వెల్చేరు “కన్యాశుల్కం” : మంచి అనువాదానికి భాష, దృక్కోణం రెండు కళ్ళు!

“కేవలం ఈ నాటకం మళ్ళీ చదవడం కోసమయినా మరో సారి ఈ కోర్సు తీసుకుంటాను. నా స్నేహితులందరికీ ఈ నాటకం చదివే అనుభవం కోసమయినా ఈ కోర్సు తీసుకోమని చెప్తాను. ఈ నాటకం చదవడం వల్ల ఆధునికతకి వున్న ప్రాంతీయ కోణం ఏమిటో నాకు తెలిసి వచ్చింది. ఇంగ్లీషు – అమెరికన్ సాహిత్య సంస్కృతుల్లోంచి మాత్రమే తెరుచుకున్న నా కంటికి ఇది కొత్త చూపునిచ్చింది,” అని కేస్లీ బాక్స్ అనే వొక అమెరికన్ అండర్ గ్రాడుయేట్ విద్యార్థిని గురజాడ “కన్యాశుల్కం” అనువాదం “గర్ల్స్ ఫర్ సేల్” చదివాక తన ప్రతిస్పందనగా రాసింది. ఆ స్పూర్తితో ఆ అమ్మాయి నాతో మూడేళ్ళ పాటు తెలుగు భాష కూడా నేర్చుకుంది.

తెలుగు భాషతో పాటు, టెక్సాస్ యూనివర్సిటీలో దక్షిణాసియా సాహిత్యం మీద ప్రతి ఏడాది రెండు కోర్సులు చెప్పాలని మా శాఖ అడిగినప్పుడు ఎంతో కొంత తెలుగు సాహిత్య అనువాదాలని కూడా ప్రవేశ పెట్టాలని అనుకున్నాను. అట్లా అనుకోవడం తేలికే గాని, దాన్ని ఆచరణలో పెట్టడం అంత తేలిక కాదని నెమ్మదిగా అనుభవమయ్యింది. మిగిలిన దక్షిణాసియా భాషల నించి అనువాదాలు ఎంపిక చేసుకోవడం నాకు పెద్ద కష్టం కాలేదు. కానీ, తెలుగు అనువాదాల విషయంలో అది చాలా కష్టమయ్యింది.

దక్షిణాసియా సాహిత్యం అనగానే హిందీ, ఉర్దూ, బంగ్లా సాహిత్యాల అనువాదాలు మాత్రమే ఎక్కువగా వాడడం ఇక్కడి విశ్వవిద్యాలయాలలో ఆనవాయితీ. ఆ భాషల నించి ఎక్కువ మంది పరిశోధకులు రావడం వల్లా, ఆ భాషలలొ అందుబాటులో వున్న విస్తారమయిన అనువాదాల వల్ల, దక్షిణాసియా అనగానే ఆ మూడు భాషలు మాత్రమే అన్న అభిప్రాయం ఇక్కడి యూనివర్శిటీలలో బలంగా నాటుకుపోయింది. దీనికి భిన్నంగా కొంత దక్షిణ భారత సాహిత్యాన్ని, మరీ ముఖ్యంగా తెలుగు సాహిత్యాన్ని అనువాదాల రూపంలో అయినా విద్యార్థుల చేత చదివించాలన్నది నా పట్టుదల. దీనికి మొదటి అడ్డంకి: తెలుగు నుంచి ఇంగ్లీషులోకి తగినన్ని మంచి అనువాదాలు లేకపోవడం; రెండో అడ్డంకి: అనువాదాలు వున్నా అవి ప్రపంచ పటం మీద నిలబెట్టినప్పుడు వాటి గురించి ఎట్లా వివరించడం అన్నది. అంటే, మంచి అనువాదం వున్నంత మాత్రాన్న సరిపోదు, ఆ రచన వొక ప్రాంతంలో గొప్పదే అయినప్పటికీ, ప్రపంచ సాహిత్య పటం మీద దాని స్థానాన్ని ఎట్లా చర్చించాలన్నది కూడా ముఖ్యం. అంటే, వొక విధంగా అది మంచి అనువాదం అయినంత మాత్రాన్నే సరిపోదు, అది ఏ వాదనతో రచనారూపం పొందిందన్నది కూడా అవసరమే. మౌలికంగా అది మంచి అనువాదం అయితే తప్ప, ఆ అనువాదం చుట్టూ అనువాదకుల వ్యాఖ్యానాలకి ఆట్టే విలువ వుండదు. క్లుప్తంగా చెప్పాలంటే, మంచి అనువాదానికి భాష వొక కన్ను, దృక్కోణం రెండో కన్ను. అందునా, పరదేశంలో పరభాషా విద్యార్థులకి పాఠాలు చెప్పే సాహిత్య అధ్యాపకుడిగా నా మటుకు నాకు ఆ అనువాదంలోని ఇంగ్లీషు చాలా ముఖ్యం. అనువాదంలో ఎట్లాంటి ఇంగ్లీషు వాడారు, ఆ ఇంగ్లీషు ఎంత వరకు ఇక్కడి విద్యార్థులకి అర్థమవుతుందన్నది వొక విషయమయితే, అది అనువాదం అనిపించక స్వంతంత్ర రచనే అనిపించే పఠనీయత మరో సవాలు. ఇవి రెండూ వొక దానితో వొకటి ముడిపడి వున్న విషయాలు. గురజాడ “కన్యాశుల్కం” తెలుగులో పలు మార్లు చదివి, పలవరించిన అనుభవం వున్న అధ్యాపకుడికి ఇది మరీ కత్తి మీద సాము. దాన్ని నాటకంగా రంగస్థలం మీదా, సినిమాగా తెర మీదా చూసిన అనుభవం, ఆ రచనతో ఆ అధ్యాపకుడికి ఇంకాస్త వ్యక్తిగత మమకారం కూడా తోడవుతుంది. అలాంటి పరిస్థితిలో అధ్యాపకుడిగానే కాక ఇతరత్రా కూడా తృప్తి కలిగితే తప్ప ఈ అనువాదాన్ని కోర్సులో పాఠంగా న్యాయం చేయలేం. గురజాడ వారి “కన్యాశుల్కం” కి నారాయణ రావు గారి అనువాదం “గర్ల్స్ ఫర్ సేల్” వొక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టి, నాలుగేళ్లు వరసగా ఈ రచనని బోధిస్తున్న అధ్యాపకుడిగానే కాక, ఆ రచన పట్ల, తెలుగు సాహిత్యం లో దాని వారసత్వం మీద మమకారం వున్న వ్యక్తిగా ఈ అనువాదం నాకు వొక మైలు రాయి. ఈ మాట నేను అనుకోవడం కాకుండా, నా విద్యార్థులతో అనిపించడం కాస్త గర్వ కారణం కూడా. పైన నా విద్యార్థిని చేసిన వ్యాఖ్యలో రెండు ముఖ్యమయిన అంశాలున్నాయి. ఒకటి: అనువాదంలోని భాషతో ఆ విద్యార్థిని పూర్తిగా మమేకం అవ్వడం; రెండు: రచన నేపధ్యంగా అనువాదకుడు ఆధునికతకి సంబంధించి అందించిన కొత్త కోణంలోని లోతుల్ని తను కూడా చూడగలగడం. ఇందులో మొదటి విషయం అనువాద విజయానికి సంబంధించింది, రెండోది – ప్రపంచ సాహిత్య పటం మీద ఆ నాటకాన్ని నిలబెడుతూ అనువాదకుడు అందించిన దృక్కోణానికి సంబంధించింది. ఈ రెండు అంశాలు యూనివర్సిటీ చదువుల పరిధిలోనే కాదు, తెలుగు సాహిత్య పరిధిలో కూడా చర్చించదగినవే. ఏది మంచి అనువాదం అవుతుందన్నది మౌలికమయిన ప్రశ్న. నిస్సందేహంగా అనువాద లక్ష్యం, లక్ష్య భాషని బట్టి ఈ ప్రశ్నకి సమాధానం వుంటుంది. లక్ష్య భాష విశ్వ భాషే అయినా, ఈ ప్రశ్నకి వొకే విశ్వజనీన సమాధానమూ సాధ్యం కాదు. ఇంకా కొంత ఉన్నత స్థాయిలో, సంస్కృతిని మనం ఎట్లా అర్ధం చేసుకుంటున్నాం అనే అంశంపై కూడా అది ఆధారపడి వుంటుంది. ప్రసిద్ధ తత్వవేత్త మర్తా నస్బమ్ ఇటీవల