ఒక 0% లవ్ స్టోరీ

(ఈ వ్యాసం ఈ నెల "పాలపిట్ట'లో నా శీర్షిక 'కాలి బాట" నుంచి)

కొన్ని సార్లు కవిత్వమూ, కథా, నవలా లేదా వొక గొప్ప తాత్విక గ్రంథమూ చేయలేని పని వొక సినిమా చేస్తుందని అనిపిస్తుంది. అయితే, పాఠకుడికీ, వీక్షకుడికీ అవగాహనలో, అనుభూతిలో తప్పక కొన్ని తేడాలున్నాయి. పఠిత ఆగి ఆగి చదవచ్చు, చూస్తున్న సినిమాని కూడా రెవైండ్ చెయ్యవచ్చు కానీ, ఆగి ఆగి చదవడంలో వున్న సౌలభ్యం రెవైండ్ చెయ్యడంలో లేదనుకుంటా. వీక్షక పాత్రలో వున్నప్పుడు మనం వొక నిరంతరాయమయిన కొనసాగింపు (కాంటిన్యూటీ)ని కోరుకుంటాం. పుస్తకం చదివేటప్పుడు ఆగి ఆగి చదవడం వల్ల ఆ కొనసాగింపు పెద్దగా కుంటుపడదు.కానీ, సినిమాకీ, సాహిత్యానికీ వొకే రకమయిన విమర్శ సాధనాలు వాడే కాలంలో ఇప్పుడు వున్నాం. ఆ దృష్టి కోణం నించే నేను ఈ మధ్య సినిమాలు చూస్తున్నాను.
ఈ నెల మాడిసన్ లో జరుగుతున్న సినిమా పండగలో భాగంగా వొక గ్రీస్ సినిమా “ఆటెన్బెర్గ్” చూశాను. ఈ సినిమా చూడడంలో వొక “స్థానిక” ఆనందం కూడా వుంది. ఈ సినిమా తీసిన రేచల్ సంగారి కొన్నాళ్లు మా టెక్సాస్ విశ్వవిద్యాలయంలో సినిమా పాఠాలు చెప్పింది. నా సాహిత్య కోర్సులలో అప్పుడప్పుడూ నేను సినిమా పాఠాలు (పథేర్ పాంచాలి, సంస్కార, ఏక్ చారాసీ కీ మా లాంటి సినిమాలు చూపించినందుకు ఇప్పటికీ మా విద్యార్థులు కలిసినప్పుడల్లా థాంక్స్ చెప్తారు) కూడా కలిపేస్తూ వుంటాను కాబట్టి, క్యాంపస్ లో జరిగే కొన్ని పండగల్లో, గోష్టి సమావేశాల్లో ఆవిడని కలిసే అదృష్టమూ దొరికింది. అసలు ఎంత పాత ఫ్రేమ్ ని అయినా మరీ కొత్తగా ఎలా చూడవచ్చో ఆమె ప్రతి వ్యాఖ్యలోనూ కనిపించేది. ఆవిడ మాటలు వింటునప్పుడు ఊహాశక్తి ఇంత దూరం వెళ్తుందా అని ఆశ్చర్యపోయే వాణ్ని. ఈ సినిమా చూశాక, “అవును, ఊహా శక్తి ఎంత దూరమయినా వెళ్తుంది!’ అని ఖాయంగా అనిపించింది. లేకపోతే, ఎక్కడో గ్రీసులో వొక పారిశ్రామిక వాడలో తీసిన/ జరిగిన ఈ సినిమా కథ తెర మీద చూస్తున్నంత సేపూ నేను ఏ గోదావరిఖనిలోనో, కొత్తగూడెం పారిశ్రామిక వాడలోనో వున్నట్టు అనుభూతి కలిగించింది సంగారి దర్శక ప్రతిభ! అన్నిటికీ మించి, ఈ సినిమా అంతా వొక పోస్ట్ మాడ్రన్ కొల్లజ్ చూస్తున్నట్టు కూడా అనిపించింది. వొక వాస్తవికతని ఇంత బాగా వ్యాఖ్యానించవచ్చా అన్న ఆశ్చర్యం ఈ సినిమా చూసిన వెంటనే కలుగుతుంది.

