మన కాలపు సూఫీ

-వాడ్రేవు చినవీరభద్రుడు
~
అఫ్సర్‌ నాకు తమ్ముడు. ఇద్దరం దాదాపుగా ఒకేకాలంలో కవిత్వం రాయడం మొదలుపెట్టాం. పోయిన శతాబ్దంలో ఎనభైల్లో మేం లోకంలోకి మేల్కొన్నప్పుడు ఒక్కలాంటి ప్రశ్నలే ఎదుర్కొన్నాం, దాదాపుగా మేం వెతుక్కున్న సమాధానాలూ ఒక్కలాంటివే. మూడు దశాబ్దాలపైబడ్డ ఈ ప్రయాణంలో మా దారులు వేరైనా, అతడి అడుగుజాడలు నేనూ, నా అడుగుజాడలూ అతడూ, ఒకరినొకరం, పరికిస్తూనే వున్నాం. అతడు కూడా కథలు రాసాడు, సాహిత్యానుశీలన చేసాడు, అన్నిటికన్నా ముఖ్యం కవిత్వసాధన వదలకుండా కొనసాగిస్తూనే ఉన్నాడు. నాకు మరింత ఆరాధనీయమైన సంగతి అతడు సాహిత్యాన్ని బోధిస్తూండటం, అది కూడా సముద్రాలకవతల. పల్లెనుంచి పట్నానికి, పట్నం నుంచి మహాపట్నానికి, మహాపట్నం నుంచి ఖండాంతరానికీ సాగిన అతడి ప్రయాణంలో ఒక్క క్షణం కూడా కవిత్వాన్ని మరచింది లేదని ఈ కవితలు సాక్ష్యమిస్తున్నాయి.

