Monday, June 15, 2015

వుంటే, సరే!

ఇవాళ సురయా పుట్టిన రోజు. ఎన్ని సార్లు విని వుంటాను, సురయా గొంతు ఇలా ఆమె స్వరంలోనూ, నా స్వరంలోనూ..ఆమె ఎందుకు పాడుతుందో నాకు తెలియక్కర్లేదు కాని, ఆ పాటలో నాకు నేనే ఎందుకు కనిపిస్తానో, వినిపిస్తానో అది నాకు కావాలి.
ఆమె స్మృతిలో పదకొండేళ్ళ కిందట - ఆమె చనిపోయినప్పుడు- రాసుకున్న కవిత ఇది. ఇందులో వాడిన చాలా ప్రతీకలూ పదచిత్రాలూ సురయా తన పాటలో ఆమె వాడినవే, ఈ కవితలో సురయా పేరు వుంది కాని, అది లేకపోయినా ఈ కవిత ఆమెకి హిందీలో వినిపిస్తే ఆమె యిట్టే గుర్తు పట్టేది ఇది తన కోసమే రాసింది అని..
~
వెనక్కి రాదు
దూరాల సొరంగంలోకి
జారిపోయాక, రైలు.
కాసేపే
ఇక్కడి యీ వెతుకులాటలూ బతుకుపాటలూ
ఎదురుచూపులూ తలపోతలూ
చివరి ఎడబాటు దాకా.
వస్తున్నప్పుడు ఎంత అలజడి!
రైలు .. రైలు .. హమారీ ఘర్‌కీ రైల్‌ .
ప్లాట్‌ఫారమ్మీద పిల్లల ఏడుపులూ
ఎదురుచూపు కొసన పెనవేసుకునే ఒత్తిళ్ళూ.
విడిపోయేటప్పటి మౌనానికి
ఏదో వొక భాషనివ్వు .. ఏదో వొక సంకేతాన్నివ్వు
కన్నీళ్ళు తప్ప.
దూరంగా మబ్బుపొరమీద పగిలిపోతుంది పాట
చూపుపొలిమేర దాటి మలుపు తిరిగే రైలుబండిలానే.
చివరాఖరి రైలుకూత గుండెలోకి దూసుకుపోతుంది.
రాత్రీపగళ్ళూ దగ్గరికొస్తూ దూరమవుతూ
అదే కూత … లోపల.
దీనికి మందు లేదు, సురయా!
నువ్వేదో పాడుకుని వెళ్ళిపోయావు కానీ
దీనికి భాష లేదు.
యీ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళినంత తేలిక.
వొక మౌనంలోంచి యింకో మౌనంలోకి
వొక నిద్రలోంచి యింకో నిద్రలోకి.
బతుకు, వొక దిల్లగీ.
ఎక్కడాలేని వూరికి గాలిరైల్లో ప్రయాణం.
పోనీలే, సురయా!
కాస్త ప్రేమా, కాస్త స్నేహమూ
కాస్త సంతోషమూ … నీకోసమే వీచే గాలీ
నీ వెంటే నడిచే ఆకాశమూ
నిన్ను మాత్రమే పాడే పాటా
చిటికెన వేలు వొదలని నీడా
అక్కడైనా వుంటాయంటావా?
వుంటే, సరే!
(మార్చి 2004)

Thursday, June 11, 2015

ఇద్దరి చీకటి


The darkness quiets if we watch it together.
-Charlotte Pence


1
చాలా సార్లు నువ్వొక గుహలాంటి చీకటి
లేదూ, చీకటిలాంటి గుహ.
కళ్ళు చికిలించుకొని అన్ని చూపుల్నీ వొక్క చోటే గుచ్చుకొని
ఎంత సేపని చూస్తానో
నీలోకి వొకింత కూడా రాలేను, నువ్వూ రానివ్వవు
నీ ఎత్తాటి గోడల మధ్యకు-
వొక్క చినుకయ్యీ రాలలేను, నువ్వూ రాలవు
ఎవరి ఎడారిలో వాళ్ళం!
అయినా గానీ
ఎంత ఆశగా చూస్తూ వుంటానో పసి కళ్ళ దాహంతో-


2
వద్దు వద్దని నువ్వు చెప్తూనే వుంటావ్ కానీ
ఇసక కంటే పొడి పొడిగా వుండే
ఆ కొద్ది మాటల్నే వొకటికి పదిసార్లు చదువుకుంటూ వుండిపోతాను
మునిమాపు చీకట్నించి నట్టనడి రాత్రి దాకా
నీ వాక్యాల చుట్టూరా మూగ దీపమై వెలుగుతూ వుంటాను,
ఎంత చలి నెగడునై కాలిపోతూ వుంటానో
తెగే నరాల ఉన్మత్తతలో-


3
సమూహలకేమీ కొదువ లేదు యిక్కడ
పలకరింపుల వానలకూ తెరపి లేదు
యింకాస్త గుండె ఖాళీ చేసుకొని
వూరికే వచ్చెళ్ళే తడినీడలూ కొన్ని.
అయినా గానీ,
అన్నిట్లోనూ అందరిలోనూ వొక్క నువ్వే నా కళ్ళకి-
యీ చుట్టూ శేష ప్రపంచమంతా గుడ్డి గవ్వయిపోతుంది నాకు.


4
నిజమే, కలిసి చూసే వెలుగులూ వుంటాయి,
అడుగులు కలిపే మలుపులూ వుంటాయి
మరీ ముఖ్యంగా
యిద్దరమూ వొకే చీకట్ని కలిసి చూస్తున్నప్పుడు
వొక నమ్మకమేదో వెలుగై ప్రవహిస్తుంది
రెండు దేహాల నిండా-
అవునా? కాదా?
అవుననో కాదనో కూడా చెప్పవా?!