అన్న వొక మంచి మాట అనువాదాలకి కూడా వర్తిస్తుంది : “ఇప్పుడు ఏ విషయన్నయినా అర్ధం చేసుకోవాలంటే, మనం అలవాటు పడి వున్న/ మనలో జీర్ణించుకుపోయిన కొన్ని లక్షణాలని అధిగమించి వొక బహుళ సాంస్కృతిక చైతన్యంతో ఆలోచించడం నేర్చుకుంటే తప్ప ఇప్పటి మార్పు అర్థం కాదు.” తెలుగు సాహిత్యంలో అనువాదాల గురించి జరుగుతున్న చర్చలు ఇంకా మన పాత అలవాట్లతో నిండి వున్నవే. ఇటీవలి అత్యాధునిక సాధనాల వాడకం వల్ల, ఇంగ్లీషు అనువాదాల వ్యాప్తి వల్లా, మన ఇంగ్లీషు కొంత తేటపడే దారిన వున్నా, ఈ ఇంగ్లీషు ఇప్పటికీ సర్కారీ ఆఫీసుల దరఖాస్తులకు, లేదంటే వకీళ్ల భాషకి దాటి ముందుకు వెళ్లలేదన్నది కొంచెం కటువయిన వాస్తవం. మన ఇంగ్లీషు అనువాదాలు బ్రిటిష్ వలస వాద సాహిత్య వ్యూహంలోనే ఇప్పటికీ బందీలు! నారాయణరావు గారి అనువాద కృషిని సరిగా అర్థం చేసుకోవాలంటే, మనలో జీర్ణించుకుపోయి వున్న ఆ భాషాపరమయిన అలవాట్ల నించి బయట పడాలి ముందు. వర్తమాన ఇంగ్లీషు మాట్లాడే భాషగా ఎట్లాంటి రూపం పొందుతున్నదో అర్థం చేసుకోగలగాలి. ఈ స్థితిలో మాండలికం కూడా తోడయిన “కన్యాశుల్కం” లాంటి బహుళ సాంస్కృతిక వాచకాన్ని ఇంకో భాషలో – ఈ సందర్భంలో ఇంగ్లీషులో- అర్థం చేసుకోవడం కష్టమే. అదనంగా, కన్యాశుల్కంలో వున్నది కేవలం మాండలికం కాదు, అందులోని భాష తెలుగు సంస్కృతి వొక ఆధునికతని సంతరించుకుంటున్న సంధి భాషకి కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. “కన్యాశుల్కం” విషయంలో ఆ మాండలికం/ ఆ ఆధునిక సంధి భాష ఎట్లా అనువదించాలన్నది కూడా పెద్ద సందేహమే. “కన్యాశుల్కం” లాంటి సందిగ్థ కాల రచన విషయంలో అనువాద న్యాయాన్ని తేల్చడం అంత తేలిక కాదని చెప్పడమే ఇక్కడ నా వుద్దేశం. మక్కీ కి మక్కీ అనువాదమే కోరుకుంటే, ఈ అనువాదం మాండలికం దగ్గిరే చతికిలబడుతుంది. మాండలికాన్ని దాటి వొక స్పష్టమయిన ఆధునిక దృక్కోణాన్ని, వలసవాద వ్యతిరేక “స్వరాన్ని” వినిపించడానికి గురజాడ ఈ రచనని వాహిక చేసుకున్నాడు. ఈ విషయం అర్థం కావడానికి అసలు గురజాడ కోణం నించి భాషనీ, ఆధునికతనీ మరో సారి ఆలోచించుకోవాల్సిన అవసరం వుంది. అప్పటి నుంచి ఇప్పటి దాకా గురజాడ నామస్మరణ లేకుండా మనకి ఆధునికత చర్చ లేదు. కానీ, గురజాడ ఆధునికత అనేది మౌలికంగా ఐరోపా-కేంద్రిత/ లేదా బ్రిటిష్-కేంద్రిత ఆలోచన కాదన్నది మనకి ఇప్పటికీ అర్థం కాలేదన్నది నిజం. ఆ రెండిటికీ భిన్నంగా గురజాడ చేస్తున్న స్థానిక ఆధునికతలొంచే ఆయన కొత్త భాషా, కొత్త ఆలోచనా పుట్టాయి. ఈ సిద్ధాంత పునాది మీంచి నిర్మించిన