీ ప్రేమ. తరచూ ఉత్తరాలు రాసుకునే కాలంలో దాశరథి ఆయనకి ఇలా రాశారు :

“ఖమ్మంలో ఎండలు మండిపోతున్నాయని విన్నాను. కానీ

రేయెండ మీరుండ
నీరసించు మండుటెండ”

రేయెండ అంటే రాత్రి కాసే ఎండ అనీ, కౌముది అనీ వేరే చెప్పకర్లేదు కదా!
Category: 14 comments

అంతర్జాతీయ వేదిక మీద వొక తెలుగు కవిత!

కొత్త ఏడాది ప్రయాణాలతో మొదలయ్యింది!

ఆస్టిన్ నించి లాస్ ఏంజెల్స్ కి విమాన ప్రయాణం చాలా సరదాగా వుంటుంది. విమానం లాస్ ఏంజెల్స్ చేరబోతుండగా, రెక్కల కింద నించి చూస్తే, ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ చూసినట్టే వుంటుంది నేలంతా.

ఆ క్షణాన ఎందుకో సంజీవ్ దేవ్ గుర్తొచ్చారు నాకు.
ప్రకృతీ, కొండల చుట్టూ సంజీవ దేవ్ పెయింటింగులు వరసాగ్గా చూస్తూ పోతున్నట్టు వుంది కింద నేలన.

లాస్ ఏంజెల్స్ లో దక్షిణాసియా సాహిత్య సదస్సుకి ఆరునెలల క్రితం ఆహ్వానం వచ్చింది. మాడరన్ లాంగ్వేజ్ అసోసియషన్ (ఎం‌ఎల్‌ఏ) కి అనుబంధంగా జరిగే సదస్సు ఇది. మామూలుగా ఇలాంటి సదస్సులలో ఏ సల్మాన్ రష్దీ గురించో, అరుంధతి రాయ్ గురించో, మహా అయితే టాగూర్ దాకానో పరిమితమవుతాయి చర్చనీయాంశాలు. సల్మాన్ రష్దీ, అరుంధతి రాయ్ గురించి కొన్ని వందల మంది మాట్లాడతారు. సాధారణంగా ఇంగ్లీషు సాహిత్యం పరిధి దాటి ఎవరూ రారు. ఈ చర్చని మరో వైపు తిప్పాలని నా ఆలోచన. భాషా సాహిత్యాల వైపు మళ్ళితే తప్ప ప్రపంచ సాహిత్యం అంతు పట్టదని మొదటి నించీ నా ఘోష. పైగా, నా తెలుగు పక్షపాతం!

ఈ మధ్య జూపాక సుబద్ర కవిత “కొంగు” గురించి చాలా కాలంగా ఆలోచిస్తున్నాను. ఆ కవిత గురించే మాట్లాడితే సరిపోదా అనుకుని, ముందు ఆ కవితని అనువాదం చెయ్యడం మొదలు పెట్టాను. ఈ లోగా మిత్రుడు పురుషోత్తమ్ ఈ కవితని అనువదించినట్టు ఎవరో చెప్పారు. సరే, ఆ అనువాదం కూడా చేతికొచ్చింది. ఈ కవిత మీరు ఇప్పటి దాకా చదివి వుండకపోతే, ఇప్పుడు చదవండి. పురుషోత్తం అనువాదం కూడా చాలా బాగుందనిపించింది. తెలుగు నించి ఇంగ్లీషులోకి కవిత్వ అనువాదం అంత తేలిక కాదు, కానీ, పురుషోత్తం అనువాద సామర్ధ్యం అంతా ఈ కవిత లో తెలుస్తుంది.

సరే, ఈ కవితని ఎక్కడో లాస్ ఏంజెల్స్ లో అసలు తెలుగు అనే వొక భాష వుందని కూడా తెలియని సమూహాల మధ్య, ఒక అంతర్జాతీయ వేదిక మీద చర్చకి ఎలా తీసుకురావాలన్నది ఇప్పుడు ప్రశ్న. అదెలా చేశామో తరవాత చెప్తాను.

అదేమిటి, ఏక వచనంలో ప్రారంభించి ఇలా బహువచనంలోకి వచ్చానేమిటా అని మీరు ఆశ్చర్యపోవచ్చు.

ప్రయాణం ఏర్పాట్లలో భాగంగా – ఈ సదస్సు గురించి నేను వొక అమెరికన్ మిత్రురాలికి చెప్పాను. ఆమె జెండర్ స్టడీస్ ప్రొఫెసర్. పేరు బానీ జైర్. మాడిసన్ విస్కాన్సిన్ లో కొన్నాళ్ళ క్రితం నా దగ్గిర హిందీ-ఉర్దూ నేర్చుకుంది. అప్పటి నించీ మా పరిచయం. కవిత్వం మా ఇద్దరి మధ్యా వంతెన. మాటల సందర్భంలో నేను సుబద్ర కవిత విషయం చెప్పగానే బానీ చాలా ఆసక్తి చూపించింది. ఇక కవిత గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టాం.

