ఎవరీ ముసుగు నారి "రమా భరద్వాజ"?





"ఈమాట"లో తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ప్రతి రచనా సగమో అర సగమో చదివి తెగ కామెంట్ల పంట పండించింది ఈ రమా భరద్వాజ అనే ముసుగు నారి. ఆమెకి ఈమాట మీద కోపమో, ఈ లోకం మీదనో కోపమో తెలీదు గానీ, ఈమాటలోని ప్రతి రచన మీదా, చివరికి సమీక్షల మీద కూడా ఒక అట్ల కాడ విసిరితే తప్ప రోజు గడవదేమో అన్నంత తీవ్రమయిన విసురుతో ఆవిడ గారు కామెంట్ల మీద కామెంట్లు రువ్వి ఈ మధ్య ఎందుకో పాపం కాసింత శాంతించింది.
"ఊరి చివర" మీద వేలూరి రాసిన సమీక్ష మీద ఆవిడ గారు ఎందు వల్లనో చింత నిప్పుల కళ్ళతో చిందులు తొక్కింది. తీరా ఆవిడ వ్యాఖ్యలు జాగ్రత్తగా చదివితే ఆవిడ నా పుస్తకం మాట దేవుడెరుగు , అసలు వేలూరి సమీక్ష కూడా సరిగ్గా / పూర్తిగా చదవలేదని ఇట్టే అర్ధం అయిపోతోంది.
ఇంతకూ ఈ సువిఖ్యాత కామెంటరు "రమా భరద్వాజ" ఎవరు? ఆవిడ గారి ఆగ్రహం ఎవరి మీదా? ఎందుకు? ఆవిడ గారి వ్యాఖ్యలు ఎంత వరకు సబబు? సాహిత్యంలోనూ, సాహిత్య విమర్శలోనూ నీతీ, నిజాయితీ అంటూ కామెంట్ల మీద కామెంట్లు దంచే ఈవిడ గారు తను మాత్రం దొంగ పేరుతో ఎందుకు రాస్తుంది? ఈ చర్చ మీద ఆసక్తి పెంచుకోమని మీకు నేను చెప్పడం లేదు గానీ, ఇలాంటి దొంగ వేషాల గుట్టు రట్టు అయితే కాస్త బాగుంటుందని నా ఉద్దేశం.

ఈ వ్యాఖ్యల్ని బట్టి ఈ "రమా భరద్వాజ" ఆనవాలు ఎవరయినా పట్టగలరేమో కాస్త ప్రయత్నించండి చూద్దాం. అదే విధంగా "ఊరి చివర" లో కవిత్వం మీద ఆవిడ గారి వ్యాఖ్యలలో ఎంత నిజం వుందో, ఎంత అక్కసు వుందో అది కూడా కొంత బేరీజు వెయ్యండి. మీ వినోద కాలక్షేపం కోసం ఆవిడ గారి నోటి ముత్యాలు కొన్ని:

July 2, 2010 1:47 am
ముకుందరామారావు పదచిత్రాలు అనేకమ్ కొత్తగా ఉన్నాయి. అఫ్సర్ రాసిన కవిత కన్నా మెరుగైన భావాలున్నా మరెందుకనో వేలూరి వారు అక్కడ ఒక గొంతుకతో మాట్లాడి ముకుందరామారావు కవిత్వమ్ పుస్తకాన్ని సమీక్షచేసేటప్పటికి మాత్రమ్ ఒకలాంటి ఉదాశీన వైఖరిని తన సమీక్షలో చూపించారు.ఇదీ సమీక్ష చేసేవారి వైఖరి. అయినా పుస్తక సమీక్షలు తెలుగున వాస్తవంగా ఉన్నదెప్పుడు గనకా??
July 4, 2010 2:04 am

