Thursday, June 16, 2011

లో నడక!





నువ్వెటూ రావు

సాయంత్రపు చెట్ల మీద
చల్లటి గాలి ఆకుపచ్చన

తపస్సులోంచి తల ఎత్తిన మునిలాంటి
గడ్డి పూల పక్క
కాలి కింద తడి వెచ్చన


నాలుగడుగుల తరవాత
వంద అడుగుల నిశ్శబ్దం ఎంత అందమో!


ఆ తరవాత
దారి ఎటో నడిపిస్తుంది.


నువ్వెటూ రాని
సాయంకాలం
చీకట్లోకి.


లోపలి కొన్ని దారుల్లోకి -

Wednesday, June 8, 2011

కాసింత!




వొక
పది సార్లు
ఈ తలుపు దగ్గిర నిలబడి కూర్చొని
తూలిపోయి రాలిపోయి తూట్లుపడి, మాటలు పడి



వొకట్రెండు
సార్లు తలుపు తెరిచినట్టు కల కని
కళ్ళు నులుముకొని పెట్టిలో లేని వుత్తరాన్ని

వెతుక్కున్నట్టు కలని వొళ్ళంతా గాలించి గాలినై నీలి నీలి పొరల మీద

ఏదో వొక చప్పుడునయి -

అయినా, అది పద్యం కాలేదు!


2

ఆడుకునీ, పాడుకునీ, మాట్లాడుకునీ,
తాగీ తినీ కాట్లాడుకుని
ఇల్లు చేరీ చేరుకోకుండా వుండీ,
సంచారి రాత్రి భాష ఇంకా రాత్రికే తెలీదు


చీకటిని ఏ చేతులు చుట్టేస్తున్నాయో

ఏ చేతుల్ని చీకటీ వెలుగు రెండు పక్కలా లాక్కుని పోతున్నాయో

అయినా, అది వొక దిక్కు కాలేదు.

3

వర్ణ మాల మాదిగ డప్పు మీద వేళ్ల వెక్కిళ్లు
సాయిబు మాసిన టోపీ కింద నెత్తుటి చెమ్మ
ఆమె నుదుట లంగరేసిన సూర్యుడు


అయినా, అది వొక తూర్పు కాలేదు.

4


తెరిచిన తలుపులన్నీ ఇనప కౌగిళ్ళతో మూత పడ్డాయి గా!

తీయండి రా


ఇంకొన్ని తలుపులు!



దబదబా బాదుకుంటూ వెళ్ళిపోయారు కదా అంతా!


వేళ్ళకి కాసింత ధ్యానం

లోపల ముఖానికి కాసింత చల్ల గాలి

వూపిరికీ వూపిరికీ నడుమ కాసింత జాగా

5

తలుపు దగ్గిర ఎవర్రా ఆ కాపలా?!

వాడికి వో చావు పెట్టె నా కానుక.


(నాయుడికీ, కోడూరికీ ఇంకా కొత్త తలుపులు తెరుస్తున్న వాళ్ళకి)

Thursday, June 2, 2011

గుడ్డు




స్లావేనియా కవిత్వం ఎలా వుంటుందో అప్పుడప్పుడూ మిత్రులతో సంభాషణల్లో వినడమే తప్ప పెద్దగా చదివే అవకాశమేమీ దొరకలేదు. ఈ మధ్య లైబ్రరీలో కొత్త పుస్తకాల దగ్గిర వెతుక్కుంటూ వుంటే, అనుకోకుండా దొరికాడు ఈ కవి. ఇతని పేరు Ales Steger. అతని కొత్త పుస్తకం The Book of Things. ఈ పుస్తకం తీయగానే మొదటి పుటలలో A word doest not exist for every thing అన్న Slovenian dictionary వాక్యం నన్ను అతని కవిత్వంలోకి లాక్కెళ్లింది. ఈ కవిత్వం ఎంత తేలిక మాటల్లో వుందంటే, చాలా కవితలు నన్ను తీవ్రంగా కుదిపేశాయి గాని, వాటిలో వొకటి రెండు అనువాదం చెయ్యబోతే తేలిక మాటల్ని అనువాదం చెయ్యడం ఎంత కష్టమో మరో సారి అనుభవంలోకి వచ్చింది. నా వీలుని బట్టి ఇతని కవిత్వం అంతా తెలుగు చేయాలన్న దురాశ నాకు వుంది, కానీ, అంత నిరాలంకార, నిరాడంబర సంభాషణకి తెలుగు సేత సాధ్యమా అన్న నిరాశ కూడా వుంది. వున్నంతలో అనువాదానికి లొంగిన మరీ తేలికపాటి కవిత ఇది. ఇక్కడ తేలిక అనేది మాటలకే పరిమితం. భావానికి కాదు!




