‘ఇంటివైపు’ ముచ్చట: ఒక కానుక-శ్రీరామోజు హరగోపాల్
~


ఈ కవి అన్వేషణ అనంతం. తనను తాను వెతికిపట్టుకునే దారిలో బాటసారి. ఎడతెగని ముచ్చట దారితో, తనతో.  

కవిత్వం కవి తనతో, కవి లోకంతో చేసే సంభాషణ కదా. 

ఇంటివైపు ‘ఫనా’ కవిత్వం.
‘‘ఎన్ని దూరాలు కలిపితే
వొక అస్థిరబైరాగినవుతానో
ఎన్ని తీరాలు గాయాలై సలిపితే
వొక నిర్లక్ష్య సూఫీనవుతానో
ఇదీ వొక ఆటేకదా నీ చుట్టూ
నేను బొంగరమయి తిరగడానికి’’

ఒక మార్మికతను మోస్తున్న ఆలోచన...వ్యవధిలేకుండా లోపల తిరుగుతున్న తలపు తరగల నూగు కలల ముత్యాలనౌక... తాను లేకుండానే... కవిత్వంగా మారిపోతున్న వేళ ఇంటివైపు....
‘‘But I am he who has been exiled beyond the wall and the gate
Take me under your eyes
Take me wherever you are
Take me however you are
I will return to myself the color of my face and body
The light of heart and eye
The salt of bread and a melody
The flavor of the soil and the homeland’’ 
Darwīsh, in his poem “ʿĀshiq min Filasṭīn” (“A Lover from Palestine”) speaks about place and addresses his lover, the soil.

ఇంటి నుంచి దూరమైన మనిషి ప్రవాసవేదన తను పుట్టిన మట్టిని, తన ప్రియురాలిని మరువలేనితనం... ఈ కవిత. 

దర్వీష్ ను చదివితే అఫ్సర్ బాగా అర్థమవుతాడంటాడు నారాయణస్వామి. అఫ్సర్ కవిత్వంలో ఎన్నోన్నో విభిన్నమైన కోణాలున్నాయి. తన కవిత్వంలోలోతుల్లో కొత్తస్వరం వినిపిస్తుంటుంది. ఆ స్వరానికి సంగీతకర్త లెవ్వరు? తన జీవితానుభవాలే కదా... తనకు జీవితాన్నిచ్చిన, ఇంకా జీవితమైన వారినే అడగాలి. అఫ్సర్ లోపల పీఠమేసుకుని కూర్చున్న బైరాగి ఎవరని?

రెండురెక్కలపక్షి కాడు ఈ కవి. బహుపక్షాలున్నవాడు. తనమీద తనజీవితమంత విస్తారమైన ప్రభావాలున్నాయి. వామపక్షభావజాలం, సూఫీతత్వం, ప్రేమతత్వం... కొన్ని వొదిలించుకున్నవి, కొన్ని కౌగిలించు కున్నవి తనను లీడ్ చేస్తుంటాయి. కాకపోతే ఈ కవి బాగా ఆలోచించి రాస్తుంటాడు. ఆ ఆలోచనల చిక్కుల్లోకి పోతే మనం కూడా చిక్కుకుంటాం. ఆ ఆలోచనలు ప్రపంచకవులందరిని చదవడం వల్ల వచ్చినవనుకుంటాను. ఇంతకు ముందు తను రాసిన కవితలకు ఇప్పటి కవితలకు తేడాలు తెలుస్తుంటాయి.
అఫ్సర్ కవితలు మంచి బంగారు పనివాడి డిజైన్లలా కొత్త,కొత్తవిగా వుంటాయి. చాలా అందమైన కవిత్వం. చదవగానే మోహపరిచే గుణముంది ఈ కవిత్వానికి. ఒకదిక్కు కన్నీళ్ళు పెట్టిస్తూనే మరొకదిక్కు హాయిగా నవ్విస్తుందీ కవిత్వం.

జీవితాన్ని ఆటంటారు, నాటకమంటారు, కల అంటారు, కాని, ఆనందమనరు... బతుకుతున్న ప్రతిక్షణం కలిగే ప్రతి అనుభవంవల్ల దొరికే ఎరుక అంతా ఆనందమే కదా... కన్నీరు చిప్పిల్లే నవ్వు... అనుభూతులతో ముప్పిరిగొనే మనసు... ఇంటివైపు అంటేనే ఆనందం. బాధలే పడ్డామో, నవ్వులే కూడబెట్టుకున్నామో, పొందిన అనుభవాల చందనాల మాలవేసి ఆహ్వానిస్తుంది ఇల్లు. ఇంటిది పేగుబంధం. అమ్మ. అమ్మలెక్క ఇల్లు.

