Sunday, February 13, 2011

రోజ్ రోటీ

(ఓ పాత కవిత...కొత్త సందర్భంలో...)
1



వొక ఆకలి మెతుకూ వొక అదనపు లాభం క్రాస్ రోడ్డు మీద నిలబడి పోట్లాడుకుంటున్నాయ్. ఆకలి మెతుకులు లక్షన్నర. అదనపు లాభాలు పది. అయినా సరే, పది గదమాయిస్తుంది, దబాయిస్తుంది, ఘరానా చేస్తుంది. చరిత్రని వ్యాపారం చేస్తుంది. వ్యాపారాన్ని చరిత్ర చేస్తుంది.
ఆకలి మెతుకు

వొక తల్వార్ లాగా మెరిసి వొక నెత్తుటి చార కసిగా ఆక్రోశిస్తుంది.

నీకు అసందర్భంగా కనిపిస్తుందా, కవీ?!

2



నాలుగు సగం చిక్కిపోయిన వూళ్ళు ఆరిపోతున్న చలి నెగడు ముందు కూర్చొని, కట్టెపుల్లల చేతుల్ని నిప్పుల మీదికి తోస్తున్నాయి, చెయ్యి కాల్తుందన్న భయం లేకుండా.

“ఎక్కడున్నాయి ఈ కాసిని కట్టెలయినా? పోనీ, ఈ నాలుగు చేతులయినా?” వొక ముసలి చెయ్యి నిట్టూరుస్తోంది, సగం ఖాళీ అయిన వూరు వైపు బలహీనంగా చూపు చాపి.

“వూరు సగం ఇళ్ళు, సగం వల్లకాడు. బతికి వున్న వాళ్ళు సగం శవాలు” ఇంకో గొంతు పిడచకట్టిన స్వరంతో మూల్గింది.

ఆ మూలుగు వినపడ్డదా, నగర కథకుడా! అద్భుత మాంత్రికుడా!

3



నా అక్షరాలు ఇసుకలో దూదుం పుల్లలు. చొక్కాలు రాల్చుకున్న పిల్లలు. నిద్రలో ఆకలి కేకలు. వొక వూరి నించి ఇంకో వూరికి పారుతున్న ఎండు కడుపులు. వొట్టిపోయిన నదులు. పక్క నించే బల్లెంలా దూసుకుపోయే పరాయి నీటి ధారలు. ఇంకేం లెక్కలు తీస్తావ్, నా ఎండు డొక్కల స్కేళ్ళ మీద.

చడ్డీ నించీ చుక్కల లెక్క నాది. ఇంకేం చెప్పమంటావ్, అధునాతన లెక్కల బుర్ర కథకుడా?!

4



నువ్వు చెప్పు, నేను వింటా, నీ బాంచ! వినీ వినీ నా చెవుల్లో పుట్టలు మొలిచినయిలే! నువ్వు గొంతు సవరించుకునే లోగా నా వొళ్ళు వొంగి దండమయిపోయిందిలే! ఇన్నాళ్ళూ. నిన్ను పీరీలాగా మోశానా, ఇప్పుడు నా కడుపు కర్బలా అయిపోయిందిలే!

చరిత్ర చొక్కాని తిరగేసి తొడుక్కుంటున్నా, నన్ను దాచేసిన చిరుగు కంతల్లోంచి సూర్యుణ్ణి కంటున్నా.

కలల కళల మాయా దర్పణమా, కాసేపు పగిలిపో!

5

రోజ్ రోటీ నా అద్దం. దాంట్లోంచి రాస్తున్నా కొత్త చరిత్ర.

*

(డల్లస్-టెక్సస్ తెలంగాణా సదస్సులో కొన్ని పల్లె బతుకు కథనాలు విన్నాక)

Wednesday, February 9, 2011

వుత్తరాలు దూరాల్ని కలిపే దారాలు!

వంశీక్రిష్ణ లేఖా సాహిత్యం "విదేహ"కి రాసిన ముందు మాట ఇది.

ఎప్పుడో వొక కవితలో రాసినట్టు గుర్తు – వుత్తరాలు దూరాల్ని కలిపే దారాలు – అని!

ఇవాళ వొకే వొక్క సారిగా నీ వుత్తరాలన్నీ చదివాక అనిపించింది, వుత్తరాలు దూరాల్ని కలిపే దారాలే కాదు, తరాల్ని కలిపే, అంతరాల్ని చెరిపే సఖ్యరాగాలు అని!
అవును, సఖ్యత, సహనం ఇవీ ఇవాళ మనకి అత్య్గవసరంగా కావలసిన నిత్యావసర వస్తువులు. నిజానికి ఇక్కడ నేను వస్తువులకి బదులు ‘భావనలు’ అనే పదం వాడాలి. కాని, వుద్దేశపూర్వకంగానే వస్తువు అనే పదం వాడాను. ఎందుకంటే, చూస్తూ చూస్తూ వుండగానే మనం భావనలకి దూరమయి, వస్తువులకి దగ్గిరయ్యాం. ఏదయినా వస్తువుకున్న గౌరవం, విలువా భావనకి లేదు. ఇంట్లో ఫ్రిజ్ కి వున్న విలువ చల్లని మనసుకి లేదు. ప్లాస్మా టివీకి వున్న విలువ మన మధ్య కబుర్లకి లేదు. అందమయిన ఫర్నీచర్ కి వున్న విలువ ఆతిధ్యంలోని ఆత్మీయతకి లేదు.

మనసులు ఇరుకు అయినా పర్లేదు, కాని, ఇల్లు రాజసౌధంలా వుండాలి. మరేమీ ముఖ్యం కాదు, ఇంట్లో వస్తువులు తప్ప. అలాంటి వస్తువుల్ని వుత్పత్తి చేసే శక్తి మాత్రమే గొప్ప శక్తి. ఇతర శక్తులు అసమర్ధుల భావనలు. డబ్బు సంపాదించలేని వాళ్ల సాకులు. చుట్టూ ఏం జరుగుతున్నా సరే, మన ఇల్లు విలాస వస్తువులతో నింపుకుంటే చాలు. వీధులు రక్తసిక్తమవుతుంటాయి. ఈ పూటకి కడుపు ఎలా నింపుకోవాలా అని సగానికి సగం జనం పొట్ట పట్టుకుని, చౌరస్తాల్లో శరీరాలే పనిముట్లుగా అడ్డాలలో నిలబడి వుంటారు. అయిననూ, మన గది భద్రంగా వుంటే చాలు. మన లాభాలు ఎడతెగక పారితే చాలు. మన పాచికలు విజయవిహారాలు చేస్తే చాలు.

ఇలాంటి వస్తు భావనలు మస్తుగా వున్న ఈ కాలంలో – వంశీ, నీ ఆలోచనలు, నీ అనుభూతులు వొకింత విచిత్రంగా వుండక మానవు. ఈ వుత్తరాలు చదువుతున్నప్పుడు చాలా మందికి ఇవి ఎదో చిత్రమయిన లిపిలో కనిపించి, కాసేపు వుక్కిరిబిక్కిరి అవ్వక మానరు. చాలా కాలం క్రితం నా లోపల కవిత్వమనే వొక పురుగు మసిలి సతమతం చేస్తున్న తొలి రోజుల్లో బెజవాడలో మోహన రాం ప్రసాద్ అనే మిత్రుడు – వాక్యం అంటే disturb చెయ్యాలి. వాక్యం అంటే పునాదిమట్టంగా destruct చెయ్యాలి- అని రాసి చూపించాడు వొక చిత్తు కాగితమ్మీద. ఇది తన కవిత్వ motto అని ప్రకటించుకున్నాడు. నిజానికి అది గొప్ప కవిత్వ వాక్యం అని నేనేమీ చెప్పను కాని… ఆ సమయంలో అది వొక మాని ఫెస్టొ లాంటి వాక్యం లాగా అనిపించింది. ఇవాళ వంశీ వుత్తరాలు చదువుతున్నప్పుడు అలాంటి ఆవేశమే కాసేపు పట్టి కుదిపింది. ఈ వుత్తరాల్లోని చాలా వాక్యాలకు వొక కవిత్వ వాక్యానికి వుండాల్సినంత పొగరూ, విగరూ, వగరూ వున్నాయి.

వంశీ మంచి కవి/ కథకుడు/విమర్శకుడు. అతని మనహ్ కార్మికశాల అనేక భావనల కొలిమి. నిజమయిన వూపిరితో, స్వచ్చమయిన మనసుతో వూదీ, వూదీ నిప్పు కణికల్ని మన కళ్ల ముందు మెరిపించే వచనశిల్పి వంశీ. మనకి మంచి వచనం రాసే వాళ్ళు లేరన్నది వాస్తవం. చాలా మంది వచనం పేరుతో మన కళ్ల ముందు పేర్చేది తడి కట్టెలు. అవి చితి పేర్చుకోడానికి కూడా పనికి రావు. వచనం పే రుతో వొట్టి దగా. పోనీ అది కవిత్వమూ కాదు. కవిత్వం పేరుతో ఆత్మ/ పర వంచన. ఎక్కడో ఇంగ్లీషులో చదివిన వాక్యాల్ని తెలుగులో కక్కి మన మనసుల్ని మురికి చేసే ప్రక్రియ. అలాంటి వచన వంచనలకూ, కవిత్వ నేరాలకూ వంశీ మొదటినించీ దూరం. గత రెండు పదులుగా వంశీ రాస్తూ వస్తున్న కవిత్వ, కథా, విమర్శ రచనల్లో ఇది కనిపిస్తున్న సత్యమే. ఇవాళ నేను ప్రత్యేకించి చెప్పక్కరలేదు.



