Thursday, August 12, 2010

పదహారో సదికి మళ్ళీ చలో!




కొన్ని శతాబ్దాలుగా అబద్ధంగానే
బతుకుతున్నా.
ఇప్పుడు నిజం చెబ్తున్నా
నేను పదహరణాల పదహారో శతాబ్దం బిడ్డని.
జర సంజో..అంట గాని
సంజాయిషీలు చెప్పను


నిన్న మొన్న గాలికి కొట్టుకొచ్చిన నీకు
ఈ గల్లీల గుండె చప్పుళ్ళు వినిపిస్తయా?
ఈ మసీదు గోపురాల మీద
గిరికీలు కొట్టి
ఆజాదీని నిజం చేసుకున్న వాణ్ణి
నీ డబ్బు మొహం మోహాలతో ముంచెత్తలేవు


రాజ్యానికి మతం రంగు పులిమినప్పుడల్లా
నా పేగుల్ని ఎర్ర తాయెత్తుగా కట్టుకొని
గోలకొండ గుండెల్లో కూడా నిద్రపోయిన వాణ్ణి
నీ కులం కూతలతో నిద్రపుచ్చలేవు.


జాగారాలు మస్తు చేసిన వాణ్ణి బిడ్డా,
జాగో అని ఢంకా బజాయించే వాణ్ణే కాని
నిద్ర మత్తులో జోగే వాణ్ణి కాను.

కాస్త కాస్త అంటూ
నువ్వు జరజర పాకిన వెయ్యికాళ్ళ పాము

కొంచెం కొంచెం అని బిక్క మొహంతో వచ్చి
నా వొళ్ళూ, ఇల్లూ దిగమింగిన వాడివి నువ్వు

నవ్వు మొహం చిందిస్తూ
నా నెత్తుటితో పండగ చేసుకున్న వాడివి నువ్వు

నా మాటల్లో
నా అక్షరాల్లో
నీ విషమే రంగరించిన వాడివి నువ్వు

ఇప్పుడు
నా గుండె కాయని తెంపి
ఫ్రీజోన్ నజరానా చేస్తావా?

సంజాయిషీలు చెప్పను
సముదాయించి అడగను
కొన్ని శతాబ్దాల అబద్ధాలకి ఇంక సెలవు
పదహారో సదికి మళ్ళీ చలో!

-

3 comments:

Anonymous said...

a mooooooving poem

koduri vijayakumar said...

a moooooving poem

Anonymous said...

wonderful paintings. ekkadivandi ivi?

నిరంతర యుద్ధాల మధ్య సజీవ శంఖారావం

అఫ్సర్ కవితాసంపుటి ‘యుద్ధం మధ్యలో నువ్వు’ రచన:  ఎమ్వీ రామిరెడ్డి  -   ఈమాట నుంచి--   ‘‘సమయం లేదు. యెవరిదగ్గిరా కనీసం అరక్షణం లేనే లేదు. సహనం...