అనువాదం నారాయణరావు గారి “గర్ల్స్ ఫర్ సేల్.” పది పదిహేనేళ్ళ కింద కూడా నారాయణ రావు గారు వొక తెలుగు రచనని అంతర్జాతీయ పఠితకి పరిచయం చెయ్యాలంటే, తెలుగు అనేదొక భాష అని కూడా పరిచయం చేయాల్సి వచ్చేది. ఆయన డేవిడ్ షుల్మన్ తో సాగిస్తూ వచ్చిన నిరంతర అనువాద కృషి వల్ల ఇవాళ ఆ అవసరం తప్పిందంటే అతిశయోక్తి కాదు. ఆ కృషి ఫలంగా ఇవాళ అమెరికాలోగానీ, యూరప్ లో గాని తెలుగు భాషకి పరిచయం అక్కరలేదు. అందుకే, వారి మిగతా అనువాదాలకి భిన్నంగా “గర్ల్స్ ఫర్ సేల్” అనువాదంలో తెలుగు భాష పరిచయానికి సంబంధించి అంత కంఠశోష పడక్కర్లేకపోయింది. పాతికేళ్లుగా మొదటి నించీ నారాయణ రావు గారు స్వయంగా చేసిన అనువాదాలు కానీ, డేవిడ్ షుల్మన్ తో కలిసి చేసిన రచనల్లో కానీ, అనువాద విధానం గమనించిన వారికి అది వొక క్రమ పద్ధతిని అంటిపెట్టుకుని వుందని అర్ధమవుతుంది. తెలుగు భాష అంటే అసలేమీ తెలియని అంతర్జాతీయ పఠితకి వొక తెలుగు రచనని ఎట్లా అందించాలన్నదే ఆ పద్ధతిని నడిపించే సూత్రం. అట్లాగే, కేవలం అనువాదంతోనే సరిపెట్టుకోవడం కాకుండా, మొత్తంగా సాహిత్య ప్రపంచంలో ఆ రచన స్థానాన్ని బేరీజు వేసే వొక వాదనా, విశ్లేషణా ప్రతి అనువాదంలోనూ కనిపిస్తాయి. ఈ వెనక మాటలు విడివిడిగా తెలుగులోకి అనువాదమయినా అవి సాహిత్య విమర్శకి సంబంధించిన బౌద్ధిక క్రమశిక్షణని నేర్పిస్తాయి. “కన్యాశుల్కం” అనువాదంలో కూడా అదే తనదయిన పద్ధతిని ఆయన అనుసరించారు. ఈ అనువాదం గురించి ఆయన మాటల్లోనే - Translating Apparao into English is a challenge…..Every character in the original speaks in a dialect of Telugu specific to his or her caste, social status, gender, educational level, and individual style. Determined to use to spell every word as it is spoken in real life, Apparao took care to spell every word as it is pronounced by the character. He even made a few orthographic innovations to indicate the precise sounds. I made no effort to reflect the dialect variations in my translation. ఇంగ్లీషులోకి ఏది వెళ్తుందో, ఏది వెళ్లదో వొక స్పష్టమయిన ప్రకటన చేసి, తరవాత రచనలోకి తీసుకువెళ్లారు అనువాదకుడు. తెలుగు మాత్రమే బోధించే సాహిత్య కోర్సులలో ఇది పెద్ద సమస్య కాదు, కానీ, ఇంగ్లీషు ద్వారా సాహిత్యాన్ని బోధించే స్థితిలో ఆ రచన ప్రభావం కొంత మేరకే వుంటుంది. ఇది పఠనానికి కూడా వర్తిస్తుంది. మూలం చదివే సౌకర్యం వున్న