స్త్రీవాద కవిత్వంలో సుబద్ర కవిత ఒక మంచి మలుపు అని నా అభిప్రాయం. ఈ కవిత జయప్రభ “పైటని తగల్లెయాలి” కవితకి ప్రతివాదం. అస్తిత్వాన్ని నిర్దిష్టంగా చెప్పాలన్న తెలుగు కవిత్వ ప్రయాణంలో సుబద్ర ‘కొంగు” తప్పనిసరిగా ఒక మజిలీ. స్త్రీకి కేవలం స్త్రీ అస్తిత్వమే వుండదని, ఆ స్త్రీ ఏ వర్గం నించి, ఏ కులం నించి వచ్చిందన్నది అస్తిత్వంలోనూ, కవిత్వ వ్యక్తీకరణలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుందని నా వాదన. ఆ రకంగా జయప్రభ “పైట” కవిత ఒక నిర్దిష్టమయిన వర్గ వ్యక్తీకరణ అయితే, సుబద్ర “కొంగు” దానికి కౌంటర్. నా వాదన బానీకి బాగా నచ్చింది. అంతే, ఈ విషయం ఇద్దరం కలిసే మాట్లాడదాం అని అనుకున్నాం. అప్పటి దాకా తను వొక వేరే టాపిక్ అనుకుంది, మా చర్చల తరవాత అది తెలుగు వైపు, సుబద్ర కవిత వైపు మళ్ళింది. ఈ ప్రసంగానికి వచ్చిన ప్రతిస్పందన మాకు ఎంత ఉత్సాహం కలిగించిందంటే, దీనిని వొక పెద్ద వ్యాసంగా మార్చే పనిలో పడ్డాం ఇప్పుడు! (అప్పటికప్పుడు ఈ వ్యాసం “సౌత్ ఆసియా రెవ్యూ” లో ప్రచురిస్తామని ఆ పత్రిక ఎడిటర్లు కూడా మాటిచ్చారు, అలా ప్రచురించడానికి తగ్గట్టుగా రాయడానికి ఇంకా చాలా పని వుంది అనుకోండి!)

భాషా సాహిత్యాలలో ఈ విధమయిన సృజనాత్మక సాహిత్యం వస్తోందా అని కొందరు ఆశ్చర్యపోయారు; తెలుగు ఎక్కడి భాష, ఆ కవిత లో కొన్ని భాగాలు తెలుగులో చదవగలరా అని కొందరు అడిగారు; తెలుగులో కొన్ని పంక్తులు చదివి వినిపించినప్పుడు తెలుగులో వున్న సహజ మాధుర్యానికి కొందరు ముగ్ధులయ్యారు. ఇది ఎంత దూరం పోయిందంటే, ఆ రోజు సాయంత్రం నా కవిత్వ పఠనం జరిగినప్పుడు వొకటి రెండు కవితలు తెలుగులో చదివి తీరాలని చాలా మంది పట్టుబట్టారు, వేదిక కింద నించి “తెలుగు చదవండి...తెలుగు చదవండి” అని కేకలు వేశారు.

ఇక్కడ కవిత్వ పఠనం కూడా గొప్ప అనుభవం. ప్రసిద్ధ రచయిత్రి ఫౌజియా అఫ్జల్ ఖాన్ ఇటీవలి తన కొత్త అనుభవాలూ-జ్నాపకాల పుస్తకం నించి కొన్ని భాగాలు చదివారు. తరవాత నా కవిత్వ పఠనం జరిగింది. అక్కడ వున్న వారి కోరిక మేరకు నేను కొన్ని తెలుగు కవితలు చదివినా, ఎక్కువగా ఇంగ్లీషు కవితలకే పరిమితమయ్యాను. తెలుగు కవిత్వం అనువాదంలో వున్న సమస్యలే, “అనువాద” పఠనంలోనూ వున్నాయి. సందర్భ వివరణ, పాద సూచికలు ఇవ్వడంలో చాలా సమయం పోతుంది, ఈ లోపు శ్రోతలలో కవిత్వం వినాలన్న ఆసక్తి చచ్చిపోతుందేమో! ఈ కారణంగా ఇక్కడి సదస్సులలో ఎక్కువ ఇంగ్లీషు పద్యాలకే పరిమితమవుతున్నా. దాదాపు గంట సేపు జరిగిన పఠనం ఆసక్తికరంగా సాగింది. ఆ తరవాత ప్రశ్నలూ-జవాబులూ!

అనేక రకాల మనుషులూ, అనేక రకాల అభిరుచులూ, అన్వేషనలూ, అనేక రకాల ఆహార పదార్థాలూ, ప్రదేశాల పరిభ్రమణంలో మంచి అనుభూతి ఈ మూడు రోజుల సాహిత్య సదస్సు!

