Sunday, January 7, 2018

మన కాలపు సూఫీ

-వాడ్రేవు చినవీరభద్రుడు
~
అఫ్సర్‌ నాకు తమ్ముడు. ఇద్దరం దాదాపుగా ఒకేకాలంలో కవిత్వం రాయడం మొదలుపెట్టాం. పోయిన శతాబ్దంలో ఎనభైల్లో మేం లోకంలోకి మేల్కొన్నప్పుడు ఒక్కలాంటి ప్రశ్నలే ఎదుర్కొన్నాం, దాదాపుగా మేం వెతుక్కున్న సమాధానాలూ ఒక్కలాంటివే. మూడు దశాబ్దాలపైబడ్డ ఈ ప్రయాణంలో మా దారులు వేరైనా, అతడి అడుగుజాడలు నేనూ, నా అడుగుజాడలూ అతడూ, ఒకరినొకరం, పరికిస్తూనే వున్నాం. అతడు కూడా కథలు రాసాడు, సాహిత్యానుశీలన చేసాడు, అన్నిటికన్నా ముఖ్యం కవిత్వసాధన వదలకుండా కొనసాగిస్తూనే ఉన్నాడు. నాకు మరింత ఆరాధనీయమైన సంగతి అతడు సాహిత్యాన్ని బోధిస్తూండటం, అది కూడా సముద్రాలకవతల. పల్లెనుంచి పట్నానికి, పట్నం నుంచి మహాపట్నానికి, మహాపట్నం నుంచి ఖండాంతరానికీ సాగిన అతడి ప్రయాణంలో ఒక్క క్షణం కూడా కవిత్వాన్ని మరచింది లేదని ఈ కవితలు సాక్ష్యమిస్తున్నాయి.

2

ఈ కవితలు చాలావరకు 2009 నుంచి నిన్నమొన్నటిదాకా రాసిన కవితలు. ఈ కవితలు తెరవగానే మనకి రూమీ వాక్యాలు కనిపిస్తాయి. అందులో, ఆయన తాను చెప్పేదంతా– తన మిత్రుడూ, తన గురువూ, తన కవిత్వసూర్యుడూ అయిన తబ్రీజీ చెప్తున్నదేననీ, తాను కేవలం అతడి మాటలు ప్రతిధ్వనిస్తున్నానని మాత్రమే అంటున్నాడు. ఈ మాటల్తో ఈ కవిత్వాన్ని తెరవడం గొప్ప అనుభవం, కొత్త అనుభవం.
మౌలానా జలాలుద్దీన్‌ రూమీ, ఆయన మిత్రుడు షమ్షుద్దీన్‌ తబ్రీజీ ప్రవక్త మహమ్మద్‌ మాటలకి సజీవ ఉదాహరణలుగా జీవించడానికి ప్రయత్నించారు. ‘ఒక విశ్వాసి మరొక విశ్వాసికి దర్పణంగా ఉంటాడు’ అన్న హడిత్‌ వాళ్ళ హృదయాల్ని వెలిగించింది. ఒకరిలో ఒకరు తమని తాము చూసుకున్నారు. ఆ నిర్లేప, నిరంజన దర్శనంలో వారు అన్ని కాలాల్లోనూ, అన్ని దేశాల్లోనూ, అన్ని అవస్థల్లోనూ జీవిస్తున్న మానవులందరి వదనాలూ చూడగలిగారు. ఇదే కవిత్వం. ఇదే మతం. అందుకనే టాగోర్‌ జీవితకాల కవిత్వసాధన తర్వాత, తనది కవుల మతమన్నాడు.
రూమీ స్నేహితుడెవరో మనకి తెలుసు. కానీ, అతడి మాటలే తనలో ప్రతిధ్వనించాక, ఆ స్నేహితుడు ఒక మానవమాత్రుడిగా మిగిలిపోక, ఈశ్వరసమానుడిగా మారిపోయేడు. మరి, ఈ కవితల్లో కవి ప్రతిధ్వనిస్తున్నదెవరిని?
ఈ ప్రశ్నకి ఎవరికి వారుగా సమాధానం వెతుక్కోవలసి ఉంటుంది. నాకు స్ఫురించినదేదో నేను చివర్లో చెప్తాను. కాని, అదెవరో అన్వేషించడానికి ముందు, ఆ వ్యక్తితో, ఆ హృదయంతో కవి చేస్తున్న సంభాషణ ఏమిటో నేను కొంత వివరించవలసి ఉంటుంది.
సంభాషణ. అవును, అదే సరైన మాట. ఈ కవిత్వమంతా ఒక ఎడతెగని సంభాషణ. అంతేకాదు, రూమీ కవిత్వానికి వచ్చిన ఒక ఇంగ్లీషు అనువాదానికి ముందుమాట రాస్తూ ఒక భావుకుడు ఆ కవితల్ని ‘పాటలూ, ఆత్మశోధనలూ, దేవుడితో రూమీ చేసిన సంభాషణలూ’ అన్నాడు. అతడు వాడిన పదం interrogation. దాన్ని నేను ఆత్మశోధన అంటున్నాను. అంటే, కవిత్వం ఏకకాలంలో రెండువైపుల సంభాషణ. అది తనతో చేసేదీ, లోకంతో చేసేదీ కూడా. దాన్నే చలంగారు ‘అంతర్‌ బహిర్‌ యుద్ధారావం’ అన్నాడు. రూమీ తనతో సంభాషించుకున్నాడు. తన మిత్రుడితో సంభాషించుకున్నాడు. తనతో తాను చేసుకునే సంభాషణ తనలోని లఘుపార్శ్వాన్ని శోధించుకోవడంగా, మిత్రుడితో సంభాషణ తన గురుపార్శ్వంతో సంభాషణగా మొదలై, చివరికి, రెండూ ఒకటిగా మారిపోయి, తను అంతరించి, గురువొక్కడే మిగలడం రూమీ కవిత్వప్రయాణం.
కవి బయటి ప్రపంచంతో చేసే సంభాషణ ‘డ్రమటిక్‌ మోనోలాగ్‌’గా, తనతో తాను చేసుకునే సంభాషణ ‘ఇంటీరియర్‌ మోనోలాగ్‌’గా మనకి పరిచితమే. కాని, తనతో తాను చేసుకునే సంభాషణ తనని తాను interrogate చేసుకునేటంత తీవ్రంగా ఉండకపోతే, దాని పర్యవసానంలో తనని తాను annihilate చేసుకోకపోవడంగా మారకపోతే, ఆ కవిత్వం నిజమైన కవిత్వంగా పరిణమించదు. ఆ అహం నిర్మూలన, దాన్ని సూఫీలు ‘ఫనా’ అన్నారు.
ఫనా అంటే జీవించి ఉండగానే మరణించడం. మరణించి జీవించడం. జీవితం కొనసాగుతుంది, కాని అహం స్ఫురణ ఉండదు. తాను మిగలడు, దివ్యప్రేమావేశం మాత్రమే కొనసాగుతుంది.
అందుకనే ఈ సంపుటిలో ‘ఫనా’ అనే ఒక కవిత కనిపిస్తే నాకు ఆశ్చర్యం కలగలేదు. రూమీని స్మరిస్తూ మొదలైన కవిత్వం ఫనాకి చేరుకోవడంలో ఆశ్చర్యం లేదు కదా. అక్కడ కవి అంటున్నాడు:
ఎన్ని దూరాలు కలిపితే
వొక అస్థిర బైరాగినవుతానో
ఎన్ని తీరాలు గాయాలై సలిపితే
వొక నిర్లక్ష్య సూఫీనవుతానో!
ఇదీ వొక ఆటే కదా నీ చుట్టూ
నేను బొంగరమయి తిరగడానికి
ఇది సమకాలికుడైన ఒక తెలుగు కవి రాసిన వాక్యాలంటే నమ్మటం కష్టం. తీవ్ర భావుకతలో మిస్టిక్‌గా మారే ఒక పిపాసి మాత్రమే మాట్లాడగల మాటలు. ఎందుకంటే, ఇది ప్రేమ కవిత్వం కాదు. ప్రేమ అంటే సామాజిక సాహచర్యానికి దారితీసే ప్రేమ అన్న అర్థంలో ప్రేమకవిత్వం కాదు. అందుకు ఈ మాటలే సాక్ష్యం:
ఆడుకుంటున్నా నాలో నేను
నీతో నేను
నీ వూహ ఒక సాకు నాకు
ప్రేమ అంటే ఇద్దరు కాక ఒకరు మాత్రమే మిగిలే అనుభవమనుకుంటేనే ఈ వాక్యాలకు అర్థముంటుంది, కాని, ఇది ఎదుటి మనిషిని (అదర్‌ను) నిర్మూలించే ‘నేను’ (సెల్ఫ్‌) కాదు. తనో, ఇతరుడో, ఎవరో ఒకరు మటుకే జీవించవలసి వస్తే, ఎదుటి మనిషికి చోటిచ్చి తాను తప్పుకునే మనఃస్థితి కోసం చేసే ప్రయాణం. ఒకప్పుడు గురజాడ ఇట్లా అనగలిగాడు:
ఉసురులకు విసికితివొ; యుద్ధము
కలదు; దేశము కొరకు పోరుము’
యుద్ధమా, ఇకనేమి లోకము!
చాలు! చాలును! లంగరెత్తుము
అక్కడ ‘నీ ఊహ’ ఒక సాకు అయినట్టే, ‘నేన’నే భావన కూడా ఒక సాకు. నిజానికి అక్కడ ఇద్దరు లేరు, ఉన్నదొక్కరే, అందుకనే ఆ కవితనిట్లా ముగిస్తాడు:
కొలమానాలన్నీ గాల్లోకి
చిలిపిగా విసిరేసి
నీ లోపల శిథిలమయిపోనీ నిబ్బరంగా
ఫనా, అంటే, self annihilation అనే మాటకి ఈ కవి ఇచ్చిన తెలుగు పరిభాష ‘నిబ్బరంగా శిథిలమయిపోవడం!’
ఫనా కవిత ఈ సంపుటికి తాళం చెవి. ఈ కవిత చూపించిన వెలుగులో చదివినప్పుడు, మొత్తం కవితలన్నీ అఫ్సర్‌ చేస్తున్న ప్రయాణాన్ని కొత్తగా చూపిస్తాయి. ఇంతకుముందు మనకి పరిచయమైన మాటలే, ఆ భావనలే, అవి మన సమకాలిక సామాజికార్థాన్ని, వైయక్తిక వేదనని స్ఫురింపచేస్తూనే అంతకన్నా ఉన్నతమైన మరొక భూమికలోకి మనల్ని లేవనెత్తుతాయి.
ఈ సంపుటి శీర్షిక ‘ఇంటివైపు’ అన్నదే చూడండి. 80ల తర్వాత కవిత్వం రాసిన ప్రతి ఒక్కరూ; తమ ఇంటి గురించీ, బాల్యం గురించీ, తమ గ్రామం గురించీ రాయకుండా ఉండలేకపోయారు, ఈ కవితో సహా. ఇప్పుడు మళ్ళా అతడు ‘ఇంటివైపు’ అంటున్నప్పుడు, ఆ ఇల్లు కేవలం స్వగృహం మాత్రమే కాదనీ, అతడిదే అయిన ఒక ఆత్మగత ప్రపంచానికి ప్రతీక అనీ బోధపడుతోంది.