ఈ వుత్తరాల్లో వంశీ ఇంకాస్త బాగా అర్ధం అవుతాడు. ఇన్నాళ్లుగా అతని రచనల అంతరంగంలోని మాటని ఈ వుత్తరాలు ఎలాంటి దాపరికమూ లేకుండా విప్పి చెబుతాయి, రెండు కారణాల వల్ల – వొకటి, వంశీ తనలోకి తాను తొంగి చూసుకునే ఆంతరంగిక వేళ ఇవి రాశాడు. తనలోకి తాను తొంగి చూసుకున్నప్పుడు తనని తానుగా అన్ని బలహీనతలతో, అశక్తులతో, సంశయాలతో , సంకోచాలతో అందుకునే వ్యక్తి కోసం రాశాడు. చాలా సందర్భాలలో ఈ వుత్తరాలు చదువుతున్నప్పుడు నాకు బుచ్చిబాబు ‘అంతరంగ కధనం’ గుర్తుకి వచ్చింది. వంశీ చాలా సార్లు ఈ వుత్తరాల మధ్య చలాన్ని ప్రస్తావిస్తాడు కాని, నిజానికి బుచ్చిబాబులోని ఆ ప్రచండమయిన అంతరంగ తీవ్రతే వంశీలో వుంది. చలం వుప్పెన లాంటి వాడు. వొక్క క్షణం ఆలోచించే వ్యవధి ఇవ్వడు. బుచ్చిబాబు సెలయే రు, తెలియని ఆ వేగంలో, తీవ్రతలో ఆలోచించుకునే నిబ్బరం కాస్త వుంది. వంశీలోనూ ఈ గుణం వుంది, వ్యక్తిగా, రచయితగా.

వంశీ, నేనూ ఇరుగుపొరుగు వూళ్లలో పెరిగాం. ఇరుగుపొరుగు వీధుల్లో చదువుకున్నాం. వొకే చోట కలిసి పని చేశాం. అన్నిటికీ మించి చాలా పుస్తకాలు కలిసి చదివాం, చాలా ఆలోచనలు కలిసి చేశాం. అలా కలిసి పెరగడంలో కొన్ని సంతోషాలూ, కొన్ని దుఖ్ఖాలూ వున్నాయి. ఎవరినించి ఏం తీసుకున్నామో తెలియదు. అలా తీసుకుంటొ, తీసుకుంటొ వొక దశలో అహాలు పెరిగి, వొకళ్లనొకళ్లం క్షమించుకోవడం మానేస్తాం. చుట్టు వున్న వ్యాపార సూత్రాలు అవతలి వ్యక్తి లోని గొప్పతనాన్ని వొప్పుకోనివ్వవు. ఇంతా చేస్తే, మనం వున్నది వస్తుగతమయిన వ్యాపార లోకమే! మిత్రులు శత్రువులవుతారు. లేదా, మిత్రత్వపు ముఖం కింద శత్రుపార్శాన్ని దాచుకుని, నటించడం మొధలు పెడతారు. అలాంటి వ్యాపార వస్తు వంచనత్వం వంశీకి పట్టుబడలేదు.

అంతటా వ్యాపార వ్యామోహమే జీవన శాసనం అయ్యినప్పుడు….అప్పుడేం చెయ్యాలి? ఎవరికయినా మనసు విప్పి వొక వుత్తరం రాయాలి, ఈ మెయిల్స్ , సెల్ ఫోన్స్ , ఫోన్స్ పక్కన పడేసి, పొస్టాఫిస్ కి వెళ్లి, వొక నీలి కవరు కొనుక్కొచ్చి, ఎగశ్వాస, దిగశ్వాస వినపడేట్టు- కొన్ని అక్షరాలు సిరాలోంచి కాగితమ్మీదికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రాలాలి.

అలాంటి అనుభూతి కలగలేదనుకోండి.

అప్పుడు – ఈ వంశీ వుత్తరాలు చదవండి. వాటిల్లో మనసుని తేలిక చేసే చిక్కని ఇరానీ చాయ్ గమ్మత్తు వుంది. చదివాక – ఎంత కాదన్నా కాస్త మనసు తడుస్తుంది.

అప్పటికీ మనసు రాలేదనుకొండి.

అప్పుడు -

ఈ నానా వస్తువ్యాపార పట్టణ మహమ్మారిని వదిలించుకొని – వొక ఆకుపచ్చని దారి గుండా వొక చిన్న వూరికి కాలి నడకన వెళ్ళండి.

ఖమ్మం నించి మధిరకి పాసింజరు బండిలో ఎక్కి, పందిళ్లపల్లి అనే చిన్న వూరి దగ్గిర దిగండి. ఆ వూళ్లో చెట్లకి , ఆ వూరి మధ్య నాటకాల ఆరుబయలుకి ముప్పయ్యేళ్ళ కింద సత్యం అనే పిల్లగాడు తెలుసు. అతని తండ్రికి బడి పిల్లలన్నా, నాటకాలన్నా ప్ర్రాణం కాబట్టీ , ఆ పంతులు గారి అబ్బాయి అని చెప్పండి వివరం కోసం.

ఆ వూరికి నాటకాల కోసం నేను చింతకాని నించి నడుచుకుంటూ వెళ్లిన చిన్నతనంలో ఆ పంతులు గారి అబ్బాయిని మిస్సయ్యాను. చాలా కాలం తర్వాత కలిసినప్పుడు ‘మనం ఇద్దరం వొక వూరి గాలి కలిసి పీల్చాం, వొక వూరి నీళ్లు కలిసి తాగాం. వొక వూరి ఆరుబయలులొ కలిసే ఆ నాటకాలు చూసి వుంటాం,’ అన్నాను. అది అంటున్నప్పుడు కూడా వంశీ ఎవరో నాకు పెద్దగా తెలియదు, ఈ వుత్తరాలు చదివాక తెలిసినంతయినా.

కాని, అది వూహ తెలియని లోకం. బహుశా ఇంకా మనకి వూహ తెలియలేదనే అనుకుంటాను. అప్పుడప్పుడూ ఇలాంటి వుత్తరాలు చదువుతున్నప్పుడు కొన్ని వూహలు తెలుస్తాయి. ఆ పల్లెటూరి ఆకుపచ్చ దారి లా అవి తెరుచుకొంటాయి. కాసేపు పసితనంలోకి వెళ్లి , వూహల స్కేలు మీద వాటి తీవ్రతల్ని ఆనవాలు పడతాం.

అలాంటి వుత్తరాల వూహల ఆనవాళ్లని కానుక చేస్తున్న వంశీకి

…… ప్రేమతో …………….. సరిహద్దుల ఆవలి నించి………………………………..



అఫ్సర్

Friday, February 4, 2011

తెలంగాణ సాహిత్య చరిత్రలో ఒక ‘అపరిచితుడు’

1944తెలంగాణ గ్రామాల్లో ఆంధ్రమహాసభ జెండాలు ఉత్తేజంగా ఎగురుతున్నాయి. ప్రతి గ్రామం ఒక నిప్పుల కుంపటిగా మారుతోంది. నెత్తురు మండి, కాసింత ధిక్కారపు గొంతు ఎత్తిన ప్రతి యువకుడి మీదా రాజ్యం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి ఖమ్మంజిల్లాలోని పిండిప్రోలు అలాంటి ఒక గ్రామం. నిర్బంధాన్ని భరించలేక నిండా రెండు పదులు నిండని ఒక బ్రాహ్మణయువకుడు అరచేతుల్లో ప్రాణాల్ని దాచుకొని భాగ్యనగరం చేరుకున్నా డు భార్యతో. నగరం బతుకు అతనికీ, ఆమెకీ కొత్త. పూటకి ఠికానా లేదు. నిలువ నీడలేదు. అతికష్టంమీద కోఠీలో ఒక ఇరుకుగది దొరికింది. ఆ ఇరుకుగది అతని ప్రపంచమయ్యింది. కాదు, ప్రపంచమే అతని ఇరుకుగదిలో ఇమిడిపోయింది. ఎందరో తెలం గాణ యువరచయితలకు అది కేంద్రమయ్యింది.

అక్కడ తన కలల్ని నిజం చేసే ‘ప్రజాసాహిత్య పరిషత్తు’ని అతను స్థాపించాడు. ఉన్న కొద్దిపాటి డబ్బులతో ఒక బుక్‌స్టాల్ ప్రారంభించి, టాల్‌స్టాయ్,దాస్తవస్కీ లాంటి రష్యన్ రచయితలతో పాటు గొప్ప ఉర్దూ పుస్తకాలు తెప్పించాడు. అవి అమ్మగా వచ్చిన కాసినిడబ్బులతో ఏపూటకి ఆ పూట గడిచిపోయేది. అంతటి దుర్భర దారిద్య్రంలోనూ అతని కవితాత్మ రాజీపడలేదు. ఈ ఇరుకుగదిలో ఉండగానే అతనొక మంచి నవల రాశాడు. అదీ దక్కనీ ఉర్దూలో! ఆ రచయిత పూర్తిపేరు సర్వదేవభట్ల నరసింహమూర్తి. అతని కలంపేరు ‘కవిరాజమూర్తి’. అతను ఉర్దూలో రాసిన నవలపేరు ‘మై గరీబ్ హూఁ’. కవిగా మాత్రమే అందరికీ తెలిసిన సర్వదేవభట్ల నరసింహమూర్తి 1926 అక్టోబర్ నెలలో ఖమ్మంలో జన్మించారు. ఖమ్మంలో నూరేళ్ళ పైబడి చరిత్ర ఉన్న ఆంధ్ర బాలాభివర్థనీ గ్రంథాలయం, విజ్ఞాన నికేతనం ఆయన చదువుకున్న బళ్ళు. ఇప్పుడు ఖమ్మంజిల్లాలో ఉన్న పిండిప్రోలు ఆయన స్వగ్రామం.

