Tuesday, May 19, 2026

యుద్ధంలో నువ్వూ నేనూ మనం

 యుద్ధంలో వెనుకడుగువేయడం పిరికివాళ్ళ లక్షణం . పోరాడి గెలవాలని చరిత్ర ఎన్నో అనుభవాలనిచ్చింది. అయితే ఆ యుద్ధం మనతో మనకే అయితే..! మనిషికీ, మనసుకి మధ్య ఘర్షణ జరిగితే ? మనిషి ఎటుపోవాలి ? దేనితో యుద్ధం చేయాలి? అదిగో సరిగ్గా అలాంటి మీమాంసతో యుద్ధ భూమిలో నువ్వు, నేను, వాళ్ళు, వీళ్ళు అందరం చిక్కబడి ఉన్నామిప్పుడు అంటారు కవి. యుద్ధం ఎక్కడో జరుగుతోంది, మనమిక్కడ శాంతిగా ఉన్నాం అనుకుంటూ భ్రమల్లో బతుకుతూ, కళ్ళ ముందు రగులుతున్న మంటలను చూస్తూ కూడా నిద్రని నటిస్తూ, శాంతిని కల కంటున్నాము అనుకుంటూ, రణరంగంలాంటి మనసుతో ఎటువైపు అడుగేయాలో తెలియక అనుక్షణం మనిషి తనతో తానే ఘర్షణ పడుతున్నాడు. నిరంతరం తన మనసుతో తానే తలపడి యుద్ధం చేస్తున్నాడు. కార్చిచ్చు లాంటి ఆ యుద్దాగ్ని జ్వాలలు మన కాళ్ళ కింది నేలమీదికి వచ్చేలోగా మత్తులాంటి నిద్ర నుంచి మేలుకోవాలి అని హెచ్చరిస్తున్నాడు కవి ఇక్కడ.