‘‘యేమేం తీసుకెళ్తాను ఇంటికి,
నా వూరికి
ఆ తొలిరక్తపు సెలయేటికి
కష్టంగా వుంటుంది
యీ లోకపు కొలమానాల కానుకల్ని చూస్తే
అర్థాలు మారిపోయిన విలువల్ని నిలువెల్లా చూస్తే
చివరికేమీ తేల్చుకోలేక
మనసు కూడా ఇరుకనిపించే సంతోషాన్నో
మళ్ళీ వదులుకుని రావాలన్న దిగులునో
కాస్త ముందే సిద్ధం చేసి పెట్టుకుంటాను
యేమై వస్తానో ముందే తెలిసిపోయినట్టూ వుంటుంది.
యేమీ 
తెలియనట్టూ వుంటుంది.’’

ఈ పుస్తకానికి ముందుమాటలు రాసిన వారిలో ముందుగా రాసిన ‘ఎంతెంత దూరం’లో స్వాతికుమారి ఉదహరించిన గులాం అలీ కవితనే చెప్పుకోవాలి ఇక్కడ..

‘నగ్రీ నగ్రీ ఫిరా ముసాఫిర్ ఘర్ కా రాస్తా భూల్ గయా’... ఇంటిబాట మరిచిపోయామా మనం? మరుపుతెరలు పడ్డాయా, మనమే కప్పుకున్నామా... ఏదో కానీ వెతుకులాటలోనైతే వున్నాం కనుక బతికే వున్నాం.

If I touch the depths of your heart.
If I come back
Use me as wood to feed your fire
As the clothesline on the roof of your house
Without your blessing
I am too weak to stand.
I am old
Give me back the star maps of childhood
So that I
Along with the swallows
Can chart the path
Back to your waiting nest అంటాడు దర్వీష్. ఇది పునరాగమన కాంక్ష. ఇది ఆశ. కవి అన్వేషణ అట్లాంటిదే.
ఈ కవిని భౌతికంగా చూస్తే ముస్లిం. తనదేశంలోనే పరాయివాడుగా చూడబడుతున్నవాడు. బతుకు తెరువు కోసం ప్రవాసంలో వున్నవాడు. దేశంలో మతప్రవాసం. బయట బతుకు ప్రవాసం. తనంతట పోయినా Exiలే కదా. Carrying a lonely road … arrested himself into himself…ఎక్లాచలోరే...

‘నిన్ను వోడించే యుద్ధం’ అనే కవితలో

‘నేనూ దేశాన్ని ప్రేమిస్తాను గాని
దాన్ని భక్తిగా తర్జుమా చేసుకోలేను ఎప్పటికీ
నువ్వు క్షమించకపోయినా సరే
నాకు యే దేహమైనా
అన్నంపళ్ళెంలాగే కనిపిస్తుంది యెప్పుడూ
యే దేశమైనా
ఆ మెతుకుల్ని దోచేసే దొంగలాగే కనిపిస్తుంది యెప్పుడూ
యిక్కడ నీ పేదరికపు వొంట్లోనూ
అక్కడ ఆ గరీబు వొంట్లోనూ
వొకే ఆకలికేక
వొకే వెతుకులాట’ అంటాడు అఫ్సర్.
నోరు,చెయ్యీ అను ఆ రెండు దేశాలు అనే కవితలో కవి
‘ చెయ్యి వొకదేశం
నోరు వొకదేశం
నువ్వూ నేనూ శరీరఖండాలం
ఇంకా తెగిపోతాం సరిహద్దులు తెంపిపోతాం
వొకేవొక్క అన్నంమెతుకు నా వునికి
మిన్ను విరిగి మీదనేపడనీ
భూమిబద్ధలయితే బద్ధలవ్వనీ 
మరి 


లి’ 
ఏ దేశమైనా పేదరికాన్ని లేకుండా చెయ్యదు. ఏ గరీబు ఆకలినీ పట్టించుకోదు. ప్రజలు చెయ్యొక దేశంగా, నోరొక దేశంగా తెగిపోతూనేవుంటారు...మారదు దేశం..మారదు లోకం.

