Monday, January 15, 2018

ఒకే ఒక్క ఆసరా- కవిత్వం!

'ఇంటివైపు' ఓ సంజ్ఞ, సంకేతం, ఓ సంతకం. ప్రవాసి హృదయపు బెంగటిల్లిన అక్షరం. కాలూనిన ప్రతి మట్టిరేణువులో తన పుట్టినూరుని తలుచుకునే ఓ సగటు మనిషి పలవరింత. కవిత్వంలో ఎప్పుడూ నూతనత్వాన్ని నిలుపుకుంటూ ఐదు కవిత్వసంపుటుల మేరా విస్తరించిన కవి. మామూలు విషయాలనే భిన్నమైన ఆనుభవిక స్పర్శతో చూడాలన్న తపన ఇటీవలి 'ఇంటివైపు'కవితాసంపుటి. సూఫీ భావనల ఆవరింపులోంచి వైవిధ్యంగా పలికిన కవిత్వమిది. కవి పరిశోధకుడు అఫ్సర్ తో కవియాకూబ్ ఇటీవలి సంభాషణ నమస్తే తెలంగాణాలో...


1.       “ఊరిచివర” వెలువడిన ఎనిమిదేళ్ళ తరవాత మీరు “ఇంటివైపు” అనే శీర్షికతో మళ్ళీ కవిగా ముందుకు వచ్చారు. రెండు కవిత్వ సంపుటాల మధ్య ఇంత దీర్ఘ కాలం యెందుకు పట్టింది?

అఫ్సర్: అవున్నిజమే. నేను వొక్కో సంపుటి మధ్యా చాలా వ్యవధి తీసుకుంటున్నా. మొదటి నించీ అంతే! అనుకొకుండానే ప్రతి సంపుటికీ మధ్యా ఆ ఆలస్యం జరుగుతూ వస్తోంది. బహుశా, సీతారాం, ప్రసేన్ లతో కలిసి ప్రచురించిన “రక్తస్పర్శ” (1986) కూడా కలుపుకొని, మధ్యలో వచ్చిన నాలుగు కవిత్వ సంపుటాల కన్నా ఎక్కువ పేజీలున్న కవిత్వ సంపుటి ఇప్పటి ఈ “ఇంటి వైపు.” 
ఈసారి ఆలస్యానికి సరయిన కారణాలున్నాయని అనుకుంటున్నా. ముఖ్యంగా ఈ  ఎనిమిదేళ్ళు నా సాహిత్య ప్రయాణంలో కీలకమైనవని అనుకుంటున్నా. ఇంతకుముందు యెన్నడూ అనుభవించి ఎరుగని సంఘర్షణ ఈ  దశలో ఎదుర్కొన్నాను. ప్రత్యేక తెలంగాణా, సూఫీయిజం, గృహోన్ముఖీనత మొదలైనవి పూర్తిగా కొత్త లక్షణాలు కాకపోయినా వాటి తీవ్రతని అనుభవించీ పలవరించిన దశ ఇది. “ఊరిచివర” (2009)లో ఈ ధోరణులు చాయామాత్రంగా కనిపిస్తే, “ఇంటివైపు”లో వాటి తీవ్ర రూపం కనిపిస్తుంది. ఒక్కో కవితని రాసిన తరవాత ఒకటికి పదిసార్లు సరిదిద్దుకుని, పునరాలోచించుకొనీ ప్రచురణకిచ్చాను. అయితే, వాటి తాజాదనం చెదిరిపోకుండా సరిదిద్దుకున్నా.

2.       కవిత్వం మీకేమిటి? మీరు కవిత్వాన్ని ఎట్లా చూస్తారు?

కవిత్వం నాకు ఒక ఆంతరంగిక  నిత్యావసరం  అనవచ్చు. సాహిత్య ఊహ తెలిసిన తరవాత నన్ను నిర్మొహమాటంగా  వ్యక్తం చేసిన రూపం కవిత్వమే. అనేకవిధాలుగా చెప్పాలంటే, మిగిలిన సాహిత్య ప్రక్రియల మీద కూడా నాకు ఆసక్తి వున్నప్పటికీ నేను నేనుగా కనిపించే స్పష్టమైన అద్దం కవిత్వమే! మిగిలిన సాహిత్య రూపాలు అంటే- కథా, సాహిత్య విమర్శా, అనువాదాలు- మొదలైనవాటిలో నా వైపు నుంచి  కొనసాగింపు అంతగా కనిపించదు. కవిత్వం ఒక్కటే నాలో నిరంతరంగా కనిపిస్తుంది. నేను ఎక్కువగా చదివేదీ కవిత్వమే. ఉద్యోగపరంగా ఎక్కువగా పాఠాలు చెప్పేదీ కవిత్వమే. అనుదిన జీవన వ్యాపకాల్లో నా తక్షణ ప్రతిఫలనం కవిత్వమే. ప్రతి జీవితంలోనూ, జీవికలోనూ ఒక ఖాళీ వుంటుంది. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో ఆ ఖాళీని నింపుకుంటారు. నాకు అది కవిత్వం ద్వారా మాత్రమే సాధ్యమైంది.

3.       మీ కవిసమయాలూ సందర్భాలూ ఏమిటి?

ప్రత్యేకంగా అట్లాంటి సమయాలూ సందర్భాలూ లేవు. కవిత్వ సృజన పరంగా నాది సరళమైన ప్రపంచం. కొత్త స్థల కాలాలతో పాటు కొత్త సందర్భాలకు కూడా తేలికగా ఒదిగి వుంటాను. ముఖ్యంగా ఈ పదిహేనేళ్ళలో  వృత్తిపరంగానూ, డానికి సంబంధించిన పనుల ఒత్తిడి వల్లా ఎక్కువ సంఘర్షణకి లోనయ్యాను. ఉద్యోగరీత్యా అంతకుముందు అనుభవంలో లేని కొత్త కోర్సులు చెప్పాల్సి వచ్చింది, కొత్త బాధ్యతలు తలకెత్తుకోవాల్సి వచ్చింది. కాబట్టి, చాలా ఒత్తిళ్ళ మధ్య కవిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. కవిత్వం ఒక instinct అని చాలా సార్లు అనుకుంటాం కాని, నిజానికి కాదు. కొన్ని సార్లు మనం మనంగా మిగలడానికి కూడా చాలా ప్రయత్నం చేయాల్సి వుంటుంది. కొన్ని క్షణాలు మరీ పరాయీ అయిపోతాం, మనలో మనం మిగలం. అలా మిగుల్చుకునే సందర్భాలే కవిత్వం రాస్తాం. ఆ కారణంగా ఈ ఎనిమిదేళ్ళలో నేను చాలా తక్కువ రాశాను, గతంతో పోలిస్తే!

4.       మీ కవిత్వ పుస్తకాల శీర్షికలు – “ఇవాళ” “వలస” ఊరిచివర” కొత్తగా “ఇంటి వైపు” – చాలా భిన్నంగా, నిర్దిష్టంగా వుంటాయి. మీరు ఉద్దేశ పూర్వకంగా ఈ భిన్నత్వాన్ని, నిర్దిష్టతని లక్ష్యంగా పెట్టుకొని శీర్షికలు ఇచ్చారా?

చాలా మటుకు యాదృచ్చికంగా పెట్టిన శీర్షికలే అవి. అయితే, గమ్మత్తుగా అవి నా జీవన సందర్భాలకు సరిపోయాయి. “ఇవాళ” శీర్షిక మొదటి సారి నేను మిత్రులతో చెప్పినప్పుడు “అందులో నీ కవిత్వ గాఢత లేనేలేదు” అని కొట్టి పడేసిన వాళ్ళు ఎక్కువే. “వలస” “ఊరి చివర” ఇప్పుడు “ఇంటివైపు” కూడా అంతే. ముందే చెప్పినట్టు, నాది సరళమైన ప్రపంచం. నా కవిత్వ ప్రయాణం కూడా అంతే. “రక్తస్పర్శ” నుంచి “ఇంటివైపు” దాకా గమనిస్తే, నేను సంక్లిష్టత నుంచి సరళత్వం వైపు ప్రయాణించాను. సరళంగా మాట్లాడడం, కవిత్వం చెప్పడం చాలా కష్టమని అర్థమైంది. ఆ కోణంలోంచే నా కవిత్వ పుస్తకాల శీర్షికలు కూడా-

5.       సమకాలీన కవులకు అఫ్సర్ కవిత్వం భిన్నంగా వుంటుందన్నది  సాధారణంగా ఏర్పడిపోయిన భావన. ఆ భిన్నత్వాన్ని మీరెలా చూస్తారు?