అఫ్సర్ ఆంగ్లంలో రాసిన "ఉపవాస పద్యాలు" తెలుగులోకి శ్రీనివాస్ గౌడ్ అనువదించారు. ఆ పద్యాల్లో ఓ చోట "ఇఫ్తార్ లేదా సహార్ ఏదో ఒక విందులో పళ్ళెం చేతులోకి తీసుకుని ఓ ఖర్జురమ్ పండుని నోట్లో పెట్టుకోబోతాను. ఆ క్షణంలోనే యుద్ధ శరణార్థ శిబిరాల్లో అవయవాలు తెగి, నెత్తుటి గాయాలతో ఆర్తనాదాలు చేసే వేలమందో, వందల మందో తిన్నారో లేదో అనిపిస్తుంది. కన్నవాళ్ళను కోల్పోయి అనాథలైన ఎంత మంది చిన్నారులు ఆకలికి అలమటిస్తున్నారో అని తలపుకు వస్తే చాలు, నోట్లో పెట్టుకున్న ఖర్జురమ్ పండు చేదుగా అనిపిస్తుంది" అంటారు. పుట్టిన గడ్డ మీద కూడా పరాయితనాన్ని అంటగట్టే ఆటవిక శక్తులతో నిరంతరం పోరాడాల్సిందే అని కూడా అంటారు. ఆ ఆవేదనకు కొనసాగింపుగా ఈ "యుద్ధం మధ్యలో నువ్వు" అనే శీర్షికతో వచ్చిన కవిత్వ సంపుటిలో యుద్ధం మనుషుల మధ్యనే కాదు, ఇప్పుడు మనిషి బతికి బట్టకట్టాలంటే చాల రకాల యుద్దాలు చేయాలి, కంటికి కనిపించని అరాచక శక్తులతో కూడా పోరాటం జరపాల్సిందే అంటారు. ఈ సంపుటిలో కొన్ని కరోనా కాలంలో రాసిన కవితలు కూడా ఉన్నాయి.
మరికొన్ని కవితల్లా అనిపించని అంతఃసంఘర్షణలు, ఆవేదనలు, ఆరాటాలు, మనుగడ కోసం, శాంతి కోసం మనస్సనే యుద్ధ భూమిలో అప్పటికప్పుడు అనుభవించిన సంవేదనలకు అక్షర రూపం కల్పించి చిత్తశాంతిని పొందడానికి కొన్ని కవితలు రాశారు అనిపిస్తుంది. వచనాలు పారాగ్రాఫిక్స్ శైలిలో మనల్ని పలకరిస్తాయి. కొమ్మ, రెమ్మ కూడా కదలని ఓ నిశ్శబ్దపు వేసవి మధ్యాన్నం, రెప్పవాలని ఓ నిశిరాత్రి హృదయాన్ని మెలితిప్పిన ఏ సంఘటనకో మనసులో ఉత్పన్నం అయిన వేదనకి వచనాక్షరాలు తోడై తెల్లటి పుస్తక క్షేత్రంలో నల్లటి అక్షర విత్తనాలను చల్లుకుంటూ పోయే అక్షర కృషీవలుడు ఈ "యుద్ధం మధ్యలో నువ్వు" సంపుటిలో కనిపిస్తాడు. సమానత్వం, ప్రేమ, స్నేహం, అస్తిత్వం, ప్రార్ధన, వేదన, దురాక్రమణ దారులపై ఝుళిపించిన కత్తి మొన, యుద్దభూముల్లో పారిన రక్తం సాక్షిగా, మనో భూమిలో ప్రవహించే కన్నీటి నదుల సాక్షిగా నా కవిత్వం మానవత్వం అంటారు. అంతే కాదు. ప్రకృతిలోని ప్రతి చిన్న అంశాన్ని ప్రేమ నిండిన హృదయంతో స్పృశిస్తూ, ఆరాధనని, ఆవేదనని, మమతానుబంధాల్లోని మార్మికతని కూడా కవితాత్మకంగా మనముందు ఉంచారు కవి. ఈ సంపుటిలో మనం మూడు విభాగాల్లో కవితల్ని దర్శించవచ్చు. మొదటి విభాగానికి "కత్తి అంచు మీద నిలబడి", రెండో విభాగంలో "ఆరు కాలాలు మాయమైన చోట", మూడో విభాగంలో పంజరాల్ని ఓడించినప్పుడు" అనే శీర్షికలతో రాశారు.
"-Being a good friend means listening" ఒక్క క్షణం, తమ ఒక్క మాటని, ఆవేదనని వినేవాళ్ళు ఒక్కరు ఉన్నా, ఆ ఉన్నవాళ్ళు హృదయ సంపన్నులు అయితే, ఎంతో మంది ఆత్మీయుల బలవన్మరణాలను ఆపవచ్చు. కానీ వినేవారేరి..? అంటూ బాధగా రాసారు "తెరవెనుక" అనే కవిత వచనాత్మకమైన చోట.
"దారిలో ఎవరో ఎదురొస్తారని - నువ్వు నడక మొదలుపెట్టలేదుగా - నొప్పించే రాళ్ళ సమూహాలు - అడుగడుక్కీ నీకేం కొత్త కూడా కాదుగా!" అంటారు "అయిదు నొప్పించే పద్యాలు" కవితలో. మన ప్రయాణం ఒంటరిదైనా, గమ్యం తెలియనిదైనా, దారి నిండా ముళ్ళు , రాళ్ళూ నడక వేగాన్ని నియంత్రించినా, ప్రయాణాన్ని మాత్రం ఆపకూడదు. అగాధపు జలనిధుల్లో ఆణిముత్యాలు, పగడపు దీవులు ఎదురైనట్లు, పయనపు దారుల్లో నీ వెనుక ఇంకో నాలుగడుగులు తోడవ్వచ్చు. వెలుగు దీపాల్లాంటి ప్రేమ మూర్తులు ఎదురురావచ్చు. మొదలు పెట్టిన ప్రయాణంలో ఎన్నడూ వెనుకడుగు వేయకూడదు" అంటూ ఆశావహ దృక్ఫథంతో ముందుకు పొమ్మంటారు.
"ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయని అనుకుంటూ - ఇక్కడేదో శాంతిలాంటిదేదో ఉంది కదా అని చల్లటి స్పర్శలాగా ఉంటావు కానీ, నువ్వొక రణరంగమైన పెనుమంట అని పొరపాటున కూడా అనుకోవు కదా!". "యుద్ధం మధ్యలో నువ్వు" అనే వచన కవిత్వంలో. యుద్ధం ఎక్కడో జరగడంలేదు. దురాగతాలను, అన్యాయాలను చూసిన చోట నీ మనసే ఒక రణరంగం. నీ అంతరంగం నిండా రగులుతున్న ఆవేదనకు పోరాటపు పదును పెట్టి, బలహీనమైన పక్షం వైపు నీ అడుగులు పడితే, అప్పుడు యుద్ధం మధ్యలో నిలబడ్డ చైతన్యపు శతఘ్నివి నువ్వే అవుతావు అంటారు కవి.
"అన్నం మెతుకులకు కరువుంటుంది - గుక్కెడు నీటికీ కరువే - మనిషికీ మనిషికీ మధ్య మరఫిరంగులు మాత్రం దర్జాగానే తిరుగుతూనే ఉంటాయి - ఇంకా రాబోయే యుద్ధాలకు ఏదో ఒక Reminder అందుతూనే ఉంటుంది" మనుషుల మధ్య ప్రేమ కరువై, ఎల్లెడలా ద్వేషం రాజ్యమేలుతోంది. జాతులు, కులమతాలు, ప్రాంతాలు, రంగు, రూపురేఖలు అన్నీ మనిషిలోని మనిషిని, మానవతాన్ని హత్య చేసి, అసూయ, పగ, విద్వేషాన్ని రగిల్చి ఒకరి పొడ ఒకరు ఒప్పక యుద్ధాలకు కాలుదువ్వుతుంటే, యుద్ధం మిగిల్చిన శకలాలుగా గాయాలతో, ఆకలిదప్పులతో అమాయకుల ప్రాణాలు గాలిలో దీపాల్లా రెపరెపలాడుతుంటే చలించని మానవ మరఫిరంగులు మాత్రం మరో యుద్దానికి సన్నద్ధమవుతూ ఉంటారు" అని ఆవేదననంతా అక్షరాల్లో పొదిగారు Reminder అనే కవితలో.
"చెప్పడానికి చాల ఉన్నప్పుడు - పెదాల్ని కుట్టేసేవాళ్ళు పుట్టుకొస్తారు" అన్యాయాలను ఎదిరించడానికి ఎత్తిన చేయిని నరికేవాళ్ళు, నాలుగు శాంతివచనాలను ప్రవచించాలని నోరుతెరిచిన వాళ్ళ నాలుకను తెగొట్టే వాళ్ళు, నవ సమాజ నిర్మాణానికి నడుంకట్టే వాళ్ళని పంజరాల్లొ బంధించేవాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. అయినా సమానత్వ పురోగమన బాటలో నేను వెలుతురు వైపుకే నడుస్తాను" అని తన దృఢ నిశ్చయాన్ని తెలియచేసారు కవి "పంజరంలోని పాటలు" కవితలో.
"తల మీద కాస్త ఆకాశం ఉంది - కాళ్ళ కింద ఇంకొంచం నేల మిగిలే ఉంది - గుండెలో తడిని ఇంకా ఏ ఎడారో కావిలించుకోలేదు - పెదవి మీది మాటని ఇంకెవరూ తుంచుకెళ్ళలేదు - కాబట్టి - కాసింత ప్రశాంతంగానే నిద్రమబ్బుల్ని ఈ రోజు తరిమేస్తాను - నీదైన వెలుగులోకి సరాసరి నడిచే వస్తాను" జీవితం నిండా ఆవరించుకున్న ఎన్నో ప్రేమలు, నమ్మకాలు, సంతోషాలు, సమాగమాలు, ఎందరో ఆప్తుల నిష్క్రమణలు ఎన్నింటినో చూసి ఉంటాడు కవి. అట్లే మనసుని మెలిపెట్టే విధ్వంసాలు, యుద్ధాలు, గాయాలు, రోదనలు, వేదనలు, పురిటి గడ్డ మీద ఉనికి కోసం ప్రాణాలను పణంగా పెట్టి జరిపే పోరాటాలను కూడా చూసి ఉంటాము అందరం ఏదో ఒక చోట. అన్నీ జరిగిపోయాయి, ఇంకేం మిగల్లేదు. సూన్యం తప్ప. చుట్టూ చీకటే ఆవరించి ఉంది అనుకున్న చోట కూడా ఓ వెలుగు రేఖ ఏ దిక్కు నుంచో ప్రసరించవచ్చు. మనిషి దారెప్పుడూ వెలుగు వైపే ఉండాలి అన్న ఆశాభావం వెలిబుచ్చారు "ఆఖరి పంక్తి మీద" అనే కవితలో.
సూర్యుడు, కవి ఎప్పుడూ కునుకు తీయరు. ఓ చోట నిలబడిపోరు. సూర్యుడు నిరంతరం భ్రమణం చెందుతూ విశ్వానికి వెలుగులు పంచితే, కవి మనుషుల హృదయాల నిండా జ్ఞానజ్యోతులను వెలిగిస్తూ ఉంటాడు అనుక్షణం దారిదీపమై పయనిస్తూ. కవులు అఫ్సర్ మోహమూద్ కూడా అక్షరయోధుడిలా యుద్దాలు లేని నేల కోసం, ఘర్షణ పడని మనసుల కోసం మనుషుల మధ్య నిలబడి శాంతి శతఘ్నిలా ప్రేమ కవితా పుష్పాలను జల్లులుగా నిరంతరం కురిపించాలని, తన కవితలను మానవత్వపు దూతలుగా పంపి, ప్రపంచం నలుమూలలా విశ్వశాంతిని, ప్రేమను వ్యాపింపచేయాలని కోరుకుంటూ..

