యింకేమీ కాదు

~
తెలుస్తూనే వుంటుంది,
దూరంగా వున్నప్పుడే యింకా ఎక్కువగా-
నేను తప్ప ఇంకెవరూ లేని గదిలో
వొక పక్కకి తిరిగి గోడవేపు చూస్తూ
నన్ను నేనే పలకరించుకున్నంత నింపాదిగా
ఆ చీకట్లోని నీడల్ని మెత్తని చూపుల్తో నిమురుతూ –
మాట్లాడుతూ వుండాలని అలా మాటల్లోకి అన్ని నిస్పృహల్నీ
గ్లాసులోకి నీళ్ళలా వొంపాలనీ
అంతే తేలికగా వాటిని మళ్ళీ గొంతులోకి కూడా వొంపేసి
అటునించి శరీరంలోకీ
యింకిపోయేంత హాయిగా మరచిపోవాలనీ అనుకుంటాను.
ఇదంతా యింకేమీ కాదు
కాస్త అలవాటు పడాలి, అంతే!
2
శరీరాన్ని బయటికి ఈడ్చుకెళ్తే గాలి మారుతుందని
అమాయకంగా నన్ను నేను నమ్మించుకొని
సాయంత్రపు చలిలోకి మనసంతా ముడుచుకొని నడుస్తూ వెళ్తాను
ఎక్కడికని? ఎంత దూరమో వెళ్ళను గానీ,
వెళ్ళిన దారంతా బెంగపడిన పక్షిలా మెలికలు తిరుగుతుంది.
వొంటరిగా వున్నప్పుడు వొంటరి పక్షిని అసలే చూడలేను.
ఇదంతా యింకేమీ కాదు
నువ్వు దేనికీ అలవాటు పడలేవని ఇంకో సారి తెలుస్తుంది తప్ప!
3
దగ్గిరగా వున్నప్పుడు
తెలిసినతనంలో ఏదో తెలియనితనమే ఎక్కువ.
తెలుసు అనుకుంటాం కానీ, ఏమీ తెలియదు నిజంగా-
దూరంగా వున్నప్పుడే
నా వొంటిని నేనే తాకి తాకి
కొలుస్తూ వుంటాను, నీ జ్వరాన్ని-

4 comments:

Unknown said...

తెలుస్తూనే ఉంటుంది దూరంగా ఉన్నపుడే ఇంకా ఎక్కువగా

మాట్లాడుతూ ఉండాలని అలా మాటల్లోనికి అన్ని నిస్ప్ృహ లను గ్లాసు లోకి నీళ్ళ లా వంపాలని
దగ్గరగా ఉన్నపుడు తెలిసినతనంలో ఏదో తెలియనితనమే ఎక్కువ

ఏమి చెప్పాలి అఫ్సర్ గారు.....ఏమి చెప్పినా తక్కువే...ఎలా చెప్పినా తక్కువే ....మీకు.... మీ పదాల నెచ్చెలులకు..మీ అక్షర నేస్తానికి ...పదచిత్రసౌందర్యానికి .....జాలువారే ఆలోచనా తేనె సోనలకు......వందనశతం

Anonymous said...

తెలిసినతనంలో ఏదో తెలియనితనమే ఎక్కువ- beautiful line.
rest of the verse unable to fathom.

Unknown said...

తెలియనితనాల అమాయకత్వంతోనే తెలిసినతనమన్న భ్రమ పుడుతుందేమో.
మీలా పదాలని తూకమేసి రాయటం ఎవరికీ సాధ్యం కాదేమో సర్. అద్భుతః

Web Statistics