డైరీలో హ్యూస్టన్ కి వొక పేజీ!





హ్యూస్టన్ లో సాహిత్య సభకి మూడు నెలల క్రితం మాట తీసుకున్నారు రాచకొండ శాయి గారు.

విపరీతమయిన రాత పనుల వొత్తిడి వల్లా, కాన్ఫరెన్సుల హడావుడి వల్లా, ఈ ఏడాది యూనివర్సిటీ లో రెండు కొత్త కోర్సులు - వొకటి భారతీయ కవిత్వం మీద - చెప్పాల్సి రావడం వల్లా ఇటీవలి కాలంలో ఏ వూరికీ, ఏ సభకీ ఎవరికీ మాట ఇవ్వడం లేదు. కానీ, టెంపుల్ సాహిత్య సదస్సులో శాయి గారు గీతాంజలి మీద చేసిన చక్కటి ప్రసంగపు మత్తులో వుండడం వల్ల, ఆ రోజు ఆయన అడగడమూ, సరే అనేయడం చాలా యాంత్రికంగా జరిగిపోయాయి.

ఆ తరవాత శాయి గారు మళ్ళీ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నప్పుడు నిజంగానే చాలా పనుల్లో కూరుకుపోయి, ఇక హ్యూస్టన్ ప్రయాణం వల్ల కాదులే అనుకున్నాం. అలా వెళ్లకుండా వుంటే చాలా మిస్ అయ్యే వాళ్ళమని ఇప్పుడు నిస్సంకొంచంగానే అంటున్నా.
అనుకోని కారణాల వల్ల దారి తప్పి, మూడు గంటల కారు ప్రయాణానికి నాలుగు గంటలు చేసి హ్యూస్టన్ చేరే సరికి, సాయి బాబా మందిరం ఇంకా ప్రశాంతంగానే వుంది. నాలుగయిదు తెలుగు కుటుంబాలే అక్కడున్నాయి. వాళ్ళు కూడా ఏ పూజాకో, ఆరతికో వచ్చి వుంటారులే అనుకున్నాం. కానీ, చూస్తూండగానే ఆ పెద్ద హాలు నిండిపోయింది. వందకి పైగా తెలుగు కుటుంబాలు వొక్క చోట చేరాయి. "నెల నెలా వెన్నెల" మొదలయింది శాయి గారి స్వాగతంతో.




మామూలుగా కాన్ఫరెన్సులలో పవర్ పాయింట్ చేయడం నాకు అలవాటే కానీ, మొట్ట మొదటి సారిగా ఒక సాహిత్య సభలో పవర్ పాయింట్ చేశాను. అలా చెయ్యడం వల్ల ఉపన్యాసం ఆద్యంతం వొక పద్ధతిగా సాగిందని అనిపించింది. మామూలుగా నా ఇతర ప్రసంగాలు విన్న వాళ్ళు కూడా ఇది భిన్నంగా, వివరంగా పూసగుచ్చినట్టుగా, ఆసక్తిగా వుందన్నారు. "ఈ కాలంలో తెలుగు" ఎన్ని ముఖాలుగా విస్తరిస్తుందో, ప్రపంచీకరణ తరవాత తెలుగు సాహిత్యం, సంస్కృతి, భాష అనే మూడు అంశాల చుట్టూ మాట్లాడాను. అన్ని చోట్ల మాదిరిగానే ఈ సభకి వచ్చిన వాళ్ళు కూడా బ్లాగులు, అంతర్జాల పత్రికల మీద చాలా ఆసక్తి చూపించారు. పొద్దు, కౌముది, ఈమాట లాంటి వెబ్ పత్రికలూ, ఆముక్తమాల్యద, తెలుగు పద్యం, నా లోకం, సాహిత్య అభిమాని, కొత్త పాళీ లాంటి బ్లాగుల వివరాలను చాలా మంది అడిగి తీసుకున్నారు. అడిగి తెలుసుకున్నారు.

శ్రీపాద కథల్లో తెలుగుదనం గురించి కల్పన మాట్లాడింది. చానెళ్ల తెలుగు మీద జోకులు గుప్పించారు చిట్టెన్ రాజు గారు.




సభ తరవాత తెలుగు పిల్లలు పాడిన పద్యాలూ, పాటలూ, చేసిన ప్రసంగాలూ నాకు పెద్ద ఆకర్షణ. తెలుగు భాష బతికే వుంటుందన్న గొప్ప భరోసా ఆ పిల్లల తెలుగు పలుకుల్లో ప్రతిధ్వనించింది.



