‘ఇంటి వైపు’ ఒక ప్రయాణికుడి నిరంతర తాత్విక సంభాషణ

-నారాయణ స్వామి వెంకటయోగి 
~

1992 లో నా కల్లోల కల మేఘం వచ్చినప్పుడు, ఆంధ్ర భూమి లో అనుకుంటా ఒక రివ్యూ వచ్చింది. హరనాద్ చేసిండు. చాల అన్యాయమైన రివ్యూ అది. ఆయనకు శివారెడ్డి గారి మీద దేవి ప్రియ మీద న్న వ్యతిరేకతను వెళ్ళబుచ్చడానికి వాళ్లకు ఇష్టమైన, వాళ్ళను ఇష్టపడే నన్ను నా కవిత్వాన్ని చీల్చి చెండాడాడు . నిజానికి ఆ రోజుల్లో నా మీద శివారెడ్డి గారి కవిత్వ ప్రభావం ఉండేది కానీ దేవి ప్రియ గారిది కాదు. అదేదీ పట్టకుండా, నా కవిత్వం లో మంచీ చెడు చెప్పకుండా కేవలం తిట్టడమే పరమావధిగా ఆయన రివ్యూ రాసిండు. ముందు ఆయనెవరో నేను పోల్చుకోలేదు. తర్వాత తెల్సింది ఆయనే విశాలాంధ్ర బుక్ హౌస్ లో ఉండే హరనాద్ అని. ఆ రివ్యూ చూసి చాల డిస్టర్బ్ ఐన. ఇంకా అప్పటికీ రివ్యూలను ఎట్లా తీసుకోవాలో , యే మెచూరిటీ తో అర్థం చేసుకోవాలో తెలవదు నాకు. శివారెడ్డి గారి దగ్గర గుడ్లల్ల నీళ్ళు తీసుకున్న. భలేవాడివయ్యా ఆయనెవరో అన్యాయంగా రాస్తే నువ్వు దానికి ఫీల్ కావాలా ఏమిటి అని ఓదార్చిండ్రు సారు. కొంచెం మనసు స్తిమితపడ్డా లోలోపల బాధ తొలుస్తూ ఉండింది.

సరిగా తర్వాత వారమే ఆంధ్రభూమిలోనే హరనాద్ రాసిన రివ్యూకు బదులుగా సమాధానంగా ‘నారాయణస్వామి పావు కాదు పావురమే ‘ అని మరో రివ్యూ వచ్చింది. అందులో హరనాద్ రాసినదానికి బలమైన రిజాయిండర్ ఉన్నది. ఎవరబ్బా రాసింది అని చూస్తె, కింద పేరు అఫ్సర్ అని ఉంది. ఒకటికి రెండు సార్లు చదివిన. అద్భుతంగా రాసిండు. హరనాద్ లేవనెత్తిన అర్థం పర్థం లేని వాదనలను పూర్వపక్షం చేస్తూ, అయన అభిప్రాయాలు ఎట్లా పక్షపాత దురభిప్రాయాలో నీళ్ళు నమలకుండా స్పష్టంగా చెప్పిండు అఫ్సర్ తన వ్యాసం లో. బాగ నచ్చింది. అద్భుతంగా ఉంది. ఐతే వెంటనే ఫోన్ చేసి చెప్తామంటే అప్పుడు సెల్ ఫోన్లు లేవు. తన ఫోన్ నాకు తెలియదు. హడావిడిగా ఆంధ్రభూమి పేపర్ కొనుక్కొని శివారెడ్డి సార్ దగ్గరకు పోయిన. నన్ను చూడగానే సార్ ‘అఫ్సర్ అదరగొట్టిండు చూసినవా’ అన్నరు. చూసిన సార్ అని నేను పేపర్ తీసి చూపించిన. చాల సేపు ఆ వ్యాసం గురించి, హరనాద్ రాసిన రివ్యూ గురించి మాట్లాడుకున్నాం సారూ నేనూ. ఎట్లా సార్ అఫ్సర్ ను కాంటాక్ట్ చేసేది అని అడిగితె తను విజయవాడలో ఉన్నడయ్యా – ఉత్తరం రాయి అన్నారు సార్. అట్లే రాస్తాను అన్న – 

