ఆమె నిశ్శబ్దంగా వెళ్లిపోయింది!

నాకు బీథోవెన్ సంగీతంలోని ప్రశాంత బీభత్సం ఇష్టం. అట్లాగే, భాషలోంచి నిశ్శబ్దంగా నవ్వుకుంటూ వెళ్లిపోయే “ఐరనీ” అంటే పిచ్చి. ఈ రెండూ వొక చోట కలిసినప్పుడు, ఆ కలయిక కవిత్వమయినప్పుడు నా లోపలి ఖాళీలన్నీ పగలబడి నవ్వుకుంటాయి. రుద్ర తాండవమే చేస్తాయి. పోలిష్ కవయిత్రి విశ్వావ సింబోర్ స్కా కవిత్వం నా లోపలి ఆ “ఐరనీ” రుద్ర తాండవ వేదిక. ఇవాళ్టి పొద్దుటి నిద్రలో ఆమె కన్ను మూసిందని తెలిసినప్పుడు, ఎందుకో ఆ మృత్యువు నాకు దేజావూలా, వొకానొక పూర్వస్మృతిలాగా అనిపించింది.

అతి తేలికయిన మాటలతో బతుకు చిక్కు ముడులు విప్పుకుంటూ వెళ్ళిన సింబోర్ స్కా అంతకంటే తేలికగా నిద్రలోంచి ఇంకో నిద్రలోకి వెళ్లిపోయింది. పెద్ద పెద్ద మాటలూ, వస్తువులూ అక్కర్లేదు కవిత్వానికి – రోజువారీ బతుకులోంచి ఎంతో కొంత అరువు తెచ్చుకొని, వాటినే లోతయిన ఆలోచనలతో నింపితే చాలు అనుకున్న నిశ్శబ్ద కవయిత్రి.

ఈ అనువాదాలు ఆమె స్మృతికి వొక నిస్సహాయ నివాళి -

ఆమె కవితల్లోంచి కొన్ని పంక్తులు మాత్రమే.
పూర్తి అనువాదాలు తరవాత వీలు వెంబడి.మూడు మరీ అడ్డగోలు మాటలు

భవిష్యత్తు అన్న పదం పలకబోతానా,
దాని మొదటి అక్షరం గతంలోకి జారిపోతుంది అప్పటికే.

నిశ్శబ్దం అనబోతానా,
దాన్ని కుప్పకూల్చేస్తాను.

“ఏమీ లేదు,” అన బోతానా,
అసలే అస్తిత్వరాహిత్యమూ పట్టి నిలపలేని
దేన్నో వొకదాన్ని చేసి అక్కడ పెట్టేస్తాను.


మరణం, అతిశయోక్తులు లేకుండా

అబ్బే, దానికి నీ జోకులేవీ ఎక్కవు
నీ చుక్కలూ, నీ వంతెనలూ ఏవీ ఏవీ తెలీవు

అల్లికలూ, తవ్వకాలూ, అరక పట్టడమూ
నౌకల్ని తయారు చెయ్యడమూ, పోనీ, కేకులు చెయ్యడమూ
అబ్బే, అవేవీ దానికి చాత కావు.

-
సరే, దాని పనులయినా అది సరిగ్గా చేసుకుంటుందా అంటే
అదీ లేదు.

శుభ్రంగా సమాధి తవ్వుకోవడం
శవపేటిక చేసుకోవడమూ
ఆనక అన్నీ నీటుగా సర్దుకోవడమూ
అదీ రాదు.


కొన్ని సాధ్యాలు

నాకు సినిమాలు కావాలి
పిల్లులు కావాలి

ఆ నది వొడ్డున మహా వృక్షాలు కావాలి
దాస్తావస్కీకి బదులు డికెన్స్ కావాలి

నాకు ఆకుపచ్చ రంగు కావాలి
నాకు మినహాయింపులు కావాలి
తెల్లారకట్ట వెళ్లిపోవడం కావాలి
Category: 10 comments

10 comments:

Rohith said...

గూగుల్ లో ఎక్కడ కనబడ్తే అక్కడ Szymborska ని వదలకుండా చదివే వాడిని. ఆమె కవిత్వాన్ని వెతికి వెతికి మరీ చదివే వాడిని. చదువుతూ చదువుతూ నే తెలియకుండానే గెట్టి గెట్టి గా చదివేసే వాడిని. ఆమె సున్నిత మాటలు, కవిత్వం లో తాను ప్రదర్శించే తెలివి, dexterity and మీరు చెప్పినట్టు ఆ కవిత్వం లోని అయ్రోనీ పాటకుడిని మంత్ర ముగ్దుడిని చేస్తాయ్.


Poetry -
but what is poetry.
Many shaky answers
have been given to this question.
But I don't know and don't know and hold on to it
like to a sustaining railing.

~Wislawa Szymborska

Zilebi said...

అఫ్సర్ గారు,

బీభత్స ప్రశాంతం.

ఆమె నిశ్శబ్దంగా వెళ్లి పోయింది 'అక్షరమై'.


జిలేబి.

వాసుదేవ్ said...

ఎందుకో మీ లింక్ చూడగానే ఆమె గురించే రాసుంటారనుకున్నా.....దానికి కారణాల్లేవు.ఎప్పుడో దాదాపు పదేళ్ళ కిందటిమాట. సింగపూర్లో డిగ్రీ స్టూడెంట్స్ కి పాఠాలు చెప్తున్నప్పుడు ఈ Szymborska ని చదివాను అప్పట్నుంచి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోలేదు. ఆమె కవిత్వానికి నిశ్శబ్దం ఓshroud.... నాకు గుర్తున్న, నాకు బాగా నచ్చిన వాక్యాలు ఇవి--అప్పడప్పుడు నెమరువేసుకునే బరువైన భావనలు:
Is there then a world
where I rule absolutely on fate?
A time I bind with chains of signs?
An existence become endless at my bidding?
అమె రాసిన "Joy of Writing" అన్న కవితనుంచి. అఫ్సర్ జీ మీ తదుపరి అనువాదాల్లో ఇది కూడా ఉండేలా చూడండి..

Anonymous said...

afsar naku teliyani oka kavayitri gurinchi ivala telusukunna thank u ...love j

Anonymous said...

good ones

హెచ్చార్కె said...

Thaks a lot, Afsar!

vaartha said...

i never read szymborska but comments enchanting me. sure i shall read her poetry..thanks a lot

vaartha said...

i never read szymborska but comments enchanting me. sure i shall read her poetry..thanks a lot

nsmurty said...

అఫ్సర్,
ఇవాళ మీరు ఒక్క గొప్ప కవయిత్రిని పరిచయం చెయ్యడమే కాదు, అనువాదం చేసి ఆ గొప్పదనాన్ని ఆవిష్కరించారు. మూడు మరీ అడ్డగోలు మాటలు matter of fact లా కనిపిస్తూనే, రసనిష్యందంగా ఉన్నాయి.
మీకు నా అభినందనలు.

Jayasree Naidu said...

కవయిత్రి గురించి మరింత పరిచయం (మీ వాక్యాల్లో) వుంటే బాగుండేదీ అనిపించింది.

Web Statistics