(గమనిక: సమయాభావం వల్ల ఈ సదస్సు వివరాలు క్లుప్తంగా మాత్రమే అందించగలుగుతున్నాను. అందుకు క్షమించండి)
Category: 14 comments

నాన్న కోసం వొక పద్యం!
నాన్నని
ఆకాశంలో సమాధి చేశాను
అప్పటి నించీ, పక్షులు
ఆయన తల దువ్వుతున్నాయి
స్నానం చేయిస్తున్నాయి
ప్రతి రాత్రీ
దుప్పటిని ఆయన గడ్డం దాకా కప్పి నిద్ర పుచ్చుతున్నాయి

నాన్నని
నేలలో సమాధి చేశాను
అప్పటి నించీ, నా నిచ్చెనలు
కిందికే దిగుతున్నాయి
నేలంతా ఇల్లయింది
గంటలు దాని గదులు
అవి ప్రతి సాయంత్రం బార్లా తెరుచుకుని వుంటాయి
వొక్కో అతిధినీ అక్కున చేర్చుకుంటూ.

కొన్ని సార్లు వాళ్ళంతా
పెళ్లి విందు కోసం
నడిచి వెళ్ళడం చూస్తాను

నాన్నని
నా గుండెలో సమాధి చేశాను
ఆయన నాలో పెరుగుతున్నారు,
నా అల్లరి కొడుకులా

పాలు తాగను పో అని మారాము చేసే నా చిట్టి తండ్రిలా.

నీరవ నిశీధిలో దిగడిపోయిన చిన్ని పాదం లా.

ఇప్పుడే నిప్పులో కడిగిన చిన్ని గడియారపు స్ప్రింగులా.

చిన్ని ద్రాక్షలా రేపటి ద్రాక్షాసవానికి కన్న తండ్రిలా.

తన కొడుకుకే పుట్టిన బిడ్డలా.నా చిట్టి తండ్రీ,

నీ కోసం బతుకునే రాసిస్తాను

(లీ యంగ్ లీ కవిత "లిటిల్ ఫాదర్" కి స్వేచ్ఛానువాదం)
Category: 18 comments

పదేళ్ళ కవిత్వం గురించి కొన్ని ఆలోచనలు

మిత్రులకి:

సారంగ బుక్స్ మొదటి ప్రచురణ - పదేళ్ళ కవిత్వం "అనేక" ముందు మాట కొంత భాగాన్ని ఈ సోమవారం ఆంధ్ర జ్యోతి సాహిత్య వేదిక వివిధ ప్రచురించింది.

http://epaper.andhrajyothy.com/AJ/AJyothI/2011/01/10/index.shtml


ఈ ముందు మాట గురించి మీ అభిప్రాయాలూ, విమర్శలూ ఇక్కడ రాయండి. ఇందులో చర్చించ దగిన సంగతులు అనేకం వున్నాయని నా అభిప్రాయం.

విమర్శ అంటే చదువరి స్థాయిని పెంచాలి

("ఊరి చివర" చర్చలో భాగంగా తిరునగరి సత్యనారాయణ గారు మరో ఈ-లేఖ పంపారు. ఆయన నాకు రాసిన ఈ-లేఖతో పాటు దీనిని ప్రచురిస్తున్నాను.)

అఫ్సర్ గారూ: నేను కింది జాబు రాస్తే పోస్టు కావడం లేదు. దయచేసి పోస్టు చేయరూ -
- తిరునగరి సత్యనారాయణ


(ఇదంతా నా సోది - దీనిలో అఫ్సర్ కవిత్వం మీద విమర్శ లేదు అభిప్రాయమూ లేదు - చదువరులు క్షమించాలి) భూషణ్ గారు తిట్టి పోస్తారని, ఒకింత అహంకారమూ (అహంకారము ఉండడం తప్పు కాదు - పోతే మితి మీరితేనే సమస్య) , కించిత్తు చీత్కారమూ ప్రదర్శిస్తారని నేను ఆరోపణ చేయలేదు. ఆయన రాసిన సమీక్షలు (అభిప్రాయాలు) చదివేక నాకనిపించిందది. కవికి అహంకారం వుంటే నష్టం లేదు (అట్లా అని వుండాలని కాదు) కానీ విమర్శకులకి ఉంటే ఇంక ఆయన/ఆమె అభిప్రాయాలు పట్టించుకోవాలని అనిపించదు. నా అభ్యర్థన అల్లా అఫ్సర్ కవిత్వం బాగా లేదని విమర్శ చేయవచ్చు - తప్పు లేదు - కానీ అది సమగ్రంగా వుండాలి.

అంటే కవిత్వంలోని వస్తువును, తాత్విక దృక్పథాన్ని, మూలాల్ని, రూపాన్ని, ఆయన వాడిన సాహితీ పరికరాల్ని అన్నీ పట్టించుకోవాలి. వాటి మీద ఆధార పడి విమర్శ చేయాలి. వస్తువు రూపమూ ఒక దాన్నొకటి బలపర్చుకుంటున్నాయా, వాటి మధ్య సంబంధం ఎలా ఉంది, ఎక్కడ రూపం బలహీనమైంది (అంటే పద్యం బలంగా లేదు) ఎందుకు బలంగా లేదు, వస్తువు నీరస పడడం వల్ల అలా జరిగిందా? కవిగా అఫ్సర్ ఏమైనా కొత్త తాత్విక ప్రతిపాదనలు చేస్తున్నాడా కవిత్వం లో? కొత్త చూపును, కొత్త అనుభవాన్ని ఇస్తున్నాడా పాఠకులకు? ఇస్తే ఆ అనుభవం, ఆ చూపు ఎట్లా సాధ్యమైంది? ఏ వస్తువు వల్ల, ఏ రకంగా ఆ వస్తువుని present చేయడం వల్ల, ఏ సాహితీ, కవితా పరికరాల్ని వాడడం వల్ల అది సాధ్యమైంది? ఈ పరిశీలనలు చేస్తే అఫ్సర్ కవిత్వంపై సరి ఐన విమర్శ జరిగేది. న్యాయం జరిగేది. ఫలితంగా సాహిత్యానికి, పాఠకులకు మేలు జరిగేది. అంతే కానీ ఈ పద్యాలు చెత్తగా ఉన్నాయి, కంగాళీ గా ఉన్నాయి, నానాటికీ తీసికట్టు నాగంభొట్ల్లు అని తీసిపారేస్తే దాని వల్ల ఉపయోగమేమిటి? అవి తిట్లు కావా?

