అనేక ముంబైల కన్నీళ్ళ తరవాత...




నాన్న ఇంకా ఇంటికి రాలేదు
ఇంకా...ఇంకా...
ఇంకా రాలేదు.

ఈ నగరం నా కళ్ల కింద
నా కాళ్ళ కింద మంట

నాన్న ఇంకా ఇంటికి రాలేదు


చీటికి మాటికి వెనక్కి తిరిగి
గోడ మీది గడియారంతో మాట్లాడుతోంది అమ్మ

దాని ముళ్లలోకి మిర్రి మిర్రి చూస్తుంది
ఎనిమిది...తొమ్మిది...పది...

నాన్న ఇంకా రాలేదు.

అమ్మ క్షణాల్ని లెక్కపెడుతుందో
టీవీలో చూస్తున్న
శవాల్ని లెక్కపెడుతుందో తెలీదు.

వచ్చేయ్ నాన్నా!


ఇప్పుడే కాల్చిన రొట్టెల వాసన
ఇప్పుడే నూరిన గోంగూర పచ్చడి
ఆకలి జమాయించేస్తోంది నాన్నా,

నువ్వు రాకుండా ముద్ద ముట్టనివ్వదు అమ్మ.

తొరగా వచ్చేయ్ నాన్నా!


అమ్మ వీపు తలుపుకి అతుక్కుపోతోంది

ఇప్పుడే ఇదిగో
అనేసి వెళ్ళి చాలా సేపయ్యింది కదా,

నాన్న ఇంటికి రాలేదు.


"అమ్మా! ఆకలే!"

'వూరెలా వుందో తెలుసా?
ఎప్పుడూ ఆకలి ఆకలి
నన్నూ చంపి కొరుక్కుని తిన్రా..."

కేకేసి, ఆ తరవాత అమ్మ ఇలా గొణుక్కుంది

"ఇంకా కాలేదు
ఇంకా కాలలేదు
కుప్పలుగా పోసిన శవాలు
మంటల దుప్పట్లు ఇంకా ఆరలేదు ఆరలేదు
కాల్తూనే వున్నాయి....47 నించీ..."


నాన్న ఇంటికి రాలేదు ఆ రాత్రి
ఈ రాత్రికి కూడా!

(ఈ కవిత "రాలేదు" శీర్షికన 'ఊరి చివర" లో వుంది. ఇప్పుడు మళ్ళీ ఇలా అదే కవిత చదువుకోవాల్సి వస్తున్నందుకు దిగులుగా..)

Painting: Mandira Bhaduri(University of Chicago)
Category: 12 comments

12 comments:

Praveen Sarma said...

ముంబైలో బాంబులు పెడితే స్టాక్ మార్కెట్లు దెబ్బతింటాయి. నగరంలో స్టాక్ మార్కెట్‌లు ఉన్నందుకు నగర ప్రజలు ప్రాణ భీతితో బతుకుతున్నారు.

వాసుదేవ్ said...

ఎందుకో ఈసారి చాలా దిగులుగా ఉంది అఫ్సర్ జీ నిన్నటి మారణహోమం తర్వాత....ఎప్పుడు ఎలా ఎక్కడ కావాలంటే అలా అమాయకులు చంపబడుతూంటే ముఖ్యంగా మనవాళ్ళచేతుల్లోనే మనవాళ్ళూ...మరీ దారుణంగా...నాకీ కవిత గుర్తే...మళ్ళీ ఇలా చదవాల్సిరావడమే బాధ.....ఈ కన్నీళ్ళకి ముగింపు ఉందంటారా?

Rohith said...

yeppudu amaayakule yenduku bali kaavali?

mee bhaada arthamavthondi sir.

సుజాత వేల్పూరి said...

"ఊరిచివర"లో చదివినప్పుడే చాలా సేపు అలా కూచోబెట్టేసింది ఈ కవిత! ఈ నేపథ్యంలో మరీ దిగులుగా, దుఃఖంగా,నైరాశ్యం నిండిన మనసుతో మరి కాసేపు అలా ఉండిపోయేలా చేస్తోంది.

ఎందుకో ఏమిటో కూడా తెలీని వాళ్ళు రక్తాలోడుతూ కాలిపోతారు. వాళ్ల పేర్లేమిటో, ఏమి చేస్తారో కూడా తెలుసుకోడానికి ఆసక్తి చూపని మనం, ఉగ్రవాదం మీద యుద్ధం ప్రకటించాలని మాత్రం వెంటనే డిమాండ్స్ మొదలెడతాం!

shame on me!

ఆ.సౌమ్య said...

అమ్మ క్షణాల్ని లెక్కపెడుతుందో
టీవీలో చూస్తున్న
శవాల్ని లెక్కపెడుతుందో తెలీదు.