Monday, June 8, 2015

ఆ చిన్ని పాదాలు




ఎంతో కొంత దూరం నడిచాక నీ నీడతో మాత్రమే తలపడే వొంటరితనాన్ని సాధించుకున్నాక నిన్ను నువ్వు తప్ప ఇంకెవరూ వేధించలేని సాధించలేని బాధించలేని నొప్పించలేని అనేక లేనితనాల పతాకాలు దారిపొడవునా నువ్వు పాతుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు
జీవితం నిన్ను కాసేపు ఆపితే ఆగిపో.
ఆగిపోవడం తప్పేమీ కాదు, ఎవరో విధించిన శిక్ష కూడా కాదు
కాసేపు నిన్ను ఆపాలని ఎందుకనుకుందో జీవితం!

2

వెనక్కి చూస్తావ్ నువ్వు చూస్తూ వుండు చూస్తూ చూస్తూ వెనక్కి వెళ్ళినా వెళ్ళు. జీవితం నిన్ను వెనక్కి పంపాలనే అనుకుంటే వెనక్కే వెళ్లి రా. కాస్త ప్రేమగానే వెళ్ళు. మనసు తలపులన్నీ ఎంచక్కా తెరుచుకుంటూనే వెళ్ళు. ఎవరన్నారు వెనక్కి వేసే ఆ అడుగులు వెనక్కే అని!
ఎంత నిదానంగా వెనకడుగులు వేసావో, అంత తపనగా మళ్ళీ ఆ అడుగులన్నీ జీవితం నించి అడిగి అడిగి తెచ్చుకుంటావ్ నువ్వే!

3

ఇవాళ ఈ చిన్ని పాదాల్లోకి వలస వెళ్లి వచ్చాను. తొలినడకల్లో మరచిపోయిన నా పాఠాలన్నీ మళ్ళీ వల్లెవేసుకున్నాను. ఆ తడబడు అడుగుల లేత అందాలన్నీ వొక వూహలో వొంపుకున్నాను.

4

అవున్రా, ఇవాళ నా అడుగులు నాకు దొరికాయి.
నీకు చెప్పాలని పరిగెత్తుకు వచ్చానా, నువ్వెక్కడో అందనంత దూరంలో వున్నావ్!

5

నీ దూరంలోకి నేనూ
నా దగ్గిరలోకి నువ్వూ వచ్చి
వొక అడుగు అవుతామా ఎప్పుడైనా?!
ఆ చిన్ని పాదాల తడబాటులోకి వెళ్లి వస్తామా ఎప్పుడైనా?!

(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)

Friday, June 5, 2015

యింకేమీ కాదు


~
తెలుస్తూనే వుంటుంది,
దూరంగా వున్నప్పుడే యింకా ఎక్కువగా-
నేను తప్ప ఇంకెవరూ లేని గదిలో
వొక పక్కకి తిరిగి గోడవేపు చూస్తూ
నన్ను నేనే పలకరించుకున్నంత నింపాదిగా
ఆ చీకట్లోని నీడల్ని మెత్తని చూపుల్తో నిమురుతూ –
మాట్లాడుతూ వుండాలని అలా మాటల్లోకి అన్ని నిస్పృహల్నీ
గ్లాసులోకి నీళ్ళలా వొంపాలనీ
అంతే తేలికగా వాటిని మళ్ళీ గొంతులోకి కూడా వొంపేసి
అటునించి శరీరంలోకీ
యింకిపోయేంత హాయిగా మరచిపోవాలనీ అనుకుంటాను.
ఇదంతా యింకేమీ కాదు
కాస్త అలవాటు పడాలి, అంతే!
2
శరీరాన్ని బయటికి ఈడ్చుకెళ్తే గాలి మారుతుందని
అమాయకంగా నన్ను నేను నమ్మించుకొని
సాయంత్రపు చలిలోకి మనసంతా ముడుచుకొని నడుస్తూ వెళ్తాను
ఎక్కడికని? ఎంత దూరమో వెళ్ళను గానీ,
వెళ్ళిన దారంతా బెంగపడిన పక్షిలా మెలికలు తిరుగుతుంది.
వొంటరిగా వున్నప్పుడు వొంటరి పక్షిని అసలే చూడలేను.
ఇదంతా యింకేమీ కాదు
నువ్వు దేనికీ అలవాటు పడలేవని ఇంకో సారి తెలుస్తుంది తప్ప!
3
దగ్గిరగా వున్నప్పుడు
తెలిసినతనంలో ఏదో తెలియనితనమే ఎక్కువ.
తెలుసు అనుకుంటాం కానీ, ఏమీ తెలియదు నిజంగా-
దూరంగా వున్నప్పుడే
నా వొంటిని నేనే తాకి తాకి
కొలుస్తూ వుంటాను, నీ జ్వరాన్ని-

Sunday, May 31, 2015

తెంపుకొచ్చిన నీలిమలు కొన్ని




1
నీలాంటిదే
వొక నింగి నీలిమని
నేనూ తుంచి తెచ్చుకుంటాను,
నిదానంగా కొమ్మని వొంచి పూవుని తెంపినట్టే.
ఎందుకనిపిస్తుందో
ఎప్పుడూ
నాదే నాదే అయిన వొక ఆకాశం కావాలనీ,
నాదే
నాదే అయిన వొక పూవు కావాలనీ.
2
నాదీ నీదీ
నీదీ నాదీ అనుకున్న అనుక్షణం
తెలుసు కదా, తెలుసు కదా
యెన్ని ఆకాశాలు చేజారిపోయాయో, పొద్దుటి పూలలా.
యెన్ని పూలు వాలిపోయాయో సాయంత్రపు మట్టిలోకి.