అసలు నా బాధంతా మన తెలుగు సాహిత్య విమర్శ, ముఖ్యంగా కవిత్వంలో రెండు రకాలుగా సాగుతోంది - ఒకటి వ్యక్తిగత అభిరుచుల ఆధారంగా ఆ పద్యాన్ని ఐతే ఆకాశానికెత్తడమో లేదా పాతాళానికి తొక్కేయడమో (లేదా బురదలో) జరుగుతోంది. పద్యంలో ఇక్కడ ఖాళీ జాగా లు వదిలాడు, ఇక్కడ ఏమీ చెప్పకుండా నిశ్శబ్దం పాటించడం వల్ల పద్యానికి గొప్ప అందమొచ్చింది, లేదా ఈ వాక్యాన్ని ఇక్కడ సరిగ్గా విరగ్గొట్టి ఇక్కడ సెమీకోలన్ వాడడం వల్ల పద్యం గొప్పదైంది - అంటూ సారంలేని విమర్శ వల్ల ఏమి ఒరుగుతుంది - మహా ఐతే ఒక రకమైన పద్యం ఎట్లా చదవాలో ఎట్లా రాయాలో తెలుస్తుంది - కానే పద్యాలన్నీ అట్లానే ఉంటాయా? ఉండాలా? అట్లా నియమముందా? లేక ఆయా సాహితీ 'విమర్శకులు' వారి వారి అభిరుచులని బట్టి పద్యం మంచి చెడులని నిర్ణయిస్తారా? లేదా పద్యం మంచి చెడులని నిర్ణయించే పద్దతి మరేదైనా ఉందా? ఇంక మరో పద్దతి పద్యాలని paraphrase చేస్తూ వ్యాసాలు రాయడం. సమకాలీన పరిస్థితులని, ఉద్యమాలని, ధోరణులని,ఇంకా సవాలక్ష general knowledge విషయాలని, కవి పద్యాలని పక్క పక్కన పేరుస్తూ వ్యాసం (వీలయితే వ్యాసాలు) రాసి మధ్య మధ్య పద్యాలకు ప్రతి పదార్థం రాసి explain చెయ్యడం. దురదృష్టవశాత్తు తెలుగులో కవిత్వ విమర్శ వీటిని దాటి బయటికి రావడం లేదు.

అట్లా కాకుండా పద్యాల్లో ఉన్న వస్తు రూపాలకి మధ్య ఉన్న కార్యకారణ ( uni directional కాదు bi directional) సంబంధాన్ని, పద్యంలో చెప్పబడిన వస్తువు (ఎంత చిన్న పద్యమైనా వస్తువుండాలి కదా - లేకుండా పద్యం ఎట్లా రాయవచ్చో నాకు తెలియదు) లేదా భావం లేదా అనుభూతి లేదా ఆవిష్కరించబడిన చూపు - ఎందుకు బాగుంది - ఎందుకు బాగులేదు - అది ఏ తాత్విక చింతనని మన ముందు ప్రతిపాదిస్తున్నది - మనలో ఏ తాత్విక చింతన కలిగిస్తున్నది - ఆ పద్య మనలో కలిగించే అనుభూతికి (లేదా feelings) తాత్విక మూలాలేమిటి - ఆ పద్యం మన ఆలోచనలని కొంచెమైనా స్థాయి పెంచుతున్నాయా లేదా - ఆ పద్యంలో ఆ వస్తువుని/ ఆ అనుభూతిని/ feelings కలిగించడానికి కవి వాడిన కవితా పరికరాలేమిటి - అవి కొత్తవా పాతవా అరిగిపోయినవా (cliche) - ఇట్లా కొంత చదువరుల స్థాయి పెంచే విధంగా, కొత్త ఆలోచనలు పుట్టించే విధంగా, పరిధి విస్తరించే విధంగా విమర్శ చేస్తే (అభిప్రాయాలు చెప్పడం కాదు - అభిప్రాయాలు చెప్పినప్పుడలా అహంకారం ప్రవేశిస్తుంది - ఇదంతా నాకే తెల్సు నేనే బాగా చెప్పగలను - ఈ కవి - చదివే పాఠకులు శుద్ధ waste అనే భావం ప్రవేశిస్తుంది ) ఎంత ఉపయోగకరంగా ఉంటుందో సహృదయులు ఆలోచించాలని నా మనవి.

