Friday, December 5, 2025

"వొక క్షమాపణ తర్వాత ప్రపంచమేమీ పెద్దగా మారిపోదు" - అఫ్సర్

 "కవిసంగమం"లో నా ఇంటర్వ్యూ రెండో భాగం- నా తిరుగుళ్ళ వల్ల ఆలస్యమైంది, మన్నించండి. కానీ, ఎంతో ఓపికతో ఈ ప్రశ్నలు తయారుచేసి, వాటిని సకాలంలో సంధించినందుకు పలమనేరు బాలాజీ గారికి, ప్రచురించినందుకు యాకూబ్ కి షుక్రియా!

చదివి, ఎలా వుందో చెప్పండి!
*

కవితావరణం 210: తేది 05.12.2024: పలమనేరు బాలాజీ,9440995010.
"..యిప్పటికీ గట్టిగానే అంటాను/ ఇలా పుట్టడం ఒక ఏమరహరుపాటే అని"
....
"వొక క్షమాపణ తర్వాత ప్రపంచమేమీ పెద్దగా మారిపోదు"
- అఫ్సర్
కథ కవిత్వం మాత్రమే కాదు విమర్శ కూడా జీవితంలో నుంచి వస్తే , జీవితాన్ని దాటి పోకుండా ఉంటే ఆ విమర్శ ఎంత సృజనాత్మకంగా ఉంటుందో ఎంత సరళంగా సూటిగా చిక్కగా పదునుగా ఉంటుందో అందుకు ఉదాహరణ అఫ్సర్.
విద్యార్థుల నుండి నేర్చుకునే విషయాలను ఒప్పుకునే ఉపాధ్యాయులు నిజమైన గురువులు.వాళ్లే రేపటి తరాన్ని తయారు చేసే సామాజిక శాస్త్రవేత్తలు. అలాంటి ఒక గొప్ప సామాజిక శాస్త్రవేత్తగా మంచి అధ్యాపకుడిగా, గొప్ప పరిశోధకుడిగా, అనువాదకుడిగా, మంచి కథకుడు కవిగా సరిహద్దులు ఎల్లలు పరిమితులు లేని తన సాహిత్య సృజనతో అందరికీ దగ్గరైన సృజన కారుడు అఫ్సర్.
దేశానికి అవతల ఉన్నాడు కానీ, ఈ దేశాన్ని కానీ, తన సమాజాన్ని కానీ, తన మూలాలను కానీ, తన ఆకాశాన్ని కానీ క్షణకాలం కూడా విస్మరించని సాహిత్యకారుడిగా తన ప్రయాణం ఎంతో ఉద్వేగ భరితంగా కొనసాగుతోంది. వివిధ దేశాలకు వివిధ స్థల కాలాలకు వివిధ సంప్రదాయాలకు భాషలకు చెందిన ఎందరో వ్యక్తులు వాళ్ళ జీవితాలు వాళ్ల జీవిత విశేషాలు వాళ్ల కన్నీళ్లు వాళ్ల దుఃఖాలు, నవ్వులు బాధలు ఆయనకు తెలుసు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మనిషి గుండె ఒకటే. కన్నీళ్లు నవ్వులు ఒకటిగానే ఉంటాయి. తన కవిత్వంలో ఈ సత్యం అర్థం అవుతుంది.
*
"వొక చేరువ- వొక క్షమాపణ"
1
దగ్గిరే... పెద్ద దూరం కాదు.
దూరమే... అంత దగ్గిర కాదు.
వొంటరివై/వొక నిలువెత్తు ప్రశ్న గుర్తులా నడుస్తూ పోతున్నప్పుడు/ నిన్నటిదేదో క్షణం /పొరలుపొరలుగా తనని తాను విప్పుకుంటూ వుంటుంది.