ఆధునిక తెలుగు కవిత్వాన్ని గురించిన చర్చ ఎప్పుడు జరిగినా సరిగ్గా ఇలాంటి సందర్భాలే నడుస్తూ వచ్చాయి. అది ఒక లాంటి రక్షణ అకవులకి. ఎవరి కవిత్వానికి చెల్లుబాటు కాదని భయం ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ దబాయించి బతకాల్సిన పరిస్తితి ఏర్పడుతుంది. సాధారణంగా ఒక పుస్తకం అచ్చు అయ్యాకా ఆ రచయిత తన పుస్తకాన్ని భుజానికెత్తుకుని తిరిగే కార్యక్రమానికి దిగకూడదు. తానే పూనుకుని చర్చల్లో తలదూర్చడం చేయకూడదు. అలా ఎవరు చేసినా వాళ్ళకి వాళ్ళ రచనల మీద నమ్మకం లేదనే అర్ధం.
ఇకపోతే ఇటీవల వీళ్ళంతా గొప్పగా చెప్పుకుంటున్న “ప్రాంతీయ - కుల -మత” చైతన్యాలు ఉత్తరోత్తరా పురోగతికి నిదర్శనమా?? తిరోగతికి నిదర్శనమా?? అన్నది సాహిత్య రంగంలో జరూరుగా చర్చ చేయాల్సిన విషయమే!! రచయితలుంటారు. కవులుంటారు. వారు ప్రభవించిన ప్రాంతాలు ఒక పార్శం మాత్రమే!! అది ఆ రచయితని గురించిన బయోగ్రఫీలో ముఖ్యమైన విషయం అవుతుందేగానీ వారి సాహిత్యానికి ఉద్దేశ్యించిన లక్ష్యాలకి.. ప్రయోజనాలకీ కాకూడదు. మంచి కవులు ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా కావలసిన వాళ్ళే కావాలి. రచయితలకి ప్రాంతీయ తత్వాలు ముఖ్యం కావడం ఎప్పుడు అవసరం అవుతుందంటే ఆ రచయితకి ఆ ప్రాంతం వలన ఏదైనా ఆశించే ఒక ప్రయోజనం ఉంటేనే!! అలాంటి ఆశ ఉన్న ఉత్తర క్షణమే అతడిలోని మీరన్న “నిజాయితీ” చచ్చిందనే అర్ధం.
రవికిరణ్ సవాలు నన్నయ్య నాటి నించీ ఐతే ఆనాటికి ఈ స్థితి లేదు గనక మీరన్న మాటలో ఇలాంటి అర్ధాలు రావనీ…. మీరు ఇటీవలి కాలాన్ని మాత్రమే లక్ష్యంగా మాత్లాడేరనీ అతనికి తెలియనంతటి నిగూఢమైన విషయమేమీ కాదు నిజానికి. రాజకీయ పరిభాష కి వీళ్ళంతా ఎంతగా అలవాటు పడిపోయేరంటే అది వీళ్లకి ఒక ఊత కర్ర లాంటిది. ఆ పరిభాష లేనిదే వీళ్ళు నడవలేరివాళ. అదుకే వీళ్ల ఆలోచనా పరిధీ..తద్వారా వీళ్ళ సాహిత్య పరిధీ విస్తరించలేకపోవడం.
July 2, 2010 1:28 am

పాశ్చాత్యదేశాల్లో పత్రికలు ఇంకా ప్రచురణకర్తల మీదా ఒక ముద్ర ఉంది. అదేమంటే అక్కడ వాళ్ళు కావాలంటే అకవులని హడావుడి చేసి కవులుగా ప్రచారం చేయగలరు..లేదా కవులని తయారూ చేయగలరు. అలాగే ఒక మంచి పుస్తకాన్నీ ఒక మంచి రచయితనీ కావాలనుకుంటే నొక్కేయనూగలరు అని. దీనికి సంబంధించి పశ్చిమ దేశాల పత్రికల మీదా ప్రచురణకర్తల మీదా బోలెడన్ని సంఘటనలూ ..కధలూ ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ వేలూరి వేంకటేశ్వర రావు గారి సమీక్ష చదవగానే “ఈమాట” మీద కూడా అలాంటి ప్రభావం ఏమన్నా ఉందా? అన్న సందేహం వచ్చింది నాకు. అఫ్సర్ రాసిన కవిత్వం సమీక్షకుడు చెప్పిన చాలా అభిప్రాయాల్లోకి ఏకోశానా ఇమడలేదు. కవిత్వం పేరుతో ఉత్త హడావుడి తప్ప మనసుని కదిలించి చాలాకాలం పాటు వెన్నాడి గుర్తుపెట్టుకోగల ఒక్క వాక్యమైనా లేని ఈ పుస్తకాన్ని అందరూ తప్పక సేకరించుకోవలసిన పుస్తకంగా సమీక్షకుడు కితాబు ఇవ్వడం చాలా కృతకంగానూ pompus గానూ ఉంది.
July 3, 2010 2:24 am