ప్రతి కవీ తనదైన వ్యక్తిత్వంతోనే వస్తాడు. అనుభవంతో మొదలుకొని భాషా, దృక్పథం దాకా ఆ భిన్నత్వం కనిపిస్తుంది. అనుభవంలోని మెరుపు పెరిగే కొద్దీ కవిత్వంలోనూ ఆ మెరుపులు కనిపిస్తాయి. వెంటనే భాషలో ఆ కాంతి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కవికి భాష చాలా అవసరమైన సాధనం. కవి వ్యక్తిత్వాన్ని పట్టిచ్చే తొలి గుర్తు.  అనుభవంలోని వైవిధ్యం లేదా మామూలు విషయాలనే భిన్నమైన ఆనుభవిక స్పర్శతో చూడాలన్న తపన మన వ్యక్తీకరణని కాస్త కొత్తగా వెలిగిస్తుంది. బహుశా, ప్రతి వొక్కరూ ఆ వెలుగు కోసం వెతుక్కుంటూ వుంటారు. సాహిత్యం ఆసరా దొరికిన వాళ్ళు ఇంకాస్త ఉద్వేగంగా వెతుక్కుంటారు. నేనూ అంతే!

6.       మీరు మైనారిటీ స్వరాన్ని వినిపిస్తూనే ఒక విశ్వజనీన దృక్పథాన్ని కవిత్వంలో వ్యక్తం చేస్తారు. ఈ సమన్వయం యెలా సాధ్యపడింది?

నేను మైనారిటీని కాదు. అట్లాగని మెజారిటీని కాదు. నేను నేనుగానే వుంటాను, అన్ని  సామాజిక కొలమానాలు విఫలమయ్యేలా! నిర్దిష్టతనీ, స్థానికతనీ ఒక సైద్ధాంతిక భూమికగా బలంగా నమ్మే వ్యక్తిని నేను.  ఆ రెండీటిలో వుండే రంగూ రుచీ వాసనా నన్ను నిర్వచిస్తాయి. కొన్ని సార్లు కవి తను ఫలానా అని చెప్పుకున్నా, అతని కవిత్వం ఆ ఫలానాలో ఇమడదు. అలాంటి “ఫలానా” ముద్రల్ని ధ్వంసం చేసుకునే శక్తి కవిత్వంలోని మాజిక్. పాల్కురికి సోమన  నుంచి ఇప్పటి కొత్త కవి  దాకా మనకి తెలిసిన ప్రతి కవీ ఈ మాజిక్ కి ఒక ఉదాహరణే.

7.       దాదాపు మూడున్నర దశాబ్దాల మీ కవిత్వంలో ముఖ్యంగా ప్రాంతంగా చూస్తే నాలుగు దశలు కనిపిస్తాయి నాకు- ఖమ్మం/ విజయవాడ/ అనంతపురం/ అమెరికా. ఇది కేవలం ప్రాంతానికి సంబంధించిన మార్పు కాదనీ, అంతకుమించిన మార్పు ఏదో మీ కవిత్వంలో కనిపిస్తుంది. మీకూ అలాగే అనిపిస్తోందా?

మంచి పరిశీలన! ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఖమ్మం మునేరులో మునిగాను, అమెరికాలోని ఫిలడెల్ఫియాలో తేలాను. మధ్యలో బెజవాడ, హైదరాబాద్, అనంతపురం లాంటి మజిలీలు వున్నాయి. ప్రాంతం కవి ఆనవాలు. నా కవిత్వ సంపుటాల్లో – “రక్తస్పర్శ” ఖమ్మం, “ఇవాళ” బెజవాడ, “వలస” అనంతపురం, “ఊరి చివర” అమెరికాలోని టెక్సాస్, “ఇంటి వైపు” ఫిలడెల్ఫియాలో వుండగా రాసినవి. ఆయా ప్రాంతాలకూ, ఆ కవిత్వ సంపుటాలకూ తప్పనిసరిగా చుట్టరికం వుంది. ఆయా ప్రాంతాల సాంస్కృతిక అంతస్సు వాటిల్లో యెంతో కొంత మౌలికంగా కనిపిస్తూ వుంటుంది. అయితే, నేను పెరిగిన, చదువుకున్న, నా తొలి అనవాళ్ళన్నీ తెలంగాణాలో వున్నాయి. మా కుటుంబ చరిత్ర తెలంగాణా సాయుధ పోరాటంతో ముడిపడి వుంది. వామపక్ష రాజకీయాలతో కలగలిసి వుంది. ఎక్కడున్నా యెలా వున్నా, వాటిని నేను నా వ్యక్తిత్వంలోంచి దూరంగా పెట్టలేను.  ప్రాంతానికి మించిన మార్పు అని మీరంటున్నది ఏదైతే వుందో, అది నా నేపధ్యం, నన్ను పెంచి పెద్ద చేసిన చరిత్ర. అందులోనే నేనున్నాను.

8.       ఒక ముస్లింగా మీరు కవిత్వంలో బలంగా వ్యక్తమవ్వాల్సిన సందర్భం ఎప్పుడు వచ్చింది?

భారతదేశంలోని  యే ముస్లిం కవికైనా అది డిసెంబర్ ఆరు 1992 అనే అనుకుంటాను. అయితే, అంతకంటే ముందే నేను మా ఖమ్మం గోడల మీద “విప్లవం వర్ధిల్లాలి” అనే నినాదాలు మసకబారి, డానికి భిన్నంగా ఎబీవిపి, మజ్లిస్  నినాదాలు కనిపించడం మొదలెట్టాయి. ఈ సందర్భాన్ని కవిత్వంలో కంటే ముందు  ఒక  కథలో వర్ణించాను. అది కవిత్వంలో యెందుకు చెప్పలేదా అన్న ప్రశ్న ఇప్పటికీ వుంది. మొదటి నించీ కవిత్వం నాకు ఒక మాజికల్ మిర్రర్. నాలోపల సామాజికుడి ఘోష ఎంత వున్నా, నా కోసమే అన్నట్టు కవిత్వాన్ని  అట్టిపెట్టుకున్నాను. మరీ ఒత్తిడి కలిగించిన బయటి సందర్భాలు కవిత్వం అయిన ఉదాహరణలు వున్నా, వాటిల్లో కూడా నాలోని పర్సనల్ కోణం స్ఫుటంగా  వ్యక్తమవుతుంది. అంతర్గతంగా ఎంతో నలిగితే తప్ప బయటి సందర్భాలూ సంఘటనలూ కవిత్వం కాలేదు నాకు.

9.       తెలంగాణా- మీ కవిత్వంలోనూ, పరిశోధనలోనూ ప్రధానమైన భూమికగా ఎప్పుడు మారింది?

మొదటి నించీ తెలంగాణా ప్రధానమైన భూమికే. చింతకానిలో తెలంగాణా జానపద పాటలూ, కథలూ, పోరాట గాధలూ చిన్నప్పటి నించే విన్నాను. మా కుటుంబానికి వున్న తెలంగాణా సాయుధ పోరాట వారసత్వం వల్ల ఇంట్లో ఆ పోరాట జ్ఞాపకాలూ అనుభవాలూ తరచూ వినిపించేవి. ఇక నా ఉస్మానియా యూనివర్సిటీ పీ ఎచ్ డీ ఆధునిక కవిత్వ వస్తు రూపాల మీద. అయితే, తెలంగాణా సాయుధ పోరాటం ఆధునిక వచన కవిత్వానికి మౌలికతని ఇచ్చిందని అందులో వాదించాను. పీర్ల పండగ మీద ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రచురించిన పుస్తకం పునాది తెలంగాణాలోని పీర్ల పండగే. అట్లాగే, ఇప్పుడు కొత్తగా రాస్తున్న పుస్తకం పోలీస్ చర్యకి సంబంధించిన సాహిత్య సాంస్కృతిక కథనాల గురించి ప్రధానంగా తెలంగాణాలో ఆధునిక సాహిత్య రూపాలు యెట్లా వికసించాయో చెప్పే ప్రయత్నం.

1   మిమ్మల్ని మీరు తెలంగాణా కవిగా చూసుకుంటారా?

రెండు తెలంగాణా పోరాటాల అట్టల మధ్య ఒదిగిన పుస్తకాన్ని నేను. ఒక పోరాటం నా కుటుంబ స్మృతి, రెండోది నా సొంత అనుభవం. నిజానికి తెలంగాణా కవి అనిపించుకోడానికి అవి సరిపోక పోవచ్చు. ఆ ప్రాంతంలోని ఉద్విగ్నత నిండేలా ఇంకా పోరాట శీలత కావాలి. నేను ప్రధానంగా రచయితని కాబట్టి పోరాటానికి నా నిర్వచనం భిన్నంగానే వుంటుంది. ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు వుంటారు. వాళ్ళ నిబద్ధత ముందు రచయిత నిబద్ధత సరిపోదు. రచయితది సాంస్కృతిక నిబద్ధత. నన్ను నేను ఆ పరిధిలో మాత్రమే చూసుకుంటాను.

1   ఇప్పుడు తెలంగాణా సాహిత్యం తిరిగిన మలుపుల్ని మీరెలా అర్థం చేసుకుంటున్నారు?

