Saturday, May 16, 2020

చూపుడు వేలు




1

నేనూ ఉమర్ వొకే వయసు. కానీ, అందరిలానే వాణ్ని నాకూ  “ఉమర్ భాయ్!” అనే పిలవడం అలవాటయింది. నేనే కాదు, మా ఆవిడ రజియా కూడా వాణ్ని అట్లానే పిలుస్తుంది. మొదట్లో మా వాడు –సాజిద్, ఇంటర్ చదువుతున్నవాడు కూడా-- వాణ్ని “ఉమర్ భాయ్” అనే పిలుస్తూంటే, “మరీ బాలేదురా, నువ్వు ఉమర్ చాచా అని పిలువు!” అని వాణ్ని కట్టడి చేసేశాం.  

“రంజాన్ ఉపవాసాలు  కూడా మొదలయ్యాయ్. ఉమర్ భాయ్ ఈసారి కనిపించనేలేదు. కొంచెం కనుక్కోండి!” ఆ సాయంత్రం రజియా చాయ్ ఇస్తూ అడిగింది.

ఈ కరోనా లాక్ డౌన్ వల్ల నా ప్రపంచమంతా కొంచెం మారిపోయింది. ఆన్ లైన్ క్లాసులతో మామూలుగా కంటే పనిభారం ఎక్కువ అనిపిస్తోంది. టెక్నాలజీ నాలో యేదో  ఆస్తిమితత్వానికి కారణమవుతోంది. ఆన్ లైన్ పాఠం అయిన ప్రతిసారీ అనిపిస్తుంది, నేరుగా క్లాస్ లో అయితేనే నాకు నచ్చేట్టుగా చెప్పగలనేమో.

ఈ కొత్త హడావుడిలో రంజాన్ చంద్రుడు కనిపించడమూ, ఉపవాసాలూ మొదలు కావడమూ గమనించుకోలేదు. ఇంకో విధంగా చెప్పాలంటే, వాటిని గమనించుకోగలిగే ముస్లింతనానికి తను కొంచెంగా దూరమవుతూ వస్తున్నాడు కొంతకాలంగా-

“ఈసారి రోజాలైనా వుంటారా?!” అని రజియా ఆ సాయంత్రం గట్టిగానే అడిగింది. కాస్త నిరాసక్తంగా తల వూపడమో యేదో చేశాను కానీ, కచ్చితంగా యేమీ చెప్పలేకపోయాను. సాయంత్రం చాయ్ సమయానికి ముగ్గురం ఎక్కడున్నా ముందు గదిలో కనీసం అరగంట కలిసి చాయ్ బిస్కట్లు షేర్ చేసుకుంటాం. కబుర్లకి కూడా అదే మంచి సమయం. మామూలుగా అయితే, ఉమర్ యేదో వొక సమయంలో వచ్చి పలకరించే వెళ్తాడు.

“ఉమర్ భాయ్ కి ఫోన్ చేయండి! లాక్ డౌన్ తరవాత అసలు రానేలేదు!”

“అవును, బాబా! కనీసం ఫోన్ చేద్దాం!”

నాకు ఈ పరిస్థితి మరీ అన్యాయంగా అనిపించింది. సాధారణంగా వాళ్ళెవరూ గుర్తు చేయకుండానే ఉమర్ ని నేనే ఒకటికి పడిసార్లు పలకరిస్తూ వుంటాను. లాక్ డౌన్ కి ముందు వాడే వచ్చి వెళ్ళాడు కూడా!

ఇంకో ఆలోచన చేసే లోపే సాజిద్ టేబుల్ మీద వున్న మొబైల్ పట్టుకొచ్చి, నా చేతుల్లో పెట్టాడు. ఉమర్ నంబర్ నొక్కి, వాడి జవాబు కోసం ఎదురుచూస్తున్నా.

రజియా ఈ లోపు నమాజ్ కోసం లోపలకి వెళ్లిపోయింది. సాజిద్ మాత్రం నా ఎదురుగా కూర్చొని ఉమర్ కోసం ఎదురుచూస్తున్నాడు.

“వాడు ఫోన్ ఎత్తడం లేదు, రా!” అన్నాను. సాజిద్ నిరాశగా ముఖం పెట్టుకొని, తన గదిలోకి వెళ్లిపోయాడు.

మరోసారి మొబైల్ ప్రయత్నించి, వూరుకున్నా.

లాక్ డౌన్ కి ముందు ఇంట్లో వాళ్ళకి నేనూ ఉమర్ చెప్పని విషయం వొకటి వుంది. అది ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చేసింది కానీ, అసలు ముందు ఉమర్ ని పట్టుకోవాలి యెట్లా అయినా!

ఉమర్ గురించే ఆలోచిస్తూ మేడమీదకి వెళ్ళి, అక్కడ మా చిన్న కూరగాయల తోటకి నీళ్ళు పోయడం మొదలుపెట్టాను.

ఆ  రూఫ్ గార్డెన్ నిజానికి ఉమర్ ఆలోచనే.

“మీ డాబా మీద మంచి గార్డెన్ పడుతుందిరా  సాదిక్!” అన్న మరునాడే వాడు రెండు బెండ, రెండు వంకాయ, రెండు టొమోటా మొక్కలు పెట్టేశాడు. చూస్తూండగానే ఆ రూఫ్ నిండా గార్డెన్ పరచుకుంది. నిజానికి ఈ లాక్ డౌన్ సమయంలో మనసుని కొంచెం కుదుటపెట్టుకోడానికి ఈ పచ్చని మొక్కల మధ్య గడపడం, వాటి బాగోగులు చూసుకోవడం...నాకు బాగుంది సరే. ఉమర్ పరిస్థితి యేమిటి?

వాడు అద్దెకి వుండే రెండు చిన్న గదుల్లో ఆ నాలుగు ప్రాణాలు వుండడమే  కష్టమే. అప్పటికీ వాడు ఆ ఇరుకులోనే అక్కడేదో రెండు మూడు కుండీలు పెట్టుకున్నాడు. కానీ, వాడి సాయంత్రాలు ఎక్కువగా ఉర్దూ అరబ్బీ పాఠాలతో గడుస్తాయి. ఈ రెండు మూడు వాడల్లో మంచి అరబ్బీ ఉర్దూ టీచర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఒక ముస్లిం ప్రైవేట్ స్కూల్ లో పగలంతా పనిచేస్తాడు. సాయంత్రాలు అయిదారుగురు పేద పిల్లల్ని చేరదీసి, వాళ్ళ చేత తన ఇరుకు ఇంట్లోనే రెండు గంటల దాకా కూర్చోబెట్టి, పాఠాలు చెప్తాడు. వాళ్ళు హోం వర్కులు చేస్తూ వుంటే, దగ్గిర వుండి అన్నీ చెప్తూ వుంటాడు.

“అంత సమయం ఎలా పెడతావ్ రా, వాళ్ళకి?!” అని నేనే ఆశ్చర్యంగా అడుగుతూ వుంటాను అప్పుడప్పుడూ.

“కమ్యూనిటి కోసం నేనింకా  యేమీ చేయలేను కదా! మామూలుగా అయితే ఆ రెండు గంటలు వాళ్ళు ఇంట్లో వుంటే ఆ పనీ ఈ పనీ తప్ప చదువు మీద అయితే పెట్టరు. నా దగ్గిర కూర్చోబెట్టాననుకో, చచ్చినట్టు చదువుతూ కూర్చొంటారు కదా! చదువు వొక్కటే దారిద్ర్యాన్ని ఎదుర్కునే మంత్రం! మనకి తెలిసినంతలో చదువు విలువ గురించి చెప్పుకుంటూ వెళ్ళాలి ,” అన్నాడు చాలా ధీమాగా.

ఆ మాటకొస్తే, నేను ఇంగ్లీష్ వైపు, వాడు అరబ్బీ ఉర్దూ వైపు మళ్లడం కూడా చాలా ఆసక్తిగానే జరిగింది. నిజాయితీగానే చెప్తున్నా- నా ఆలోచనల్లో కమ్యూనిటీకి ఎప్పుడూ పెద్ద చోటు లేదు. నేను బాగా చదువుకోవాలి, లెక్చరర్ కావాలి. మంచి లెక్చరర్ కావాలి అన్నవరకే నా లక్ష్యంగా వుండేది. దానికి తగ్గట్టుగానే ఎమ్మే ఇంగ్లీషు చదువుకోగానే ఇక్కడే లెక్చరర్ గా చేరాను. వాడికి ఇంగ్లీషు, లెక్కలు కూడా బాగానే మార్కులు వచ్చేవి కానీ, ఎందువల్లనో డిగ్రీ తరవాత పూర్తిగా అరబ్బీ ఉర్దూ టీచింగ్ కి ఎంతకావాలో అంత వరకే నేర్చుకొని, ముస్లిం ప్రైవేట్ స్కూల్ లో కుదిరాడు.

“ఇట్లా అయితే నేను ముస్లిం పిల్లలకు దగ్గిరగా వుంటాను. వాళ్ళ కోసం యెమైనా చేస్తాను. లేదా, యెమైనా చెయ్యాలీ అన్న motivation తో వుంటాను.” అన్నాడు ఆ వుద్యోగంలో చేరిన రోజు-

“ఉమర్ భాయ్ ఫోన్ దొరికిందా?” అప్పుడే మేడపైకి వస్తూ రజియా అడిగిన ప్రశ్నకి నా ఆలోచనలు చెదిరిపోయాయ్.

“లేదు, రజియా! రేపు పొద్దున నేనే వెళ్లివస్తాను” అని లేచి, నీళ్ళతో చేతులు కడుక్కున్నాను.

“గార్డెన్ వర్క్ కూడా లేకపోతే ఎంత కష్టంగా వుండేదో...ఈ టైమ్ లో...?” అన్నాను.

“వర్క్ కావాలా? బోలెడు పని పెడతా...కిందకి రండి!” నవ్వుతూ అంది రజియా. కాసేపు ఏవో కబుర్లు చెప్పుకుంటూ మేడ మీది కుర్చీల్లోనే కూర్చుండిపోయాం.

కానీ, తనకి చెప్పాలి. లాక్ డౌన్ కి ముందు ఏం జరిగిందో?! అది ఎక్కడ మొదలు పెట్టాలో ముందు తేల్చుకోవాలి!

రాత్రి భోజనాలయ్యాక టీవీ ముందు కూర్చొన్నాం. సాజిద్ కి ఇది చాలా బిజీ సెమిస్టరు. పాపం, ఏదో తినేసి తన రూమ్ కి వెళ్ళి తన చదువులో తను మునిగిపోతూ వుంటాడు.

వార్తలు వింటున్నాం. అంతా కరోనా గురించే. మర్కజ్ కి వెళ్లివచ్చిన వాళ్ళే పాజిటివ్ కేసుల్లో ఎక్కువమంది వున్నారని మంత్రి అన్న మాటల మీద ఇంకా చర్చలు, చర్యలు జరుగుతూనే వున్నాయి. ఇది ముస్లింలని ఇంకో కొత్త పేరుతో అణచివేసే కుట్ర తప్ప ఇంకేమీ కాదని కొంతమంది ముస్లిం నాయకులు అంటున్నారు. కొన్ని చోట్ల ముస్లింలని దూరంగా వుంచడానికి ఇప్పుడు మర్కజ్ బూచి చూపిస్తున్నారని whatsapp గ్రూప్ లో , ఫేస్ బుక్ లో కూడా చర్చలు జరుగుతున్నాయి. అవి తను ఫోన్ లో చదువుతూనే వున్నాడు. ఆ లోకం రజియాకి తెలియదు కాబట్టి, ఆమెకి టీవీలో చూసేదీ, వినేది మాత్రమే వార్త!

“మన వాళ్ళు కూడా మరీ అన్యాయంగా తయారవుతున్నారు! ఈ మర్కజ్ లూ, జమాత్ లూ లేకపోతే ఏం? మనం బతకలేమా? వాళ్ళ వల్ల మామూలు ముస్లింలకు కూడా కష్టాలు!” అంది వున్నట్టుండి రజియా.

మొబైల్ ఫోనుకీ మధ్య, టీవీ వార్తలకు మధ్య షటిల్ ఆడుతున్న నేను ఆ మాట అన్న రజియా కళ్ళల్లోకి చూశాను. కచ్చితంగా అదే సమయంలో రజియా కూడా నా కళ్ళల్లోకి చూస్తోంది, నేనేం అంటానా అని!

కాసేపు యేమీ అనలేకపోయాను గాని, రజియా వూరుకోదు. కొంచెం గట్టిపిండం మరి!

“అంత తేలికగా లేదు, రజియా! మర్కజ్ లేకపోతే, ఇంకో కారణమేదో ముస్లింలని తిట్టిపోయడానికి వెతికి పట్టుకుంటారు. దేశమంతా ముస్లిం వ్యతిరేకతలో కొట్టుకుపోతోంది!”

“మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. మీరు ముస్లిం కాబట్టి మీ క్లాసులకి రాము అనే హిందువులు వుంటారా? లేకపోతే, మీ పేరులో మహమ్మద్ వుందని చెప్పి, మీ హిందూ స్నేహితులు యేమైనా కటాఫ్ చేశారా? మనం బాగుంటే, వాళ్ళు బాగుంటారు మనతో! మనమూ- వాళ్ళూ అనుకుంటే అట్లాగే వుండిపోతాం!”

అవునా? మనమూ- వాళ్ళూ—అని అంటున్నది యెవరో రజియాకి తెలియదా నిజంగా?!

ఇంకేం చెప్పాలో నాకు తెలీలేదు. “దేశం చాలా మారిపోయింది, రజియా! ఏడాది కిందట వున్నట్టు ఇప్పుడు లేదు!” అన్నాను.

“మీరేదో చెప్తారు. సరే, ఇషా నమాజ్ వేళ అయింది. వచ్చాక కాసేపు ఖురాన్ చదువుకొని పడుకుంటాను. మీరెలాగూ రేపు క్లాస్ కి రెడీ అవ్వాలి కదా!” అంటూ లోపలికి వెళ్లిపోయింది.

టీవీలో మర్కజ్ వార్త వస్తున్న సమయంలోనే ఉమర్ సంగతి చెప్పాలని అనుకున్నా. కానీ, ఈ చర్చ తరవాత ఇంకేం చెప్తాను? తన దగ్గిర యేమైనా విషయం దాచి వుంచడం అన్నది ఇంతవరకూ జరగలేదు. ఉమర్ మర్కజ్ కి వెళ్లివచ్చాడని, రాగానే అతన్ని   కరోనా టెస్టింగ్ కి పంపించారని రజియాకి చెప్పాలి.. చెప్పి తీరాలి రేపో మాపో!

ఆ తరవాత మా ఇంట్లో ఉమర్ ఎవరు? రజియా కి అతను “భాయ్”గానే కనిపిస్తాడా?! రజియా స్పందనని వూహించలేకపోతున్నా.

ఆ రాత్రి నాకు నిద్రలేదు. నిజం చెప్పడం అంత తేలిక కాదు, దాని వెనక వచ్చే పర్యవసానాల్ని గురించి ఆలోచన వుంటే! అవేమీ మనసులో పెట్టుకోకుండా తిన్నగా విషయం చెప్పేయాలా?!

“చెప్పేయ్, ఏం పర్లేదు?! నిజం నిజమే. అది చెప్పడం ఆలస్యమైతే అబద్ధం కంటే ప్రమాదకరం కావచ్చు!” అంటున్నాడు ఉమర్ లోపలినించి.

వాడు అంతే...అబద్ధాలు మన ముఖాల్ని మార్చేసే వక్రరేఖలు అంటాడు. కానీ...రేపు యెట్లా అయినా కలవాలి వాణ్ని.

3

“సాదిక్ బాబూ! అంత దూరం వద్దమ్మా! మధ్యలో యేదో స్కూల్ గ్రౌండ్స్ దగ్గిర కలవండమ్మా!” అనేది అమ్మ స్కూల్ రోజుల్లో ఆదివారాలు యెప్పుడైనా నేను సైకిల్ వేసుకొని, ఉమర్ వాళ్ళ ఇంటి వైపు వెళ్తూ వుంటే! ఉమర్ వాళ్ళ నాన్న రెహమాన్ ది పెద్ద వుద్యోగమేమీ కాదు. మూసా కిరాణా కొట్టులో పొట్లాలు కట్టేవాడు. ఉమర్  వాళ్లమ్మ చిన్న చిన్న కుట్టు పనులు చేసేది. ఉమర్ తమ్ముడు ఖమర్ మా ఇద్దరి కంటే మూడేళ్లు చిన్న. నా సైకిల్ వాళ్ళింటి ముందు ఆగినప్పుడల్లా రెహ్మాన్ వాళ్లమ్మ బయటికొచ్చి, “సాదిక్ బేటా!” అని ఆత్మీయంగా నన్ను లోపలికి పిలిచేది. అది నాలుగైదు అద్దె ఇళ్ల వాటాలున్న చిన్న కాంపౌండ్. వాళ్ళ ఇల్లు అంటే రెండు చిన్న గదులు.

మా అమ్మ “అంత దూరం వద్దు!” అనడంలో కేవలం దూరం మాత్రమే లేదు.  మాటల్లో అమ్మా నాన్న యెప్పుడూ చెప్పలేదు గాని, వాళ్ళ చర్యల్లో అర్థమయ్యేది. ఉమర్ వాళ్ళ స్థాయి మనతో కలవదూ అని! స్కూల్ రోజుల్లో అప్పుడప్పుడూ ఉమర్ గాని, ఖమర్ గాని మా ఇంటికి వచ్చేవాళ్లు. కానీ, నాకు తెలిసీ మా ఇంట్లో యెవరూ వాళ్ళిద్దరినీ అంత మనస్ఫూర్తిగా లోనికి రమ్మని గాని, కాసేపు కూర్చోమని కానీ చెప్పిన గుర్తు లేదు నాకు.

అయినా- ఉమర్ తో నా స్నేహం ఆగలేదు. పెళ్లయ్యాక – రజియాకి అట్లాంటివి పెద్ద పట్టింపులు లేవు. అప్పటికి ఉమర్ భాయ్ స్కూల్ టీచర్ కాబట్టి నా అందరి స్నేహితుల కంటే ఎక్కువ మర్యాదలే దక్కుతున్నాయి. నిజానికి రజియాకి అన్నతమ్ముళ్ళు లేకపోవడం వల్ల ఉమర్ తన మంచితనంతో “భాయ్” స్థానంలోకి తేలికగానే వచ్చేశాడు.

4

బైక్ దిగి, ఉమర్ వాళ్ళ కాంపౌండ్ లోకి అడుగుపెట్టాను. వాళ్లది చివరి వాటా ఇల్లు. మొదటి మూడు వాటాల బయట అప్పటిదాకా కబుర్లు చెప్పుకుంటున్న ఆడవాళ్ళు నన్ను చూసి మాటలు ఆపేశారు. తిన్నగా చివరి వాటా దాకా వెళ్ళి, నిలబడ్డాను. ఖమర్ బయటికివచ్చాడు, “సాదిక్ భాయ్ వచ్చాడమ్మా!” అంటూ-

నన్ను చూడగానే వాళ్లమ్మ కళ్ళనీళ్లు తుడుచుకుంది. “అసలు కన్నెత్తి చూసిన వాళ్ళు లేరు బాబూ!” ఏడుపు వచ్చేస్తోంది ఆమెకి.  రెహమాన్ వున్న పళాన నిలబడి, తన కుర్చీ ఖాళీ చేసి నాకు ఇచ్చాడు. గదిలో వున్న వొకే వొక్క మంచమ్మీద అతుక్కుపోయి వున్నాడు ఉమర్ భాయ్. నన్ను చూడగానే వాడి కళ్ళు మెరిశాయ్. లేవబోయాడు. వద్దని చెబ్తే మళ్ళీ వెనక్కి వాలాడు.

“లాక్ డౌన్ నుంచీ అట్లానే వున్నాడు. జ్వరమూ అవీ చెక్ చేస్తున్నా. మొదట్లో 102 దాకా కనిపించింది. తరవాత నార్మల్ అయింది. కానీ, లేచి కూర్చోడం లేదు. కాసేపు కూర్చున్నా, వెంటనే కూలిపోతున్నాడు,” అన్నాడు ఖమర్.

“ఉమర్ భాయ్, నువ్వు చెప్పు!” అంటూ వాడి చేతులు దగ్గిరకు తీసుకున్నా. ఆ కాస్త స్పర్శకే వాడు కరిగిపోయినట్టు అనిపించాడు. వొక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది. నేను వాడి వీపు మీద చేయి వేసి, దగ్గిరకు తీసుకున్నాను. కాసేపు అట్లా వదిలేశాను వాణ్ని. వాడు ఏడిచీ ఏడిచీ కొంచెం నిమ్మళించాడు.  ఇన్నేళ్ల స్నేహంలో అంత బలహీనమైన స్థితిలో వాడెప్పుడూ కనిపించలేదు.  ఉమర్ భాయ్ క్లాస్ లో అయినా, బయట అయినా, రోజువారీ బతుకులో అయినా నన్ను అడిగితే చాలా creative. వాడికి రొటీన్ లైఫ్ లేదు. యేదైనా పనిచేస్తే, మనసుపెట్టి చేస్తాడని అందరూ అంటారు. క్లాస్ లో ఉమర్ భాయ్ చాలా సరదాగా వుంటాడని స్కూల్ ప్రిన్సిపల్ పదేపదే అంటాడు. ఇక పిల్లలకు వాడంటే ప్రాణం.

ఆరునెలలుగా ముస్లిం పేదపిల్లలకు యేదైనా చేయాలని వాడు అందరినీ కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. నా లాంటి స్నేహితుల సాయంతో వేరే మతాల పెద్దల్ని కూడా కలుపుకొని వెళ్తున్నాడు. ఆ క్రమంలోనే కొంతమంది జమాత్ పెద్దలతో కూడా అతనికి స్నేహాలు యేర్పడ్డాయి. అవన్నీ అతను తన శక్తితో సాధించగలిగిన తేలికపాటి విజయాలే! అవన్నీ పక్కన బెడితే, ఇప్పుడు అతన్ని వేధిస్తున్న పెద్ద సమస్య వేరే వుంది.

“నేనెప్పుడూ ఇక్కడ పరాయీవాడిగా నన్ను నేను భావించుకోలేదు. కానీ, మర్కజ్ కి వెళ్ళి వచ్చాక అందరి దృష్టిలో నేను యెవరినో అయిపోయాను.!” అన్నాడు కళ్ల నీళ్ళు కుక్కుకుంటూ.

కానీ, ఇవాళ నేను చూస్తున్న ఉమర్ కీ, ఆ ఉమర్ కీ పోలికే లేదు.

ఆ స్థితిలో నేను వాడితో ఎక్కువసేపు ఆ విషయాలూ ఈ విషయాలూ మాట్లాడి, వాడి మనసు బాధపెట్టే కంటే, కొంచెం సేపు కూర్చొని వెళ్లిపోవడమే మంచిదని ఆ రోజుకు అనుకున్నా.

కొద్దిసేపు కూర్చొన్న తరవాత నేను లేచి నిలబడితే వాడే అన్నాడు: “రజియానీ సాజిద్ నీ చూసి చాలా రోజులే అయింది. వస్తా అని చెప్పు!”

‘అవును, రోజూ అడుగుతున్నారు వాళ్ళు!” అని, నేను బయటికి వచ్చాను. నాతోపాటు ఖమర్ కూడా వచ్చాడు. నేను వొక పక్కగా నిలబడి, సిగరెట్ వెలిగించాను.

“సాదిక్ భాయ్, నెగెటివ్ వచ్చినా సరే వాళ్ళు అన్నయ్యని చాలా ఇబ్బంది పెట్టారు. ముందు ఆస్పత్రిలో తరవాత పోలీస్ స్టేషన్ లో “ఏరా, మర్కజ్ కి వెళ్లకపోతే యెమైందిరా?! ప్రాణాలతో ఆడుకుంటున్నార్రా మీరంతా!” ఇట్లాంటి సూటి పోటీ మాటలు. వారం రోజుల నుంచి ఈ ఇంటి వోనరు గొడవ ఇల్లు ఖాళీ చేయమని! ఇన్నేళ్లుగా ఇదే ఇంట్లో వున్నాం. ఓనర్ కి మేమేమిటో తెలుసు!”

“ఖమర్, ఇప్పుడు మన గతమంతా చెరిగిపోయింది. మన స్నేహాలూ, బాబాయ్, మామాయ్, అన్నయ్యా, అక్కా  అనుకోడాలూ అన్నీ పోయాయ్. ఇప్పుడు నువ్వూ నేను ముస్లిం మాత్రమే!”

కానీ, నా ప్రశ్న అడక్కుండా వుండలేకపోయాను. “మర్కజ్ కి యెందుకు వెళ్ళాడు ఉమర్? వాడికి జమాత్ లూ అవీ నచ్చవ్ కదా!”

“నిజమే, కానీ, ఈ మధ్య ముస్లిం పిల్లల కోసం యేదైనా చెయ్యాలీ అన్న తపన పెరిగిపోయింది. చాలా మంది పేద పిల్లలు—ఈ మధ్య అయితే అనాథలు కూడా – అన్న సాయం కోసం వస్తున్నారు. వాళ్ళకి చేతనైనంత చేస్తూనే వున్నాడు. కానీ, ఎంత చేసినా సరిపోవడం లేదు. అట్లా జమాత్ వాళ్ళు కాంటాక్ట్ లోకి వచ్చారు!”

“అవునా?! ఇదంతా నాకు తెలీదే!” అన్నాను ఆశ్చర్యంగా-

“జమాత్ లో కూడా అన్న పాత్ర యేమీ లేదు. వాళ్ళు సాయం చేస్తామంటే సరే అన్నాడు. అంతే! అందులోని ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి, మర్కజ్ కి తీసుకువెళ్లారు. వాళ్ళే అన్నీ ఖర్చులూ పెట్టుకున్నారు!”