ప్రతి సందర్భంలోనూ అనువాదం ఎంతో కొంత అసంతృప్తి మిగుల్చుతూనే వుంటుంది. ఆ వాస్తవికతని గుర్తిస్తూనే, మూలంలోని ఆ పరిమళాన్ని పూర్తిగా కాకపోయినా, వీలయినంత మేరకు తీసుకు రావడమే అనువాదకుడి పని. ఈ విషయం గమనించిన వొక విద్యార్థిని ఏమందో చూడండి: “నేను తెలుగు నేర్చుకుంటే ఎంత బాగుంటుందో! అప్పుడు ఈ నాటకంలోని భాష పూర్తిగా నాకు తెలిసేది కదా! అది నా ఆశ గానీ, ఇంగ్లీషులో – మా ఇంటి భాషలో- చదువుతున్నప్పుడు కొన్ని సన్నివేశాలు మా ఇంటి రంగస్థలంలో వూహించుకొని నాలో నేనే నవ్వుకున్న సందర్భాలు ఎన్నో! ఈ అనువాదంలో వాడిన ఈ భాష, ఈ నుడికారం అచ్చంగా నావే! వాటిని చెప్పడానికి ఇంకో యాస ఏమయినా దొరుకుతుందా, ఇంకో విధంగా ఆ వాక్యాల్ని తిరగ చెప్పగలనా అని కొన్ని సార్లు ప్రయత్నించాను. కానీ, ఇంత కంటే మెరుగయిన భాష నాకు దొరకలేదు,” అని అదే కోర్సులో ట్రాన్స్ లేషన్ స్టడీస్ పైన థీసీస్ రాసిన లారా క్లార్క్ అనే ఇంగ్లీషు డిపార్ట్మెంట్ పీఎచ్ డీ విద్యార్థిని తన ప్రెసెంటేషన్ లో చెప్పింది. (ఈ కోర్సు రీడర్ రెస్పాన్స్ థియరీ ప్రాతిపదికగా రూపొందించింది కావడం వల్ల విద్యార్థులు ముందే కొన్ని ప్రేసెంటేషన్లు చేసే వారు. విద్యార్థుల స్పందనల్ని చర్చకి పెట్టి, తరవాత నేను లెక్చర్ ఇచ్చే వాణ్ని) ఇలాంటి కోర్సులలో అనువాదాలు వుపయోగించినప్పుడల్లా – అది భగవద్ గీతకి బర్బరా స్టోలర్ మిల్లర్ అనువాదం కావచ్చు, మను ధర్మ స్మృతికి పాట్రిక్ అలివేల్ అనువాదం కావచ్చు, అనంతమూర్తి ‘సంస్కార’కి రామానుజన్ అనువాదం కావచ్చు, మహాశ్వేత కి గాయత్రి స్పివక్ అనువాదం కావచ్చు - భాష మీదా, నుడికారం మీదా చర్చ తప్పక జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడి విద్యార్థులకి, పండితులకి ఆయా భాషలు ఎట్లా పని చేస్తాయన్నది అత్యంత ఆసక్తికరమయిన ప్రశ్న, వొక తెగని అన్వేషణ. వొక అనువాదం చూపిస్తే, ఇంకో మూడు నాలుగు అనువాదాలు వెతికి పట్టుకొని సరిపోల్చుకుంటూ భాషా చర్చ చేయాలన్న కుతూహలం వాళ్ళది. ఇలాంటి సందర్భంలో అనువాదం సరిగా లేకపోతే, మొత్తంగా కోర్సు అభాసు పాలు అవుతుంది. “కన్యాశుల్కం” ఇంగ్లీషు అనువాదం ఇప్పటి దాకా ఈ కోర్సులలో కనీసం మూడు వందల మంది చదివి వుంటారు. ఆ మూడు వందల మందికీ అమెరికన్ ఇంగ్లీషు ఇంటి భాష, అమ్మ భాష. ఇందులో భాష పంటి కింద రాయిలా తగులుతోందని ఇప్పటి వరకూ వొక్క వ్యాఖ్య కూడా నేను వినలేదు. ఆ మేరకు నారాయణరావు గారి అనువాదం వొక విజయమే నాకు. •
Category: 1 comments

1 comments:

వాసుదేవ్ said...