తండ్రి వీరభద్రయ్య న్యాయవాది. బాబాయి సర్వదేవభట్ల రామనాథం పెద్ద కమ్యూనిస్టు నాయకుడు. తమ్ముడు విశ్వనాథం ఖమ్మంలో తరువాత మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన న్యాయవాది, గాంధేయవాది. రెండో కొడుకు నరసింహమూర్తిని కూడా న్యాయవాదిగా చూడాలన్నది తండ్రి కల. కాని, నరసింహమూర్తి లోకమే వేరు. ఇంకా ఇరవయ్యేళ్ళు నిండకుండానే అతనిపైన కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం పడింది. ముఖ్యంగా బాబా యి రామనాథం గొప్ప స్ఫూర్తి. తరువాత ఉర్దూ అభ్యుదయకవులు నరసింహమూర్తి దారినే మార్చివేశారు. బాబాయి మాదిరిగా ప్రత్యక్ష కమ్యూనిస్టు రాజకీయాల్లోకి రాలేదు నరసింహమూర్తి. ఉర్దూ కవిత్వం మీద మమకారం పెంచుకుని, ఉర్దూలో కవి త్వం చెప్పడం మొదలుపెట్టాడు.

ఉర్దూలో అతని కవిత్వ పటిమకి మెచ్చి నైజాం సర్కారు ‘ప్రజా కవిరాజు’ బిరుదునిచ్చింది. ఆ బిరుదు అందుకునే నాటికి అతనికి పందొమ్మిదేళ్ళు. నైజాం ఇచ్చిన బిరుదు తరువాత ‘కవిరాజమూర్తి’గామారి స్థిరపడిపోయింది. కమ్యూనిస్టుల ఏరివేత ప్రారంభమయిన తరువాత ఈ పల్లెటూరి యువకుడు హైదరాబాద్ చేరుకున్నాడు. అంతకుముందు, అంటే 1944 ప్రాంతాల్లో కవిరాజమూర్తి ఉర్దూ, తెలుగు భాషలలో విస్త­ృతంగా రచనలు చేసినట్టు తెలుస్తోంది. కాని అవి ఏవీ ప్రస్తుతం అందుబాటులో లేవు. అతికష్టం మీద ఈ వ్యాసరచయితకి అందుబాటులోకి వచ్చిన ‘మై గరీబ్ హూఁ’ నవల తెలుగు అనువాదం (రెండో ముద్రణ -1950) వెనుక అట్టమీద వివరాల ప్రకారం ఆయన ఉర్దూలో రెండు నవలలు, ఒక నాటిక, ఒక జముకుల కథ, గేయాలు ప్రచురించినట్టు ఉంది.

ఉర్దూలో ఆయన రాసిన నవలలు ‘లహూకీ లకీర్’ (రక్తరేఖలు), కవితాసంపుటి ‘అంగారే’ (నిప్పురవ్వలు) కూ డా ఇప్పుడు ఎక్కడా లభ్యమవ్వడం లేదు. ‘మై గరీబ్ హూఁ’ నవల తెలుగు అనువాదం మాత్రం ఖమ్మం సాహిత్యచరిత్రపై పరిశోధన చేస్తున్న నరసింహారావుగారి ద్వారా లభించింది. (ఉర్దూమూలం కోసం పరిశోధకుడు వెతుకుతూనే ఉన్నారు). “మై గరీబ్ హూఁ నవల మీరు తెలుగులో చదివితే మీకు ఆ జోష్ (ఊపు)రాదు. అది ఉర్దూలో చదవాలి,అందునా మూర్తిగారు చదువుతుంటే నాకు కళ్ళనీళ్ళు ఆగేవి కావు” అన్నారు కవిరాజమూర్తిగారి భార్య వరలక్ష్మి. డెబ్బయ్ ఆరే ళ్ళ వరలక్ష్మిగారు ఈ నవల పేరు ప్రస్తావించగానే ఒక గొప్ప ఉత్సాహంతో అప్పటి సాహిత్య విశేషాలు చాలా చెప్పారు. నవలలోని కొన్ని సంభాషణల్ని అలవోకగా వినిపించారు. అంతేకాదు, 1946-1950 మధ్య హైదరాబాద్ తెలుగు- ఉర్దూ రచయితల ఉమ్మడి సాంస్క­ృతిక జీవన విధానాన్ని గురించి ఆమె చెప్పిన ప్రతి అంశం తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణానికి ఒక సాధనమే! అంత వృద్ధాప్యంలో కూడా అప్పటి ఉమ్మడి జీవనశైలి ఎలా ఉండిందో ఆమె అనేక జ్ఞాపకాల మధ్యచెప్పుకుంటూ వచ్చారు.

ఊరు వదిలి భాగ్యనగరానికి…!
’1942, 1946,1949, 1950… ఇవి నా జీవితంలో మరిచిపోలేని సంవత్సరాలు. 1942లో (అంటే అప్పటికి మూర్తిగారికి పదహారేళ్ళు) మూర్తిగారితో నా పెళ్ళయింది. పెళ్ళయిన మూ డేళ్ళు మాత్రమే మా జీవితంలో సంతోషంగా సాగిన రోజులు. 1946లో ఖమ్మంలో పెద్ద ఎత్తున ఆంధ్రమహాసభ జరిగింది. సుందరయ్యగారు వచ్చారు. చుట్టుపక్కల ఊళ్ళనుంచి వేలకొద్దీ జనం బండ్లు కట్టుకుని వచ్చారు. గొప్ప సభ జరిగింది. కాని మూర్తిగారి జీవితం ప్రమాదంలో పడింది. ఆయన్ని కమ్యూనిస్టు అన్న కసితో ఒక హత్యకేసులో ఇరికించారు. ఇల్లూవాకిలీ ఊరూ వదిలి పొట్టచేతపట్టుకుని హైదరాబాద్ చేరాం. హైదరాబాద్‌లో ఎట్లాబతికామో మాకే తెలీదు. ఈ పూట రొట్టి దొరుకుతుందా,దొరకదా అని ప్రతిపూటా నరకం. కాని మూర్తిగారికి సాహిత్యమే పెద్ద జీవితం. ఆయన ఉర్దూ సాహిత్య జిజ్ఞాస ఎందరినో స్నేహితుల్ని సంపాదించిపెట్టింది.

ఉర్దూ కవులూ,రచయితలతోపాటు బెల్లంకొండ రామదాసు, రెంటాల, అబ్బూరి వరదరాజేశ్వరరావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, దేవులపల్లి రామానుజరావులాంటి వాళ్ళంతా ఆ ఇరుకుగదికి వచ్చిపోతుండేవాళ్ళు. నేనూ ఒక మూల కూర్చొని వాళ్ళ మాటలన్నీ వింటూండేదాన్ని. కొద్దికాలానికి- అంటే 1949లో గిడుతూరి సూర్యంగారు హైదరాబాద్ కుద్బీగూడలో పద్మశాలి ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. అప్పుడే ‘ప్రజాసాహిత్య పరిషత్తు’ కూడా ఏర్పడింది. తరువాత మూర్తిగారికి నృపతుంగ హైస్కూల్లో తెలుగుపండితుడి ఉద్యోగం అయ్యింది. ఆ సమయంలోనే సుల్తాన్‌బజార్‌లో ‘మూర్తీస్ బుక్‌హౌస్’ పేరుతో బుక్‌స్టాల్‌పెట్టారు. కేవలం ఇంగ్లీషు పుస్తకా లు మాత్రమే బొంబాయినుంచి తెప్పించి అమ్మేది. అలా తెప్పించిన పుస్తకాలలో కొన్నాయన నాకు చదివి వినిపించేవారు. ‘అన్నా కెరెనీనా’ ఆయన చదువుతూండగా విన్నవాటిల్లో నాకు నచ్చిన గొప్ప పుస్తకం.

రచన ఒక జ్వరవేదన!
అదే సమయంలో మూర్తిగారు ఉర్దూలో ఏదో రాయడం మొదలుపెట్టారు. ‘ఇది పెద్ద నవల. దక్కనీలో రాస్తున్నా’ అంటూ రోజుకి కొన్ని పేజీలు చదివి వినిపించేవారు. అది రాస్తున్నంత కాలం ఆయన మూర్తీభవించిన అశాంతిలా ఉండిపోయారు; ఏదో జ్వరం వచ్చినట్టే! ఈ నవల ఎప్పుడు పూర్తవుతుందా అని బెంగపెట్టుకునే దాన్ని. కాని ఆయన ఉర్దూలో అది చదువుతున్నంతసేపూ విపరీతమైన ఉద్వేగానికి లోనయ్యేదాన్ని. ఏదో మంత్రించినట్టుగా కళ్ళప్పగించి వింటూ వుండిపోయేదాన్ని. ఆ భాష, ఆ ప్రవాహం, ఆ వేగం… ‘వినడం కాదు, మాట్లాడు….’ అనేవారాయన. మూర్తిగారు కవిత్వం చాలా రాసినా అది ఎప్పుడూ నాకు వినిపించేవాళ్ళు కాదు. కాని, నవల ప్రతి పేజీ రాసింది రాసినట్టుగా ఏ రోజుకి ఆరోజు వినిపించేవారు.