- రోహిణి వంజారి
ఆంధ్రజ్యోతి వివిధ - మే 18 2026

Friday, April 17, 2026

కవిత్వం అనేక రంగుల వాన!


అరవింద్‌ కృష్ణ మెహెరోత్రాతో కొన్ని కబుర్లు


తెరపి లేకుండా కురుస్తోంది వాన.కాసేపాగితే బాగుణ్ణు కదా అనుకుంటూ ఇంట్లోంచి బయటి కొచ్చాను. అల్లరిపిల్లలా మొరాయిస్తోంది వాన. వొక్కో అడుగూ వేస్తూ నడుస్తూ వున్నా. నిదానంగా చలి తగ్గిపోతూ వుంటుంది కాబట్టి, మార్చి నెల చివరికొచ్చేసరికి మా యూనివర్సిటీ కాంపస్‌ కొంచెం వెచ్చనైన ఉత్సాహంతో ఉరక లేస్తుంది.చిన్ని సూర్యుడి తునక చాలు ఈ కొద్దిపాటి ఉత్సాహానికి!
విద్యార్థులు గూడువిడిచిన పిట్టల్లాగా కాంపస్‌లో పరుగులు తీస్తూ వుంటారు. ఇవాళ వాన కురుస్తున్నా సరే, వాళ్ళ ఉత్సాహమేమీ ‘‘తగ్గేదే లే’’ అన్నట్టుగా వుంది. నిన్నటిదాకా కాళ్ళకింద ఎండుటాకులు విరుగుతున్న చప్పుడు వినిపించేది. ఇప్పుడు వున్నట్టుండి కాళ్ళ కింద ఆకుపచ్చదనమూ, నీలి పసుపు రంగుల గడ్డిపూల తలలూ మెరుస్తున్నాయి. నా లోపల నేనూ అంతే వుత్సాహంగా వున్నా. కనీసం నలభయ్యేళ్ళ కింద కొత్త యవ్వనపు కాంతిలో చదువుకున్న వాక్యాలని ఇవాళ స్వయంగా కలుసుకుంటున్నాను.
అరవింద్‌ కృష్ణ మెహెరోత్రా-ఇవాళ్టికి ఆ నిగనిగలాడే వాక్యాల సంపుటి పేరు. ఎనిమిది పదుల వయసుకి చేరుకుంటున్న మెహెరోత్రా ప్రసిద్ధ ఇండో-ఇంగ్లీషు కవి. ప్రాచీన మధ్యయుగాల కవిత్వాల అనువాదకుడు, చరిత్రకారుడు.అధ్యాపకుడు.మొదటి కవిత్వ వాక్యాలు ఆయన టీనేజీ ప్రాయంలో పుట్టాయనుకుంటే,ఈనాటి దాకా వొక్కక్షణం విరామం లేదు. వివిధ ప్రక్రియల్లో భాషా, ప్రాంతీయ బేధాలేమీ లేకుండా సాగిన ఆయన కృషి భారతీయతలోని అనేక కోణాల ప్రతిబింబం. ఇండియన్‌ ఇంగ్లీషు కవిత్వంలో డామ్‌ మొరేస్‌, నిస్సిమ్‌ ఏజెకీల్‌, రామానుజన్‌, ఆగా షాహీద్‌ అలీ ల సరసన చేరే కవి. సాహిత్య చరిత్ర రచనలో తనదైన పంథాని నిర్మించుకున్నobjectivity ఆయన సొంతం. ఇక అనువాదాల్లో గాథా సప్తశతి నుంచి కబీర్‌ మీదుగా గాలిబ్‌ దాకా అనేకత్వంవైపు ఆయన ప్రయాణం. దాదాపు రెండు వందల పుస్తకాలు మంత్రదండం లాంటి ఆ చేతుల్లోంచి వచ్చాయి. మొన్నటికి మొన్న ఆయన Collected Poems, Ghalib: A Diary అ ఈజ్చీటడ అనే రెండు పుస్తకాలు వెలువడ్డాయి. వచనంలోనూ, కవిత్వంలోనూ ఇంత వైశాల్యమూ, లోతూ వున్న వ్యక్తి ముందు నిలబడడానికి కాళ్ళు వణుకుతున్నాయి.
ఆయన్ని కలవడానికి వెళ్తున్నప్పుడు నా మనసు నిండా గంగమ్మ తల్లికి ఆయన రాసుకున్న పదాలు నాట్యమాడుతున్నాయి. అవి నా ఇంటర్‌ రోజుల్లో ఇంగ్లీషులో చదువుకున్న ఆయన మొదటి కవితలు. ఆయన్ని నన్ను బాగా దగ్గిరగా పరిచయం చేసిన పాదాలు. అప్పటికి కమలాదాస్‌, నిస్సిమ్‌ ఏజెకీల్‌, రామానుజన్‌ మాత్రమే నాకు ఇండియన్‌ ఇంగ్లీషు కవిత్వంలో తెలిసిన పేర్లు.అనుకోకుండా తారస పడ్డాడు ఈ కొత్త కవి. ఆ పొడుగాటి కవితలో గంగమ్మ స్వగతం ఇలా వినిపిస్తున్నారు మెహెరోత్రా:
నేను పురుషుణ్ణి, స్త్రీని కూడా.
పిల్లలు వదిలిన కాయితప్పడవని.
జాలర్లకు మచ్చికైన దాన్ని.
వెంట్రుకల్లేని ముని శిరసు మీది మబ్బుతునకని.
అన్ని కదలికల ప్రతిబింబాన్ని.
- ఇదొక దీర్ఘ కవిత. చిన్ని చిన్ని పదాలతో, చిన్ని చరణాలతో నడుస్తూ మాట్లాడుతున్నట్టుగా వుంటుంది కవిత అంతా. నెమ్మదిగా ఇంకా చాలా దూరం నెమ్మదించి నడుస్తూ చాలా ఆధునికమైన చర్చలోకి అడుగుపెడుతుంది ఈ వొక్క వాక్యంతో:
ఈ మొత్తం ప్రపంచంలోకి వెళ్లిపోతాను
నేనే ప్రపంచాన్ని.
అనేక జాతుల నేను
అనేక నగరాల నేను
అనేకం నేను
బంధనాల్లేని పుస్తకంలోని పుటని నేను.
మెహెరోత్రా కవితల్లో ఇది కొంచెం భిన్నంగా వుంటుంది కానీ చాలా కవితలు మన రోజువారీ జీవితం చుట్టూరా, ఆ జీవితంలో వుండే అనుదిన సామగ్రి చుట్టూరా తిరుగుతూ వుంటాయి. తను పుట్టినప్పటి నుంచీ చూస్తూ వచ్చిన ప్రతి వస్తువునీ కవిత్వంలోకి ఎలా లాక్కు రావాలో ఆయనకి బాగా తెలుసు. ‘ఇస్త్రీ చేసే ఆమె’ అనే కవితలో ఆయనే అన్నట్టు:
అడ్డదిడ్డంగా బట్టలు పడివున్న
మూటలోంచి
బాగా నలిగిపోయిన వొక చేరుమాలు బయటికి తీసి,
ఆమె ఇస్త్రీ చేస్తోంది,
ఆమె చేతి కింద
వాటి ముడతలన్నీ మాయమైపోతున్నాయ్‌.
కచ్చితంగా ఇదే కవిత్వంలో ఆయన చేసే పని కూడా. మాటల సందర్భంలో ఇలాంటి అనేక ప్రారంభాల గురించి అడిగాను. ‘‘కవిత్వం అదేగా చేస్తుంది. మనకు తెలిసిన వస్తువుల్నే గుర్తుచేస్తుంది. వాటి తెలియనితనాన్ని గుర్తుచేస్తుంది.’’ అన్నారాయన. ఆ మాటతో ఆయన మనఃప్రపంచ ద్వారానికి నాకు తాళంచెయ్యి దొరికినట్టయింది.
2
కాంపస్‌ లోకి అడుగుపెట్టగానే ముందు ఆయన్ని మా లైబ్రరీలో కలిశాను. అక్కడ అరుదైన పుస్తక ప్రతుల విభాగంలో ప్రతి పుస్తకాన్ని సున్నితంగా పేజీలు తిప్పుతూ వుండగా ఆయన్ని చూశాను.ముగ్గుబుట్ట వంటి తల,మంచు చుట్టుముట్టినట్టున్న గడ్డమూ-మెహెరోత్రా స్వయంగా వొక నిలువెత్తు పెయింటింగ్‌ లా కనిపించారు. ‘‘ఇంగ్లీషు సాహిత్యం ఎక్కువగా చదువుకున్న మీరు ఈ తక్షణ వస్తువుల అన్వేషణలో ఎలా పడ్డారు?’’ అన్న ప్రశ్నకు ‘‘చక్రాల కుర్చీలో కూర్చొనున్న మామయ్య గురించి రాయడానికి కోకిలలూ, స్కై లార్క్‌ పక్షుల పాటలు పనికి వస్తాయా?’’ అని తిరుగు ప్రశ్న వేశారు. కానీ, నిజానికి ఆయన తొలినాళ్ళ కవిత్వమంతా పరదేశీ సాహిత్యం వల్లనే నిగ్గుతేలింది. అదే ప్రశ్నగా అడిగితే, ‘‘కాసేపు నా దారిలో నేను పడడానికి అదొక పక్క దోవ మాత్రమే’’ అన్నారు.
మా సంభాషణ ఆ 1960ల కవిత్వం మీదికి మళ్ళింది, అంటే, ఆయన టీనేజీ వయసు కవిత్వం గురించి- ‘‘అప్పుడేం చేయాలో తెలియక కేవలం రాత వొక్కటే దిక్కయింది. రెండు మూడు చేతి రాత - ఇంగ్లీషు టైపింగ్‌ పత్రికలుపెట్టి, అందులో కవిత్వమూ, బొమ్మలూ మొదలు పెట్టాం. వొక స్టిల్‌ లైఫ్‌ చిత్రంలాంటి కవిత్వంలోకి నా దృష్టి మళ్ళింది. రెండు టైప్‌ పత్రికలు - ఎజ్రా, Damn You - మొదలుపెట్టాం. అంతే. కవిత్వం టైప్‌ చేయడం, బొమ్మలు. ఆ పొత్తాలను చేతనైనట్టు మేమే కుట్టుకోవడం! అంటే, పబ్లిషర్‌ కోసం ఎదురు చూడక్కర్లేదన్నమాట!’’
ఆ ఇరవైల వయసులో ప్రసిద్థ అమెరికన్‌ కవి ఎజ్రా పౌండ్‌ ఆయనకి వొక నమూనా. అందుకే రాతపత్రికకి కూడా అదే పేరు పెట్టారు. ఎజ్రా అంటే ఎంత ఇష్టమంటే, తను ప్రచురించే పుస్తకాలకి ఎజ్రా - ఫకీర్‌ ప్రెస్‌ అని పేరు పెట్టుకున్నారు. ఎజ్రా పౌండ్‌తో పాటు, విలియం కార్లోస్‌ విలియమ్స్‌, గిన్స్‌బెర్గ్‌ తోడుగా వచ్చారు. ‘‘మొదట నన్ను బాగా కుదిపేసింది అధివాస్తవిక కవిత్వమే. కానీ, నా కవిత్వం ఏ అమెరికాలోనో, యూరప్‌ లోనో పుట్టలేదు. నా తక్షణ వాస్తవికత లోంచి పుట్టింది. కాకపోతే, నా చుట్టూ వున్న వస్తువులూ, మనుషుల్ని చూడడానికి ఆ కొద్దిపాటి ఎడం నాకు అవసరమైంది.’’ అన్నారాయన. కవిత్వాన్ని ఆయన రకరకాలుగా నిర్వచిస్తారు. కానీ, ప్రతి నిర్వచనంలో అనేక అర్థాల మడతపేచీ లుంటాయన్న వాస్తవాన్ని వొప్పుకోవాలంటారు. ‘‘అన్నీవుంటాయి కవిత్వంలో! ఆటలూ, పాటలూ, పొడుపు కథలూ, అన్నిటికీ మించీ అనుకోకుండా జరిగేవి! నిజానికి కవిత్వమంతా అట్లాంటి యాక్సిడెంట్స్‌! కవి కావాలనే చాలా యాక్సిడెంట్స్‌ని సృష్టించుకుంటూ పోతాడు,’’ అంటారు.
భారతీయ సాహిత్యానికి సంబంధించినంత వరకూ ఆయన అన్వేషణ ప్రాకృత ప్రేమ కవిత్వంతో మొదలయిందట. మా ఇద్దరి సంభాషణ ఎక్కువగా ఈ ప్రాకృత ప్రేమ చుట్టూ సాగింది. మేం మాట్లాడుకుంటున్న సమయంలో నా విద్యార్థిని మెహెరోత్రా అనువాదం చేసిన ప్రాకృత కవిత్వం "The Absent Traveler" (1991) కాపీ వొకటి పట్టుకొచ్చింది. నేను ఇప్పుడు పాఠాలు చెప్తున్న వొక సాహిత్య కోర్సులో ఈ కవితల్ని మా విద్యార్థులు చదువుతున్నారు. ఆ విషయాల్ని ఆ విద్యార్థిని ప్రస్తావించింది. వెంటనే ఆయన జ్నాపకాలు ఆ ప్రాకృత కవిత్వ అనువాదాల వైపు మళ్ళాయి. ఆయన అన్నారు:
‘‘బొంబాయిలో వొక మధ్యాన్నం వున్నట్టుండి మిత్రుడు, మరాఠీ కవి అరుణ్కొలాట్కర్‌ గాథాసప్తశతి పద్యాలు సంస్కృతంలో చదవడం మొదలు పెట్టాడు. నాకు సంస్కృతం రాదు. అరుణ్‌ వాటిని వెంట వెంటనే ఇంగ్లీషులోకి తర్జుమా చేసి వివరించడం మొదలు పెట్టాడు. అదిగో, అలా మొదలైంది ఈ అనువాదం. ఇది సంస్కృతం, జర్మన్‌, మరాఠీ భాషల్లో చదవాలన్న కోరిక వుండేది నాకు. కానీ, ఆ మూడు భాషలూ నాకు రావు. కాబట్టి, ప్రాకృతంలోకి వెళ్ళక తప్పలేదు. అనువాదం మొదలు పెట్టాక నిజానికి నేను చేసిందేమీ లేదు. మూలంలో ఏముందో అది ఇంకో భాషలోపెట్టాను దుబాసీ లాగా- ఆ కవిత్వానికే వొక మాంత్రికమైన శక్తి వుంది. వెంటనే అది రీడర్‌ని, శ్రోతని పట్టి లాగేస్తుంది. ఉదాహరణకు గృహిణి నీరు పోస్తున్నప్పుడు దప్పికతో వున్న యాత్రికుడు తన రెండు చేతులూ దగ్గిరకి పొదువుకున్నప్పుడు ఆమె పాత్రకూ, అతని చేతులకూ మధ్య జరిగే సంభాషణ - అదే కదా కవిత్వం! ఎందుకో వొణికే ఆమె చేతులూ, ఆ పాత్ర వొంపిన తీరూ-- జాగ్రత్తగా భాషలో పెట్టడం కవి మాత్రమే చేయగలడు. అనువాదం కూడా అలాంటి అనుభవమే!’’
3
‘‘అనువాదాల్లోంచి మీరు నేర్చుకున్న పెద్ద పాఠం ఏమిటి?’’ అన్న ప్రశ్నతో మా సంభాషణ మరో మజిలీ చేరుకుంది. ఈ సంభాషణకు ముందు నాకు తక్షణం గుర్తొచ్చింది గత ఏడాది మెహెరోత్రా కొత్త దీర్ఘ కవిత Ghalib: A diary 1857-1858. ఈ దీర్ఘ కవితలో ఆయన తాత్వికత అంతా నేరుగా ప్రత్యక్షర సాక్ష్యంగా కనిపిస్తుంది. ఇది గాలిబ్‌కి నివాళి. ముఖ్యంగా ఆ మహాకవిలోని బహుళత్వానికి కవి ఫిదా అయిపోతాడు. ఇందులో వొక చోట:
మనం పువ్వులం
ఏ వేళ్ళకి పుట్టామో తెలీదు.
వొక్క వైపే చూస్తాం చంద్రుడిని
అట్లాగే
పదానికి వొక్క వైపే చూస్తాం
పూల వంటి
చంద్రబింబం వంటి ముఖాన్ని కూడా
వొక్క వైపే చూస్తాం
- అంటారు.
కచ్చితంగా అదే ఆయన జీవన/ సాహిత్య తాత్వికత. నా వైపు సాలోచనగా చూస్తూ ఆయన అన్నారు: ‘‘అనువాదాల్లోంచి ఎక్కువగా నేర్చుకుంది ఆ భాషల బహుళత్వం. గాలిబ్‌ని ఉర్దూ లోంచీ, కబీర్‌ని కేవలం హిందీలోంచి చదవలేము. ఆ కవుల్ని నడిపించిన భాషలు అనేకమున్నాయి. వాటి ఆనుపానులు కూడా మనకి తెలియాలి. మన సాహిత్య చరిత్ర నిర్మాణం కూడా ఈ బహుళత్వమే పునాదిగా జరగాలి. దురదృష్టవశాత్తూ, మనం మన సాహిత్య చరిత్ర నిర్మాణం బాధ్యతని యూనివర్శిటీల భుజాల మీద పెట్టేశాం. సాహిత్యపరమైన సంవేదనలు ఏమైనా వుంటే, వాటిని హతమార్చే ఏకైక పనిలో పడ్డాయి ఈ యూనివర్శిటీలన్నీ! వాటికి సాహిత్యం ఏ మౌలిక పునాది మీద బతుకుతుందో తెలీదు. వాటి దృష్టి అంతా వొకే వొక వైపు వుంటుంది. అది monolingual imagination. ఇవాళ భారతీయ సాహిత్యానికి కావాల్సింది బహుభాషా దృష్టి.’’
ఆ తరవాత ఆయన హైదారాబాద్‌ దక్కనీ సాహిత్య వారసత్వం గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. హైదరాబాద్‌ యూనివర్సిటీలో ఆయన పాఠాలు చెప్పిన కాలమంతా ఆయన దృశ్యాలుగా వివరించారు. ‘‘అక్కడి ప్రతి రోజూ నా కళ్ల ముందు ఇప్పటికీ నిలిచే వుంటుంది. ఉర్దూ-తెలుగు భాషల మధ్య ఆ స్నేహం ఎప్పటికీ నిలిచే వుండాలని నేను అనుకుంటాను. అది ఇవాల్టి అవసరం,’’ అంటూ ఆ రెండు భాషల మధ్యా (పారశీకం కూడా) వున్న బంధాన్ని గురించి కాసేపు ముచ్చటించుకున్నాం. తెలుగు నుంచి ఇతర భాషల్లోకి ముఖ్యంగా ఇంగ్లీషులోకి వెళ్తున్న అనువాదాల గురించి ఆయన ప్రత్యేకించి ఆసక్తి చూపించారు.
సంభాషణ ముగిశాక బయటికి వస్తే, వాన కాస్త తెరిపినిచ్చింది. వానలో తడిసిన చెట్లు ఇంకాస్త ఆకుపచ్చగా కనిపించాయి. లైబ్రరీ నుంచి దారికిరువైపులా పేరు తెలియని ఎన్నెన్నో పూలు వాటి వాటి భాషలో పలకరించాయి. వాటిని కవిత్వంలోకి తర్జుమా చేసుకుంటూ నేను ఇంటివైపు మళ్ళాను, మెహెరోత్రా కవిత్వమంతా మరోసారి చదివి తీరాలన్న ఆలోచనతో!