‘కొత్తపదాల అందాన్ని అద్ది హత్యని లించింగ్ అన్నారు.యింకోసారి అది ఎన్కౌంటర్ కావచ్చు. చట్టరాహిత్యపుటడవిలో పేరు తెలియని చెట్లకు వేలాడేసి, ప్రాణాల్ని చివరంటా వేటాడవచ్చు. నగరం నడిమధ్యలోనే యేదో వొక నిషిద్దమాంసం ఎరగా విసిరి యేకంగా మనిషినే నిషిద్ధపదార్థం చేయచ్చు. పదమొక్కటే మార్తుంది. వేట అదే. హత్యా అదే.

....................
యింకా కొన్ని పేజీల తరవాత అదే కథ మనదాకా వస్తుంది.
...................
నీ మానవజాతి చరిత్ర సమస్తం
హత్యచేయబడ్తున్న హోరు చూస్తున్నావా నువ్వు?’........... 
కవి అంతరంగంలో ఈ హోరు వుంది.నిస్సహాయవేదన వుంది. మానవీయత వుంది...కాని, ఎట్లా ఈ దుఃఖాన్ని వొదిలేయడం. ఎట్లా మనిషి మనగలగడం? దేన్ని మనుగడ అనాలి. 
‘‘నువ్వు గొంతు సవరించుకునేలోగా
నా వొళ్ళుపొంగి దండమయిపోయిందిలే
ఇన్నాళ్ళూ నిన్ను పీరీలాగామోశానా
ఇప్పుడు నా కడుపు కర్బలా అయిపోయిందిలే
చరిత్రచొక్కాను తిరగేసి తొడుక్కుంటున్నా
నన్ను దాచేసిన చిరుగుకంతల్లోంచి సూర్యుణ్ణి కంటున్నా
కలల కళల మాయాదర్పణమా, కాసేపు పగిలిపో
రోజ్ రోటీ నా అద్దం
దాంట్లోంచి రాస్తున్నా కొత్తచరిత్ర’’ ఇది కవిగా తన స్పందన. కవులేం చేస్తారు అని శివారెడ్డి అన్నట్టు అఫ్సర్ ఒక కొత్త పద్యం రాసియిచ్చాడు.
కవిగా అఫ్సర్ కవిత్వం మోడర్న్ ఎక్స్ ప్రెషన్. కవితానిర్మాణ, నిర్వహణలు కొత్తబాటలో...ఊహించని విధంగా కవితను మొదలుపెట్టడంలోగాని, ముగించే టపుడుగాని...సాంప్రదాయిక వచనకవితారీతులను వొదిలిపెట్టాడనిపిస్తుంది. ఈ సంకలనంలోని ఏ కవితను చూసినా తెలిసిపోతుంది.ఒక్క కవితలో అనేకకవితల్ని నింపి రాయడం తనప్రత్యేకత. భావసంక్లిష్టత. వస్తువే తన కవితాశిల్పాన్ని నిర్మించుకుంటుంది. ఎంత శబలమైన మాటలను వాడుతాడో అంతే నిగూఢమైన భావాలను దట్టిస్తాడు. 
ఈ కవి కవికాడనిపిస్తుంది.ఉత్త ప్రేమబైరాగి.
గాలిబ్ ‘దాతలగు వారి చేతులను చూతునోయి’ అన్నట్టు అఫ్సర్ కూడా తనకవిత్వం చదివేవారి లోతులను పట్టుకోవాలనుకుంటున్నాడు. ఏకకాలంలో బహుముఖభావవ్యక్తీకరణ చేయడం ద్వారా ఈ కవిత్వం చదివేవాళ్ళకు కావలసినదేదో దొరికేటట్టు చేస్తాడు.
శివారెడ్డిగారు అఫ్సర్ లో పాలస్తీనా కవి,ప్రవాసి దర్వీష్ ను చూస్తే, చినవీరభద్రుడు రూమీని చూసాడు. అఫ్సర్ కవిత్వంలో చింతకాని నుంచి అమెరికా వెళ్ళిన ప్రవాసి కనిపించాడు శివారెడ్డికి. అంతరాంతరాలలోని ద్వైధీయమానసం నుంచి బైరాగిగా బయటపడ్తున్న ఫనా కవిత్వం రాసిన సూఫీని చూసాడు వీరభద్రుడు. అనేకపార్శ్వాలతో సింగిడిలెక్క అగుపించే అఫ్సర్ కవిత్వాన్ని దర్శించడం మామూలు కాదు. దార్శనికత కావాలి. ఆ యిద్దరు దార్శనికులే కదా. వారి కన్నా ఇంకా గొప్పగా నేను చెప్పగలిగిందేమున్నది?