1. ఇదేమరి విమర్శని తీసుకోలేకపోవడం అంటే . విమర్శ చేస్తే ఆ చేసిన వాళ్ళంతా భోగలాలసులు ..కష్టజీవుల కష్టాలు పట్టని వాళ్ళూ ..సమర్ధించిన వాళ్ళంతా వీర విప్లవవాదులూ అన్న బుకాయింపు. ఎన్నాళ్ళీ hipocracy?? విమర్శించిన వాళ్ళు పట్టుచీరల్లో తిరుగుతూంటే సమర్ధించినవాళ్ళూ గోచీలు పెట్టుకుని ఉద్యోగాలు చేస్తున్నారా?? హంబక్ రాతలతో false arguments చేస్తూ ఎలా ఒప్పించగలరూ ?? ఏం రాస్తున్నారన్నదే కాదు ఎలా రాస్తున్నారన్నది ఇక్కడ విషయం. మనసుకి ఎక్కని రాతని ఓహో!! అని మెచ్చుకుందికి తెలుగుదేశాన కోకొల్లలున్నారు. విమర్శ అన్నది లేదు గనకే ఏది బాగులేదో ఎందుకు బాగులేదో ఎవరూ మాట్లాడడం లేదు గనకే పుట్టగొడుగుల్లా కవిత్వం పేర పుస్తకాలు పుట్టుకు వస్తున్నాయి. చెప్పిన వాళ్ళని తిట్టే కార్యక్రమం లేదా ఇప్పుడీ ఇస్మాయిల్ చేసిన పధ్ధతిలో ఇటువంటి కామెంట్స్ కి పూనుకోవడం వల్లనే ఆధునిక కవిత్వపు మంచిచెడ్డలు అన్నది ఎవరూ ముట్టని అంశం అయింది. ఆధునిక కవిత్వం అంటే ఒక హేళన అందువల్లనే స్థిరపడింది. తెలుగులో ఒక సామెత ఉంది “తలపాగా చుట్టుకోడం రాక తల వంకర అన్నాట్ట” అని. అలాంటిదే ఈ ఆధునిక కవితావ్యాపారంలో ఉన్నవాళ్ళవైఖరి. తమకి తోచదు. చెపితే ఆలోచన చేయరు. ఎవరన్నా ఒక కవితని పాఠకుల మనసులలోకి ఎలా బలంగా పంపించగలమా అని ఆలోచన చేయాలి అంతే గానీ బాగులేదని విమర్శించినవాళ్ళని పిల్లిశాపనార్ధాలు పెట్టడం కాదు. వెనకటికి ఒక విమర్శకుడు అంటూండే వాడు మనకి నచ్చంది మరొకరికి నచ్చవచ్చు అని. కానీ బాగున్న కవిత అది దేనిగురించిరాసినా ఎందరినో ఆకట్టుకోగలదు మరి. అలా ఆకట్టుకున్నవి నిలబడ్డాయి. ఆకట్టుకోలేనివి ఎవరెన్ని కితాబులిచ్చినా బోల్తాపడ్డాయి.


July 10, 2010 12:00 am

ఈమాటలో చాలా మంది పాఠకులు పెద్దగా సాహిత్యం గురించి తెలిసిన వాళ్ళు కారు. వారికి సాహిత్యపు పూర్వాపరాలూ తెలియవు. తెలిసిన పాఠకులకి నా వ్యాఖ్యలు ఏవీ పెడసరంగా విన్పించవు. నేను అభ్యంతరకతరమైన లేదా అమర్యాదాపూరితమైన వాక్యాలు ఏమీ రాయలేమోదు. అందువలన కృష్ణ ఈమాటకోసం ఆ పత్రిక సంపాదకుల కోసం.. ఇంకా అఫ్సర్ వంటి కవుల కోసం బాధ పడితే నేను చేయగలది ఏమీ లేదు. అననుకూల అభిప్రాయాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడే వాళ్లకోసం నేను అభిప్రాయాలు రాయడం లేదు. అది పత్రికని చదివే మిగతా పాఠకుల సమస్య కాదు. నేను నా అభిప్రాయాలని చెప్పకూడదని ఈమాట సంపాదకులెవ్వరూ అనలేదు. వారు వద్దని అన్న రోజున నేను అలాగే అభిప్రాయాలు చెప్పడం మానేయగలను. నాకొచ్చిన ఇబ్బది ఏమీ లేదు.

20 comments:

Kathi Mahesh Kumar said...

హ్మ్మ్ ఆసక్తికరం...

శరత్ కాలమ్ said...