2

ఈ కవితలు చాలావరకు 2009 నుంచి నిన్నమొన్నటిదాకా రాసిన కవితలు. ఈ కవితలు తెరవగానే మనకి రూమీ వాక్యాలు కనిపిస్తాయి. అందులో, ఆయన తాను చెప్పేదంతా– తన మిత్రుడూ, తన గురువూ, తన కవిత్వసూర్యుడూ అయిన తబ్రీజీ చెప్తున్నదేననీ, తాను కేవలం అతడి మాటలు ప్రతిధ్వనిస్తున్నానని మాత్రమే అంటున్నాడు. ఈ మాటల్తో ఈ కవిత్వాన్ని తెరవడం గొప్ప అనుభవం, కొత్త అనుభవం.
మౌలానా జలాలుద్దీన్‌ రూమీ, ఆయన మిత్రుడు షమ్షుద్దీన్‌ తబ్రీజీ ప్రవక్త మహమ్మద్‌ మాటలకి సజీవ ఉదాహరణలుగా జీవించడానికి ప్రయత్నించారు. ‘ఒక విశ్వాసి మరొక విశ్వాసికి దర్పణంగా ఉంటాడు’ అన్న హడిత్‌ వాళ్ళ హృదయాల్ని వెలిగించింది. ఒకరిలో ఒకరు తమని తాము చూసుకున్నారు. ఆ నిర్లేప, నిరంజన దర్శనంలో వారు అన్ని కాలాల్లోనూ, అన్ని దేశాల్లోనూ, అన్ని అవస్థల్లోనూ జీవిస్తున్న మానవులందరి వదనాలూ చూడగలిగారు. ఇదే కవిత్వం. ఇదే మతం. అందుకనే టాగోర్‌ జీవితకాల కవిత్వసాధన తర్వాత, తనది కవుల మతమన్నాడు.
రూమీ స్నేహితుడెవరో మనకి తెలుసు. కానీ, అతడి మాటలే తనలో ప్రతిధ్వనించాక, ఆ స్నేహితుడు ఒక మానవమాత్రుడిగా మిగిలిపోక, ఈశ్వరసమానుడిగా మారిపోయేడు. మరి, ఈ కవితల్లో కవి ప్రతిధ్వనిస్తున్నదెవరిని?
ఈ ప్రశ్నకి ఎవరికి వారుగా సమాధానం వెతుక్కోవలసి ఉంటుంది. నాకు స్ఫురించినదేదో నేను చివర్లో చెప్తాను. కాని, అదెవరో అన్వేషించడానికి ముందు, ఆ వ్యక్తితో, ఆ హృదయంతో కవి చేస్తున్న సంభాషణ ఏమిటో నేను కొంత వివరించవలసి ఉంటుంది.
సంభాషణ. అవును, అదే సరైన మాట. ఈ కవిత్వమంతా ఒక ఎడతెగని సంభాషణ. అంతేకాదు, రూమీ కవిత్వానికి వచ్చిన ఒక ఇంగ్లీషు అనువాదానికి ముందుమాట రాస్తూ ఒక భావుకుడు ఆ కవితల్ని ‘పాటలూ, ఆత్మశోధనలూ, దేవుడితో రూమీ చేసిన సంభాషణలూ’ అన్నాడు. అతడు వాడిన పదం interrogation. దాన్ని నేను ఆత్మశోధన అంటున్నాను. అంటే, కవిత్వం ఏకకాలంలో రెండువైపుల సంభాషణ. అది తనతో చేసేదీ, లోకంతో చేసేదీ కూడా. దాన్నే చలంగారు ‘అంతర్‌ బహిర్‌ యుద్ధారావం’ అన్నాడు. రూమీ తనతో సంభాషించుకున్నాడు. తన మిత్రుడితో సంభాషించుకున్నాడు. తనతో తాను చేసుకునే సంభాషణ తనలోని లఘుపార్శ్వాన్ని శోధించుకోవడంగా, మిత్రుడితో సంభాషణ తన గురుపార్శ్వంతో సంభాషణగా మొదలై, చివరికి, రెండూ ఒకటిగా మారిపోయి, తను అంతరించి, గురువొక్కడే మిగలడం రూమీ కవిత్వప్రయాణం.
కవి బయటి ప్రపంచంతో చేసే సంభాషణ ‘డ్రమటిక్‌ మోనోలాగ్‌’గా, తనతో తాను చేసుకునే సంభాషణ ‘ఇంటీరియర్‌ మోనోలాగ్‌’గా మనకి పరిచితమే. కాని, తనతో తాను చేసుకునే సంభాషణ తనని తాను interrogate చేసుకునేటంత తీవ్రంగా ఉండకపోతే, దాని పర్యవసానంలో తనని తాను annihilate చేసుకోకపోవడంగా మారకపోతే, ఆ కవిత్వం నిజమైన కవిత్వంగా పరిణమించదు. ఆ అహం నిర్మూలన, దాన్ని సూఫీలు ‘ఫనా’ అన్నారు.