ప్రేమా, సెక్సూ, పొగ గొట్టాలూ, చావు

ఈ సినిమా వొక ఇరవై మూడేళ్ళ అమ్మాయి కథ. ప్రేమ అంటే ఏమిటో, సెక్స్ అంటే ఏమిటో అని వెతుక్కుంటూ వుండే అమాయకమయిన పిల్ల మరీనా. వొక పారిశ్రామిక వాడలో డ్రైవర్ గా పని చేసే ఆ అమ్మాయికి వొక తండ్రి, వొక చిన్ననాటి స్నేహితురాలు తప్ప ఇంకో లోకం తెలియదు. ఆ చిన్ననాటి స్నేహితురాలు, మరీనా మాటల్లో చెప్పాలంటే, కనిపించిన ప్రతి మగవాడితోనూ వెళ్లిపోతూ వుంటుంది. తండ్రికి ఆధునిక నాగరికత నచ్చదు. కానీ, తప్పని సరయి, ఆ పారిశ్రామిక వాడలో బతుకు! “ఈ పరిశ్రమాలూ, ఈ ఆధునికత ఇదా విప్లవం? ఏం చేశాం మనం? మన గొర్రెల్ని చంపి ఈ పొగ గొట్టాలు నిలబెట్టాం!’ అని ఎప్పుడూ కోపిస్తూ వుంటాడు. సినిమాకి నిజానికి ఆ పొగ గొట్టాలే పెద్ద సెట్టింగ్. అనారోగ్యం వల్ల తండ్రి చావుకి దగ్గిర పడడం వల్ల మరీనా వొక విధమయిన వొంటరి తనంలోకి వెళ్లిపోతుంది. స్నేహితురాలి విశృంఖల శృంగారం, తండ్రి ఆధునికతా నిరసనల మధ్య మానసికంగా నలిగిపోతుంది. ఆ దశలో ఆమెకి డేవిడ్ అటెంబరో జంతువుల మీద తీసిన టీవీ డాక్యుమెంటరీలూ, పాప్ మ్యూజిక్ కొండంత ఆసరా అవుతాయి. ఆ సంగీతాన్ని, ఆ జంతువుల్ని అనుకరించడంలో ఆమెకి వొక మానసిక ఆనందమూ, కాలక్షేపమూ దొరుకుతాయి.

ఈ లోపు వొక ఇంజనీరుతో పరిచయం అవుతుంది. ప్రేమా, సెక్సు కి సంబంధించి ఆమె తనకి వున్న అన్ని సందేహాలూ తీర్చుకోడానికి, ప్రయోగాలు చెయ్యడానికి అతనొక లాబ్ లాగా ఉపయోగ పడతాడు ఆమెకి! అదెలా సాధ్యమయ్యింది అన్నదే ఈ సినిమాలో కథ! స్త్రీ పురుషుల సంబంధాల గురించి తలెత్తుతున్న కొత్త ప్రశ్నలకి సమాధానం వెతుక్కునే ఈ తరం అమ్మాయి మరీనా. ఆధునిక జీవితం అంటే ప్రేమా సెక్సూ, నాగరికతా, పరిశ్రమలూ, కొత్త ఆర్ధిక సంబంధాలూ ఇవే అనుకుంటే, వాటి విశ్వ రూపం, వాటి అంతిమ రూపం కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి.

వొక అమ్మాయి, వొక నాన్న, వొక దేశమూ!