Saturday, February 14, 2026

అలజడికి అక్షర రూపం- సాహిల్

 

-పి. జ్యోతి


"సాహిల్ వస్తాడు" కథా సంకలనంలో అప్సర్ గారి 11 కథలున్నాయి. ముస్లిం మైనారటి సమస్యలపై వారి దృక్పథంతో రాసిన కొన్ని కథలు ఇతర రచయితులవి కొన్ని చదివాను. ఈ విషయం పై నిష్పక్షపాతమైన దృష్టికోణం నాకు ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను.

పుట్టీనది, పెరిగినది, చదువుకున్నది, పనిచేస్తున్నది లాలాగుడ ఛుట్టుపక్కలే. 23 సంవత్సరాలుగా హిందీ పాఠాలు చెబుతున్నది రైల్వే పిల్లలకు అందులో ముస్లింల సంఖ్య, హిందువుల సంఖ్య సరిసమానం, సూర్దాస్ ను చదవం, భగవాన్ రామ్ క్యో బోల్నా మేడమ్? హమ్ కాఫిరో కే సాథ్ నై బైఠ్తే లాంటీ మాటలను పది పన్నేండు సంవత్సరాల పిల్లలు నుంచి విన్నాను, అలాగే ఇన్ నీచ్ కమీనోం కో కాట్ కే ఫేంక్ దేనా మేడం, లాంటి మరో వర్గపు మాటలూ విన్నాను. వీటి నుండి నేను తిరుగాడుతున్న సమాజాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇరు పక్షాల ప్రేమ పోందాను.

ఇరు వర్గాల వారు నన్ను తమ పక్షాణ చేర్చుకోవాలని పడే తపనను చూసాను. ఏ వర్గంలోనూ చేరకుండా ఉండగలిగే వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాను. నన్ను నేను ఎలా మలుచుకోగలిగినా అంతర్లీనంగా నా శిష్య వర్గంలో ఒకరిపై ఒకరికి అపనమ్మకం పెరిగిపోవడం, ఎవరి గ్రూపుల్లో వారు మిగిలిపోవడం చూస్తూనే ఉన్నాను. నా చిన్నప్పటి కన్నా ఇప్పుడు ఈ దూరం పెరగడం చూస్తున్నాను. నా ఈ అనుభవాల ను ఈ సంకలనం ద్వారా మరో సారి అర్ధం చేసుకునే ప్రయత్నం చేసాను. రమ్జాన్ కు ప్రతి సంవత్సరం వచ్చే షీర్ కుర్మాలు రావడానికి సందేహిస్తుంటే, హలీంను కేవలం హిందువు రంగుతో తినవలసి వస్తే, బుర్కా తీసి పాఠం వినమని చెప్పడానికి సందేహించవలసిన పరిస్థితులు, చెప్పులు లేకుండా కాలేజీకి రాకు (అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములకు) ఇది పాములు తిరిగే చోటు అలా అయితే ఆటలలో కూర్చోకు అని చెప్పవలసి వచ్చినప్పుడు, సందేహంగా చూస్తూ తెలుసులే హిందు మతం పై గౌరవం లేదు నీకు అని బాహాటంగా విమర్శించే శిష్యుల మధ్య ఇంకా ఆశ....... మంచి రోజులు వస్తాయిలే అని.......ఈ నా స్వీయానుభవాలనుండి బైటకు వస్తే...........................