అలా వినిపించకపోతే ఆయనకి కలం ముందుకి సాగేది కాదు. పైగా ప్రతిపేజీ మీదా ఇద్దరం చాలా సేపు మాట్లాడుకొనేవాళ్ళం”. ఆశ్చర్యంగా నవలలోని ప్రతిభాగం ఇప్పటికీ ఆమెకి కళ్ళకి కట్టినట్టుగా గుర్తుంది. ముఖ్యంగా ‘మై గరీబ్ హూఁ’ అనే వాక్యం పునరుక్తి అయిన ప్రతిసారీ ఆ వాక్యం చుట్టూ మూర్తిగారు అల్లిన సన్నివేశాల్ని ఆమె బాగా గుర్తుంచుకొని చెప్పారు. కాని, ఆమె దగ్గర ఈ నవల తెలుగు అనువాదం లేదు. ‘ఒక్క ఊళ్ళోనూ స్థిరంగా ఉండకపోవడం వల్ల ఎక్కడి పుస్తకాలు అక్కడే పోయాయి. చివరికి ఆయన రచన ఒక్కటీ మా దగ్గర మిగల్లేదు’ అన్నారామె. నా చేతుల్లో ఉన్న ‘మై గరీబ్ హూఁ’ జిరాక్సు ప్రతిని చేతుల్లోకి తీసుకుని, ఆమె కొద్దిసేపు ఆ పుస్తకా న్ని అప్యాయంగా తాకుతూ ఉండిపోయారు.

చాలాసేపు మా ట్లాడిన తరువాత ‘నా దగ్గర మూర్తిగారి ఒకే ఒక పుస్తకం మిగిలింది. అది మీకు ఇస్తాను. తీసుకెళ్ళండి’ అంటూ లోపలకి వెళ్ళి, అతి శిథిలావస్థలో ఉన్న ఒక చిన్న పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఆ పుస్తకం పేరు ‘మార్పు’. అది 1949లో మూర్తిగారు రాసిన నాటిక. తెలంగాణలోని గ్రామాల్లో ఈ నాటిక ప్రదర్శించేవారనీ, జనం బాగా వచ్చేవారనీ ఆమెచెప్పారు. ‘మై గరీబ్ హూఁ జిరాక్సు నాకు ఇవ్వండి దయచేసి. మా వద్దలేదు’ అన్నారామె. సంభాషణలో చాలాసేపు ఆమె ఈ నవల గురించి మాట్లాడడానికి ఆసక్తి చూపించారు. ‘అది ఉర్దూలో సంపాదించి, చదవండి’ అని పదేపదే చెబుతున్నప్పుడు ఉర్దూ మూలరచన ఆమెపై ఎంత ప్రభావం కనబరిచిందో తెలుస్తూనే ఉంది. ‘మూర్తిగారు తెలుగులో బాగా రాయగలిగి ఉండీ,ఈ నవలని ఉర్దూలోనే ఎందుకు రాశారు?’ అడిగాన్నేను. ‘ఆయన ఏం రాసినా ముందు ఉర్దూలో రాసేవారు. కవిత్వం, కథ, వ్యాసం ఏదైనా కానివ్వండి.తన భాష ఉర్దూ అని స్పష్టంగా చెప్పేవారు.

ఆయన తెలుగులో రాయడం మొదలుపెట్టింది చాలా కాలం తరువాత. తెలుగులో రాసినా, అదీ ఉర్దూ ప్రభావం తోనే. ఉర్దూ కవుల గురించీ, లేకపోతే వాళ్ళ అనువాదాలే. వ్యక్తిగతంగా నాకు కూడా ఆయన ఉర్దూలో రాస్తున్నప్పుడు చాలా సౌకర్యంగా ఉండేవారని అనిపించేది. ఆయన వ్యక్తిగా ఎంతో ఉద్వేగశీలి. లోపల చాలా అశాంతి ఉండేది. దానికి అనువైన తీవ్రతా, పదునూ ఉర్దూలో ఉండివుండవచ్చు. పైగా, ఇంటికి ఎవరొచ్చినా ఉర్దూలో వ్యవహా రం నడిచేది. తెలుగులో మొదలైనా, కాసేపట్లో ఉర్దూ దానికదే వచ్చేసేది. ఆయన ఉర్దూలోనే ఆలోచించేవారు. అందుకే, ఆయన తెలుగు రచనల్లోని వాక్యనిర్మాణం కూడా ఉర్దూ ప్రతీకలూ పదచిత్రాలతో నిండి ఉండేదనుకుంటా’. ‘ఈ నవల తెలుగు అనువాదం ఎప్పుడొచ్చింది?’ ‘కనీసం ఏడాది తరువాత, 1950లో నవల అచ్చయింది.

నా అంచనా ప్రకారం ఈ నవల 1948 ప్రాంతాల్లో రాసి ఉంటారు. గిడుతూరి సూర్యంగారు ‘పద్మశాలి ప్రింటింగ్‌ప్రెస్’ పెట్టిన తరువాత తెలుగులోకి అనువదించాలన్న ఆలోచన వచ్చింది.’ ‘ఈ నవల ఆయన మిత్రులు చదవడం,చర్చించడం చేశారా?’ ‘లేదు. ఉర్దూ కవిత్వంగురించి చాలాసేపు చర్చలు జరిగేవి. ఈ నవల ఆయన ఒక స్వగతంలాగా రాసుకున్నారు. తన జీవితం, తన సమాజం, తనకి ప్రభుత్వం మీద ఉన్న ఆగ్రహం… బహుశా… ఈనవల గురించి ఆయన నాతోనే ఎక్కువగా మాట్లాడి ఉంటారు. తెలుగులో ఈనవల అచ్చులోకి వచ్చిన తరువాత, అంటే 1950లలో మళ్ళీ ఆయన మీద నిర్బంధం పెరిగింది. మళ్ళీ ఊరు మారాం.తాండూరు వెళ్ళిపోయాం. ఏడాది తరువాత పటాన్‌చెర్వులో వ్యవసాయశాఖలో ఉద్యోగం దొరికింది.అప్పటిదాకా ప్రాణభయంతోనే బతికారు.

1949 ప్రాంతాల్లోనే ఉర్దూలో ‘తెలంగాణ’ అనే ఒక పక్షపత్రిక నడిపారు. అది పోలీసుచర్య తరువాత ఆరునెలలపాటువచ్చింది’. ‘శ్రీమంతుల కుటుంబంలో పుట్టిన మూర్తిగారు ‘గరీబు’పక్షం ఎందుకు చేరారు?’ ‘కమ్యూనిస్టు పార్టీప్రభావమే! బాబాయి రామనాథం అంటే ఆయనకు ప్రాణం. శ్రీమంతుల కుటుంబంలోపుట్టారన్న మాటేగానీ, ఏనాడూ భోగభాగ్యాలు అనుభవిం చింది లేదు. మేం పిండిప్రోలు నుంచి హైదరాబాద్ పోయేటప్పటికి ఆయనకి ఇరవయ్యేళ్ళలోపే! 1954 వరకూ మళ్ళీ ఖమ్మం మొగమే చూళ్ళేదు. ఇంక ఆ సంపద ఉందో పోయిందో చూసుకున్నదీలేదు. తరువాత ఆయన పార్టీని వదిలివేశారు.కాని,పార్టీభావాల్ని మాత్రం వదల్లేదు. ‘మై గరీబ్ హూఁ’ నవలలో మీకు ఈ విషయం అతి తేలి గ్గా అర్థమైపోతుంది.అందులో పేదవాడు పడ్డకష్టాలేవీ ఊహల్లోంచి పుట్టినవి కావు. ఆయన అనుభవంలోనివే! ఆకథలోని ప్రధానపాత్రధారి’అపరిచితుడు’ ఆయనే.

‘ఈ నవల తరువాత, మళ్ళీ ఖమ్మంవచ్చాక ఆయన ఎక్కువగా ఏమీరాయలేదా?’ ‘రాశారు.కాని తెలంగాణ ఉద్యమం ముందూ వెనకా ఉన్న రచనల్లోని తీవ్రతవాటిల్లోలేదు. ఆయన రచయితగా ఒక సైనికుడిలాంటివారు. యుద్ధసమయం అయిపోయాక, ఆయన ప్రధానంగా అనువాదాల్లోకి వెళ్ళిపోయారు. మనిషిలో నిదానం వచ్చింది.నిబ్బరంగా కవిత్వం రాసుకున్నారు’ వరలక్ష్మిగారితో మాట్లాడాక, కవిరాజమూర్తి నవలని మరోసారి చదివాను. ఒక నవల సమకాలీన సమాజాన్నిగురించి ఎన్ని విధాలుగా, ఎన్ని స్వరాలలో మాట్లాడుతుందో అర్థమైంది. సమాజం చీలుదారుల్లో నిలబడిన రచయిత ఎన్ని విషయాలు చూడగలడో, వాటికి ఎంత లోతయిన భాష్యం ఇవ్వగలడో అర్థమైంది. ఒక నవల సాంఘిక చరిత్రగా మారి, అప్పటి అనేక భౌతిక,మానసిక స్థితిగతులకు ప్రతిఫలనం ఎలా అవుతుందో తెలిసివచ్చింది. అన్నింటికీ మించి- ఈ నవల ప్రధానంగా చర్చకిపెట్టిన అంశం:-మతం. ఇప్పుడు ముస్లిం భాషగా ముద్రపడిపోయిన ఉర్దూలో ఒక ముస్లిమేతరుడైన రచయిత ఇస్లాంనీ, నైజాం పాలనలోని ‘ఇస్లామీకరణ’నీ ఎట్లా అర్థం చేసుకున్నాడని వేరే చర్చ.