అప్పటికే అఫ్సర్ చాల మంచి కవిగా పేరున్న వాడు. మంచి సాహిత్య విమర్శకునిగా కూడా పేరుంది. న్యూస్ పేపర్ లో జర్నలిస్ట్ గా, కాలమిస్టు గా కూడా ప్రసిద్ధుడే. రక్తస్పర్శ, ఇవాళ కవితా సంకలనాలు , క్రితం తర్వాత అని తను ఇతర కవులతో కలిసి రాసిన దీర్ఘ కవిత వచ్చి ఉన్నాయి. తను ఖమ్మం అని తెలుసు. సుధాకిరణ్ తో అనేక సంభాషణల్లో అఫ్సర్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. సాధారణంగా ఖమ్మం లో సాహిత్య వాతావరణం గురించి మాట్లాడినప్పుడల్లా అఫ్సర్ ప్రసేన్ సీతారం యాకూబ్ అన్నల పేర్లు రాకుండా ఉండడం అసంభవం. అప్పటికే యాకూబ్ అన్న అన్వర్ ఉల్ లూం కాలేజిలో లెక్చరర్ గా చేస్తున్నారు. నేను వాసవీ లో చేస్తున్న. మల్లె పల్లి లో తన కాలేజి. మాకు దగ్గరే. అప్పుడప్పుడు వెళ్ళేది కూడా. ఐతే అఫ్సర్ను వ్యక్తిగతంగా కలిసింది చాల తక్కువ. ఒక సారి 1988 లో ఖమ్మ లో పీ డీ ఎస్ యూ సభలైనప్పుడు (నేనూ విద్యా కల్సి వెళ్ళిన మొదటి సభలవి) అక్కడ తను కలిసినట్టు గుర్తు. తను పీ డీ యేస్ యూ కు దగ్గర గ ఉంటాడు అని కూడా విన్న. ఆ రోజుల్లో అఫ్సర్ ను గురించి గానీ ఖమ్మం విజయవాడ కేంద్రంగా ఉన్న కవుల ‘గ్యాంగ్’ గురించి విన్నప్పుడు గానీ నాకు చాల అసూయగా ఉండెడిది. వాళ్ళంతా కలిసి సంయుక్త దీర్ఘ కవితలు రాయడం, కవిత్వం లో ‘రెబెల్స్’ గా ఉండడం, కొత్త మార్గాలు వెతకడం, వగైరా వార్తలు విన్నపుడల్లా వెంటనే విజయవాడో ఖమ్మమో పోవాలి అన్నంత ఆవేశం కలిగేది. హైదరాబాదు లో శివారెడ్డి సార్ దేవిప్రియ సార్ వీ వీ సార్ విమలక్క లాంటి కవుల సాంగత్యం మాకుంది లే అన్న గర్వం మరో వైపు.