తెలంగాణా సాయుధ పోరాటం సాహిత్య చరిత్రలో పెద్ద మలుపు అనే తాత్విక భూమిక నుంచి నేను వచ్చాను. అప్పటి కోస్తా ఆంధ్ర కవులకీ, రచయితలకీ, ఉద్యమకారులకి కూడా తెలంగాణా ఒక దిక్సూచి. తెలంగాణా పాత్ర యెప్పటికీ అట్లాగే వుంటుంది. తెలంగాణా అప్పటి వజ్రాయుధం. ఇప్పుడు కూడా వజ్రాయుధమే. కాని ఇటీవలి ఉద్యమ తీవ్రతలో వున్నప్పుడు పెంచి పోషించుకున్న ద్వేషాలు పక్కన పెట్టి, తెలంగాణా అసలు సిసలు పాత్రని అందరూ గుర్తించి తీరాలి. మన చరిత్రలో అంతకంటే గొప్ప ఉద్యమాల్ని ఇప్పటిదాకా మనం చూడలేదు. అందుకు తెలంగాణా మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలూ గర్వించాలి. ఇదే విషయం సాహిత్యానికి కూడా వర్తిస్తుంది. ఈ ఇరవయ్యేళ్ళలో తెలంగాణా నుంచి వచ్చిన మౌఖిక, లిఖిత సాహిత్యాలూ రెండూ బలమైనవే. ఆ వారసత్వం మున్ముందు కొనసాగాలి. ఇందులో దళిత, ముస్లిం స్త్రీ స్వరాలకి వాటికి తగిన స్థానం కూడా దక్కాలి.

   భారతీయ కవిత్వాన్ని దగ్గిరగా చదివిన అతికొద్ది మంది కవుల్లో మీరూ ఒకరు. భారతీయతా, కవిత్వం, ప్రాంతీయత- యీ మూడు అంశాల మధ్య పొంతన యెలా సాధ్యం?

భిన్నత్వం లేకుండా భారతీయత లేదు.  స్థానికతలోని బలమే భారతీయత బలం కూడా. ఇదే మాట భారతీయ కవిత్వం గురించి కూడా చెప్పుకోవాలి. స్థానికతలోని బహుళత్వం (pluralism) మన కవిత్వ సంస్కృతికి పునాది. మన దేశంలో యెన్ని భాషలున్నాయో, అన్ని భాషల కవిత్వాలూ మనకి ముఖ్యమే. వివిధ భాషల్లో వస్తున్న కొత్త తరం కవులు అట్లాంటి భారతీయతనే వెతుక్కుంటున్నారు.

   అట్లాగే, అంతర్జాతీయ కవిత్వం చదువుతూ, విశ్వవిద్యాలయ స్థాయిలో బోధిస్తున్నారు. ఆ కోణాలు మీ కవిత్వ వ్యక్తిత్వంపై యెలాంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాయి?

టీచింగ్ నా రోజువారీ జీవితంలో పెద్ద భాగం. పాఠం చెప్పే సమయం తక్కువే అయినప్పటికీ ఎక్కువ సమయం పాఠం చుట్టూ ఆలోచనలతో గడుస్తుంది. పైగా, ప్రతి సెమిస్టర్ కొత్త కోర్సులు చెప్పాల్సి రావడం వల్ల ఆలోచనలకి పెద్ద వ్యాయామం. ఈ సెమిస్టర్ “ప్రతిఘటన ఉద్యమాలూ- సాహిత్యం” అనే కొత్త కోర్సు చెప్తున్నా. ఈ కోర్సు ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష ఉద్యమాలతో మొదలై, ఇప్పటి అస్తిత్వ చైతన్య ఉద్యమాల దాకా వస్తుంది. ఇలాంటి కోర్సులు చెప్తున్నప్పుడు అది కేవలం తరగతి గదికే పరిమితం కావు. మన ఆలోచనల పరిధిని విస్తరిస్తాయి. కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తాయి. అవి కవిత్వ రచనలో కూడా కొత్తదనం కోసం వెతుక్కుంటాయి. నా దృష్టిలో ఇదంతా మన సొంత అన్వేషణలో భాగమే!

   ప్రభావాల మాటకి వస్తే, ఇటు భారతీయ కవిత్వంలోనూ అటు అంతర్జాతీయ కవిత్వంలోనూ మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వారు వున్నారా?

పేర్లు చెప్పడం కష్టం! ప్రభావాలు తప్పనిసరి. భారతీయ కవిత్వంలో దళిత కవిత్వం నన్ను బాగా ప్రభావితం చేసింది. అంతర్జాతీయ కవిత్వంలో బ్లాక్ పోయెట్స్ నాకు చాలా ఇష్టమైన వాళ్ళు.

1   వర్తమాన కవిత్వం ప్రింట్ నుంచి సోషల్ మీడియాకి మళ్ళుతున్న దశని మీరెలా అర్థం చేసుకుంటున్నారు?

సోషల్ మీడియాని సమర్ధంగా వుపయోగించుకుంటే కవిత్వానికి అది కొత్త శక్తి. ప్రింట్ మీడియాలో వుండే పరిమితుల్ని అది దాటి వెళ్తుంది. ఎంత కాదన్నా, ప్రింట్ మీడియా కొంత సాంప్రదాయిక చట్రంలో వుంటుంది. కొత్తదనాన్ని అంత తేలికగా ఆహ్వానించదు. ఫేస్ బుక్ లో అట్లాంటి చట్రాలు పనిచేయవు. కాబట్టి, కొత్త స్వరాలకి మంచి అవకాశం. కొత్త ప్రయోగాలకి కూడా మంచి వేదిక. 

   అమెరికాలో కొత్త తరం కవిత్వం యెలా ఉంటోంది?

వస్తు వైవిధ్యం, అనుభవ విస్తృతి, విషయాన్ని తేలిక భాషలో చెప్పడం కొత్త అమెరికన్ కవిత్వంలో కనిపిస్తున్నాయి. ఇవి మన వర్తమాన తెలుగు కవిత్వంలోనూ వున్నాయి. కాని, భాషకి సంబంధించి ఇంకా మనకి కొన్ని సాంప్రదాయికమైన ఆలోచనలు వున్నాయి.అ వి తొలగిపోవాలి. అమెరికన్ కవిత్వంలో ప్రోజ్ పోయెమ్ కొన్ని సాంప్రదాయికమైన చట్రాల్ని బద్దలు కొట్టింది. ఆ ధోరణి మనకి కూడా అవసరమే.

1  మన దగ్గిర “కవిసంగమం” లాగా అమెరికాలో ఇంటర్నెట్/  సోషల్ మీడియా భూమికగాధోరణులు యేమైనా ఉన్నాయా?

“కవిసంగమం లాంటి ప్రయోగం అమెరికన్ సాంస్కృతిక నేపధ్యంలో అంతగా ఫలించదు. ఎంతకాదన్నా, అమెరికన్ కవిత్వంలో ఒక హైరార్కీ వుంది. కొన్ని బలమైన శక్తుల పెత్తనం ఇంకా వుంది. అందువల్ల అమెరికన్ కవి సమూహల్ల్లో వెసులుబాటు తక్కువ. కవిసంగమం ప్రధానంగా సాధించిన విజయం హైరార్కీని సవాలు చేయడం, కొత్త తరాన్ని అందుకోవడం. ఇవి రెండూ అమెరికన్ సమాజంలో అంత తేలిక కాదు. అట్లాగే, ఇంటర్నెట్ సాహిత్యానికి కూడా ఇంకా రావల్సినంత ప్రాముఖ్యం రాలేదు.

1   కొత్త తరం కవులు చాలా మంది వస్తున్నారు. ముందు తరం కవిగా మీరు వాళ్లకి యేమైనా చెప్పదలచుకున్నారా?

సందేశాలివ్వడం నాకు నచ్చదు. నిత్య సంశయం వెంటాడుతున్న తరం మనది. కవి ఏ తరం వాడైనా మన సహప్రయాణీకుడే! ఇప్పుడు మరీ ముఖ్యంగా అందరూ కలిసి ప్రయాణం చేయాల్సిన సందర్భం. చాలా సామాజిక వొత్తిళ్ళ మధ్య నడుస్తూ వెళ్తున్నాం. వ్యక్తిగత  అస్తిత్వం కూడా ప్రమాదంలో వుంది. మనకి వున్న ఒకే ఒక్క ఆసరా- కవిత్వం! అదృష్టం బాగుండి, ఇప్పుడు కవులకి మంచి వేదికలున్నాయి. మంచి కవిత్వాన్ని అక్కున చేర్చుకునే చదువరుల సంఖ్య కూడా పెరిగింది. జీవితాన్ని వంచించుకోకుండా రాసే ప్రతి వాక్యం నిలుస్తుంది.  ఆ నమ్మకం నా మటుకు నాకు గతంలో కన్నా ఇప్పుడే ఎక్కువగా వుంది. మనం వచనం ఎక్కువ చదవాలి. విమర్శని తట్టుకోవాలి. ఒక అడుగు ముందుకే వేయాలి, కాని నిన్నటి రెండు అడుగుల్ని కూడా  గుండెకి హత్తుకోవాలి.
*



Sunday, January 7, 2018

మన కాలపు సూఫీ

-వాడ్రేవు చినవీరభద్రుడు
~
అఫ్సర్‌ నాకు తమ్ముడు. ఇద్దరం దాదాపుగా ఒకేకాలంలో కవిత్వం రాయడం మొదలుపెట్టాం. పోయిన శతాబ్దంలో ఎనభైల్లో మేం లోకంలోకి మేల్కొన్నప్పుడు ఒక్కలాంటి ప్రశ్నలే ఎదుర్కొన్నాం, దాదాపుగా మేం వెతుక్కున్న సమాధానాలూ ఒక్కలాంటివే. మూడు దశాబ్దాలపైబడ్డ ఈ ప్రయాణంలో మా దారులు వేరైనా, అతడి అడుగుజాడలు నేనూ, నా అడుగుజాడలూ అతడూ, ఒకరినొకరం, పరికిస్తూనే వున్నాం. అతడు కూడా కథలు రాసాడు, సాహిత్యానుశీలన చేసాడు, అన్నిటికన్నా ముఖ్యం కవిత్వసాధన వదలకుండా కొనసాగిస్తూనే ఉన్నాడు. నాకు మరింత ఆరాధనీయమైన సంగతి అతడు సాహిత్యాన్ని బోధిస్తూండటం, అది కూడా సముద్రాలకవతల. పల్లెనుంచి పట్నానికి, పట్నం నుంచి మహాపట్నానికి, మహాపట్నం నుంచి ఖండాంతరానికీ సాగిన అతడి ప్రయాణంలో ఒక్క క్షణం కూడా కవిత్వాన్ని మరచింది లేదని ఈ కవితలు సాక్ష్యమిస్తున్నాయి.