అయినా
యెందుకో తెంపుకొస్తూనే వుంటాం,
నీ పూలు నువ్వూ
నా ఆకాశాలు నేనూ.
*

Friday, May 29, 2015

ఫనా


1
ఆడుకుంటున్నా నాలో నేను
నీతో నేను.
నీ వూహ వొక సాకు నాకు.
తిరిగే విరిగే అలలో గడ్డ కట్టుకుపోతున్నా,
నా లోపలి నీలోకి / నీ లోపలి నాలోకి
నన్నే విసురుకునే ఆటబొమ్మనై.
2
ఎన్ని దూరాలు కలిపితే
వొక అస్థిర బైరాగినవుతానో,
ఎన్ని తీరాలు గాయాలై సలిపితే
వొక నిర్లక్ష్య సూఫీనవుతానో!
ఇదీ వొక ఆటే కదా నీ చుట్టూ
నేను బొంగరమయి తిరగడానికి!
3
కొలమానాలన్నీ గాల్లోకి
చిలిపిగా విసిరేసి
నీ లోపల శిధిలమయిపోనీ నిబ్బరంగా!
(ఫనా వొక సూఫీ భావన. “నేను” అనేది కనిపించనంతగా “నువ్వు” అనే భావనలో లీనమయిపోవడం!)

Wednesday, May 27, 2015

కాసింత సంతోషం!

గదినిండా చీకట్లు మాత్రమే పొర్లి, పొంగుతున్నప్పుడు
అవును, కచ్చితంగా అప్పుడే
కాసింత సంతోషంగా వున్నప్పటి వొకానొక పూర్వ క్షణపు దీపాన్ని మళ్ళీ వెలిగించు.
ఆ వెలుగులో నువ్వేమేం చేసి వుంటావో
వొక్క సారి- కనీసం వొక్కసారి- వూహించు.

మరీ పెద్దవి కాదులే, చిన్ని చిన్ని సంకేతాలు చాలు.

1
బహుశా మండుటెండ విరగబడే మధ్యాన్నంలో నువ్వు
వూరిచివర చెరువుని వెతుక్కుంటూ వెళ్లి వుంటావ్
శరీరాన్ని గాలిపటం చేసి ప్రతినీటి బిందువులోనూ వొక ఆకాశాన్ని దిగవిడుచుకొని
రంగురంగులుగా ఆ నీటి వలయాల్లోకి ఎగిరిపోతూ వుండి వుంటావ్.

యిప్పుడు అంతగా గుర్తు లేదేమో కాని,
ఆ చెరువుతోనూ ఆ ఆకాశమూ నువ్వూ వొకే భాషలో మాట్లాడుకొని వుండి వుంటారు,
వొకరిలోకి ఇంకొకరు తొంగి చూసుకొని వుంటారు నీటిలోపలి చందమామలా.

2
పల్లె రాదారి మీద ముగ్గురు నలుగురు పిల్లలు యీ లోకాన్ని బేఖాతర్ చేసేస్తూ
కబుర్ల సముద్రంలో మునకలు వేస్తూ వెళ్తున్నప్పుడు
వాళ్ళల్లో యెవరిదో వొక పసిచూపులోకి చెంగున గెంతి
నీ బాల్యపు చేలన్నీ పెద్ద పెద్ద అంగలతో దాటేసి వుంటావ్ వెనకెనక్కి-

యిప్పుడు అసలేమీ గుర్తు లేదేమో కాని,
అప్పుడు నీ వొంటిమీది పెద్దరికపు పొరలు రాలిపోయి
నువ్వు మళ్ళీ నగ్నంగా నిలబడే వుంటావ్,
ఆ పిల్లలు నీ ముందు నిలువుటద్దాలై నిలిచినప్పుడు-

ఎవరికీ చెప్పలేకపోవచ్చు కానీ
నువ్వు ఎంత దిగులుపడ్తున్నావో
వొక్కో సారి రాత్రీ పగలూ తెలియని కాలాల్లోకి యెలాగెలా జారుకుంటూ వెళ్ళిపోతున్నావో
అటు ఇటు ఎటు మళ్ళినా ఏడుపువై ఎలా పగిలిపోతున్నావో తెలుసు కాని-

కాసింత సంతోషంగా వున్నప్పుడు
కచ్చితంగా ఆ క్షణంలో నువ్వూ నేనూ యిద్దరు పిల్లలమై రెండు వూహలమై
వూయల వూగామే అనుకో,
అప్పుడు యీ దేహాలూ ఈ నిజాలూ గాలికన్నా తేలిక.

యిప్పుడు నువ్వు కనీసం వొక సంతోషపు అలలో,
అలలోపలి సంతోషపు కడలిలో
కొంచెమే అయినా సరే,
తేలిపో.
యిప్పుడు నువ్వు కనీసం వొక దీపం కళ్ళల్లో
కళ్ళలోని వెల్తురు నీడల్లో
కొంచెమే అయినా సరే,
వెలిగి రా!
4
జీవితం ఎప్పుడూ ఉత్సవమే కానక్కర్లేదు
కాసింత సంతోషపు చిన్ని సంకేతమైనా చాలు!