ఫనా అంటే జీవించి ఉండగానే మరణించడం. మరణించి జీవించడం. జీవితం కొనసాగుతుంది, కాని అహం స్ఫురణ ఉండదు. తాను మిగలడు, దివ్యప్రేమావేశం మాత్రమే కొనసాగుతుంది.
అందుకనే ఈ సంపుటిలో ‘ఫనా’ అనే ఒక కవిత కనిపిస్తే నాకు ఆశ్చర్యం కలగలేదు. రూమీని స్మరిస్తూ మొదలైన కవిత్వం ఫనాకి చేరుకోవడంలో ఆశ్చర్యం లేదు కదా. అక్కడ కవి అంటున్నాడు:
ఎన్ని దూరాలు కలిపితే
వొక అస్థిర బైరాగినవుతానో
ఎన్ని తీరాలు గాయాలై సలిపితే
వొక నిర్లక్ష్య సూఫీనవుతానో!
ఇదీ వొక ఆటే కదా నీ చుట్టూ
నేను బొంగరమయి తిరగడానికి
ఇది సమకాలికుడైన ఒక తెలుగు కవి రాసిన వాక్యాలంటే నమ్మటం కష్టం. తీవ్ర భావుకతలో మిస్టిక్‌గా మారే ఒక పిపాసి మాత్రమే మాట్లాడగల మాటలు. ఎందుకంటే, ఇది ప్రేమ కవిత్వం కాదు. ప్రేమ అంటే సామాజిక సాహచర్యానికి దారితీసే ప్రేమ అన్న అర్థంలో ప్రేమకవిత్వం కాదు. అందుకు ఈ మాటలే సాక్ష్యం:
ఆడుకుంటున్నా నాలో నేను
నీతో నేను
నీ వూహ ఒక సాకు నాకు
ప్రేమ అంటే ఇద్దరు కాక ఒకరు మాత్రమే మిగిలే అనుభవమనుకుంటేనే ఈ వాక్యాలకు అర్థముంటుంది, కాని, ఇది ఎదుటి మనిషిని (అదర్‌ను) నిర్మూలించే ‘నేను’ (సెల్ఫ్‌) కాదు. తనో, ఇతరుడో, ఎవరో ఒకరు మటుకే జీవించవలసి వస్తే, ఎదుటి మనిషికి చోటిచ్చి తాను తప్పుకునే మనఃస్థితి కోసం చేసే ప్రయాణం. ఒకప్పుడు గురజాడ ఇట్లా అనగలిగాడు:
ఉసురులకు విసికితివొ; యుద్ధము
కలదు; దేశము కొరకు పోరుము’
యుద్ధమా, ఇకనేమి లోకము!
చాలు! చాలును! లంగరెత్తుము
అక్కడ ‘నీ ఊహ’ ఒక సాకు అయినట్టే, ‘నేన’నే భావన కూడా ఒక సాకు. నిజానికి అక్కడ ఇద్దరు లేరు, ఉన్నదొక్కరే, అందుకనే ఆ కవితనిట్లా ముగిస్తాడు:
కొలమానాలన్నీ గాల్లోకి
చిలిపిగా విసిరేసి
నీ లోపల శిథిలమయిపోనీ నిబ్బరంగా
ఫనా, అంటే, self annihilation అనే మాటకి ఈ కవి ఇచ్చిన తెలుగు పరిభాష ‘నిబ్బరంగా శిథిలమయిపోవడం!’
ఫనా కవిత ఈ సంపుటికి తాళం చెవి. ఈ కవిత చూపించిన వెలుగులో చదివినప్పుడు, మొత్తం కవితలన్నీ అఫ్సర్‌ చేస్తున్న ప్రయాణాన్ని కొత్తగా చూపిస్తాయి. ఇంతకుముందు మనకి పరిచయమైన మాటలే, ఆ భావనలే, అవి మన సమకాలిక సామాజికార్థాన్ని, వైయక్తిక వేదనని స్ఫురింపచేస్తూనే అంతకన్నా ఉన్నతమైన మరొక భూమికలోకి మనల్ని లేవనెత్తుతాయి.
ఈ సంపుటి శీర్షిక ‘ఇంటివైపు’ అన్నదే చూడండి. 80ల తర్వాత కవిత్వం రాసిన ప్రతి ఒక్కరూ; తమ ఇంటి గురించీ, బాల్యం గురించీ, తమ గ్రామం గురించీ రాయకుండా ఉండలేకపోయారు, ఈ కవితో సహా. ఇప్పుడు మళ్ళా అతడు ‘ఇంటివైపు’ అంటున్నప్పుడు, ఆ ఇల్లు కేవలం స్వగృహం మాత్రమే కాదనీ, అతడిదే అయిన ఒక ఆత్మగత ప్రపంచానికి ప్రతీక అనీ బోధపడుతోంది.