అట్లా ఎక్కువ సార్లు కలవకపోయినా అఫ్సర్ నేనూ బాగా సన్నిహితమయ్యాము. మంచి దోస్తులమైనం.
తరవాత 2005 జులై లో తానా సభల సాహిత్య కార్యక్రమానికి ఆరి సీతారామయ్య గారు పిలిస్తే వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళా కలిసిండు అఫ్సర్ ఈ సారి కల్పనతో. ఆ రెండు మూడు రోజులు చాల ఆత్మీయంగా గడచినాయి. ఇంక అప్పటినుండి అమెరికా లో నాకు అఫ్సర్ అత్యంత ఆత్మీయుడైన గొప్ప స్నేహితుడూ కవీ. నేను ఇంకొంత మంది మిత్రులతో ‘ప్రాణహిత’ నడిపినప్పుడూ, తనూ రవీ ముందు ‘వాకిలి’, తర్వాత తనూ కల్పనా ‘సారంగ’ నడిపినప్పుడూ ఇద్దరం మాట్లాడుకోని రోజు లేదు. మా సంభాషణల్లో కవిత్వమూ, సాహిత్యమూ, సాహిత్య విమర్శా, సమకాలీన రాజకీయాలు , అస్తిత్వాలు ఉద్యమాలు, తెలంగాణా , ప్రవాసమూ – దొర్లని అంశం లేదు. మా సంభాషణలు అట్లా నడుస్తూనే ఉన్నాయి. తను ఒక గొప్ప కవే కాదు లోతైన ఆలోచన పరుడు, చదువరి, గొప్ప మేధావి. తన నుంచి ఎన్నో నేర్చుకున్న. ముఖ్యంగా సారంగ కోసం రాయమని తను నన్నడిగినప్పుడు, నాకు మంచిగా రాయడం, వచనం లో క్లుప్తత గాంభీర్యత ఎట్లా తీసుకురావాలో నేర్పింది తనే. నా సందుక తీసుకురావాలి అనుకున్నప్పుడు కవితలన్నింటినీ చదివి ఎడిట్ చేసి కొన్నింటికీ శీర్షికలు పెట్టిందీ తనే. నాకు శీర్షికలు పెట్టడం రాదు. అందులో తను దిట్ట. అట్లే వానొస్తద కవితలు కూడా. నిజానికి రెండు మూడు పేర్ల మధ్య ఊగిసలాడుతూ యే పేరుపెట్టాలి అని తననడిగితే వానొస్తద అని సూచించిందీ తనే! ఇప్పటికీ నా ప్రతి పోయెం కూ మొదటి పాఠకుడు తనే.

మొన్న డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహా సభలకు హైదరాబాద్ పోయినప్పుడు అఫ్సర్ తన పుస్తకం తీసుకొస్తున్నాడని తెల్సు. అంతకు ముందు శివారెడ్డి సార్ దగ్గర ముందు మాటకోసం ఎదిరిచూస్తున్నాడని తెలుసు. సార్ తో మాట్లాడిన ప్రతి సారి ముందు మాటనే గుర్తు చేసేటోన్ని. రాస్తున్న నాన్నా ఇదిగో ఈ నెలాఖరు లోగ ఇస్తా అని సార్ అనడం నేను అఫ్సర్ కు చెప్పడం. ఓ సారి సార్ ను హైదరాబాదు లో కలిసినప్పుడు అన్నాడు అఫ్సర్ అందరి లాంటి పోయేట్ కాదు కదా నాన్న తొందరగా రాసెయ్యడానికి - తను చాల డిఫికల్ట్ పోయేట్ కదా – తన ఇంతకు ముందు పుస్తకాలు కూడా తెప్పించుకున్న తిరగేస్తున్నా అన్నారు. అప్పుడే సార్ కు పాలస్తీనా మహాకవి దార్వీష్ ‘బటర్ ఫ్లై బర్డెన్’ పుస్తకం ఇచ్చిన. యే కవిత్వ పుస్తకమైన ఆనందంగా తెసుకుని కళ్ళకద్దుకుంటారు సార్. దార్వీష్ పుస్తకం చూడంగానే సార్ కండ్లలో ఆనంద బాష్పాలు. అద్భుతం నాన్న అన్నారు సార్. పుస్తకాలూ అదీ కవిత్వ పుస్తకాలూ గిఫ్ట్ గా ఇస్తే ఆనందంగా కండ్ల నీళ్ళురాల్చేడిది నాకు తెలిసి సార్ ఒక్కరే. తర్వాత మాట్లాడి మల్లా అఫ్సర్ ముందు మాట గుర్తు చేస్తే ‘దొరికింది నాన్నా ఒక మార్గం దొరికింది – దార్వీష్ చూపించిండు మార్గం, ఇంకెంత మరో రెండు మూడు వారాల్లో వచ్చేస్తది’ అన్నారు సార్. అన్నట్టుగానే అద్భుతమైన ముందు మాట రాసిండ్రు సార్. తర్వాత పుస్తకం వాకిలి ప్రచురణగా అద్భుతంగా రావడం, ఆవిష్కరణ జరగడం ఆ సభకు నేను వెళ్ళడం జరిగిపోయినయి.

