An Empty Episode- 6/ వొకే వొక్క దీర్ఘ కవితలా నువ్వు పుట్టినప్పుడు

 

ఆరో సన్నివేశం :

ఇంత కవిత్వం ఎలా పుట్టుకొస్తుందన్న ప్రశ్న ఇప్పుడేమీ కొత్త కాదు నాకు. కానీ, నా సమాధానాలే నన్నెప్పుడూ చిత్రహింస పెడ్తాయి. నేనొక గాయపడిన పక్షిలాంటి పదచిత్రమై, ఎక్కడో రాలిపడ్తాను. చాలాసార్లు నీ ముందే రాలిపడాలని అనుకుంటా. కాని, ఆఖరాఖరికి నా కాళ్ళ ముందే పడి వుంటా, సమాధానం దొరికిందా ఇప్పుడయినా అని ప్రశ్నించుకుంటూ!

 

1

 

నన్ను రాసే ప్రతి వాక్యమూ నేనే  అని అనలేను. కొన్ని వాక్యాలు నీ మాటల, నిశ్శబ్దాల కూడికలు. వాటి కింద నా సంతకమే వున్నా నేనూ వెళ్ళాల్సిందే నీ జాడలు వెతుక్కుంటూ.  

 

2

 

నా లోపల్నించి నిష్క్రమించిన నీ ప్రతి కవిత్వ వాక్యం నన్ను గుచ్చి గుచ్చి చూస్తుంది. ఎప్పటికప్పుడు నేనే చివరి వాక్యాన్ని అంటూ-ఇక రానుపొమ్మంటూ-

 

నన్ను తాకి వచ్చే నీ ప్రతి పదం నా స్పృహని గిచ్చి గిచ్చి చూస్తుంది ఎప్పటికప్పుడు నువ్వున్నావా అని- నేను లేనే లేనని కదా నీ గట్టి నమ్మకం.

 

నాలోని ఉన్మాదమో ఆనందమో ఇంకేదో కాసేపు నన్ను పరాయీని  చేస్తుంది నీ వాక్యం ముందు నేను ప్రేక్షకుణ్ణి, నిస్సహాయుణ్ని.  నన్నేమీ అడక్కు. అడక్కు.

 

3

 

నిజంగా కవిత్వ వాక్య ప్రసవ వేళ నేనెవరినో నీకు, నువ్వెవరివో నాకు తెలియనే తెలియదు. చెరో వైపు వొక అపరిచిత గోళం నిర్మానుష్య భూమిలా, లేదంటే- నిర్జల సముద్రంలా  గిరగిరా తిరుగుతూ వుంటుంది. అంతా తెలిసినట్టూ వుంటుంది. ఏమీ తెలియనట్టూ వుంటుంది. ఇలాంటి ఇంకా కొన్ని అపరిచితత్వాలు కలిస్తేనేగా, కవిత్వమవుతుంది,

ఎవరి చిర్నామాల్లో ఎవరుంటారో తెలీక-  

 

అందుకే, వాక్యాలు వొక్కో సారి అప్పుడే గాలికి పుట్టిన పసి ఏడుపు కేకలు.

కాసింత హత్తుకునే వెచ్చని కన్రెప్పల్లో   తలవాల్చేస్తాయ్ చివరికి.

4

 

బాలింత వెన్నెల మెరుపు కళ్ళతో

ప్రియురాలి పండు గోరింట చేతుల్తో

తడుముకుంటూనే  వుంటాను, నేనీ లోకాన్ని,
నీ లోకాన్ని.

కన్రెప్పల పొత్తిళ్ళలో వొదగని శోకాన్ని.

(డిసెంబర్ 11)

 
Category: 0 comments

0 comments:

Web Statistics