Tuesday, May 26, 2015

నేల కంపిస్తుందని తెలియని నీకు…



nepal


1.
నీ కాళ్ళ కింద భూమి ఎప్పుడూ వణికి పోలేదు కాబట్టి, 
లేదూ  కాస్తయినా జారిపోలేదు కాబట్టీ, నీకు యింకా చాలా తెలియవ్.
 నిజానికి ఈ వివర్ణ ముఖాల నగరపు చలి  తప్ప 
యింకే జీవన్మరణ ప్రకంపనలూ తెలియవు కాబట్టి 
నీకు నువ్వో ఆ అవతలి ఇంకొక ముఖమో తెలియనే తెలియదు.
 చలిలో ఎండాకాలాన్నీ, ఎండలో చలికాలాన్నీ 
అందంగా పునఃసృష్టించుకునే తెలివో తేటదనమో నీకు ఉండనే వుంది కాబట్టి 
అసలే జీవితం ఎలా తెల్లారుతుందో, 
అంత హటాత్తుగానే ఏ మరణం ఎందుకు దాపురిస్తుందో నీకు యెప్పటికీ తెలియకనే పోవచ్చు.
కాని, అసలవేవీ జీవితమే కాదంటావే, 
అదిగో అక్కడే నీ రహస్యం అంతా నిద్రపోతూ వుంటుంది, వొళ్ళూపై  లేకుండా!

2.
యెప్పటి నించి ఆలోచించడం మొదలు పెట్టావో నువ్వు, 
యెప్పటి నించి దేన్ని యెలా అనుభవించడం మొదలెట్టావో నువ్వు,
 వొక బాధలో యింకో వొంటరితనంలో 
మరింకో చావు కన్నా పీడలాంటి బతుకులో యేది యెందుకు యెలా కమ్ముకొస్తుందో 
యెవరిని యే క్షణం యెలా కుమ్మేస్తూ పోతుందో ఏదీ ఏదీ  నీ వూహకి కూడా అందదు.
 నువ్వొక అద్దాల గదిలోపల గదిలో సమాధి తవ్వుకుంటూ వుంటావ్! 
దాన్ని  తెరిచే సూర్యకిరణపు తాళం చేయిని యెక్కడో పారేసుకుని వుంటావ్!

3.
 నువ్వు పడుకున్న గదిలో కాస్త చలిగా వుందనో, 
నీ పక్కన పడుకున్న దేహంలో కొంత  వెచ్చదనం చచ్చిపోయిందనో,
 నువ్వు ఎక్కాల్సిన మెట్టు చూస్తూ చూస్తూ వుండగానే చప్పున జారిపోయిందనో 

రాత్రీ పగలూ గుండెలు బాదుకొని యేడుస్తూ వుండిపోతావ్ తప్ప,
 యింకో గుండెలోకి  ప్రవేశించి అక్కడి గాయాన్ని పలకరించి రాలేవ్ నువ్వు. 
వొక కోరిక నించి యింకో కోరికలోకి వలసెళ్ళే ఏమరుపాటులోనో తొందరపాటులోనో
 అన్ని స్థలాలూ, కాలాలూ, వూహలూ చెక్కుచెదరని అందమైన అమరిక  నీకు. 

మహా బలిదానాలే చేయక్కర్లేదు,
 కాని కనీసం వొక అరచుక్క కంట తడిని ఎవరికోసమూ రాల్చలేవు కదా నువ్వు.
4.
ఇవాళ నేలా వణికి పోతుంది గజగజ.
రేపు ఆకాశమూ తొణికిపోతుంది వానచుక్కలా.
యీ సూర్యుడూ యీ చంద్రుడూ యింకేవీ నిలబడవ్ యింత ఠీవిగా యిప్పటిలాగానే.
జీవితం కొన్ని చేతుల్లోంచి యెట్లా పట్టుతప్పి పోతుందో
అలాగే కచ్చితంగా అలాగే ఇవన్నీ నెలవు తప్పి ఎటేటో రాలిపోతాయి,
నీకేమీ చెప్పకుండానే.

5.
నిజంగా
నీకు యింకా చాలా జీవితం తెలియనే  తెలియదు,
నీ కాళ్ళ కింద భూమి ఎప్పుడూ వణికి పోలేదు కాబట్టే!



Sunday, January 25, 2015

లోపలి ప్రయాణాలూ సాహసయాత్రలే!