ఈ లోపు నా మొబైల్ మోగింది. ఇంటి నించి సాజిద్ ఫోన్. “బాబా! ఉమర్ చాచా కలిశారా?”

“అవును, కలిశాం. అందరూ బాగున్నారులే!” అని పెట్టేశాను.

“ఖమర్, కనీసం నువ్వు నాకు చెప్తూ వుండు. వాడు బాగా హర్ట్ అయినట్టున్నాడు. నేను రెండు రోజుల్లో మళ్ళీ వస్తా!” అని బైక్ ఎక్కాను.

ఇప్పుడు నా ముందున్న ప్రశ్న—రజియాకీ, సాజిద్ కి నిజం చెప్పాలా, వద్దా?!

నిజం చెప్పకుండా వుండడం ఉమర్ కి కూడా నచ్చదు.

కానీ, ఆ నిజం ఎటు వెళ్తుందో?!

నా మటుకు నాకు ఉమర్ ని వొంటరీ వాణ్ని చేయకూడదు అని ఆ క్షణంలో కచ్చితంగా అనిపించింది.  అంతా విన్నాక రజియా, సాజిద్ కూడా అట్లా అనుకుంటారా?! చెప్పలేను!

*
ANDHRA JYOTI SUNDAY MAY 16TH, 2020




Wednesday, May 13, 2020

‘సాహిల్ వస్తాడు’ మనం చర్చించాల్సిన సందర్భం


                                    ‘

                                                                   
  -  డా।। ఎ. రవీంద్రబాబు

                                                         

అఫ్సర్ కవి, కథకుడు. సమకాలీన సమూహంలో తనను తాను ఆవిష్కరించుకుంటూ సొంత డిక్షన్ తో బలమైన అస్తిత్వాన్ని వ్యక్తం చేస్తున్న సృజనశీలుడు. కాలం పోకడల మధ్య అదృశ్య పొరలను గమనించి, గుర్తించి సాహిత్యాన్ని పదునెక్కిస్తున్న మార్మిక కళాతాత్వికుడు. గతానికి, వర్తమానికి మధ్య వారధిని నిర్మించే క్రమంలో మర్చిపోయిన మూలాలను పట్టుకొని ఆయువుపట్టులా పొదుగుతున్న సాహసికుడు. చరిత్ర వదిలేసిన వాటిలో, సొంత ముద్రలతో నిర్మించుకున్న చరిత్రలో దాగిన సత్యావిష్కరణల మీదుగా మాట్లాడతున్నాడు. సమకాలీనతల నుంచి గతం వైపు, గతం నుంచి భవిష్యత్తువైపు చూపు సారిస్తున్నాడు. సాహిత్య వ్యక్తిగా వ్యవస్తీకృతమైన సత్యాల్లోని నీడల్నీ ప్రశ్నిస్తున్నాడు. సాహిత్యం చేయాల్సిన పనిని నిబద్ధతగా, నిష్కర్షగా చేశాడు. చేస్తునే ఉన్నాడు.

అఫ్సర్ గత ఏడాది జనవరిలో తన కథల్లోంచి కొన్నింటిని “సాహిల్ వస్తాడు మరికొన్ని కథలు” పేరుతో వెలువరించాడు. “సాహిల్ వస్తాడు” కథా శీర్షికనే సంపుటికీ పెట్టాడు. అంటే ఈ కథ ఎంత ప్రాధాన్యత గలిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ కథా లోతుల్లోకి తొంగిచూస్తే.. మైనరిటీల అభద్రత, అస్తిత్వం, సమూహంలో ఏకాకితనం, రెండు మానసిక ప్రంపంచాల మధ్య ముస్లీంల మానసిక వేదన, కౌటుంబిక బంధాల్లోని ఆత్మీయత, వైయక్తిక సమ్మతమై, సమాజం సమ్మతం కానీ బాహ్య మానసిక జీవన నడవడిక, ఇస్లాంలోని స్వచ్ఛత... ఎన్నో అంశాలు రంగురంగుల రెక్కల్లా, బాధామయ శోకంలా దృశ్యాల్లా కదలాడతాయి. తనను తాను అపసవ్యదిశలోకి మార్చుకోని జీవన సౌందర్య స్వేచ్ఛాగానానికి, తితలీ(సీతాకోక చిలుక)లో దాగిన అమాయకత్వపు లేలేత నిజాయితీకి ఈ కథలోని సాహిల్ ఓ నిర్వచనంలా నిలుస్తాడు.   

   1980ల తర్వాత తెలుగు సమాజం తన సాహిత్య గతిని మార్చుకుంది. అస్తిత్వాలకు పురుడుపోసింది. తెలుగునేలపై చోటుచేసుకున్న అనేక సామాజిక సంఘటనలు, జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు అస్తిత్వ సాహిత్య ఉద్యమాలకు దారితీశాయి. ముఖ్యంగా 20వ శతాబ్ది చివరి దశాబ్దం.. సామూహికత్వంలోంచి చలనశీలమైన స్వీయ వ్యక్తీకరణలకు తావిచ్చింది. ప్రతి మనిషికి సంబంధించిన భావ, బౌద్ధిక సంఘర్షణలు, సంవేదనలు, సంలీనతలు.. అన్నీ చారిత్రక, సామాజిక, సాంఘిక, ఆర్థిక నేపథ్యంతో ముడిపినవేనని రుజువుచేశాయి. ఏకరూపత నుంచి భిన్నత్వ భావనాలోకాల్లోకి సమాజం వెళ్లిపోయింది.

అగ్రరాజ్య ఆధిపత్యం, చమరుకై పోటీలు, ఉగ్రవాద ముద్రలు.. జీవన పార్శ్వాలకు, సున్నితమైన అంశాలకు సైతం మతం పులమటం, మైనరిటీ అంటూ అభద్రతలోకి నెట్టివేయటం, బాబ్రీ మసీదు విధ్వంసం, తర్వాత చెలరేగిన అల్లర్లు, గుజరాత్ సంఘటన, వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడి, దాని పర్యవసానాలు...  ఈ క్రమంలో ముస్లింల జీవితాల్లో చోటుచేసుకున్న అభద్రత, అస్తిత్వం, బతుకులు, సడలుతున్న ఆత్మవిశ్వాసం, వీటి నుంచి ఉద్భవించే ప్రశ్నలు.. ఎన్నింటినో సాక్ష్యాలుగా మైనారిటీ వాదం చూపిస్తుంది. సంఘర్షణ, దాని తాలూకూ రాజీ, మింగుడుపడని వాస్తవాలు, ధ్వంసం మవుతున్న బాహ్య, అంతర్ మైనరీటీ జీవితాలను కవిత్వం, కథ, నవలలుగా తీసుకొచ్చింది ఈ వాదం. తమదైన టోన్ ను వినిపించే ప్రయత్నం చేశారు ఎందరో ముస్లిం సృజనకారులు. ఆత్మన్యూనత నుంచి అస్తిత్వ పెనుగులాట వరకు, కన్నీళ్ల నుంచి పోరాటం వరకు సాగిన, సాగుతున్న మైనారిటీవాద సాహిత్యంలో ఎన్నో మలుపులు, మెరుపులు ఉన్నాయి. ఈ క్రమంలో అఫ్సర్ రాసిన “సాహిల్ వస్తాడు” కథా స్థానాన్ని, నేపథ్యాన్ని, వస్తువును, పాత్రల అభూతులను, ఆవేదనలను, సామాజిక సందర్భాన్ని, కథా రీతిని గమనిస్తే...

“సాహిల్ వస్తాడు” కథా శీర్షికలోనే సాహిల్ కనిపించడంలేదన్న భావన వ్యక్తమవుతుంది. మరి సాహిల్ ఎక్కడకు వెళ్లాడు? ఎందుకు వెళ్లాడు? అసలు కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి? సాహిల్ కు సంబంధించిన వ్యక్తులు ఎవరు? వాళ్లు సాహిల్ కోసం ఎలా ఎదురు చూశారు? సాహిల్ ను వెతకడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారు? సాహిల్ కనిపించకుంటే అతడికి సంబంధించిన వాళ్ల పరిస్థితి ఎలా ఉంది?... కథా శీర్షికే ఇలాంటి ఎన్నో ప్రశ్నలను సంధిస్తుంది. ప్రతి ప్రశ్న వెనుక దాగిన జవాబుకోసం మనల్ని కథలోకి లాక్కుపోతుంది.

రాము దృష్టికోణంతో నడిచే ఈ కథ కలతో, కలత నిద్రతో మొదలవుతుంది. చార్మినార్ చుట్టూ జరిగిన అల్లర్ల అలికిడి, తెగినకలలో సీతాకోక చిలుక గుంపుల శవాలు.. వాటి అలికిడితో మొదలవుతుంది. ఆ స్థలంతో అతడి ఇద్దరు స్నేహితులు ఫణి, సాహిల్ కు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ ముందుకు సాగుతుంది. వాళ్ల ముగ్గురు అక్కడ టీలు తాగుతారు. కబుర్లు చెప్పుకుంటారు. చాయ్ బిస్కెట్ తోపాటు, సాహిల్ గజళ్లు వాళ్ల మధ్య తితల్లా ఎగురుతూ మనసులకు రంగులు అద్దుతుంది.

“ప్రేమంటే ఏమిటో తెలుసుగాని అందాల నా చెలికి నా ఇల్లే తెలియదు.

దేవుడి పేరు వింటే విన్నదేమో కాని ఆమెకి అతని జాడే తెలియదు.

మరీ పరధ్యానంగా వున్నానేమో, యవ్వనపువనం ఎప్పుడొచ్చి ఎటు వెళ్లిందో తెలియదు.

వసంతం వాకిట నిల్చుందని తెలుసుకానీ, ఆకురాలుకాలమని తెలియదు.” ఇలాంటి పాటలు సాహిల్ సమక్షంలో సంగీత సాహిత్యాల పోటీలా ఉంటాయి. సాహిల్ అద్భుతమైన పాటగాడు. స్వచ్ఛమైన పదాలతో అతనే పాటగా మారిన వ్యక్తి.

రాము కూతురుకు తితలీ అని పేరుపెట్టింది కూడా అతనే. “ఈ చిన్నీకి రెక్కలు లేవనే కాని, సీతాకోక పాపలా పుడితే అది ఇలాగే ఉంటుందిరా” అని ఎనిమిదేళ్ల పాపను ముద్దుచేయగల అమాయకుడు. తితలీ “మామూ” అంటూ అతనితో ఆత్మీయంగా ఆడుకుంటుంది. కబుర్లు చెప్తుంది. “తితలీ దగ్గరకు వస్తే తప్ప అతనికి ఆత్మశాంతి ఉండదు”.     

రాముకు సాహిల్ తో పరిచయం చదువుకునే రోజుల నుంచి ఉంది. అతడి ఆత్మాభిమానం, మంచితనం, నిజాయితీ.. అన్నీ తెలుసు. తను హసీనాను ప్రేమిస్తూ, కలలో నిద్రలో చేస్తున్న పనులు బాగాలేవు అని స్నేహితుడితో చెప్పిన వ్యక్తి. ఏదయినా వొక విషయం దాస్తే రాత్రంతా నిద్రపట్టని మనిషి. “తప్పు చేస్తున్నానన్న భావం ఇస్లాం దృష్టిలో అలాగే వుండనివ్వదు” అని నమ్మి, ప్రేమించిన హసీనాను పెళ్లి చేసుకున్న నిజమైన ఇస్లాం. అంతేకాదు, “ధర్మ బద్ధం కానిపని ఏదీ నేను చేయలేను. అది కేవలం నాశరీరానికి మాత్రమే పరిమితమయ్యే విషయం అయినప్పటికీ” అన్న ఫిలాసఫర్. భార్య హసీనా, కొడుకు ఫైజ్, స్నేహితులు ఫణి, రాము మాత్రమే అతడికి తెలిసిన ఆత్మీయ ప్రపంచం. అలాంటి సాహిల్ హటాత్తుగా కనిపించకుండా పోతాడు.     

     దాని వెనుక మత మౌఢ్యంతో చార్మినార్ చుట్టూ జరిగిన అల్లర్లు, శవాల చప్పుళ్లు. ముస్లింలపై జరిగిన దాడులు.. అనేకం. ముస్లింలను అనుమానించడం, అవమానించడం, అరెస్టులు చేయడం, తద్వారా వాళ్ల కుటుంబాలను అభద్రతాభావంలోకి, సంఘర్షణలోకి నెట్టివేయడం లాంటివి ఎన్నో.. అలాంటి నేపథ్యంలోంచే సాహిల్ కనిపించకుండా పోవడాన్ని చూడాలి. ఆ సామాజిక, రాజకీయ, మత పరిస్థితుల నుంచి సమాజం అతడిని చూసే దృష్టికోణాన్ని చెప్పాడు అఫ్సర్. అతడి గురించి అన్నీ తెలిసిన ఆత్మీయ స్నేహితుడు నోరు విప్పలేని నిస్సహాయత, అతడి కుటుంబానికి భరోసా ఇవ్వలేని బాధ, కూతురుతో ఆ విషయాన్ని ఎలా షేర్ చేసుకోవాలో తెలియని మౌనం... ఇవన్నీ కథలో కనిపిస్తాయి. సాహిల్ ను రెండు ప్రపంచాలుగా చూసే సర్కిల్ కు, తన భార్యకు ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? చెప్తే పర్యవసానం ఏంటి అనే బాధ రామును భయపెడుతుంది. పోలీస్ స్టేషన్ లో జరిగే సంఘటనలో...