3

ఈ కవితలన్నిటిలోనూ ఒక జ్ఞాపకం ఉంది. ఆ జ్ఞాపకాన్ని పదేపదే స్మరించుకోవడం ఉంది. సూఫీ పరిభాషలో ఈ స్మరణని ‘ధిక్ర్‌’ అంటారు. అంటే స్మరణ. నిరంతర స్మరణ. అప్రయత్న స్మరణ.
స్మరణ గొప్పదా, ధ్యానం గొప్పదా అని అడిగితే ప్రవక్త, స్మరణనే గొప్పదన్నారు. నిజానికి సర్వేశ్వరుడు మానవుడికిచ్చిన మాట ఏమిటంటే ‘నువ్వు నన్ను తలుచుకో, నేను నిన్ను తలుచుకుంటాను’ అని. ధ్యానంలో ఎంతో కొంత సంకల్పమూ, ప్రయత్నమూ ఉంటాయి. కాని స్మరణ అప్రయత్న సిద్ధి. అందుకనే, ఫనాని చేరుకోవాలంటే ధిక్ర్‌ గుమ్మంగుండానే అని సూఫీలు నమ్ముతూ వచ్చారు.
ఈ కవిత్వమంతా, ఆ అప్రయత్న స్ఫురణ, స్మరణతో పొంగిపొర్లుతోంది. కొన్ని సార్లు అది, చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా, ఇంద్రియాలకు అందేదిగా ఉంటుంది:

అవున్నిజంగానే వెళ్తాను నాలోకి
ఆ చిన్నప్పటి పొలంలో రాలిపడిన రేగిపళ్ళ వాసనలోకి
ఇప్పుడింక గుర్తొస్తుంది చిన్నప్పటి నా చింతకాని
ఏం వెతుక్కుంటావో, అలసిపోయేంతదాకా
ఆ వూరి చివర చెట్ల మంచుతెరల మధ్య
పట్టా పక్కన వూరు
ఎక్కడయినా ఎప్పుడయినా ఒకటే
దాని ప్రతి మాటా
రైలు కూతల్లో ఒదిగిపోతుంది
కానీ చాలాసార్లు అది అస్పష్టంగానే ఉంటుంది. అది ఊరు కావొచ్చు, సహచరి కావొచ్చు, చిన్నప్పటి జ్ఞాపకం కావొచ్చు, లేదా తానిప్పుడు జీవిస్తున్న ఒక అమెరికన్‌ నగరం కూడా కావొచ్చు.

అయినా సరే, వెళ్ళి రావాలి ఆ మంత్రనగరికి
ఇన్ని వాస్తవ స్వప్నాల నడుమ
ఒక కలలేని నిద్ర
నిద్రరాని కల-
కునుకు కప్పుకున్న మెలకువ
వూరు మసకచీకటిలోకి
సగం కన్ను తెరిచి
మూతపెట్టుకుంది ఇంకోసారి.
చాలాసార్లు కలగాపులగంగా మారిపోయిన ‘ప్రత్యక్షం’ లోంచి ఆ పరోక్షాన్ని గుర్తుపట్టడానికి పెనగులాడుతూనే ఉంటాడు కవి.
నన్ను చుట్టుముట్టిన ఈ తెలియని ముఖాల
తెలియని చెట్ల, తెలియని ఆకాశాల, తెలియని గాలుల
కనిపించని కన్నీళ్ళ, వినిపించని ఏడ్పుల సమూహంలో నిలబడి
ప్రతి ముఖమూ నీదే అనుకుని బతిమిలాడుకుంటాను
అందుకని ఏమనుకుంటాడంటే,
వొక వూరు యింకొక వూరు ఎప్పుడూ కాదు
అప్పుడప్పుడూ వెనక్కి చూడు
దాటి వచ్చిన వూరు
ఏమంటుందో విను
అసలే నగరమయినా ఎవరికయినా ఇల్లవుతుందా?
ఏమో ఈ డౌన్‌ టౌన్‌ గుండెల్లోంచి నడుస్తున్నప్పుడు
శరీరాన్నీ, గుండెనీ కూడా
పొగమంచు, చలిచినుకులు ముసురుకున్నట్టే వుంది.
అయితే, కవి ఇట్లా పరాయీకరణ అనుభవిస్తున్నందువల్లా, తాను తనదని భావిస్తున్న లోకం ‘ప్రత్యక్షం’లో కనిపించనందువల్లా, ఈ కవిత్వాన్ని రొమాంటిక్‌ కవిత్వంగా భావించలేం. అక్కడే, ఈ కవిలోని సమకాలికత చాలా స్పష్టంగా కనిపించేది. చూడండి:

ఆ మాటకొస్తే ఎన్ని చినుకులు కలిస్తే
వొక వాన అవుతుందో కూడా తెలీదు ఈ పరాయి క్షణంలో…
కాని
మళ్ళీ మళ్ళీ
వొక తెల్లవారు జాము వానలో తడుస్తూ
ఇల్లూ ఊరూ వదిలి
పరిగెత్తుతూనే వుంటాను, ప్రపంచం వేపు
ప్రపంచం వైపు పరుగెత్తకుండానూ, ప్రపంచాన్ని అందుకోకుండా ఉండాలనీ కాదు కవి ఆరాటం. తన పూర్వక్షణాల దగ్గరే ఆగిపోవాలని లేదు కవికి. కానీ, ఆగుతాడు, ఆగకుండా ఉండలేడు, కాని అది కాసేపే. అందుకే ఇలా అనుకుంటాడు:
ఆగిపోవడం తప్పేమీ కాదు, ఎవరో విధించిన శిక్ష కూడా కాదు
కాసేపు నిన్ను ఆపాలని ఎందుకనుకుందో జీవితం.
గడచిపోయిన జీవితం గురించి కవికి స్పష్టత ఉంది.
కాని, ఆ పోయిన కలలాంటి నిజం కూడా వుండదు.
ఆ పోయిన నిజంలోని పుప్పొడీ వుండదు
అందుకని అతడు తన ప్రయాణం కొనసాగించాలనే కోరుకుంటాడు.
లోపల వొక వెయ్యి తలుపుల ఇల్లు
ప్రతి ఇంట్లో వొక అపరిచిత లోకం-
తెరుచుకుంటూ వెళ్ళాలి చివరి తలుపేదో తెలీక-

4

సరిగ్గా, ఇక్కడే అతడికి స్మరణ ఆలంబనగా నిలబడేది. ఆ వెయ్యి తలుపుల ప్రపంచంలో తాను ఏ గదిలో ఉన్నాడో గుర్తుపట్టడానికి ఆనవాలు ఆ స్మరణనుంచే లభిస్తుంది. స్మరించడమంటే ఎప్పటికీ ఆ గతించిన క్షణాల దగ్గరే ఉండిపోడం కాదు. తాను వెతుకుతున్న ఆ వదనం ప్రత్యక్షంలో ఏ క్షణాన ప్రత్యక్షమయినా గుర్తుపట్టగలిగే నిత్యజాగరూకతతో ఉండటం…
నిన్ను నువ్వు వర్తమానంలో, ప్రత్యక్షంలో ఎట్లా గుర్తుపడతావు?
మాట ద్వారా, పాట ద్వారా అంటాడు కవి. ఆ మాట కోసం వెతుకులాటనే ఈ కవిత్వంలో సింహభాగం. ఈ కవి అన్వేషణ నిజమనీ, ప్రగాఢమనీ మనకి సాక్ష్యమిచ్చేది ఆ నలుగులాటనే. ఆ నలుగులాటని అతడు తనలోకి ప్రయాణమని చెప్పుకుంటాడు.