కొన్ని/జవాబులేవో నీ దగ్గిర వున్నాయని అనుకుంటావ్./
కొన్ని సంజాయిషీలేవో /ఏదో వొక మిష మీద చెప్పేసుకుంటావ్./ రాసి పెట్టుకున్నవో దాచిపెట్టుకున్నవో నిన్ను /నిలువునా నిలదీసుకొని పట్టిపట్టి నీ నించి రాబట్టినవో యేవో /కొన్ని క్షమాపణలు/యెలాగైనా సరే/చెప్పేసుకుందామని అనుకుంటూ వుంటావ్./
తట్టుకోలేనితనంతో నిన్ను నువ్వు/ యెలాగూ సంబాళించుకోలేని క్షణంలో/దేహాన్నంతా మడిచి ఏ అగ్గిపెట్టెలోనో/ఇరికించుకోవాలన్నంత కసితో కూలబడిపోతావ్/ నలుగురి నవ్వుల మధ్య, తెగని కబుర్ల తీగల మధ్య, /యవ్వనం తన పొగరంతా పెల్లుబికేట్టు/ ఎగసిపడే కాఫీ షాపు కోనలో..
మొన్ననో, అటు మొన్ననో/ జీవితం యింతకంటే ఎక్కువ విసిగించకపోలేదు. /ఇంతకంటే ఎక్కువే తడి చెంపల మీంచి జారిపోయింది./ కాదనను.
కాని యెప్పటికప్పుడు/ యిదే వొంటరితనపు చరమరాత్రి లాంటి పగళ్ళు.
అవన్నీ క్షమించలేని గుర్తులే/నీ కంటి కింద కాంతిని అపహరించి/ జీవితం ముందు నిన్ను పరాజితగా మిగిల్చిన గాయాలే!
యిప్పుడు తలచుకునే గుర్తులే, కాదనను.
వొక క్షమాపణ తరవాత ప్రపంచమేమీ పెద్దగా మారిపోదు.
కాని, ఆ పోయిన కలలాంటి నిజం కూడా వుండదు./ ఆ పోయిన నిజంలోని పుప్పొడీ వుండదు.
నన్ను చుట్టుముట్టిన ఈ తెలియని ముఖాల, /తెలియని చెట్ల, తెలియని ఆకాశాల, తెలియని గాలుల, /కనిపించని కన్నీళ్ళ,/
వినిపించని ఏడ్పుల సమూహంలో నిలబడి, /ప్రతి ముఖమూ నీదే అనుకొని బతిమాలుకుంటాను
యిక క్షమించేయ్ /జీవితం మరీ దూరమయిపోతోంది. /కాస్త దగ్గిరకు తీసుకో ఆ పిచ్చిదాన్ని!
దగ్గిరకు అదుముకో /చేరువకి లాక్కొని నువ్వివాల్సినవి యిచ్చి వెళ్ళిపో
(2013)
*
అనుకరణకు లొంగని ఈ శైలి అఫ్సర్ ది. కట్టడి లేని కవిత్వం.
స్వేచ్ఛగా ఉండే కవిత్వం. ఉద్విగ్నత, తాత్వికత, భావుకత కలగలసిన కవిత్వం
వాడ్రేవు చినవీరభద్రుడు గారు అన్నట్టు అఫ్సర్ మన కాలపు సూఫీ.
శివారెడ్డి గారు అన్నట్టు "ఇంటి వైపు" పుస్తకం మొత్తం ఒక సుదీర్ఘ ప్రేమ కవితే.!
*
అఫ్సర్ సాహిత్యం పైన, నిశితంగా చర్చ జరగాలి, విస్తృతంగా పరిశోధనలు జరగాలి. ఇప్పటివరకు ఆయన సాహిత్యం గురించి మాట్లాడని విమర్శకులు కనీసం ఇప్పటినుండి అయినా మాట్లాడాలి. యువతరం ఆయన నుండి ఆయన సాహిత్యం నుండి నేర్చుకోవాల్సిన అనేక విషయాలను నేర్చుకోవటానికి సిద్ధంగా ఉంది. యువతరానికి ఆయన సాహిత్యాన్ని అందించాల్సిన బాధ్యత సమాజం పైన, ప్రచురణకర్తల పైన ఉంది. అంతర్జాల సమావేశాల ద్వారా అయినా సరే మనం మొదటి నుండి ఒక క్రమ పద్ధతిలో మరొకసారి ఆయన రచనలను అంచనా వేస్తూ చర్చించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి.
