ఇంకో జీవితంలోకి మార్క్వెజ్!

A kind of emptiness in his life had begun there. From then on he had been unable to distinguish, to remember what events were part of his delirium and what were part of his real life.
పందొమ్మిదేళ్ళ వయసులో మార్క్వెజ్ రాసుకున్న మొట్ట మొదటి కథలో వొక వాక్యం అది.
తను రాసుకున్న మొదటి వాక్యాలతో పదే పదే ప్రేమలో పడడం ఏ రచయితకైనా ఎంత ఇష్టంగా వుంటుందో, అంత కష్టంగానూ వుంటుంది. ఆ వాక్యాల నునులేతదనంతో పాటు వాటిలోని అమాయకత్వం అతన్ని ఎప్పుడూ గుచ్చి గుచ్చి చూస్తుంది. తనకి తెలియకుండానే అతను ఆ వాక్యాల్ని తిరగ తొడుక్కుంటూ వుంటాడు, కాని, ఎప్పుడూ వొక కొత్త చొక్కా తొడుక్కునే పిల్లాడిలాగా సంబరపడిపోతుంటాడు. అలాంటి కొన్ని సంబరాల కలయిక – మార్క్వెజ్ ఇప్పటిదాకా గడిపిన జీవితం! అతని ఇంకో జీవితం ఇప్పుడు మొదలవుతుందని నమ్ముతున్నాను కాబట్టి, నా లోకంలో మార్క్వెజ్ కి మరణం లేదు.
ఇవాళ సాయంత్రం మార్క్వెజ్ కన్ను మూశాడని తెలిసిన తరవాత ఆ పందొమ్మిదేళ్ళ వయసు నించి ఇవాల్టి ఎనభయ్యో ఏడు దాకా అతని ప్రయాణం ఏమిటా అని ఆలోచిస్తూ వొక రకమైన అస్థిమితత్వంలోకి జారిపోయాను. ప్రతి వాక్యాన్ని వొక అందమైన జ్ఞాపకంగా చెక్కే శక్తి వున్న మార్క్వెజ్ నిజానికి ఈ రెండేళ్ళ కిందటి నించి వొక్క జ్ఞాపకాన్నీ తలచుకోలేని విస్మృతిలోకి జారిపోయాడు, అల్జీమర్స్ అనే దయలేని వ్యాధి వల్ల!
“What matters in life is not what happens to you but what you remember and how you remember it.”
మార్క్వెజ్ రాసిన ఆ వాక్యం నిన్నటి నించీ విపరీతమైన ఉద్వేగంతో నా లోపల చప్పుడు చేస్తోంది. ఈ చప్పుడు వొక్కో సారి నా చెవుల్ని ఇంకే చప్పుడూ వినలేని స్థితిలోకి తీసుకు వెళ్తోంది. నన్నురకరకాల తలుపుల్లోంచి మార్క్వెజ్ అనే వొక అనేక గదులూ తలుపులూ కిటికీలూ వున్న విశాలమైన సౌధంలోకి లాక్కు వెళ్తోంది.
140417170605-01-gabriel-garcia-marquez-horizontal-gallery
       2     
మొదటి వాక్యాలు రాస్తున్నప్పుడు అతని వయసు పందొమ్మిది. అతని మొదటి వాక్యాలు చదువుతున్నప్పుడు నాకూ పందొమ్మిదే!
కాఫ్కాలూ, కామూలూ, ఇలియాస్ కానెట్టీలూ, పదే పదే చదివే షేక్స్పియర్ మాక్బెత్ లూ, బైరాగి కవిత్వాలలోంచి మళ్ళీ రాస్కల్నికోవ్, హామ్లెట్లూ, డాలీ రేఖలలో కూడా దాక్కున్న అసంబద్ధ వాక్యాలూ, త్రిపుర అనే దేశంలో వొంటరి సంచారాలూ తెగ సందడి చేసే ఆ పందొమ్మిదేళ్ళ అమాయకత్వపు అంతిమ దినాల్లో- బెజవాడ గాంధి నగర్ “ప్రబోధ” బుక్ సెంటర్లో అనుకోకుండా దొరికిన One Hundred Years of Solitude – ఆ యవ్వన కాలపు బైబిల్.
నండూరి సుబ్బారావు గారు “నమిలి మింగిన నా ఎంకి” అని ఎందుకన్నారో అప్పుడే అర్థమైంది. ఈ నవల నన్ను నమిలి మింగేసిందో, నేను ఆ వాక్యాల్ని నమిలి మింగానో తెలియదు. కాని, రాసే వాక్యం మీద చచ్చేంత మమకారాన్నీ, సంశయాన్నీ నింపిన నవల అది.
ఆ తరవాత చాలా కాలం తరవాత Love in the Time of Cholera చదివి, కొన్ని నిద్రలేని రాత్రులు గడిపాక మార్క్వెజ్ ని తట్టుకునే శక్తి పోయింది నాకు! జీవితానికి మరీ అంత సున్నితత్వం అవసరమా అనే సందిగ్ధంలో పడిపోవడం అప్పుడే మొదలయింది. సున్నితత్వాన్ని మించిన యుద్ధం లేదని ఎక్కడో నేను రాసుకున్న వాక్యానికి మూలం ఆ నవలలో, ఆ నవల చుట్టూ నేను అల్లుకున్న మాయా వాస్తవికతలో వుంది.
కాని, సున్నితత్వాన్ని నిశ్శబ్దంతో కానీ, కృత్రిమమైన మౌనంతో గాని ఆట్టే కప్పెట్టలేమని కూడా అప్పుడే అర్థమవడం మొదలైంది. నా లోపల నేను చేసుకుంటూ పోతున్న యుద్ధంలో నాతో నేనే తలపడే సన్నివేశంలో నేను మాత్రమే రాసుకోగలిగే వాక్యంలో మాత్రమే నాకు విముక్తి వుందని మార్క్వెజ్ నాకు నేర్పడం మొదలు పెట్టాడు. కచ్చితంగా అప్పుడే నాకు ఇంకా చదవాలి చదవాలి ఈ సున్నితత్వపు అంతు చూడాలి అన్న కసిని పెంచుకుంటూ వెళ్ళాడు. Love in the Time of Cholera అనే నవల యాభై ఏళ్ళ తరవాత ఎప్పుడో మళ్ళీ పుట్టుకొచ్చే, ఉబికి వచ్చే ప్రేమ గురించి అనుకుంటాం కాని, నిజానికి ఆ నవలలోపలి అసలు కథ ఈ సున్నితత్వపు పునర్జన్మ కాదా!?
అవును – అనే నా సమాధానం, ఎలాంటి సంశయం లేకుండా!