ఈ బర్నింగ్ టాపిక్ పై మీ స్పందన మీ అభిప్రాయాలన్నీ క్షుణ్ణంగా చదివాను.కానీ మీతో ఏకీభవించలేను.రెండేళ్ళకిందట ఓ పుస్తకాల షాపులో ఈ పుస్తకంచూసి, రచయిత పేరుచూసి వెంటనే చేతులోకితీసుకుని రెండుమూడుపేజీలు తిరగేసి సొమ్మసిల్లిపడిపోయినంత షాక్.నేను ఇక్కడ చాలా విషయాలు చర్చించదల్చుకోలేదు. నామట్టుకు నాకన్పించినవే చెప్పదల్చుకున్నాను. ఒకేవొక విషయం--భాషలో "connotational usage" గురించి మీకు ప్రత్యేకించి చెప్పఖ్ఖర్లేదు. టైటిలోనే ఇది ఫెయిల్. కన్యాశుల్కం అనే పదంలో "పెళ్ళికి" అనే అర్ధం ప్రస్ఫుటంగా ఉంది. కానీ "గర్ల్స్ ఫర్ సేల్" అన్నదాంట్లో ఆ అర్ధమేదీ స్ఫురించకపోగా ఇంగ్లీష్ నేటివ్ స్పీకర్స్ కీ అదేంటో వివరించాల్సిన అగత్యంలోకెళ్ళిపోయిందీ అనువాదం కాని అనువాదం. తెలుగువాడిగా, ఆంగ్లోపధ్యాయుడిగా ఈ రెంఊ భాషల సాధకబాధకాలన్నీ తెల్సినవే--అని అనుకుంటున్నాను. భారతదేశ నేపథ్యంగా వొచ్చిన ఈ టైటిల్ చేసిన పరాయిదేశంవాడికెవ్వరికైనా "గర్ల్స్ ఫర్ సేల్ ఫర్ ప్రాస్టిట్యూషన్?" అనే సందేహం రాకమానదు.(స్లమ్ డాగ్ మిలీయనీర్ సిన్మా ప్రకారమైనా ఇలానే భారతదేశంలోని సోషల్ ఎట్రాసిటీస్ గురించిన భావన ఉన్న వీదేశీయులకి)..కానీ కన్యాశుల్కంలో అలాంటి భావమేమీలేదు, కేవలం కట్నానికి వ్యతిరేకపదంగా తప్ప. టైటిల్లోనే ఫెయిలన ఈ అనువాదం ఖచ్చితంగా రెండుభాషలు తెల్సిన పాఠకుడికి మాత్రం చేదుమాత్రే!..ఇక మీ విద్యార్ధుల స్పందనంటారా? ప్రతి పాఠకుడి దగ్గరకీ ఈ పుస్తకంతో పాటు ఓ అఫ్సరో ఓ నారాయణరావో వెళ్ళరు కదా.....

Web Statistics