2

ఈ కవితలు చాలావరకు 2009 నుంచి నిన్నమొన్నటిదాకా రాసిన కవితలు. ఈ కవితలు తెరవగానే మనకి రూమీ వాక్యాలు కనిపిస్తాయి. అందులో, ఆయన తాను చెప్పేదంతా– తన మిత్రుడూ, తన గురువూ, తన కవిత్వసూర్యుడూ అయిన తబ్రీజీ చెప్తున్నదేననీ, తాను కేవలం అతడి మాటలు ప్రతిధ్వనిస్తున్నానని మాత్రమే అంటున్నాడు. ఈ మాటల్తో ఈ కవిత్వాన్ని తెరవడం గొప్ప అనుభవం, కొత్త అనుభవం.
మౌలానా జలాలుద్దీన్‌ రూమీ, ఆయన మిత్రుడు షమ్షుద్దీన్‌ తబ్రీజీ ప్రవక్త మహమ్మద్‌ మాటలకి సజీవ ఉదాహరణలుగా జీవించడానికి ప్రయత్నించారు. ‘ఒక విశ్వాసి మరొక విశ్వాసికి దర్పణంగా ఉంటాడు’ అన్న హడిత్‌ వాళ్ళ హృదయాల్ని వెలిగించింది. ఒకరిలో ఒకరు తమని తాము చూసుకున్నారు. ఆ నిర్లేప, నిరంజన దర్శనంలో వారు అన్ని కాలాల్లోనూ, అన్ని దేశాల్లోనూ, అన్ని అవస్థల్లోనూ జీవిస్తున్న మానవులందరి వదనాలూ చూడగలిగారు. ఇదే కవిత్వం. ఇదే మతం. అందుకనే టాగోర్‌ జీవితకాల కవిత్వసాధన తర్వాత, తనది కవుల మతమన్నాడు.
రూమీ స్నేహితుడెవరో మనకి తెలుసు. కానీ, అతడి మాటలే తనలో ప్రతిధ్వనించాక, ఆ స్నేహితుడు ఒక మానవమాత్రుడిగా మిగిలిపోక, ఈశ్వరసమానుడిగా మారిపోయేడు. మరి, ఈ కవితల్లో కవి ప్రతిధ్వనిస్తున్నదెవరిని?
ఈ ప్రశ్నకి ఎవరికి వారుగా సమాధానం వెతుక్కోవలసి ఉంటుంది. నాకు స్ఫురించినదేదో నేను చివర్లో చెప్తాను. కాని, అదెవరో అన్వేషించడానికి ముందు, ఆ వ్యక్తితో, ఆ హృదయంతో కవి చేస్తున్న సంభాషణ ఏమిటో నేను కొంత వివరించవలసి ఉంటుంది.
సంభాషణ. అవును, అదే సరైన మాట. ఈ కవిత్వమంతా ఒక ఎడతెగని సంభాషణ. అంతేకాదు, రూమీ కవిత్వానికి వచ్చిన ఒక ఇంగ్లీషు అనువాదానికి ముందుమాట రాస్తూ ఒక భావుకుడు ఆ కవితల్ని ‘పాటలూ, ఆత్మశోధనలూ, దేవుడితో రూమీ చేసిన సంభాషణలూ’ అన్నాడు. అతడు వాడిన పదం interrogation. దాన్ని నేను ఆత్మశోధన అంటున్నాను. అంటే, కవిత్వం ఏకకాలంలో రెండువైపుల సంభాషణ. అది తనతో చేసేదీ, లోకంతో చేసేదీ కూడా. దాన్నే చలంగారు ‘అంతర్‌ బహిర్‌ యుద్ధారావం’ అన్నాడు. రూమీ తనతో సంభాషించుకున్నాడు. తన మిత్రుడితో సంభాషించుకున్నాడు. తనతో తాను చేసుకునే సంభాషణ తనలోని లఘుపార్శ్వాన్ని శోధించుకోవడంగా, మిత్రుడితో సంభాషణ తన గురుపార్శ్వంతో సంభాషణగా మొదలై, చివరికి, రెండూ ఒకటిగా మారిపోయి, తను అంతరించి, గురువొక్కడే మిగలడం రూమీ కవిత్వప్రయాణం.
కవి బయటి ప్రపంచంతో చేసే సంభాషణ ‘డ్రమటిక్‌ మోనోలాగ్‌’గా, తనతో తాను చేసుకునే సంభాషణ ‘ఇంటీరియర్‌ మోనోలాగ్‌’గా మనకి పరిచితమే. కాని, తనతో తాను చేసుకునే సంభాషణ తనని తాను interrogate చేసుకునేటంత తీవ్రంగా ఉండకపోతే, దాని పర్యవసానంలో తనని తాను annihilate చేసుకోకపోవడంగా మారకపోతే, ఆ కవిత్వం నిజమైన కవిత్వంగా పరిణమించదు. ఆ అహం నిర్మూలన, దాన్ని సూఫీలు ‘ఫనా’ అన్నారు.
ఫనా అంటే జీవించి ఉండగానే మరణించడం. మరణించి జీవించడం. జీవితం కొనసాగుతుంది, కాని అహం స్ఫురణ ఉండదు. తాను మిగలడు, దివ్యప్రేమావేశం మాత్రమే కొనసాగుతుంది.
అందుకనే ఈ సంపుటిలో ‘ఫనా’ అనే ఒక కవిత కనిపిస్తే నాకు ఆశ్చర్యం కలగలేదు. రూమీని స్మరిస్తూ మొదలైన కవిత్వం ఫనాకి చేరుకోవడంలో ఆశ్చర్యం లేదు కదా. అక్కడ కవి అంటున్నాడు:
ఎన్ని దూరాలు కలిపితే
వొక అస్థిర బైరాగినవుతానో
ఎన్ని తీరాలు గాయాలై సలిపితే
వొక నిర్లక్ష్య సూఫీనవుతానో!
ఇదీ వొక ఆటే కదా నీ చుట్టూ
నేను బొంగరమయి తిరగడానికి
ఇది సమకాలికుడైన ఒక తెలుగు కవి రాసిన వాక్యాలంటే నమ్మటం కష్టం. తీవ్ర భావుకతలో మిస్టిక్‌గా మారే ఒక పిపాసి మాత్రమే మాట్లాడగల మాటలు. ఎందుకంటే, ఇది ప్రేమ కవిత్వం కాదు. ప్రేమ అంటే సామాజిక సాహచర్యానికి దారితీసే ప్రేమ అన్న అర్థంలో ప్రేమకవిత్వం కాదు. అందుకు ఈ మాటలే సాక్ష్యం:
ఆడుకుంటున్నా నాలో నేను
నీతో నేను
నీ వూహ ఒక సాకు నాకు
ప్రేమ అంటే ఇద్దరు కాక ఒకరు మాత్రమే మిగిలే అనుభవమనుకుంటేనే ఈ వాక్యాలకు అర్థముంటుంది, కాని, ఇది ఎదుటి మనిషిని (అదర్‌ను) నిర్మూలించే ‘నేను’ (సెల్ఫ్‌) కాదు. తనో, ఇతరుడో, ఎవరో ఒకరు మటుకే జీవించవలసి వస్తే, ఎదుటి మనిషికి చోటిచ్చి తాను తప్పుకునే మనఃస్థితి కోసం చేసే ప్రయాణం. ఒకప్పుడు గురజాడ ఇట్లా అనగలిగాడు:
ఉసురులకు విసికితివొ; యుద్ధము
కలదు; దేశము కొరకు పోరుము’
యుద్ధమా, ఇకనేమి లోకము!
చాలు! చాలును! లంగరెత్తుము
అక్కడ ‘నీ ఊహ’ ఒక సాకు అయినట్టే, ‘నేన’నే భావన కూడా ఒక సాకు. నిజానికి అక్కడ ఇద్దరు లేరు, ఉన్నదొక్కరే, అందుకనే ఆ కవితనిట్లా ముగిస్తాడు:
కొలమానాలన్నీ గాల్లోకి
చిలిపిగా విసిరేసి
నీ లోపల శిథిలమయిపోనీ నిబ్బరంగా
ఫనా, అంటే, self annihilation అనే మాటకి ఈ కవి ఇచ్చిన తెలుగు పరిభాష ‘నిబ్బరంగా శిథిలమయిపోవడం!’
ఫనా కవిత ఈ సంపుటికి తాళం చెవి. ఈ కవిత చూపించిన వెలుగులో చదివినప్పుడు, మొత్తం కవితలన్నీ అఫ్సర్‌ చేస్తున్న ప్రయాణాన్ని కొత్తగా చూపిస్తాయి. ఇంతకుముందు మనకి పరిచయమైన మాటలే, ఆ భావనలే, అవి మన సమకాలిక సామాజికార్థాన్ని, వైయక్తిక వేదనని స్ఫురింపచేస్తూనే అంతకన్నా ఉన్నతమైన మరొక భూమికలోకి మనల్ని లేవనెత్తుతాయి.
ఈ సంపుటి శీర్షిక ‘ఇంటివైపు’ అన్నదే చూడండి. 80ల తర్వాత కవిత్వం రాసిన ప్రతి ఒక్కరూ; తమ ఇంటి గురించీ, బాల్యం గురించీ, తమ గ్రామం గురించీ రాయకుండా ఉండలేకపోయారు, ఈ కవితో సహా. ఇప్పుడు మళ్ళా అతడు ‘ఇంటివైపు’ అంటున్నప్పుడు, ఆ ఇల్లు కేవలం స్వగృహం మాత్రమే కాదనీ, అతడిదే అయిన ఒక ఆత్మగత ప్రపంచానికి ప్రతీక అనీ బోధపడుతోంది.