"పుస్తకం" కామెంట్ రాజకీయాలు!

"ఊరి చివర" మీద "పుస్తకం"లో వచ్చిన వ్యాఖ్యల్లో తిరునగరి సత్యనారాయణ గారు ఒక వ్యాఖ్య రాశారు, దాన్ని "పుస్తకం" వారు కొంత భాగం వేశారు, తిరిగి తెల్లారే దాన్ని తొలగించారు.

ఈ వ్యాఖ్యని మొదట "పుస్తకం"వారు ఎందుకు అచ్చేశారో, తరవాత ఎందుకు తొలగించారో, ఈ మధ్యలో ఏ డ్రామా జరిగిందో తెలీదు. వారే పెట్టుకున్న నియమం ప్రకారం అసభ్యతా, వ్యక్తిగత దూషణలు వున్న వ్యాఖ్యలని తొలగించే/ప్రచురించ నిరాకరించే అధికారం వారికి వున్నది. అలాగే, మంచి సాహిత్యాన్ని, మంచి చర్చా ప్రమాణాలను ప్రేమించేవారు కూడా దాన్ని హర్షిస్తారు. కానీ, తిరునగరి రాసిన ఈ వ్యాఖ్యలో ఎక్కడా అసభ్యత లేదని, వ్యక్తిగత దూషణ లేదని వొక్క సారి చదివితే మీకే అర్ధమవుతుంది. అలాంటప్పుడు ఈ వ్యాఖ్యని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ వ్యాఖ్య చదివాక ఎవరికయినా వెంటనే వచ్చే సందేహం ఇది.
నిజానిజాలు గ్రహించగల పాఠకుల కోసం తిరునగరి గారు నాకు మెయిల్ లో పంపించిన ఈ వ్యాఖ్యని ఇక్కడ తిరిగి అందిస్తున్నాను. “పుస్తకం” వాళ్ళు తొలగించిన ఈ వ్యాఖ్యని మీరూ చదవండి..ఆలోచించండి...అభిప్రాయాలను పంచుకునే మీ స్వేచ్చని అక్షరాలా స్పష్టంగా ప్రకటించండి.

ఇది తిరునగరి వ్యాఖ్య.


అఫ్సర్ ‘ఊరి చివర’ మీద భూషణ్ సమీక్ష, దాని మీద చర్చ చూసాక నాకో అనుమానం కలిగింది. (క్షమించండి ఇక్కడ ఇద్దరినీ ఏకవచనం తోనే సంభోదిస్తున్నా – పవన్ లాగా నచ్చినందుకు భూషణ్ గారని. నచ్చనందుకు అఫ్సర్ అనీ అనకుండా). ఇంతకీ మనం అఫ్సర్ కవిత్వం మీద సాహిత్య విమర్శ చేస్తున్నామా లేక మన అభిప్రాయాలు చెప్తున్నామా? అభిప్రాయాలైతే అవి పూర్తిగా వ్యక్తిగతమైనవి. అయితే మన అభిప్రాయాలు మన వ్యక్తిగతమని గ్రహించి, అటువంటి అభిప్రాయాలే ఇతరులకూ ఉండవచ్చని గౌరవించి, నా అభిప్రాయమే గొప్పది – నీ అభిప్రాయం హీనమైనది అని తిట్టిపోయకుండా ఉంటే, కొంతలో కొంత, కొన్ని అభిప్రాయాలకు విలువ ఉండేది. అంతే గాని నాకు నచ్చనందుకు ఇదంతా కంగాళి అని హుళక్కి అని, సున్నా అని, నానాటికి తీసికట్టు నాగంభొట్లు అనీ నిర్ధారింపు వ్యాఖ్యలు చేసి పారేస్తే అది, సాహిత్య విమర్శ పక్కన పెట్టండి – సరైన అభిప్రాయం కూడా కాదు. అట్లాంటి వ్యాఖ్యలు మన అసహనాన్ని, అహంకారాన్ని, అన్నీ నాకే తెలుసు అనుకునే దురుసు తలబిరుసు తనాన్ని, కోపాన్ని, బహుశా కించిత్తు చేతకాని తనాన్ని, ఉడుకుమోత్తనాన్ని ఇంకా చెప్పాలంటే సవాలక్ష అప్రజాస్వామిక ధోరణులని బయట పెడతాయి.