గుడ్డు

పెనం అంచున నువ్వు దాన్ని చంపినప్పుడు
దాని చావు కన్ను నువ్వు చూసావో లేదో మరి!


ఆ గుడ్డు మరీ చిన్నది, ఈ పొద్దుటి ఆకలి
బాధలో అది వో మూలకి కూడా రాదు.

దాని కన్ను నిన్ను చూస్తూనే వుంటుంది,
నీ లోకంలోకి తేరిపార చూస్తుంది.

నీ లోకపు అంచులేమిటి? వాటి కళ్ళద్దాల కింద ఏ తత్వాలున్నాయా అని-


శూన్యంలో బేఖాతరుగా చుట్టి వచ్చే కాలాన్ని
ఆ కన్ను చూస్తుందా?
దాని కనుపాపలు, చిట్లిన దాని అవయవాలు,
ఆ గందరగోళం, లేదా ఏదో వొక పద్ధతి
అంటూ వుంటే దాన్ని చూస్తుందా?


హ..ఇంత పరగడపున ఇంత చిన్ని కన్ను చుట్టూ
ఇంత పెద్ద ప్రశ్నలా?

నిజంగా నీకు - అవును నీకే -
వీటికేదో వొక సమాధానం కావాలంటావా?

టేబుల్ దగ్గిర కూర్చొని వున్నప్పుడు
కన్నూ కన్నూ కలిసినప్పుడు

నువ్వు దాని కన్నుని ఓ బ్రెడ్డు ముక్కతో కప్పేస్తావ్?! అంతేనా?

*

Friday, May 27, 2011

వొకానొక తాళం చెవి




కవిత్వాన్ని అకవిత్వీకరించే మరో సాధనం - సంభాషణ. మామూలు సంభాషణలోని తేలిక మాటలనే తీసుకొని, వాటికి అసాధారణమయిన శక్తినివ్వడం. డెబోరా కీనాన్ కవిత్వం చదువుతున్నప్పుడు ఇదెలా సాధ్యమో అర్ధమవుతుంది. ఆమె కొత్త కవిత్వ సంపుటి "గుడ్ హార్ట్" నించి వొక కవిత ఇది.





వొకానొక తాళం చెవి

ఏకాంతమా, అమ్మా! నా జీవితాన్ని మళ్ళీ చెప్పమ్మా!
- డీ మీలోజ్



ఇల్లు విడిచి
ఏ పొద్దో వాలకముందే
ఆ వొడ్డు దాకా వొక్క నిమిషం నడిచి వెళ్లాలని.


లేదా,
అప్పుడప్పుడే పొద్దు వాలినప్పుడయినా సరే.


వెండి అలల్ని దాటి
నల్ల డాల్ఫిన్లు బారులు తీరడానికి
ఎగబడుతున్నప్పుడు.


తాళంలో చెవి తిప్పి
నా అడుగుల చప్పుడు వింటూ

తెల తెల్లని ఇసక దారి
సంద్రంలోకి లాగుతున్నప్పుడు.