మిగిలిన అన్ని ప్రయాణాలూ లోకం కోసం
ఈ ఒక్క ప్రయాణమే నాదీ నా లోపలకీ అనిపిస్తుంది.
ప్రయాణాల్నిట్లా రెండుగా వింగడించుకోవడం వల్లనే ఈ కవి పాతకాలపు భావకవి కాదని మనకి తెలుస్తున్నది. ఈ లోపలి ప్రయాణపు జాడల వల్ల ఇతడు సూఫీల దారిన ప్రయాణిస్తున్నాడు, కానీ, కొత్తయుగానికి చెందిన సూఫీ అనవలసి వుంటుంది.
సూఫీలు తామెక్కడ ఉంటే, అక్కడి సామాజిక- భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టుగా తమ ఆలోచనను సవరించుకుంటూ వచ్చారు. అలాగే, ఈ కవి కూడా, ఇప్పటి కాలానికి చెందిన స్పృహ వదిలి ఎప్పుడూ కవిత్వం చెప్పాలనుకోడు.
విగ్రహాలూ, విధ్వంసాలూ, ఆత్మహత్యలూ హత్యలూ
కరువులూ నిరుద్యోగాలూ
ఆకలి కడుపులూ వీధుల మీద
పోస్టర్లయి తిరుగుతున్న మనుషులూ వూరేగింపులవుతున్న అసహనాలూ
చావుకేక వేస్తున్న పసితనాలూ
-వొక్క అరక్షణం కూడా నేనొంటరిని
వొక్కణ్ణే నేనొక్కణ్ణే అని గావుకేక వెయ్యలేను
చావులూ, ఆకలి చావులూ తెలుసు నాకు
కన్నీళ్ళూ వాటి చివర జీవన్మరణాల అనుక్షణికాల తాడుకి వేళ్ళాడే
బతుకుదప్పికలు తెలుసు నాకు
కణకణ మండే ఉద్యమ రక్తకాసారాల్లోకి
దేహాల్ని చితుకుల్లా విసిరేస్తున్న ప్రాణాలూ తెలుసు నాకు
కానీ కళ్ళముందు కనిపిస్తున్న ఈ దృగ్విషయాన్ని తన ఆంతరంగిక ప్రపంచంతో ముడిపెట్టుకోవాలనీ, తన అంతరంగంలో తనకి లభిస్తున్న ప్రశాంతితో ప్రపంచాన్ని ముంచెత్తాలనీ కవికి అపారమైన కరుణ. ఆ ప్రయత్నంలో ఎన్నో అవస్థలు.
నేను ఏ భాషలో నిన్ను చేరుకున్నానో తెలీదు
నువ్వు నాది కాసేపు కవిత్వభాష అంటావ్‌
కాసేపు మరీ ఉద్వేగాల భాష అంటావ్‌
చాలాసేపు
నేను నీకు ఎంతకీ పాలు అందని శైశవ ఆక్రోశంలా వినిపించి వుంటాను.
నా పసిభాష ఉద్వేగమై ప్రవహిస్తే
ఈ వొక్కసారికి మన్నించు
ఇంకా నాకు రానే రాని ఈ లోకపు భాష నేర్చుకోవాలి నేను
కళ్ళముందు కనిపిస్తున్న ఈ ప్రపంచం ఎంత కఠినమంటే, చివరికి, ఒక క్షణం పాటు, కవి ఇలా అనుకోకుండా ఉండలేకపోయాడు:

ఛ.. ఛ…
ఇంకేం రాస్తాం బే, కవిత్వం!
కానీ ఆ క్షణం దగ్గర ఆగిపోయినా కూడా అది ఆగిపోడమే అవుతుంది. తనని ప్రపంచం నిర్మూలించినట్టే అవుతుంది.
వొక మాట మూసుకున్న తరవాత
ఇంకేమీ తెరుచుకోవు
మాటని తెరిచి వుంచు
అక్కణ్ణుంచి కూడా, అతికష్టం మీదనైనా, అడుగులో అడుగు వేసుకుంటూనైనా, ముందుకు ప్రయాణం సాగించాలి. అప్పుడే ప్రపంచం దిశగా వేసే ప్రతి అడుగూ తనలోకి తాను వేసుకోడమవుతుంది, తనలోకి తాను వేసుకునే ప్రతి అడుగూ ప్రపంచం వైపుగా వెయ్యడమే అవుతుంది.
అందుకనే తనని గుర్తుపట్టే ప్రయత్నం ఇప్పుడు కవికి పద్యాన్ని గుర్తుపట్టే ప్రక్రియగా మారింది.
పద్యాలు ఎలా వుంటాయి
ఒక్కటే ప్రశ్న దారి పొడవునా.
కాని పద్యం ఒంటరితనంలో దొరికేది కాదు

నలుగురు కలిస్తే నాలుగు పద్యాలు
పద్యం ఎప్పుడూ వొంటరి కాదు.
కవికి తననీ, లోకాన్నీ కలుపుకోగల సంకేతస్థలంగా పద్యం కనిపించింది.
బాధ తెలిసిన పదం పద్యం అంటే
ఏడ్వనీ
ఎంత ఏడిస్తే అంత పద్యం!
ఇదొక సూక్ష్మలోక యాత్ర. కవికి తన గురించిన ఒక స్మృతి ఉంది. ఆ జ్ఞాపకం, పైకి వ్యక్తిగతంగా కనిపించవచ్చుగాక, కాని, నిజానికి అదొక సార్వజనీన జ్ఞాపకం. ఒక అతీతకాలపు స్మరణ. దాని ఆధారంగా కవి తాను ప్రపంచంతో ఏకం కాగల ఒక సంకేతస్థలాన్ని ఊహిస్తాడు, దర్శిస్తాడు, చిత్రిస్తాడు.
అక్కడ ప్రపంచమంటే కూడా ప్రపంచముఖంలో కనిపించే తనే. ఈ ‘తను’ తనకే పరిమితమయిన తాను కాదు. ఏ ఒక్కరికీ చెందనీ, అందరికీ చెందిన ఆ ‘తనని’ పట్టుకోవడం ద్వారా కవి తననీ, ప్రపంచాన్నీ కూడా పైకి లేవనెత్తుతున్నాడు.
ఈ వాక్యాలకి
ఇంత బాధ ఎక్కణ్ణించి అనే కదా మాటిమాటికి నీ ప్రశ్న!
వొకే వొక్కసారి నా నిజమయిన ఏకాంతంలోకి
నెమ్మదిగా నడిచి రా,
నువ్వు నడిచినంత మేరా!
ఈ వాక్యాల్లో ‘ఏకాంతం’ అనేది చాలా కీలకమైన మాట. ఇది ఒంటరితనం కాదు. ఒంటరితనమంటే ఒక్కడూ ఉండటమని కాదు, ప్రపంచం నీలో ప్రతిఫలించకపోవడం. అది దుర్భరమే కాదు, అవాంఛనీయం కూడా.
ఆ మేరకు నీలోపలి ‘నువ్వు’కి కూడా నువ్వు దూరమయిపోతావు. దానికి ప్రత్యామ్నాయం నలుగురితో కలిసి కాలం గడపడం కాదు. వృథాగా సాగే ఆ కాలక్షేపంలో, నువ్వూ, ప్రపంచమూ కూడా కనుమరుగైపోతారు.
కావలసింది ఏకాంతం. ఏకాంతమంటే, నీలో ప్రపంచవదనం, ప్రపంచంలో నీ వదనం సాక్షాత్కరించే సమయం. అది ప్రయత్నపూర్వకంగా చేస్తే ధ్యానం. అలాకాక, అప్రయత్నంగా జరిగితే, స్మరణం. ఆ స్మరణం వల్లనే తన వాక్యాలకి అంత బాధ అంటున్నాడు కవి. ఎందుకంటే, ఆ బాధ తన హృదయంలో ప్రతిఫలిస్తున్న ప్రపంచం బాధ కాబట్టి.