ఆయన సాహిత్యాన్ని పరిశీలించడానికి విమర్శించడానికి ఆయన సూచించిన విమర్శా పద్ధతులే చాలా బాగా ఉపయోగపడతాయి.
ఒక రంగానికి పరిమితం అయిపోకుండా ఒక స్థలాన్ని ఒక కాలానికో పరిమితమైపోకుండా అనేక రంగాలుగా బహుముఖీనా విస్తరిస్తున్న ఆయన సాహిత్య చైతన్యం సాహిత్యకారులకు ఒక గొప్ప ప్రేరణ కలిగించక మానదు.
విశ్రమించకపోవడం, అలసిపోకపోవటం, ఇంతకీ ఆ గాయపడుతున్న హృదయాన్ని పోగొట్టుకోకుండా ఉండటం, అడ్డు గీతాల్ని చెరిపేసే గుణం, ప్రచారానికి కీర్తి కాంక్షకి దూరంగా ఉండటం, భేషజాలు లేకుండా బ్రతకడం, కొత్త తరాన్ని ముందుండి ప్రోత్సహించడం అఫ్సర్ ప్రత్యేకతలు.
*
గతవారం కవితావరణంలో అఫ్సర్ గారి ఇంటర్వ్యూకి వచ్చిన స్పందన అపూర్వం అద్భుతం. మిగిలిన ఇంటర్వ్యూ ఈవారం కవిసంగమం పాఠకుల కోసం..
*
9. ఒక అద్భుతమైన సృజనకారుడిగా వర్తమాన జీవితం, సమాజంలోని సంఘర్షణలకు సాహిత్య ప్రక్రియకు మధ్య గల అవాంతరాల గురించి కొంచెం చెబుతారా?
* నేను ఈ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలోనే మనందరికీ తెలిసిన విమల ఫేస్ బుక్ లో ప్రేమకవిత్వం వరసగా పోస్ట్ చేస్తున్నారు. వాటికి నేను తక్షణ పాఠకుణ్ణి. విమల అనగానే మనకు సాధారణంగా విప్లవ కవిత్వ ఫ్రేమ్ వర్క్ కనిపిస్తుంది. కానీ, మొదటి నించీ ఆమె కవిత్వాన్ని దగ్గిరగా గమనిస్తున్న వాళ్ళకి ఆ ఫ్రేమ్ వర్క్ కి ఎడంగా మెలిగే వ్యక్తీకరణలు అనేకం కనిపిస్తాయి. ఇది నేను వేణు కవిత్వంలో కూడా చూశాను. ఆ మాటకొస్తే, శివసాగర్, వీవీ లలో కూడా! సాహిత్య ప్రక్రియలను మనం అకారణంగా కట్టుబాటు చేస్తున్నాం. వర్తమాన జీవితంలో అనేక కోణాలుంటాయి. వాటిని పట్టుకోవాలనే తపన సృజనకి ప్రాణం లేదా అస్తిత్వ లక్షణం. మధ్యలో ఎలాంటి అవాంతరాలు వచ్చినా దాటుకుంటూ వెళ్లిపోవడం సృజనకి ఆరోగ్యకరం. అది ముందుకెళ్లే మార్గం. సాహిత్య చరిత్ర నిండా ఇలాంటి దాఖలాలు కనిపిస్తాయి. ఖాళీలు ఏమైనా ఉంటే పూరించుకుంటూ వెళ్ళే సజీవ చైతన్యమే సాహిత్యం.
10. సాహిత్యకారుడికి ఉండాల్సిన స్వేచ్ఛ గురించి, ధైర్యం గురించి, అనేక నిర్బంధాలు, నిషేధాల మధ్య రచయితగా బ్రతికి ఉండడం గురించి..