సాహిల్ కనిపించడం లేదని అతని భార్య, రాము, ఫణి వెళ్తే.. ముస్లింతో స్నేహం చట్ట విరుద్దమైనట్లు చూస్తాడు సర్కిల్. “వొక్క విషయం చెప్పాలి. అతను ముస్లిం, మీరు హిందువులు. అతనిది ముస్లిం మైండ్! ముస్లింమైండ్ అంటే వయిలెంట్. అంత తేలిక కాదు అర్థం చేసుకోవడం – అది వొక మిస్టరీ! మీకు తెలియని లైఫ్ అతనికి చాలా వుండి వుంటుంది. ఇన్ని బాంబు బ్లాస్టులు, బస్సులు తగలబెట్టడాలూ, చావులూ, హత్యల తర్వాత కూడా మీకీ విషయం అర్థంకాకపోతే మీరు వొట్టి అమాయకులైనా అయి వుండాలి. లేకపోతే, తెలియని మాయలో ఇరుక్కొని వుండాలి.” అంటాడు. అది రామును బరించలేనింతగా బాధపెడుతుంది. వాళ్ల స్నేహంమీద నమ్మకాన్నే ప్రశ్నిస్తుంది. రెండుకుంటంబాల మధ్య ఎప్పటి నుంచో ఉన్న తెగని బంధాన్ని, ఆత్మీయతని ప్రశ్నిస్తుంది. నమ్మకంతో అర్థరాత్రి తన ఇంటికి వచ్చిన సాహిల్ భార్య హసీనా నమ్మకాన్నీ ప్రశ్నిస్తుంది.

ముస్లిం వ్యక్తులను అలాంటి సందర్భంలో సమాజం చూసే విధానం, వాళ్లను అంచనా వేసే ఆలోచనలు ఎంత దుర్మార్గంగా ఉంటాయో చెప్పే సంఘటన అది. వ్యక్తిని మతం కోణంలో, అప్పటి వరకు జరిగన అల్లర్లతో ముడిపెట్టి మంచితనాన్ని, హృదయసౌకుమార్యాన్ని కర్కశంగా.. వాళ్లకై వాళ్లు తమదైన దృష్టితో చూడడం ఎంత దుర్మార్గమో చెప్తుంది. మతం అనేది మనిషిని, వ్యక్తిత్వాన్ని, చర్యలను అర్థం చేసుకునే దిక్సూచిలా మారిన వైనానికి నిదర్శనం ఈ సంఘటన. అంతేకాదు సాహిల్ గురించి, అతని వ్యక్తిత్వం, నిజాయితీ, దృక్పథం, మంచితనం, ఆదర్శాల గురించి తెలిసిన రాము ఏమీ చెప్పలేక పోవడం, చెప్పలేని పరిస్థితి దాపురించడం ఎంత దయనీయమో చెప్పే సఘంటన. ముస్లిం వ్యక్తైన సాహిల్ కే కాదు, రాములోని మూలాలని, మానవీయమైన వాళ్ల స్నేహబంధాల్ని, నోరు విప్పలేని నిస్సహాయ స్థితిని ప్రశ్నించే సంఘటన.  

హిందువైన రాముకే రక్తం ఉడికిపోతా ఉంటే.. సాహిల్ భార్య హసీనాకు- “ హసీనాకు ఎప్పుడూ గుర్తుంటుంది కదా? అంటే. ఆ ముస్లిం అన్న లేబుల్ కింద పడాల్సిన అవమానాలు, అనుమానాలూ అన్నీ ఈ పాటికి అనుభవించే వుంటుంది! కాదంటావా? అని ఫణి ప్రశ్నిస్తాడు”. దానికి రాము దగ్గర సమాధానం ఉండదు. అంటే నిజమనే అర్థమన్నమాట.

          “పొద్దున ఇంటి నుంచి బయటికి వెళ్లిన మనిషి సాయంత్రం సజావుగా వస్తాడో రాడో తెలియని ఈ నగరపు బతుకులో- మతం అనేది చివరికి కలహకారణంగానే మిలిగిపోయిన ఈ రోజువారీ హింసలో.. ఆందోళన తట్టుకోలేక తప్పనిసరిగా పోలీస్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.”  

మతం మనుషుల మధ్య ఎలాంటి చిచ్చు రేపుతుందో, హింసతో ప్రాణాలు ఎలా తీస్తుందో తెలిపే వాక్యాలివి.

పోలీస్ స్టేషన్ లో జరిగిన సంఘటననే రాము పిడుగు పడినట్లు భావిస్తుంటే.. నమ్మకమైన స్నేహంలోని పొరలు ఒక్కొక్కటి విప్పుతూ ఆత్మీయ మిత్రుడి స్వచ్ఛమైన హృదయాన్ని, వయిలెంట్ మైండ్ గా చూస్తుంటే.. తట్టుకోలేకుంటే ... భార్య-

“మీరేమీ అనుకోనంటే వొక మాట అడగనా? ఆ పోలీసు స్టేషన్లో మీరు విన్నది నిజమేనేమో! మనకు తెలియని యాంగిల్ సాహిల్ లో ఇంకోటి ఉందేమో” అంటుంది. ఆ మాటలు అతడిని మరింత బాధపెడతాయి. ఆ మాటలు సాహిల్ లోని మరో కోణాన్ని కాదు, అది వారి స్నేహాన్ని ప్రశ్నిస్తున్నట్లు అనిపిస్తుంది. సాహిల్ ది అలాంటి వ్యక్తిత్వం కాదని బల్లగుద్ది చెప్పగల మనసును నిలదీస్తుంది. అప్పటి వరకు సాహిల్ ను ఒక మంచి మిత్రుడిలా చూసిన తన భార్య నీరు అతడిని ముస్లింలా చూడటాన్ని, మతంతో ముడిపెట్టి అతడి వ్యక్తిత్వాన్ని. చర్యలను అంచనా వేయడాన్ని తట్టుకోలేదు.

“నువ్వెవరికీ ఏమీ సమాధానం చెప్పలేవు. ఇప్పుడంతా సాహిల్ ని ముస్లిం అనే చూస్తారు. కాని మనిషి మిస్ అయ్యాడని అనుకోరు అలా వుంది ఇప్పుడు పరిస్థితి” అన్న మూడో మిత్రుడు ఫణి మాటలు గుర్తొస్తాయి. రచయిత కూతురు తితలీ “సాహిల్ మామూ వస్తాడు. తనతో ఆడుకుంటాడు” అన్న ఆశతో కథ ముగుస్తుంది.

కథలో సాహిల్ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా చెప్పి, కేవలం ముస్లిం మతస్తుడైనందున అతడిని సమాజం చూస్తున్న కోణాన్ని చిత్రించాడు అఫ్సర్. సాహిల్ ను అనుమానించడానికి పాతబస్తీ అల్లర్లు, వాటి వల్ల హైదరాబాద్ లో నెలకొన్ని పరిస్థితిని నేపథ్యంగా ఎంచుకున్నాడు. ముస్లింలలో ఉన్న మంచితనాన్ని కూడా మతంతో ముడిపెట్టి, ముస్లింల అందర్నీ వయిలెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్లలా చూసే వాళ్ల మైండ్ సెట్టే వయిలెంట్ అని తెలియజేశాడు. ఒక మనిషికి మరో రంగు పులిమి, వాళ్ల కోణంలో చూసే విధానం ఎలా ఉంటుందో, అందుకు మతం కారణమైతే ఎలా ఉంటుందో కూడా కథలో చూపాడు. అప్పటివరకు మనతో కలిసి, మనతో ఉన్న వ్యక్తిని సైతం నమ్మలేని దయనీయ పరిస్థితిని నీరు మాటల ద్వారా వ్యక్తీకరింపజేశాడు అఫ్సర్.

సాహిల్ వస్తాడా, రాడా, ఎక్కడికి వెళ్లాడు? రాకపోతే భార్య హసీనా, కొడుకు ఫైజ్ పరిస్థితి ఏంటి? సాహిల్ ను ఉగ్రవాదిగా చూస్తున్న సమాజం వాళ్లను ఎలా ట్రీట్ చేస్తుంది? సమాజం ముస్లింలను మంచిగా చూడలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? వ్యక్తికి, మతానికి ఉన్న సంబంధం వ్యక్తిత్వాన్ని ఎందుకు నిర్ణయిస్తుంది? మనిషిని మనిషిగా చూడలేని దుస్థితి వెనకున్న కారణాలేంటి? సాహిల్ గురించి బల్లగుద్ది చెప్పగల రాము నోరు విప్పితే పరిస్థితి ఏ విధంగా ఉండేది? నీరు ఆలోచన మారడం వెనుక ఎవరి ప్రభావం ఉంది? పసిపాప తితలీకి రాము సాహిల్ మామ గురించి అర్థమయ్యేలా ఏం చెప్పగలడు? వంటి ఎన్నో ప్రశ్నలు కథ ముగిసినా పాఠకుల మదిలో అలానే నిలిచిపోతాయి. వెంటాడతాయి. వేటాడతాయి. ఒక నిజాయితీగల ముస్లిం వ్యక్తిని, పైగా కనిపించకుండా పోయిన వ్యక్తిని, అతడి కుటుంబాన్ని.. మతంతో ముడిపెట్టి సమాజం చూసే దృక్కోణం, బాధ్యతగల పోలీసుల ఆలోచనాతీరు... దానివల్ల వాళ్లు ఎదుర్కొనే కష్టాలు, కన్నీళ్లే ఈ కథ.



