ఈ వారమే ఇండియానాపొలిస్ లో అమెరికా తెలుగు సాహితీ సదస్సు!





ఈ వారం ఇండియానా పొలిస్ లో అమెరికా తెలుగు సాహితీ సదస్సు జరుగుతోంది. ఇది ఏడవ సదస్సు. వంగూరి ఫౌండేషన్ 1998 నించి రెండేళ్ల కోసారి ఈ అఖిల అమెరికా తెలుగు సాహితీ సదస్సులు నిర్వహిస్తోంది. ఈ శనివారం ఉదయం 8 గంటలకు సదస్సు మొదలవుతుంది. సాయంత్రం 6:30 గంటల దాకా సాహిత్య ప్రసంగాలూ, చర్చా వేదికలూ జరుగుతాయి. ఆరున్నర నించి 8 గంటల వరకు మధుర గాయకులు ఘంటసాల ఆరాధనోత్సవాలు జరుగుతాయి. హైదరబాద్ నించి వచ్చిన శ్రీమతి దివాకర్ల సురేఖా మూర్తి, "అపర ఘంటసాల" బాల కామేశ్వర రావు ల మధుర గీతాలు వుంటాయి. ఈ ఇద్దరి గాన మాధుర్యం ఇప్పటికే టెక్సాస్ తెలుగు వారికి సుపరిచితం. అది నిజంగా వీనుల విందే! మరునాడు స్వీయ రచన పఠనంతో రెండో రోజు కార్యక్రమాలు మొదలవుతాయి.

వంగూరి చిట్టెన్ రాజు గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ సదస్సుకి ఆంధ్రా నుంచి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, మంధా భానుమతి, అక్కిరాజు సుందర రామకృష్ణ హాజరవుతున్నారు.

ఈ సదస్సులో నేను "అమెరికా తెలుగు సాహిత్యం - రెండు దశాబ్దాలు" అనే అంశం మీద మాట్లాడతాను. 1990 ల తరవాత అంతర్జాతీయ ఆర్ధిక రాజకీయ పరిణామాల తరవాత అమెరికా తెలుగు సాహిత్యం ఎలాంటి మార్పులకి లోనయ్యిందో, ఎలాంటి తెలుగు రచయితలు ఈ పరిణామాల నించి వెలుగులోకి వచ్చారో ప్రధాన చర్చనీయాంశం అని నా వుద్దేశం.

నా ఈ-చిరునామా ఇది:afsartelugu@gmail.com
Category: 1 comments

1 comments:

Afsar said...

అఫ్సర్ గారికి,
"అమెరికా తెలుగు సాహిత్యం - రెండు దశాబ్దాలు" పూర్తి ప్రసంగ పాఠాన్ని ఇక్కడ ఉంచితే ప్రవాసాంధ్రులందరికి,ముఖ్యంగా సాహిత్యాభిమానులందరికి అందుబాటులో ఉంటుంది. వీలైతే ఆ రికార్డింగ్‌ని కూడా నెట్‌లో ఎక్కడ ఉంటుదో తెలియజేస్తే బాగుంటుంది."
ఈ వ్యాఖ్యని మీ బ్లాగులో పోస్ట్ చెయ్యడం కుదరలేదు.చాలా సార్లు ప్రయత్నించాను. ఏదో సాంకేతిక సమస్య అనుకుంటాను. అందుకని ఇక్కడ మీకు జాబు రూపంలో తెలియజేస్తున్నాను.
శెలవు.
అనిల్ అట్లూరి

Web Statistics