17-మే-2013

Flash upon that inward eye
Which is the bliss of solitude.
టీనేజీ ఉరుకుల పరుగులలో ఈ వాక్యం మొదటి సారి విన్నప్పుడు ఆ solitude గానీ, ఆ inward eye గురించి గాని నాకు పెద్దగా తెలియదనే చెప్పాలి. కానీ, ఆ వాక్యం విన్నాక Wordsworth గురించి ఇంకా తెలుసుకోవాలనిపించింది. బాహ్యజీవితం అంత హుషారుగా అనిపించని ఆ కాలంలో నేను Wordsworth చేతివేలు పట్టుకొని ఏవేవో వూహారణ్యాల్లో దారి తప్పే వాణ్ని, అతనే చెప్పిన ఆ inward eye మెరుపులు చూపుల్ని వెలిగిస్తూ వుండగా!
నిజమే, జీవితం ఎవరికీ సాఫీగా వుండదు. పోనీ అని, సూఫీగానూ వుండలేం! కుదుపులు వుంటాయి, వొళ్లు కదుము కట్టే దిగుళ్లూ వుంటాయి. కానీ, వాటిని కూడా ఉత్సాహంగా తీసుకునే శక్తి సంపాదించుకుంటే…అప్పుడేం చేస్తుందీ పాడు బతుకు?!
అలా ఉత్సాహంగా తీసుకునే శక్తి వూరికే రాదు, inward eye తో మన లోపలి లోకాల్లోకి ప్రయాణాలు చేస్తున్నప్పుడే అది సాధ్యం! ఈ లోప్రయాణం ఎలా వుంటుంది? నిజంగా ఈ ప్రయాణానికి మనం ఎప్పుడేనా సిద్ధంగా వుండగలమా? వున్నా, ఆ ప్రయాణం తుదకంటా వెళ్లగలమా? వెళ్ళినా తిరిగి రాగలమా? రాగలగినా అంతకు ముందులాంటి జీవితాన్ని జీవించగలమా? ఇవి తేలికగా అనిపించే గట్టి ప్రశ్నలు. సమాధానాలు ఎవరిదగ్గిరా సిద్ధంగా వుండవు, సిద్ధంగా వున్న సమాధానాలు ఎవరినీ సమాధాన పరచలేవు. ఎందుకంటే, ఎవరి ప్రయాణం వాళ్ళదే! ఎవరి అనుభవం వాళ్ళదే! కానీ, అనుభవమున్న ఇంకో పూర్వయాత్రికుడు కొన్ని వెలుగురేఖలు చూపించవచ్చు. వేలు పట్టి నడిపించకపోయినా, ముందుకు నడిపించే వొక సంకేతాన్ని అందించవచ్చు. ఇలాంటి వొక సంకేతశిల్పి సాయికిరణ్! గత నెల రోజులుగా ఈ శిల్పి చెక్కిన వొక ‘అంతర్యాన’ చిత్రపటం చేతుల్లో పెట్టుకొని నేను గడిచివచ్చిన కొన్ని దారుల్ని చూపించాలని ఇక్కడ నా ప్రయత్నం. ఇది కేవలం నా దారి, నా ప్రయత్నం. మీ మీ ప్రయాణాలకు వాటి దిగుళ్ళకీ నేను ఏ రకంగానూ పూచీపడడం లేదు.
2
ఎక్కడయినా వొంటరిగా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు వొకట్రెండు పుస్తకాలూ, కొన్ని ఆలోచనల్ని తోడు తీసుకెళ్ళడం నాకు అలవాటు. పోయిన నెల Raleigh-Durham వెళ్తూ, సాయికిరణ్ కవిత్వం ‘అంతర్యానం’ తోడు దొరికింది. ఇక ఆలోచనలు బోలెడు!
ప్రయాణం మొదలయిన కొద్ది సేపటికి ఆకాశ మార్గంలో విమానం కొన్ని మబ్బుల్లో చిక్కుకుంది. తలెత్తి చూస్తే మబ్బులు హడావుడిగా పరుగులు తీస్తున్నాయి. మబ్బుల మెట్ల మీంచి కిందికి దిగే ప్రయత్నంలో వుంది విమానం. అప్పుడు వొక్క కుదుపు ఇచ్చింది విమానం, వొక్కసారిగా రెండు మూడు మెట్లు దూకేసే అల్లరమ్మాయిలాగా! “ఎందుకింత తొందరా?!” అనుకుంటూ నేను అప్పటిదాకా నా లాప్ టాప్ లో చదువుతూ వున్న సాయికిరణ్ కవిత్వ పుస్తకాన్ని పక్కన పెట్టాను. కాసేపు నిబ్బరంగా వున్నాను కానీ, విమానంలోని అనౌన్సర్ ప్రకటనలూ, నా ఇరువేపులా ప్రయాణికుల కంగారూ చూసి నేనూ కాస్త కంగారు నటించక తప్పలేదు. అవును, నటనే! “ఏం ఈ మాత్రం కుదుపులు భరించలేమా?” అన్నది నా లోపలి పొగరుమోతు మోటు సమాధానం! ఆ సమాధానానికి లోపల్నించి సాయికిరణ్ వత్తాసు!
మబ్బుల రాపిళ్లకు
ఆకాశం
రంగు మార్చే లోపు
నీడ పొడవు
నిర్ధారించుకోవాలి.
అంటున్నాడు సాయికిరణ్. వూరికే అనడం లేదు, జీవితంతో చాలా పెద్ద లెక్క తేల్చుకోడానికి సిద్ధపడే ఇంత మాటా అంటున్నాడు. ఇలా అనడానికి సాఫీగా సాగే జీవితాన్నే కాదు, తట్టుకోలేని కుదుపుల్ని కూడా ఎన్నో చూసి వుండాలి సాయి. ఎంతో తట్టుకొని నిలబడితే తప్ప ఈ నిబ్బరపు పాఠం మనకి చెప్పలేడు కదా మరి! ఈ కాలపు కవిత్వంలో ఇదే సాయిమార్గం!
మీరు ఇప్పటికే ఈ పుస్తకం చూసి వుండకపోతే – వొక విషయం మీకు ముందే చెప్పాలి. ఈ పుస్తకాన్ని నేను వెనక నించి చదువుతున్నాను. ఇప్పుడు చెప్పిన కవిత ఈ పుస్తకానికి ‘ముగింపు.’ నాకూ సాయికి (?) కొన్ని సాధారణ అసాధారణ లక్షణాలున్నాయి. అందులో వొకటి: కవిత్వ పుస్తకాన్ని వెనక నించి చదవాలన్న తిక్క. అయితే, నేను వొకే పుస్తకాన్ని అనేక సార్లు చదివే అలవాటు వున్న వాడిని కాబట్టి, మొదటి సారి చదివినప్పుడు తిక్కగా వెనక నించి చదివి, రెండో సారి చదివేటప్పుడు చక్కగా ముందు పేజీ నించి చదువుతాను. ఈ అలవాటుకి కారణమేమిటంటే: నా మటుకు నాకు సస్పెన్సు తట్టుకునే శక్తి లేకపోవడమే! చివరికేమిటీ గొడవ అన్నది మొదలే తేలిపోయిందనుకోండి – సినిమా కవిగారెవరో చెప్పినట్టు- ‘మనసు కాస్త కుదుటపడతది.’ ఇలాంటి అసాధారణ లక్షణాన్ని సాయికిరణ్ చాలా అందంగా కవిత్వం చేశాడు ఇక్కడ –