                                  ---------------------    














Sunday, January 19, 2020

తోడుకునేవాళ్లకి తోడుకున్నంత

--సిరాశ్రీ

కవిత్వం అంటే ఇది అని ఒక్క ముక్కలో నిర్వచనం చెప్పడం కష్టం. అలా నిర్వచనం అనే చట్రంలో ఇరికిస్తే కవిత్వం కొత్త పుంతలు తొక్కదు. ఎవరు వ్రాసినా ఆ చట్రంలో ఇమిడి రాయాల్సొస్తుంది. ఛందస్సు అనే చట్రం నుంచి బయటకు వచ్చి శాఖోపశాఖలుగా విస్తరిస్తున్నదే వచనకవిత్వం. "కాదేదీ కవితకనర్హం" అని కవితావస్తువుని ఎంచుకునే విషయంలో చెప్పాడు శ్రీశ్రీ. "కాదేదీ కవితాశైలికి అనర్హం.." అని ఆధునిక వచన కవులు ఎందరో చెబుతున్నారు. కొన్ని కవితలు నేరుగా గుండెలోకి దూసుకుపోతాయి. కొన్ని మెదడుతో చెడుగుడు ఆడతాయి. కొన్ని కవి ఏదో చెప్తున్నాడు అది అందుకోవాలి అనే ప్రయత్నాన్ని చేయిస్తాయి. అయితే పాఠకుడి మానసిక స్థితి, పఠనశక్తి, కవితాసక్తి అన్నీ పరిగణనలోకి వస్తాయిక్కడ.
ఈ మధ్యన "అఫ్సర్ కవిత్వం" చదువుతున్నాను. అవును ఇంకా ప్రెసెంట్ కంటిన్యువస్సే. ఏకంగా 660 పేజీల వచన కవిత్వం...అఫ్సర్ అనే కవితాకర్షకుడు నాలుగు దశాబ్దాల పాటు పండించిన పంట. పైన చెప్పినట్టు కొన్ని దూసుకుపోతున్నాయి, కొన్ని మెదడుకి పని పెడుతూ...ఈ కవి భావనాసముద్రపు లోతుల్ని చూసేలా స్కూబా డైవింగ్ చేయిస్తున్నాయి.
పుస్తకం అందుకున్నాక నోట్లు లెక్కపెట్టే టెల్లర్ మేషీన్ లాగ పేజీలని వేగంగా తిప్పి ఒక చోట ఆపాను. నా కంట పడిన పంక్తులు:
"నా కవిత్వపాదానికి విగ్రహం లేదు
నిగ్రహం లేదు
ఆగ్రహం తప్ప...
నా కవిత్వపాదానికి మరణం లేదు
జీవితం తప్ప...
మరణం కడుపులోంచి పుట్టిన యుద్ధం నా కవిత్వం
మరణించలేకపోవడమే కవిత్వం".
సూటిగా ఉన్న ఈ పంక్తులు చైతన్యాన్ని, స్ఫూర్తిని సూచిస్తున్నాయి. మళ్లీ పేజీలు సర్రున తిప్పి ఆపాను. ఇది కనపడింది:
"అందరూ మాట్లాడుతున్నారు
అయినా అందరూ మౌనాన్ని చర్చిస్తున్నారు.
అందరూ తగవులాడుతున్నారు
అయినా అందరూ నిశ్శబ్దాన్ని స్వప్నిస్తున్నారు.
నరనరాల్లో అనుక్షిపణులు తయారవుతున్నాయి
అయినా అందరూ శాంతిని ఘోషిస్తున్నారు"
వర్తమాన చింతన, అధిక్షేపం కలగలిసిన ఈ పంక్తులు ఒక తపస్వినుంచి రాలిపడ్డట్టు అనిపించింది.
ఇక పేజీలని ఒబ్బిడిగా తిప్పుతూ, తీరుబడిగా కూర్చుని చదవడం మొదలుపెట్టాను. ఇంకా కాస్త కాస్తగా చదువుతూనే ఉన్నాను.
ఒక చోట ప్రతి మానవుడికి ఎదురయ్యే నిజమైన మరణాన్ని గురించి ప్రస్తావన ఉంది.
అఫ్సర్ మాటల్లో..
" హత్యలో
ఆత్మహత్యలో
భ్రూణహత్యలో
కాదు మరణమంటే..
వెంటవచ్చిన విశ్వాసం నిర్దాక్షణ్యంగా
హృదయాన్ని కొరికి పుండు చేసినప్పుడు,
ఒక పరిచిత హస్తం
మృత్యు ఖడగంగా రూపెత్తినప్పుడూ
నిజంగా మరణం".
ఇలా వివరణ అవసరంలేని ఎన్నో కవితాపంక్తులు మనసుకి చలనం తీసుకొస్తాయి.
అలాగే ఒకటికి పదిసార్లు చదివించి, చదివిన ప్రతిసారి ఒక్కో సన్నివేశాన్ని ఊహించుకునేలాంటివీ ఉన్నాయిందులో ...
ఇదొక్కసారి చూడండి:
"పద్యం రాద్దామనుకున్నాను
...
ఎన్నో దారుల చీకట్లని తవ్వి తలకెత్తాను
ఎన్నో పరిమళాల మట్టి వాసనల్ని
తడిమి మొలకెత్తాను..
రాని వుత్తరాల నిరీక్షణోద్వేగాన్ని
గుండె మీద భారంగా ఒంపుకున్నాను
మాట మరచిన స్నేహితుడి
నిర్లక్ష్య నేత్రాన్ని ఒక్కసారి తలచుకున్నాను
సంకేత బిందువు దాటిన
ఆమె నిగ్రహాన్ని వూహించుకున్నాను
ఇక రాయడానికి అక్షరం మిగల్లేదు".
ఇక్కడ కవి చెప్పేది విషాదమా? విరహమా? ఆ రెండూ అయితే రాయడానికి అక్షరం మిగలకపోవడం ఏమిటి? ఆ రెండూ కవిత్వంలో పండిచడం తేలికే కదా అనుకున్నాను.
మళ్లీ చదివాను..ఈ సారి కవి చెప్తున్నది నిర్లిప్తత ఏమో అనిపించింది. అవును అది అయితేనే ఏమీ రాయబుద్ధికాదు. అందుకే ఆయనకి అక్షరాలు మిగల్లేదు.
అదీ..అలా ఉంటాయి అఫ్సర్ ప్రయోగాలు. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి.
ధారగా పడుతున్న వర్షం శబ్దం బాగుంటుంది. మధ్య మధ్యలో ఉరుములు వినిపిస్తుంటాయి. అఫ్సర్ కవిత్వమూ అంతే...ప్రతి కవిత ధారగా కురుస్తున్న వర్షం అయితే మధ్యలో ఇలాంటి ఉరుములు...మచ్చుకి ఈ రెండూ చూడండి:
"...వెళ్తున్నా నేను
శబ్దానికి
నిశ్శబ్దానికీ మధ్య
నిట్టూర్పుని వూది".
"తరగతి గదుల గోడల మధ్య
ఇంకిపోతున్న చరిత్ర కంఠశోష".
వీటికి వివరణలు అక్కర్లేదు. ఉరుముల్లాంటి ఈ పదాలు పాఠకుల మెదళ్లలో మెరుపులు మెరిపిస్తాయి.
అయితే ఇందులో కొన్ని వచనాలు మరీ భావగర్భితంగా ఉన్నవి ఉన్నాయి. ఏదో తగిలీ తగలనట్టు ఉంటూ రెండు మూడు సార్లు చదివినా లోతు అంతుబట్టదు. ఇలాంటి వాటి మీద బహుశా డాక్టరేట్ పరిశోధనలు జరగవచ్చు. . రక్తస్పర్శ, ఇవాళ, వలస, ఊరిచివర, ఇంటివైపు అనే నాలుగు సంపుటాల్ని "అఫ్సర్ కవిత్వం- అప్పటి నుంచి ఇప్పటి దాకా" అని ఒక కవితాగ్రంథంగా వచనాకవితాభిమానుల ముందుకొచ్చింది. తోడుకునేవాళ్లకి తోడుకున్నంత అన్నంత ఊటగా ఉంది. ఈదగలిగేవాళ్లకి ఈదగలిగినంత అన్నంత విస్తారంగా ఉంది. ఎమెస్కో, అన్వీక్షికి, అమెజాన్ లు ఈ పుస్తకాన్ని పాఠకలులకి అందజేస్తున్నాయి.
ముక్తాయింపుగా ఒక మాట-
ఆయనపేరు అఫ్సర్
ఆయన కవిత్వం అత్తర్
స్వస్తి.
*