ఈమాట వారెవ్వరూ బ్లాగులు వ్రాయక, బ్లాగులు చదవక తమలోకమ్లో తాముంటారని నాతో పాటు కొందరి అభిప్రాయం. కొత్తపాళీ, మీరూ తప్ప అక్కడా, ఇక్కడా వున్నవారు ఇంకా ఎవరున్నారు?

భావన said...

అవును నేనూ కూడా గమనిస్తూ వుంటాను ఈ మాట లో ఈమె ఎవరో కాని ఎప్పుడూ ఎందుకో అందరిని అన్ని వ్యాఖ్యల నూ విమర్శిస్తూనే వుంటారు. మొదట్లో చదివే దానిని కాని తరువాత తరువాత ఆమె వ్యాఖ్య చదవటం మానేసా. (ఆమె కు నష్టం లేదు అనుకోండీ).
శరత్...ఈ కవితలకు, కధలకు (కవితలకు ముఖ్యం గా) ఈ పాత విధానంలో బోలెడన్ని తెలుగు పదాలు సమాసాలు అలంకారాలు గుప్పించి మనలాంటి వాళ్ళెవ్వరికి అర్ధం కానంట క్లిష్టతచేర్చి ఆ పైన మనలను వెధవలు అనటం తో అంతలేసి తెలుగు రాసేవాళ్ళంటే భయం వేసి దూరం గా వుంటారనుకుంటా మనలాంటీ సామాన్య బ్లాగు జనాలు.

teresa said...

She is a popular 'kavayitri' herself- is what I heard!

She and another male provide great entertainment in eemaata at their own cost :)

శరత్ కాలమ్ said...

ఓ రెండేళ్ళ క్రిందట పొరపాటున ఈమాట వైపు వెళ్ళా. అందులో ముఖ్య సంపాదకులు గారట - పేరు గుర్తులేదు - ఆ సైటుకి రచనలు పంపే వారి గురించి మహా చులకనగా వారి సంపాదక సభ్యులకు ఓ వ్యాసం పంపేరు. ఆ వ్యాసం చదవడంతోటే నాకు ఈమాట అంటే చిరాకు వేసింది. ఆ ముఖ్య సంపాదకులుంగారిని ఈ విషయమై రమా భరద్వాజ్ దులిపివేసింది కదా యమ దులిపింది. దానితో నాకు రమా గారంటే గౌరవం అమాంతం పెరిగిపోయింది. ఆ తరువాత ఇక ఈమాట వైపు వెళ్ళలేదు కాబట్టి తరువాతి విషయాలూ, అక్కడ మీ విషయాలూ నాకు తెలియవు.

ఈమె మద్రాసు నుండి వ్రాసే అవకాశం వుందా? మద్రాసులో అదే సామాజిక వర్గానికి చెందిన రమ ఒకరు తెలుసు కానీ పరిచయం లేదు. ఆమె కూడా రచయిత్రినే.

కొత్త పాళీ said...

@ శరత్, దయచేసి ఈ కింది విషయాలు గమనించ గలరు:
1) 2008లో ఈమాట ఒక సంచిక సంపాదకీయం బ్లాగుల గురించే.
2) నా కథలు కొన్ని ఇదివరలో ఈమాటలో ప్రచురితమైనాయి. కొద్దినెలలపాటు సంపాదకవర్గంలో పనిచేశాను. ఏడాది పైగా ఈమాటకూ నాకూ ఎటువంటి సంబంధమూ లేదు.

జ్యోతి said...