3

ఈ కవితలన్నిటిలోనూ ఒక జ్ఞాపకం ఉంది. ఆ జ్ఞాపకాన్ని పదేపదే స్మరించుకోవడం ఉంది. సూఫీ పరిభాషలో ఈ స్మరణని ‘ధిక్ర్‌’ అంటారు. అంటే స్మరణ. నిరంతర స్మరణ. అప్రయత్న స్మరణ.
స్మరణ గొప్పదా, ధ్యానం గొప్పదా అని అడిగితే ప్రవక్త, స్మరణనే గొప్పదన్నారు. నిజానికి సర్వేశ్వరుడు మానవుడికిచ్చిన మాట ఏమిటంటే ‘నువ్వు నన్ను తలుచుకో, నేను నిన్ను తలుచుకుంటాను’ అని. ధ్యానంలో ఎంతో కొంత సంకల్పమూ, ప్రయత్నమూ ఉంటాయి. కాని స్మరణ అప్రయత్న సిద్ధి. అందుకనే, ఫనాని చేరుకోవాలంటే ధిక్ర్‌ గుమ్మంగుండానే అని సూఫీలు నమ్ముతూ వచ్చారు.
ఈ కవిత్వమంతా, ఆ అప్రయత్న స్ఫురణ, స్మరణతో పొంగిపొర్లుతోంది. కొన్ని సార్లు అది, చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా, ఇంద్రియాలకు అందేదిగా ఉంటుంది:

అవున్నిజంగానే వెళ్తాను నాలోకి
ఆ చిన్నప్పటి పొలంలో రాలిపడిన రేగిపళ్ళ వాసనలోకి
ఇప్పుడింక గుర్తొస్తుంది చిన్నప్పటి నా చింతకాని
ఏం వెతుక్కుంటావో, అలసిపోయేంతదాకా
ఆ వూరి చివర చెట్ల మంచుతెరల మధ్య
పట్టా పక్కన వూరు
ఎక్కడయినా ఎప్పుడయినా ఒకటే
దాని ప్రతి మాటా
రైలు కూతల్లో ఒదిగిపోతుంది
కానీ చాలాసార్లు అది అస్పష్టంగానే ఉంటుంది. అది ఊరు కావొచ్చు, సహచరి కావొచ్చు, చిన్నప్పటి జ్ఞాపకం కావొచ్చు, లేదా తానిప్పుడు జీవిస్తున్న ఒక అమెరికన్‌ నగరం కూడా కావొచ్చు.

అయినా సరే, వెళ్ళి రావాలి ఆ మంత్రనగరికి
ఇన్ని వాస్తవ స్వప్నాల నడుమ
ఒక కలలేని నిద్ర
నిద్రరాని కల-
కునుకు కప్పుకున్న మెలకువ
వూరు మసకచీకటిలోకి
సగం కన్ను తెరిచి
మూతపెట్టుకుంది ఇంకోసారి.
చాలాసార్లు కలగాపులగంగా మారిపోయిన ‘ప్రత్యక్షం’ లోంచి ఆ పరోక్షాన్ని గుర్తుపట్టడానికి పెనగులాడుతూనే ఉంటాడు కవి.
నన్ను చుట్టుముట్టిన ఈ తెలియని ముఖాల
తెలియని చెట్ల, తెలియని ఆకాశాల, తెలియని గాలుల
కనిపించని కన్నీళ్ళ, వినిపించని ఏడ్పుల సమూహంలో నిలబడి
ప్రతి ముఖమూ నీదే అనుకుని బతిమిలాడుకుంటాను
అందుకని ఏమనుకుంటాడంటే,
వొక వూరు యింకొక వూరు ఎప్పుడూ కాదు
అప్పుడప్పుడూ వెనక్కి చూడు
దాటి వచ్చిన వూరు
ఏమంటుందో విను
అసలే నగరమయినా ఎవరికయినా ఇల్లవుతుందా?
ఏమో ఈ డౌన్‌ టౌన్‌ గుండెల్లోంచి నడుస్తున్నప్పుడు
శరీరాన్నీ, గుండెనీ కూడా
పొగమంచు, చలిచినుకులు ముసురుకున్నట్టే వుంది.
అయితే, కవి ఇట్లా పరాయీకరణ అనుభవిస్తున్నందువల్లా, తాను తనదని భావిస్తున్న లోకం ‘ప్రత్యక్షం’లో కనిపించనందువల్లా, ఈ కవిత్వాన్ని రొమాంటిక్‌ కవిత్వంగా భావించలేం. అక్కడే, ఈ కవిలోని సమకాలికత చాలా స్పష్టంగా కనిపించేది. చూడండి:

ఆ మాటకొస్తే ఎన్ని చినుకులు కలిస్తే
వొక వాన అవుతుందో కూడా తెలీదు ఈ పరాయి క్షణంలో…
కాని
మళ్ళీ మళ్ళీ
వొక తెల్లవారు జాము వానలో తడుస్తూ
ఇల్లూ ఊరూ వదిలి
పరిగెత్తుతూనే వుంటాను, ప్రపంచం వేపు
ప్రపంచం వైపు పరుగెత్తకుండానూ, ప్రపంచాన్ని అందుకోకుండా ఉండాలనీ కాదు కవి ఆరాటం. తన పూర్వక్షణాల దగ్గరే ఆగిపోవాలని లేదు కవికి. కానీ, ఆగుతాడు, ఆగకుండా ఉండలేడు, కాని అది కాసేపే. అందుకే ఇలా అనుకుంటాడు:
ఆగిపోవడం తప్పేమీ కాదు, ఎవరో విధించిన శిక్ష కూడా కాదు
కాసేపు నిన్ను ఆపాలని ఎందుకనుకుందో జీవితం.
గడచిపోయిన జీవితం గురించి కవికి స్పష్టత ఉంది.
కాని, ఆ పోయిన కలలాంటి నిజం కూడా వుండదు.
ఆ పోయిన నిజంలోని పుప్పొడీ వుండదు
అందుకని అతడు తన ప్రయాణం కొనసాగించాలనే కోరుకుంటాడు.
లోపల వొక వెయ్యి తలుపుల ఇల్లు
ప్రతి ఇంట్లో వొక అపరిచిత లోకం-
తెరుచుకుంటూ వెళ్ళాలి చివరి తలుపేదో తెలీక-

4

సరిగ్గా, ఇక్కడే అతడికి స్మరణ ఆలంబనగా నిలబడేది. ఆ వెయ్యి తలుపుల ప్రపంచంలో తాను ఏ గదిలో ఉన్నాడో గుర్తుపట్టడానికి ఆనవాలు ఆ స్మరణనుంచే లభిస్తుంది. స్మరించడమంటే ఎప్పటికీ ఆ గతించిన క్షణాల దగ్గరే ఉండిపోడం కాదు. తాను వెతుకుతున్న ఆ వదనం ప్రత్యక్షంలో ఏ క్షణాన ప్రత్యక్షమయినా గుర్తుపట్టగలిగే నిత్యజాగరూకతతో ఉండటం…
నిన్ను నువ్వు వర్తమానంలో, ప్రత్యక్షంలో ఎట్లా గుర్తుపడతావు?
మాట ద్వారా, పాట ద్వారా అంటాడు కవి. ఆ మాట కోసం వెతుకులాటనే ఈ కవిత్వంలో సింహభాగం. ఈ కవి అన్వేషణ నిజమనీ, ప్రగాఢమనీ మనకి సాక్ష్యమిచ్చేది ఆ నలుగులాటనే. ఆ నలుగులాటని అతడు తనలోకి ప్రయాణమని చెప్పుకుంటాడు.