3

ఈ కవితలన్నిటిలోనూ ఒక జ్ఞాపకం ఉంది. ఆ జ్ఞాపకాన్ని పదేపదే స్మరించుకోవడం ఉంది. సూఫీ పరిభాషలో ఈ స్మరణని ‘ధిక్ర్‌’ అంటారు. అంటే స్మరణ. నిరంతర స్మరణ. అప్రయత్న స్మరణ.
స్మరణ గొప్పదా, ధ్యానం గొప్పదా అని అడిగితే ప్రవక్త, స్మరణనే గొప్పదన్నారు. నిజానికి సర్వేశ్వరుడు మానవుడికిచ్చిన మాట ఏమిటంటే ‘నువ్వు నన్ను తలుచుకో, నేను నిన్ను తలుచుకుంటాను’ అని. ధ్యానంలో ఎంతో కొంత సంకల్పమూ, ప్రయత్నమూ ఉంటాయి. కాని స్మరణ అప్రయత్న సిద్ధి. అందుకనే, ఫనాని చేరుకోవాలంటే ధిక్ర్‌ గుమ్మంగుండానే అని సూఫీలు నమ్ముతూ వచ్చారు.
ఈ కవిత్వమంతా, ఆ అప్రయత్న స్ఫురణ, స్మరణతో పొంగిపొర్లుతోంది. కొన్ని సార్లు అది, చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా, ఇంద్రియాలకు అందేదిగా ఉంటుంది:

అవున్నిజంగానే వెళ్తాను నాలోకి
ఆ చిన్నప్పటి పొలంలో రాలిపడిన రేగిపళ్ళ వాసనలోకి
ఇప్పుడింక గుర్తొస్తుంది చిన్నప్పటి నా చింతకాని
ఏం వెతుక్కుంటావో, అలసిపోయేంతదాకా
ఆ వూరి చివర చెట్ల మంచుతెరల మధ్య
పట్టా పక్కన వూరు
ఎక్కడయినా ఎప్పుడయినా ఒకటే
దాని ప్రతి మాటా
రైలు కూతల్లో ఒదిగిపోతుంది
కానీ చాలాసార్లు అది అస్పష్టంగానే ఉంటుంది. అది ఊరు కావొచ్చు, సహచరి కావొచ్చు, చిన్నప్పటి జ్ఞాపకం కావొచ్చు, లేదా తానిప్పుడు జీవిస్తున్న ఒక అమెరికన్‌ నగరం కూడా కావొచ్చు.

అయినా సరే, వెళ్ళి రావాలి ఆ మంత్రనగరికి
ఇన్ని వాస్తవ స్వప్నాల నడుమ
ఒక కలలేని నిద్ర
నిద్రరాని కల-
కునుకు కప్పుకున్న మెలకువ
వూరు మసకచీకటిలోకి
సగం కన్ను తెరిచి
మూతపెట్టుకుంది ఇంకోసారి.
చాలాసార్లు కలగాపులగంగా మారిపోయిన ‘ప్రత్యక్షం’ లోంచి ఆ పరోక్షాన్ని గుర్తుపట్టడానికి పెనగులాడుతూనే ఉంటాడు కవి.
నన్ను చుట్టుముట్టిన ఈ తెలియని ముఖాల
తెలియని చెట్ల, తెలియని ఆకాశాల, తెలియని గాలుల
కనిపించని కన్నీళ్ళ, వినిపించని ఏడ్పుల సమూహంలో నిలబడి
ప్రతి ముఖమూ నీదే అనుకుని బతిమిలాడుకుంటాను
అందుకని ఏమనుకుంటాడంటే,
వొక వూరు యింకొక వూరు ఎప్పుడూ కాదు
అప్పుడప్పుడూ వెనక్కి చూడు
దాటి వచ్చిన వూరు
ఏమంటుందో విను
అసలే నగరమయినా ఎవరికయినా ఇల్లవుతుందా?
ఏమో ఈ డౌన్‌ టౌన్‌ గుండెల్లోంచి నడుస్తున్నప్పుడు
శరీరాన్నీ, గుండెనీ కూడా
పొగమంచు, చలిచినుకులు ముసురుకున్నట్టే వుంది.
అయితే, కవి ఇట్లా పరాయీకరణ అనుభవిస్తున్నందువల్లా, తాను తనదని భావిస్తున్న లోకం ‘ప్రత్యక్షం’లో కనిపించనందువల్లా, ఈ కవిత్వాన్ని రొమాంటిక్‌ కవిత్వంగా భావించలేం. అక్కడే, ఈ కవిలోని సమకాలికత చాలా స్పష్టంగా కనిపించేది. చూడండి:

ఆ మాటకొస్తే ఎన్ని చినుకులు కలిస్తే
వొక వాన అవుతుందో కూడా తెలీదు ఈ పరాయి క్షణంలో…
కాని
మళ్ళీ మళ్ళీ
వొక తెల్లవారు జాము వానలో తడుస్తూ
ఇల్లూ ఊరూ వదిలి
పరిగెత్తుతూనే వుంటాను, ప్రపంచం వేపు
ప్రపంచం వైపు పరుగెత్తకుండానూ, ప్రపంచాన్ని అందుకోకుండా ఉండాలనీ కాదు కవి ఆరాటం. తన పూర్వక్షణాల దగ్గరే ఆగిపోవాలని లేదు కవికి. కానీ, ఆగుతాడు, ఆగకుండా ఉండలేడు, కాని అది కాసేపే. అందుకే ఇలా అనుకుంటాడు:
ఆగిపోవడం తప్పేమీ కాదు, ఎవరో విధించిన శిక్ష కూడా కాదు
కాసేపు నిన్ను ఆపాలని ఎందుకనుకుందో జీవితం.
గడచిపోయిన జీవితం గురించి కవికి స్పష్టత ఉంది.
కాని, ఆ పోయిన కలలాంటి నిజం కూడా వుండదు.
ఆ పోయిన నిజంలోని పుప్పొడీ వుండదు
అందుకని అతడు తన ప్రయాణం కొనసాగించాలనే కోరుకుంటాడు.
లోపల వొక వెయ్యి తలుపుల ఇల్లు
ప్రతి ఇంట్లో వొక అపరిచిత లోకం-
తెరుచుకుంటూ వెళ్ళాలి చివరి తలుపేదో తెలీక-

4

సరిగ్గా, ఇక్కడే అతడికి స్మరణ ఆలంబనగా నిలబడేది. ఆ వెయ్యి తలుపుల ప్రపంచంలో తాను ఏ గదిలో ఉన్నాడో గుర్తుపట్టడానికి ఆనవాలు ఆ స్మరణనుంచే లభిస్తుంది. స్మరించడమంటే ఎప్పటికీ ఆ గతించిన క్షణాల దగ్గరే ఉండిపోడం కాదు. తాను వెతుకుతున్న ఆ వదనం ప్రత్యక్షంలో ఏ క్షణాన ప్రత్యక్షమయినా గుర్తుపట్టగలిగే నిత్యజాగరూకతతో ఉండటం…
నిన్ను నువ్వు వర్తమానంలో, ప్రత్యక్షంలో ఎట్లా గుర్తుపడతావు?
మాట ద్వారా, పాట ద్వారా అంటాడు కవి. ఆ మాట కోసం వెతుకులాటనే ఈ కవిత్వంలో సింహభాగం. ఈ కవి అన్వేషణ నిజమనీ, ప్రగాఢమనీ మనకి సాక్ష్యమిచ్చేది ఆ నలుగులాటనే. ఆ నలుగులాటని అతడు తనలోకి ప్రయాణమని చెప్పుకుంటాడు.