నేను ఈమాట చదవను. కాని మీ పోస్టు చదవగానే సీను, సినిమా అర్ధమైపోయింది. స్వానుభవం మీద చెప్తున్న మాట ఇది..... కొందరు మనుష్యులు ఇలా ఉంటారండి. కాదు కాదు ఇలాగే ఉంటారు. వాళ్లలో ప్రతిభ ఉంటుంది. అయినా కూడా వేరేవాళ్ల మీద ఏడుస్తారు. ఆ అసూయ, ద్వేషానికి కారణం లేకున్నా తమ అక్కసుని ఇలా వ్యక్తపరుస్తుంటారు. ఎదుటివారిని బాధపెట్టాము, ఓడించాము, కించ పరిచాము అనుకుంటారు కాని ఆ మాటలు చదివినవారు వాళ్ల గురించే అసహ్యంగా అనుకుంటారు. చీదరించుకుంటారు అని ఆలోచించరు. తమ పేరు చెప్పుకునే ధైర్యముండదు. అంతర్జాలంలో మారుపేరుతో ఏదైనా రాయొచ్చు గుర్తుపట్టలేరు అనుకుంటారు. అమాయకులు. కాని వాళ్ల జాతక చక్రం మొత్తం తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం ఈనాడు మనకు అందుబాటులో ఉంది. ఆ సైటువారికి సదరు వ్యాఖ్యలతో ఆ ముసుగునారి మెయిల్ ఐడి. ఐపి అడ్రస్ తెలిసే ఉంటుంది. ఈ మాటల వల్ల మనకు బాధ కలుగుతుంది. కోపం వస్తుంది. వీళ్లని ఏమీ చేయలేమా అనుకుంటాము. కాని ఇలాంటివారు మంచివారే కాని మానసిక వికలాంగులు. మనమే అర్ధం చేసుకుని జాలిపడి త్వరగా కోలుకోవాలని ప్రార్ధించాలి. మారితే సరి లేకుంటే అది వారి ఖర్మ. కాని ఇలాంటివాళ్లని అప్పుడప్పుడు పదిమందికి పరిచయం చేయాలండి.

సుజాత వేల్పూరి said...

Jyothi,

I second you!

Afsar said...

భావన గారూ: నిజానికి తెలుగు చాలా అందమయిన భాష, ఈ ముసుగు "రమ"ల రాతల వల్ల అది వికారంగా మారుతోంది. వీళ్లేదో తెలుగు మీద కుట్ర పన్నుతున్నారని నా అనుమానమున్నూ! కానీ, సామాన్య బ్లాగులు అని మీరన్నవే నిజానికి మంచి తెలుగులో వుంటున్నాయని నా అభిప్రాయం.

తెరెస్సా, మీ దగ్గిర ఇంకా కొన్ని రహస్యాలు వున్నట్టున్నాయి. కాస్త వాటిని కూడా విప్పి చెప్పండి. బ్లాగు లోకం మీకు రుణపడి వుంటుంది.


శరత్ "గారూ": ఈమాట గురించి చర్చ జరగాల్సిన అవసరం వుంది, ఈ ముసుగు నారీ వ్యాఖ్యానాలు మీరు పై పైన చదివినా, ఆమెకి నచ్చిన కవీ , క్రిటిక్ వొక్కరే వున్నారు. మరో సారి చూడండి.

Afsar said...

కొత్త పాళీ: మీరు నిజానికి ఇప్పుడు మీ బ్లాగులో రాస్తున్న విషయాలు ఏదో రూపంలో/ లేదా వాటి యధాతధ రూపంలో అయినా ఈమాటలో వచ్చి వుంటే బాగుండేది.

జ్యోతి గారూ: మీది మంచి మనసు కాబట్టి క్షమా గుణం ఎక్కువ. నాది అంత మంచి మనసు కాదు, క్షమా గుణం కూడా కాస్త తక్కువే. విషయానీ, విషాన్నీ ఒక్కలాగే కక్కెస్తా. వికలాంగులూ. మానసిక వికలాంగులు జాలి పడాల్సిన వాళ్ళు కాదు, అందరిలానే ప్రేమకి అర్హులు. కానీ "ఈ - ముసుగు " టైపు మనుషులు జాలికి అనర్హులు.

సుజాత గారూ: థాంక్స్ ఆండీ

Kathi Mahesh Kumar said...

ఇప్పుడే ఈమాటలో జరిగిన చర్చ చదివొచ్చా.

రమాభరద్వాజ ఉద్దేశం అవహేళన తప్ప సాహితీవిమర్శ లేక చర్చ కావనేవి తేటతెల్లంగా కనబడుతుంటే దాని గురించి మనం చర్చించి ఆ వ్యాఖ్యకు విలువతేవడం ఏందుకుచెప్పండి?

షాడో said...

భరద్వాజ, ఈ పేరెక్కడో విన్నట్టుందే!

Afsar said...

మహేష్:

అసలు సిసలు సాహిత్య విమర్శ కంటే, అవహేళనే ప్రమాదకరమయ్యింది, తక్షణం నిరసించాల్సింది. అవహేళన ఎలా మొదలయి, ఎక్కడికి వెళ్తుందో, సమాజంలోని కింది వర్గాల వాళ్ళే అవహేళనకి గురవుతూ వుంటారో, అది ఒక కమ్యూనికేషన్ రాజకీయ వ్యూహమని మీకు చెప్పకరలేదనుకుంటా.