మిగిలిన అన్ని ప్రయాణాలూ లోకం కోసం
ఈ ఒక్క ప్రయాణమే నాదీ నా లోపలకీ అనిపిస్తుంది.
ప్రయాణాల్నిట్లా రెండుగా వింగడించుకోవడం వల్లనే ఈ కవి పాతకాలపు భావకవి కాదని మనకి తెలుస్తున్నది. ఈ లోపలి ప్రయాణపు జాడల వల్ల ఇతడు సూఫీల దారిన ప్రయాణిస్తున్నాడు, కానీ, కొత్తయుగానికి చెందిన సూఫీ అనవలసి వుంటుంది.
సూఫీలు తామెక్కడ ఉంటే, అక్కడి సామాజిక- భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టుగా తమ ఆలోచనను సవరించుకుంటూ వచ్చారు. అలాగే, ఈ కవి కూడా, ఇప్పటి కాలానికి చెందిన స్పృహ వదిలి ఎప్పుడూ కవిత్వం చెప్పాలనుకోడు.
విగ్రహాలూ, విధ్వంసాలూ, ఆత్మహత్యలూ హత్యలూ
కరువులూ నిరుద్యోగాలూ
ఆకలి కడుపులూ వీధుల మీద
పోస్టర్లయి తిరుగుతున్న మనుషులూ వూరేగింపులవుతున్న అసహనాలూ
చావుకేక వేస్తున్న పసితనాలూ
-వొక్క అరక్షణం కూడా నేనొంటరిని
వొక్కణ్ణే నేనొక్కణ్ణే అని గావుకేక వెయ్యలేను
చావులూ, ఆకలి చావులూ తెలుసు నాకు
కన్నీళ్ళూ వాటి చివర జీవన్మరణాల అనుక్షణికాల తాడుకి వేళ్ళాడే
బతుకుదప్పికలు తెలుసు నాకు
కణకణ మండే ఉద్యమ రక్తకాసారాల్లోకి
దేహాల్ని చితుకుల్లా విసిరేస్తున్న ప్రాణాలూ తెలుసు నాకు
కానీ కళ్ళముందు కనిపిస్తున్న ఈ దృగ్విషయాన్ని తన ఆంతరంగిక ప్రపంచంతో ముడిపెట్టుకోవాలనీ, తన అంతరంగంలో తనకి లభిస్తున్న ప్రశాంతితో ప్రపంచాన్ని ముంచెత్తాలనీ కవికి అపారమైన కరుణ. ఆ ప్రయత్నంలో ఎన్నో అవస్థలు.
నేను ఏ భాషలో నిన్ను చేరుకున్నానో తెలీదు
నువ్వు నాది కాసేపు కవిత్వభాష అంటావ్‌
కాసేపు మరీ ఉద్వేగాల భాష అంటావ్‌
చాలాసేపు
నేను నీకు ఎంతకీ పాలు అందని శైశవ ఆక్రోశంలా వినిపించి వుంటాను.
నా పసిభాష ఉద్వేగమై ప్రవహిస్తే
ఈ వొక్కసారికి మన్నించు
ఇంకా నాకు రానే రాని ఈ లోకపు భాష నేర్చుకోవాలి నేను
కళ్ళముందు కనిపిస్తున్న ఈ ప్రపంచం ఎంత కఠినమంటే, చివరికి, ఒక క్షణం పాటు, కవి ఇలా అనుకోకుండా ఉండలేకపోయాడు:

ఛ.. ఛ…
ఇంకేం రాస్తాం బే, కవిత్వం!
కానీ ఆ క్షణం దగ్గర ఆగిపోయినా కూడా అది ఆగిపోడమే అవుతుంది. తనని ప్రపంచం నిర్మూలించినట్టే అవుతుంది.
వొక మాట మూసుకున్న తరవాత
ఇంకేమీ తెరుచుకోవు
మాటని తెరిచి వుంచు
అక్కణ్ణుంచి కూడా, అతికష్టం మీదనైనా, అడుగులో అడుగు వేసుకుంటూనైనా, ముందుకు ప్రయాణం సాగించాలి. అప్పుడే ప్రపంచం దిశగా వేసే ప్రతి అడుగూ తనలోకి తాను వేసుకోడమవుతుంది, తనలోకి తాను వేసుకునే ప్రతి అడుగూ ప్రపంచం వైపుగా వెయ్యడమే అవుతుంది.
అందుకనే తనని గుర్తుపట్టే ప్రయత్నం ఇప్పుడు కవికి పద్యాన్ని గుర్తుపట్టే ప్రక్రియగా మారింది.
పద్యాలు ఎలా వుంటాయి
ఒక్కటే ప్రశ్న దారి పొడవునా.
కాని పద్యం ఒంటరితనంలో దొరికేది కాదు