వొక అమ్మాయి మానసిక, శారీరక ప్రపంచాన్ని తెర మీద ఆవిష్కరించడంలో సంగారి చాలా కష్టపడిందని ఈ సినిమాలో ప్రతి ఫ్రేములోనూ అనిపిస్తుంది. ఈ సినిమా వొక అమ్మాయి కథ కాదనీ, ఇప్పుడిప్పుడే ఆర్థిక రంగంలో కొత్త విప్లవాలకి నాంది పలుకుతున్న గ్రీసు దేశపు ఆత్మ కథ అని విమర్శకులు దీన్ని వ్యాఖ్యానించారు. నిజమే, తండ్రి పాత్రతో పలికించిన సంభాషణలన్నీ వొక దేశం వొక స్థితిలోంచి ఇంకో స్తితిలోకి ప్రయాణిస్తూ తనని తాను వెతుక్కునే ప్రయత్నమే.
చివరి రోజు తనని ఆస్పత్రికి తీసుకువెళ్తున్న మరీనతో అంటాడు తండ్రి – “ ఈ ఇరవయ్యో శతాబ్దాన్ని నేను బాయ్ కాట్ చేస్తున్నా. కొత్త శతాబ్దంలోకి వెళ్తున్న నీకు యేమీ ఇవ్వలేకపోతున్నా, యెమీ నేర్పలేకపోతున్నా. “
కానీ, అన్నిటికీ మించి ప్రేమ, సెక్సు గురించి తండ్రీ కూతుళ్ల మధ్య జరిగే సంభాషణలు ఈ చిత్రంలో చాలా విశేషంగా అనిపిస్తాయి.
“నాన్నా, నువ్వు నన్ను ఎప్పుడయినా నగ్నంగా వూహించుకున్నావా’’ అని అడుగుతుంది మరీనా తండ్రిని వొక సారి.
తండ్రి అదోలా చూస్తాడు.
“నేను వూహించుకున్నాను లే! నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ, ఆ శిశ్నమ్ అనేది లేకపోతే నువ్వు ఇంకా బాగుండే వాడివి!”
“అలా వూహించకూడదు నువ్వు!”
“ఏం? టాబూనా?”
“అవును, కొన్ని అలా టాబూ కావడం మంచిది!”
“ఏమో, నేను అలా ఆలోచించకుండా వుండలేకపోతున్నా”
స్నేహితురాలు వొక పెద్ద ప్రశ్నార్థకం మరీనాకి. ఆ స్నేహితురాలు శిస్నాలని అనేక భంగిమల్లో వర్ణించు చెబుతూ వుంటుంది మరీనకి.
వొక రోజు మరీనా అంటుంది ఆమెతో – “నువ్వు శిస్నాలని అలా అనేక రకాలుగా వూహించుకుంటూ వుంటావ్. కానీ, నాకు వక్షోజాలంటేనే ఇష్టం. స్విమ్మింగ్ చేశాక, ఆ గదిలోకి వెళ్తే, అద్దాల ముందు నిలబడ్డ ఆడవాళ్ళవి చూడు. ఎన్ని రకాల వక్షోజాలో!”
సెక్సుకి సంబంధించి ఈ ఇద్దరి మధ్యనే కాకుండా, తండ్రితోనూ, తన ప్రియుడితోనూ మరీనా చెప్పే మాటలు వినడానికి కొంత కొత్తగా వుంటాయి. కానీ, వాస్తవంగానే ఈ తరం ఆడపిల్లలు అలా మాట్లాడున్నారేమో అనీ అనిపిస్తుంది. అది ఎంత వరకు వాస్తవం అన్నది పక్కన పెడితే, కొన్ని అసహజమయిన ప్రశ్నలు అని కూడా అనుకుంటే, ఆ సహజ/ అసహజాల మధ్య చర్చ పెట్టడమే ఈ సినిమాలో వొక కథ. జంతువుల డాక్యుమెంటరీలు చూస్తూ, ప్రతి సారీ మరీనా అవి చాలా సహజంగా బతుకుతున్నాయనీ, ఆధునిక పొగ గొట్టాల మధ్య వుక్కిరిబిక్కరవుతున్న మనిషి చివరికి తన చావు తానే రాసి పెట్టుకుంటున్నాడని వొక వ్యాఖ్యానం ఈ సినిమాలో వుంది. వొక అమ్మాయి వొంటరి ప్రేమరాహిత్యపు ప్రేలాపనల్లోంచి వినిపించడం వల్ల ఈ సినిమా చాలా మటుకు ఆ వ్యాఖ్యానానికి బలమయిన దృశ్య రూపం ఇచ్చింది. అలాగే, మనం వ్యక్తిగతం అనుకునే కథలు వొక జాతి చరిత్రనే చెబుతాయన్న అత్యాదునిక శిల్ప రహస్యమూ వుంది ఈ సినిమాలో!
*
Category: 6 comments