Thursday, January 2, 2020

అఫ్సర్‌లోని ప్రధాన సంఘర్షణ ఇదే

 -ఎం. నారాయణ శర్మ
బహుశ : ఒక పూర్తి కావ్యంగా కాక ఖండికలుగా వస్తున్నప్పటినుంచే వచన కవిత్వం, పద్య ఖండికల్లో అనేక పొరలు (Multi layer) కలగలిసి ఉంటాయి. సుస్పష్టమైన సామాజిక భూమికను పోషించడం తప్పనిసరైన సమయం కావడంవల్ల ఈ అంశం ప్రతి కవిత్వంలోనూ కనిపిస్తుంది. కాని వ్యక్తి ఆత్మ, కాలపు ఆత్మ ఈ రెండు కవిత్వంలో కవి స్వరూపాన్ని నిర్ణయిస్తాయి. అఫ్సర్ ‘ఇంటి వైపు’ చెబుతున్న ఒకనొక సామాజిక, సమకాలీన సందర్భం ఇదే. ప్రాథమికంగా ‘ఇంటివైపు’ అనే పదం లోపలికి వెళితే అందులోని కవిత్వ వాతావరణం, మార్దవమైన గొంతు, అందులో పలికే సంవేదన ఇవన్నీ ‘నాస్టాల్జియా’ (Nostalgia)గా కనిపిస్తాయి. ప్రాథమికంగా నాస్టాల్జియా ప్రదేశానికి సంబధించిందిగానే చెబుతారు. కాని భాషాపరంగా ఇంటికి ఊరికి వేర్వేరు అర్థాలున్నాయి. ఇంటికి ఉండే మత, కుల, ఆర్థిక, సాంస్కృతిక సంబంధమైన ఉనికి ఊరికి సంబంధించిన ఉనికి ఒకేలా ఉండదు. అందువల్ల . అఫ్సర్ కవిత్వంలో ఇంటికి ఇవన్నీ ఆపాదించుకోవాలి. ఈ కవిత్వంలో అఫ్సర్‌లోని ప్రధాన సంఘర్షణ ఇదే. సమకాలీన సమస్యలు. కోరికలు వగైరాలున్నా. ఇల్లును గురించిన అనేక ఆవేశాల సమాహారమే ఈ కవిత్వాన్ని చర్చకు పెడుతుంది.
Nostalgiadefined as sentimental longing for ones pastis a self-relevant, albeit deeply social, and an ambivalent, albeit more positive than negative, emotion. … Also, nostalgia- elicited meaning facilitates the pursuit of ones important goals
(నాస్టాల్జియా ; ఒక వ్యక్తికి సంబంధించిన భావగర్భితమైన భ్రాంతి, కోరికగా, ఆత్మ సంబంధమైందిగా నిర్వచింపబడింది. అయినప్పటికీ లోతుగా అనేక విషయాలతో కలగలిసిపోయింది. అనిశ్చయమూ, ద్వంద్వ ప్రవృత్తిగలిగినది అయినప్పటికి ఎక్కువగా నిశ్చయమైనది. కొంత అనిశ్చయం, ఉద్వేగం కూడా. నోస్టాలిజియా ఒకరి ముఖ్యమైన లక్ష్యాలు వెంబడించడాన్ని సులభంగా వ్యక్తం చేస్తుంది.)
ఈ నిర్వచనం అఫ్సర్ కవిత్వానికి సరిపోతుంది. అఫ్సర్ రాసిన అంశాలల్లో ఇల్లు కేవలం ఇల్లు మాత్రమే కాదు అనేక సాంఘిక, రాజకీయ సంఘర్షణలకు మూలం కూడా. ముఖ్యంగా కొన్ని బహిష్కరణల గురించి మాట్లాడిన సందర్భాలున్నాయి. అందువల్ల అఫ్సర్ కవిత్వంలోని ఇంటివైపులో ఈ సంఘర్షణలున్నాయి. జ్వాన్ జెల్మన్ (Juan Gelman) కవిత్వంలో ఇలాంటి భావనలు కనిపిస్తాయి. జెల్మన్ కవిత్వంలో ‘ప్రవాసంలో ఉన్న జ్ఞాపకాలు కేవలం విషాద భరితమైనవో, కోరికలో కావు. సమస్యాత్మకమైన ప్రగతి, ఆధునీకరణపై పోరాటం, సమాజం నుండి బహిష్కరింపబడిన సభ్యుడిగా తనను తాను మళ్ళీ సమాజంలో భాగంగా సృష్టించుకునే ప్రయత్నం. అందువల్ల ఈ కవిత్వ(జెల్మన్ కవిత్వ)అధ్యయనం అత్యంత వ్యక్తిగతమైందిగా(highly personal) అంతర్గతవ్యక్తిత్వానికి (Communal) లేదా మత సంబంధమైన ఆత్మల ప్రతిప్సందనగా గమనించాలి’ అని విమర్శకులు భావించారు. అఫ్సర్‌లోనూ ఈ మూలాలున్నాయి
1. అయినా /నా దేశభక్తిని నువ్వు నీద్వేషంతో కొలుస్తావ్/నువ్వు ద్వేషిస్తూనే వుంటావ్/నన్ను ప్రేమిస్తూ ఉండమని చెప్పి/నా చుట్టూ గాలినిఖైదు చేస్తావ్/అప్పటికీ/నేను ప్రేమిస్తూనే వుంటాను/నీ చేతులు ఖడ్గాలై నన్ను ఖండఖండాలు చేస్తున్నా సరే’ -(యింకో ద్వేష భక్తి గీతం.పే.227)
2. నా పేరు చివర మహమ్మదో అహమ్మదుషెకో/సయ్యదో ఖానో వున్నా నేను మంచి బాలుణ్ణిరా/కాగితం తుపాకీని చూసినా /మూర్చపోయే అమాయకుణ్ణిరా/నమ్మరా నన్ను నమ్మరా’ (నా పేరు-పే.151)
3. వాళ్ళెవరో యేమిటో యిప్పుడేమీ గుర్తులేదు నాకు. నామీది యెర్ర మరకల్లాగే వాళ్ళూ నెమ్మదిగా చెరిగిపోతున్నారు. పేర్లూ, ఊళ్ళూ దేశాలూ మరచిపోతున్నాను కాని, నన్ను హత్తుకున్న ఆ వొంటి వెచ్చదనం యిప్పుడూ అంటుకుని ఉంది. అప్పుడప్పుడూ అది కార్చిచ్చులా అంటుకుంటు వుంది -(నెత్తుటి చొక్కా స్వగతం)
4. నేనిలాగే యీ మంచాన్ని అంటి పెట్టుకొని ఉంటాను. జ్వరమేదో నన్ను పొయ్యి మీది రొట్టెలా కాల్చేస్తోందని వొంటి పొరలన్నీ వెతుక్కుంటూ వుంటాను. ఆ సెగని… కాల్చేస్తే కాల్చెయ్యనీ-అని అలా దగ్గిరగా తీసుకుంటూనే ఉంటాను. ఇష్ట ప్రాణంగా-(చెమ్మదీపం.పే.81)
ఇలాంటి వాక్యాలను గమనించినప్పుడు స్పష్టాస్పష్టంగా అఫ్సర్ రాజకీయాల గురించి ముఖ్యంగా మతరాజకీయాల గురించే మాటలాడుతున్నాడని అర్థమవుతుంది. ఇలాంటి వాక్యాలన్నిటిని అది నియంతృత్వ నాస్టాల్జియా (paradictatorial nostalgia) గా పరిశీలకులు భావించారు.‘the poetry of this study is both a highly personal (individual) and intra-personal (communal) response to a present trauma, (ఈ కవితాధ్యయనం రెండు అంశాలతో కూడింది. వర్తమాన గాయాల నుంచి వ్యక్తిగతం, మత సంబంధమైన ప్రతిస్పందన) జెల్మన్‌కు అఫ్సర్‌కు సారూప్యత కనిపించేది ఇక్కడే. అఫ్సర్ కూడా వర్తమాన పరిస్థితుల నుంచి తన వ్యక్తిగత జీవితం వైపుకు వెళ్లి మాట్లాడుతున్నారు. వర్తమానం బలంగా గతానికి ముఖ్యంగా అందులోని సంఘర్షణకు తీసుకు వెళుతుంది. అందువల్ల ఎక్కువ నాస్టాల్జియాగా, ఇంకొంత మత సంబంధమైనదిగా ఈ కవిత కనిపిస్తుంది. శైలి గతంగా అఫ్సర్‌లో సున్నితత్వం ఉంటుంది, గొంతుక దుఃఖంగా ధ్వనిస్తుంది. ధిక్కారమో మరొకటో కనిపిస్తే ఈ కవిత్వం అస్తిత్వ దృష్టితో రాసిందిగా కనిపించేది. కాని సున్నితమైన సంవేదనాత్మక కథనం వల్ల ఇది మరోలా కనిపిస్తుంది అన్ని చోట్లా సుమారుగా ఈ సంవేదన కనిపిస్తుంది. మానసికమైన చింతన కనిపిస్తుంది. కాని వ్యక్తిగతమైన చింతన వల్ల తాత్త్వికమైన జీవితం ధ్వనిస్తుంది. పై భావాంశాలల్లో మొదటి రెండు ప్రత్యక్షంగా మతం గురించి, ఆయా సంఘర్షణల గురించి మాట్లాడినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది.
వీటిలో వర్తమాన సందర్భం కూడా స్పష్టంగా ఉంది. మూడు నాలుగుల్లో ఇలాంటి గతం కార్చిచ్చులా అంటుకుని పీడించటం కనిపిస్తుంది. ‘వొంటి పొరలు’ గత జీవితంలోని అనేక సన్నివేశాలను సంకేతిస్తాయి. ‘జ్వరం’ పట్టి పీడిస్తున్న బాధను సంకేతిస్తుంది. మూడులో తాను దేనికి దూరంగా పోయాడో. ఏ ముద్రను తప్పించుకునేందుకు, ఎన్ని మరచిపోయాడో కాని అవన్నీ మరచినా ఆ ఉనికిలోని వెచ్చదనం తనను వెంటాడడం వల్ల మనిషిగా ఎటు నిలబడుతున్నాడని చెప్పడం కనిపిస్తుంది. అఫ్సర్‌లోని నాస్టాల్జియా కేవలం జ్ఞాపకాన్ని ఆనుకుని ఉన్నదికాదు. ఆ జ్ఞాపకాల తాలూకు దుఃఖాన్ని విషాదాన్ని మోస్తున్నది కూడా. అందువల్లే కొంత చిటపటగా ఉండడం, వ్యాకూలంగా ఉండడం, మొరటుగా మాట్లాడడం నిరాశగా మాట్లాడడం కనిపిస్తాయి. ఈ నిరాశలోంచి తాత్త్వికంగా కనిపించడమూ ఇలాంటిదే. కవిత్వం దానికి ఆకారమైన భౌతిక జీవితం, దాని సమస్యలు వాటి వెనుక సంవేదన అవి కవిత్వమౌతున్న తీరు మీద జరగాల్సినంత చర్చ జరుగలేదు. ఇంటివైపులో జీవితం, దానిని అనుకున్న సమస్యలు, వాటిని వ్యక్తం చేసేందుకు ఎన్నుకున్న మార్గం అన్నీ స్పష్టం. అయితే వచనంలోని నిస్పృహ వల్ల తాత్వికంగా పరిమళించడం కనిపిస్తుంది. ఇది ఎంతవరకంటే కొన్ని సార్లు ఈ వ్యాకూలతకు నిస్పృహకు కారణమైన జీవితాన్ని అస్పష్టం చేసేదాక కూడా.