తర్వాత ‘ఇంటివైపు’ ను చదువుతున్నప్పుడల్లా నేను దార్వీష్ నే గుర్తు తెచ్చుకున్న. నా దగ్గరున్న బటర్ ఫ్లై బర్డెన్ సార్ కు ఇచ్చిన కదా మరొకటి కొనుక్కున్న – మల్ల చదివిన. అఫ్సర్ నూ దార్వీష్ నూ పక్క పక్కన పెట్టుకొని చదివిన. నిజమే సార్ చెప్పింది. సార్ తన ముందుమాటలో అంతగా వెతకలేదు కానీ (ముందు మాటకు ఉండే స్కోప్ వేరు కదా) దార్వీష్ ను చదివితే అఫ్సర్ ఇంకా బాగా అర్థమవుతాడు. అట్లా అని అఫ్సర్ అర్థం కాని కవి అని నా ఉద్దేశ్యం కాదు. ప్రతి కవికీ అనేక కోణాలుంటాయి. అనేక పరిమాణాలుంటాయి. అనేక పార్శ్వాలుంటాయి. మరీ ముఖ్యంగా ఎన్నో యేండ్ల నుండీ కవిత్వ వ్యవసాయం దీక్షగా చేస్తున్న కవి. అనేక అంశాల మీద విస్తారంగా రాస్తున్న కవి. ఊరికే రాయడం కాదు విశ్లేషణతో రాస్తున్న కవి. అఫ్సర్ ను అల్లాటప్పా గా చదివేసి నాకు అర్థమైండు- ఆయన కవిత్వమంతా నాకు తెలిసిపోయింది అనుకోవడానికి వీలు లేదు. అది అంత సులభం కాదు. పైగా అఫ్సర్ ఊరికే కవిత్వం రాసి పడేయ్యడంలేదు. తనను తను ప్రతి సారి పుటం పెట్టుకుంటున్నాడు. ప్రపంచ కవుల్ని ఔపోసన పట్టి వాళ్ళ కవిత్వాన్ని విశ్లేషణాత్మకంగా చదివి తన కవిత్వంలోకి గుణాత్మకంగా ఇంకిన్చుకున్నాడు. అది సూఫీ కవులు కావచ్చు అదొనిస్ కావచ్చు దార్వీష్ కావచ్చు మార్క్ స్త్రాండ్ కావచ్చు టొమాస్ ట్రాన్ట్రోమ్మర్ కావచ్చు. అఫ్సర్ తో ఒక గంట మాట్లాడితే ఎందరొ కవుల్ని పరిచయం చేస్తాడు. అయన కవిత్వం చదివితే ముఖ్యంగా ఇంటి వైపు చదివితే వర్తమాన ప్రపంచ సాహిత్యం మీ ముందు ప్రత్యక్షమై, మీ కండ్లలోకి మనసులోకి చివరికి మెదడు లోకీ శాశ్వతంగా ఇంకిపోతుంది. అట్లా ఇంకిపోయినట్టు మనకు తెలవదు కూడా.