5

పాడుతూనే వున్నాడు, నస్రత్‌ ఫతే ఆలీ ఖాన్‌
-పదం మూలం తెలియక క్షోభిస్తున్న కవిలాగా
ఈ వాక్యాలు ఈ కవిత్వస్వభావాన్ని పట్టిచ్చే ఆనవాళ్ళు. ఒకటి, కవి గుర్తు చేసుకుంటున్న గాయకుడు సూఫీ గాయకుడు కావడం. రెండవది, అంతకన్నా కూడా ముఖ్యం, ఆ గాయకుణ్ణి పదం మూలం తెలియక క్షోభిస్తున్న కవితో పోల్చడం. సూఫీ కవిత్వం ప్రధానంగా సంగీతమయం. నాట్యవిస్ఫూర్జితం. సూఫీ గీతం ఏకాలంలో పద్యం, గానం, నాట్యం కూడా. అది ప్రేమపారవశ్యంతో ప్రపంచాన్ని చుట్టేసే ఒక గాఢపరిష్వంగం. ఈ కవిత్వానికి ఆ లక్షణాలు పొడసూపుతున్నట్టుగా కనిపించడం నన్నెంతో ఆశ్చర్యానికి లోను చేసింది. ‘రెండేసి పూలు ఓ చందమామా’ అన్న కవిత చూడండి, ఇక రాబోయే రోజుల్లో ఈ కవి గళం నుంచి గజళ్ళూ, గీతాలూ రానున్నాయనిపించడం లేదూ.
ఆ ఛందస్సులో చెప్తాడా లేదా అన్నది ప్రశ్న కాదు. ఉద్వేగపరంగా అతడిప్పటికే ద్రవీభూతమనస్కుడైపోయాడు. ఈ కవిత చూడండి,
వెళ్ళిపోతూ మలుపు దగ్గర కాసేపు నిలబడి చూడు
రాయాలనుకున్నదేదో నీ చూపు చివర కనలిపోయింది.
ఆదియందు మాట వుండెనో లేకపోయెనో
ఆదియందే చివరి మాట స్వప్నించనీ నన్ను.
అంతమందు మాట వుండునో వుండకపోవునో
నిన్న రాత్రి నీ కలకి అంటుకున్న కార్చిచ్చును నేను
వెళ్ళిపోతూ మలుపు దగ్గర కాసేపు నిలబడి చూడు
రాయలేనిదేదో ఒకటి దగ్ధమయ్యింది, రెప్పల తెల్లనవ్వు కింద.
గజల్‌ షేర్లని తలపిస్తున్న ఈ ద్విపదల్లో ఉన్నది సంగీతమే కదా. అంతేనా? గొప్ప గాయకుడు పారవశ్యానికి లోనయిన తర్వాత, తన పాటలో సాహిత్యాన్ని కూడా వదిలేసి, ఏదో ఒక్క పంక్తి దగ్గరే లుంగలు చుట్టుకుపోయినట్టుగా, ఈ కవి కూడా తన స్మరణ, తన ఆత్మవిస్మరణల్లో ‘అంతమందు మాట వుండునో వుండకపోవునో’ అనే మెలకువకి చేరుకున్నాడు.
ముళ్ళు విప్పుకునే కళ నేర్చుకో
త్వరపడు, ఆత్మ దేహాన్ని వదిలేముందే
ఉన్నట్టు కనిపిస్తున్నది ప్రతి ఒక్కటీ వదిలిపెట్టు
ఏది లేనట్టు కనిపిస్తోందో దాన్ని వెతికిపట్టు
అన్నాడు రూమీ.
కళ్ళముందు కనిపించేది ప్రత్యక్షం. కానీ, అది సత్యం కాదు. అది నిన్ను దారి తప్పించేదే. అందుకనే దాన్ని ‘ప్రత్యక్షపు కూటనీతి’ అన్నాడు బైరాగి. దాని వెనక ఉన్నది పరోక్షం. రూమీ మాటల్లో చెప్పాలంటే, ‘లేనట్టుగా కనిపించేది’. కానీ, అదే సత్యం. అక్కడే తనకీ, ప్రపంచానికీ కలయిక. అది నిత్యస్మరణ ద్వారా, ఆత్మవిస్మృతిద్వారా మటుకే సాధ్యం కాగల అరుదైన సమాగమం. ఇంట్లోనే నీకు గురువు దొరుకుతాడని కబీర్‌ పదే పదే చెప్పింది ఈ రహస్యమే.
ఈ ఇంటివైపు ఆ ఇంటి వైపు ప్రయాణం.
ఈ కవి మన కాలపు సూఫీ.



(12, అక్టోబరు, 2017)
(ప్రచురణ వివరాలు: ఇంటివైపు – అఫ్సర్. వాకిలి ప్రచురణ, 2017. వెల: Rs. 180/- $ 9.95 ప్రతులకు: నవోదయ, అమెజాన్, కినిగె, తెలుగుబుక్స్.ఇన్)

Monday, January 1, 2018

ఎంతెంత దూరం?

- స్వాతి కుమారి 
~

ఆటల్లో పడి ఎటెటో తిరిగి ఇంటిధ్యాస మర్చిపోయిన పిల్లాడికి, ఉన్నఫళాన అమ్మగుర్తుకొచ్చి స్నేహితుల్ని, కర్రా బిళ్ళని, మర్రి ఊడల్ని వదిలేసి ఇంటికి పరిగెత్తుతాడు. అప్పుడు వాడికి ఇల్లంటే అమ్మ.

తర్వాత్తర్వాత రెక్కలు మొలిపించుకుని, వేర్లని పెరుక్కుని బహుదూరంగా వలసపోయాక, ప్రతిరోజు వలసపోతూ ఉండటమే బతికే పద్ధతిగా మారిపోయాక;

ఇల్లంటే తను వదులుకుని వచ్చిన దేశం, ఊరు, బాల్యం.
ఇల్లంటే తన సామాజిక, సాంస్కృతిక, వ్యక్తిత్వ మూలం.
ఇల్లు ఒక ప్రతీక; పుట్టుకకి, ఎదుగుదలకి; ఎదిగిపోయాక తిరిగొస్తే మళ్ళీ పసిపిల్లాణ్ణి చేసి ఒద్దిక నేర్పడానికి.
“నగ్రీ నగ్రీ ఫిరా ముసాఫిర్ ఘర్ కా రాస్తా భూల్ గయా

……
హమే తో సబ్ కుచ్ యాద్ రహా పర్ హమ్ కో జమానా భూల్ గయా” - గులాం అలీ
మరిచిపోయిన దారిని ఒంటరిగా వెతుక్కోక తప్పదు. తనని మరిచిపోయిన వాళ్ళకి తనెవరో గుర్తు చెయ్యకా తప్పదు. మైలురాళ్ళని కౌంట్ డౌన్ చేసుకుంటూ ప్రతి మజిలీలో ఒక పద్యాన్ని నాటుకుంటూ ’ఎక్లచలోరే’ అని సాగిపోయే కవి ప్రతీ అడుగులోనూ ఒక కాందిశీకుడే. ప్రతీ మలుపులోనూ గుక్కెడు జ్ఞాపకాల కోసం దోసిలి పట్టే దాహార్తుడే.

దొరికిన చుక్కలన్నీ కలుపుకు పోతున్నా పూర్తికాని ముగ్గులా, అనుగ్రహించబడిన గాయాలన్నిటితోనూ అల్లిక వీలుకాని కవితలా, ఈ ప్రయాణం ఎప్పుడూ ఒక పలవరింతే. పలవరించే గొంతుక మాత్రం పలుకుపలుకుకీ బెంగటిల్లి పసిదై పోతుంది. జీవితకాలపు అనుభవాల అట్టడుగునించీ, వంటబట్టించుకున్న మాయమర్మపు లౌక్యపు మాటల చీలికల్లోంచి, ఒక యవ్వనపుజీరగా ఎగిసెగిసిపడుతుంది. మొహమాటాన్ని, మర్యాదల్నీ ధిక్కరించి, పలుకే బంగారమైన ప్రేయసిని పంతంగా ప్రేమిస్తూనే ఉంటుంది.

హఫీజ్ భగవంతుడితో ఇలా అంటాడు-

“పక్షులకి మొదట్లో ఎగరడం తెలీదు.
నువ్వు వాటిదగ్గర కూర్చుని పాటలు పాడావు.
నువ్వెళ్ళిపోయాక,
నీకోసమైన వాటి తపన
రెక్కలుగా మొలిచి
నింగిని తొలుచుకుపోయింది.”
బహుశా ఆర్తిని రెక్కలుగా చాపుకున్నఅ పక్షుల్లాంటివే ఇంటివైపుగా మళ్ళిన ఈ కవితలన్నీ.


గాలిలో వాటి గిరికీల గీతల వెంటపడి నడిచిపోయే అస్థిర బైరాగిలాంటివాడే ఈ కవి.
***
పుస్తకం వివరాలు:
ఇంటివైపు
కవి: అఫ్సర్
పబ్లిషర్: వాకిలి
వెల: Rs. 180/- ($ 9.95)
ప్రతులకు:
Navodaya Book House
amazon.com
kinige.com

Sunday, December 31, 2017

ఒక సూఫీ లొలొపలి --ఇంటివైపు ఒక చూపు!




                                                                    -నరేష్కుమార్ సూఫీ 

అతను ప్రేమగీతం పాడినప్పుడల్లా వారిలా అంటారు.. "బహుశా..! ఏ లోకాలనుంచో వచ్చిన కోకిల అతని గుండెకు గాయం చేసిఉంటుంది" అని, మనమూ అంతేనేమో లేదంటే మనం కూడా ఎలా పాడగలం?" --Kahlil Gibran 

1

నిజమేనేమో..! ఏ గాయమూ లేకపోతే ఎలా? ఏ వేదనా లేకుంటే ఆనందం ఏదో ఎలా తెలుస్తుంది?? ఇప్పుడు ఒకసారి "ఇంటివైపు" చూసుకోవాలి ఒకసారి.. కళ్ళతో.., కన్నీళ్లుతెచ్చుకోగల కళ్ళతో.., కథలు చెప్పగల కళ్ళతో.. 