పుస్తకంలా
విచ్చుకున్న ఆకాశం
ఎగురుతున్న కాగితంలా
సముద్రం
పాతుకుపోయిన కాళ్ళు
పెరుక్కోలేని చెట్టులా
నేను
ఎటు నుంచి చదవాల్సిన
పుస్తకం ఇది?
ఈ కవితలో మొదటి రెండు – ఆకాశమూ, సముద్రమూ(అంటే – పుస్తకమూ, కాగితమూ) చలనశీలమైనవి కవి దృశ్యీకరించిన ప్రకారం చెట్టు (అంటే, ‘నేను’) చలనరహితం. మామూలుగా చెట్టు చలనరహితం కాదు. కాళ్ళు పెరుక్కోలేని తనం వున్నప్పటికీ చెట్టు నిలువునా కదులుతుంది. అయితే, ఈ కవితని కేవలం ఈ వాచ్యార్ధాలలో తేల్చుకోలేం. ఈ కవిత ప్రకృతిలో మన ఉనికి కంటే కూడా ఎక్కువగా మొత్తంగా కవిత్వ అనుభవంలో లేదా జీవిత అనుభవంలో మన ఉనికికి సంబంధించింది. కవిత్వం అనే అనుభవ మంటపంలో కూర్చున్నప్పుడు మనం ఎక్కడా అన్న ప్రశ్నకి సమాధానం వెతుక్కునే కవిత ఇది.
ఆ కవిత చదువుతున్నప్పుడు అందులోని వాక్య సముదాయాలు రేపే సంచలనం ముందు మనం కాసేపు నిశ్చలనంగానే వుండిపోవాలి. తప్పదు. తను ఆ అనుభవాన్ని ఎటు నించి చూడాలన్నది కూడా సందిగ్ధమే. అదీ తప్పదు. కవిత్వంలోని రహస్యం ఏమిటంటే అది అనేకర్ధాల తలుపులు తెరుచుకోడానికి సిద్ధంగా వుంటుంది. వాటిని మనస్ఫూర్తిగా వొప్పుకోవడంతో సాయి ‘అంతర్యానం’లోని వొక చిక్కుముడి ఇట్టే విడిపోతుంది మనకి! ఈ పుస్తకంలోని ఏ కవితనయినా మీరు వొకసారి చదివి పక్కన పెట్టలేరు. ఆ వొకసారి చదివిన అనుభవాన్ని అలా జాగ్రత్తచేసుకుంటున్నప్పుడే సాయి ఇంకోసారి చదివింపజేసుకొని ఇంకో అనుభవద్వారాన్ని తెరుస్తాడు. అందుకే, నేను ఈ కవిత్వాన్ని ఆగి ఆగి చదివాను. ముందుకీ వెనక్కీ వెళ్తూ చదివాను. కానీ, ప్రతిసారీ ‘ఎటు నించి చదవాల్సిన పుస్తకం ఇది?” అన్న ప్రశ్న నాకు మిగిలిపోయింది. తమ్ముడు ఇక్బాల్ చంద్ ఈ కవిత్వాన్ని ‘ప్యూర్ పొయెట్రీ’ అంటున్నాడు. అలా అంటున్నప్పుడు ఆ purity ని తమ్ముడు ఎలా అర్థం చేసుకున్నాడో తెలీదు కానీ, నాకు మాత్రం ఈ పఠనం వల్ల కలిగే వొక స్వచ్చమయిన మెరుపు -పొద్దుటి కొద్దిపాటి వానలో తడిసిన ఆకు – మాదిరిగా అనిపిస్తుంది.
3
సాయి కవిత్వంలో ఇంకో అందం ఏమిటంటే: అది మన అనుభవ క్షేత్రంలోనే సంచరిస్తుంది. ఈ నలభై పైగా కవితల్లో ప్రతీదీ మన అనుభవమే; వొక వేళ మన అనుభవంలో లేని విషయం ఏదన్నా చెబితే, దాన్ని వెంటనే మన అనుభవంలోకి తీసుకు వచ్చే సరళమయిన మనసూ, నిండయిన భాషా సాయి దగ్గిర వున్నాయి. ఉదాహరణకి: ‘వలయాలు’ లాంటి కవితలు.
చినుకు పోట్లకి
ఛిద్రమయిన సెలయేరులా
నా వలయంలో
నేను తిరుగుతూనే వుంటాను
చీకటి తెలియని
రాత్రి కోసం.
చదవడానికి తేలికగా అనిపించే కవిత ఇది. కానీ, ఇందులో శబ్ద/ అర్థ వలయాలు చుట్టుకుంటూ వెళ్తే, భారతీయ తత్వశాస్త్ర చరిత్ర అంతా కనిపిస్తుంది. చదువరి మనసు/ ఆలోచన రెండూ ఎంత దూరం వెళ్తే అంత దూరం లాక్కు వెళ్ళడం మంచి కవిత్వ లక్షణాల్లో వొకటని నా నమ్మకం. సాయి కవిత్వంలో అలాంటి ఉదాహరణలు చాలా దొరుకుతాయి. వూరికే వొక్క సారి చదివినప్పుడు సాయి మంచి అనుభూతి శకలం పట్టుకున్నాడే అనిపిస్తుంది. కానీ, ఆ శకలాన్ని పట్టుకుని ముందుకు వెళ్తే, పెద్ద డొంక ఏదో కదులుతుంది. అయితే, ఇది ముళ్ళ డొంక కాదు. జీవితాన్ని కంటి ముందు దృశ్యంలా పరచి అర్థాలు వెతుక్కోమనే పూలూ ముళ్లూ రాళ్లూ కలిసిన దారి. ఈ విషయం ఇంకా స్పష్టంగా తెలియాలంటే మీరు సాయి రాసిన ‘అంతర్యానం’ కవిత రెండు మూడు సార్లు చదవాలి. ఇందులో నాకు బాగా నచ్చిన పంక్తి ఇది:
సందేహ సముద్రంలో
చంద్రుడినై
అలల రాపిడి మధ్య
కాసేపు అస్తిత్వం కోల్పోతా.
ఈ వాక్యం నేను నాలోని భిన్న మానసిక/ భౌతిక స్థితులకు అన్వయించుకుంటూ కనీసం అరడజను సార్లు చదువుకున్నాను. గాయమ్మీద లేపనం రాసే వేళ్ళల్లో వుండే శక్తి ఏదో ఈ వాక్యాల్లో వుంది.
కవిత్వ వాక్యం మీద సాయికి చాలా పట్టింపు. వొక్క అనవసరమయిన పదమూ పడకుండా రాసింది కన్నా చెరిపింది ఎక్కువ అన్న భావం గట్టిగా కలుగుతుంది మొత్తం కవిత్వం చదివాక! ఇలాంటప్పుడు కూడా పునరుక్తి/ recurring images దొరక్కపోలేదు. పుస్తకం, జ్నాపకం, మబ్బు…ఇవి లేకుండా సాయి కవిత్వం రాయలేడా అనిపించింది కొన్ని సార్లు! ప్రతి రచయితకీ కొన్ని hanging words వుంటాయని బుచ్చిబాబు ఎక్కడో రాశాడు; అంటే, రచయిత ఉద్దేశపూర్వకంగానో, నిరుద్దేశపూర్వకంగానో కొన్ని పదాలలో repeat అవుతాడు. సాయి ‘అంతర్యానం’లో కూడా అలాంటి పదాలు దొరుకుతాయి. కానీ, అవి పంటి కింద రాయిలా తగలకుండా చూసుకోవడం సాయికి తెలుసు. అయినా సరే, అలాంటి పునరుక్తి లేని పునర్యానం కోసం ఎదురుచూస్తున్నా.