"ఈ కథలు చదువుతున్నప్పుడు ఎట్లాంటి చారిత్రక, రాజకీయ, వ్యక్థిగత సందర్భాల నుంచి ఈ రచయిత వస్తునాడో చదువరిగా మీకు తెలిసిపోతూనే వుంటుంది. అయితే ప్రతి సందర్భంలోనూ నాలోని వ్యక్తి తనదైన స్వేచ్చా భావనతో గొంతు విప్పడం కూడా మీకు వినిపిస్తూనే వుండాలి" అని అఫ్సర్ రాసుకున్నారు. ఈ కథల ప్రత్యేకత అదే. స్పష్టంగా సూటిగా చెప్పాలంటే ఒక ముస్లిం ఈ దేశంలో తన అస్థిత్వ సమస్యను అనుభవిస్తూ రాసుకున్న అనుభవాలు కావు ఇవి. తాను అనుభవించిన వాస్తవాలను కేవలం భావోద్వేగ అంశాలుగా కాక ఆ సంఘటనల ప్రభావం వ్యక్తిగతంగా అనుభవిస్తూ వాటీ నుండీ విడిపోయి విశ్లషణాత్మక దృష్టీతో వాటిని అర్ధం చేసుకుంటూ పతనమయిపోతున్న మానవ విలువలు గురించి కలవరపడిపోతున్న ఒక మనిషి చిత్రించిన జీవితపు ముద్రలు ఇవి. ఇతర రచయితుల కథలకు అఫ్సర్ కథలకు మధ్య నాకు కనిపించిన వ్యత్యాసం ఇది.
ఈ కథలన్నిటిలో ఒక కథ గురించి చెప్పమంటే నేను మొదటిగా ఎన్నుకునే కథ "చోటీ దునియా'. ఇందులో ఆర్తి పాత్రను అభిమానించకుండా ఉండలేను. ఎంత స్పష్టత, జీవితం పట్ల ఏంతటి అవగాహన ఆ మాటలలో? "If hope is an impossible demand, then we demand the impossible. If the right to shelter, food, and employment are impossible demands, then we demand the impossible" అనే జూడిత్ బట్లర్ మాట ఈ కథకు ఆధారం అని అర్ధం అవుతుంది. "ఐడెంటిటీ అన్నది ఒక దేశం కన్నా, వొక భాషకన్నా పెద్దది. దాన్ని ఎట్లా వెతుక్కోవాలో తెలీదు మనకి" నువ్వు నిజంగా హిందువా? నిజంగా ముస్లింవా? నాకయితే అది సగమే నిజమనిపిస్తుంది. మిగతా సగం నువ్వు నీ చుట్టూ వున్న నేలలో ఎంత బాగా ఇమిడిపోతావన్న దానిమీద ఆధారపడి వుంటుంది" ..... ఏంత గొప్ప వాక్యం ఇది? మన చుట్టూ ఉన్న ప్రస్తుత సమాజం వైపు ఈ దృష్టితో చూడగలిగే వ్యక్తులు ఎంతమంది? వ్యక్తివాదం నుండి మాబ్ సైకాలజీ నుండి విడివడి సమస్యను ఈ దృష్టితో చూడగలిగే వ్యక్తులు నిజమైన మానవతావాదులు. Put it in Perspective.... వీరి ఆఖరి వాక్యం ఒక గొప్ప పాఠం.
"తాను ఇతరుడిగా మారే క్రమం ఎక్కడ మొదలయిందో తెలుసుకోవాలని అఫ్సర్ కు ఆసక్తి. కేవలం పాండిత్యపరమైన ఆసక్తి కాదు, అస్థిత్వవేదనకు సంబంధించిన ఆసక్తి' అన్నారు కే. శ్రీనివాస్ గారు తమ ముందుమాటలో అంత కన్నా బాగా ఈ కథలోని భావాన్ని, రచయిత దృక్పథాన్ని వివరించడం నాకు రాదు. "బతుకులోకి వెళ్ళే కొద్దీ నేనొక పిరికి ప్రాణమై తడబాటే బాటగా మిగిలిపోతే, వాడు అనేక తడబాట్ల మధ్య "తను" గా మిగలడానికే నిలబడ్డాడు" అనే ఒక వాక్యం ఉంది వీరి "ఒక తలపు వెనక" అనే కథలో. అప్సర్ గారి ఈ కథలలో తను గా నిలబడవలసిన అవసరాన్ని బలంగా చెప్పారు. అది గోరీమా పాత్ర నుంది మొదలై,తెలంగీ పత్తా దాకా...ఆ తను ని కనుక్కోవడానికి ప్రతి పాత్రలో అంతర్మధనాన్ని చూపించిన విధానం ఆలోచలనలను రేకెత్తిస్తుంది. ప్రస్తుతం ముస్లిం సమాజం అనుసరించవలసిన మార్గాన్ని స్పష్టం చేస్తుంది. Put everything in perspective.... అన్నది ఒక నినాదం అవుతుంది. "
"సహేలి" కథ ఇస్మత్ చుగ్తాయి "The Quilt" కథను గుర్తుకు తీసుకువచ్చింది. Lesbian relationship కి సంబంధించిన కథ ఇది. కాని ఈ కథలో వాంచ, ప్రేమ, పెళ్ళి వీటిపై జరిగిన చర్చ DH Lawrence ని simplify చేసినట్లుంది.Spanish Painter Salvador Dali "The persistence of memory" గురించి ప్రస్తావించినా, T.S. Eliot కవిత్వాన్ని గుర్తు చేసినా Irving Stone రాసిన Vincent Van Gough biography "The lust for life" ప్రస్తావన తీసుకువచ్చినా వీటిని తన కథలలో రచయిత వాడుకున్న విధానం వీరి శైలిని ప్రత్యేకంగా నిలబెట్టుతుంది.
సమాజంలోని అలజడిలో ఒక పాత్రగా మిగిలిపోవడం అందరూ చేస్తున్నదే. అయితే ఆ అలజడిని అనుభవిస్తూ, దాన్ని అర్ధం చేసుకుని అది మన వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను, తెలివిని, విలువలను లోబర్చుకునే క్రమం నుండి తప్పించుకోవాలనే అవసరం, కోరిక, ఉన్న అస్థిత్వ పోరాటంవాదులు చదువ వలసిన కథలు ఇవి.

యుద్ధంలో నువ్వూ నేనూ మనం

  యు ద్ధంలో వెనుకడుగువేయడం పిరికివాళ్ళ లక్షణం . పోరాడి గెలవాలని చరిత్ర ఎన్నో అనుభవాలనిచ్చింది. అయితే ఆ యుద్ధం మనతో మనకే అయితే..! మనిషికీ, ...