నలుగురు కలిస్తే నాలుగు పద్యాలు
పద్యం ఎప్పుడూ వొంటరి కాదు.
కవికి తననీ, లోకాన్నీ కలుపుకోగల సంకేతస్థలంగా పద్యం కనిపించింది.
బాధ తెలిసిన పదం పద్యం అంటే
ఏడ్వనీ
ఎంత ఏడిస్తే అంత పద్యం!
ఇదొక సూక్ష్మలోక యాత్ర. కవికి తన గురించిన ఒక స్మృతి ఉంది. ఆ జ్ఞాపకం, పైకి వ్యక్తిగతంగా కనిపించవచ్చుగాక, కాని, నిజానికి అదొక సార్వజనీన జ్ఞాపకం. ఒక అతీతకాలపు స్మరణ. దాని ఆధారంగా కవి తాను ప్రపంచంతో ఏకం కాగల ఒక సంకేతస్థలాన్ని ఊహిస్తాడు, దర్శిస్తాడు, చిత్రిస్తాడు.
అక్కడ ప్రపంచమంటే కూడా ప్రపంచముఖంలో కనిపించే తనే. ఈ ‘తను’ తనకే పరిమితమయిన తాను కాదు. ఏ ఒక్కరికీ చెందనీ, అందరికీ చెందిన ఆ ‘తనని’ పట్టుకోవడం ద్వారా కవి తననీ, ప్రపంచాన్నీ కూడా పైకి లేవనెత్తుతున్నాడు.
ఈ వాక్యాలకి
ఇంత బాధ ఎక్కణ్ణించి అనే కదా మాటిమాటికి నీ ప్రశ్న!
వొకే వొక్కసారి నా నిజమయిన ఏకాంతంలోకి
నెమ్మదిగా నడిచి రా,
నువ్వు నడిచినంత మేరా!
ఈ వాక్యాల్లో ‘ఏకాంతం’ అనేది చాలా కీలకమైన మాట. ఇది ఒంటరితనం కాదు. ఒంటరితనమంటే ఒక్కడూ ఉండటమని కాదు, ప్రపంచం నీలో ప్రతిఫలించకపోవడం. అది దుర్భరమే కాదు, అవాంఛనీయం కూడా.
ఆ మేరకు నీలోపలి ‘నువ్వు’కి కూడా నువ్వు దూరమయిపోతావు. దానికి ప్రత్యామ్నాయం నలుగురితో కలిసి కాలం గడపడం కాదు. వృథాగా సాగే ఆ కాలక్షేపంలో, నువ్వూ, ప్రపంచమూ కూడా కనుమరుగైపోతారు.
కావలసింది ఏకాంతం. ఏకాంతమంటే, నీలో ప్రపంచవదనం, ప్రపంచంలో నీ వదనం సాక్షాత్కరించే సమయం. అది ప్రయత్నపూర్వకంగా చేస్తే ధ్యానం. అలాకాక, అప్రయత్నంగా జరిగితే, స్మరణం. ఆ స్మరణం వల్లనే తన వాక్యాలకి అంత బాధ అంటున్నాడు కవి. ఎందుకంటే, ఆ బాధ తన హృదయంలో ప్రతిఫలిస్తున్న ప్రపంచం బాధ కాబట్టి.