* నిర్బంధాలూ, నిషేధాలూ తెలుగు సాహిత్యానికి కొత్త కాదు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో అనేక జానపద రూపాలూ, సాహిత్యమూ నిషేధానికి గురయ్యాయి. తరవాతి కాలంలో కూడా అలాంటి సందర్భాలు అనేకం. అయినా, తెలుగు రచయితలు ధిక్కరించి, నిలిచారు. మన కాలంలో గద్దర్, వరవరావు గారు అలాంటి స్థితిని ఎదుర్కొంటున్నారు. అయినా, వాళ్ళ సృజన ఆగిపోలేదు. పోరాటమూ పదునెక్కింది. అయితే, మనం గుర్తించాల్సిన మరో చేదు నిజం ఏమిటంటే- నిర్బంధాలూ, నిషేధాలూ పరోక్షంగా కూడా వుంటాయి. ఫలానా విధంగా రాస్తేనే సాహిత్యం అనడమూ అదొక శాసనమే. నిర్బంధమే. ఈ రెండోది ఎదుర్కోవడం నా దృష్టిలో చాలా కష్టం. అలాంటి నిర్బంధం ఎప్పుడూ వుంటుంది. రచన అనేదే తిరుగుబాటు. రచన అంటేనే ప్రతిఘటనా ప్రకటన అనుకునే రచయితలు వాటిని ఎదుర్కొంటూనే వుంటారు. యుద్ధం కొనసాగుతుంది.
11. రెండేళ్ల కిందట మీ కవిత్వం Evening with a Sufi పేరుతో ఒక ప్రసిద్ధ ప్రచురణ సంస్థ ఇంగ్లీషులో ప్రచురించింది. తెలుగుతో పోలిచినప్పుడు ఇంగ్లీషులో మీ కవిత్వానికి ఎలాంటి ప్రతిస్పందన వచ్చింది?
* నా కవిత్వానికి అనువాదాలు రావడం కొత్త కాదు కానీ, Evening with a Sufi ప్రసిద్ధ ప్రచురణ సంస్థ ద్వారా రావడం వల్ల ఎక్కువ మందిని చేరుకుంది. అనేక పత్రికలు విశ్లేషణాత్మక సమీక్షలూ, ఇంటర్వ్యూలూ ప్రచురించాయి. ఆ రకంగా గొప్ప తృప్తీ. అయితే, కవిత్వాన్ని అర్థం చేసుకోడంలో, విశ్లేషించడంలో మనకూ, వేరే భాషల వాళ్ళకీ ఎంత తేడా వుందో బాగా అర్థమైంది. ముఖ్యంగా కవితని క్లోజ్ రీడింగ్ చేయడం అనే ప్రక్రియని ఇంకా మనం అర్థం చేసుకోవాలనుకుంటా.
12. పాశ్చాత్య దేశాల్లో సాహిత్యం పట్ల యువతరానికి ఆసక్తిని కలుగచేయడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి... మీరు సాహిత్యానికి సంబంధించిన క్లాసుల్లో ఏం చేస్తారు?
* ఇందులో రెండు ప్రశ్నలున్నాయి. రెండీటీకి సంబంధం వుంది. మొదట కొత్త తరం సాహిత్యం ఎందుకు చదవాలన్న ప్రశ్నకి మన దగ్గిర కనీసం ఒక సమాధానం వుండాలి. అమెరికాలో ఇరవయ్యేళ్ళ పైబడి నా అధ్యాపకత్వంలో అర్థమైన వాటిల్లో ఒకటి- ఇప్పటి తరానికి చరిత్ర మీద ఎక్కువ ఆసక్తి వుంది. అది కూడా సాధారణ చరిత్ర కాదు, తమ సమూహాలకు సంబంధించిన చరిత్ర, తమ కుటుంబాల వెనక తరాలుగా నడిచిన చరిత్ర. నా మటుకు నాకు ఇది అసలైన అన్వేషణే! ఇది రచయితలకూ అవసరమే. నా క్లాసుల్లో విద్యార్థులు చర్చల్లో తీసుకొచ్చే అంశాలు ఎక్కువగా అటువైపే లాక్కువెళ్తాయి. ఇక బయట కూడా కొత్త తరం రచయితలు కవిత్వంలోనూ అలాంటి చరిత్రని వెతుక్కుంటూ వెళ్తున్నారు.
13. కొత్తగా రాయాలని ప్రయత్నిస్తున్న వాళ్లకి, రాయలేకపోతున్న వాళ్లకి, రాయాలంటే భయపడుతున్న వాళ్లకి, రాద్దామని అనుకుంటున్న వాళ్ళకి ఒక అన్నగా.. ఒక స్నేహితుడిగా ఏం చెబుతారు?