సూటిగా విమర్శ చేసే వాళ్ళతో ఎప్పుడూ పేచీ లేదు. అభిప్రాయ భేదమని మన వాదం వినిపించే ప్రయత్నం చేస్తాం. అది విషయం.

కానీ, అవహేళన విషం. దానికి విరుగుడు ఇంకా నాకు తెలీదు, మౌనం మాత్రం దేనికీ సమాధానం కాదు. అది అర్ధాంగీకారం కూడా కావచ్చు ప్రమాద వశాత్తూ.

చదువరి said...

అక్కడి చర్చలు చూసాక, ఈ టపాలో వెలిబుచ్చిన కోపం కొంతవరకు సబబే అనిపించింది. అయితే "..సమాజంలోని కింది వర్గాల వాళ్ళే అవహేళనకి గురవుతూ వుంటారో, అది ఒక కమ్యూనికేషన్ రాజకీయ వ్యూహమని మీకు చెప్పకరలేదనుకుంటా" అనే వ్యాఖ్య మాత్రం ఆశ్చర్యం కలిగించింది.

అక్కడి వ్యాఖ్యల్లోని ఎగతాళిని, ఎటకారాన్ని మీరు ఇలా అనువదించబోవటం సబబేనా అని సందేహం కలుగుతోంది.

శరత్ కాలమ్ said...

చదువరి గారన్నట్లే ఆ వ్యాఖ్యలు అఫ్సర్ గారి ఆత్మన్యూనతను తెలియజేసాయి. ఆ న్యూనతంత అవసరం ఇంకా వుందా? దానికి గల కారణాలు ఒక భ్రమనా లేక ఇంకా చెరిగిపోని వాస్తవాలా అన్నది నాకు స్పష్టంగా తెలియకున్నా నేనయితే భ్రమ అనుకునే వైపునే వున్నా. అఫ్సర్ లాంటి వారు ఆత్మ విశ్వాసాన్ని కలిగించాలి కానీ విస్మయం కలిగించారు. అగ్రకులంలో పుట్టాను కాబట్టి మరి నాకలా అనిపిస్తోందో ఏమో కానీ మా నాన్నగారయితే నన్ను చిన్నప్పటి నుండీ నిక్ష్పాక్షిక ధోరణితోనే పెంచారు.

Malakpet Rowdy said...

భరద్వాజ, ఈ పేరెక్కడో విన్నట్టుందే!
________________________

అమ్మ షాడో! దీంట్లోకి నన్ను లాగేద్దామనే?

Malakpet Rowdy said...
This comment has been removed by the author.
Malakpet Rowdy said...
This comment has been removed by the author.
Malakpet Rowdy said...

ఈ రమా భరద్వాజ నేననుకునే ఆవిడే అయితే, "పైటను తగలేసే" ఫెమినిష్టు చచ్చుకవితలకీ, అఫ్సర్ కవితలకి అసలు పోలికే లేదు!

శరత్ కాలమ్ said...

"వికలాంగులూ. మానసిక వికలాంగులు జాలి పడాల్సిన వాళ్ళు కాదు, అందరిలానే ప్రేమకి అర్హులు."

చాలా బాగా చెప్పారు.

ఒక వ్యక్తి మన మీద కోపంతొ కర్ర పుచ్చుకొని మన కాళ్ళు విరగ్గొట్టాడనుకోండి. వాడిని (శారీరక) వికలాంగుడు అనం కదా. దుర్మార్గుడు అంటాం. అలాగే చెడు కామెంట్లు వేసిన వారిని మానసిక వికలాంగులుగా చిత్రీకరించి వారి మీద వున్న ఇప్పటికే వున్న పలు అపోహలను ఇంకా పెంచి ద్వేషం నింపవద్దని జ్యోతి గారు లాంటి వారిని కోరుతున్నాను. దుర్మార్గులని తిట్టడానికి ఇంకా చాలా పదాలు వున్నాయి. వాటిని వాడుకుందాం.

ఇహపోతే ఆమె అభిప్రాయాలు సబబయినవా కావా అన్నది నాకు తెలియని విషయం కానీ రమా భరద్వాజ్ పద్ధతిగానే వ్యాఖ్యానించారు కాబట్టి జ్యోతి గారు ఛీత్కరించినంత ఛీత్కారం అవసరం లేదని నా అభిప్రాయం.

Web Statistics