పుట్టిన రోజు అక్షరాలా...
ఓ జ్ఞాపకానికి శుభాకాంక్షలు

- రఘోత్తమ రావు

శీతగాలితో బాధ ఒకటి ఊసులాడిన
నిన్నటి రోజు ఎందుకలా గడిచింది?

ఎండపొడ గిట్టని మనసు
తడిలేని కళ్ళతో ఏమిటా సైగలు?

ఇంకా నిద్రపోతున్న గుబులుకు
మేలుకొలుపు పాడుతున్నట్టు ఎవరిదా గొంతు?

కదల్లేని గడియారం
కాలాన్ని కదిలించేస్తోంది.

పద!
ఒకటో అరో అక్షరాల్ని
రక్తనాళాల్లోకి ఎక్కించుకుందాం.

ఆ స్పర్శతో
ఈ గుండెదడ తగ్గొచ్చు!

(ఆవకాయ నుంచి)

అన్నేసి రంగుల్లో..

-కొండముది సాయి కిరణ్ కుమార్

కళ్ళాపి చల్లుతూ
వస్తూ పోయే మేఘాలు.
అన్నేసి రంగుల్లో
చీకటి అద్ది వెళ్ళిన చుక్కలు.
అక్షరాల పూలతో
ముగ్గులేస్తూ....
"ఊరిచివర" "అఫ్సూర్యుడు"


అఫ్సర్ !

-ఎండ్లూరి సుధాకర్

నీ పుట్టిన రోజు
అక్షరం పుట్టిన రోజు
ఆకాశం పుట్టిన రోజు
ఆధునికత పుట్టిన రోజు

ఈ మట్టిలో పుట్టి
అమెరికా మట్టిపై అడుగు పెట్టి
తెలుగమెరికా తేజం నింపిన
తెలుగు వాడా అఫ్సర్ !
తెలుపుతున్నాను జన్మదిన శుభాకాంక్షలు !

లేవు వాటికి తెలుపు నలుపుల ఆంక్షలు !
నీ కలంతీర్చాలి
కవిత్వంలో ఖండాంతర కాంక్షలు !
మూడు దశాబ్దాల నా స్నేహానికి
'రక్త స్పర్శ'లో
'ఇవాళ' తీరని సరస్వతీ మోహానికి
నీకిస్తా ఒక ముద్దా బంతుల గోదావరి గుల్దస్తా! ( పూల గుత్తి)
సాల్ గిరా ముబారకులతో

నీ మిత్రుడు ....
- సుధాకర్ భాయ్ ఎండ్లూరి.

క్యాలండర్ చిరునవ్వే రోజు

------వాసుదేవ్

ఎడాదికొక్కరోజే క్యాలండర్ నవ్వేది
అక్షరం పుట్టినరోజని...

కాలం గడ్డకట్టాలనుకున్నదీరోజే
ముందుకు జరగనంటూ మొరాయింపుతో.....

అక్షరాలన్నీ మురిసిపోయేదీనాడే
తమ శతార్ధాల సృష్టికర్తకి హారమవుతూన్నవేళ!

నిముషాలు గంటలకిందుగా జారిపోతున్నప్పుడు
రోజు బాధపడిందీరోజే
కరిగిపోతున్నందుకు......
కాగితం నల్లపడ్డప్పడల్లా
అక్షరం, భావం ఆధిపత్య పోరులో
పాఠకుడి వెతుకులాటకి ప్రాణంపోసేదిక్కడే!

(అక్షర అఫ్సూర్యుడికి పద బహుమానం-- పుట్టినరోజు సందర్భంగా)జయహో...
జయహో...


- డాక్టర్ పులిపాటి గురుస్వామి

ఓ చల్లని పలకరింత
వెచ్చని ఆలింగనం
చెరగని చిర్నవ్వు

అమెరికా నుండి
ఇక్కడి దాకా
అక్షర బీజాలు చల్లుతున్న
తెలుగు కృషీవలుడు

''అ'' కారాన్ని
అలంకరించుకున్న
అందరి ప్రేమికుడు...

అక్షరమే
గుర్తింపు కిరీటం గా కల్గిన
మేధావి రత్నం
'అఫ్సర్'

జయహో...
జయహో...

జన్మదిన శుభాకాంక్షలు...
మనసారా....
Category: 4 comments

4 comments:

మరువం ఉష said...

ఒకటొకటిగా వచ్చిపడిన స్వాతిముత్యపు జల్లుల్లో, అచ్చెరువున, అమితానందపు పచ్చికబయళ్ళలో విహరించే సాహితీమిత్రులు "అక్షరపు" అఫ్సర్ గార్కి అభినందనలు/శుభాకాంక్షలు. :)

Unknown said...

అభినందనల వర్షంలో తడిసి ముద్దయినట్టున్నారుగా! ఎంతైనా ఆత్మీయుల పలకరింపులు, శుభాకాంక్షలు మన ఆయుష్షును పెంచే దీవెనెలు.

వాసుదేవ్ said...

సర్జీ!నా రచనకూడా మీ బ్లాగ్ లో చోటు"చేసుకున్నందుకు" ఆనందంగా ఉంది.ధన్యవాదాలు సర్

వాసుదేవ్ said...

సర్జీ!నా రచనకూడా మీ బ్లాగ్ లో చోటు"చేసుకున్నందుకు" ఆనందంగా ఉంది.ధన్యవాదాలు సర్

Web Statistics