దురదృష్టవశాత్తు ఇక్కద ఒక్క చోటే కాదు ఇంకా అనేక చోట్ల (బహుశా తాను సాహిత్య కవిత్వ విమర్శ పేరుతో రాస్తున్న అభిప్రాయాలన్నింటిలోనూ) భూషణ్ ఇదే ధోరణి ప్రదర్శించాడు. దీని వల్ల ఒక వేళ భూషణ్ చెప్పే వాటిల్లో ఏమైనా విలువైన అంశాలున్నా వాటిని స్వీకరించేందుకు మనసొప్పదు. కొన్ని రకాల కవిత్వం పట్ల, కవిత్వ ధోరణుల పట్ల, కవుల పట్ల తీవ్రమైన prejudice తో భూషణ్ చేసే వ్యాఖ్యల (అవీ ఆయన నిజాయితీగానే చేసినా) పట్ల గౌరవం కలగదు. వాటినుండి మనం నేర్చుకునేదేమీ లేదు అనేంతగా ఆ prejudice వాటిని కప్పేస్తుంది. అందువల్ల అభిప్రాయాలుగానే వాటికి ఆ గౌరవం దక్కనప్పుడు వాటికి సాహిత్య విమర్శ స్థాయి కలగడం దాదాపు అసాధ్యం. కాబట్టి భూషణ్ తన prejudice ని, తలబిరుసు తనాన్ని, అహంకారాన్ని పక్కన పెట్టి అభిప్రాయాలు చెబితే వాటికి receptiveness పెరుగుతుంది.

ఇకపోతే భూషణ్ రాసేవి అభిప్రాయాలే, సాహిత్య విమర్శ కాదు అని ఎందుకంటున్నానంటే సాహిత్య విమర్శ కు (పాశ్చాత్య, దేశీ సంప్రదాయాల్లో) కొన్ని సూత్రాలున్నాయి, కొన్ని విలువలున్నాయి. కవిత్వాన్ని, సాహిత్యాన్ని సరిగ్గా అంచనా వేయడం కోసం, పాఠకులకు పరిచయం చేయడం కోసం కొన్ని పద్దతులున్నాయి. పద్దతిని బట్టి విమర్శనా సూత్రాలూ ఉంటాయి. అటువంటి విమర్శ వల్ల పాఠకులకు, సాహిత్యకారులకూ, కవులకూ (రచయితలకూ) మొత్తంగా సాహిత్యానికీ మేలు జరుగుతుంది. అటువంటి విమర్శ వల్ల నేర్చుకొనేది ఎంతో ఉంటుంది. భూషణ్ రాసే వాటిల్లో ఇవి దాదాపుగా కనబడవు. తాను కవిత్వాన్ని చదివి ఒక అభిప్రాయం ఏర్పర్చుకుంటాడు. ఇంకా ఆ వొక్క అభిప్రాయాన్నే వివిధ రకాలుగా చెప్పడానికి నానా అవస్థా పడతాడు. ఈ క్రమంలో తిట్లకు లంకించుకుంటాడు. నోరు పారేసుకుంటాడు. దానితో చదివే వాళ్లకు (వాళ్లకు అఫ్సర్ ఎవరో భూషణ్ ఎవరో తెలియకపోతే) ఏమిటే ఇంత తిడుతున్నాడు ఏమిటీ కారణం అని అయోమయానికి గురవుతారు – భూషణ్ అభిప్రాయం పైన కించిత్తు విసుగు తెచ్చుకుంటారు కూడానూ –ఏమిటే ఈయన గోల అని).

ఇంతకీ భూషణ్ పద్దతి గురించి మాట్లాడుకుందాం. భూషణ్ కు చాలా కవితా ధోరణుల పట్ల, కవిత్వాల పట్ల, కవుల పట్ల ఒక రకమైన allergy. కోపం అసహనం. అసలు అట్లాంటిది కవిత్వమే కాదు అని ఆయన అభిప్రాయం. కవిత్వమంటే ఇట్లాగే ఉండాలి అని ఆయన నిక్కచ్చి అభిప్రాయం. దాని నుండి ఆయన బయట పడే ప్రయత్నం సాధారణంగా చెయ్యడు. ఇదంతా ఇంతకీ form గురించే! కవిత్వం లోని వస్తువు దాకా వెళ్ళ్డడం లేదింకా! క్లుప్తత ఉండాలి, అర్థవంతమైన భాష కావాలి, పదాలు పద చిత్రాలు repeat కాకూడదు. ఊహాలో maturity ఉండాలి,. Diction బాగుండాలి. లయ ఉండాలి వగైరా వగైరా ! ఇవన్నీ వైయక్తికాలు – personal అభిరుచులు! ఈ వ్యక్తిగత అభిరుచులు కవిత్వం చదివే వాళ్లకు వేరు వేరు స్థాయిల్లో ఉండవచ్చు. మళ్ళీ ఇక్కడ నీ స్థాయి తక్కువ నా స్థాయి ఎక్కువ అనే వాదన అనవసరం. ఒకరికి సత్యజిత్ రే నచ్చవచ్చు మరొకరికి మృణాళ్ సేన్ నచ్చవచ్చు. మరొకరికి రిత్విక్ ఘాటక్ నచ్చవచ్చు. తప్పేముంది. అభిరుచులు ఆమూర్తమైనవి. అవి ఏర్పడ్డానికి అనేక కారణాలున్నయి.