3
images
అయితే, మార్క్వెజ్ తో నా అసలు సిసలు సహప్రయాణం 1995 తరవాతనే!
ఆ ఏడాది మార్క్వెజ్ కథలు Strange Pilgrims ఇంగ్లీషు అనువాదం నా కంట పడింది. వొక ఆదివారం పొద్దున్న బెజవాడ అలంకార్ సెంటర్లో సైడ్ వాక్ మీద పరచుకున్న పుస్తకాల మధ్య రికామీగా తిరుగుతున్నప్పుడు Strange Pilgrims పుస్తకం అట్ట నన్ను నిలబెట్టేసింది.
అప్పట్లో ఉద్యమం ఏమిటంటే: కొత్తగా తెచ్చిన పుస్తకం రెండు రోజుల్లో వేడివేడిగా చదివేయాలి. చదివాక అందులో వున్న వాక్యాలు వొక నోట్ బుక్ లో తిరగరాసుకోవాలి. ఇంకో వారం తరవాత ఆ వాక్యాలు మళ్ళీ చదువుకొని, వాటిని తెలుగులోకి తర్జుమా చేసుకోవాలి. మళ్ళీ చదువుకోవాలి. చదువుకుంటూ నిద్రపోవాలి. నిద్రలో ఆ వాక్యాల్ని కలవరించాలి. ఇవన్నీ జరక్కపోతే ఆ రచయితకి నా లోకంలోకి వీసా లేదు.
కాలేజీలో వున్నప్పుడు మహాకవి టాగూర్ గురించి నాకొక థియరీ వుండేది. టాగోర్ గొప్ప కవీ కాదు, మంచి నవలా రచయిత అంత కంటే కాదు, గొప్ప కథకుడు అని! అలాగే, శరత్ మంచి కథకుడు కాదు, గొప్ప నవలా రచయితా అని! అలాగే… అలాగే, త్రిపుర అసలు కథకుడు కాదు, మనకి తెలియని/ మనల్ని ప్రక్రియ పేరుతో నిరంతరం మోసపుచ్చే రహస్య నవలా రచయిత అని!
Strange Pilgrims చదివాక- అలాంటి థియరీ కనిపెట్టేసాను. అప్పుడు కొంత కాలం నా వాదమూ తగవూ ఏమిటంటే, మార్క్వెజ్ నవలా రచయిత కంటే ఎక్కువగా గొప్ప కథకుడు అని!
మార్క్వెజ్ వొక కొత్త రకం భాష వాడుతున్నాడని, వొక కొత్త రకం వాస్తవికత మాట్లాడుతున్నాడని మనకి కచ్చితంగా అర్థమైతే, అతని అన్ని ప్రాణాల అసలు చిలక Strange Pilgrims లో వుందని మీరు కూడా వొప్పుకుంటారు. ఈ పన్నెండు కథలు రాయడానికి అతనికి పద్దెనిమిదేళ్ళు పట్టిందట. అంటే, ఆ కథల్లో ఎన్ని ప్రాణాలు పొదిగాడో అర్థమై వుండాలి కదా! అందులో మొదటి కథ 1970లలో వొక కలలో పుట్టిందట. ఆ కలలో మార్క్వెజ్ కి అంత్యక్రియలు..దోస్తులంతా వచ్చారట. అంతా అయిపోయాక ఎవరి దారిని వాళ్ళు వెళ్లిపోతున్నప్పుడు, తను కూడా వెళ్ళడానికి సిద్ధమయ్యాడు మార్క్వెజ్. అప్పుడు వొక చెయ్యి అతన్ని బలంగా వెనక్కి లాగి, “you’re the only one who can’t go!” అన్నదట. అంతే! మార్క్వెజ్ అక్కడే వుండిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు మార్క్వెజ్ కి అర్థమైంది: చనిపోవడం అంటే స్నేహితుల్ని మళ్ళీ కలవలేకపోవడం అని!
స్నేహితుల్ని కలవలేని ఆ వెలితిలోంచి పుట్టిన కథలు ఇవి. వ్యక్తిగతంగా నాకు ఈ కథలు ఎందుకు నచ్చాయంటే, మార్క్వెజ్ ఇతర రచనల్లో అతని దుఃఖం చాలా transparent గా కనిపిస్తుంది. కాని, ఈ కథల్లో ఆ దుఃఖాన్ని ఏ చేరుమాలుతోనూ దాచుకోలేనితనం కనిపిస్తుంది. అది అప్పుడే చెంప మీద జారి, ఆరిపోడానికి ససేమిరా నిరాకరించే తడి చుక్కలా గోరువెచ్చగా అనిపిస్తుంది ఈ కథల్లో!
