ఎంతెంత దూరం?

- స్వాతి కుమారి 
~

ఆటల్లో పడి ఎటెటో తిరిగి ఇంటిధ్యాస మర్చిపోయిన పిల్లాడికి, ఉన్నఫళాన అమ్మగుర్తుకొచ్చి స్నేహితుల్ని, కర్రా బిళ్ళని, మర్రి ఊడల్ని వదిలేసి ఇంటికి పరిగెత్తుతాడు. అప్పుడు వాడికి ఇల్లంటే అమ్మ.

తర్వాత్తర్వాత రెక్కలు మొలిపించుకుని, వేర్లని పెరుక్కుని బహుదూరంగా వలసపోయాక, ప్రతిరోజు వలసపోతూ ఉండటమే బతికే పద్ధతిగా మారిపోయాక;

ఇల్లంటే తను వదులుకుని వచ్చిన దేశం, ఊరు, బాల్యం.
ఇల్లంటే తన సామాజిక, సాంస్కృతిక, వ్యక్తిత్వ మూలం.
ఇల్లు ఒక ప్రతీక; పుట్టుకకి, ఎదుగుదలకి; ఎదిగిపోయాక తిరిగొస్తే మళ్ళీ పసిపిల్లాణ్ణి చేసి ఒద్దిక నేర్పడానికి.
“నగ్రీ నగ్రీ ఫిరా ముసాఫిర్ ఘర్ కా రాస్తా భూల్ గయా

……
హమే తో సబ్ కుచ్ యాద్ రహా పర్ హమ్ కో జమానా భూల్ గయా” - గులాం అలీ
మరిచిపోయిన దారిని ఒంటరిగా వెతుక్కోక తప్పదు. తనని మరిచిపోయిన వాళ్ళకి తనెవరో గుర్తు చెయ్యకా తప్పదు. మైలురాళ్ళని కౌంట్ డౌన్ చేసుకుంటూ ప్రతి మజిలీలో ఒక పద్యాన్ని నాటుకుంటూ ’ఎక్లచలోరే’ అని సాగిపోయే కవి ప్రతీ అడుగులోనూ ఒక కాందిశీకుడే. ప్రతీ మలుపులోనూ గుక్కెడు జ్ఞాపకాల కోసం దోసిలి పట్టే దాహార్తుడే.

దొరికిన చుక్కలన్నీ కలుపుకు పోతున్నా పూర్తికాని ముగ్గులా, అనుగ్రహించబడిన గాయాలన్నిటితోనూ అల్లిక వీలుకాని కవితలా, ఈ ప్రయాణం ఎప్పుడూ ఒక పలవరింతే. పలవరించే గొంతుక మాత్రం పలుకుపలుకుకీ బెంగటిల్లి పసిదై పోతుంది. జీవితకాలపు అనుభవాల అట్టడుగునించీ, వంటబట్టించుకున్న మాయమర్మపు లౌక్యపు మాటల చీలికల్లోంచి, ఒక యవ్వనపుజీరగా ఎగిసెగిసిపడుతుంది. మొహమాటాన్ని, మర్యాదల్నీ ధిక్కరించి, పలుకే బంగారమైన ప్రేయసిని పంతంగా ప్రేమిస్తూనే ఉంటుంది.

హఫీజ్ భగవంతుడితో ఇలా అంటాడు-

“పక్షులకి మొదట్లో ఎగరడం తెలీదు.
నువ్వు వాటిదగ్గర కూర్చుని పాటలు పాడావు.
నువ్వెళ్ళిపోయాక,
నీకోసమైన వాటి తపన
రెక్కలుగా మొలిచి
నింగిని తొలుచుకుపోయింది.”
బహుశా ఆర్తిని రెక్కలుగా చాపుకున్నఅ పక్షుల్లాంటివే ఇంటివైపుగా మళ్ళిన ఈ కవితలన్నీ.


గాలిలో వాటి గిరికీల గీతల వెంటపడి నడిచిపోయే అస్థిర బైరాగిలాంటివాడే ఈ కవి.
***
పుస్తకం వివరాలు:
ఇంటివైపు
కవి: అఫ్సర్
పబ్లిషర్: వాకిలి
వెల: Rs. 180/- ($ 9.95)
ప్రతులకు:
Navodaya Book House
amazon.com
kinige.com

0 comments:

Web Statistics