మంచితనానికి “కోవెల”!

"రక్త స్పర్శ" కవితా సంపుటి వెలువడిన 1986 ల లో ఒక సారి అనుకోకుండా సంపత్కుమార గారిని కలవడం మరచిపోలేని జ్ఞాపకం. ఒక చిన్న ఇంట్లో మేడ మీద కొన్ని పుస్తకాల బీరువాల మధ్య ఆయన్ని కలిసాను. వచన కవిత్వం మీద ఆయన చేస్తూ వస్తున్న లక్షణ చర్చకి ఆయన అప్పుడు రక్తస్పర్శ కవితల నించి కొన్ని ఆధారాలు వెతుకుతున్నారు. అప్పటికే చేకూరి రామారావు (చే.రా) ఆంధ్రజ్యోతిలో “చేరాతల” కాలం లో రక్తస్పర్శ కవిత్వాన్ని "మంచి కవిత్వం మాబాగా వస్తోంది!" అనే శీర్షిక కింద రాసిన పరిచయ వ్యాసం తెలుగు సాహిత్య లోకంలో చర్చనీయాంశంగా మారుతోంది. "ఖమ్మం కవులకు ఓ పీఠం పెట్టేసేట్టున్నాడు రామారావు" అని సంపత్కుమార గారు చలోక్తులు రువ్వే వారు.

సంపత్కుమార సంప్రదాయ వాది అని అప్పటికింకా పేరు. నేను నా వామపక్ష రచయితల శిబిరాల్లో కూడా ఆయన గురించి అదే మాట వింటూ వచ్చాను. చాలా కాలం పాటు అలాంటి మాటలు ఆయన గురించి వినీ వినీ నాకు తెలియకుండానే ఆయన్ని నా మనసు మూలల్లోకి కూడా రాకుండా అతి జాగ్రత్త పడుతూ వచ్చాను. కాని, ఆయన్ని కలుసుకున్న మొదటి సారే ఆయన్ని గురించి నేను విన్నవాటితో నిమిత్తం లేకుండా వొక సద్భావం, స్నేహానుభూతి కలిగింది. ఈయన్ని ఇంతకాలంగా కలవలేకపోయానే అని కొంత పశ్చాత్తాప పడ్డాను కూడా.

అసలు ఆయన్ని ఆ మొదటి సారి అయినా కలవాలన్న ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు. మిత్రుడు బన్న అయిలయ్య అసలు కారణం.
ఏదో వొక సభకో, మిత్రులతో సమావేశానికో వరంగల్ వెళ్ళినప్పుడు, మాటల సందర్భంలో "మీరు ఇంత మందిని కలుస్తున్నరు, సంపత్కుమార్ సార్ ని ఎందుకు కలవరు?" అని అయిలయ్య వొక సారి గట్టిగానే అడిగాడు.
"ఏమో, ఆయన్ని కలవడానికి నాకు అభ్యంతరం లేదు గానీ, మా మధ్య మాట్లాడుకోడానికి ఏమీ వుండదేమో!" అన్నాను.

"అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారు. ఆయన మీ కవిత్వం చాలా ఇష్టంగా చదువుతారు. మీ కవిత్వాన్ని గురించి మా క్లాసుల్లో చెబ్తారు. బాగా విశ్లేషణ చేస్తారు. మీరు ఈసారి కలిసి తీరాలె" అంటూ దాదాపూ లాక్కు వెళ్ళాడు.
తన కవిత్వానికి వొక తీవ్రమయిన పాఠకుడు వుండడం కంటే కవికి గొప్ప ప్రలోభం ఇంకా ఏముంటుంది? కాని, నేను స్వతహాగా కొంత బిడియస్తుణ్ణి కావడం, పైగా, సంపత్కుమార గారు వొక "సాంప్రదాయికుడు" అన్న ముద్ర నా మనసులో పడిపోయి వుండడం వల్ల నేను ఆయన ముందు కొంచెం ముడుచుకు కూర్చున్నాను. ఈ లోపు మా కోసం లోపలి నించి మంచి దోసెలు వేడి వేడిగా పళ్ళేలలో తీసుకు వచ్చారు. ఎవరో మధ్యలో ఫోన్లు చేస్తే "అఫ్సర్ వచ్చాడయ్యా మా ఇంటికి. నేను తరవాత మాట్లాడతా." అని ఫోన్లు పెట్టేస్తున్నారు. నా రాక కలిగించిన సంతోషాన్ని ఆయన చెప్పకుండానే రకరకాలుగా వ్యక్తం చేస్తున్నారు.
నా బిడియాన్ని పోగొట్టుకొని నేను మామూలు స్థితికి రావడానికి నాకు కొంత సమయం పట్టింది. కానీ, మా మధ్య సంభాషణ మొదలయ్యాక అది ఎడతెగని ఏరులా సాగిపోయింది. అప్పుడు మొదలయిన ఈ సంభాషణ కనీసం పదిహేనేళ్ళపాటు నిరంతరాయంగా సాగింది. ఎక్కడ కలిసినా మాటలు కవిత్వ లక్షణ చర్చ వైపు దూసుకెళ్ళేవి.