“Listen to the story told by the reed,
of being separated.
“Since I was cut from the reedbed,
I have made this crying sound.
Anyone apart from someone he loves
understands what I say.
Anyone pulled from a source
longs to go back.”…….జలాలుద్దీన్ రూమి అంటున్నాడు... ఇంటివైపుకు ఇంతకన్నా నిర్వచనముంటుందా? తనను తన ఉనికి నుంచి వేరుచేసి తూట్లుపొడువబడ్డ పిల్లంగోవి దుఃఖస్వరమే పాడుతుంది, తిరిగి తనను తనవెదురుపొదను చేర్చేదాక. మనిషి అంతే.
‘‘కొలమానాలన్నీ గాల్లోకి
చిలిపిగా విసిరేసి
నీలోపల శిథిలమయిపోనీ నిబ్బరంగా’’...అంటాడు అఫ్సర్ రూమీలెక్కనె.
అంతేకాదు అఫ్సర్, ‘‘ కాలాన్ని నిలువునా చీల్చిన తరవాత, నువ్వు నిజంగా పరమయోగివే’’ నంటాడు. 
‘‘అయిదువాక్యాల్లో అన్నీ చెప్పి
నాలోపలి గుహలన్నీ తొలిచి
నీ కంటి ముందు వొలిచి పెట్టాలని అనుకున్నా
ఆ అయిదువాక్యాలేమిటో చెప్పేలోగా
నా వంతుకొచ్చిన క్షణాలు జారిపోయాయ్
చివరికి నీకేమీ చెప్పలేదు’’
రూమి ప్రేమికులను విడివడని దేహం,ప్రాణాలవలెనె చూస్తాడు.
Laz Slomovits అనే రచయిత ఒక ఇరానియన్ సింగర్,పెయింటర్ Sepideh Vahidiని రూమి ప్రేమగురించి ఏం చెప్పాడో చెప్పమంటే, ఆమె“To be in love, to be in love and to be in love.” అన్నది. ప్రేమకు హద్దులు లేవని రూమి ఎరుగడా.
‘‘Lovers don’t finally meet somewhere
they’re in each other all along’’. అంటాడు రూమి.
నీలోనే అనే కవితలో,
‘‘నీలోనే లీనమయ్యే చప్పుడునై
నీలోపల సుడులు తిరిగే మౌనమై
నిన్ను దాటి వెళ్ళలేని అలనై
కొన్ని జీవితకాలాలు నీలోనే...’’ అవును కదా..
‘‘యిప్పుడంతా నీ లేతపదాల పద్యాన్ని నేను
నీపెదవుల మీద ననలెత్తే బోసి అక్షరాల వోనమాలు దిద్దుకుంటూ, నీలోంచి యింకో భాషని తోడుకొచ్చి, నా పసిదనాల పిల్లకాలవల్లోకే నా కాలాన్నంతా మళ్ళిస్తా...
నీ క్షణ,క్షణ పుట్టినరోజుల పునర్జన్మల్లో ప్రతిసారీ నాకు నేనే మెలకువ.
నువ్వే మేల్కొపలుపు.
రా,
యిద్దరికీ
యిది ఆటసమయం..’’ క్రీడామాత్రంగా జీవితం. ప్రేమికులు శాశ్వతమైనవాళ్ళు.
అఫ్సర్ కవితల్లో ప్రేమకవితలు ప్రత్యేకం. అవి తనవే కావు, సమస్తమానవాళి ప్రేమానుభవాల్లెక్కనె వినిపిస్తాయి. తన కవితలు చాలామట్టుకు వ్యాఖ్యానాలు అక్కరలేనివే. తనకవితారూపాలన్నీ రూపకాలే. 
తనకవిత్వం గురించి ఒక్కసారి రాస్తే మనసునిండదు.

1 comments:

Anonymous said...

వివరణాత్మక సమీక్ష..
చివరిమాట అక్షర సత్యం

Web Statistics