కాసింత సంతోషం!

గదినిండా చీకట్లు మాత్రమే పొర్లి, పొంగుతున్నప్పుడు
అవును, కచ్చితంగా అప్పుడే
కాసింత సంతోషంగా వున్నప్పటి వొకానొక పూర్వ క్షణపు దీపాన్ని మళ్ళీ వెలిగించు.
ఆ వెలుగులో నువ్వేమేం చేసి వుంటావో
వొక్క సారి- కనీసం వొక్కసారి- వూహించు.

మరీ పెద్దవి కాదులే, చిన్ని చిన్ని సంకేతాలు చాలు.

1
బహుశా మండుటెండ విరగబడే మధ్యాన్నంలో నువ్వు
వూరిచివర చెరువుని వెతుక్కుంటూ వెళ్లి వుంటావ్
శరీరాన్ని గాలిపటం చేసి ప్రతినీటి బిందువులోనూ వొక ఆకాశాన్ని దిగవిడుచుకొని
రంగురంగులుగా ఆ నీటి వలయాల్లోకి ఎగిరిపోతూ వుండి వుంటావ్.

యిప్పుడు అంతగా గుర్తు లేదేమో కాని,
ఆ చెరువుతోనూ ఆ ఆకాశమూ నువ్వూ వొకే భాషలో మాట్లాడుకొని వుండి వుంటారు,
వొకరిలోకి ఇంకొకరు తొంగి చూసుకొని వుంటారు నీటిలోపలి చందమామలా.

2
పల్లె రాదారి మీద ముగ్గురు నలుగురు పిల్లలు యీ లోకాన్ని బేఖాతర్ చేసేస్తూ
కబుర్ల సముద్రంలో మునకలు వేస్తూ వెళ్తున్నప్పుడు
వాళ్ళల్లో యెవరిదో వొక పసిచూపులోకి చెంగున గెంతి
నీ బాల్యపు చేలన్నీ పెద్ద పెద్ద అంగలతో దాటేసి వుంటావ్ వెనకెనక్కి-

యిప్పుడు అసలేమీ గుర్తు లేదేమో కాని,
అప్పుడు నీ వొంటిమీది పెద్దరికపు పొరలు రాలిపోయి
నువ్వు మళ్ళీ నగ్నంగా నిలబడే వుంటావ్,
ఆ పిల్లలు నీ ముందు నిలువుటద్దాలై నిలిచినప్పుడు-

ఎవరికీ చెప్పలేకపోవచ్చు కానీ
నువ్వు ఎంత దిగులుపడ్తున్నావో
వొక్కో సారి రాత్రీ పగలూ తెలియని కాలాల్లోకి యెలాగెలా జారుకుంటూ వెళ్ళిపోతున్నావో
అటు ఇటు ఎటు మళ్ళినా ఏడుపువై ఎలా పగిలిపోతున్నావో తెలుసు కాని-

కాసింత సంతోషంగా వున్నప్పుడు
కచ్చితంగా ఆ క్షణంలో నువ్వూ నేనూ యిద్దరు పిల్లలమై రెండు వూహలమై
వూయల వూగామే అనుకో,
అప్పుడు యీ దేహాలూ ఈ నిజాలూ గాలికన్నా తేలిక.

యిప్పుడు నువ్వు కనీసం వొక సంతోషపు అలలో,
అలలోపలి సంతోషపు కడలిలో
కొంచెమే అయినా సరే,
తేలిపో.
యిప్పుడు నువ్వు కనీసం వొక దీపం కళ్ళల్లో
కళ్ళలోని వెల్తురు నీడల్లో
కొంచెమే అయినా సరే,
వెలిగి రా!
4
జీవితం ఎప్పుడూ ఉత్సవమే కానక్కర్లేదు
కాసింత సంతోషపు చిన్ని సంకేతమైనా చాలు!

1 comments:

Unknown said...

శరీరాన్ని గాలిపటం చేసి ప్రతి నీటి బిందువులోను ఆకాశాన్ని దిగవిడుచుకుంటూ రంగు రంగులుగా ఆ నీటి వలయాల్లోకి ఎగిరిపోతూ ఉండి ఉంటారు.ఇ పుడు నువ్వు కనీసం ఒక దీపం కళ్లలో కళ్ళ లోని వెలుతురు నీడల్లో కొంచెమైనా సరే వెలిగిరా...కదా అఫ్సర్ గారు...ఈ దీపమైనా ఏదీపమైనా దగ్గరకు వెళ్లి కాసేపు వెలిగి వెళ్ళచ్చు గదా...జీవితం ఎపుడూ ఉత్సవమే కానక్కరలేదు.కాసింత సంతోషపు చిన్ని సంకేతమే చాలు కదా

Web Statistics