ముందు చెప్పినట్టు అఫ్సర్ లో అనేక పార్శ్వాలున్నాయి. ఆయనకు ఆయన కవిత్వానికి (నిజానికి ఆయనంటే ఆయన కవిత్వమే) అనేక పరిమాణాలు (Dimensions) ఉన్నాయి. పాఠకునికి ఎవరికీ కావాల్సింది అది అయన కవిత్వలో దొరుకుతుంది. ఎవరికీ కావాల్సింది వాళ్ళు ఆయన ‘ఇంటి వైపు’ వెళ్లి సంపాదించుకోవచ్చు. ఆ అద్భుత అనుభూతి లో మునిగి తేలవచ్చు. ఐతే ప్రదానంగా ‘ఇంటి వైపు’ లో అఫ్సర్ ఒక తాత్విక సంభాషణ చేస్తుండు. ‘ఇంటి వైపు’ ఆయన ప్రయాణమంతా (నిజానికి చదివే మన ప్రయాణం కూడా) ఒక సంభాషణే. ఒక ఎడ తెగని సంభాషణ. అది ఒక కవిత తో ఐపోదు. ఒక కవిత చదవంగానే ఇది ఐపోయింది మరో కవిత చదువుదాం అనుకున్నట్టు కాదు. ఒక కవిత నుండి మరో కవితకు దాని నుండి మరో కవితకు (పైగా ఆ కవితలన్నీ అదే సంభాషణ క్రమంలో ఉండవు ఈ పుస్తకంలో – అయినా ఏమీ పరవా లేదు ఆ క్రమాన్ని మనం తేలికగానే పోల్చుకోవచ్చు ). యే ఒక్క కవితకూ భౌతికమైన ముగింపే తప్ప లాజికల్ ముగింపు ఉండదు. మొత్తం ఇంటి వైపుకూ లాజికల్ ముగింపు ఉండదు. అందుకే అది నిరంతర సంభాషణ. నిరంతర ప్రయాణం. ప్రయాణం లాంటి సంభాషణ . ఐతే ఈ సంభాషణకు ముగింపు లేకపోవడం మాత్రమే కాదు, ఇందులో ఒక యెడ తెగని శోకం ఉన్నది. ఒక గోస ఉన్నది. ఒక జాలి ఉన్నది. కొన్ని సార్లు సంభాషణ తీవ్రమైనప్పుడు ఆగ్రహం అనిపిస్తుంది కానీ నిజానికది ఆగ్రహం కాదు. జాలి. శబ్దం లోంచి నిశ్శబ్దం లోనికి ప్రవహించి శబ్దానికీ నిశ్శబ్దానికీ మధ్య కొన్ని జా గాలు సృష్టించి అందులో మనలను ఒంటరి వాళ్ళనీ దిక్కు తెలవనివాళ్ళనీ చేసి ఏదీ శాసించకుండా ఏదీ పురమాయిన్చకుండా అతి మెత్తగా తన గాయాల్ని చూపించి సుతారంగా తన కన్నీళ్లను మనకు నెత్తురు లాగా పూసి మనలని ఒక భయ విహ్వాలతకు గురి చేసి మళ్ళీ తనే మెల్లగా తన చిటికెన వేలు అందించి తోడుగా మరో పద్యం లో కలుద్దాం లే అక్కడ నేను ఉంటాలే అని అర్దాన్తరంగా వదిలేస్తడు అఫ్సర్. అందుకే ఎంత తేలికగా కనబడతాడో అంత కష్టమైన కవి. ఎంత సౌమ్యునిలా కనబడతాడో అంత కఠిన మైన కవి. ఆ ఈ సారి మనకు దొరుకుతాడు లే అనుకున్న ప్రతిసారి తన కవిత్వం లో దొరకకుండా మాయమవుతాడు. ఐతే ఆ మాయమవడం అస్పష్టతోనో అర్థం కాక పోవడమో కాదు.

అఫ్సర్ ది అంతు చిక్కని బాధ. అంత తేలికగా దొరకని శోకం. మనకు తెలుసు అఫ్సర్ కవిత్వంలో సూఫీ తత్వముందని. అదొక అవిభాజ్య పాయగా ఆయన కవిత్వమో అల్లుకుపోయిందని. ఐతే సూఫీ గాయకులను మీరెప్పుడన్నా వింటే వాళ్ళు చాలా పై శ్రుతిలో ఎక్కువగా పాడతారు. వాళ్ళ గానంలో ఒక ఆవేశం, తన్మయత్వం, పాషన్ , ఒక తీవ్ర ఉద్వేగం ఉంటై. అవనీ తారా శృతి లో పలుకుతాయి. కానీ అఫ్సర్ అవన్నీ అదే మోతాదులో ఉన్నా మంద్ర స్థాయిలో పాడే సూఫీ గాయకుడు. ఇది ఒక పారడాక్స్ లాగ వినపదవచ్చు. నిజమే అఫ్సర్ కవిత్వం ఒక అద్భుతమైన పారడాక్స్,