(ఆంధ్ర జ్యోతి సాహిత్య వేదిక, 2007)

గమనిక: ఈ రచయితకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం నేను చూస్తున్నాను. ఎవరి దగ్గిర అయినా ఈ రచయిత ఇతర రచనలు గాని, ఏ చిన్నపాటి వివరం గానీ వుంటే అందించి సహకరించగలరు)

Thursday, January 27, 2011

ఉషా మాధవం...శాన్ అంటోనియో సంక్రాంతి సంబరం!








పోయిన వారం శాన్ ఆంటోనియో సంక్రాంతి సంబరాలకి వెళ్ళాం. మూడు గంటలకు పైగా జరిగిన ఈ సంబరాల్లో తెలుగు వాళ్ళు పాటలు పాడారు, నృత్యాలు చేశారు, తెలుగు దేశంలో సంక్రాంతి నిజంగా అంత బాగా చేసుకుంటున్నారో లేదో తెలియదు కానీ, శాన్ ఆంటోనియోలో వున్న ఆ మూడు గంటలూ తెలుగు దేశపు సంక్రాంతి శోభని తలచుకునేలా చేశారు. అన్నిటికి కంటే నాకు బాగా నచ్చింది – గోవిందరాజు మాధవ రావు గారిని శాన్ ఆంటోనియో తెలుగు వాళ్ళు సత్కరించడం! ఇది కూడా మాధవరావు గారికి తెలియకుండా ఒక “సర్ ప్రైజ్” లాగా చేశారు మూర్తి గారు. ఈ “సర్ ప్రైజ్” కోసం రెండు నెలలు ముందు మమ్మల్ని సిద్ధం చేశారు. మామూలుగా శాన్ ఆంటోనియో ఎప్పుడు వెళ్ళినా మాధవరావు గారి ఇంట్లో దిగే మేం, ఈ ‘సర్ ప్రైజ్’ లో భాగంగా మాగంటి ఉష (ప్రముఖ రచయిత మాగంటి కోటేశ్వర రావు గారి అమ్మాయి) ఇంట్లో దిగాం.

టెక్సాస్ లో తెలుగు వాళ్ళకి శాన్ ఆంటోనియో అంటే వెంటనే గుర్తొచ్చే పేరు గోవింద రాజు మాధవరావు! టెక్సస్ లో ఎక్కడయినా ఏ తెలుగు వేడుకయినా, తెలుగు వాళ్ళకి సంబంధించిన కార్యక్రమమయినా జరిగితే అక్కడ గోవిందరాజు మాధవ రావు గారి కుటుంబం వుండి తీరుతుంది. మాధవరావు గారు ఒక్కరే కాదు, ఆయనతో పాటు ఉష గారు! వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరి పేరు మినహాయించినా అది అసంపూర్ణంగా వుంటుంది. వాళ్ళిద్దరూ కలిసి చేసే సేవల్లో ఎవరికెంత వాటా దక్కాలి అన్నది అంత తేలికగా తేలే విషయం కాదు. కానీ, ఉష గారికి సింహ భాగం దక్కాలని నా వాదన అనుకోండి. (మేము శాన్ ఆంటోనియో వెళ్ళినప్పుడల్లా ఉష గారు మా కోసం దోసకాయ పచ్చడి వొక సీసాడు ఇస్తారన్న రహస్యం కూడా ఇందులో వుందనుకోండి. ఆ దోసకాయ పచ్చడి వేసుకుని తిన్నప్పుడల్లా మేము ఉష గారిని తప్పక తలచుకుంటాం కాబట్టి మాకు కొంచెం ఉష గారి పక్షపాతం. ఇక వాళ్ళిద్దరి కనుపాపలు సంజాత, స్వపంతి ఎక్కువ అమెరికాలోనే పెరిగినా అచ్చ తెలుగు ఆడపిల్లలు)

అమెరికాలో పేరుకి చాలా మంది తెలుగు సమాజ సేవకులు వున్నారు. కొంత మంది స్వయం ప్రకటిత కాగితప్పులులూ వున్నారు. వాళ్ళ సేవలు కాగితాలకే పరిమితం. అమెరికా తెలుగు సమాజం అంటూ పెద్ద కబుర్లు చెప్తారు, రాస్తారు, ఆంధ్రా వెళ్ళి వూదర కొట్టుకుంటారు. కానీ, చిన్న సాయం అందించడానికి చేయి ముందుకి రాదు. (అది ఎప్పుడూ ప్యాంటు జేబుల్లోనో, కోటు జేబుల్లోనో కూరుకు పోయి వుంటుంది). వీళ్ళు మహా అయితే, పదవుల కోసం పోటీ పడ్తారు. తెలుగు సంస్కృతికి తామే పదహారణాల ప్రతినిధులమని బోర్డులు పెట్టుకుంటారు. అలాంటి హంగూ ఆర్భాటం ఏమీ లేకుండా, ఒక చేత్తో చేసిన సాయం ఇంకో చేతికి కూడా తెలియకుండా సాయపడే వ్యక్తులు తక్కువ.

నిశ్శబ్దంగా తమ కృషి తాము చేసుకుంటూ వెళ్ళే మాధవరావు గారి కుటుంబం పెద్ద కబుర్లు చెప్పే కుటుంబం కాదు. తెల్లారి లేచి పేపర్ లో పేరు పడిందా లేదా అని వెతుక్కునే రకం కాదు. ఏ సంఘంలో తమకి ఎంత హోదా ఇచ్చారని లెక్కలు వేసుకునే వాళ్ళు కాదు. అక్కర వున్న వారికి వెంటనే నిస్సంకోచంగా సాయం అందించడం వొక్కటే వాళ్ళకి తెలుసు. మేం టెక్సాస్ వచ్చి మూడేళ్లే అయ్యింది. కానీ, ముప్పయ్యేళ్లుగా టెక్సాస్ లో వున్న తెలుగు వాళ్ళు ఈ విషయం ఇంకా బాగా చెప్పగలరు.

వరంగల్ దగ్గిర హనమ కొండ మాధవరావు గారి సొంతూరు. అక్కడ ఆర్. ఈ. సి. లో ఆయన చదువుకున్నారు, తరవాత విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటరులో పనిచేశారు. 1991 లో అమెరికాలో అడుగుపెట్టారు. ప్రవాస తెలుగు సంఘాలతో ఆయన అనుబంధం త్రివేండ్రం నించి మొదలయ్యింది. 1979 లో ఆయన త్రివేండ్రం సాంస్కృతిక సంఘానికి కార్యదర్శిగా వుండే వారు. శాన్ ఆంటోనియో వచ్చాక ఆయన టెక్సాస్ సాహిత్య సదస్సులలో పాల్గొనడం మొదలు పెట్టారు. మొదటి నించీ సాహిత్యం పట్ల వున్న అభిరుచి వల్ల సాహిత్య సదస్సులలో ఆయనకి క్రియాశీలక పాత్ర దక్కింది. టెక్సాస్ వచ్చిన తెలుగు రచయితలని ఎవరినయినా ఆయన మొదట శాన్ ఆంటోనియో తెలుగు వారికి పరిచయం చెయ్యడం మొదలు పెట్టారు. ఆ విధంగా స్థానికంగా సాహిత్య, భాషాభిమానాన్ని పెంచే కృషి శాన్ ఆంటోనియోలో మొదలయ్యింది. టెక్సాస్ యూనివర్సిటీ తెలుగు కమిటీలో ఆయన టాస్క్ ఫోర్స్ సభ్యుడు. అంతే కాదు, తెలుగు భాషలో బాగా ప్రతిభ కనబరచిన ఇద్దరు విద్యార్ధులకి టాసా (శాన్ ఆంటోనియో తెలుగు సంఘం) తరఫున ఏటా రెండు స్కాలర్షిప్పులు ఇప్పిస్తున్నారు. మొట్ట మొదటి సారి 2007 లో పెద్ద ఎత్తున తెలుగు నాటకోత్సవాలు కూడా నిర్వహించారు. ఒక తెలుగు వ్యక్తి గానే కాక, ఒక శాస్త్రవేత్తగా టెక్సాస్ లో ఆయన వివిధ శాస్త్ర సంఘాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.