అన్నిటికంటే నాకు బాగా నచ్చిన సంగతి ఇంకోటి వుంది...సాధారణంగా అమెరికాలో తెలుగు సాహిత్య సభల్లో కొత్త తరం కనిపించదు, కొత్త తరం అంటే ఇక్కడ పుట్టి పెరిగిన మన తెలుగు టీనేజర్లు. హ్యూస్టన్ లో ఈ సారి వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళంతా తెలుగు టీనేజర్లు. ఆరుగంటల పాటు సాగిన కార్యక్రమంలో వాళ్ళ ఉత్సాహం ఉరకలు వేసింది.

సరే, సభానంతర సంగతులు ఇంకా అనేకం వున్నాయి. కొత్త సాహిత్య మిత్రులతో కబుర్లు, తెలుగు బడి నిర్వహిస్తున్న ఉపాధ్యాయులతో మాటా మంతీ, శాయి/లలితా/వరుణ్ / రాఘవేంద్ర గారి కుటుంబ సభ్యుల ఆతిధ్యమూ, పూర్వ విద్యార్థులతో కబుర్లు, నా చిన్ననాటి మిత్రుడు రాముతో వొక రోజంతా కబుర్లూ, ఎన్నాళ్ళకో కలిసిన కల్పన బంధువులతో వొక పూట కాలక్షేపమూ...సాహిత్యంతో పెరిగే సాన్నిహిత్యం గొప్ప అనుభూతులు!
Category: 6 comments

6 comments:

Anil Atluri said...

మీరు ఈ పోస్ట్‌లో వివరించినవాటన్నింటిలోకి బాగా నచ్చిన అంశాలు రెండు:
ఒకటి: పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం.
రెండు:వలంటీర్లుగా పనిచేసిన తెలుగు టీనేజర్లు.

చాలా సంతోషం.

మీ పవర్ పాయింట్ ప్రెజంటేషన్‌ని కూడ పోస్ట్ చెయ్యవచ్చుకదా ఇక్కడ?!

cbrao said...

మీ హూస్టన్ కబుర్లు, ఛాయాచిత్రాలతో ఉండటం వలన, మీరే స్వయంగా చెప్తున్న అనుభూతి కలిగింది.

ఆ పవర్ పాయింట్ ప్రెజంటేషన్‌ బ్లాగు పాఠకులకు చూపించగలరా?

Sai said...

అఫ్సర్ గారు,
మీ ఇద్దరి రాక, మా హ్యూస్టన్ నగరంలో తెలుగు భాషాభిమానం ఉన్న ప్రజలకి ఒక కొత్త ఆశ, కొత్త వెలుగు కనిపింప చేసింది. మీ మాటలు, మీ పవర్ పాయింట్ presentation ఎందరినో ఆకట్టుకున్నాయి. మీకు వీలు కలుగదేమో నని అనుకున్నా గాని వచ్చి మా అందరితో కొంచెం కాలమయినా గడిపినందుకు చాలా సంతోషం. మీకు, కల్పన గారికి, మా ధన్యవాదాలు. - శాయి

మాగంటి వంశీ మోహన్ said...

హ్యూస్టన్ పిల్లలకు, టీనేజర్లకు, ప్రత్యేకించి వారి తలిదండ్రులకు - అభినందనలు...

Anonymous said...

అఫ్సర్ గారు,
మీకు తీరిక లేనప్పటికీ హూస్టన్ వెళ్ళి "నెల నెలా వెన్నెల" కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం చాలా అనందం గా ఉంది. సాయి గారి "సభావిశేష సంచిక" రెండురోజుల క్రితమే చదివాను. వినూత్న రీతిలో ప్రసంగం, పిల్లలకు భాషాసాహిత్యాలను పరిచయం చేయడం అభినందనీయం.

NR Urimindi

Afsar said...

@అనిల్, రావు గారు, వంశీ :

ధన్యవాదాలు. పవర్ పాయింట్ త్వరలో బ్లాగ్ లో పెడ్తాను.

అవును, పిల్లల కంటే టీనేజర్లు ఎక్కువ కనిపించడం నాకు సంతోషంగా అనిపించింది. తెలుగు పట్ల కొత్త తరం స్పందనని అది తెలియజేస్తోంది.

@శాయి గారు: సభానంతర సంగతులు బోలెడువున్నాయి, మన ఇద్దరి చర్చతో సహా. సమయాభావం వల్ల రాయలేకపోయాను.

@రెడ్డి గారూ: అవును, శాయిగారు, ఇతర మిత్రులు ఒక సభా ప్రయోగం చేశారని అనిపించింది.

Web Statistics