సమస్యల్లా, వ్యక్తిగత అభిరుచులతో కవిత్వాన్ని అంచనా వేయలేము – వేస్తే అది అభిప్రాయమే అవుతుంది సాహిత్య విమర్శ కాదు. ఈ అభిరుచులనే గీటురాళ్ళుగా పెట్టుకుని ఇట్లా ఉంటేనే కవిత్వం, లేక పోతే కంగాళీ అంటే అది అహంకారమూ, అన్యాయమూ కాదూ? ఇది కనీసం రూపవాద (formalistic) సాహిత్య విమర్శ కూడా కాదే! రూపవాద విమర్శలో విమర్శకులు రూపానికున్న విస్తృతిని పరిగణనలోకి తీసుకుంటారు. ఒక writing ని సాహిత్యం, కవిత్వం చేసే సాహిత్య (కవిత్వ) పరికరాలని (literary devices) గుర్తిస్తారు. వాటి ఆధారంగా సాహిత్య విమర్శ చేస్తారు. ఆ పరికరం metaphor కావచ్చు, metonymy కావచ్చు, allusion కావచ్చు, conceit కావచ్చు. ‘Direct speech with target’ కావచ్చు, self parody కావచ్చు. పద్యం అవసరమైన చోట పొడుగ్గా ఉండొచ్చు, లయ ఉండొచ్చు ఉండక పోవచ్చు – ఒక theme repeat కావచ్చు – ఒక పదచిత్రం haunt చేయొచ్చు - వగైరా వగైరా చెబుతూ రూపమే ప్రదానంగా తమ విమర్శ కొనసాగిస్తారు. కవిత్వం లో భాషను (poetry is the highest form of language కదా!) భాషను ప్రయోగించిన పద్దతిని, మెళకువలను ఇట్లా వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అతీతంగా నిష్పాక్షికంగా విమర్శ చేస్తారు. సాహిత్య పరికరాల ద్వారా సాహిత్యాన్ని అంచనా వేసి విమర్శ చేసి భాష గురించీ, కవిత్వం గురించి విలువైన విషయాలను రూపవాద విమర్శ మనకందించింది. అందుకే తనకు మయకోవ్స్కీ వస్తువు ఇష్టం లేక పోయినా ఆయన కవిత్వం మీద అద్బుతమైన విమర్శ చేస్తాడు రోమన్ యాకబ్సన్ . అయితే రెండు ముఖ్యమైన విషయాలు .

ప్రాథమికంగా విమర్శ చేసేవారికి నిజాయితీ ఉండాలి, రెండు విమర్శ సూత్రాలు, పద్దతులు తెలిసి ఉండాలి. అట్లా కాకుండా ఊరికే కటువైన అభిప్రాయలు, అవీ prejudices తో కూడుకున్న అభిప్రాయాలు మాత్రమే చెబితే వాటి వల్ల అప్రజాస్వామిక ధోరణులు బలపడి, వైమనస్యాలు విద్వేషాలు పెరిగడం తప్ప పెద్ద సాహిత్య ప్రయోజనముండదు.

ఇంతకీ అఫ్సర్ కవిత్వంలో కొన్ని పదాలు పదే పదే వాడాడని, కొన్ని పదచిత్రాలను repeat చేసాడని, లయ లేదని, కవికి Diction లేదని ఇట్లా ఆయన కవిత్వం మీద అభిప్రాయాలు చెప్పే ముందు వాటికి ప్రామాణిక సూత్రాలేవయినా ఉన్నయా? ఎంత మంది కవులు (మనం గొప్ప కవులు అనిపించుకున్న వారు) ఈ పని చేయలేదు. కవికి ఒక theme ఉండదా? అట్లా ఉండడం తప్పా? ఉదాహరణకు మొత్తం ఇస్మాయిల్ కవిత్వం లోనో లేక అజంతా కవిత్వం లోనో లేక తిలక్ కవిత్వం లోనో ఎన్నో పదాలు, పద చిత్రాలు, ఊహలు repeat కాకుండా ఉన్నయా? ఇస్మాయిల్ కు చెట్టు కవి అని, అజంతా కు స్వప్న కవి అని పేరొచ్చినంత మాత్రాన వారు గొప్ప కవులు కాకుండా పొయ్యారా? కాబట్టి కేవలం పదాల, పద చిత్రాల repetition (అదీ సందర్భాన్ని వదిలేసి – out of context) అభాండం వేసి ఒక కవిని తీసిపారెయ్యడం కనీస సాహిత్య విమర్శ మూలసూత్రాలు తెలిసిన ఎవ్వరి కైనా సమంజసం కాదు.