ఉష గారు మొదటి సరిగా శాన్ ఆంటోనియో లో తెలుగు బడి మొదలు పెట్టారు. మొదట కొద్ది మంది పిల్లలతో మొదలయిన తెలుగు బడిలో ఇప్పటి దాకా కొన్ని వందల మంది పిల్లలకి తెలుగు నేర్పారు. మొన్న సంక్రాంతి వేడుకలలో తెలుగు బడి పిల్లలు మంచి జోకులు చెప్పి, అందరినీ కడుపుబ్బ నవ్వించారు. తెలుగు పాటలు పాడి, తెలుగు నృత్యాలు చేసి కనువిందు/ వీనుల విందు చేశారు. (అసలు విందు కూడా చాలా బాగుందండోయ్! పూర్ణాలూ, చక్ర పొంగలి, పులిహోర, పెరుగు మిరపకాయలూ వగైరా నా ఫావరైట్)

శాన్ ఆంటోనియోలో గోవిందరాజు కుటుంబం నాటిన తెలుగు మొక్క ఇప్పుడు పెరిగి పెద్దదయింది. ఆ తరం నించి ఈ తరానికి ఈ స్ఫూర్తిని అందించడానికి ఉత్సాహం ఉరకలేసే పాటమళ్ళ మూర్తి గారు, నిత్యయవ్వనోత్సాహి అడివి వెంకటేష్ లాంటి వారు ముందుకు వస్తున్నారు. స్నేహం, సౌజన్యం, సమానవత్వం ముప్పేటగా కలిసి పోయిన మాధవిజాన్ని, మాధవ మానవ ధ్వజాన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి ఈ తరం ముందుకు వస్తోంది. వారికి స్వాగతం. నోరు మంచిదయితే వూరు మంచిదవుతుందంటారు, నోరే కాదు చెయ్యి, మనసు కూడా మంచిది కావాలి. అది నిరూపించుకున్నారు శాన్ ఆంటోనియో తెలుగు వాళ్ళు!

Thursday, January 20, 2011

నా టీనేజర్లు!




వున్నట్టుండి ఓ రోజున వాళ్ళు
వాళ్ళ గదుల్లోకి మాయమయి పోతారు.

తలుపులూ పెదాలూ మూతపడతాయి
ఇక ఇంట్లోనే
వొకరికొకళ్ళం అపరిచితులవుతాం.

బయట గదిలో పచార్లు చేస్తుంటా
వాళ్ళ గుసగుసలే వినిపిస్తాయి
ఆ రహస్య భాషేదో నాకు తెలుసు
కానీ ఇప్పుడేమీ గుర్తు లేదు

అదీ నేను నేర్పిన భాషే కదా!


కొన్నేళ్ల తరవాత తలుపు తెరుచుకుంటుంది
మళ్ళీ చూస్తాను ఆ ముఖాలని,
వొకప్పుడు నా అరచేతుల్లో దాచుకున్న ముఖాల్ని,
నా చేతుల్లో పొద్దు తిరుగుడు పూలయి విచ్చుకున్న ముఖాల్ని.


అవి నాకు పరిచితమయిన చర్మాలే!

కానీ
ఇప్పుడు నిటారుగా నిలబడిన దేహాలు
ముత్యాల్లా మెరుస్తూ
నన్ను దాటుకుంటూ వెళ్లిపోయే దేహాలు!





(మూలం: పాట్ మొరా - టెక్సాస్ ఎల్ ఫాసో లో పుట్టిన కవయిత్రి. కవిత్వం, స్మృతులుగా మెక్సికన్ అమెరికన్ స్త్రీల జీవితాన్ని రికార్డు చెయ్యడానికి మొరా ప్రయత్నిస్తోంది. పిల్లల కోసం ఎక్కువగా రాసింది. ఆమె జీవితం కేవలం కవిత్వానికి పరిమితం కాదు,కవిత్వం ఆమెకి వొక సాధనం మాత్రమే.)

Monday, January 17, 2011

నాన్నగారు...మళ్ళీ వస్తారా?




ఇవాళ నాన్నగారు కన్ను మూసిన రోజు.

ఆయనది ఊహించని మరణం. ఆయన అలా మృతశరీరంతో పడివుండడం వొక మాయ అనీ, వున్నట్టుండి మళ్ళీ ఏదో వొక రోజు నవ్వుతూ ఆయన అలా నడుచుకుంటూ వెనక్కి వచ్చేస్తారని చాలా కాలం వొక దిగ్భ్రమలో, భ్రమ లాంటి నమ్మకంతో వుండే వాణ్ని.

చనిపోయినప్పుడు ఆయన వయసు 57 ఏళ్లు. అసలు లోకానికి ఏమీ చెయ్యని వాళ్ళు నూరేళ్ళు బతుకుతున్న పాడు కాలంలో అలాంటి వాళ్ళ ఆయుషు అంతా నాన్నగారికి వచ్చేస్తే బాగుండు అని స్వార్ధంగా, క్రూరంగా అనుకుంటూ వుండే వాణ్ని చాలా కాలం! నా స్పృహా, నా చైతన్యం, నా చదువూ అన్నీ బిక్కచచ్చిపోయిన ఆ మరణానంతర విషాద కాలంలో!

కానీ, మృత్యువుకి నా ఉద్వేగాలేవీ లేవు, తెలియవు కూడా !

అది మనిషిని వొకానొక జ్ణాపకంగా మాత్రమే మిగిల్చే కరకు వాస్తవం!

*
నాన్నగారిని తలచుకోగానే ముత్యాల కోవలాంటి ఆయన తెలుగక్షరాలు గుర్తొస్తాయి నాకు.

చిన్నప్పటి మా బడి గోడ మీద వొక దినపత్రిక సైజులో నాలుగు పేజీల గోడ పత్రిక “మధురవాణి” గుర్తొస్తుంది. ప్రతినెలా బడిపిల్లల కవితలూ, కథలూ, చిరు వ్యాసాలతో ఆ నాలుగు పేజీలను ఆయనే స్వహస్తాలతో రాసేవారు. ఆ పత్రిక గోడ మీద అతికించిన రోజు మా అందరికీ పెద్ద పండగే! నాలుగో తరగతి నించి పదో తరగతి పిల్లల దాకా ఆ పత్రికని ఆసాంతం చదివే వారు. అంతే కాదు, ఆ పత్రికలో తమ పేరు చూసుకోవాలని ఉత్సాహపడే వాళ్ళు. స్కూల్ లో నాన్నగారికి ఎంత పేరుండేదంటే – ఆ రోజుల్లో “కౌముదీ పిక్చర్స్” బానర్ కింద వచ్చే సినిమాలన్నిటికీ నాన్నగారే కథలూ, కవిత్వం రాసేవారని వాళ్ళు అనుకునేవాళ్ళు. “అబ్బే అది నేను కాదురా!” అని ఆయనెంత చెప్పినా వాళ్ళు వినే వాళ్ళు కాదు. వాళ్ళకి రచయిత అన్నా, కవి అన్నా ఆయనొక్కరే! చిన్న వూళ్లలో వుండే పెద్ద నమ్మకాల్లో ఇదీ వొకటి! నాన్నగారు ఇంకా వివరించబోతే, “లేకపోతే, ఆ సినిమా వాళ్ళు “కౌముది” అని మీ పేరెందుకు పెట్టుకుంటారు సార్!” అనే వాళ్ళు.
కౌముది అనే పేరుతో అప్పటికి నాన్నగారి నవలలు రెండు వెలువడ్డాయి. ఒకటి: కళంకిని, రెండు: విజయ. సుంకర, వాసిరెడ్డితో కలిసి ఆయన అనువదించిన ‘రంగభూమి” విశాలాంధ్ర వాళ్ళు అనేక ఎడిషన్లు వేశారు. విశాలాంధ్ర, ఆంధ్రజ్యోతి దినపత్రికలలో ఆయన కవిత్వమూ, కథల అనువాదాలు ఎక్కువగా వస్తున్న కాలం అది. అభ్యుదయ రచయితల సంఘం ఖమ్మం జిల్లా శాఖకి ఆయన అప్పటికే అధ్యక్షులుగా వున్నారు. కమ్యూనిష్టు పార్టీ వారి ఆంధ్రప్రదేశ్ యువజన సమాఖ్య వారి పత్రిక “యువజన” ని సాహిత్య పత్రికగా తీర్చిదిద్దిన సంపాదకవర్గంలో ఆయన వున్నారు.
చింతకాని ఖమ్మం జిల్లాలో చాలా చిన్న వూరు. పాసింజరు బండి దిగి అయిదు మైళ్ళు నడిస్తే కానీ, అసలు వూరు రాదు. కానీ, ఆ చిన్న వూరే ఆయన సాహిత్య కేంద్రం అయ్యింది. మా ఇల్లు నిత్యం రచయితలూ, కవుల రాకపోకల్తో సందడిగా వుండేది. ప్రతి నెలా ఎవరినో వొకరిని పిలిచి బడిలో ప్రసంగాలు ఇప్పించే వారు నాన్న. అలా దాశరథి, పెద్దిభొట్ల, హీరాలాల్ మోరియా, కవిరాజమూర్తి ఇలా ఎందరో నేను నాలుగో తరగతిలో వుండగానే ముఖాముఖీ తెలుసు. వాళ్ళ పద్యాలూ, కథలూ మా పిల్లలందరికీ కంఠోపాఠం.

ఉపాధ్యాయ వృత్తిని కేవలం ఉద్యోగంగా ఆయనెప్పుడూ భావించలేదు. ఆయన పేరుకే హిందీ పండిత్ గానీ, తెలుగు, ఇంగ్లీషు పాఠాలు కూడా చెప్పేవారు. వొక్క లెక్కలు తప్ప అన్నీ చెప్పే వారు. ఆ రకంగా విద్యార్ధులందరికీ అందుబాటులో వుండే సార్ అనే పేరుంది. ఏ విద్యార్థి ఎప్పుడు వచ్చినా సమయం చూసుకోకుండా పాఠం చెప్పడానికి సిద్ధమయే వారు. ఆ రకంగా చాలా మంది విధ్యార్ధులకి మా ఇల్లు, మా ఇంట్లో పుస్తకాలు అన్నీ మావే మావే అనే భావం వుండేది.