1. యింకా కొంత అలవాటుపడని రహస్యమో/నిన్నొక మిస్టరీ వరదగుడి చేసేదేదో ఉంది నీలో//తోవ పొడవునా తవ్వుకుంటూనే ఉంటావే/యింకా బయట పడని నిక్షిప్తత ఎదో తవ్వుతూనే ఉంది నిన్ను//ఒకే ఒక్క చిన్న అనుమానమై /నిన్ను నువ్వుపగలగొట్టుకుంటూ వుంటావ్, పగలూ రాత్రీ’
2.పెద్దపెద్ద సముద్రాల్ని మరీ చిన్న చిన్న పడవల్తో తోడేద్దామని అనుకుంటావే గానీ/నీ పడవనే వంచించిచే నీటి చుక్కలు ఉంటాయని/మరచిపోతావ్ యెప్పుడూ-/యెప్పటికప్పుడు మునిగిపోవడమే/తిరగదోడుకునే బతుకు పాఠమైనప్పుడు/యే అనుభవన్నీ నువ్వు ప్రేమించలేవు/యే క్షణంలో నైనా తలమునకలై బతకలేవు’
3.అయినా సరే/కింద ఏ మాత్రం నిలబడనివ్వని నేల మీదికి కాళ్ళని దూస్తూ వుంటావ్/ఎప్పుడూ వోడిపోయే యుద్దానికి-(అలవాటు పడని తనమేదో.పే.244/245)
ఒక మెలాంకలిక్ భావన, సాంద్రమైన తలపోత, తనలో తాను మాట్లాడుకున్నట్టుగా ఉండే కథనం ఇవన్నీ కవితను మలిచాయి. ఇదంతా అఫ్సర్‌లోని విశ్వమానవుడికి, అస్తిత్వ మానవుడికి మధ్య సంఘర్షణ. ఇందులో అంసాన్ని చెప్పేవి. ‘మిస్టరీ వరద గుడిని చేసేది ‘అంటే దుఃఖమయంగా చేసేది. గతం. దొవ పొడగునా దాన్ని తవ్వుకుంటూ పోతూనే ఉంటుంది. కాని నిక్షిప్తమైందేదో అంతు చిక్కదు (బహుశః చిక్కిన అంగీరించే స్థితి లేదు). సముద్రాలు సమస్యకు కారణమైన విషయం. దాన్ని తొలగించడానికి చేసే ప్రయత్నాలను సంకేతించేవి పడవలు. రెండవ వాక్యంలో వచ్చే పడవ‘నీ పడవనే వంచిచే’ లో ఉన్న పడవ సంకేతించేది జీవితాన్ని.’ఎప్పటికప్పుడు తిగ దోడడమే బతుకు పాఠమవడం‘వర్తమాన సంఘర్షణ.‘నిలబడనివ్వని నేల‘మళ్ళీ భౌతిక ప్రపంచం.
ఇలా ఒక సంఘర్షణ కవితగా మారే సమయంలో చాలా అంశాలు ప్రతీకలుగా, వాక్యాలుగా నిలబడతాయి. అయా వాక్యాలు చెప్పే సారం నుంచే తప్ప,గతంలోని అధ్యయనానికి లోబడి ఆయా స్వాభావాలనుంచి కవితను వ్యాఖ్యానించడానికి వీలవని సృజన ఇది. ప్రతీకలు ఎప్పటికప్పుడు కొత్త స్వభావాన్నికప్పుకోవడం ఇక్కడ కనిఒఇంచే అంశం. అఫ్సర్‌లో వాక్యాలు ప్రకటనాత్మకంగా కదులుతాయి. వాక్యానికి కొన్ని సార్లు భౌతిక, కొన్ని సార్లు కళ,కొన్ని సార్లు ప్రకటనాత్మక ప్రవర్తనలుంటాయి. ఎప్పటికప్పుడు వాక్యం యొక్క స్వభావాన్ని అవి చెబుతుంటాయి. మొత్తంగా ఈ కవిత భారమైన రాజకీయంగా ఎదుర్కొంటున్న జీవితాన్ని స్పష్టంగా వ్యాఖ్యానిస్తుంది. కొంత అస్పష్టంగా కవిత్వీకరిస్తుంది. జీవితం కవిత్వమౌతున్న తీరుపై ఇంకా విశ్లేషణలు జరిగితే ఈ ప్రకటనలోని విషయాలు బాగా అర్థమౌతాయి.

Tuesday, September 25, 2018

ఇంటివైపుకోసారి...


-భవాని ఫణి 
~

ఎంతటి వారినైనా పసివారిని చేసి ఆడించగలిగేవి వారి వారి చిన్ననాటి జ్ఞాపకాలేననుకుంటాను. మనల్ని మనమే నిత్యం గమనించుకుంటూ, బేరీజు వేసుకోవడం చేతకాకయితేనేం, మనదైన స్వంత లక్షణంతో బ్రతికేయడం - అప్పుటికి రావడమే అందుకు కారణం కావచ్చు. ఆ ఏమీ తెలీనితనాన్నీ గుర్తు చేసుకోవడమంటే, కోల్పోయిన మనల్ని మనం తిరిగి కలుసుకోవడమే కదా. ఎప్పటికప్పుడు కలుగుతున్న స్పృహలనన్నీ అక్షరాలుగా మార్చి, మనసు తెల్లకాగితం మీద రంగురంగుల్లో రాసేసి, మన 'గతం' మనకందించిన జ్ఞాపకాల ఉత్తరాల కంటే విలువైనవి ఇంకేముంటాయి జీవితంలో! ప్రపంచాన్ని మనకీ, మనల్ని ప్రపంచానికీ పరిచయం చేసిన అమ్మలాంటిదే కదా గతం కూడా. ఆ కమ్మని జ్ఞాపకాల్ని విప్పుకున్నప్పుడల్లా, వింత వింత అనుభూతులేవో కుప్పల్లా రాలి పడి, రాశి కడుతుంటాయి. ఎన్నెన్నో అవన్నీ...కొన్నికొన్ని ఆనందాలూ, ఉద్వేగాలూ, మరికొన్ని కొన్ని దుఃఖాలూ, దిగుళ్లూ.
అప్పుడప్పుడోసారి, ఎవరైనా ఇలా వింత బెంగతో తల్లడిల్లకపోతే, దాని గాఢ పరిష్వంగంలో చిక్కుకుని అల్లాడకపోతే, తమని తామెక్కడో పోగొట్టుకున్నట్టే మరి. అటువంటప్పుడే అఫ్సర్ గారి 'ఇంటివైపు'కోసారి వెళ్ళొస్తే సరిపోతుంది. భుజాలకి విమానం రెక్కల్ని మొలిపించుకు మరీ ఎగిరిపోతూ... ఎప్పటెప్పటివో కలల్లాంటి కొన్ని సీతాకోక చిలుకల్ని వెంబడిస్తూ, ఈ యాంత్రిక ప్రపంచం నుండి దూరంగా తరలిపోయే, ఆయన ఆ అందమైన వాహనంలో, మనమూ ఓసారి ప్రయాణించాల్సిందే. ఇప్పటి వయసు తెచ్చిన జ్ఞానమనే భాషతో, అనుభవం తెరిచిన వేదాంతి మనసుతో, ఆనాటి పసితనపు స్వచ్ఛతనోసారి ఆయనలా ప్రేమగా పలకరిస్తున్నప్పుడు, తేనెను తెచ్చే తేనెటీగా, తేనె తుట్టలో తేనెచుక్కా - ఒకటిగా మారి ఏర్పడే తేనెపట్టులాంటి నిజమొకటి, మన కళ్ళకూ, మనసుకూ కూడా రుచ్యమవుతుంది.
ఈ కవితా సంపుటిలోని 'ఇంటివైపు' కవితే చూడండి...
చాలా ఏళ్ళ తర్వాత, మన బాల్యాన్ని దాచుకున్న ఊరివైపెళుతుంటే, మనసెలా ఉంటుంది! క్షణాలెంత బరువెక్కిపోతాయి! కాలాన్ని చక్రంగా చేసి గిరగిరా తిప్పెయ్యాలనిపించదూ...
"అక్కడందరికీ
అక్కడన్నిటికీ
నా ఈ అలికిడి వినిపిస్తూనే ఉందేమో!"
తనలో కలిగిన ఆ వింత అలజడిని, తను పెరిగిన ఇంటికో, తన స్వంత ఊరు మొత్తానికో ఆపాదించేంత ఉద్వేగం! అంతలోనే, ఎదురుకాబోయే ఆ మధురానుభవాలు కాసినీ, కాలంలో పడి కరిగిపోయే పంచదార గుళికలేనన్న స్పృహ తెచ్చే బెంగ మరోవైపు...
"మనసు కూడా ఇరుకనిపించే సంతోషాన్నో
మళ్లీ వదులుకుని రావాలన్న దిగులునో
కాస్త ముందే సిద్ధం చేసి పెట్టుకుంటాను"
ఇదొక్కటే కాదు, ఈ 'ఇంటివైపు'లోని ప్రతీ కవితలోనూ మనల్ని మనం లీనం చేసుకుంటాం. కాసేపు మనతోనే మనం, ఆ మాటల్ని చెప్పుకుంటున్నట్టుగా భ్రమిస్తాం.
"ఎంత నిదానంగా వెనకడుగులు వేసావో
అంత తపనగా మళ్లీ ఆ అడుగులన్నీ
జీవితం నుండి అడిగి అడిగి తెచ్చుకుంటావ్ నువ్వే!"
అన్నారు 'చిన్ని పాదాలు' అనే కవితలో ఆయన. అవును... అడిగి అడిగి మరీ తెచ్చుకుంటాం - మనవైన మరి కొన్ని జ్ఞాపకాలని, మరుపు కొండల్ని తవ్వి మరీ, మన గతాల్లోంచి.
ఇంటికి చెందిన జ్ఞాపకాలతో, బెంగల్తో మొదలయ్యే ఈ పుస్తకంలోని పేజీలన్నీ, పోయే కొద్దీ, మరింత క్లిష్టమైన అనుభవాల్నీ, అనుభూతుల్నీ తర్కించుకుంటూ తిరిగిపోతాయి. ఓ పరాయి నేలా, మరో జ్వరమూ, ఇంకో షంషాద్ బేగం స్వరమూ, మరో గజల్ పై మోహమూ, కావేరీ తీరమూ, రాత్రై వెలిగిన పద్యమూ, అన్నం మెతుకు ఆక్రోశమూ, ద్వేష భక్తి గీతమూ...నిజమే, పుస్తకం పూర్తవుతుంది గానీ, నిజానికి మాటల సంచీ ఖాళీ అవనే అవదు. వినాలనుకున్నవింకా మిగిలే ఉంటాయి.
చివర్లో, ఈ కవితా సంపుటి గురించి అఫ్సర్ గారు రాసుకున్న "మా ఇంటి దాకా...!" చదివినప్పుడు, మా అత్తగారంటుండే ఓ మాట గుర్తొచ్చింది.
'చదువుల కోసమని పిల్లల్ని మరీ పసివయసుల్లోనే దూరంగా పంపేసి, వాళ్లాడుకున్న వస్తువులన్నీ సర్దుతున్నప్పుడు, మనిషి పోయినంత ఏడుపొచ్చేదట ఆవిడకి!'. ఎప్పుడో మనం వదిలి వచ్చేసినవన్నీ, ఇప్పటికీ మనల్నింతగా కదిపి కదిలిస్తుంటే, అలా పంపించి మనల్ని దూరం చేసుకున్నవాళ్లంతా, అప్పటికీ ఇప్పటికీ మనకోసమని ఇంకెంతగా తల్లడిల్లుతుంటారో కదా!
*