మిగిలిన అన్ని ప్రయాణాలూ లోకం కోసం
ఈ ఒక్క ప్రయాణమే నాదీ నా లోపలకీ అనిపిస్తుంది.
ప్రయాణాల్నిట్లా రెండుగా వింగడించుకోవడం వల్లనే ఈ కవి పాతకాలపు భావకవి కాదని మనకి తెలుస్తున్నది. ఈ లోపలి ప్రయాణపు జాడల వల్ల ఇతడు సూఫీల దారిన ప్రయాణిస్తున్నాడు, కానీ, కొత్తయుగానికి చెందిన సూఫీ అనవలసి వుంటుంది.
సూఫీలు తామెక్కడ ఉంటే, అక్కడి సామాజిక- భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టుగా తమ ఆలోచనను సవరించుకుంటూ వచ్చారు. అలాగే, ఈ కవి కూడా, ఇప్పటి కాలానికి చెందిన స్పృహ వదిలి ఎప్పుడూ కవిత్వం చెప్పాలనుకోడు.
విగ్రహాలూ, విధ్వంసాలూ, ఆత్మహత్యలూ హత్యలూ
కరువులూ నిరుద్యోగాలూ
ఆకలి కడుపులూ వీధుల మీద
పోస్టర్లయి తిరుగుతున్న మనుషులూ వూరేగింపులవుతున్న అసహనాలూ
చావుకేక వేస్తున్న పసితనాలూ
-వొక్క అరక్షణం కూడా నేనొంటరిని
వొక్కణ్ణే నేనొక్కణ్ణే అని గావుకేక వెయ్యలేను
చావులూ, ఆకలి చావులూ తెలుసు నాకు
కన్నీళ్ళూ వాటి చివర జీవన్మరణాల అనుక్షణికాల తాడుకి వేళ్ళాడే
బతుకుదప్పికలు తెలుసు నాకు
కణకణ మండే ఉద్యమ రక్తకాసారాల్లోకి
దేహాల్ని చితుకుల్లా విసిరేస్తున్న ప్రాణాలూ తెలుసు నాకు
కానీ కళ్ళముందు కనిపిస్తున్న ఈ దృగ్విషయాన్ని తన ఆంతరంగిక ప్రపంచంతో ముడిపెట్టుకోవాలనీ, తన అంతరంగంలో తనకి లభిస్తున్న ప్రశాంతితో ప్రపంచాన్ని ముంచెత్తాలనీ కవికి అపారమైన కరుణ. ఆ ప్రయత్నంలో ఎన్నో అవస్థలు.
నేను ఏ భాషలో నిన్ను చేరుకున్నానో తెలీదు
నువ్వు నాది కాసేపు కవిత్వభాష అంటావ్‌
కాసేపు మరీ ఉద్వేగాల భాష అంటావ్‌
చాలాసేపు
నేను నీకు ఎంతకీ పాలు అందని శైశవ ఆక్రోశంలా వినిపించి వుంటాను.
నా పసిభాష ఉద్వేగమై ప్రవహిస్తే
ఈ వొక్కసారికి మన్నించు
ఇంకా నాకు రానే రాని ఈ లోకపు భాష నేర్చుకోవాలి నేను
కళ్ళముందు కనిపిస్తున్న ఈ ప్రపంచం ఎంత కఠినమంటే, చివరికి, ఒక క్షణం పాటు, కవి ఇలా అనుకోకుండా ఉండలేకపోయాడు:

ఛ.. ఛ…
ఇంకేం రాస్తాం బే, కవిత్వం!
కానీ ఆ క్షణం దగ్గర ఆగిపోయినా కూడా అది ఆగిపోడమే అవుతుంది. తనని ప్రపంచం నిర్మూలించినట్టే అవుతుంది.
వొక మాట మూసుకున్న తరవాత
ఇంకేమీ తెరుచుకోవు
మాటని తెరిచి వుంచు
అక్కణ్ణుంచి కూడా, అతికష్టం మీదనైనా, అడుగులో అడుగు వేసుకుంటూనైనా, ముందుకు ప్రయాణం సాగించాలి. అప్పుడే ప్రపంచం దిశగా వేసే ప్రతి అడుగూ తనలోకి తాను వేసుకోడమవుతుంది, తనలోకి తాను వేసుకునే ప్రతి అడుగూ ప్రపంచం వైపుగా వెయ్యడమే అవుతుంది.
అందుకనే తనని గుర్తుపట్టే ప్రయత్నం ఇప్పుడు కవికి పద్యాన్ని గుర్తుపట్టే ప్రక్రియగా మారింది.
పద్యాలు ఎలా వుంటాయి
ఒక్కటే ప్రశ్న దారి పొడవునా.
కాని పద్యం ఒంటరితనంలో దొరికేది కాదు

నలుగురు కలిస్తే నాలుగు పద్యాలు
పద్యం ఎప్పుడూ వొంటరి కాదు.
కవికి తననీ, లోకాన్నీ కలుపుకోగల సంకేతస్థలంగా పద్యం కనిపించింది.
బాధ తెలిసిన పదం పద్యం అంటే
ఏడ్వనీ
ఎంత ఏడిస్తే అంత పద్యం!
ఇదొక సూక్ష్మలోక యాత్ర. కవికి తన గురించిన ఒక స్మృతి ఉంది. ఆ జ్ఞాపకం, పైకి వ్యక్తిగతంగా కనిపించవచ్చుగాక, కాని, నిజానికి అదొక సార్వజనీన జ్ఞాపకం. ఒక అతీతకాలపు స్మరణ. దాని ఆధారంగా కవి తాను ప్రపంచంతో ఏకం కాగల ఒక సంకేతస్థలాన్ని ఊహిస్తాడు, దర్శిస్తాడు, చిత్రిస్తాడు.
అక్కడ ప్రపంచమంటే కూడా ప్రపంచముఖంలో కనిపించే తనే. ఈ ‘తను’ తనకే పరిమితమయిన తాను కాదు. ఏ ఒక్కరికీ చెందనీ, అందరికీ చెందిన ఆ ‘తనని’ పట్టుకోవడం ద్వారా కవి తననీ, ప్రపంచాన్నీ కూడా పైకి లేవనెత్తుతున్నాడు.
ఈ వాక్యాలకి
ఇంత బాధ ఎక్కణ్ణించి అనే కదా మాటిమాటికి నీ ప్రశ్న!
వొకే వొక్కసారి నా నిజమయిన ఏకాంతంలోకి
నెమ్మదిగా నడిచి రా,
నువ్వు నడిచినంత మేరా!
ఈ వాక్యాల్లో ‘ఏకాంతం’ అనేది చాలా కీలకమైన మాట. ఇది ఒంటరితనం కాదు. ఒంటరితనమంటే ఒక్కడూ ఉండటమని కాదు, ప్రపంచం నీలో ప్రతిఫలించకపోవడం. అది దుర్భరమే కాదు, అవాంఛనీయం కూడా.
ఆ మేరకు నీలోపలి ‘నువ్వు’కి కూడా నువ్వు దూరమయిపోతావు. దానికి ప్రత్యామ్నాయం నలుగురితో కలిసి కాలం గడపడం కాదు. వృథాగా సాగే ఆ కాలక్షేపంలో, నువ్వూ, ప్రపంచమూ కూడా కనుమరుగైపోతారు.
కావలసింది ఏకాంతం. ఏకాంతమంటే, నీలో ప్రపంచవదనం, ప్రపంచంలో నీ వదనం సాక్షాత్కరించే సమయం. అది ప్రయత్నపూర్వకంగా చేస్తే ధ్యానం. అలాకాక, అప్రయత్నంగా జరిగితే, స్మరణం. ఆ స్మరణం వల్లనే తన వాక్యాలకి అంత బాధ అంటున్నాడు కవి. ఎందుకంటే, ఆ బాధ తన హృదయంలో ప్రతిఫలిస్తున్న ప్రపంచం బాధ కాబట్టి.