అప్పట్లో బడిపంతులు అంటే ఇప్పటి మాదిరి పెద్ద జీతాలు లేవు. బతకలేని బడిపంతులు అన్నది నిజం! పైగా, మాది పెద్ద కుటుంబం. అమ్మ తెల్లన్నం వండిందీ అంటే ఆ రోజు పండగో పబ్బమో అయ్యి వుండాలి! లేకపోతే, జొన్నన్నం, గోంగూర పచ్చడే రోజూ! లేదంటే, సజ్జ రొట్టెలు! ఇక కొత్త బట్టల జత ఏడాదికి వొకసారి. చాలా కష్టంగా గడిచేవి రోజులు. కానీ, ఇంట్లో ఏదో వొక ఉత్సాహం నిరంతరం తరగలెత్తినట్టుండేది. చుట్టూ బోలెడు పుస్తకాలు, ప్రతి వారం ఎవరో వొకరు చుట్టాలు, స్నేహితులు ఇంట్లో అతిధులుగా వుండే వాళ్ళు. కబుర్లూ, కథలూ, పాటలూ...హోరెత్తినట్టుండేది ఇల్లు. మేం పట్టణం అంటే ఖమ్మం వెళ్ళే దాకా ఆ ఉత్సాహం అలా కొనసాగింది.


*
చింతకాని నా బాల్యానికి పునాది. నాన్నగారి యువకోత్సాహానికి సంబరం. కవిత్వంలాగా బతకడం అంటే ఏమిటో తెలిసినట్టే వుండేది ఆ కాలంలో అంత పేదరికంలో కూడా!

కానీ, తెలియని వొక దుఖం ఏదో ఆయన లోపల వుండేదనుకుంటా. మారని సమాజం పట్ల ఏదో అసంతృప్తి, ఏదో చేయాలన్న తపన! బడిని గుడిగా మలుచుకొని అదే ధ్యాసగా బతకడంలో ఆయన ఆ దుఖానికి విముక్తి కనుక్కున్నట్టు అనిపించేది.
జీవితం అనే కావ్యంలోసగం వృధసగం వ్యధ..
అని ఆయన ఒక కవితలో రాసుకున్నారు. ఆయన వచనంలో ఆయన నికార్సయిన మార్క్సిస్టు, కానీ కవిత్వంలోకి వచ్చే సరికి ఆయనలోని కాల్పనికుడు ఆ మార్క్సిస్టుని దాటుకుని వచ్చేవాడు. ‘రచయితకి స్వేచ్చ వుండాలి, ఎంత కమ్యూనిస్టు అయినా!” అనే వారు ఆయన.
అనేక సంవత్సరాల పాటు పార్టీ కోసం బతికి, సర్వస్వం పార్టీకి ధారపోసి, తన కోసం ఏమీ మిగుల్చుకోలేదు నాన్నగారు.
పార్టీ చీలిపోయాక క్రుంగదీసిన నైరాశ్యంలోంచి బయట పడేసరికి ఆయన నిరుద్యోగి. ఆయనే రాసుకున్నట్టు “చిరుద్యోగి, పోనీ, దురుద్యోగి సైతం కాలేని నిరుద్యోగి.” అప్పుడు ఆయనకి హిందీ అనే గడ్డిపోచ దొరికింది. అది పట్టుకుని అలహాబాద్ హిందీ మహావిద్యాలయానికి వెళ్ళి, అక్కడ చదువుకొని, వెనక్కి వచ్చి ఆయన హిందీపండితులుగా చేరారు. అలా ఆయన ఉద్యోగంలోకి కుదురుకునే సరికి నేను నాలుగో తరగతిలో వున్నా. అప్పటికి బడికి పంపే స్తోమతు లేక నన్ను ఉర్దూ క్లాసులకి పరిమితం చేసింది మా అమ్మ. ఆ విధంగా నేను నాలుగో తరగతి దాకా తెలుగు అక్షరముక్క తెలీకుండా పెరిగాను. నాలుగో తరగతి తెలుగు బడిలోకి వచ్చేసరికి నాకు కష్టాలు మొదలయ్యాయి. తెలుగు రాదు, ఉర్దూ మీద మమకారం పోదు. బడిలో అందరూ ఏడిపించడం మొదలెట్టారు. నాకు కచ్చపుట్టింది. మా నాన్నగారి రాతని అనుకరించడంతో నా తెలుగు మొదలయ్యింది. ఆయన నెల రోజులలో నాకు వోనమాలు నేర్పించి, రెండో నెలలోకి వచ్చే సరికి చిన్న కథలు చదివించడం మొదలెట్టారు. ఏడాది తిరిగే సరికి నేను పెద్ద పుస్తకాలు చదవడం మొదలెట్టాను. శ్రీ శ్రీ కవిత్వాన్ని ఇంటా బయటా పాటల కింద మార్చేసి హోరెత్తించే వాణ్ని. అది చూసి, మా హెడ్మాస్టర్ “అరె, ఈ జన్మలో నీకు తెలుగు రాదనుకున్నాను రా! మొత్తానికి సాధించావ్!” అనడంతో నా గర్వ పతాక ఎగిరింది బడిలో!

కానీ, అదంతా నా గొప్పతనం కాదు, పాఠం చెప్పడంలో నాన్నగారి నేర్పరితనమే తప్ప!

“సార్ క్లాసులో ఒక్క సారి చెప్పిన తరవాత షెల్లీ పద్యమయినా నోటికి వచ్చేస్తుంది, పెద్దన పద్యమయినా బట్టీ కొట్టినట్టు వుండిపోతుంది ” అని బడిలో విద్యార్ధులు అనే వారు. అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఆయన రాస్త్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా వరసగా అయిదుసార్లు అవార్డులు గెలిచి, తరవాత రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. చివరి రోజుల్లో “అక్షరదీపం” పట్టుకుని మారుమూలల పల్లెలకి వెళ్ళి పాఠాలు చెప్పేదాకా వెళ్లింది ఆయన తపన. చివరికి ఉపాధ్యాయ వృత్తి కోసం తనలోని రచయితని వదులుకున్నారు. ఆయన తరవాతి కాలంలో రాసిన రచనలు కూడా “అక్షరదీపం” వాచకాలూ, కథలూ, పాటలు మాత్రమే!

“నేను ఎప్పటికీ పాఠకుడిని మాత్రమే. చదవడంలో వున్న ఆనందం నాకు రాయడంలో లేదు. అయినా నేను ఉపాధ్యాయుడిని, అంతే! ఈ రోజు పాఠాలు బాగా చెబితే ఆ రోజుకి నా కల తీరినట్టే, నా లక్ష్యం నెరవేరినట్టే!” అనే వారు ఎప్పుడూ. కానీ, తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లీషు, అరబ్బీ, ఫారసీ భాషలు చదువుకొని, వాటి సాహిత్యాలని ఆపోసన పట్టిన నాన్నగారు, ఒక మారుమూల పల్లెలో బడిపంతులుగా వుండి, జాతీయస్థాయిలో రచయితలతో స్నేహాలూ, ఉత్తరప్రత్యుత్తరాలూ నడిపిన నాన్నగారు…జీవితాన్ని వొక అక్షర ఉద్యమంగా మలుచుకున్న నాన్నగారు...ఇప్పటికీ, ఎప్పటికీ మరణశయ్య మీద ఆయన్ని వూహించలేను!

ఆయన చివరి డైరీలో రాసుకున్న ఈ వొక్క వాక్యం ఎప్పటికీ నా మనసులో వెలుగుతూ వుంటుంది:

“అనుభవమే చివరి వెలుగు. ఈ క్షణమే చివరి క్షణం. ఆ వొక్క క్షణమూ సదామణి సదృశ జ్వాలగా వెలుగు”

*
కౌముది అనే పేరు ఆయన ఎందుకు పెట్టుకున్నారు తెలియదు. ఆయన అసలు పేరు షంషుద్దిన్, అంటే సూర్యుడు అని. దానికి పూర్తి వ్యతిరేకంగా ఆయన చంద్రకాంతిని ఆశ్రయించి “కౌముది” అని పెట్టుకున్నారు.
ఆయనంటే మహాకవి దాశరథికి చాలా ప్రేమ. “కౌముది” అన్న పేరంటే మరీ ప్రేమ. తరచూ ఉత్తరాలు రాసుకునే కాలంలో దాశరథి ఆయనకి ఇలా రాశారు :

“ఖమ్మంలో ఎండలు మండిపోతున్నాయని విన్నాను. కానీ

రేయెండ మీరుండ
నీరసించు మండుటెండ”

రేయెండ అంటే రాత్రి కాసే ఎండ అనీ, కౌముది అనీ వేరే చెప్పకర్లేదు కదా!

Friday, January 14, 2011

అంతర్జాతీయ వేదిక మీద వొక తెలుగు కవిత!

కొత్త ఏడాది ప్రయాణాలతో మొదలయ్యింది!