ఎట్లా తప్పిపోయాడో ఈ పిల్లవాడు.. నల్లచేపపిల్లలా ఎన్ని సముద్రాలని దాటి వచ్చాడో.. ఏ పశ్చిమ నగరం అతన్ని భయపెట్టిందో... ఇప్పటికి ఇంటివైపు చూడాలనిపించి ఉంటుంది.. కానీ ఇప్పుడు తాను పిల్లవాడూ కాదు.. ఒకప్పటి పల్లెవాడూ కాదు.. అయ్యో..! మరిప్పుడు ఎట్లా ఏడవగలడు? మరెట్లా.. అమ్మకావాలని మారాము చేయగలడు?? హ్మ్..! ఉందిగా కవిత్వం.. ఏడవొచ్చు, భయపడొచ్చు, పసితనపు అమాయకత్వం ఒలకబోయవచ్చు.. ముఖ్యన్గా..! కాసేపు తన బాల్యంలో, తన ఇంట్లో నిండా ముతకవాసనల చిరుగు దుప్పటి కప్పుకున్న సౌఖ్యాన్ని మళ్లీ అనుభూతించుకోవచ్చు.. అందుకే ఈ చూపిప్పుడు "ఇంటివైపు"

2

"అవున్నిజంగానే వెళ్తాను నాలోకి
ఆ చిన్నప్పటి పొలంలో రాలిపడిన రేగిపళ్ళ వాసనలోకి" అనే పసితనపు పలవరింత.... ఇంటినుంచి తిరిగి వెళ్తూ...
"ఏమై వస్తానో ముందే తెలిసిపోయినట్టు ఉంటుంది..
ఏమీ తెలియనట్టూ ఉంటుంది"
అంటూ ఒక తాత్విక నిట్టూర్పు...
అఫ్సర్... చాలా మాట్లాడుకున్నాడు, ఎవరితోనో చాలానే చెప్పుకున్నాడు, ఒక మోనోలాగ్, మరో ఇంట్రావర్టిక్ ట్రావెలాగ్ రాసుకున్నాడు.. మొత్తానికి ఒక అనిర్ధారిత సత్యాన్ని ఇట్లా మనమీదకి వదిలేసాడు.. ఇప్పుడు పాఠక సమూహాలకి వెళ్లక తప్పదు ఆ "ఇంటివైపు"

3

"ఇప్పుడింక గుర్తొస్తోంది, నా చిన్నప్పటి చింతకాని.
ఇంకా తెల్లా తెల్లారకముందే
ముసురు తెరల్లో నీడల్లా దాక్కునే చెట్ల వేపు
దేహాన్నంతా చుట్టబెట్టుకొని
వూరి బయటకి నడిచి వెళ్తున్న నేను"
పచ్చిగా పైకి కనిపించే పదాల మధ్యాంతా పచ్చి మధ్యమంత మార్మికత..
"యెలా తుడిచేస్తానో దాటిన కాలాల్ని
నన్ను ఎటూ కదాలనివ్వని గాయాల్ని
అందంగా తెరుచుకున్న రహస్య ద్వారాల్ని
లోపల వెయ్యి తలుపుల ఇల్లు
ప్రతీ ఇంట్లో కొన్ని అపరిచితలోకాలు"
భరించలేనంత తాత్వికత, చలిగా ఉన్న అర్థరాత్రివేళ టీ, సిగరేట్టూ లేకుండా ముఖేష్ పాటని వింటున్నంత తీయని వ్యధ.... ఎలా వెళ్ళేది మనమూ అతని వెంట ఆ "ఇంటివైపు" ??

4

ఎప్పుడైనా అఫ్సర్ ని చూసారా? కవిలాంటి అఫ్సర్ కాదు... హుందాగా ఉండే అఫ్సర్ ని కాదు కుమిలి పోయే అఫ్సర్ ని, లొలొపలికి ముడుచుకు పోయి దుఃఖపు ముద్దయ్యే అఫ్సర్ని? చూసి ఉన్నారా?? 

"ఇంకోలాగా మాట్లాడలేనందుకు నువ్వు క్షమిస్తావో లేదో కానీ
ఇంతకంటే నిజం ఇంకోలా లేనందుకు
ఇవాళ
ఈ శరీరమంతా ఉరితాడై సలుపుతోంది నన్ను"
అంటూ రోహిత్ మరణానికి ఏడ్చిన అఫ్సర్, 

"ఇంకో తురకని కనబోతున్న ఆ తురకదాని గర్భంలో పిండాన్ని శూలంతో పొడిచేసాం. జై హింద్" అంటూ ప్రపంచంలో, చరిత్రలో కొన్ని లక్షల సార్లు జరిగిన తన హత్యకు తానే.. తన మృతదేహం ముందు తానే నిలబడి వెక్కి వెక్కి రోదించే అఫ్సర్... ఊరట కోసం కవిత్వంతో అయినా "ఇంటివైపు" వెళ్లిపోయే అఫ్సర్ కనిపించాడా మీకు??

5

"యెవరి నేల ఏదో
యెవరి పలుకు ఎక్కడిదో
అందరూ అశాంతి రెక్కల పిచ్చుకలు"
మౌంట్ మాత్రే (మాడిసన్ లో వొక కెఫె అట.. అక్కడ పారిస్ అమరవీరుల స్తూపం ఉందట) లో ఒక్కడై, చరిత్ర రక్తపు మరకలని పదే పదే తడుముతూ, తుడపాలన్న పిచ్చి ప్రయత్నం... అఫ్సర్ ఆ సమయానికి ఒక నిట్టూర్పు గొంతుక, లేదూ... ఒక నిశ్శబ్ద నమూనా...
నిజానికి అఫ్సర్ గొప్ప ప్రేమికుడు.. తనని తాను విపరీతంగా ప్రేమించుకొన్నాడు, అఫ్సర్ గొప్ప hater తనని తాను మరింతగా ద్వేషించుకున్నాడు, అఫ్సర్ అంతే గొప్ప క్రూరుడు కూడా తనని తాను ఓడించుకోనీ, కర్కశంగా తనని తాను ఖండించుకోనీ ఒక్కో ముక్కలోనూ తనని వెతుక్కుంటూ... తనని తాను ఓదార్చుకుంటూ.. వచ్చాడు "ఇంటివైపు"

6

మీరు... ఎప్పుడైనా... శంషాద్ బేగం పాటవిన్నారా?? ఎప్పుడో ఒక అర్థరాత్రి ఆ స్వరంతో ప్రేమలో పడ్డారా??
"హమే మాలూమ్ హై.. మాలూమ్ హై
అంతా తెలుసు తెలుసు అని పాడుకొని
వెంటనే నాలిక్కర్చుకొని
లేఖిన్
కానీ కానీ.. అన్నావే
అదిగో
అదే
అసలు జీవితమంతా !"
అన్న వాక్యాలు చదివాక.. మళ్లీ మళ్లీ శంషాద్ బేగం పాటని, కొన్ని క్షణాలపాటు ఆ స్వరం మూగవోయిన నాటి తేదీని మళ్లీ గుర్తుచేసి శూన్యంలో ముంచేసిన అఫ్సర్ నీ మర్చిపోవాలంటే... ఎన్ని నిద్రలేని రాత్రులు కావాలి..?? శంషాద్ జనాజాని తానొక్కడే ఇప్పటికీ మోస్తూ పోతున్నాడు.. "ఇంటివైపు"

7

బేనామ్ ముసాఫిర్
బేనామ్ శహర్
ఏక్ దీవానా గాతే, చల్తే ఫఖీర్ లా..
. ఒక సాయిబుల పిల్లవాడు.. లేలేత పెదాలమీద దాచుకున్న నవ్వుతో, కాస్త బెదురుతో.. ఏదో ఒకనాడు మీముందుకి వస్తాడు. 

"నమ్మరా నన్ను నమ్మరా
నా పేరు చివర మహమ్మదో అహమ్మదో షేకో
సయ్యదో ఖానో వున్నా నేను మంచి బాలున్నిరా"
అంటూ తన అందమైన సుర్మా కళ్ళనిండా నీళ్లతో మీ మొహంలో మొహం పెట్టి చూస్తాడు... అతన్ని హత్తుకొండి, పసి బుగ్గలమీద ఒక ముద్దునీ... అతని గుండెల మీద ఒక భరోసానీ అద్ది.. ఒడిలోకి ఎత్తుకొని తీసుకు వెళ్ళండి.. మీ "ఇంటివైపు", అతని "ఇంటివైపు.. అఫ్సర్ #ఇంటివైపు...

*

Sunday, November 26, 2017

వొక్క వూహ చాలు...


Image may contain: one or more people, sunglasses, eyeglasses and closeupImage may contain: textImage may contain: 1 person, outdoor


ఇప్పటికిప్పుడు- 2
~

కవిత్వాన్ని గురించి చాలా మందితో చాలా సార్లు ముచ్చటించి వుంటాను. విద్యార్థుల నించి మహోపాధ్యాయుల దాకా, అసలేమీ అక్షర జ్ఞానంలేని వాళ్ళ నించి మహా పండితుల దాకా- ఎందరితోనో యెన్నో సంభాషణలు జరిగివుంటాయి.

కాని, కొందరితో కబుర్లు మాత్రం యెప్పటికీ మనసులో నిలిచి వుంటాయి. యిప్పటికీ యెప్పటికీ యీ వరసలో అజంతా గారు తప్పక వుంటారు.