మూసుకు పోయిన దారంటా
వీధి చివరంటా నడిచెళ్లే ఆ పిల్లలా.

అందరూ మంచి వాళ్ళే అనే
అందరూ పొరపాట్లు చేసిన వాళ్ళే అనే
కుటుంబ బాదరబందీ నించి

వొకానొక ఏకాంతపు కౌగిలిలోకి
నిదానంగా నడక.


వుండి పోవాలని వెళ్లిపోవాలని
తాళం చెవి బాగు చేయించాలని దాన్ని మళ్ళీ పోగొట్టుకోవాలని
ఇసక మీదనో రాళ్ళ మీదనో నడవాలని
అలల మీద స్వారీ చేయాలని తేలిపోవాలని
దారి చివరంటా పోవాలని

తాళం చెవి సరిగ్గా వేయాలని
దాని అర్థం తేల్చుకోవాలని.

ఇవాళ

వొకానొక గాలి తరగ దాని వొంటరి క్షణంలో
నా దక్షిణం వైపు కిటికీని తట్టి వెళ్తోంది

అది మోసుకు వెళ్లే తాళం చెవి నాకు తెలుసు
అది మందలింపు కాదు, పొడుపు కథ కాదు,
వాగ్దానమూ కాదు.

Friday, May 20, 2011

కాన్సర్ గుండెచప్పుడు ...కార్లా కవిత్వం!



టెక్సాస్ కవయిత్రి కార్లా మోర్టాన్ వొక వైపు కాన్సర్ ని సవాలు చేస్తోంది. మరో వైపు కవిత్వంలోని అలంకారాలనీ సవాలు చేస్తోంది. ఆమె కవిత్వం నిరలంకారంగా, నిరాడంబరంగా కేవలం జీవితాన్నే పాడే పదం. గత ఏడాది టెక్సాస్ పొయెట్ లారెట్ గా గౌరవం పొందిన కార్లా కొత్త పుస్తకం "రీడిఫైనింగ్ బ్యూటీ" నించి వొక కవిత ఇది.




గాలికి చేతులున్నాయని నాకు తెలీదు,
నా తల అంతా శుభ్రంగా గొరికించుకునేంత దాకా
దాని చేతులు ప్రేమగా నన్ను నిమిరేంత దాకా .

నా వొళ్ళు ఇంత అందంగా వుంటుందనీ తెలీదు
దాన్ని ఎవరో తెరిచి, కత్తెర వేసి, ఏదో విషంతో నింపెంత దాకా.

ఆత్మకీ కళ్ళు వుంటాయని తెలీనే తెలీదు
నా గుండె చివరంటా నన్ను వొలుచుకొని
నా అస్తిత్వాన్నంతా రాల్చుకొని నీ దాకా వచ్చే దాకా

నీ నిశ్శబ్దపు చూపు కింద
నగ్నంగా
వికలంగా నిల్చునే దాకా.

మూలం: కార్లా కె. మోర్టాన్.

Saturday, May 14, 2011

మూడో తరం నుంచి ఓ ఆణిముత్యం..."ఊరి చివర"


ఇండియా టుడే నుంచి..."ఊరి చివర" గురించి అంపశయ్య నవీన్ గారి సమీక్ష

Sunday, April 10, 2011

ఈ కవిత్వం మొహమాటాలు లేని రాజకీయ భావ ప్రకటన

"పాలపిట్ట" తాజా సంచికలో వెలువడిన ఇంటర్వ్యూ ఇది...



అఫ్సర్ గారూ, మీ కొత్త కవితా సంపుటి “ఊరి చివర” విడుదల సందర్భంగా మీకు హృదయపూర్వక అభినందనలు! దీన్ని పురస్కరించుకుని మీతో కొంచెం సేపు ముచ్చటిద్దామనుకున్నాం. ముందుగా “ఊరి చివర” నేపథ్యం, వచ్చిన పరిస్థితీ వివరిస్తారా?