Sunday, December 28, 2014

మనిద్దరి గాయాలూ..



నాకు తెలుసు వొక్క ఏడుపే మిగులుతోంది ప్రతి సన్నివేశం చివరా! ఈ సన్నివేశంలో కూడా నీ కోసం బోలెడంత దుఃఖాన్నే మోసుకొస్తున్నందుకు ఈ సారికి కూడా క్షమించు. ఎప్పుడూ క్షమించేది నువ్వే కదా! నా లోపలి క్షమా కణాలన్నీ చచ్చిపోయి కొన్ని తరాలయిందిగా! ఈ వొక్క క్షణాన్నయినా భయాలు లేని, గాయాలు లేని, సంకోచాలు లేని, సంశయాలు లేని  నీ ‘నిర్భయ’ స్నేహంలోకి, వేధింపులు  కాని ప్రేమలోకి, అనుమానాలు అత్యాచారాల్లేని సాహచర్యంలోకి ప్రయాణించగలనా?

1
          ఎంతకీ నువ్వంటే వొక శరీరమే నాకు?!

అవునా?
కాదని చెప్పే క్షణం కోసం కొన్ని యుగాలయింది ఎదురుచూసీ, చూసీ!

నీ చిరునవ్వులకు బదులు నీ పెదాలే కోసుకొస్తున్నానా ప్రతిసారీ?
 నీ గుండె చప్పుళ్ళకు బదులు నీ వక్షోజాల బరువులే కొలుస్తూ వున్నానా ఎప్పుడూ?
 చిగురాకు కన్నా మెత్తనయిన నీ అలికిడి
నాలో మోగించే చిన్ని సంగీతపు  అలలకి చెవొగ్గే బదులు
 నీ పొడుగాటి కాళ్ళ మధ్య ఏదో వొక వాంఛా ద్రవంగా తప్ప మిగల్లేకపోతున్నానా?

ఇప్పటికీ ప్రశ్న ఎన్ని సార్లు నా అద్దంలో నిలబడి నన్నూ
నాలోపల ఎలాగోలా వొదిగి వుండాలనే నిన్నూ  గుచ్చి గుచ్చి అడిగానో తెలీదు.
రెండూ శరీరాలే…కానీ, ఈ రెండు శరీరాల మధ్య ఇంత పెద్ద లోయ తెలీదు…. ఎందుకో!

2
 
          మాధానం కోసం నిజంగా ఎదురుచూశానా?
అనేక సూర్యచంద్రుళ్ళ శాఖా చంక్రమణాల్లో నీ కోసం
 ఎప్పుడూ ఎదురుచూస్తూ నిలబడే అమ్మనయ్యానా నిజంగా ఎప్పుడయినా?
 ఆ కళ్లలోని రెండు కరుణ సముద్రాల్లో కనీసం వొక నీటి చుక్కనయ్యానా పోనీ?
ప్రమాదాలు దారికాసే నీ ఏ మలుపులోనయినా
వొక స్నేహితుడి పలకరింతనయ్యానా  ఎక్కడయినా?
 నన్ను తనలోకి లాక్కునే ప్రతి చీకట్లో వొక వెలుగు చెయ్యివై
 నువ్వు అందుకున్నప్పుడు తోడు నడిచినప్పుడు ఆ స్పర్శని గుర్తుంచుకున్నానా పోనీ?

3
 
          నా సమాధానాలు నిజంగా
నా లోపలికి ఇంకాయో లేదో నిన్నూ అడగలేదు,
నన్ను నేనూ అడుక్కోలేదు.
ఈ ప్రశ్నలెప్పుడూ మనిద్దరితో ఆడుకుంటూనే వున్నాయ్.

ఈ ఆట వొక వేట! అలుపు లేదు నా మగతనానికి! నా అంగాంగ అహంకారానికి!
ఆయుధాలు మార్చి మార్చి ప్రయోగించే
 కొత్త విద్యలేవో నేర్చుకుంటూనే వున్నా ఎప్పటికప్పుడు అలసిపోకుండా!