ముఖ్యంగా కవిత్వం చదవడాన్ని గురించి ఆయన అన్న మాటలు నాకెప్పుడూ గుర్తుంటాయి. “కవిత చదవడానికి ముందు శుభ్రంగా స్నానం చేయాలి” అన్నారాయన వొక సారి. కవిత్వం చదవడాన్ని పూజ కన్నా పవిత్రంగా భావించాలని యింకో సందర్భంలోనూ అన్నారు. "వెతకాలి శమంతక మణి కోసం!" అని మరోసారి! ఆశ్చర్యంగా అజంతా గారితో నా సంభాషణల్లో యెప్పుడూ కవిత్వ రచన గురించి పెద్దగా ప్రస్తావనలు లేవు. పై రెండు భిన్నమైన సందర్భాల్లోనే కాకుండా అనేక సార్లు ఆయన చెప్పే ప్రయత్నం చేసింది వొకే క్రియ గురించి – అది కవిత్వం చదవడం! యింకో సారి నాకు తెలుగులో చెప్తే అర్థం కాలేదేమో అన్నట్టుగా గట్టిగా “It’s a sacred act!” అన్నారు.

అజంతాగారితో సన్నిహితంగా వున్న మిత్రులకు తెలుసు- ఆయన మామూలు వాక్యాలు కూడా మామూలు వాక్యాలు కావు. వాటికి ప్రతీకాత్మక అర్థాలే వుంటాయి. “శుభ్ర స్నానం” “పూజ” “శమంతక మణి” లాంటి పదాలూ భావనల్ని ఆయన సంప్రదాయికంగా వాడడంలేదని నాకు తెలుస్తూనే వుంది. యెందుకంటే, బెజవాడలో దగ్గిరగా వున్నప్పుడు కనీసం పదేళ్ళ పైబడి ఆయన్ని అనేక స్థితుల్లో చూసిన వాణ్ని కాబట్టి!
కవిత్వం చదవడానికి ప్రత్యేకమైన మనఃస్థితి వుండాలని ఆయన నమ్మకం. అది శుభ్రంగా స్నానం చేసినట్టుండే మనసులాగా, తుడిచేసిన స్వచ్చమైన పలకలాగా వుండాలని కూడా ఆయన గట్టి నమ్మకం. ఆ రెండీటిని నేను ఆ రోజుల్లో ఆట్టే నమ్మే వాణ్ని కాదు. అదే విషయం ఆయనతో పోట్లాడే వాణ్ని కూడా! శుభ్రమైన మనసు అనేది అంత తేలికైన స్థితి కాదు. అది యెంత సాధ్యమో కూడా తెలీదు. అలాగే, యెవరూ స్వచ్చమైన పలకలాంటి మనసుతోనూ వుండరు. ఉదాహరణకు: నా మటుకు నేను విద్యార్థి రాజకీయాల నించి వచ్చిన వాణ్ని. నా మీద వామపక్ష భావాల ప్రభావం తప్పనిసరిగా వుంటుంది. నేను అదంతా తుడిచేసి, స్వచ్చమైన పలకలాంటి మనఃస్థితి వుందంటే, అది నటన అవుతుందేమో కాని,నిజం కాదు. నేను ఆ మాట అన్నప్పుడల్లా ఆయన “లేదు, కవిత్వం విషయంలో కుదురుతుంది!” అనే వారు.
అలాగే, వొక కవిత చదవడానికి ముందే మనం యేదో వొక స్థితిలో తప్పకుండా వుంటాం. మళ్ళీ నా మాటకే వస్తే, నేను పగలంతా రాజకీయ, సామాజిక సంఘటనల వార్తలు అనువాదాలు చేసీ చేసీ, ఎడిట్ ఎడిట్ చేసీ చేసీ వస్తాను. రాత్రి కవిత్వం పుస్తకం పట్టుకుంటాను, శుభ్రంగా స్నానం చేశాకే! అయినా సరే, నా ఆలోచనలన్నీ ఆ వార్తల చుట్టే తిరుగుతూ వుంటాయి. ఆ ఆలోచనల మధ్యనే కవిత్వం చదువుతాను. అప్పుడు కచ్చితంగా యే ప్రేమ కవిత్వమో, భావ కవిత్వమో చదివితే అది అసంబద్ధంగా అనిపించడం ఖాయం.
అజంతా గారికి కవిత్వం చదవడాన్ని గురించి కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలే వుండేవి. వొక కవిత యెంత కాలం అదే పనిగా చదువుతున్నామనే దానికంటే ఆ కవితని యెన్ని కోణాల నించి యెన్ని విధాలుగా చదువుతామన్నది ముఖ్యమని ఆయనొక సందర్భంలో అన్న మాటని పట్టుకొని మరో సారి నేను సంభాషణలోకి దిగాను.
అది మా యిద్దరికీ యిష్టమైన బందర్ రోడ్డు మీద యింకో అర్థరాత్రి మొదలయిన సంభాషణ. నా మొండితనంతో వేగలేక అప్పుడు ఆయన తన చేతుల్లో వున్న (అజంతా గారి చేతుల్లో యెప్పుడూ వొక కవిత్వ పుస్తకం తప్పకుండా వుండేది!) Wallace Stevens కవిత్వం పుస్తకం నా చేతుల్లో పెట్టి, “అబ్బాయ్, వీణ్ణి చదివి రారా! వచ్చే శనివారం యీ బందర్ రోడ్డు మీదే తేల్చుకుందాం!” అన్నారాయన సవాల్ విసురుతున్నట్టుగా! చర్చ శనివారానికి వాయిదా పడడంతో మరిన్ని ఆధారాలతో encounter చేయచ్చని ఆ రాత్రి ఆయన్ని వాళ్ళింట్లో దింపి, నేను నా గదికి దూసుకొచ్చా Wallace Stevens తోడుగా!
2
అదిగో అప్పుడు అట్లా ఆ వారం రోజులు మననం చేసుకున్న వొకే వొక్క కవిత- Thirteen Ways of Looking at a Blackbird!
ఆ వారం రోజుల్లో అది యెన్ని సార్లు చదివానంటే, మొత్తం కవిత నోటికొచ్చేసింది. ఇష్టమైన ఇంగ్లీషు కవిత్వమంతా బట్టీ కొట్టి, వాక్యాలు రువ్వుకుంటూ తిరగడం అప్పట్లో వొక ఫాషన్! అట్లా హైకూ నడకల ఆ కవిత వొక పదం వెంట పదం, వాక్యం వెంట వాక్యం అట్లా............ధారాళంగా పలికేది.
కవిత్వాన్ని యెట్లా చదవాలీ యెట్లా అర్థం చేసుకోవాలీ అన్న తెగని అన్వేషణలో వున్న కాలం అది. కవితకి వొకే అర్థమూ వొకే గురీ వుండనే వుండవ్ అని ఖాయంగా తెలిసిన కాలమే! నాగార్జున యూనివర్సిటీలో అర్ధాంతరంగా ఆపేసిన ఎమ్మే ఇంగ్లీష్ చదువు వల్ల అప్పటికి అమెరికన్ కవిత్వం బాగానే చదువుకున్నా, నాకు Wallace Stevens గురించి అసలేమీ తెలియదు. ఇప్పుడంటే, గూగుల్ లో వెతుక్కుంటే యే కవి జీవితమైనా తెలిసిపోతుంది. కాని, అప్పుడు లైబ్రరీల్లో పడి వెతుక్కోవాలి. పైగా, నాకు మొదట కవిత్వం మాత్రమే చదివే అలవాటు. కవుల జీవిత విశేషాల మీద అంత ఆసక్తి లేదు.
అయితే వొక క్రమశిక్షణ యేమిటంటే, వొక కవిని చదవడం మొదలెడితే, కనీసం రెండు నెలలు అంతా ఆ కవి కవిత్వమే చదివే వాణ్ని. బెజవాడలో నాకు అట్లా కలిసి వచ్చింది కూడా! టాగోర్ లైబ్రరీ, ప్రబోధ బుక్ సెంటర్, మోహన ప్రసాద్ గారినీ, టీయల్ కాంతారావు గారినీ బతిమాలుకొని సిద్ధార్థ కాలేజీ లైబ్రరీ, యింకో స్నేహితుణ్ణి వొప్పించి లయోలా లైబ్రరీ—మొత్తానికి ఆ రెండు నెలలు అష్ట కష్టాలూ పడీ Wallace Stevens కవిత్వ వ్రతం చేశా.
యింతా చేస్తే, Wallace Stevens ఇప్పుడు మా వూరికి దగ్గిరలో 1879లో రీడింగ్ అనే చోట పుట్టాడు. మా పొరుగు రాష్ట్రం కనెక్టికట్ లో వుద్యోగం చేసి, అక్కడే 1955లో చనిపోయాడు. పోయినేడాది కనెక్టికట్ కాలేజీలో సూఫీ కవిత్వం గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆ మహాకవి తిరిగిన వీధుల్లో తిరుగుతున్నాను కదా అని యెంత సంతోషమేసిందో! యింత అద్భుతమైన కవిత్వం రాసిన Wallace Stevens వొక ఇన్సురెన్సు కంపెనీలో నిత్యం అంకెలతో కుస్తీపట్లు పడుతుండే వాడంటే నమ్మబుద్ధి కాలేదు.
ఆ ఇన్సురెన్సు కంపెనీ గోడల మీద మళ్ళీ ఆ Thirteen Ways of Looking at a Blackbird కవిత్వ వాక్యాలు కనిపించి, బెజవాడలో నా ఇరవైల కవిత్వ అన్వేషణ గుర్తొచ్చింది.
I
Among twenty snowy mountains,
The only moving thing
Was the eye of the blackbird.
II
I was of three minds,
Like a tree
In which there are three blackbirds.
III
The blackbird whirled in the autumn winds.
It was a small part of the pantomime.
IV
A man and a woman
Are one.
A man and a woman and a blackbird
Are one.
V
I do not know which to prefer,
The beauty of inflections
Or the beauty of innuendoes,
The blackbird whistling
Or just after.
VI
Icicles filled the long window
With barbaric glass.
The shadow of the blackbird
Crossed it, to and fro.
The mood
Traced in the shadow
An indecipherable cause.
VII
O thin men of Haddam,
Why do you imagine golden birds?
Do you not see how the blackbird
Walks around the feet
Of the women about you?
VIII
I know noble accents
And lucid, inescapable rhythms;
But I know, too,
That the blackbird is involved
In what I know.
IX
When the blackbird flew out of sight,
It marked the edge
Of one of many circles.
X
At the sight of blackbirds
Flying in a green light,
Even the bawds of euphony
Would cry out sharply.
XI
He rode over Connecticut
In a glass coach.
Once, a fear pierced him,
In that he mistook
The shadow of his equipage
For blackbirds.
XII
The river is moving.
The blackbird must be flying.
XIII
It was evening all afternoon.
It was snowing
And it was going to snow.
The blackbird sat
In the cedar-limbs.
3
యెందుకు యీ కవిత అంత ఆకర్షణ నాకు?!
మొదటి సంగతేమిటంటే, అప్పటిదాకా కొరుకుడు పడని చాలా కవిత్వం చదివాక యిది కాస్త ప్రాణానికి హాయిగా అనిపించింది. సంక్లిష్టత లేదని కాదు, వుంది. కాని, అర్థమయ్యే సంక్లిష్టత అందంగా వుందనిపించింది. చదవగానే యీ నల్లపక్షి యేమిటన్న ప్రశ్న వస్తుంది. ఆ నల్లపక్షిని చూసే పదమూడు సన్నివేశాల్ని కవి కల్పించాడు. ఆ ఊహాశక్తి నాకు బాగా నచ్చింది. ప్రతి ఊహా వొక చిత్రపటంలా మనసులో వేలాడుతూ వుండిపోతుంది, కవిత అర్థమయ్యే లోపు!
అజంతా కవిత్వంలో మంత్రమహిమేదో వుందని ఆ రోజుల్లో అనుకునే వాళ్ళం. నిజానికి చాలా కవితల్లో అజంతా రాజకీయ దృశ్యాల్నే వర్ణిస్తూ వుంటారు. కాని, ఆ రాజకీయ దృశ్యాలు మిగతా సామాజిక కవిత్వంలాగా crude గా వుండవు. తనదైన ఊహాశక్తిని అద్ది, వాటికి ఆ సామాజిక సందర్భాలకు మించిన విలువని జోడిస్తూ వుంటుంది అజంతా కవిత్వం. బహుశా, మేం కలిసినప్పుడల్లా అజంతా అలాంటి ఊహాశక్తి గురించే చెప్తున్నారేమో అనిపిస్తుంది నాకు లోతుగా ఆలోచిస్తే!
యీ విషయంలో అజంతాకీ, Wallace Stevens కీ నాకు చాలా పోలికలు కనిపిస్తాయి. అయితే, అజంతా గారు ప్రతీకాత్మకంగా చెప్తే, Wallace Stevens వాచ్యంగానే అనేకసార్లు ఊహాశక్తి గురించి మాట్లాడుతూ వచ్చాడు. అసలు ఊహా శక్తినే వొక సాహిత్య విలువగా ప్రతిపాదిస్తాడు Wallace Stevens.
". . .for the poet, the imagination is paramount, and . . . he dwells apart in his imagination, as the philosopher dwells in his reason, and as the priest dwells in his belief . . . ."
ఆ మాటకొస్తే, Wallace Stevens కవిత్వాని విశ్లేషించిన విమర్శకులు కూడా అదే ప్రమాణంగా అతని కవిత్వాన్ని తూచారు. ప్రసిద్ధ విమర్శకుడు, కవిత్వ అధ్యాపకుడు హెరాల్డ్ బ్లూమ్ అంటాడు:
Here is a good place to begin: stop hunting for “meaning,” per se, and simply look at the poems as imaginative brain-clouds you get to ride along on.
కాని, నాకు బాగా నచ్చిన మాట Stevens గురించి పుస్తకం రాసిన James Longenbach అన్నాడు: “The point is not so much to understand the poems (for when we understand something, we don’t need it anymore, and we don’t read it again); the point is to inhabit the poems. By doing so, we recognize that our humanity is not constituted by our ‘mastery’ of something. It is constituted by our willingness to humble ourselves to the ‘mystery’ of something.”
యిప్పుడు మన అజంతా చెప్పిన మాటలూ, Wallace Stevens అన్న మాటలూ బేరీజు వేసుకుంటే, కవిత్వాన్ని అర్థం చేసుకోడానికి పైన ఉదాహరించిన Thirteen ways కవిత నిజానికి కవిత్వం చదవడం గురించే అని నాకు అనిపిస్తుంది.
కవిత్వం చదవడానికి వొకే కోణం లేదు, వొకే దారి లేదు. కనీసం పదమూడు దారులూ కోణాలూ వున్నాయన్న మాట!
యిప్పుడు యింకో సారి మీరు ఆ కవిత చదివితే, ఆ పదమూడు కోణాలు యేమిటో మీకే అర్థమవుతుంది. మీ ఊహకి అందనిది ఏదీ లేదనీ తెలుస్తుంది!