ఆయన ప్రతి కవిత ఒక మంద్రస్థాయి సూఫీ గీతం.
అఫ్సర్ దాదాపు ప్రతి కవితలో ఒక నువ్వు ఉంటాడు. అంటే కవి ఎవరితోనో మాట్లాడుతుండు. సంభాషిస్తుండు. ఎవరా మరొకరు? మనకు తెలిసినోల్లెనా? లేక కవికి మాత్రమే తెలిసినోళ్ళా? ఎవరైనా ఒక జెనెరిక్ పర్సనాలిటీనా? నాకు మాత్రం అది అఫ్సరే అనిపిస్తుంది. తన ప్రతి కవితలో తనతో తనే మాట్లాడుకుంటున్నాడు కవి. ఈ కవులకు తమతో మాట్లాడుకునే ‘multiple personality disorder’ (మంచి అర్థం లోనే ) ఉంటుందేమో? కవి భావనలకు, ఆలోచనలకు మరో భావాలతో ఆలోచనల్తో సంఘర్షణ జరగాలి కదా? ఒకానొక తీవ్ర స్థాయి ఉద్వేగం లో వొణికి పోయి, జ్వరం తో చలించి తర్వాత నిదానించి ఆ ఉద్వేగానికి కారణమైన భౌతిక పరిస్తితులతో సంభాషిస్తూ సంఘర్షిస్తూ మంద్ర స్థాయిలో పాడుతున్న పాట కదా అఫ్సర్ కవిత. ఆ సంఘర్షణ ఎవరితో మరి? ఆ సంభాషణ ఎవరితో మరి?ఐతే ‘ఇంటి వైపు’ పూర్తిగా చదివితే దీన్ని జనరలైజ్ చెయ్యలేము. ప్రతి కవిత లోనూ ఉండే ‘నువ్వు’ ఒక్కడే అని చెప్పలేము. ఇక్కడ అనేక ‘నువ్వులు’ ఉన్నరు. భిన్న రూపాల్లో ఉన్నారు. భిన్న పరిమాణాల్లో ఉన్నారు.