ఎంత చెప్పు,
నేను నా కలుగులోకి దూరి సంతసించే విర్రవీగే  నా మగతనపు మృగయా వినోదినే ఎప్పుడే!


4
          చీకటి ఇంతే
నా దేహపు గూటిలో వొక స్త్రీత్వపు దీపం వెలిగితే తప్ప !

నా వెతుకులాటా  ఇంతే
నిన్ను వెతుక్కునే దీపమే నేనయితే తప్ప!

Thursday, May 2, 2013

నది చుట్టూ పది పద్యాలు




1

అవే పాదాలు

అవే అడుగులు

ఇక్కడేమో నేలని మోస్తున్నంత

దిగాలుగా ఇసకరోడ్లలో దిగబడ్తుంటాయి

నీ దగ్గిరేమో  నింగి అందుకుంటున్నంత

తేలికగా గాలి రెక్కల మీద ఎగుర్తుంటాయి.

2

నది కాళ్ళ దగ్గిర

తల వంచి నిల్చున్నప్పుడు నేనేమడిగానో నాకు గుర్తు లేదు.

నిద్రపట్టనప్పుడు

నీ రెండు చేతులూ భుజమ్మీద వూయెలూగి

కలలన్నీ కరిగి కళ్లలోకి నది పొంగుకొచ్చింది.

తెల్లారబోతున్నప్పుడు నేనొక సముద్రాన్నని తెలిసింది.

3

అక్కడ రెండు గట్ల మధ్య వొరుసుకుపోతున్న

నీళ్ళు

నీకు అద్దంలా కనిపిస్తాయి స్వచ్ఛంగా.

ఏమిటో గుర్తొస్తున్నట్టు

అలా ఆ విరిగిపోతున్న నీటి బింబాల మధ్య

నువ్వు

ప్రతిబింబాలను ఏరుకుంటూ వుంటావు.

4

వొక మంచు పర్వతాన్ని

ముక్కలుగా తెగనరుకుతున్న చప్పుడు నేను వింటాను

ఎండ దుప్పటి కప్పుకొని

చలిగాలులు ఉదయాన్ని కోసుకుంటూ వెళ్లిపోతాయి.

నా వొంటి మీద వాల్తున్న నీరెండలోంచి

కంటిరెప్పలతో నన్ను కాచుకున్న నీలోంచి

నిశ్శబ్దంగా బయటికి వస్తున్నప్పుడు

నేను కుప్పకూలిపోతున్న మంచు కొండని.

5

ఎక్కడికీ వెళ్లనంటాను

నా వొళ్లోనే నదిని దాచుకుంటాను.

దూరాన  కొండ భుజానికి ఆనుకుని నిల్చున్న ఆకాశం.

అక్కడ చూడు,

నీటి వొంటి మీంచి జారిపోతున్న పడవ.

తీరా చూస్తే, నది నువ్వు- పడవ నేను.

6

మరీ చీకటప్పుడు ఆ చివ్వరికి నడుచుకుంటూ వెళ్ళామా?

నీటి గుండెలు ఎలా పగిలిపోతున్నాయో తెలిసిందా?

ఇంత నిశ్శబ్దాన్ని

ఈ చెట్లూ చేమలూ

ఈ కొండలూ ఈ గుట్టలూ

ఈ నేలా ఈ ఆకాశమూ నిజంగా భరిస్తాయా?

వంతెన మీంచి నడిచివెళ్తున్న పాదాల కింద

ఏమిటేమిటో కూలిపోతున్నాయో

వింటున్నావో లేదో అనుకుంటే

నా వైపు తిరిగి నువ్వు వొక కన్నీటి చుక్కని

నీ రెప్పల మధ్య దీపంలా వెలిగించావు.

7

తెల్లారని వంతెన మీద

నువ్వు సూర్యుణ్ణి వెతుక్కుంటున్నావు

దూరంగా నేను వొక గుడ్డిదీపాన్ని చూపించాను

నువ్వు నా కళ్లలోకి చూసి పగలబడి నవ్వావు కానీ

కాసేపటికి ఆ దీపమే ఆకాశం నడినెత్తికెక్కింది.

8

దిక్కుల సంగతెవ్వరికీ తెలీదు

వొక్క నదికి తప్ప.

దీనికీ ఓ అంచు వుండాలి కదా అనుకుంటే దొరకదు.

చేప పిల్లలా మెరుస్తూ ఈ దేహంలోకి ప్రవేశించాక

బయటికి రావడం ఇక వల్ల కాదు

ఏదో వలలో చిక్కుబడితే తప్ప.

అది సరే,

దిక్కుల్ని వల బంధిస్తుందా?


9

మరీ పొద్దున్నే నువ్వు

నుదుటి మీద ఎర్రని సూర్యుణ్ణి ధరించి వచ్చావు

నా కళ్లలోని చీకటంతా

అప్పటికప్పుడు నిద్రపెట్టె సర్దుకుని వెళ్లిపోయింది.

10

కాలానికి ఇక్కడెవరైనా ఆనకట్ట కడితే

బావుండేది,

పోనీ

వొక్క క్షణానికైనా!


(మే 2 –  వొకే వొక్క ప్రేమ దీపం కల్పన-కి  పుట్టిన రోజు సందర్భంగా)

యుద్ధంలో నువ్వూ నేనూ మనం

  యు ద్ధంలో వెనుకడుగువేయడం పిరికివాళ్ళ లక్షణం . పోరాడి గెలవాలని చరిత్ర ఎన్నో అనుభవాలనిచ్చింది. అయితే ఆ యుద్ధం మనతో మనకే అయితే..! మనిషికీ, ...