కవిత్వాన్ని గురించీ, కవిత్వంలో పాద విభజన గురించీ నేను అప్పటికే తీవ్రంగా ఆలోచిస్తూ వుండే వాడిని కావడం వల్ల మా మధ్య సంభాషణకి వొక దారం దొరికినట్టయింది. పాద విభజనకి వొక గ్రామర్ వుందని నా వాదన. నేను కొన్ని కవితలు తీసి, వాటిని రెండు రకాలుగా చదివి వినిపించే వాణ్ని ఆయనకు- వొకటి: పాద విభజన లేని పూర్తి వచన రూపంలో, రెండు: పాద విభజన సహితంగా, మధ్య మధ్య విరామాలతో.

"నువ్వు కవిత్వం బాగా చదువుతావ్, కాబట్టి నా చెవులకు మంత్రం వేస్తున్నావ్ కానీ, నిజంగా కవులు ఇంత ఆలోచనతో, ఇంత లయ జ్ఞానంతో ఆ పాద విభజన చేస్తున్నారంటావా?" అని మధ్యలో నా వ్యాఖ్యానం కోసం చెవి అప్పగించే వారు.
ఈ అన్వేషణని ఆయన ఇంకా ముందుకు తీసుకువెళ్ళారు. రాజమండ్రిలో ఎండ్లూరి సుధాకర్ వచన కవిత్వం మీద శిక్షణా శిబిరం నిర్వహించినప్పుడు ఆయన వొక ప్రయోగం చేశారు. కొన్ని వచన కవితల్ని తీసుకొని, వాటి పాద విభజనల మీద కవుల్నీ, పాఠకులనీ పరీక్షించారు. అది ఆయన చాలా శాస్త్రబద్ధంగా, వొక శాస్త్రవేత్తలాగా చెయ్యడం నన్ను బాగా ఆకట్టుకుంది. ఏ పని అయినా చేస్తే, దాన్ని నిజంగా వొక సైంటిస్టు కన్నుతో, బుద్ధితో చూడడం, తర్కించడం ఆయనలోని గొప్ప లక్షణం.
అయిష్టంగా మొదలయి, ఇష్టంగా పెనవేసుకుపోయిన స్నేహ బంధం ఆయనతో నాది. అతి కష్టమయిన సన్నివేశాలలో కూడా అత్యంత ఆత్మీయంగా, వయ భేదంతో సంబంధం లేకుండా, హాయిగా పలకరించే హితుడు సంపత్కుమార. పాండిత్యమూ, మంచితనమూ గూడు కట్టుకున్న మూర్తి ఆయనది.


(సాహిత్య విమర్శకులూ, కవి సంపత్కుమార గారి నిష్క్రమణ గురించి విన్న తరవాత)

2 comments:

దేశరాజు said...

Maree anta konchamenaa? Inkoncham detail ga raayadagina Goppa Manishi aayana.

Afsar said...

అవును, రాజా! కోవెల సంపత్కుమార గురించి రాయాల్సింది చాలా వుంది. కానీ, తెలుగు మీడియా (సాహిత్య పేజీలతో సహా) ఆయనకి సరయిన నివాళి ఇవ్వలేదని నాకు అనిపించింది. కనీసం బ్లాగు ముఖంగా అయినా ఆయన్ని తలచుకోవడం మన ధర్మం. మీరూ, మీలాంటి ఇతరులూ కోవెల గురించి తెలిసిన నాలుగు ముక్కలూ ఇక్కడ రాస్తే బాగుంటుంది.

Web Statistics