నాలుగు మాటలు ఇంకో సారి...

(చిత్రం: మహిమాన్విత)

వొకే వొక్క బుడగలో బుడుంగుమని మునగా లేం, తేలా లేం
అయితే కానివ్వు
బుడగలో పుట్టుకా
బుడగలో చావూ
అన్నీటినీ లోపలికి లాక్కు వెళ్ళే అక్షయ సముద్రం అదే!

వొక్కో సారి ఆశ్చర్యమూ లేదు విడ్డూరమూ కాదు
మాయా కాదు మంత్రమూ కాదు.
అంతా సచ్ ముచ్ సచ్...

2

ఇవాళ వొక బుడగలోంచి కళ్ళు తెరిచి చూశాను
చిన్న చిన్న నదులు చిట్టి కప్పల్లా ఎగిరెగిరి పడ్తున్నాయి.

ఇవాళ కళ్ళలోంచి వొక నీటి దీపం వెలిగించి చూశాను
కొన్ని వందల చీకటి గోళాలు గోలీ కాయల్లా దొర్లి పోతున్నాయి

ఏమీ తేడా కానలేను, మిత్రుడా!
నువ్వు ముడుచుకుపో నీ నీడలోనే!

3

గది దాటి వచ్చి చూస్తే ఆ నాలుగు దారులూ
నాలుగు ఖండాలుగా ఎటో ఎగిరిపోయాయి

గోడ పగలగొట్టి నడిచోస్తే ఆ పది మందీ
పాతిక దారుల్లో తప్పిపోయారు

ఏమీ కారణం చెప్పలేను, మిత్రుడా!
గదికీ లోకానికీ కటీఫ్!

4

ఎన్ని సార్లు గీసినా ఏకాంత చిత్రం
నువ్వు
గీసి చెరిపెయ్యలేని పసితనపు బొమ్మే నయం!

బొమ్మ ఇప్పటికీ దృశ్యమే.

పసితనమే అదృశ్యమయ్యింది.
Category: 2 comments

2 comments:

Mohanatulasi said...

2nd and 4th
మళ్ళీ మళ్ళీ చదవాలనేలా వున్నాయి.
ఇంకా ఏదో వుంది అన్నట్టు!

Rohith said...

:) chaala baagundi sir. nijame...malli malli chadavaali ani pinche kova loki chendina kavitha ne idi....

Web Statistics