చిత్రమేమిటంటే ఇక్కడ అఫ్సర్ కూడా ఒక్కడే కాదు. కవిగా అఫ్సర్ ఒక్కడే ఒకటే పర్సనాలిటీ ఒకడే వ్యక్తీ అనుకుంటే మనకు ‘ఇంటి వైపు’ అర్థం కాదు. ఇందులో అనేక అఫ్సర్ లు ఉన్నారు. అందరి మూలసూత్రమూ అన్ని సార్లూ ఒకటే కాక పోవచ్చు. నాస్టాల్జిక్ గా, ఒక తీరని రందితో ‘ఇంటి వైపు’ పోవాలనుకుని సంభాషిస్తున్న/పాడుతున్న కవి అఫ్సర్ అనుకుంటే తనను సరిగా అర్థం చేసుకోలేము. అఫ్సర్కు అనేక రందులున్నాయి. అనేక వెతలున్నాయి. అనేక ఫికర్లు ఉన్నాయి. ఒక అఫ్సర్ లో వలస పెత్తనానికి గురవుతున్న తెలంగాణా వాది ఉన్నాడు. అతడు వలస పెత్తనాన్ని ఎదిరించి సంకెళ్ళు తెంచుకుని విముక్తి కోసం పోరాడుతున్న ప్రాంతీయ అస్తిత్వం వాది ఉన్నాడు. ఒక అఫ్సర్ లో జాతీయంగా అంతర్జాతీయంగా వివక్షకు, అణచివేతకు గురవుతున్న ముస్లిం ఉన్నాడు. తన ఊరునుంచి, వేర్ల నుంచి దూరంగా అమెరికా లో నివసిస్తూ తాను కోల్పోయిన తల్లి ప్రేమనూ, ఇంటి ప్రేమనూ ఊరి ప్రేమను తలుచుకుంటూ ఆ పాత రేగుపళ్ళ వాసనలను యాది చేసుకుంటూ రంది పడుతున్న అఫ్సరూ ఉన్నాడు. ఇంత మంది కలయిక ఈ ‘ఇంటి వైపు’ అఫ్సర్. ఇన్ని అనేక అఫ్సర్ల కలయిక ఈ కవిత్వ లో ఉన్నది. ముఖ్యంగా ఇవన్నీ ఈ శతాబ్డం లో వచ్చిన కవితలు. ఈ శతాబ్దం దుఃఖం, ఒంటరి తనం, గ్లోబలైజేషన్ లో అస్తిత్వం కోల్పోయి తిరిగి ఆ ప్రాంతీయత నుండే ఆ ప్రాంతీయ అస్తిత్వం నుండే, ఆ ముస్లిం అస్తిత్వం నుండే, ఆ సూఫీ తత్త్వం నుండే తననుండి వేర్లనూ జీవితాన్నీ దూరం చేసిన ప్రపంచీకరణను ధిక్కరిస్తున్న బహుళ అస్తిత్వ వాది ఉన్నాడు. అఫ్సర్ ది ఒక అస్తిత్వం కాదు. అనేక అస్తిత్వాలు కలగలిసినా యే అస్తిత్వానికదే స్పష్టంగా వేరుగా కనబడే కవిత్వమూ, వ్యక్తిత్వమూ అఫ్సర్ ది. అదే తన కవిత్వంలో కనబడుతుంది. వినబడుతుంది. తన ఆకాంక్షలను, వెతలను, రోదనలను, గోసగా మంద్రంగా విన్పిస్తాడు ప్రతి కవితలోనూ – ఎడతెగకుండా – నిరంతరంగా – ఒక organic continuity తో. అందుకే యే కవితా దానికదే కాదు. అట్లా అని స్వంతంగా ఉండకా పోదు. 

ఇక ప్రతి కవితలోనూ ఒక నువ్వు ఉన్నాడు (ఉన్నది) కదా. అదెవరో తెల్సుకోవాలంటే కొంచెం కష్టపడాలి. అంత తేలికగా దొరకడు. కవిత లో అస్తిత్వ ప్రకటన చేసిన చోట, ధిక్కార ప్రకటన చేసిన ఆ ‘నువ్వు ‘ సాధారణన్గా ఆ అస్తిత్వానికి వ్యతిరేకమో, అడ్డం పడ్డ వారో, లేదా కనీసం పట్టించుకోకుండా నిర్లిప్తత ప్రకటించిన వారో అయి ఉంటారు. కానీ తన రంది గురించి చెప్పినప్పుడు, వెతల్ని చెప్పినప్పుడు. అన్ని అస్తిత్వాలకు సాధారణమైన కల గురించి, ఒక కొత్త సమాజం గురించిన కల గురించి చెప్పినప్పుడు, తన ఇంతో గురించి ఊరి గురించి వలస గురించి చెప్పినప్పుడు ఆ ‘నువ్వు’ మాత్రం అఫ్సరే అనుకుంటున్న. అఫ్సర్ కవి దే మరో పార్శ్వం. మరో కోణం. తన ఆల్టర్ ఇగో. ప్రముఖ పోర్చుగీస్ కవి ఫెర్నార్దో పెస్సోయ తన పేరుతో కాక మరో మూడు పేర్లతో కవిత్వం రాసిండు. మూడూ విభిన్న వ్యక్తిత్వాలు. తనను ముగ్గురు విభిన్న మనుషుల్లాగే భావించుకుని మొత్తంగా నాలుగు పేర్లతో కవివం రాసిండు పెసోయా. ఐతే ఇక్కడ అఫ్సర్ కూ పెసోయ కు పోలిక లేదు. కేవలం తన ప్రతికవితలో కనబడే ‘నువ్వు’ అందరూ ఒకరు కారనీ , ఒక్కొకరు ఆయా సందర్భాలలో ఆయా ఆలోచనల మేరకు కవితో సంభాషిస్తున్న లేదా కవి సంభాషిస్తున్న బహుశా మరో కవిలోనిదే మరో వ్యక్తిత్వం అని నేను అనుకుంటున్నా.