- "ఊరి చివర" అనే శీర్షికలోనే ఆ కవిత్వ నేపధ్యమూ, పరిస్థితీ స్పష్టంగా అర్ధం అవుతున్నాయి. "కవిత్వ" ఇసకలో మాత్రమే తలదూర్చి వున్న ఉష్ట్ర పక్షులకి ఈ కవిత్వం అర్ధం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు. కేవలం కవిత్వ అభిమానుల కోసమే కవిత్వం రాయడం నా వల్ల కాని స్థితిలో ఈ కవిత్వం వచ్చింది. ఈ కవిత్వం రాస్తున్న సమయంలో నేను మూడు ప్రపంచాల మధ్య - ఒకటి: తెలంగాణా, రాయలసీమ మారుమూల పల్లెల్లో వున్నాను, రెండు: ప్రపంచానికి కేంద్రం అని భ్రమిసే అమెరికాలోనూ వున్నాను, మూడు: పాప్ కల్చరూ, ధనిక సంస్కృతినీ అనుకరిస్తూన్న "లిటిల్ అమెరికా" లాంటి నయా హైదరబాదులోనూ వున్నాను. ఈ మూడు ప్రపంచాల మధ్య రాపిడికి గురవుతున్న ఒక తెలంగాణ ఊరి అస్తిత్వం, ఉనికి రాజకీయాల తిరణాలలో అనాధ ముస్లిం అస్తిత్వమూ ఈ కవిత్వం రాయించాయి. "శుద్ధ" కవిత్వం ఇక రాయలేనన్న స్థిరత్వం, చుట్టుముడ్తున్న మూడు భిన్న ప్రపంచాల అస్థిరత్వం "ఊరి చివర" లో కనిపిస్తుంది. కాని, ఈ పుస్తకం మీద విమర్శలు గుప్పిస్తున్న వాళ్ళు ఈ రెండు విషయాలు తప్ప అన్నీ మాట్లాడుతున్నారు.