Monday, August 20, 2018

అనేక దూరాల ప్రయాణం అఫ్సర్!


Image may contain: 5 people, including Afsar Mohammed, people smilingGenuine poetry can communicate before it is understood…..TS. Eliot
ఆయన కవిత్వం ఇంకా పూర్తిగా అర్థం అయ్యేలోగానే, తాను అనుకొన్న భావాన్ని, పాటకుడి మనసు లోకి ప్రవేశ పెడతాడు. అందుకే అఫ్సర్ కవిత్వం హడావుడి గా చదివేది కాదు. చక్కగా తలస్నానం చేసి, ఆరుబయట చల్లటి గాలి లో, వేడి ఫిల్టర్ కాఫీ తాగుతూ, చదవాలి. చదివిన కవితలోని వాక్యాలను , కవితాసక్తి ఉన్న యువకవికొ, కవియత్రికో చెపుతూ, గుండెల నిండా ఆ ఆనందాన్నో, ఆ ఉద్వేగాన్నో అనుభవిస్తూ ఉండాలని పిస్తుంది. నా మటుకు నేనైతే, ఆయన కవిత్వాన్ని ముఖ్యంగా వలస, “ఇంటివైపు” చదివి, కవితాశక్తి ఉన్నవాళ్ళతో ఆ కవిత్వంలోని వాక్యాలను షేర్ చేసుకొన్నాను. అఫ్సర్ తో పరిచయం ఒక గొప్ప విశేషం.
.
నేను ఆంధ్ర భూమి లో జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు అఫ్సర్ అనంతపురం ఆంద్ర భూమి కి ఎడిషన్ ఇంచార్జ్ గా ఉండేవారు. మేడం కల్పనా గారు కూడా అక్కడ మా డెస్క్ చూసే వారు. ఎంతగా ప్రోత్సహించే వారో నాకిప్పటికీ గుర్తే. ఆయన అమెరికా కు వెళ్ళే సమయం లో తన దగ్గర ఉన్న వెయ్యి కి పైగా సాహితీ పుస్తకాల తో పాటు, అవి ఉంచుకోవడానికి రాక్ లు కూడా పంపినారు.
..
ఆయన అనంతపూర్ లో ఉన్న రోజుల్లో రాయలసీమ సమస్యలపి తనదైన శైలి లో మొత్తం జర్నలిస్టులందరినీ రాయమని చెప్పేవాడు. ఆయన ఎన్నో వ్యాసాలు రాసాడు. రాయలసీమ కె ప్రత్యేకం అనే అంశాలు నాతో చాల రాయించాడు. సీమ కె ప్రత్యేకమైన అనేక అంశాల పై ప్రత్యెక శ్రద్ధ చెప్పి నాతో రాయించాడు. అలాగే, ఇక్కడ గూగూడు లో ఆయన రాసిన the festival of pires పీర్ల పైన అంతర్జాతీయ స్థాయి లో ఆయన పుస్తకం ఖ్యాతి గాంచింది. ఆయన ఇటీవల విడుదల చేసిన కవితా సంకలనం “ఇంటివైపు’ నా దగ్గరకు చేరడమే ఒక ప్రత్యేక పరిస్థితి. ఎలాగోలా కష్ట పడి తెప్పించుకొన్నాను.
సాదాసీదా సాఫీ వాక్యంలా సాగే అఫ్సర్ వాక్యం అంత సాదా కాదు అర్థం అనంతం. చదువుతున్న ప్రతిసారీ ఏదో ఒకటి కొత్త గా కనిపించటం ప్రత్యేకత. ఆడంబరం అలంకారం అద్దని అతి సాధారణ సరళ పదాల సహజమైన అందం అఫ్సర్ కవిత్వం. కానీ... పైకి కనిపించినంత నిరాడంబరత ఆ కవిత్వం చదువుతున్నప్పుడు కనిపించదు. ఓ నిశ్శబ్దం మనలోకి ప్రవేశించి విస్ఫోటనం చెందుతున్న శబ్దం కచ్చితంగా విని తీరతారు. అప్పుడు అసలు కవిత్వం అర్థం అవటం మొదలౌతుంది. ఒకే కవిత, చదువుకున్న ఒక్కొక్కరికి ఒక్కోలా వినిపిస్తుంది. ఒకే చదువరికి, చదువుకున్న ప్రతిసారి ఒక్కోలా కనిపిస్తుంది. మొత్తానికి ఏదో తెలియని అస్పష్ట అవ్యక్తతల మధ్య స్పష్టత స్పృశించి బయటకు వస్తాం.
అతని కవిత్వం... ఒక నిరంతర చింతనా.. నిరంతరాన్వేషణా.. అంతఃశోధనా.. ఆత్మావలోకనా.. అలౌకికతా... తాత్వికతా.. ఏదైనా.. అతని అక్షరాలెప్పుడూ అనేక భావాల్ని అభావంగా అలా వదిలేసి వెళ్ళిపోతాయి. అనేక భావాల్ని అభావంగా .. ఏంటీ అనిపించొచ్చు. అభావంగా అంటే.. అతని కవిత్వం ఉప్పెనై ఎగిసిపడదు.. ఆవేశమై ఆగ్రహించదు.. ఆరాటమై కంగారు పడదు.. ఆవేదనై పొంగి పొర్లదు.... కానీ... చదువరి మస్తిష్కాన్ని మౌనంగా ముంచేస్తది. ఆలోచనల్ని ఆక్రమించేస్తది. మోహాన్నీ అమోహంగా చెప్పటం.. అక్షరాలుగా చూస్తే అస్పష్టత గోచరిస్తూ.. చదువరికి మాత్రమే స్పష్టమయేలా రాయటం.. ఏం చెప్పారూ.. అనిపించటం.. ఎంత చెప్పారు అనిపించటం..
..
Poetry is a type of literature based on the interplay of words and rhythm....అక్షరాల అఫ్సర్ అక్షరాలతో చేసిన విన్యాసమే ఆయన “ఇంటివైపు” కవితల సంకలనం. చెప్పూ చెప్పూ చెప్పూ //గొంతులో సముద్రాన్ని జోకొట్టినట్టు //సముద్రం లో పదాల్ని విసిరేసినట్లు //3//యీ లోకంతో ఇంకేం పని అని //పడుకొంటాను మూడ౦కెలా-//కలల్ని వేలాడేసి//ఖాళీ తనాలపంకీకి -//
Poetry comes from the highest happiness or the deepest sorrow….. ఏపిజే అబ్దుల్ కలాం అన్న మాట అక్షరాల నిజం. అఫ్సర్ కవిత్వం లో గాయపడిన కవి గుండె కనిపిస్తాది. గాయం చేసిన నొప్పి ని పాటకుడి లోకి పంపుతాడు. కవిత పూర్తి అయ్యే లోగా అతడి నొప్పిని, గాయాన్ని మటుమాయం చేస్తాడు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అది నా స్వానుభవం.
..
ఎక్కడెలా ఎందుకు గాయపడ్డావో
నిన్ను నొప్పించి అయిన అడగాలనుకుంటాను.
తాకి చూడడానికి ఆ దిగులుకొక
శరీరం వుంటే బాగుండనీ అనుకొంటాను.
నువ్వు ఏ ఏ పదాల్లో దీన్ని గురించి చెప్పుకుంటూ వెళ్తావా అని
ఎదురు చూస్తూ ఉంటాను. ..... ఈ వాఖ్యాలు ఆయన కవిత్వం లోనివి. వాటిని ఎలా ఉంటుందో అని ఇంగ్లీష్ లోకి అనువాదం చేసి చూసాను. ఒక శబ్దం ఉంది. ఒక లయ ఉంది. అది లిరికల్ పోయెట్రీ అని చెప్పేయొచ్చు.
Where and how you were wounded
I would like to ask even it pains you.
I feel better….
That affright should have a body…
To touch and see!
I will be watching…..
In which words you will render about these…
ఆ నొప్పి ను కూడా ఒక రిధంలో తీసుకురాగల నేర్పరి అఫ్సర్ . సాదారణ౦గా లిరికల్ పోయెట్రీ లిరిక్ రైటర్ ల లైన్స్ లో వినొచ్చు...చూడొచ్చు. సాదారనంగా కవిత్వం రాసే కవుల కవితల్లో ఆ మీటర్ , ఆ ప్రాస, ఆ రిధం ఉందంతే, అది ఓ అద్బుతంగా ప్రజల నోళ్ళల్లో నాన్తుంది. పుట్టపర్తి నారాయణ చార్యుల వారి శివ తాండవం లో “ ఆడేనమ్మా శివుడు.. పాదేనమ్మా భవుడు” అనే వాఖ్యాలు, ఆ మోత్హం శివతాండవం లో జనవాహిని గుండెల్లో మార్మోగుతుంది. అలాగే, శ్రీ శ్రీ కవితల్లోని రిధం, ఆ లిరికల్ అస్పెక్ట్ ఆయన్ను యుగకవి గా మలచింది.
Poetry is when an emotion has found its thought and thought has found words….robert frost
అఫ్సర్ లో ఒక అమాయకపు పిల్లవాడు దాగున్నాడు. అతడిలో దాగున్న ఆ పిల్లాడి అమాయకపు ప్రశ్నలు అతని కవిత్వాన్ని ఆ పిల్లవాడు చిన్ని చేతులను తిప్పుతూ మనల్ని అడిగినట్లు అనిపిస్తుంది. అఫ్సర్ కవిత్వ ప్రపంచానికో విభ్రమ. విదేశాల్లో ఉండి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జాతర చేస్తుంటాడు. సారంగా... అక్షర అనే వెబ్ పత్రికలు నడుపుతూ, ఎందరో కవులను motivate చేస్తూ ఒక అవ్యక్తానందాన్ని పొందుతాడు. ఇంతా చేసి, ఆయన ఏమైనా ఆశిస్తునాడా? అనే ప్రశ్న నాకిప్పటికీ అర్థం కాలేదు. ఒకటే తపన. ఒకటే ఆరాటం. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఆయన పట్టు అద్వితీయం.
Poetry is an echo, asking a shadow to dance…….carl sandburg ... ఇది ముమ్మాటికి అఫ్సర్ కవిత్వం లో నిజం. అయన కవిత్వం చదివి పుస్తకం మూసి వేసినా సరే, ఒక చిన్న నొప్పి అక్షరాలతో వెంటాడుతుంది. చదువుతున్నంత సేపూ పాటకుడి లోని ఒక ఉద్వేగం నిజంగానే నర్తిస్తుంది.
ప్రముఖ కవి వంశీ కృష్ణ గారు చెప్పినట్లు... అఫ్సర్ కవిత్వ ప్రస్థానం లో మూడు దశలు వున్నాయి . ఒకటి ఖమ్మం లో చదువుకున్నప్పటి దశ . రెండు ఆంధ్రజ్యోతి .. ఆంధ్రభూమి లలో ఉద్యోగించిన దశ . మూడవది అమెరికా . ఈ మూడు దశలలో అఫ్సర్ కవిత్వం బహుముఖాలుగా విస్తరించింది . ఎక్కడో నాసికా త్రయంబకం లో ఒక చిన్న , సన్నటి , పల్చని ధారగా మొదలైన గోదావరి పలు రకాలుగా ప్రవహించి , విస్తరించినట్టుగా అఫ్సర్ కవిత్వం కూడా ఖమ్మం లో సన్నగా మొదలై ఇవాళ విశ్వవ్యాప్తం అయింది
..
చూడు ఈ చరిత్ర లోకి మనిద్దరం
మనకి తెలియకుండానే,
కాల్లీడ్చుకొంటూ వొళ్లీడ్చుకొంటూ వచ్చాం
అసలు చరిత్ర నీకు తెలుసు
నా ముఖమ్మీదనే ఉమ్మి రంగులద్ది
నీ ముఖమ్మీదనే రక్తపు చారికలు అలిమి...
ఇద్దరికిద్దరం ఒక అబద్దాన్ని మోస్తూనే..
భారిస్తూనే కర్మ కర్మ అంటూనే..... ఇవి ఆయన కవిత్వం లోని వాక్యాలు. అసలు ఫిలాసఫీ ని కవిత్వాన్ని మిళితం చేసే విధ్యేదో ఆయనకు అబ్బినట్లు అనిపిస్తాది. One may be both a poet and a philosopher, but not at the same time: the two belong to very different spheres of activity. ఇందుకు భిన్నంగా మనకు అఫ్సర్ కనిపిస్తాడు. ప్రముఖ కవి Roger Caldwell సూచి౦చిన విషయం అఫ్సర్ అక్షరాల పాటిస్తున్నాడు. ఆయన అంటాడు....philosophy & poetry to be mutually alienి అని..
..
ఇలా వ్యాసం రాస్తూ... ఆయన తో కొన్ని మాటలు మాట్లాడాలని అనిపించింది.. నేనో నాలుగు ప్రశ్నలు వేసాను. ఈ వ్యాసం లో అక్కడక్కడా, నేను వేసిన ప్రశ్నలు.. ఆయన ఇచ్చిన సమాధానాలు పొందు పరుస్తున్నాను.
సి.వి. సురేష్ : 1. ఆధునిక కవిత్వం లో శిల్పం..వస్తువు . శైలి .ఇవేవీ కూడా నిర్దిష్ట0గ సూత్రీకరించలేక పోతున్నారు..ఈ దశలో కవిత్వం నిర్ధేశించే గొప్ప కవులు కానీ.ఫలానా వారు మంచి కవులనీ..వాళ్ళు చెప్పే విధంగా లేకపోతే కవిత్వం కాదని చెప్పే అవకాశం లేకపోయింది.. .. ఈ దశలో రైటర్స్ కు దిశ దశ నిర్దేశించే ఒక గురుత్వం కూడా మాయమైంది.. ఎవరూ శిక్షణ తరగతులు కూడా నిర్వహించడమ్ లేదు. ఇది ఏ పరిణామాలకు దారితీయొచ్చు.!?
అఫ్సర్: చాలా మంచి ప్రశ్న, సీవీ! మొదటి భాగానికి నా జవాబు: కవిత్వంలో ఆ మాటకొస్తే మొత్తంగా సాహిత్యంలోనే సూత్రీకరణలు చాలా కష్టం. మొదటి నించీ మనది అభిరుచి విమర్శ మాత్రమే. లోతైన విమర్శ చేస్తే తట్టుకునే శక్తి రచయితలకూ లేదు, చదువరులకూ ఆసక్తి లేదు. నా దృష్టిలో ఎప్పటికీ రాచమల్లు రామచంద్రా రెడ్డి మాత్రమే అలాంటి సూత్రీకరణలతో కూడిన విమర్శ చేయగలిగారు. సాహిత్య విమర్శకి స్వయం ప్రతిపత్తి, సొంత గౌరవం వచ్చే దాకా ఈ పరిస్థితి మారదు. ఇక ప్రశ్నలో రెండో భాగం: గురుత్వం అక్కర్లేదు. గురువుల వల్ల నష్టమే కాని లాభాలు తక్కువ. వొకరు గురువూ, ఇంకొకరూ లఘువూ అనుకునే మనస్తత్వంలో ఫ్యూడల్ లక్షణాలున్నాయి. అయితే, కవిత్వ శిక్షణ కి సంబంధించి “కవి సంగమం” చేస్తున్న కృషి మీద నాకు భరోసా వుంది. ఆ మేరకు కవి యాకూబ్ కృషి నిలబడుతుందన్న నమ్మకమూ వుంది.
ఆయనలో దాగున్న ఆ అమాయకపు పిల్లాడు.... ఎలా చెప్పగలిగాను సివీ ?అని అడిగాడు. అప్పుడు నేను ఇంకో పది ప్రశ్నలు అడిగి ఉంటె బావుండేదేమో అనిపించింది...! అని నేను చెప్పాను.
progressive పోయెట్... నేను ఆంద్ర భూమి లో పని చేస్తున్నప్పుడు నాకెప్పుడూ చెప్పేవాడు... ప్రజల పక్షాన జర్నలిజం ఉండాలి సురేష్ అనేవాడు. పీడిత పక్షాన నిలబడినప్పుడే సాహిత్యం కానీ. జర్నలిజం కానీ మనగలుగు తుంది. అని చెప్పేవాడు.
ఈ వ్యాసం రాస్తూనే, ఆయన ను నేను అడిగిన రెండవ ప్రశ్న....
సి.వి. సురేష్ : 2.. ఎవరికి మెడల్స్.. ?ఎవరికి శాలువాలు.. ?ఎవరి కి ప్రశంస ?అనే ఒక ఆలోచన అందరిలో ఉంది.. అటువంటి నేపధ్యం లో 'ఆకవిత్వం' బహిష్కరింపబడలేదు.. దానిని త్యజించడం లేదా అది కవిత్వం కాదు.. అని ఐడెంటిఫై చేసే ఒక వ్యవస్థ అవసరమా!? ఎలాంటి కరెక్షన్ కావాలనుకొంటున్నారా?
అఫ్సర్: సాధారణంగా అకవిత్వమే అందలాలు అందుకుంటుంది. అందలాలు అంటే ఈ వ్యవస్థ సృష్టించిన కృత్రిమ గౌరవాలు! మంచి కవి వాటి జోలికి పోడు, జోలె పట్టడు. మీరు చెప్పిన మాట బాగుంది. ఏది కవిత్వం కాదో ఎవరో వొకరు చెప్పాలి. అది కవులు చేయలేరు. గొప్ప విమర్శ ద్వారానో, గొప్ప అనువాదాల ద్వారానో మాత్రమే తెలుస్తుంది. మన అనువాద రంగం బలపడితే, అదే గొప్ప కరెక్షన్!
యిది ఆట సమయం ! అనే కవిత లో వాఖ్యాలు చూడండి...
యిప్పుడంతా నీ పసిపాదాల పద్యాన్ని నేను. ఆ పాదాల్లో సేలయేటి పరుగును నేను.ఆ పాదాలు వెతుక్కుంటున్న నెమిలి నడకని కూడా నేనే. యిప్పుడీ క్షణం లో కొన్ని కాలాలు ఇలా నీ ఎదుట freeze అయిపోయి, జీవితం మరీ నెమ్మదించిన still painting అయిపోతే బాగుణ్ను అనుకుంటాను కానీ, నువ్వు నన్ను ఎన్నిపరుగులు తీయిస్తావో తెలుసుకదా నాకు..
తత్వం బోధించే ఈయన కవిత్వం లో ఓ విలియం బ్లేక్, ఓ ఎమిలి డికెన్సన్, ఓ హఫీజ్ మనకు కనిపిస్తారు. పై వాఖ్యాల లోని తత్వం గమనిస్తే,...జీవితం మరీ నెమ్మదించిన still painting అయిపోతే బాగుణ్ణు అనడం ఎంత వేదన , ఎంత నొప్పి, ఎంత తత్వం మనకు కనిపిస్తాదో... ఇలా చెప్పుకొంటూ పోతే కొండవీటి చేంతాడు అంత అవ్వడం ఖాయం.
ఈ సందర్భంగా... ఆయనను నేను అడిగిన మూడో ప్రశ్న.... నిడివి ఎక్కువ కావడం తో ... నాలుగో ప్రశ్న కూడా సాహితీ మిత్రులకు ఉపయోగ మవుతుందని ఇక్కడే వరుసగా ఉంచాను....
సి.వి. సురేష్ (౩.) దాదాపు 3 దశాబ్దాలు పైనే మీకు కవిత్వం తో సహచర్యం...ఈ పీరియడ్ లో కవిత్వ లక్ష్యం ప్రజలకు అందుతోందని భావించారా!? ఎక్కడైనా ఈ కవిత్వానికి దుర్దశ కమ్మిన నేపధ్యం చూసారా!?
అఫ్సర్: ఇన్నేళ్ళ ప్రయాణంలో కవిత్వమూ కథా ఇవి రెండు మాత్రమే నాకు మిగిలాయి. సాహిత్య విమర్శ కొంత రాసినా అది పరిమితం. నా మటుకు నా కవిత్వమూ కథలూ రెండూ నేను అనుకున్న లక్ష్యాలను అందుకున్నాయి. రాయడం మొదలు పెట్టిన ఇన్నేళ్ళ తరవాత కూడా ఇవాళ నా పేరు కొంతమందికైనా గుర్తుందీ అంటే ఆ లక్ష్యం గురి తప్పలేదనే కదా! కవిత్వానికి దుర్దశ, మంచి దశా లేవు. అది అప్పుడూ ఇప్పుడూ అలాగే వుంది. మనం చూసే దృష్టి కోణం మారుతోంది అంతే! శ్రీశ్రీ కి ముందూ వెనకా శూన్యం లాంటి మాటలు అర్థరహితం. అట్లాగే, ఏదో ఒక కవి పేరు మాత్రమే ధగ దగా వెలిగే స్థితి కవిత్వంలో ఏనాడూ లేదు. మన కవిత్వమనే కాదు, మీలాంటి వారు అనువాదం చేస్తున్న గొప్ప కవుల సంప్రదాయం చూసినా ఇది అర్థమవుతుంది. గొప్ప కావ్యాలు వెలుగుతాయి. గొప్ప భావనలు వెలుగుతాయి. వ్యక్తులు కాదు!
సి.వి. సురేష్ :(4.) వర్ధమాన కవులకు దిశ దశ నేర్పించాల్సిన అవసరం ఉందా!? మీరిచ్చే సూచనలు..సలహాలు? అఫ్సర్: నేర్చుకోవడం అనే ప్రక్రియ ప్రసిద్ధులకైనా, వర్థమానులకైనా వొక్కటే! నేర్చుకోవాలి అనే తపన ఆగిపోయిన చోట కవిత్వం నిలవనీరు అవుతుంది. ప్రవాహం మాత్రమే సాహిత్య లక్షణం. ఆ ప్రవాహంలో ఎప్పుడు కాళ్ళు తడుపుకున్నా, కొత్త నీటి తాజాదనం తెలియాలి. రాయడం, చదవడం ఎంత ముఖ్యమో వినడం, అర్థం చేసుకోవడం అనే రెండు ప్రక్రియలు కూడా అంతకంటే ముఖ్యం. ఆ చివరి రెండూ కాస్త దెబ్బ తింటున్నాయేమో అని కాస్త చింత అప్పుడప్పుడూ.
ఆయన కవిత్వం కో డిక్షన్ ఉంది. అది నేనైతే ముద్దుగా అఫ్సరిజం అంటుంటా.. ! అఫ్సరే ఓ కవిత్వం అని నా అభిప్రాయం.
వ్యాసకర్త.. సి.వి. సురేష్, అడ్వకేట్, ప్రొద్దటూరు. 7780151975

యుద్ధంలో నువ్వూ నేనూ మనం

  యు ద్ధంలో వెనుకడుగువేయడం పిరికివాళ్ళ లక్షణం . పోరాడి గెలవాలని చరిత్ర ఎన్నో అనుభవాలనిచ్చింది. అయితే ఆ యుద్ధం మనతో మనకే అయితే..! మనిషికీ, ...