ఒక వీరశైవ, ధీర సూఫీ అర్ధనారీ"స్వరం" : నీలం మాయ

అయిల సైదాచారి మనకు కొత్త కాదు. అతని కవిత్వం ఇంతకు ముందే మనకు తెలుసు. అందరికీ తెలిసిన అందరూ మరచి పోవాలనుకునే వొక అనుదిన నేపథ్యం నించి సైదా చారి కవిత్వ అనుభవ మంటపంలోకి ప్రవేశించాడు. అతని కవిత్వం మొదటి సారి చదివినప్పుడు ఇది వొక భిన్నమయిన భాష అని మనకి వెంటనే అనుభవమవుతుంది. కాని, ఆ అనుభవం మనల్ని అంత తేలికగా వూపిరదనివ్వాడు. మనలోని నిబ్బరత్వాన్ని కాసేపు కల్లోలితం చేసి, అసహనానికి లిపి వెతుక్కున్నేలా చేస్తాడు. ఎంత దూరం, ఎంత లోతుల్లోకి వచ్చామనుకున్నా, తెలుగు కవిత్వం ఇంకా అనుభవాన్ని నిఖార్సుగా చెప్పుకునే స్థాయికి అయితే రాలేదు. కవిత్వాన్ని గురించి ఇంకా చాలా స్థిర నిశ్చితాలు వున్నాయి మనకి. కవిత్వం లలిత పద పల్లవ కోమలంగా వుండాలన్న అదృశ్య సంకెల ఇంకా తెగిపోలేదు. అంత లలితంగా నేను మాట్లాడలేను అని వెర్రి కేక అయినా వేసే కవులు లేకుండా పోతున్నారన్న నిరాశలో పడ్డప్పుడు సైదా చారి 'డూ డూ బసవన్న' లా కాకుండా సై సై రా రా బసవన్న అంటూ కొత్త రంకె వేస్తున్నాడు. ఇతని గొంతులో దూరం నించి ఎక్కడో ఆ వీర శైవ బసవన్న నాకు కనిపిస్తూనే వున్నాడు. ఆ పద చిత్రాలలోంచి అందుకే కన్నడ వచన కవుల అనుభవ మంటపంలోకి మనల్నితోసుకు తీసుకు పోతున్నాడు సైదా.

సైదా చారి అంటే వొక నెమ్మదయిన జ్ఞాపకం. నేను యూనివర్సిటీ మెట్లు ఎక్కి ఎమ్మే చదవాలి అని జ్వర తీవ్రతలాంటి వేదనతో కాలిపోతూ, ఆర్ధిక కారణాల వలన చదవలేక పత్రికా వుద్యోగంలోకి కలల్ని కుదించుకుని, మిత్రుల్ని కలిసే మిష మీద వుస్మానియా, సెంట్రల్ యూనివర్సిటీ, అమెరికన్ లైబ్రరీ చుట్టూ పుస్తకాల కోసం తెగ వెతుక్కునే కాలంలో గుడిపాటి పుణ్యమా అని దొరికాడు ఈ సైదా నాకు. ఆ యూనివర్సిటీల మెత్తని గడ్డి మీదా, అక్కడి చెట్ల కిందటి గరం చాయ్ లూ , వుస్మానియా బిస్కట్ల చప్పరింతల మధ్య కవిత్వం అందరినీ కలిపే బంధం అయినప్పుడు, రామదాసు లాంటి మిత్రులు వాళ్ళ అనుదిన చర్య్లల్లోనూ మా 'రక్త స్పర్శ ' వాక్యాల్ని అలవోకగా కోట్ చేసే సమయాల్లో - వొక బక్క పలచటి దేహం లోంచి అందమయిన ముఖం లోంచి కాస్త సందేహిస్తూ, సంశయిస్తూ ఈ సైదా నెమ్మదిగా వొక వాక్యాన్ని సంధించే వాడు. "నువ్వు ఇలా ఎందుకు రాసావు? అలా ఎందుకు రాయలేదు?" అనే అతని అనేక ప్రశ్నల సారాంశం. ఇతనికి పదాల పట్టింపు ఎక్కువ అనుకునే వాళ్ళం చాలా సార్లు. నిత్యం ఏదో పోగొట్టుక్కున్న వాక్యాన్ని, ఆలోచనని వెతుక్కునే వాడిలాగా ఎప్పుడయినా మెత్తగా నవ్వుతూ, ఎక్కువగా ప్రశ్నార్ధకాలు రువ్వుతూ వుండే సైదా ఆ కాలంలో రహస్యంగా కవిత్వం రాస్తూ వుండే వాడని నా అనుమానం.

సైదా చాలా కాలం చ డీ చప్పుడూ లేకుండా రాసాడు. రాసి, వాటిని ఏ దిండు కిందనో దాచేసుకొని, వొక అర్ధ రాత్రి లేచి కూర్చొని, చీకటికి తన వాక్యాలన్నీ తనివి తీరా వినిపించుకొని వుంటాడు, తనకి తనే శ్రోత అయి - రాసిన వెంటనే కవిత్వం అచ్చు అయ్యి, తెల్లారే లేచి, వొక అవార్డు క్యూలోనో , విమర్శకుడి ముంగిటనో ముగ్గులా నిలబడే
కాలంలో, సైదా చారి వొక వింత జీవి. అమామూలు కవి. కవిత్వం వల్ల వచ్చే అదనపు లాభాల మీద అతనికి మోజు లేదు. ఆ మాట కొస్తే కవుల మీద అతనికి కాసిన్ని అనుమానాలూ వుండి వుండ వచ్చు. ప్రేమిస్తూనే ప్రశ్నించే గట్టి వ్యక్తిత్వ బలం అతని పదాల్లోకీ ప్రవహిస్తుంది. ఎందుకు అన్న నిలవనీని ప్రశ్న అతని కవిత్వాన్ని కన్నడ వచన కవుల వరసలోకి లాక్కెళ్తుంది. అతను కవిత్వంలో పదాల్నీ, వాక్యాలనీ అనురాగంతో శంకిస్తాడు. . మనసులోని మాటని ఓవర్ రైట్ చేసే భాష పెత్తనాన్ని సహించడు.