వున్న వూళ్ళోనే దిగడిపోయిన మనిషికి వాస్తవికత అన్ని కోణాలూ అర్థమవుతాయని అనుకోను. వలసపోయిన కళ్ళకి కొత్త చూపుల రెక్కలు వస్తాయి. తన దేశానికి దూరంగా వుండి, తనకి తానూ, తన వాళ్ళూ, ఆ పరదేశంలోని వాళ్ళు కూడా పరాయీగా, లేదంటే కొంత ఎడంగా కనిపిస్తున్నప్పుడు మార్క్వెజ్ ఈ కథలు రాసుకున్నాడు. ఆ దూరపు దుఃఖంలో తన వూరికి తను ఎంత దగ్గిరగా వుండాలనుకుంటున్నాడో ఆ ఎడబాటు బాధలోంచి తనకోసమే రాసుకున్న కథలు ఇవి. అవి, కొన్ని క్షణాల్లో నావి అనిపించాయి అంటే, ఆ క్షణాల్లో నేనూ మార్క్వెజ్ తరహా వాస్తవికతలోకి వెళ్ళిపోయానన్న మాట!
ఎలాంటి వాస్తవికత ఇది?! వినండి మార్క్వెజ్ ఏమంటున్నాడో!
True memories seemed like phantoms, while false memories were so convincing that they replaced reality.
నా మిత్రులు చాలా మందికి తెలుసు, నా ఆలోచనల ప్రయాణం మార్క్స్ తో మొదలయింది, మరీ ముఖ్యంగా : The philosophers have only interpreted the world, in various ways; the point is to change it. అన్న వాక్యం. ఇది నా నోట్ పుస్తకాల్లోనూ, ఖమ్మం గోడల మీద ఎర్రెర్రగా రాసుకున్న రోజులన్నీ గుర్తే!
కాని, ఎంతో కొంత లోకాన్ని చూశాక, ఎన్నో కొన్ని పుస్తకాల్ని చదువుకున్నాక, ఎన్నో సంభాషణల తరవాత నాకు అర్థమైందేమిటంటే: మార్పు సుదూర లక్ష్యమనీ, అసలు వాస్తవికతనే ఇంకా సరిగ్గా అర్థం చేసుకోవాల్సి వుందనీ! వేయి పూలలో కనీసం వొక పది పూలయినా పూర్తిగా వికసిస్తే చాలు అని!
తన మరణానికి మరుసటి రోజు – మార్క్వెజ్ మళ్ళీ అదే చెప్తున్నాడు నాకు!
ఈ వాస్తవికతకి నేనెప్పటికీ వొక strange pilgrimని!
*

3 comments:

సుబ్రహ్మణ్యం - ఢిల్లీ said...

చాలా గొప్ప పరిచయం అఫ్సర్ గారు. మీ రాతల్లో ఒక హాయి అయిన పదాల అల్లికతో మంచి భావాల వ్యక్తీకరణ. ఇప్పుడే సాహిత్యం లో ఆ ఆ లు దిద్దుకుంటున్న నాకు మీ సాహిత్యం ఒక భావాన్ని మంచిగా ఎలా చెప్పాలో నేర్పుతుంది.

Jayasree Naidu said...

U intertwine the writer and your memories. Yes... sometimes that connectivity remains forever. Happy to have a great reading Afsar ji

పూర్వ ఫల్గుణి (poorva phalguni) said...

ఎప్పటిలాగే చాల బావుంది అఫ్సర్ జీ .ఆ పరిచయం.ముఖ్యం గా strange pilgrims లోని మొదటి కధ. ఇంకా ఇంకా ఈ ఎండాకాలంలో సాహితీ వానజల్లులు కురిపించండి.(ఈ సియాటెల్ లోవరుణ దేవుడు చల్లచల్లగా జల్లులు కురిపిస్తున్నాడు) ..
మణి వడ్లమాని


Web Statistics