ఎప్పుడో రాసి కవిత ఈనాటికీ సరిగ్గా సరిపోతోందంటే....హ్మ్...నిట్టూర్చడం తప్ప ఏమీ చేయలేమా అనే నిరాశ కూడా కలుగుతోంది!

SJ said...

deeniki andari badyata undi ,kevalam govt ante saripodu endukante maname kada vallani ennukoni nilabettindi ...kani ila jaragadam vicharakaram.

జాన్‌హైడ్ కనుమూరి said...

మళ్ళీ ఇలా అదే కవిత చదువుకోవాల్సి వస్తున్నందుకు దిగులుగావుంది
అదే కన్నీరు మళ్ళీ మళ్ళీ

కెక్యూబ్ వర్మ said...

ఇంత అభద్రతా భావంతో బతుకులీడుస్తున్న మనం వీటి వెనక దాగి వున్న నిజాల్ని గురించి బహిరంగ చర్చ చేయలేని ఓ నిస్సహాయ, నిరామయ స్థితిలోకి నెట్టబడుతున్న వైనం మరింత విచారించదగ్గది....

కనకాంబరం said...

మళ్ళీ ఇలా అదే కవిత చదువుకోవాల్సి వస్తున్నందుకు దిగులుగా..)
మీ యీ పదాలు గుండెను పిండిన భావన , ఆర్ద్రత కలిగిస్తున్నాయి మాష్టారూ. ..శ్రేయోభిలాషి ...నూతక్కి(Kanakaambaram ).

Afsar said...

ఈ కవిత మీద స్పందించిన మిత్రులందరికీ షుక్రియా!

@ప్రవీణ్; అవును నిజమే మీరన్నది.
@వాసుదేవ్ , @రోహిత్: కన్నీళ్ళకి ముగింపు లేదు, మొత్తంగా "సహనం" అనే పదాన్ని మనం మరచిపోతున్నంత కాలం. మతం అనేది ఇంకా వొక రాజకీయ ఆయుధంగానే మిగిలిపోతున్నంత కాలం. మతరాజకీయ మాయలమరాఠీలు తప్పించుకుంటారు, అమాయకులు బలి అవుతారు!

@ఉగ్రవాదం మీద యుద్ధం కంటే ముందు మన ఇరుగు పొరుగు బంధాల్ని నాశనం చేస్తున్న స్థానిక రాజకీయాలని నిరసించాలి. తలచుకున్న కొద్దీ దుఖ్ఖమే ఇలాంటివి!కానీ, మనం దగాపడుతున్నామని తెలిసినప్పుడు ఏం చెయ్యాలి అన్నది ప్రశ్న.

@సౌమ్య: ఈ కవిత 2008 లో రాసింది. 2011. 2020. ఏమో? ఎప్పటికయినా బయటపడతామా? తెలీదు. రాను రాను మనం అంతా వొక పెద్ద కుట్రలో ఎవరి చదరంగంలోనో పావులుగా చావులుగా మారిపోతున్నాం.

@సాయి: కానీ ప్రభుత్వాల బాధ్యత ఎక్కువ వుంది. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వ బాధ్యత.

@జాన్; నాకు మంచి నమ్మకం - కవిత్వం - మంచి కవిత్వం మనలోపల మూసుకుపోతున్న మనసు తలుపులు తీస్తుంది. మీరు కవులు. కన్నీళ్ళ దగ్గిరే ఆగిపోకూడదేమో?

@వర్మ; దేని మీద అయినా బహిరంగ చర్చ చెయ్యగలిగిన సత్తా మన వాళ్ళకి వుందా?

@నూతక్కి: ఆర్ద్రతని కాపాడేదే మంచి సాహిత్యం అనుకుంటున్నాను ప్రస్తుతానికి - ఆ తడి అంటూ వుంటే లోకం కొంచెమయినా పచ్చగా వుంటుంది, అక్కడ గడ్డిపూలు పూసినా సరే!

Afsar said...

@ సుజాత గారు: ఉగ్రవాదం మీద యుద్ధం కంటే ముందు మన ఇరుగు పొరుగు బంధాల్ని నాశనం చేస్తున్న స్థానిక రాజకీయాలని నిరసించాలి. తలచుకున్న కొద్దీ దుఖ్ఖమే ఇలాంటివి!కానీ, మనం దగాపడుతున్నామని తెలిసినప్పుడు ఏం చెయ్యాలి అన్నది ప్రశ్న.

బండ్ల మాధవరావు said...

digulu digulu gaa 40 la loo praarambham maatramee telusu. mugimpu kosamee eduru chuupu

Web Statistics