ఇంత చెప్పీ అఫ్సర్ కవిత్వ రూపం లో సాధించిన విజయాల గురించి చెప్పక పొతే అసంపూర్తిగా ఉంటుంది. ‘ఇంటి వైపు’ కవితలలో ఒక ప్రత్యేకమైన శిల్పం ఉంటుంది. సాంప్రదాయ సాహిత్య పరికరాల కన్నా కొత్తవి వాడుకున్నాడు కవి వీటిలో. మనం సాధారణంగా కవిత్వ భాష అనుకునేదాన్ని విసర్జించి కొత్త బాష, శబ్ద నిరాడంబరమైన , నిరలన్కారమైన భాషను కనుక్కున్నాడు. కవిత లో భాష కన్నా పదాల కన్నా తనే వెనుక మాటలో చెప్పుకున్నట్టు భావమే అలంకారం. భావమే జీవం. అఫ్సర్ ‘ఇంటి వైపు’ లో చాలా కవిత్వ భాషనూ, డిక్షన్ నూ, శబ్దాలనూ అన్ లర్న్ చేసిండు. అది అంత తేలిక కాదు. ఏంటో చదివితే తప్ప యెంతో కష్ట పడితే తప్ప అన్ లర్న్ చెయ్యలేము. ఐతే నాకు కనిపించిన మరో రూప విశేషం. దాదాపు ప్రతి కవితలోనూ ఇది కనబడుతుంది. కవితలో అధ్యాయలుంటాయి (chapters). కొన్నిటిలో మొదటిది కవిత మధ్యలో ప్రారంభమవుతుంది. అంటే అంతకు ముందుది ఉపోద్ఘాతమన్న మాట. నా మట్టుకు నాకు ప్రతి కవిత ఒక నాటిక లాగా (play) అనిపిస్తుంది. అట్లా అనుకున్నప్పుడు ప్రతి అధ్యాయం ఒక అంకం లాగా అనిపిస్తుంది. అందులో సంభాషణలు. కవికీ మరో ‘నువ్వు’ కు మధ్య. చిత్రమేమిటంటే కవి ఇక్కడ అనేకమే ‘నువ్వూ’ అనేకమే. ఏదీ ఒంటరి కాదు ఏదీ ఏకాకి కాదు.

మొత్తం కవిత్వమంతా అనేకుల మధ్య సంభాషణ. తీవ్రమైన వెతలనీ, రందుల్నీ, దుఃఖాన్నీ, శోకాన్నీ, దిక్కారాన్నీ, ఆకాంక్ష లనీ, ఒక కల నేరవేరాలన్న మొక్కవోని పట్టుదలనూ అతి మంద్రంగా పాడిన సూఫీ తాత్విక సంగీతం అఫ్సర్ కవిత్వం.

తా.క : ఇందులో ‘ఇంటి వైపు’ లోని కవితా పాదాలను ఉటంకించకుండా ఉండడానికి ఒక కారణం ఉంది. నేను చెప్పిన విషయాలు మీరే పోల్చి చూసుకోండి. నేను పొరపాటుగా అర్థం చేసుకుంటే నన్ను సరి చెయ్యండి. ఉతికి ఆరెయ్యండి. నేను తప్పైనా రైటైనా అఫ్సర్ కవిత్వం మిమ్మల్ని ‘ఇంటి వైపు’ తీసుక పోవడం ఖాయం.

*

0 comments:

Web Statistics