5

పాడుతూనే వున్నాడు, నస్రత్‌ ఫతే ఆలీ ఖాన్‌
-పదం మూలం తెలియక క్షోభిస్తున్న కవిలాగా
ఈ వాక్యాలు ఈ కవిత్వస్వభావాన్ని పట్టిచ్చే ఆనవాళ్ళు. ఒకటి, కవి గుర్తు చేసుకుంటున్న గాయకుడు సూఫీ గాయకుడు కావడం. రెండవది, అంతకన్నా కూడా ముఖ్యం, ఆ గాయకుణ్ణి పదం మూలం తెలియక క్షోభిస్తున్న కవితో పోల్చడం. సూఫీ కవిత్వం ప్రధానంగా సంగీతమయం. నాట్యవిస్ఫూర్జితం. సూఫీ గీతం ఏకాలంలో పద్యం, గానం, నాట్యం కూడా. అది ప్రేమపారవశ్యంతో ప్రపంచాన్ని చుట్టేసే ఒక గాఢపరిష్వంగం. ఈ కవిత్వానికి ఆ లక్షణాలు పొడసూపుతున్నట్టుగా కనిపించడం నన్నెంతో ఆశ్చర్యానికి లోను చేసింది. ‘రెండేసి పూలు ఓ చందమామా’ అన్న కవిత చూడండి, ఇక రాబోయే రోజుల్లో ఈ కవి గళం నుంచి గజళ్ళూ, గీతాలూ రానున్నాయనిపించడం లేదూ.
ఆ ఛందస్సులో చెప్తాడా లేదా అన్నది ప్రశ్న కాదు. ఉద్వేగపరంగా అతడిప్పటికే ద్రవీభూతమనస్కుడైపోయాడు. ఈ కవిత చూడండి,
వెళ్ళిపోతూ మలుపు దగ్గర కాసేపు నిలబడి చూడు
రాయాలనుకున్నదేదో నీ చూపు చివర కనలిపోయింది.
ఆదియందు మాట వుండెనో లేకపోయెనో
ఆదియందే చివరి మాట స్వప్నించనీ నన్ను.
అంతమందు మాట వుండునో వుండకపోవునో
నిన్న రాత్రి నీ కలకి అంటుకున్న కార్చిచ్చును నేను
వెళ్ళిపోతూ మలుపు దగ్గర కాసేపు నిలబడి చూడు
రాయలేనిదేదో ఒకటి దగ్ధమయ్యింది, రెప్పల తెల్లనవ్వు కింద.
గజల్‌ షేర్లని తలపిస్తున్న ఈ ద్విపదల్లో ఉన్నది సంగీతమే కదా. అంతేనా? గొప్ప గాయకుడు పారవశ్యానికి లోనయిన తర్వాత, తన పాటలో సాహిత్యాన్ని కూడా వదిలేసి, ఏదో ఒక్క పంక్తి దగ్గరే లుంగలు చుట్టుకుపోయినట్టుగా, ఈ కవి కూడా తన స్మరణ, తన ఆత్మవిస్మరణల్లో ‘అంతమందు మాట వుండునో వుండకపోవునో’ అనే మెలకువకి చేరుకున్నాడు.
ముళ్ళు విప్పుకునే కళ నేర్చుకో
త్వరపడు, ఆత్మ దేహాన్ని వదిలేముందే
ఉన్నట్టు కనిపిస్తున్నది ప్రతి ఒక్కటీ వదిలిపెట్టు
ఏది లేనట్టు కనిపిస్తోందో దాన్ని వెతికిపట్టు
అన్నాడు రూమీ.
కళ్ళముందు కనిపించేది ప్రత్యక్షం. కానీ, అది సత్యం కాదు. అది నిన్ను దారి తప్పించేదే. అందుకనే దాన్ని ‘ప్రత్యక్షపు కూటనీతి’ అన్నాడు బైరాగి. దాని వెనక ఉన్నది పరోక్షం. రూమీ మాటల్లో చెప్పాలంటే, ‘లేనట్టుగా కనిపించేది’. కానీ, అదే సత్యం. అక్కడే తనకీ, ప్రపంచానికీ కలయిక. అది నిత్యస్మరణ ద్వారా, ఆత్మవిస్మృతిద్వారా మటుకే సాధ్యం కాగల అరుదైన సమాగమం. ఇంట్లోనే నీకు గురువు దొరుకుతాడని కబీర్‌ పదే పదే చెప్పింది ఈ రహస్యమే.
ఈ ఇంటివైపు ఆ ఇంటి వైపు ప్రయాణం.
ఈ కవి మన కాలపు సూఫీ.



(12, అక్టోబరు, 2017)
(ప్రచురణ వివరాలు: ఇంటివైపు – అఫ్సర్. వాకిలి ప్రచురణ, 2017. వెల: Rs. 180/- $ 9.95 ప్రతులకు: నవోదయ, అమెజాన్, కినిగె, తెలుగుబుక్స్.ఇన్)

0 comments:

Web Statistics