మీరు గతంలో వెలువరించిన కవితా సంపుటులకూ “ఊరి చివర” కూ ప్రధానమైన తేడాలూ, మార్పులూ (గుణాత్మకమైనవి) ఏమిటి?
- ఆ కవితా సంపుటాలకూ, "ఊరి చివర" కీ మధ్య పెద్ద తేడా: వస్తు విస్తీర్ణం. అందులో వున్న నలభై ఎనిమిది కవితలూ నలభై ఎనిమిది కొత్త వస్తువులు. భిన్నత్వాన్ని గౌరవించాలన్న తపన ఇందులో అన్ని కవితల్నీ నడిపించే సూత్రం. ఇది చూసి కవిత్వ సరళ రేఖల మీద బతికే వాళ్ళు గొల్లుమంటున్నారు. అయ్యో, కవిత్వమూ, శుభ్రతా అంటూ చేతుల్ని అతిసున్నిత పుష్ప ద్రవాలతో కడుక్కుంటున్నారు. కవిత్వ వస్తువు, రూపం మీద మళ్ళీ చర్చలకి దిగుతున్నారు.
- ఈ విమర్శలూ, వ్యాఖ్యానాలూ చదువుతూంటే, 1985 "రక్త స్పర్శ" రోజులు గుర్తొస్తున్నాయి. అయితే, వొక్కటే తేడా. అప్పుడు మనకి మంచి విమర్శకులు వున్నారు. ఈ కవిత్వ సంపుటిని సమీక్షిస్తూ కేవీయార్ "1985 కవిత్వానికి కొండ గుర్తు" అని రాశారు, ఆయనకి నా కవిత్వ రూపం మీద అభ్యంతరాలు వున్నప్పటికీ- కవిత్వ రూపం కొత్తగా వుండాలనుకున్న ఆ తపనలో నేను అమాయకంగా ఇస్మాయిల్ కవిత్వాన్ని ఆరాధించే వాణ్ని. ఇస్మాయిల్ గారిది "టింబర్ డిపో" (అంటే కట్టెలు పేర్చినట్టుగా వుండేదని) కవిత్వం అని ఆ రోజుల్లో అజంతా గారు అనే వారు. ఇస్మాయిల్ కవిత్వం విడిగా చదివేటప్పుడు బాగానే అనిపించినా, చదివాక తీరని అసంతృప్తి కలిగించేది. ఆ దశలో నేను కొత్త హిందీ కవిత్వంలోనూ, ఉర్దూలోనూ సేదదీరాను. ఆ తరవాత, "ఇవాళ" లొ నేను రాయలనుకున్న కవిత్వ రూపానికి కొంత దగ్గిరగా వచ్చాననుకున్నా.
- "వలస" లో కొన్ని అసంతృప్తులు వున్నాయి, కాని, చాలా మందికి "వలస" నచ్చింది. "ఊరి చివర" లో నేను రూప వైవిధ్యం వైపు నడిచాను. బిస్మిల్లా ఖాన్ మీద రాసిన కవిత కానీ, "తోలు మందం" అనే కవిత గానీ, "నెత్తుటి నెమలీక" కానీ వస్తు, రూప ప్రయోగాలు. వ్యాఖ్యలు చేసే అమెరికన్ తెలుగులు నెత్తురు అనే పదం చూడగానే, పసి పిల్లల్లా భయపడుతున్నారు కాని, "నెత్తురు" అనే పదచిత్రం, పదం ఎన్ని సందర్భాల్లో ఎంత భిన్నంగా వాడానో చూడలేకపోతున్నారు.నెత్తురు అనగానే ముఖం మాడ్చుకొని కవిత్వం పక్కన పడేస్తే జాలేస్తోంది వీళ్ల మీద. "ఊరి చివర" మొహమాటాలు లేని రాజకీయ భావ ప్రకటన. అందులో రాజకీయ భావాలతో పేచీ వున్న వాళ్ళు ఇంకేమీ అనలేక కవిత్వమూ/అకవిత్వమూ/ అయోమయమూ/ లాంటి పదాల కింద దాక్కుంటున్నారు. ఇందులో గుణాత్మకమయిన మార్పు అదే. అది అర్ధం అయ్యింది కాబట్టే, కొంత మందికి ఈ మార్పుని చూడడం ఇష్టం లేదు, కనీసం కవిత్వ పాతివ్రత్యాన్ని అయినా కాపాడుకోవాలన్న పిచ్చి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నన్ను "అకవి" అన్నా నాకు పరవాలేదు, కాని, ఈ భావ ప్రకటనల నిజాన్ని ఎవరికి వాళ్ళు సొంత కళ్ళతో చూడగలిగితే చాలు. కవిత్వం కన్నా, అలాంటి "ప్రకటన" ఇప్పటి అవసరం అని నాకు రాను రానూ అర్ధం అవుతోంది. దానికి వ్యాసాలు రాసుకోవచ్చు కదా అని అతితెలివి పరులు కొంత మంది అనవచ్చు. కాని, కవిత్వం అనేది శుద్ధ వాదుల సొంత ఆస్తి కాదు కదా! ఇప్పుడు నేను చదివే ప్రపంచ కవిత్వం అంతా నాకు రాజకీయ కవిత్వంగానే కనిపిస్తోంది. "ప్రాణ హిత" లో తెరిచిన దర్వాజా ఆ రకం కవిత్వంలోకే.

(రెండో భాగం తరవాత...)
- ఇంటర్వ్యూ: నారాయణ స్వామి (ప్రాణహిత)

అలజడికి అక్షర రూపం- సాహిల్

  -పి. జ్యోతి "సాహిల్ వస్తాడు" కథా సంకలనంలో అప్సర్ గారి 11 కథలున్నాయి. ముస్లిం మైనారటి సమస్యలపై వారి దృక్పథంతో రాసిన కొన్ని కథలు ఇ...