ఆస్టిన్ నించి లాస్ ఏంజెల్స్ కి విమాన ప్రయాణం చాలా సరదాగా వుంటుంది. విమానం లాస్ ఏంజెల్స్ చేరబోతుండగా, రెక్కల కింద నించి చూస్తే, ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ చూసినట్టే వుంటుంది నేలంతా.

ఆ క్షణాన ఎందుకో సంజీవ్ దేవ్ గుర్తొచ్చారు నాకు.
ప్రకృతీ, కొండల చుట్టూ సంజీవ దేవ్ పెయింటింగులు వరసాగ్గా చూస్తూ పోతున్నట్టు వుంది కింద నేలన.

లాస్ ఏంజెల్స్ లో దక్షిణాసియా సాహిత్య సదస్సుకి ఆరునెలల క్రితం ఆహ్వానం వచ్చింది. మాడరన్ లాంగ్వేజ్ అసోసియషన్ (ఎం‌ఎల్‌ఏ) కి అనుబంధంగా జరిగే సదస్సు ఇది. మామూలుగా ఇలాంటి సదస్సులలో ఏ సల్మాన్ రష్దీ గురించో, అరుంధతి రాయ్ గురించో, మహా అయితే టాగూర్ దాకానో పరిమితమవుతాయి చర్చనీయాంశాలు. సల్మాన్ రష్దీ, అరుంధతి రాయ్ గురించి కొన్ని వందల మంది మాట్లాడతారు. సాధారణంగా ఇంగ్లీషు సాహిత్యం పరిధి దాటి ఎవరూ రారు. ఈ చర్చని మరో వైపు తిప్పాలని నా ఆలోచన. భాషా సాహిత్యాల వైపు మళ్ళితే తప్ప ప్రపంచ సాహిత్యం అంతు పట్టదని మొదటి నించీ నా ఘోష. పైగా, నా తెలుగు పక్షపాతం!

ఈ మధ్య జూపాక సుబద్ర కవిత “కొంగు” గురించి చాలా కాలంగా ఆలోచిస్తున్నాను. ఆ కవిత గురించే మాట్లాడితే సరిపోదా అనుకుని, ముందు ఆ కవితని అనువాదం చెయ్యడం మొదలు పెట్టాను. ఈ లోగా మిత్రుడు పురుషోత్తమ్ ఈ కవితని అనువదించినట్టు ఎవరో చెప్పారు. సరే, ఆ అనువాదం కూడా చేతికొచ్చింది. ఈ కవిత మీరు ఇప్పటి దాకా చదివి వుండకపోతే, ఇప్పుడు చదవండి. పురుషోత్తం అనువాదం కూడా చాలా బాగుందనిపించింది. తెలుగు నించి ఇంగ్లీషులోకి కవిత్వ అనువాదం అంత తేలిక కాదు, కానీ, పురుషోత్తం అనువాద సామర్ధ్యం అంతా ఈ కవిత లో తెలుస్తుంది.

సరే, ఈ కవితని ఎక్కడో లాస్ ఏంజెల్స్ లో అసలు తెలుగు అనే వొక భాష వుందని కూడా తెలియని సమూహాల మధ్య, ఒక అంతర్జాతీయ వేదిక మీద చర్చకి ఎలా తీసుకురావాలన్నది ఇప్పుడు ప్రశ్న. అదెలా చేశామో తరవాత చెప్తాను.

అదేమిటి, ఏక వచనంలో ప్రారంభించి ఇలా బహువచనంలోకి వచ్చానేమిటా అని మీరు ఆశ్చర్యపోవచ్చు.

ప్రయాణం ఏర్పాట్లలో భాగంగా – ఈ సదస్సు గురించి నేను వొక అమెరికన్ మిత్రురాలికి చెప్పాను. ఆమె జెండర్ స్టడీస్ ప్రొఫెసర్. పేరు బానీ జైర్. మాడిసన్ విస్కాన్సిన్ లో కొన్నాళ్ళ క్రితం నా దగ్గిర హిందీ-ఉర్దూ నేర్చుకుంది. అప్పటి నించీ మా పరిచయం. కవిత్వం మా ఇద్దరి మధ్యా వంతెన. మాటల సందర్భంలో నేను సుబద్ర కవిత విషయం చెప్పగానే బానీ చాలా ఆసక్తి చూపించింది. ఇక కవిత గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టాం.

స్త్రీవాద కవిత్వంలో సుబద్ర కవిత ఒక మంచి మలుపు అని నా అభిప్రాయం. ఈ కవిత జయప్రభ “పైటని తగల్లెయాలి” కవితకి ప్రతివాదం. అస్తిత్వాన్ని నిర్దిష్టంగా చెప్పాలన్న తెలుగు కవిత్వ ప్రయాణంలో సుబద్ర ‘కొంగు” తప్పనిసరిగా ఒక మజిలీ. స్త్రీకి కేవలం స్త్రీ అస్తిత్వమే వుండదని, ఆ స్త్రీ ఏ వర్గం నించి, ఏ కులం నించి వచ్చిందన్నది అస్తిత్వంలోనూ, కవిత్వ వ్యక్తీకరణలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుందని నా వాదన. ఆ రకంగా జయప్రభ “పైట” కవిత ఒక నిర్దిష్టమయిన వర్గ వ్యక్తీకరణ అయితే, సుబద్ర “కొంగు” దానికి కౌంటర్. నా వాదన బానీకి బాగా నచ్చింది. అంతే, ఈ విషయం ఇద్దరం కలిసే మాట్లాడదాం అని అనుకున్నాం. అప్పటి దాకా తను వొక వేరే టాపిక్ అనుకుంది, మా చర్చల తరవాత అది తెలుగు వైపు, సుబద్ర కవిత వైపు మళ్ళింది. ఈ ప్రసంగానికి వచ్చిన ప్రతిస్పందన మాకు ఎంత ఉత్సాహం కలిగించిందంటే, దీనిని వొక పెద్ద వ్యాసంగా మార్చే పనిలో పడ్డాం ఇప్పుడు! (అప్పటికప్పుడు ఈ వ్యాసం “సౌత్ ఆసియా రెవ్యూ” లో ప్రచురిస్తామని ఆ పత్రిక ఎడిటర్లు కూడా మాటిచ్చారు, అలా ప్రచురించడానికి తగ్గట్టుగా రాయడానికి ఇంకా చాలా పని వుంది అనుకోండి!)

భాషా సాహిత్యాలలో ఈ విధమయిన సృజనాత్మక సాహిత్యం వస్తోందా అని కొందరు ఆశ్చర్యపోయారు; తెలుగు ఎక్కడి భాష, ఆ కవిత లో కొన్ని భాగాలు తెలుగులో చదవగలరా అని కొందరు అడిగారు; తెలుగులో కొన్ని పంక్తులు చదివి వినిపించినప్పుడు తెలుగులో వున్న సహజ మాధుర్యానికి కొందరు ముగ్ధులయ్యారు. ఇది ఎంత దూరం పోయిందంటే, ఆ రోజు సాయంత్రం నా కవిత్వ పఠనం జరిగినప్పుడు వొకటి రెండు కవితలు తెలుగులో చదివి తీరాలని చాలా మంది పట్టుబట్టారు, వేదిక కింద నించి “తెలుగు చదవండి...తెలుగు చదవండి” అని కేకలు వేశారు.

ఇక్కడ కవిత్వ పఠనం కూడా గొప్ప అనుభవం. ప్రసిద్ధ రచయిత్రి ఫౌజియా అఫ్జల్ ఖాన్ ఇటీవలి తన కొత్త అనుభవాలూ-జ్నాపకాల పుస్తకం నించి కొన్ని భాగాలు చదివారు. తరవాత నా కవిత్వ పఠనం జరిగింది. అక్కడ వున్న వారి కోరిక మేరకు నేను కొన్ని తెలుగు కవితలు చదివినా, ఎక్కువగా ఇంగ్లీషు కవితలకే పరిమితమయ్యాను. తెలుగు కవిత్వం అనువాదంలో వున్న సమస్యలే, “అనువాద” పఠనంలోనూ వున్నాయి. సందర్భ వివరణ, పాద సూచికలు ఇవ్వడంలో చాలా సమయం పోతుంది, ఈ లోపు శ్రోతలలో కవిత్వం వినాలన్న ఆసక్తి చచ్చిపోతుందేమో! ఈ కారణంగా ఇక్కడి సదస్సులలో ఎక్కువ ఇంగ్లీషు పద్యాలకే పరిమితమవుతున్నా. దాదాపు గంట సేపు జరిగిన పఠనం ఆసక్తికరంగా సాగింది. ఆ తరవాత ప్రశ్నలూ-జవాబులూ!

అనేక రకాల మనుషులూ, అనేక రకాల అభిరుచులూ, అన్వేషనలూ, అనేక రకాల ఆహార పదార్థాలూ, ప్రదేశాల పరిభ్రమణంలో మంచి అనుభూతి ఈ మూడు రోజుల సాహిత్య సదస్సు!

(గమనిక: సమయాభావం వల్ల ఈ సదస్సు వివరాలు క్లుప్తంగా మాత్రమే అందించగలుగుతున్నాను. అందుకు క్షమించండి)

అలజడికి అక్షర రూపం- సాహిల్

  -పి. జ్యోతి "సాహిల్ వస్తాడు" కథా సంకలనంలో అప్సర్ గారి 11 కథలున్నాయి. ముస్లిం మైనారటి సమస్యలపై వారి దృక్పథంతో రాసిన కొన్ని కథలు ఇ...