Tuesday, November 21, 2017

ఎంట్రీ అను ఇంట్రో


Image may contain: text
1


విత్వం యెందుకు చదవాలి అన్న ప్రశ్నలోంచి మొదలవుతున్న వెతుకులాట యిది.

కొత్త వాక్యం కోసం ప్రతిసారీ ప్రశ్నించుకుంటూ, చుట్టూ వున్న జీవితాన్నీ, మనుషుల్నీ, పుస్తకాల్నీ శోధించుకుంటూ కొన్ని వ్యక్తీకరణ సాధనాల్ని సమకూర్చుకునే సాధనలో భాగం  కూడా-

సమాధానాలు రాబట్టానన్న తృప్తి నాకు లేదు. ఆమాటకొస్తే, యింకా మిగిలి వుండి, నన్ను రంపాన పెడ్తున్న నొప్పిలోంచే యిప్పటికిప్పుడు యిలా రాస్తున్నాను.
రాస్తున్నాను అనే కంటే “చెప్పుకుంటున్నాను” అనే క్రియ/ ప్రక్రియ యిక్కడ కచ్చితంగా అనిపిస్తోంది. మీ నలుగురి మధ్య కూర్చొనో, మీతోపాటు నడుస్తూనో, తింటూనో, తాగుతూనో నన్ను నేను వెతుక్కుంటున్న కొన్ని ఘడియల అక్షర రూపం యిదంతా-

మొదటి కవిత అనే పొద్దు పొడుపు నేనెప్పుడు అనుభవించానో, ఆ మొదటి వాక్యం నన్ను ఎప్పుడు ఆవహించిందో చెప్పలేను గుర్తు లేదు కాబట్టి-

బహుశా మొదటి వాక్యం వొక అర్థం లేని అసంబద్ధ కూని రాగమై వుంటుంది. లేదూ, అర్థం వెతుక్కోలేక పడిన నానావిధ అవస్థల వొంకర టింకర అయ్యి వుంటుంది. వొక్కటి మాత్రం చెప్పాలి, నాలో పుట్టిన ఆ మొదటి వాక్యపు పొద్దుకి నేనెప్పుడూ వంద వందనాలు చెప్పుకుంటాను. ఆ పొద్దే లేకపోతే యీ బతుక్కి వొక అర్థమేమీ వుండేది కాదేమో!

అప్పటి నించీ వొక ప్రశ్న నన్ను నిలువునా  దహిస్తూనే వుంది.  అట్లా అనుకోకుండా పొడిచిన ఆ వాక్యపు పొద్దులో యింకా నేను మిగిలే వున్నానా అని!
2


ప్రశ్నలు అడగడం సులువు. తేలికపాటి సమాధానాలు అంటే యీ పూటకి అన్నం తిని, నిద్రపోయే సుఖాన్నిచ్చే సమాధానాలు యిచ్చుకోవడమూ/ యివ్వడమూ కూడా తేలికే కావచ్చు. కాని, నిద్ర పట్టనివ్వని, యీ పూటకి అన్నం మెతుకు ముట్టనివ్వని ప్రశ్నలు వుంటాయి. కవిత్వానికి సంబంధించి ముఖ్యంగా వొక కవి తనని తాను నిలదీసుకొని అడిగే ప్రతి ప్రశ్నా అలాంటిదే- యెవరైనా ఆ ప్రశ్న అడక్క ముందు తనకి తానే నిలువద్దంలో నిలబడే సత్తా యెంత మందిలో వుంటుందో చెప్పలేం. కనీసం కొన్ని బలహీనమైన సమాధానాలు తన దగ్గిర వున్నాయన్న కవులు యెంత మంది వుంటారో కూడా చెప్పలేం. యిక్కడ యింకో అసుఖం కూడా వుంది. అసలు అట్లా ప్రశ్నించుకొని, సమాధానాలు వెతుక్కునే వెసులుబాటు రోజువారీ బతుకు యిస్తుందో లేదో కూడా చెప్పలేం.  యిప్పటికిప్పుడు అది కష్టమే! కత్తి మీద సాము అంటారే, పునరుక్తి దోషం అంటినా సరే, అట్లాగే అనుకోవాలి యీ అవస్థని-

మొదటి ప్రశ్న యెప్పుడూ వొక్కటే: అసలు కవిత్వం యెందుకు చదవాలి? కవిత్వమే యెందుకు? మిగిలిన అనేక వచన కవిత్వేతర రూపాలు వుండగా వొక్క కవిత్వం దగ్గిరే యెందుకు మాటిమాటికీ తచ్చాడుతూ వుండడం?!
నా మటుకు నాకు వొక్కటే అనుభవం: ప్రతి కవితా యేదో నాదే అయిన ఆత్మీయ  సందర్భంలోకి నన్ను తీసుకువెళ్తుంది.  అక్కడ నన్ను నేను చూస్తూ నిలబడ్తాను, నదిలో ప్రతిబింబాన్ని చూస్తున్నట్టే! యీ పని మిగతా సాహిత్య రూపాలు చేయలేవా అంటే చేయలేవనే అంటాను. బహుశా, కొంత తీక్షణంగా, లోతైన ఆలోచనతో రాసిన దగ్గరి స్నేహితుడి లేఖ అలాంటి పని చేయచ్చు. అందుకే, కవిత్వం చాలా సార్లు నా కోసమే రాసిన సన్నిహిత లేఖలాగా అనిపిస్తుంది కూడా.