ఇంతకీ అఫ్సర్ తన ఊరి చివర లో ఏమి చెప్తున్నాడు? ఆయన వస్తువేమిటి, ఆయన ఏ పరాయీకరణ (alienation) గురించి మాట్లాడుతున్నాడు? ఏ nostalgia గురించి రాస్తున్నాడు? తాను పుట్టిన గడ్డకు వేల మైళ్ళ దూరంలో ఉంటూ ఏది పలవరిస్తున్నాడు? ఆయన కవితా వస్తువులేవి? ఆయన తాత్విక దృక్పథమేమిటి? ఏ కళ్ళతో తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తున్నాడు, తనలోపలి ఊరునూ ఊరి చివరనూ పాడుతున్నాడు? ఆయన వేదనంతా ఏమిటి? ఇవేవీ పట్టవా ఆయన కవిత్వాన్ని సమీక్ష చేసేవాళ్ళకు? ఇదంతా వదిలేసి, కొన్ని prejudiced అభిప్రాయాలతో కొన్ని అర్థరహిత అసంపూర్ణ నియమాలతో అఫ్సర్ ది అసలు కవిత్వమే కాదని కొట్టి పారెయ్యడం ఏ మాత్రం సమంజసం? ఏ మాత్రం ప్రజాస్వామికం? అఫ్సర్ కవిత్వం మీద విమర్శ (పోనీ అభిప్రాయమైనా సరే) అఫ్సర్ పట్ల అభిమానమో, దురభిమానమో, ద్వేషమో కొలమానంగా చేసే పని కాదు కదా? నిష్పాక్షికంగా ఉండటం ప్రజాస్వామికం కాదా? ఆరోగ్యకరం కాదా? అసలు అఫ్సర్ కవిత్వాన్ని అంచనా వేయడానికి అఫ్సర్ తాత్విక దృక్పథాన్ని, ఆయన వస్తువునూ పూర్తిగా ఎందుకు విస్మరించినట్టో? కేవలం రూపం మీద ఆధారపడి చేసే సాహిత్య విమర్శకు కూదా కాలం చెల్లిపోయిందే ? (అట్లా అని భూషణ్ చేసింది రూపవాద విమర్శ కూడా కాదు). ముందే ఏర్పర్చుకున్న కరడు కట్టిన అభిప్రాయాలతో, కించిత్తు అహంకారంతో, కించిత్తు చీత్కారంతో భూషణ్ చేసిన వ్యాఖ్యలు సాహిత్య అభిప్రాయాలుగా కూడా నిలవడం లేదు అని వేరే చెప్పాలా!
-తిరునగరి సత్యనారాయణ

కొన్ని తలపోతలు -2

1

ఇప్పుడు అప్పుడప్పుడూ
ఎప్పుడో అనుకోకుండా
వొక పగిలిపోయే బుడగలాగా -

అమ్మ లేదు
లేదు లేదు
అన్న నిజం లోపలి నించి తన్నుకొస్తుంది.

ఇదొక విశేషణం దొరకని క్షణం
అర్ధమూ దొరకదు.

వో కొత్త బాధ.


2

వో నిశ్శబ్దపు ఆదివారం పొద్దున
వో చిమ్మచీకటి శకలంలో

లోపలి నించి వో దుక్ఖపు తరగ:

ఇక నించి నా బతుక్కి అర్ధం ఏమిటా అని.

3

చెప్పలేని తనం
పిచ్చిపట్టి కేకలు వేయలేని తనం నించి.

4

నా ప్రపంచం: బల్ల పరుపు.

ఇక్కడేమీ ప్రతిధ్వనించదు
పోనీ ఏమీ గడ్డ కట్టదు కనీసం.

5

పోయిన రాత్రి: పీడ కలలు
అనేకనేక బాధల్ని
భరించలేక
మెలికలు తిరుగుతున్న అమ్మ.

(మూలం: రోలాండ్ బార్త్ )
Category: 0 comments

"ఊరి చివర" గురించి మరో సారి...!

"ఊరి చివర" గురించి వద్దు వద్దు అంటూనే మళ్ళీ మళ్ళీ చర్చలకి ప్రాణం పోస్తున్నారు కవిమిత్రులూ, విమర్శకులూ.
ఇటీవల కొంత కాలంగా ఇతర పనుల వొత్తిడి వల్ల నేను ఈ చర్చల జోలికి వెళ్లలేకపోతున్నాను. పై పైన చూస్తే, వీళ్ళంతా చెప్పిందే మళ్ళీ చేబ్తున్నారనీ, రాసిందే మళ్ళీ రాస్తున్నారనీ, తమని తామే పునరావృతి చేసుకుంటున్నారనీ అనిపిస్తోంది.

అయిననూ... పాఠకుల సౌకర్యార్ధం ఈ లింకులు :

http://kottapali.blogspot.com/2011/01/blog-post_03.html

http://pustakam.net/?p=5861
Category: 6 comments

విజయవాడ బుక్ ఫెస్టివల్ లో "అనేక" విడుదల!

విజయవాడ బుక్ ఫెస్టివల్ లో “అనేక” విడుదల!

సారంగ బుక్స్ తొలి ప్రచురణ “అనేక” పదేళ్ళ కవిత్వం జనవరి రెండో తేదీన విజయవాడ బుక్ ఫెస్టివల్ లో విడుదల అయ్యిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అఫ్సర్, వంశీకృష్ణలు సంపాదకత్వం వహించిన ఈ కవిత్వ సంకలనం మొత్తం 404 పేజీలు, దాదాపు 200 మంది కవుల కవితలు ఇందులో వున్నాయి.

వెల: 199 రూపాయలు.

ప్రతులు కావలసిన వారు: ప్రస్తుతం విజయవాడ బుక్ ఫెస్టివల్ లో బుక్ స్టాల్ 232 లో అడగండి.
గుడిపాటి సెల్ నంబరు : +91 984 878 7284 (from outside India), 984 878 7284 (from within India)


సారంగ గురించి మరిన్ని వివరాలకు చూడండి: http://saarangabooks.com/
Category: 5 comments
Web Statistics