5

పాడుతూనే వున్నాడు, నస్రత్‌ ఫతే ఆలీ ఖాన్‌
-పదం మూలం తెలియక క్షోభిస్తున్న కవిలాగా
ఈ వాక్యాలు ఈ కవిత్వస్వభావాన్ని పట్టిచ్చే ఆనవాళ్ళు. ఒకటి, కవి గుర్తు చేసుకుంటున్న గాయకుడు సూఫీ గాయకుడు కావడం. రెండవది, అంతకన్నా కూడా ముఖ్యం, ఆ గాయకుణ్ణి పదం మూలం తెలియక క్షోభిస్తున్న కవితో పోల్చడం. సూఫీ కవిత్వం ప్రధానంగా సంగీతమయం. నాట్యవిస్ఫూర్జితం. సూఫీ గీతం ఏకాలంలో పద్యం, గానం, నాట్యం కూడా. అది ప్రేమపారవశ్యంతో ప్రపంచాన్ని చుట్టేసే ఒక గాఢపరిష్వంగం. ఈ కవిత్వానికి ఆ లక్షణాలు పొడసూపుతున్నట్టుగా కనిపించడం నన్నెంతో ఆశ్చర్యానికి లోను చేసింది. ‘రెండేసి పూలు ఓ చందమామా’ అన్న కవిత చూడండి, ఇక రాబోయే రోజుల్లో ఈ కవి గళం నుంచి గజళ్ళూ, గీతాలూ రానున్నాయనిపించడం లేదూ.
ఆ ఛందస్సులో చెప్తాడా లేదా అన్నది ప్రశ్న కాదు. ఉద్వేగపరంగా అతడిప్పటికే ద్రవీభూతమనస్కుడైపోయాడు. ఈ కవిత చూడండి,
వెళ్ళిపోతూ మలుపు దగ్గర కాసేపు నిలబడి చూడు
రాయాలనుకున్నదేదో నీ చూపు చివర కనలిపోయింది.
ఆదియందు మాట వుండెనో లేకపోయెనో
ఆదియందే చివరి మాట స్వప్నించనీ నన్ను.
అంతమందు మాట వుండునో వుండకపోవునో
నిన్న రాత్రి నీ కలకి అంటుకున్న కార్చిచ్చును నేను
వెళ్ళిపోతూ మలుపు దగ్గర కాసేపు నిలబడి చూడు
రాయలేనిదేదో ఒకటి దగ్ధమయ్యింది, రెప్పల తెల్లనవ్వు కింద.
గజల్‌ షేర్లని తలపిస్తున్న ఈ ద్విపదల్లో ఉన్నది సంగీతమే కదా. అంతేనా? గొప్ప గాయకుడు పారవశ్యానికి లోనయిన తర్వాత, తన పాటలో సాహిత్యాన్ని కూడా వదిలేసి, ఏదో ఒక్క పంక్తి దగ్గరే లుంగలు చుట్టుకుపోయినట్టుగా, ఈ కవి కూడా తన స్మరణ, తన ఆత్మవిస్మరణల్లో ‘అంతమందు మాట వుండునో వుండకపోవునో’ అనే మెలకువకి చేరుకున్నాడు.
ముళ్ళు విప్పుకునే కళ నేర్చుకో
త్వరపడు, ఆత్మ దేహాన్ని వదిలేముందే
ఉన్నట్టు కనిపిస్తున్నది ప్రతి ఒక్కటీ వదిలిపెట్టు
ఏది లేనట్టు కనిపిస్తోందో దాన్ని వెతికిపట్టు
అన్నాడు రూమీ.
కళ్ళముందు కనిపించేది ప్రత్యక్షం. కానీ, అది సత్యం కాదు. అది నిన్ను దారి తప్పించేదే. అందుకనే దాన్ని ‘ప్రత్యక్షపు కూటనీతి’ అన్నాడు బైరాగి. దాని వెనక ఉన్నది పరోక్షం. రూమీ మాటల్లో చెప్పాలంటే, ‘లేనట్టుగా కనిపించేది’. కానీ, అదే సత్యం. అక్కడే తనకీ, ప్రపంచానికీ కలయిక. అది నిత్యస్మరణ ద్వారా, ఆత్మవిస్మృతిద్వారా మటుకే సాధ్యం కాగల అరుదైన సమాగమం. ఇంట్లోనే నీకు గురువు దొరుకుతాడని కబీర్‌ పదే పదే చెప్పింది ఈ రహస్యమే.
ఈ ఇంటివైపు ఆ ఇంటి వైపు ప్రయాణం.
ఈ కవి మన కాలపు సూఫీ.



(12, అక్టోబరు, 2017)
(ప్రచురణ వివరాలు: ఇంటివైపు – అఫ్సర్. వాకిలి ప్రచురణ, 2017. వెల: Rs. 180/- $ 9.95 ప్రతులకు: నవోదయ, అమెజాన్, కినిగె, తెలుగుబుక్స్.ఇన్)

Monday, January 1, 2018

ఎంతెంత దూరం?

- స్వాతి కుమారి 
~

ఆటల్లో పడి ఎటెటో తిరిగి ఇంటిధ్యాస మర్చిపోయిన పిల్లాడికి, ఉన్నఫళాన అమ్మగుర్తుకొచ్చి స్నేహితుల్ని, కర్రా బిళ్ళని, మర్రి ఊడల్ని వదిలేసి ఇంటికి పరిగెత్తుతాడు. అప్పుడు వాడికి ఇల్లంటే అమ్మ.

తర్వాత్తర్వాత రెక్కలు మొలిపించుకుని, వేర్లని పెరుక్కుని బహుదూరంగా వలసపోయాక, ప్రతిరోజు వలసపోతూ ఉండటమే బతికే పద్ధతిగా మారిపోయాక;

ఇల్లంటే తను వదులుకుని వచ్చిన దేశం, ఊరు, బాల్యం.
ఇల్లంటే తన సామాజిక, సాంస్కృతిక, వ్యక్తిత్వ మూలం.
ఇల్లు ఒక ప్రతీక; పుట్టుకకి, ఎదుగుదలకి; ఎదిగిపోయాక తిరిగొస్తే మళ్ళీ పసిపిల్లాణ్ణి చేసి ఒద్దిక నేర్పడానికి.
“నగ్రీ నగ్రీ ఫిరా ముసాఫిర్ ఘర్ కా రాస్తా భూల్ గయా

……
హమే తో సబ్ కుచ్ యాద్ రహా పర్ హమ్ కో జమానా భూల్ గయా” - గులాం అలీ
మరిచిపోయిన దారిని ఒంటరిగా వెతుక్కోక తప్పదు. తనని మరిచిపోయిన వాళ్ళకి తనెవరో గుర్తు చెయ్యకా తప్పదు. మైలురాళ్ళని కౌంట్ డౌన్ చేసుకుంటూ ప్రతి మజిలీలో ఒక పద్యాన్ని నాటుకుంటూ ’ఎక్లచలోరే’ అని సాగిపోయే కవి ప్రతీ అడుగులోనూ ఒక కాందిశీకుడే. ప్రతీ మలుపులోనూ గుక్కెడు జ్ఞాపకాల కోసం దోసిలి పట్టే దాహార్తుడే.

దొరికిన చుక్కలన్నీ కలుపుకు పోతున్నా పూర్తికాని ముగ్గులా, అనుగ్రహించబడిన గాయాలన్నిటితోనూ అల్లిక వీలుకాని కవితలా, ఈ ప్రయాణం ఎప్పుడూ ఒక పలవరింతే. పలవరించే గొంతుక మాత్రం పలుకుపలుకుకీ బెంగటిల్లి పసిదై పోతుంది. జీవితకాలపు అనుభవాల అట్టడుగునించీ, వంటబట్టించుకున్న మాయమర్మపు లౌక్యపు మాటల చీలికల్లోంచి, ఒక యవ్వనపుజీరగా ఎగిసెగిసిపడుతుంది. మొహమాటాన్ని, మర్యాదల్నీ ధిక్కరించి, పలుకే బంగారమైన ప్రేయసిని పంతంగా ప్రేమిస్తూనే ఉంటుంది.

హఫీజ్ భగవంతుడితో ఇలా అంటాడు-

“పక్షులకి మొదట్లో ఎగరడం తెలీదు.
నువ్వు వాటిదగ్గర కూర్చుని పాటలు పాడావు.
నువ్వెళ్ళిపోయాక,
నీకోసమైన వాటి తపన
రెక్కలుగా మొలిచి
నింగిని తొలుచుకుపోయింది.”
బహుశా ఆర్తిని రెక్కలుగా చాపుకున్నఅ పక్షుల్లాంటివే ఇంటివైపుగా మళ్ళిన ఈ కవితలన్నీ.


గాలిలో వాటి గిరికీల గీతల వెంటపడి నడిచిపోయే అస్థిర బైరాగిలాంటివాడే ఈ కవి.
***
పుస్తకం వివరాలు:
ఇంటివైపు
కవి: అఫ్సర్
పబ్లిషర్: వాకిలి
వెల: Rs. 180/- ($ 9.95)
ప్రతులకు:
Navodaya Book House
amazon.com
kinige.com

Sunday, December 31, 2017

ఒక సూఫీ లొలొపలి --ఇంటివైపు ఒక చూపు!




                                                                    -నరేష్కుమార్ సూఫీ 

అతను ప్రేమగీతం పాడినప్పుడల్లా వారిలా అంటారు.. "బహుశా..! ఏ లోకాలనుంచో వచ్చిన కోకిల అతని గుండెకు గాయం చేసిఉంటుంది" అని, మనమూ అంతేనేమో లేదంటే మనం కూడా ఎలా పాడగలం?" --Kahlil Gibran 

1

నిజమేనేమో..! ఏ గాయమూ లేకపోతే ఎలా? ఏ వేదనా లేకుంటే ఆనందం ఏదో ఎలా తెలుస్తుంది?? ఇప్పుడు ఒకసారి "ఇంటివైపు" చూసుకోవాలి ఒకసారి.. కళ్ళతో.., కన్నీళ్లుతెచ్చుకోగల కళ్ళతో.., కథలు చెప్పగల కళ్ళతో.. 