అయితే, యీ సందర్భంలో యింకో ప్రమాదాన్ని గురించి హెచ్చరించకుండా వుండలేను. కవితని కేవలం అలాంటి వ్యక్తిగతమైన కోణం నించి మాత్రమే చదువుకుంటూ వెళ్తే, ఆ కవిత ఆవిష్కరిస్తున్న యితర అనేక లోకాలు మనకి తెలీకుండా పోవచ్చు. మొదట “నేను” అనేది యెంత అవసరమో, కవిత మళ్ళీ మళ్ళీ చదువుతున్నప్పుడు ఆ “నేను” ని దాటుకుంటూ వెళ్లిపోవాలి నాలోని చదువరి. అప్పుడు కవితలోని “ప్రపంచ” బాధ కూడా నా కోసం తలుపు తీసుకొని, నన్ను యింకో లోకంలోకి తీసుకువెళ్తుంది. నిజానికి అలాంటి యింకో లోకపు చీకటి వెలుగులు తెలుసుకోవడం కోసమే నేను చదువుతాను.

నేను యిలాంటి వెతుకులాటలో వున్నప్పుడే యీ మధ్య ది అట్లాంటిక్ అనే పత్రిక పేజీలు  వూరికే అలా తిరగేస్తూ వుంటే, మార్క్ యకీష్ అనే అమెరికన్ కవి నా కోసమే అన్నట్టు యిలా అన్నాడు:

Try to meet a poem on its terms not yours. If you have to “relate” to a poem in order to understand it, you aren’t reading it sufficiently. In other words, don’t try to fit the poem into your life. Try to see what world the poem creates. Then, if you are lucky, its world will help you re-see your own.

నాకూ యీ ప్రపంచానికీ మధ్య యేవో మాటలు నడుస్తూ వుంటాయి. నా చుట్టూ వుండే మనుషులు నాతో నిరంతరం యేదో మాట్లాడుతూనే వుంటారు. నన్ను రకరకాలుగా కదిలిస్తూ అదిలిస్తూ వుంటారు. అలాగే, నాకూ నా చుట్టూ వుండే కవులకూ మధ్య యేదో వొక తెలియని అవగాహన వుంటుంది. వాళ్ళూ నేనూ అదేపనిగా యేదో తవ్వుకుంటూ వుంటాం. యీ మధ్య వొక కవితలో రాసుకున్నాను అదే-

వొక నువ్వూ ప్రతి నేనూ
వొకటేదో పురావస్తు తవ్వకంలో
నిమగ్నమైన పనిముట్టులాగా-
కాని, యీ తవ్వకం పని గురించి యెట్లా మాట్లాడాలి యిప్పటికిప్పుడు?

నేను కలిసిన వ్యక్తుల్లోంచి కవిత్వ సందర్భాలు చెప్పాలి. చదువుతున్న పుస్తకాల్లోంచి నెమలీకల్ని, యీ క్షణాల్ని వెలిగించే వెల్తురు పిట్టల్ని ఎగరేసి చూపించాలి. యిప్పుడే ఆలోచనల్లో మెదిలిన నిప్పు కణికని అరచేతుల్లో బంధించి స్నేహితుడికి దాని వేడిని తాకి చూడమని  చెప్పాలి. అవన్నీ యిప్పటికిప్పుడు జరిగి తీరాలని నా కోరిక.

ఆ కోరికలోంచి యిదిగో “యిప్పటికిప్పుడు” యిలా.


*

Friday, June 30, 2017

Not in Anyone’s Name!


1
యిప్పుడు నేనేమీ వణికిపోవడం లేదు. నన్ను భయం చాపలో చుట్టి నువ్వు యెక్కడికో విసిరేయనూ లేవు. వొక చలికాలపు మసక చీకటిగా మసిలే వాణ్ణి కాదు నేను. నా భుజమ్మీద నీ చేతుల్ని మనసారా చుట్టడం సరే, కనీసం నీ చేతి నీడ కూడా యేనాడూ పడలేదు కనుక నాలోపల మెలితిరుగుతున్న నిప్పు సముద్రాల అలికిడి నీకు తెలీదు.

2
నువ్వు అచ్చోసి వదిలేసిన కాగితాలో, ఇరవైనాలుగ్గంటల నీ దృశ్య పహరాలో , వూరేగిస్తున్న వెయ్యి నాల్కల నోళ్లో , ఆ నోటి మాటల మంటలో , ఆ మాటల్లోని విషమో నన్ను కనికట్టు చేస్తూ వుంటాయని అనుకుంటూ వుంటావ్. నేనో కొత్త దృశ్యాన్ని రచిస్తూ వుంటానని, కొత్త మాటని వూహిస్తూ వుంటానని, నీ వూహకేమాత్రం తోచని సమూహమై వస్తానని అనుకోలేదు కదా! వొక్క నిప్పు తునక చేతికందితే చాలు నేను లావాని. వొక్క నీటి చుక్క తాకితే చాలు నేను సునామీని.

3
నీకంటూ ఏమీ మిగల్లేదు, నువ్వొక రంగువో పేరువో యింకేదో తప్ప నువ్వు యెప్పుడూ యేమీ కాదు. పుట్టిన మట్టిలోని అమ్మతనాన్ని అమ్మకానికి పెట్టినవాడివి, మా నమ్మకాల విత్తనాల్లో విషం పోసి ద్వేషాన్ని పండిస్తున్న వాడివి, లోపలి నెత్తురంతా తోడిపోసి ప్రతి శరీరాన్నీ యెండిపోయిన దిగుడు బావి చేస్తున్న వాడివి – యివాళ నీ పేరు వొక రక్కసి మోళీ.

4
నువ్వూహించని రంగుతో రాస్తున్నా నా పేరు.
*

Sunday, May 14, 2017

పద్యం పుట్టుక గురించి మళ్ళా …!

చిత్రం: రాజశేఖర్ చంద్రం 



1 


కాసింత నేలని తవ్వి, వొక సీసాలో కాలాన్ని కట్టేసి
దాన్ని కప్పేశాం, గుర్తుందా?
మరీ చిన్నప్పటి సరదా కదా,
గుర్తుండి వుండదులే!


*
 పద్యం కూడా అంతేనా ?

2

రాయడానికేమీ లేని తనం
నీకూ, నాకూ , బహుశా అందరికీ.
కచ్చితంగా ఇప్పుడే ఇష్టపడలేని హోంవర్కులాగా.
ఎంతకీ ప్రేమించలేని సిలబస్ లాగా.
బాధ లేదని కాదులే!
కాకపోతే, ఎవరి బాధో తప్ప
రాయలేని తనం
అరువు కళ్లతో ఏడుపు,
కొయ్య కాళ్ళతో పరుగు!  
*
ఏదో వొక కొయ్య కాలు చాలదేమో,  లోపలి పద్యానికి!


3

సొంతమూ, పరాయీ అని కాదు కాని
నువ్వు నీ దేహంలో సంచరించడం మానేసి
ఎంత కాలం అయ్యింది, చెప్పకూడదూ, కాస్త!
చర్మం కూడా  పరాయీ చొక్కాలాగే అనిపిస్తోందీ మధ్య.
  
*
మాటలో తేలిపోతుంది, నిజమేదో, కానిదేదో!

 4

తవ్వోడ దొరికింది సరే,
అదే పద్యం అనుకుంటున్నాం
నువ్వూ, నేనూ, అందరం!
లోపలా, బయటా చాలా చాలా తవ్వి పోశాం కానీ,
 లేని చోట తవ్వుకొని, వెతుక్కుంటే – దొరుకుతుందా, పద్యం?

  *
పద్యం పుట్టుక  అసలేమైనా గుర్తుందా?
వుండి వుండదులే,
మరీ చిన్నప్పటి సరదా కదా?!
 

పూర్తి కాని వాక్యాలు

ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (జులై 6) లో అచ్చయిన కొత్త కథ-   1           మ రీ పెద్ద విలాసాలేమీ కోరుకోలేదు సబీనా. అన్నీ చిన్నచిన్న కోరికలే!   ...