వానలో హైదరాబాద్!




వొంటరి రాస్తా మీద
చిట్టికప్పల్లా ఎగిరెగిరి పడ్తుంటాయి చినుకులు

చినుకు వొక అల్లావుద్దీన్ అద్భుత దీపం.
దీని బుడగ దేహంలోకి నేను జారిపోతాను
నగరపు పైపై మెరుగుల నా దేహం
కాసేపు దీప కాంతిని ధరిస్తుంది.

వొంటరి రాస్తా పక్కన
కాసిన్ని వాన నీళ్ళు
పిల్ల మడుగులయి ఎటో పారాలని చూస్తాయి
నా వొంటిని మడిచి
కాయితప్పడవలాగా అందులోకి వదిలేస్తాను.

అది ఎటు వెళ్ళి
ఎటు వస్తుందా అని చూస్తూ వుంటాను.

దాని రెక్కల మీద నా కన్ను అతికిస్తాను.

అది కదలడం మరిచిపోయిందని
కాసేపటికి
అర్ధమవుతుంది నాకు.

ఈ వూళ్ళో వానకి ఏ పనీ లేదు
అది ఎవరికోసమూ కురవదు

తనలో తానే తపస్సు చేసుకునే నీటి బుడగ
ఓ అరక్షణం నన్ను నిలదీసే పాము పడగ.

13 comments:

ఎం. ఎస్. నాయుడు said...

భలే ఉంది

విశ్వనాథ్ said...

ఖమ్మం కి చెందిన ప్రసేన్,వంశీకృష్న గారితో కలిసి కవితలు రాసిన అఫ్సర్ మీరేనా?మీరు అయితే మీవి కొన్ని పుస్తకాలు చదివాను.అన్నట్టు నేను ప్రసేన్ గారు నాకు పెద్దనాన్న.

Afsar said...

@నాయుడూ: ఎలా వున్నారు?
@విశ్వనాథ్: థాంక్యూ. అవును, ఆ అఫ్సర్ నే! ప్రసేన్ తో మొన్ననే మాట్లాడా.

malli said...

అఫ్సర్ గారూ,బావున్నారా?
చాలా బావుంది కవిత.
''వొంటరి రాస్తా మీద
చిట్టికప్పల్లా ఎగిరెగిరి పడ్తుంటాయి చినుకులు''
మంచి ఎక్స్ ప్రెషన్.20 ఏళ్ల కిందట తెలుగు యూనివర్సిటీలో
మీరు నా మొదటి కవితను సరి చేసి స్టేజి మీద చదివించడం
నాకిప్పటికీ బాగా గుర్తు.ఆ తర్వాత కవిత్వం రాయడం ఎంత కష్టమో అర్ధమై
రాయడం మానేసా..అది వేరే విషయం.

malli said...

అఫ్సర్ గారూ,బావున్నారా?
చాలా బావుంది కవిత.
''వొంటరి రాస్తా మీద
చిట్టికప్పల్లా ఎగిరెగిరి పడ్తుంటాయి చినుకులు''
మంచి ఎక్స్ ప్రెషన్.20 ఏళ్ల కిందట తెలుగు యూనివర్సిటీలో
మీరు నా మొదటి కవితను సరి చేసి స్టేజి మీద చదివించడం
నాకిప్పటికీ బాగా గుర్తు.ఆ తర్వాత కవిత్వం రాయడం ఎంత కష్టమో అర్ధమై
రాయడం మానేసా..అది వేరే విషయం.

Afsar said...

మల్లి!

థాంక్యూ

మొత్తానికి మిమ్మల్ని కవిత్వానికి దూరం చేశానా, నా ఎర్ర సిరా దిద్దుబాట్లతో!

అయ్యో! అది నా పొరపాటు కింద భావించి, మళ్ళీ రాయండి కవిత్వం!

ప్రసూన said...

అఫ్సర్ గారూ కవిత చాలా చాలా బావుందండీ. అదిరింది.

భాను said...

మీ కవిత చదువుతుంటే ఎప్పుడో కాలేజ్ రోజుల వరకు కూడా , వానలో అలా తడుస్తూ, నడుస్తూ , వానను ఎంజాయ్ చేసిన రోజులు గుర్తుకొచ్చాయి

కెక్యూబ్ వర్మ said...

ఏ వయసు వారికైనా వాన చినుకు తన ఫిలాసఫీతో ఊపేస్తుంది. ఓ గొప్ప అనుభూతినందించారు. థాంక్యూ సార్..

అక్షర మోహనం said...

Afsar..! ee tadava, Hyderabad vaanalo nuvvodilana padava, nannu cherindi.

Afsar said...

@ప్రసూన: థాంక్ యు.
@భానూ: ఏదో వొక స్మృతిని తట్టి లేపడమే కవితా విజయం అనుకుంటాను. మీలో ఆ అనుభూతిని తట్టినందుకు సంతోషంగా వుంది.
@క్క్యూబ్; వానకి ఇంకో పార్శ్వం కూడా వుంది. అది కూడా త్వరలో నా "అక్షరం" లో చూస్తారు మున్ముందు.
@మోహనా: ఎంత దూరం అయినా ప్రవహించే/ ప్రయాణించే గుణం కాయితప్పడవ కె వుందేమో! అవునా?

కొండముది సాయికిరణ్ కుమార్ said...

కవిత చాలా బాగుందండి. ముఖ్యంగా ఈ లైనులు :

వొంటరి రాస్తా పక్కన
కాసిన్ని వాన నీళ్ళు
పిల్ల మడుగులయి ఎటో పారాలని చూస్తాయి
నా వొంటిని మడిచి
కాయితప్పడవలాగా అందులోకి వదిలేస్తాను.

అది ఎటు వెళ్ళి
ఎటు వస్తుందా అని చూస్తూ వుంటాను.

Afsar said...

సాయి గారూ:

ఎలా వున్నారు? మీ పలకరింపు ఎండాకాలపు వొంటి మీద చల్లని వాన చినుకు పడ్డట్టు వుంది.

Web Statistics