ఎట్లా తప్పిపోయాడో ఈ పిల్లవాడు.. నల్లచేపపిల్లలా ఎన్ని సముద్రాలని దాటి వచ్చాడో.. ఏ పశ్చిమ నగరం అతన్ని భయపెట్టిందో... ఇప్పటికి ఇంటివైపు చూడాలనిపించి ఉంటుంది.. కానీ ఇప్పుడు తాను పిల్లవాడూ కాదు.. ఒకప్పటి పల్లెవాడూ కాదు.. అయ్యో..! మరిప్పుడు ఎట్లా ఏడవగలడు? మరెట్లా.. అమ్మకావాలని మారాము చేయగలడు?? హ్మ్..! ఉందిగా కవిత్వం.. ఏడవొచ్చు, భయపడొచ్చు, పసితనపు అమాయకత్వం ఒలకబోయవచ్చు.. ముఖ్యన్గా..! కాసేపు తన బాల్యంలో, తన ఇంట్లో నిండా ముతకవాసనల చిరుగు దుప్పటి కప్పుకున్న సౌఖ్యాన్ని మళ్లీ అనుభూతించుకోవచ్చు.. అందుకే ఈ చూపిప్పుడు "ఇంటివైపు"

2

"అవున్నిజంగానే వెళ్తాను నాలోకి
ఆ చిన్నప్పటి పొలంలో రాలిపడిన రేగిపళ్ళ వాసనలోకి" అనే పసితనపు పలవరింత.... ఇంటినుంచి తిరిగి వెళ్తూ...
"ఏమై వస్తానో ముందే తెలిసిపోయినట్టు ఉంటుంది..
ఏమీ తెలియనట్టూ ఉంటుంది"
అంటూ ఒక తాత్విక నిట్టూర్పు...
అఫ్సర్... చాలా మాట్లాడుకున్నాడు, ఎవరితోనో చాలానే చెప్పుకున్నాడు, ఒక మోనోలాగ్, మరో ఇంట్రావర్టిక్ ట్రావెలాగ్ రాసుకున్నాడు.. మొత్తానికి ఒక అనిర్ధారిత సత్యాన్ని ఇట్లా మనమీదకి వదిలేసాడు.. ఇప్పుడు పాఠక సమూహాలకి వెళ్లక తప్పదు ఆ "ఇంటివైపు"

3

"ఇప్పుడింక గుర్తొస్తోంది, నా చిన్నప్పటి చింతకాని.
ఇంకా తెల్లా తెల్లారకముందే
ముసురు తెరల్లో నీడల్లా దాక్కునే చెట్ల వేపు
దేహాన్నంతా చుట్టబెట్టుకొని
వూరి బయటకి నడిచి వెళ్తున్న నేను"
పచ్చిగా పైకి కనిపించే పదాల మధ్యాంతా పచ్చి మధ్యమంత మార్మికత..
"యెలా తుడిచేస్తానో దాటిన కాలాల్ని
నన్ను ఎటూ కదాలనివ్వని గాయాల్ని
అందంగా తెరుచుకున్న రహస్య ద్వారాల్ని
లోపల వెయ్యి తలుపుల ఇల్లు
ప్రతీ ఇంట్లో కొన్ని అపరిచితలోకాలు"
భరించలేనంత తాత్వికత, చలిగా ఉన్న అర్థరాత్రివేళ టీ, సిగరేట్టూ లేకుండా ముఖేష్ పాటని వింటున్నంత తీయని వ్యధ.... ఎలా వెళ్ళేది మనమూ అతని వెంట ఆ "ఇంటివైపు" ??

4

ఎప్పుడైనా అఫ్సర్ ని చూసారా? కవిలాంటి అఫ్సర్ కాదు... హుందాగా ఉండే అఫ్సర్ ని కాదు కుమిలి పోయే అఫ్సర్ ని, లొలొపలికి ముడుచుకు పోయి దుఃఖపు ముద్దయ్యే అఫ్సర్ని? చూసి ఉన్నారా?? 

"ఇంకోలాగా మాట్లాడలేనందుకు నువ్వు క్షమిస్తావో లేదో కానీ
ఇంతకంటే నిజం ఇంకోలా లేనందుకు
ఇవాళ
ఈ శరీరమంతా ఉరితాడై సలుపుతోంది నన్ను"
అంటూ రోహిత్ మరణానికి ఏడ్చిన అఫ్సర్, 

"ఇంకో తురకని కనబోతున్న ఆ తురకదాని గర్భంలో పిండాన్ని శూలంతో పొడిచేసాం. జై హింద్" అంటూ ప్రపంచంలో, చరిత్రలో కొన్ని లక్షల సార్లు జరిగిన తన హత్యకు తానే.. తన మృతదేహం ముందు తానే నిలబడి వెక్కి వెక్కి రోదించే అఫ్సర్... ఊరట కోసం కవిత్వంతో అయినా "ఇంటివైపు" వెళ్లిపోయే అఫ్సర్ కనిపించాడా మీకు??

5

"యెవరి నేల ఏదో
యెవరి పలుకు ఎక్కడిదో
అందరూ అశాంతి రెక్కల పిచ్చుకలు"
మౌంట్ మాత్రే (మాడిసన్ లో వొక కెఫె అట.. అక్కడ పారిస్ అమరవీరుల స్తూపం ఉందట) లో ఒక్కడై, చరిత్ర రక్తపు మరకలని పదే పదే తడుముతూ, తుడపాలన్న పిచ్చి ప్రయత్నం... అఫ్సర్ ఆ సమయానికి ఒక నిట్టూర్పు గొంతుక, లేదూ... ఒక నిశ్శబ్ద నమూనా...
నిజానికి అఫ్సర్ గొప్ప ప్రేమికుడు.. తనని తాను విపరీతంగా ప్రేమించుకొన్నాడు, అఫ్సర్ గొప్ప hater తనని తాను మరింతగా ద్వేషించుకున్నాడు, అఫ్సర్ అంతే గొప్ప క్రూరుడు కూడా తనని తాను ఓడించుకోనీ, కర్కశంగా తనని తాను ఖండించుకోనీ ఒక్కో ముక్కలోనూ తనని వెతుక్కుంటూ... తనని తాను ఓదార్చుకుంటూ.. వచ్చాడు "ఇంటివైపు"

6

మీరు... ఎప్పుడైనా... శంషాద్ బేగం పాటవిన్నారా?? ఎప్పుడో ఒక అర్థరాత్రి ఆ స్వరంతో ప్రేమలో పడ్డారా??
"హమే మాలూమ్ హై.. మాలూమ్ హై
అంతా తెలుసు తెలుసు అని పాడుకొని
వెంటనే నాలిక్కర్చుకొని
లేఖిన్
కానీ కానీ.. అన్నావే
అదిగో
అదే
అసలు జీవితమంతా !"
అన్న వాక్యాలు చదివాక.. మళ్లీ మళ్లీ శంషాద్ బేగం పాటని, కొన్ని క్షణాలపాటు ఆ స్వరం మూగవోయిన నాటి తేదీని మళ్లీ గుర్తుచేసి శూన్యంలో ముంచేసిన అఫ్సర్ నీ మర్చిపోవాలంటే... ఎన్ని నిద్రలేని రాత్రులు కావాలి..?? శంషాద్ జనాజాని తానొక్కడే ఇప్పటికీ మోస్తూ పోతున్నాడు.. "ఇంటివైపు"

7

బేనామ్ ముసాఫిర్
బేనామ్ శహర్
ఏక్ దీవానా గాతే, చల్తే ఫఖీర్ లా..
. ఒక సాయిబుల పిల్లవాడు.. లేలేత పెదాలమీద దాచుకున్న నవ్వుతో, కాస్త బెదురుతో.. ఏదో ఒకనాడు మీముందుకి వస్తాడు. 

"నమ్మరా నన్ను నమ్మరా
నా పేరు చివర మహమ్మదో అహమ్మదో షేకో
సయ్యదో ఖానో వున్నా నేను మంచి బాలున్నిరా"
అంటూ తన అందమైన సుర్మా కళ్ళనిండా నీళ్లతో మీ మొహంలో మొహం పెట్టి చూస్తాడు... అతన్ని హత్తుకొండి, పసి బుగ్గలమీద ఒక ముద్దునీ... అతని గుండెల మీద ఒక భరోసానీ అద్ది.. ఒడిలోకి ఎత్తుకొని తీసుకు వెళ్ళండి.. మీ "ఇంటివైపు", అతని "ఇంటివైపు.. అఫ్సర్ #ఇంటివైపు...

*

యుద్ధంలో నువ్వూ నేనూ మనం

  యు ద్ధంలో వెనుకడుగువేయడం పిరికివాళ్ళ లక్షణం . పోరాడి గెలవాలని చరిత్ర ఎన్నో అనుభవాలనిచ్చింది. అయితే ఆ యుద్ధం మనతో మనకే అయితే..! మనిషికీ, ...