అక్క మహాదేవి పూనినట్టు, అల్లామా ప్రభు లోపలి నించి గొంతు సవరించు కున్నట్టు సైదా ఎందుకు మాట్లాడుతున్నాడు? అ త ని వాక్యాల మధ్యకి ఆ విశ్వ బ్రాహ్మల పని ముట్లు, ఆ జాన్ పాడు సైదులు నమ్మకాల తాయెత్తులు, ఆ ఆడ వాళ్ళ రూపంలో అనేక భావాల సంచారీ తనం ఎక్కడి నించి వస్తున్నాయి? కవి , ఆ మాటకొస్తే మనిషి ఆ పాత అస్తిత్వపు జంఝాటాల నించి ఎలాంటి స్మృతిని తీసుకు వస్తాడు? అది అతనికి కొత్త ఉనికి ఇస్తుందా? గతంలోకి విసిరేస్తుందా? అంత తేలిక కాదు సమాధానం. కాని, అది సైదా కవిత్వాన్ని చిక్కన చేస్తుంది. సైదా కవిత్వంలోని ఆడ వాళ్ళు నిజంగా ఆడ వాళ్ళు కాదు, వాళ్ళు మనలోని ఆదిమ భావనల మెటఫర్లు. మన లోపల మనం సిగ్గుపడి చిదిమేసిన సహజాతాల ఆనవాళ్ళు. అందుకే, ఈ కవిత్వంలో ఎక్కడ ఆడతనం అంతమవుతుందో, ఎక్కడ భావం పుడ్తుందో తేలికగా తేలదు. చదివే వాళ్ళు ఇతనికి 'ఆడదన్నా/ కొండలన్నా అబ్సెషన్ ' అనుకునేంతగా ఆడదీ/భావనా పెనవేసుకు పోయాయి ఈ కవిత్వంలో.

సైదా చారి ఈ 'నీలం బొమ్మ'ని చదివి అర్ధం చేసుకోవడానికి మనకి చాలా సందర్భాల్లో మన లోపలి మనల్ని వొక సారి అతిధిగా అయినా చూసి వచ్చే సహనం వుండాలి. ఎక్కడో లతా మంగేష్కర్ గొప్ప మాట చెప్పింది " నాతొ నేను కాసేపు అప్పాయింట్మెంట్ తీసుకోవాలి' అని. అది ఆమె తన జీవితంలో నిజంగా చెయ్య గలిగిందో లేదో మనకి తెలియదు. కాని, ఇక్కడ వొక తెలుగు కవి వొక నగరం మూల నించి, వొక గది మూల నించి అక్షరమ్ తడి చెయ్యి చాచి, "అవును ఇది మనలోపలి ఆడతనపు సహజాతంతో సంభాషణ చేసే వేళాయెరా " అని అలలితంగా అపల్లవి గా, అకోమలంగా అంటున్నాడు. మీ కాళ్ళని కాస్త ఏ చెరువు నీళ్ళలోనో స్నానం చేయించి, ఈ గడ్డి ఆకుపచ్చత్వం తగిలేలా నేల మట్టిదనం మిమ్మల్ని కడిగేలా నడవండి మీ అహం మీంచి.

-

3 comments:

madhura lalasa said...

Afsar garu,

Meee neelam maaya pustaka parichayam vo vintha sowndary prasamsa. Ventane velli aaa pustakam chadiveyalani, aaa pada chitraalni navileyaa lani korika thappaka kaluguthunnadi, meee sooofi paata laagaa meee kavya parichayam andam gaa unnadi

Afsar said...

రవీంద్రనాథ్ గారూ:

థాంక్స్ అండీ

నేను చాలా కాలంగా తెలుగు కవిత్వ పుస్తకాల మీద సమీక్షలూ గట్రా రాయడం లేదు, కవిత్వం అంటే ఎంత ఇష్టం వున్నా, తెలుగు కవులూ, కవిత్వ విమర్శకుల మీద వున్న ఏవగింపు వల్ల; పాతికేళ్ళుగా ఈ దగుల్బాజీ మొహాల మీద వున్న రోత వల్ల.

ఆ ఏవగింపు నించి నన్ను కొంచెం ఇవతలకి లాగిన పుస్తకం సైదాచారిది. అందుకే ఈ సమీక్ష రాయగలిగాను. మీరే కాదు, అసలు కవిత్వం అంటే ఏమిటో ప్రేమ వున్న వాళ్ళెవరయినా ఈ పుస్తకం చదవాలనే నా కోరిక.

Anonymous said...

Sorry for my bad english. Thank you so much for your good post. Your post helped me in my college assignment, If you can provide me more details please email me.

Web Statistics