ఊపిరాడనివ్వని సినిమా : బ్రెత్ లెస్!
ఎండాకాలం మాడిసన్ వచ్చినప్పుడల్లా – బోనస్ లా దొరికే గొప్ప అవకాశం – ఇక్కడి యూనివర్సిటీ థియేటర్ స్క్వేర్లో సినిమాల పండగ. ప్రతి ఎండాకాలం జులై నెల రాగానే విస్కాన్సిన్ యూనివర్సిటీ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తుంది. దాదాపు ప్రతి వీకెండ్ కొత్త – పాత సినిమాలు చూపిస్తారు. ప్రతి ఫెస్టివల్ కీ వొక థీమ్ వుంటుంది. పోయిన ఎండా కాలం ఆఫ్రికా రాజకీయ సినిమాలు చూపించారు. ఈ సారి కుటుంబం అనే థీమ్ చుట్టూ తిరిగే కథలున్న సినిమాలు చూపిస్తున్నారు. అయితే, కుటుంబం అనేది థీమ్ కి మాత్రమే పరిమితం కాదు, ఈ చిత్రాలని సకుటుంబ సమేతంగా చూసేట్టు ఎంపిక చేశామని, ఈ ఫెస్టివల్ అంతా చూసే సరికి అంతర్జాతీయ సినిమా కళ చరిత్ర గురించి వొక అవగాహన కలగాలన్న ఉద్దేశంతో క్లాసిక్స్ నించి సమకాలీన సినిమాల దాకా ఎంపిక చేశామని ఫెస్టివల్ మొదటి రోజున నిర్వాహకులు ఆశపెట్టారు. ఇవాళ ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు, నవ తరంగం (న్యూ వేవ్) ధోరణికి శ్రీకారం చుట్టిన గోడార్డ్ సినిమా ‘బ్రెత్ లెస్” చూసి వచ్చాక, అది నిజమే అనిపించింది.గోడార్డ్ గురించి శ్రీశ్రీ చాలా సార్లు ప్రస్తావిస్తాడు తన వ్యాసాల్లో! గోడార్డ్ గురించి చదివినప్పుడల్లా శ్రీశ్రీ అభిరుచిని మెచ్చుకుని తీరాల్సిందే. శ్రీశ్రీకి గోడార్డ్లో అంతగా నచ్చిందేమిటా అని చూస్తే, చాలా విషయాలు దొరుకుతాయి. ఇద్దరికీ మార్క్స్ అంటే విపరీతమయిన గురి. ఇద్దరిలోనూ అస్తిత్వ వాద చాయలు, ఒక రకం అనార్క్సిస్టు నీడా కనిపిస్తాయి. ఇద్దరికీ సినిమా కళ మీద విపరీతమయిన గురి వుంది. గోడార్డ్ వొక సారి అన్నాడట “ 1950లలో సినిమా అంటే నిత్య ఉపయోగ వస్తువు. రొట్టె తరవాత అదే!” ఈ మాట కవిత్వాన్ని గురించి శ్రీశ్రీ అనడం చాలా మందికి గుర్తుండే వుండాలి.

ఇవాళ “బ్రెత్ లెస్” సినిమా చూస్తున్నంత సేపూ శ్రీశ్రీ వచనం గుర్తొచ్చింది నాకు.

శ్రీశ్రీ వచనంలో ఓ గొప్ప కొరడా ఝుళిపింపు, వ్యంగ్యం, విసురూ వున్నాయని మనకందరికీ తెలుసు. కొన్ని శ్రీశ్రీ వాక్యాలు చదువుతున్నప్పుడు ఆ వాక్యాలకి అంత పదును ఎక్కడి నించి వచ్చిందా అని విస్మయంలో పడిపోతాం. కానీ, ఇవాళ ఈ సినిమాలో సంభాషణలు వింటున్నంత సేపూ శ్రీశ్రీ వ్యాసాల్లోనూ, కథల్లోనూ, రేడియో నాటికల్లోనూ వుపయోగించిన వచనమే గుర్తొస్తూ వుంది. అంటే, గోడార్డ్ సినిమాల నుంచి శ్రీశ్రీ ఎంత నేర్చుకున్నాడా అనిపించింది. నేను గోడార్డ్ సినిమాలు ఇంతకు ముందు కూడా చూశాను. కానీ, చెత్త సబ్ టైటిల్స్ వల్ల ఎప్పుడూ ఆ సంభాషణల పదును తెలిసి రాలేదు.
ఇప్పుడు నేను చూసిన సినిమా 2010 లో కొత్త సబ్ టైటిల్స్ తో విడుదల అయిన సినిమా. సంభాషణల ప్రాణం తెలిసి సబ్ టైటిల్స్ ఇచ్చారు.

ఈ సినిమా ప్రొడక్షన్ గురించి చాలా కథలు ప్రచారం లో వున్నాయి. ముఖ్యంగా సంభాషణలు గోడార్డ్ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు రాసే వాడట. అసలు ఈ సినిమా వొక డాక్యుమెంటరీ లాగా తీయాలని మొదలు పెట్టి, ఓ హాండ్ కెమెరాతో తీశారట. కానీ, సినిమా చూస్తున్నప్పుడు మనకి అలాంటి అనుమానాలే రావు. ఎన్ని రోజులు కష్ట పడితే ఈ సంభాషణ రాసి వుంటాడా, ఎంత కష్ట పడితే వొక్కో ఫ్రేమ్ తయారయ్యిందో కదా అనుకుంటూ వుంటాం. అడుగడుగునా గొప్ప చిత్రీకరణలు, అచ్చెరువు గొలిపే సన్నివేశ కల్పనా కనిపిస్తాయి. వొక గొప్ప కావ్యం చదువుతున్న అనుభూతి కలిగించిన సినిమా ఇది.
Category: 1 comments

1 comments:

శ్రీ said...

మంచి సినిమా పరిచయం చేసారు అఫ్సర్ గారు. శ్రీశ్రీ గారిని కదిలించిన గోడార్డ్ సినిమా తప్పక చూడాల్సిందే. మీ సమ్మర్ ఫెస్టివల్ సినిమాలను మాతో పంచుకోండి, నేనూ చూసేస్తాను.

Web Statistics