* ఇంతకుముందు కంటే ఇప్పుడు రాయడం అనే ప్రక్రియలో కొత్త భయాలు చోటు చేసుకుంటున్నాయి. అవతలి వారి ఆమోదముద్ర పొందాలన్న విపరీత కాంక్ష అలాంటి భయాలకు కారణం. ఆమోదం అవసరమే కానీ, మరీ సృజనని పక్కదోవ పట్టించే ఆమోదం అక్కర్లేదు. కవి ముందు తను చెప్పాలనుకున్నది చెప్పాలి. ముఖ్యంగా కవిత్వానికి ఆమోద ముద్ర అంత తేలిక కాదని నా అనుభవంలో అర్థమైంది. కొత్త తరహాలో రాసేవాళ్ళకి మొదట్లో చుక్కెదురవడం సహజం. ఇది విమర్శకు కూడా వర్తిస్తుంది. ఇది కొన్నిసార్లు రచనని పూర్తిగా బ్లాక్ చేసే స్థితి కూడా వస్తుంది. అది జరిగేలోపు కవి తన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి. ఎందుకు రాయాలో ఎవరికోసం రాయాలో తేల్చుకోవాలి.
14. అమెరికాలాంటి దేశాల్లో మీరు కొత్తతరాన్ని చూస్తున్నారు. ఆ కొత్తతరం కవుల నుంచి మనం ఏం నేర్చుకోవాలి?
* అమెరికాలోని కొత్తతరం కవులకి చాలా మందిలో ఒక పట్టుదల వుంది. మరీ ముఖ్యంగా రచన విషయంలో! రచన అనేది చేతికి పట్టుబడ్డాక వదులుకోలేని తనం వుంది. అందువల్ల, రచనకి కావల్సిన క్రమశిక్షణ కూడా పెరుగుతోంది. ఈ విషయంలో నేను నా విద్యార్థుల నుంచి చాలా నేర్చుకుంటున్నాను. పుట్టిన చోటుకి దూరంగా వుండడం వల్ల కొన్ని సందర్భాలు నేను చాలా నిరుత్సాహంగా వుంటాను. నా యూనివర్సిటీ ఆఫీసులో అలా కూర్చొని వున్నప్పుడు ఎవరో వొక విద్యార్థి వచ్చి, కాఫీ తాగుదామా అని బయటికి తీసుకువెళ్తారు. ఆ కాఫీ సమయంలో చాలా జీవితం అర్థమవుతుంది. ఎందుకు ఎందుకు అని ఉప్పొంగే అనేక ప్రశ్నలకు జవాబులు దక్కుతాయి.
15. కవులు రచయితలు తమ అధ్యయనం మెరుగుపరచుకోవటం ఎట్లాగో మీ అనుభవాలతో చెప్పండి.
* అధ్యయనం కేవలం పుస్తకాలే కాదు. పుస్తకాల కంటే జీవితం పెద్దది. ఆ పెద్ద కాన్వాస్ మీంచి మనం ఎన్ని రంగులు, ఎన్ని గీతలు సరిగ్గా ఆనవాలు పట్టగలమో చూసుకోవాలి.
16. పాఠకుల నుండి మీరు అందుకున్న ఉత్తమ ప్రశంసలు కానీ విమర్శలు కానీ పాఠకుల నుండి మీకు ఎదురైన ప్రత్యేకమైన అనుభవాలు కానీ ఏవైనా ఉన్నాయా?
* చాలా వున్నాయి. అవి మరో సందర్భంలో చెప్తాను.
17. తెలుగు కవిత్వాన్ని విస్తృతంగా ఆంగ్లంలోకి తద్వారా ఇతర ప్రపంచ భాషల్లోకి అనువదించే ప్రక్రియకు పాశ్చాత్య దేశాలలో ఉన్న మీలాంటివారు చేస్తున్న ప్రయత్నాల గురించి...
*ప్రస్తుతం వంద కవితలు ఎంపిక చేసి పెట్టుకున్నాను. అవి నెమ్మదిగా అనువాదం చేస్తూ వున్నాను. పాతిక వరకూ అయ్యాయి. అమెరికాలోని ఒక పెద్ద ప్రచురణ సంస్థ వీటిని ప్రచురించబోతోంది.