6 comments:

శరత్ కాలమ్ said...

మన ఇప్పటి బ్రతుకులన్నీ అక్వేరియం బ్రతుకులేమోనని మా ఇంట్లోని అక్వేరియంలోని చేపలని చూసినప్పుడల్లా ఆ అమ్మాయికి జంతువులని చూసినప్పుడు ఎలా అనిపిస్తుందో నాకు అలా అనిపిస్తుంది. కొన్ని చేపలు ఖర్మ కాలి నదీనదాల్లో స్వేఛ్ఛగా జలకాలాడకుండా అక్వేరియంల్లో పడిపోతాయి. మనమేమో సున్నితమయిన నాగరికతల్లో పడిపోతాము.

కెక్యూబ్ వర్మ said...

thank u sir..సినిమా రివ్యూతో నేటి ఆధునిక తరం పడుతున్న మానసిక సంఘర్షణను చెప్పడం బాగుంది..సినిమాలోని ప్రశ్నలు చాలా తాజాగా వున్నాయి..

కొత్త పాళీ said...

very interesting.
You're lucky; మంచి సినిమా చూసి చాలా రోజులు (నెలలు?) అయింది.

కోడూరి విజయకుమార్ said...

@అఫ్సర్.....ఇలా అప్పుడప్పుడూ...మీరు చూసిన మంచి సినిమాల గురించీ,,, వాటి గొప్పదనం గురించీ మాకు ఇలా చెప్పడం బాగుంది....టీవీ లలో వొస్తే తప్ప....వరల్డ్ సినిమా చూసే అదృష్టం ఇక్కడ లేదు....[అవైనా వున్నందుకు సంతోషమే అనుకోండి..]

వాసుదేవ్ said...

పైన చెప్పినవన్నీ కలిపేసుకుంటె నా అభిప్రాయం...కానీ ఓ సందేహం అఫ్సర్ జీ! ఆధునికతని విమర్శిస్తూ చాలా సినిమాలు, రచనలు వచ్చిఉండొచ్చు.....కాని ఆధునికత లేకుండా మనిషి ప్రిమిటివ్‌గా ఎప్పటికీ ఉండిపోయే అవకాశం లేదు కాబట్టి ఈ ఆధునికతని మార్చేదిశగా రచనలు వస్తే బెటరన్పిస్తోంది......పొగగొట్టాలు గొర్రెల్ని రిప్లేస్ చెయ్యకపోతే ఆదిమానవుడిగానే మనుగడని ఊహించుకోలేం కదా.......మీ రివ్యూ బావుంది మొట్టమొదటి అవకాశంలోనే సినిమా చూడాలనేవిధంగా ఉంది.......వాసుదేవ్

Afsar said...

శ్రీనివాస్ గారు; ఆధునికతని పూర్తిగా నిరాకరించడం కాదు, ఆధునికతలోని కొన్ని అంశాలని ప్రశ్నించడమే ఈ సినిమా చేసిన పని.

Web Statistics