*
ఒక గొప్ప సాహిత్య వాతావరణంలోకి ఇంటర్వ్యూ ద్వారా ప్రయాణం చేసి వస్తున్నాం.ఇతని తడి ప్రపంచం విలువైనదని విశాలమైనదని తన మాటలు,తన రాతలు రుజువు చేస్తున్నాయి.
*
కథ కవిత్వం మాత్రమే కాదు విమర్శ కూడా జీవితంలో నుంచి వస్తే జీవితాన్ని దాటి పోకుండా ఉంటే ఆ విమర్శ ఎంత సృజనాత్మకంగా ఉంటుందో ఎంత సరళంగా సూటిగా చిక్కగా ఉంటుందో అందుకు ఉదాహరణ అఫ్సర్.
విద్యార్థుల నుండి నేర్చుకునే విషయాలను ఒప్పుకునే ఉపాధ్యాయులు నిజమైన గురువులు.వాళ్లే రేపటి తరాన్ని తయారు చేసే సామాజిక శాస్త్రవేత్తలు. అలాంటి ఒక గొప్ప సామాజిక శాస్త్రవేత్తగా మంచి అధ్యాపకుడిగా, గొప్ప పరిశోధకుడిగా, అనువాదకుడిగా, మంచి కథకుడు, కవిగా సరిహద్దులు ఎల్లలు పరిమితులు లేని తన సాహిత్య సృజనతో అందరికీ దగ్గరైన సృజన కారుడు అఫ్సర్.
దేశానికి అవతల ఉన్నాడు కానీ, ఈ దేశాన్ని కానీ, తన సమాజాన్ని కానీ, తన మూలాలను కానీ, తన ఆకాశాన్ని కానీ క్షణకాలం కూడా విస్మరించని సాహిత్యకారుడిగా తన ప్రయాణం ఎంతో ఉద్వేగ భరితంగా కొనసాగుతోంది. వివిధ దేశాలకు వివిధ స్థల కాలాలకు వివిధ సంప్రదాయాలకు భాషలకు చెందిన ఎందరో వ్యక్తులు వాళ్ళ జీవితాలు వాళ్ల జీవిత విశేషాలు వాళ్ల కన్నీళ్లు వాళ్ల దుఃఖాలు ఆయనకు తెలుసు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మనిషి గుండె ఒకటే. కన్నీళ్లు నవ్వులు ఒకటిగానే ఉంటాయి. ఆయన కవిత్వం ఇదే చెబుతుంది.
ఒక సహజత్వం ఒక పరిమళం ఒక తాజాదనం అతని అక్షరాలకు ఉంది
అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆయనను అభిమానించే వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఆయన రచనల్ని వెతికి చదివే వాళ్ళు పదిమందికి పరిచయం చేసేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఇంతమంది ఉన్నా, ఏ మూలకూడా రవ్వంత కూడా గర్వం కనిపించకపోవడం , భేషజాలకు దూరంగా ఉండటం, నిరంతరం అధ్యయనంలో రచనలు స్నేహ పూర్వక వాతావరణంలో మనుషుల్ని వెతుక్కుంటూ జీవితాన్ని గొప్ప వైభవోపేతంగా చూస్తూ ఒక గొప్ప మానసిక ప్రపంచంలో నిగర్వంగా సామాన్యంగా అతి సామాన్యంగా జీవించగలగటం మహర్షులకే సాధ్యం. అలాంటి ఒక మహర్షి అఫ్సర్.
కవి మిత్రుల తరఫున పాఠకుల తరఫున హృదయపూర్వక, ప్రేమ పూర్వక ధన్యవాదాలు అఫ్సర్ అన్నకు.

"వొక క్షమాపణ తర్వాత ప్రపంచమేమీ పెద్దగా మారిపోదు" - అఫ్సర్

  "కవిసంగమం"లో నా ఇంటర్వ్యూ రెండో భాగం- నా తిరుగుళ్ళ వల్ల ఆలస్యమైంది, మన్నించండి. కానీ, ఎంతో ఓపికతో ఈ ప్రశ్నలు తయారుచేసి, వాటిని స...